7, సెప్టెంబర్ 2019, శనివారం

కాఫీ విత్ కలిమి - 7 - A friend in teens is a friend in beens అన్న ఓ Guyయాళి

ఊసుపోని ఓ ఉదయం

కనిపించని ఆన్లైను నేస్తంతో ఆడేసుకుంటున్నాడు బుజ్జిజింక. వీడు ఈ ఏడాది హైస్కూల్కి వెళ్తున్నా ఇంకా బుజ్జిజింక-ఆఫ్-ద-హౌసే!

అనుకోకుండా చేరాల్సొచ్చిన ఆఫీసు కాన్ఫరెన్సు కాల్లో గడగడ మాట్లాడేసుకుంటున్నారు ఇంటి అయ్యగారింకో వంక.

ఇంకేముంది? అప్రకటిత నిర్బంధ కర్ఫ్యూ  మొదలు ఇంట్లో.

ఈ ఇద్దరు చేసే సందడి మధ్యా గిన్నె కదిలితే టంగుమంటుందని, గరిటాడితే టింగుమంటుందని వంట కూడా వాయిదా పద్ధతుల మీద చేస్తున్నాను.

పాట పాడలేక నోరాడక, అటూ ఇటూ కదలలేక కాలాడక- అలా అని కుదురుగా ఓ చోట కూర్చోలేక సతమతమౌతున్నాను.

ఇంకిలాక్కాదని పొంగీ పొంగని చిక్కటి పాలలో ఓ చెంచాడు బ్రూ, అరచెంచాడు పంచదార కలుపుకుని కుడిచేత కాఫీకప్పు, ఎడం చేత ఇంటి ఫోను పట్టుకుని ఆట్లాడుతున్న పిల్లాడికి, మాట్లాడుతున్న పిల్లాడి తండ్రికి కొంచెం ఎడంగా కూర్చుని, ఫోన్ మీటలు నొక్కి , భూమికవతలున్న కలిమితో మాటలు కలిపా.

భలే! ఊసుపోని ఉదయం కాస్తా ఊసులాడుకున్న ఉదయమైన వైనమేమన...

 "హలో... బావున్నావా? ఇంట్లో అందరూ ఎలా వున్నారు?"

"హాలొ-హలో. బావున్నాను. ఇంట్లో బావు న్నారు, బావున్నారు. ఇంట్లో వున్న అందరూ బావున్నారు."

"హహహ... ఏంటి విశేషాలు?"

"ఇంకో మూడు వారాల్లో నిన్ను చూడబోతున్నాను - అదే విశేషం. అన్నట్టు మర్చిపోయాను చెప్పడం Belated Happy Star Birthday! ఏం చేశావీసారి? Milestone Birthday కదా!"

"Milestone అని నువ్వే అన్నావు కదా అందుకే కొన్ని స్టోన్ లేవో కొనిపెట్టారు ఇంట్లో అందరూకలిసి"

"భలే! భలే! అలా అయితే నేనూ కొనుక్కుంటా... అప్పుడు మనిద్దరం రాళ్ళు కొన్న స్నేహితురాళ్ళనిపించుకుంటాం"

"కదా?! భలే!"

"ఒక్కో పుట్టినరోజు వచ్చినప్పుడల్లా... బావుంటుంది...కానీ ఇంకా రావాల్సిన బుద్ధేదో రాలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ముందు రోజుకీ, ఆ తర్వాత రోజుకీ ఇదో రోజు తక్కువ, అదో రోజు ఎక్కువ అనిపించడం తప్ప ఇంకే మార్పూ కనిపించదు."

"నాకూ అంతే! ఒక్కోసారి అది మంచిగా వున్నట్టనిపిస్తుంది, ఇంకోసారి ఏ తేడా లేకుండా ఉండడంలో ఏదో తేడా ఉందేమో అనిపిస్తుంది"

"అబ్బే! అదేం లేదు. మనమెలా పుట్టామో అలాగే వున్నాం...వుంటాం... మారాలని ప్రయత్నించడం, మారుతామని ప్రయాస పడడం మనకంతగా నప్పదు కానీ మనమిలాగే వుందాం."

"అంతే... అంతే!"

"అందుకే .... మనిద్దరం A friend in teens is a friend in beens లాగే కంటిన్యూ అవుదాం. నా Teenage-Beenage గుర్తుంది కదా?"

"ఎందుగ్గుర్తులేదూ? నాకూ భలే నచ్చిందా మాట."

"నీకింకో సంగతి చెప్పాలి... మొన్నో రోజు ఆఫీస్‌లో కాన్ఫరెన్స్ కాలొహటి  అయిపోతూ ఉండగా ఒకతను "Okay  Guys! Let's continue tomorrrow" అనగానే నేను "Okay Guys! You "guys only" continue tomorrow. I won't join"  అన్నా! వెంటనే ... వాళ్ళు పాపం మంచబ్బాయిలు కదా... అది సీరియస్‌గా తీసేస్కుని తెగ బాధ పడిపోబోయారు "We didn't mean that" అంటూ. నే వెంటనే  'ఇహహ్హహ్హా' అని నవ్వేసి "You didn't mean it, but I took that meaning because I'm mean" అని ఆ అపార్థసారథులనీ నవ్వించేసి call ని కంచికంపా!"

"అవునూ...నేనూ నోటీస్ చేశా ... ఈ మధ్యేంటీ నువ్వు 'ఇహహ్హహ్హా' అంటూ వికటాట్టహాసం చేస్తున్నట్లు నవ్వుతున్నావ్?"

"అది వికటాట్టహాసం కాదమ్మా... నటసామ్రాట్టాట్టహాసం"

"అర్థమైంది... కౌముదికి డీఎన్నారు-ఏఎన్నారు సిరీస్ రాసిరాసి ఇలా అయ్యానంటావ్!"

"అంతేగా... అంతేగా!"

"పిల్లా! ఇలా నువ్వు తప్ప ఇంకెవరూ మాట్లాడలేరు. ఇలా తప్ప నువ్వింకెలా మాట్లాడినా మజా ఉండదు...కానియ్! నీ నటసామ్రాట్టాట్టహాసం బహు-బాగు!"

"ఇంకా వుంది ఆగు... ఆ Guys విషయం బదరికి చెప్తూ 'బావా! మీరు Guy ఐతే మీకు ఆలిని Guyయాళిని అవుతానా?' అనడిగితే తన కళ్ళు భలే మెరిశాయి 'సరిగ్గా సరిపోయింది నీ defintion నీకే!' అంటూ"

"హహ్హాహ్హా ... నువ్వు Guyయాళివే - అక్షరాలా!"

"నీ నవ్వు వినడం బావుంది...చాలా రాత్రయిందీ ...ఇంక నవ్వుకుంటూ పడుక్కో...మళ్ళీ ఎప్పుడో ఇల్లాగే కాల్చేస్తా!"

"చెయ్ చెయ్... నువ్వు కాల్చేస్తే మళ్ళీ ఇలాగే మాటలతో ఆట్లాడేసుకుని మాట్లాడేస్కుందాం!"





చివరాఖరి సిప్పు:

A friendship grown from teens to been's is a treasure to be cherished. ~meSayIt




14 కామెంట్‌లు:

  1. ఇంట్లో బావు న్నారు, బావున్నారు...శ్లేష👌🏻
    రాళ్ళు కొన్న స్నేహితురాళ్ళు...
    Guyయాళి...👌🏻😄
    భలేగా ఉంది ఫోన్లో మీ మాట్లాట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా మాట్లాట మీకు నచ్చినందుకు, నా Guyయాళిని మెచ్చినందుకు బోల్డన్ని థాంక్యూలు :)

      తొలగించండి
  2. “Guyయాళి” .... బహు బాగా chepparu.... Mee coffee tho kalimi ...maku coffee break.... 👌👏👏

    రిప్లయితొలగించండి
  3. Haha, good read for a sunday morning. Like your bujji jinka analogy :)

    రిప్లయితొలగించండి
  4. Chala bagundi, mee ‘guyaali’ reference and coffee kaburlu. Manchi coffee lanti kaburlu ! :)

    రిప్లయితొలగించండి
  5. కొత్త పదం కనిపెట్టినందుకు మీకో వీరతాడు.హ హ guy యాళీ గారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వీరతాడు వేశారంటే మీరు తప్పకుండా అసమదీయులే :) :) బోల్డన్ని థాంక్స్!

      తొలగించండి
  6. ఎవరు పుట్టించ కుండ మాటలు ఎలా పుడతాయి. వేసుకో రెండు వీర తాళ్ళు. Well said Lalitha

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మో! ఇంకో రెండు వీరతాళ్ళు! సంతసించితిని! ధనయవాదములు, ధనయవాదములు, అన్నపూర్ణా!

      తొలగించండి