30, ఏప్రిల్ 2016, శనివారం

24వ కళ "వంట"బట్టిన విధం - ముక్తాయింపు

నాంది ఇక్కడ: 24వ కళ "వంట"బట్టిన విధం - నాంది 

... ఆ విధంగా మొదలయిన నా పాక కళా శాస్త్ర అధ్యయనం మా అమ్మ హైదరాబాదు నుంచి తిరిగి రావడంతో అక్కడే ఆగిపోయింది. 

చదువూ... అవుతూనే పెళ్ళీ అవడం, బెంగళూరు వెళ్ళడం, వెళ్ళీ వెళ్ళగానే ఉద్యోగం లో చేరకపోవడం - దానితో అప్పటిదాకా కాలేజ్ అనీ, ప్రాజెక్ట్ అనీ హడావిడిగా నడిచిన లైఫ్ ఒక్కసారిగా సుదీర్ఘ శలవు లా తోచడం, దానితో రోజంతా బోల్డంత టైం ఉన్నట్లు అనిపించేది. 

మామూలుగానే నాన్న ఇచ్చే పాకెట్ మనీ ఏ మాత్రం మిగిలినా, ఎవరైనా పెద్దవారు సందర్భాన్ననుసరించి (అంటే పుట్టిన రోజులు, దండాల పండగలు లాంటివి) ఇచ్చే డబ్బులు వున్నా వాటితో పుస్తకాలు కొనుక్కోవడం అలవాటు. అసలు నాకు గుర్తుండి పుస్తకం కొనుక్కోదగని సందర్భం ఏదీ లేదు నాకు. గుంటూరు లోని - నవోదయ, విశాలాంధ్ర, ప్రబోధ బుక్ స్టోర్స్- నా సర్వకాల దర్శనీయ స్థలాలు. 

ఆ వరసలో పెళ్ళవగానే మొదట కొనుక్కున్న పుస్తకం - మాలతీ చందూర్ రాసిన వంటలు-పిండివంటలు పుస్తకం. ఆ పుస్తకమూ, దానితో పాటు దొరికిన తీరికా - కోతికి కొబ్బరికాయ - దొరికినట్టే అయింది (ఈ సామ్యం ఎందుకు వాడానో అవమానం-1 లో తెలుస్తుంది). కొన్నాళ్ళు ఆవిడ పుస్తకం ఫాలో అయినా తర్వాత ఇంక వంట అంతా జిహ్వ-జ్ఞాపకం మీదే ఆధారపడి నేర్చుకున్నాను - అంటే చిన్నప్పుడు నాన్నమ్మ, అమ్మ వండి పెట్టిన వంటల రుచిని గుర్తు చేసుకుని దానికి తగినట్టు ingredients కలుపుకుంటూ మొత్తానికి బానే చేసేదాన్ని. 

నా 24 వ కళాధ్యయనం లో రాజపూజ్యావమానాలు:

{రాజపూజ్యం = మెచ్చుకోళ్ళు; అవమానం = పెద్ద చేశావులే - అనుకోళ్ళు)

రాజపూజ్యం - 1

అసలే ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఇష్టంగా చేసిన అలవాటేమో - going by rule book - అనేది వంటలో కూడా అనుసరించడం మొదలు పెట్టాను. కొత్త విద్య నేర్చుకునే ఉత్సాహమో, దానికి తోడు దొరికిన బదరి ప్రోత్సాహమో - కారణం ఏదైనా కానీ - రోజూ పొద్దున్నే నాలుగింటికి లేచి ఒక పప్పు, కూర, పెరుగు పచ్చడి, ఒక సింపుల్ గా చేయగలిగే రవ్వ లడ్డు టైప్ స్వీట్ - ఇన్ని చేసి నాలుగు గిన్నెలు హాట్ ప్యాక్ లో నింపి పెట్టేదాన్ని. బదరి ఇంటికి వచ్చి వాటి బాగోగులు చెప్పేదాకా పరీక్ష రాసి ఫలితానికి ఎదురు చూస్తున్నట్లుండేది. ఎప్పుడయినా తన ఆఫీసు వాళ్ళు కలిస్తే "లలితా! Was Chemistry your main subject? All your dishes are so perfect & taste very good as if you are preparing them to the correct measure in a lab" అనే వారు. కొంత మందేమో బదరి లంచ్ అంతా ఇవాళ మేమే తినేశాము అని చెప్పేవారు. 

అవమానం - 1

అదే ఉత్సాహం తో నేను చేసిన వంటలు మా ఇంటి ఓనర్ ముద్దమ్మ కి ఇచ్చేదాన్ని. వాళ్ళ కన్నడ వంటల కన్నా భిన్నంగా వున్న నా ఆంధ్ర వంటలు ఆవిడకి నచ్చి మెచ్చుకునేవారు. ఒకసారి ఆవిడ అదే మాట మేడ పైన వున్న ఒక్క గదిలో అద్దెకుండే ఇందిరమ్మ గారనే ఒక పెద్దావిడతో  అంటే ఆవిడ ಹಿಂಗೂ, ತೆಂಗೂ ಇದ್ರೇ ಮಂಗಾನೂ ಅಡಿಗೆ ಮಾಡತ್ತೇ (హింగూ, తెంగూ ఇద్రే మంగానూ అడిగే మాడత్తే - ఇంగువ, కొబ్బరి వుంటే కోతి కూడా వంట చేస్తుంది)  అన్నారు. ఇందిరమ్మ గారి మాట ముందు నాకర్థం కాలేదు - అప్పటికి ఇంకా కన్నడ అంత అలవాటు కాకపోవడం వల్ల.  అర్థం తెలిశాక -  ముందు కొంచెం నిరుత్సాహంగా అనిపించినా కన్నడ లో ఒక మంచి సామెత తెలిపినందుకు ఇందిరమ్మ గారిని కావాలని పలకరించి మరీ మాట్లాడేదాన్ని - ఆవిడ కన్నడ భాష నచ్చి. తర్వాత ఆవిడా ఒప్పుకున్నారు - నేను పాకకళా విశారదనే అని ;). 

రాజపూజ్యం - 2; అవమానం - 2:

ఆ  వంటోత్సాహపు తొలినాళ్ళలో బదరి ఒక ఆదివారం ఇద్దరు బెంగాలీ స్నేహితులని (కుందు, కార్తీక్ ) ఇంటికి భోజనానికి పిలిచారు. మొదటి సారిగా చపాతీలు చేద్దామని పిండి కలిపాను. మామూలు వంట (కూర , సాంబారు, స్వీటు etc.,) అంతా అయ్యాక చపాతీలు చేద్దామని కలిపిన పిండి తీస్తే ఎప్పటికీ వత్తడానికి రాదే !!! తీరా చూస్తే అర్థం అయింది ఏంటంటే - నాకు గోధుమ పిండి, శనగ పిండి మధ్య తేడా తెలీక చపాతీలకి శనగ పిండి కలిపాను. వెంటనే నా భుజం నేనే తట్టేసుకుని - చపాతీల కన్నా బజ్జీ చేయడం తేలిక కదా - ఏ పిండి కలిపినా మన మంచికే అనేసుకుని - బో .......ల్డన్ని బంగాళదుంప బజ్జీలు ఒక పెద్ద బేసిన్ నిండా చేసేశాను. 

కుందు, కార్తీక్ రాగానే అన్ని పదార్థాలతో పాటు ఆ బజ్జీల బేసిన్ కూడా - గొప్పగా ఎన్ని బజ్జీలు చేసేశానో చూపించడానికి  - వాళ్ళ ముందు పెట్టి భోజనం వడ్డించాను. షరా మామూలు అన్నట్లు ఆంధ్ర భోజనం మెచ్చుకుంటూ తిన్నారు వాళ్ళిద్దరూ. బజ్జీలు టీ టైం లో తింటామన్నారు.  బదరికి , నాకు పట్టలేనంత ఆనందం - మా మొదటి ఆతిధ్యం విజయవంతం అయినందుకు. భోజనం అయ్యాక కొంచెం సేపటికి టీ తో పాటు బజ్జీలు పెట్టాను. కుందు, కార్తీక్ చెరో ఐదు తిన్నారు మొదట. తర్వాత టీ అయిపోయినా బజ్జీలు తింటూనే వున్నారు. "పాపం! వీళ్ళు ఇంత రుచిగా వుండే బజ్జీలు ఎప్పుడో తినలేదేమో , ఎంత బాగా చేశాను నేను ?!!! పోన్లే మొత్తం వాళ్ళనే తిననీయ్ !" - అని లోలోపల సంతోషంతో ఉబ్బి తబ్బయిపోతూ పెడుతూ నేనూ, బజ్జీలు తినే కొద్దీ మారుతున్న ముఖ కవళికలతో వాళ్ళూ - మొత్తానికి బజ్జీల బేసిన్ ఖాళీ చేసేశాము. 

తర్వాత బదరి చెప్పారు - వాళ్ళిద్దరూ రెండు రోజులు ఆఫీసుకి శలవు పెట్టారని. అసలు సంగతేంటంటే - ఎవరైనా భోజనానికి పిలిస్తే పెట్టిందంతా తినకపోతే వారిని అవమానించినట్టు అవుతుందని నేను చేసిన బజ్జీలు అన్నీ ఒక్కటి కూడా వదలకుండా తినేసి వాళ్ళిద్దరికీ కడుపు నొప్పి వచ్చిందట :( అందుకే - ఒక అవమానం నా ఖాతాలో. 



అవమానం - 3:

అప్రతిహతం గా సాగుతున్న నా పాక కళారాధన చిరు దివ్వె నుంచి దివిటీ స్టేటస్ వచ్చింది - కోనసీమ, గుంటూరు, కర్ణాటక - conglomerate వంటలతో. 

ఎన్నో ఆతిథ్యాలు, pot luck లలో మెప్పులతో శాకాహార పాకాల జండాని అమెరికా గడ్డ మీద రెపరెపలాడిస్తున్న తరుణంలో మళ్ళీ ఒకసారి బదరి స్నేహితులిద్దరు డిన్నర్ కి వచ్చారు. దొండకాయ కొత్తిమీర కారం కూర, పాలకూర పప్పు వగైరా వగైరాలు వండి - వారు తింటూ వుండగా - బావుందాండీ - అనడిగాను. అంతే! ఊహించని సమాధానం -  మేము రోజూ తినే మా బ్రహ్మచారి వంటల కన్నా ఏదైనా బావుంటుంది లెండి - అని. 

ఆరోజు తర్వాత ఈ రోజు వరకూ ఇంకెప్పుడూ  నేను చేసిన వంట తినే అతిథులు ఎవ్వరినీ - వంట నచ్చిందా - అని అడగలేదు. 

రాజపూజ్యం - 4; అవమానం - 4

అప్పుడప్పుడు అంటే వీలయినప్పుడు రెండు మూడు కుటుంబాలని భోజనాలకి పిలవడం, సరదాగా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ గడపడం తరచుగా జరిగేదే. అలాంటప్పుడు "వంట చాలా బావుంది లలితా " అనగానే పొంగిపోబోయే తరుణంలో "ఎలా అయినా చిన్నప్పట్నుంచీ వంట చేస్తే ఎలాగైనా ఒక mastery వస్తుంది. మా మిస్సెస్ కొంచెం బిజీ కదా - ఈ మధ్యే కొంచెం నేర్చుకుంటోంది" అన్న మాట వినగానే "మరే! నేను మరి గాడి పొయ్యి దగ్గర బొంత వేసుకు పుట్టాను - అందుకే ఇలా వండేస్తున్నాను" అనుకుని కుంగిపోతాను. వెంటనే  ఇంకో అవమానం వేసేసుకుంటాను లెక్కలో. 
 
ఇవన్నీ ఒక ఎత్తూ - నా రెండు పూటలా వండే అలవాటు ఇంకో ఎత్తు. అసలే మా అమ్మ వారానికి రెండు సార్లు ఫోన్ చేసినప్పుడల్లా పొరపాటున గొంతు ఏమన్నా కొంచెం నీరసం గా వినిపిస్తే వెంటనే "లల్లీ! కోటి విద్యలూ కూటికొరకే అన్నారు - work లో ఎంత బిజీగా వున్నా సరైన భోజనం లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. A sound mind in a sound body. తిండి కలిగితే కండ కలదోయ్ - కండ కలవాడేను మనిషోయ్ " అని ఆవిడకి తెలిసిన తిండికి సంబంధించిన సామెతలు, sayings, పాటలు అన్నీ గబగబా చెప్పేసి నాకు వంటెంకరేజుమెంటు తెగ ఇచ్చేస్తుంది. అదీ కాక చిన్నప్పట్నుంచీ ఆవిడ చేసిన అలవాటే - అన్నం పొగలు ఆరకుండా తినేయడం - దానితో ఎంత హడావిడి వున్నా ఒక నలభై నిముషాల్లో అయిపోయేలా రెండు పూటలా వండడం అలవాటు అయింది - మొదట్నుంచీ. 

ఇంత చేసినా నాకు మాట్లాడడానికి వంట ఒక టాపిక్ కాదు. బదరి మాత్రం ముచ్చటగా చెప్పుకుంటూ వుంటారు - తను లోకల్ ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ఐదింటికి లేచి ఎలా  లంచ్ బాక్స్ పెడతానో. అలా చెప్పడం కొంచెం తక్కువ ఇష్టులని, మరి కొంచెం ఎక్కువ మనసు-కష్ట పెట్టుకున్నవారిని పరిచయం చేసింది. అందుకే ఎవరినైనా కలిసినప్పుడు అసలు food కి సంబంధించిన ఏ మాటా రాకుండా వుంటే చాలు అనుకుంటూ వుంటాను. 

 మహా రాజ పూజ్యం:

మా పిల్లలు చాలా picky భోజనం దగ్గర. ఎంతా అంటే వాళ్ళకి ప్రతీదీ Around the World in 80 Days లో Phileas Fogg లాగా should be at certain temperature & with a specific taste. అలాంటి వాళ్ళు  ఎక్కడికయినా వెళ్తే - అన్ని చోట్లా మనకి ఇష్టమయిన పదార్ధాలే వుండవుగా - అయినా సరే వాళ్ళ ఇబ్బందిని కొంచెం కూడా ప్రకటించకుండా పెట్టినది తినేసి ఇవతలకి వస్తారు. "ఇంట్లో రోజూ నువ్వు మాకిష్టమయినవి  చేసి పెడతావు కదా - We can live with it for one day అమ్మా!"- అంటారు.


అలా - ఇష్టులయిన వాళ్ళ, బదరి  ప్రోత్సాహంతో నా 24 వ (కళాధ్యయనం + కళాభ్యాసం)  మూడు పూటలు, నాలుగు శాకాలు , రెండు పాకాలుగా (24 = 3*4*2) అమోఘంగా ఘుమ ఘుమలాడుతూ జరుగుతోంది.





21 కామెంట్‌లు:

  1. Good blog Lalli. Now I can understand your maturity in vantalu. Can you ship few for taste.:)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుపుత్రా! ఆ షిప్పేదో ఎక్కి నువ్వే రా - వీలయితే కుటుంబ సమేతంగా. కలిసి భోంచేద్దాం :)

      తొలగించండి
  2. వారం ఆగినందుకు వడ్డన :) బాగానే జరిగిందిగాని, ఆ అంగ్రేజీ మాటలే సగం ఉడికిన కాకరకాయ ముక్కల్లా తగిలేయి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్తే! ఎంత వద్దనుకున్నా ఒక్కోసారి - అందులోనూ ఈసారి "సగం ఉడికిన కాకరకాయ ముక్కలు" బానే పడ్డాయి. ఈ ఒక్కసారికి సర్దుకుని చదివి వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు. ఇక ముందు పోస్టుల్లో జాగ్రత్త పడతాను.

      తొలగించండి
    2. Quotes లో ఉన్న English, count అవ్వదు లే 👍 IMOO ☺

      తొలగించండి
  3. లలితా! నీ ఉత్సాహం, బదరీ ప్రోత్సాహం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.
    In our good old Bangalore says, తెల్లవారుఝామునే నీ ఘుమఘుమలతో మా రోజు తెల్లవారేది.
    నీ నాలుగ్గిన్నెల హాట్‌పేక్ ఇంకా మస్తిష్కాలలో ఘుమఘుమలాడుతున్నాయి.
    ఆంటీ సామెతలు హైలైట్ :)



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భలే భలే మంచి రోజులులే - మళ్ళీ మళ్ళీ ఇక రావులే - అన్ని రకాలుగా.

      నాలుగు గిన్నెలు ఒకటయ్యాయి - మూడు పూటలు రెండయ్యాయి ;)

      తొలగించండి
  4. Just like your vantalu, your language is also a feast👏👏👏👏👏

    రిప్లయితొలగించండి
  5. Just like your vantalu, your language is also a feast👏👏👏👏👏

    Sunitha

    రిప్లయితొలగించండి
  6. Née boldannikaburlu superb - Hari Krishna

    రిప్లయితొలగించండి
  7. Lallitha garu mee katha chala bagundi👌👌👌👌👌

    Katyayini

    రిప్లయితొలగించండి
  8. @Lalli mee katha manchi guma gumalu vastondi... 👌

    - from Sarada

    రిప్లయితొలగించండి
  9. కోతికి కొబ్బరికాయ.... and the Kannada సామెత, lol moments.
    రాజపూజ్యం, అవమానం concept ను మీ వంటలకు అన్వయించుకోవడం భలే novel idea గా అనిపించింది. మీ అతిధుల com(pli)ments, వాటికి స్వగతంలో మీ జవాబాలోచనలు ఇంకా బావున్నాయి. శనగపిండి చపాతీలు :) మొత్తానికి షడ్రసోపేతం గా ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ జవాబాలోచనలు పదం బావుంది. ఓపికగా చదివి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  10. సునీత, అరుణ, హరికృష్ణ, శేషు, కాత్యాయిని, శారద: వీలు చేసుకుని చదివి మెచ్చినందుకు థాంక్స్.

    రిప్లయితొలగించండి
  11. బాగు భలే....the conclusion! ಚಪ್ಪಾಳೆ....ನಿಮ್ಮ ಕನ್ನಡಾಭಿಮಾನಕ್ಕೆ. Food is the universal unifier అన్న మాటల్ని ఈ బ్లాగు మరల underline చేసింది. Keep cooking up great feasts....for mind and body.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలుగు మాతృ భాష అయితే కన్నడ ఒకరకంగా పితృ భాష (నాన్న నేర్పిన భాష - ఆయన కర్నాటక బిజినెస్స్ ట్రిప్పుల్లో నేర్చుకొచ్చి).

      ఇప్పటికీ పాడుకుంటుంటాను - ಇದೇ ನಾಡು ಇದೇ ಭಾಷೇ ಎಂದೆಂದೂ ನಮ್ಮದಾಗಿರಲಿ - అని.

      ನಿಮ್ಮ ಚಪ್ಪಾಳೆಕ್ಕಾಗಿ ಧನ್ಯವಾದ !

      తొలగించండి
  12. Super Lalitha! Excellent read...enjoyed it with my coffee👌
    Blog chadivaka mee vanta tinalanna korika kaluguthondi😀 It reminded me of my experience with malathi chandur book when I got married.
    Mee next blog post kosam waiting...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకు తెలిసి మాలతీ చందూర్ వంటలు-పిండివంటలు పుస్తకం డిజిటల్ మీడియా లేనప్పుడు కొత్తగా పెళ్ళయిన వారికి వంటింటి ప్రాక్టికల్ గైడ్. వీలు చేసుకుని చదివి, కమెంట్ పెట్టినందుకు థాంక్స్!

      తొలగించండి