30, మే 2021, ఆదివారం

అదే కాయ - అదే పప్పు - అదే వద్దు!

    అప్పుడెప్పుడో - చదువుకునే రోజుల్లో గుంటూర్లో ఉన్నప్పుడు - నాన్న ఆఫీస్‌లో పనిచేసే వెంకటేశ్వర్లు - అప్పుడప్పుడూ - వాళ్ళూరి నుంచి వెన్న తెస్తూ, దాంతో పాటే వాళ్ళింట్లో కాశాయని ఓ రెండు పెద్దపెద్ద ఆనపకాయలు (తను వాటిని సొరకాయలు అనేవాడు) తెచ్చిచ్చేవాడు. 

    దాంతో మొదలు మాఇంట్లో ఆనపకాయ-వారోత్సవాలు. 

    ఆదివారం: ఆనపకాయ పులుసు

    సోమవారం: జీలకఱ్ఱ-ఎండుమిరపకాయ-కరివేపాకు వేసిన పోపులో ఆనపకాయ కూర 

    మంగళవారం: ఆనపకాయ తొక్కలు వేయించి ధనియాలు, జీలకఱ్ఱ, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, మెంతులు వేయించి, రెండు రెబ్బలు చింతపండు వేసి రుబ్బిన ఆనపకాయ-తొక్కల పచ్చడి 

    బుధవారం: ఆనపకాయ ముక్కలు, పెసరపప్పు ఉడికించి, జీలకఱ్ఱ-ఇంగువ-ఎండుమిరపకాయ-కరివేపాకు పోపేసి, దానికి combination గా కాల్చిన వంకాయని పచ్చిమిరపకాయ, కొత్తిమీరతో కలిపి చిన్న రోట్లో దంచి, చింతపండు పులుసు కలిపి - మెంతులు-ఆవాలు-ఎండుమిరపకాయ-ఇంగువ-కరివేపాకు పోపేసిన వంకాయ-పచ్చిపులుసు. 

    గురువారం: ములక్కాడ, అరటికాయ ముక్కలతో పాటు ఆనపకాయ ముక్కలు కూడా ఓ నాలుగేసి - వేయించిన ధనియాలు, మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు, రెండు మెంతి గింజలు, చిటికెడు జీలకఱ్ఱ, ఉడికిన కందిపప్పు, కొబ్బరి వేసి - రుబ్బి చేసిన -  సాంబారు 

    శుక్రవారం: ఇంకో నాలుగు ఆనపకాయ ముక్కలు వేసి చేసిన ఆవ-మిళిత-తోటకూర పులుసు 

    శనివారం: తెల్ల గుమ్మడి కాయ, ములక్కాడ, కేరట్, బంగాళాదుంప, వంకాయ ముక్కలతో పాటు - దీని కోసమే  దాచిపెట్టిన ఆనపకాయ ముక్కలు వేసి - ఉడకబెట్టి - కమ్మటి పెరుగు, రుబ్బిన కొబ్బరి-ధనియం-పచ్చిమిరపకాయ ముద్ద కలిపి - జీలకఱ్ఱ-ఆవాలు-ఇంగువ-సహిత నేతి పోపుతో చేసిన ఆవియల్. 

    అలా - అప్రతిహతంగా - ఆదివారం నుంచి శనివారం దాకా - మా అమ్మ జరిపించిన ఆనపకాయ-వారోత్సవాలలో - అప్పటికి "అబ్బా! ఆనపకాయ బాబోయ్!" అనుకున్నా - అనుకుకోండా ఆనపకాయ అలవాటు అయింది నాకు. 

    ఆనపకాయ దొరికితే పైన చెప్పిన ఏడు రకాలే కాకుండా నేను చేసే ఎనిమిదో రకం: పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకఱ్ఱ, ఎండుమిరపకాయలు, ఇంగువ నానబెట్టి కొంచెం కొబ్బరి వేసి రుబ్బి, ముందే ఉడకబెట్టిన ఆనపకాయముక్కలతో కలిపి పులిసీపులవని మజ్జిగలో రెండు పొంగులు రానిచ్చి, జీలకఱ్ఱ-ఆవాలు-ఇంగువతో నెయ్యిపోపు పెట్టిన మజ్జిగపులుసు. 

    అంతే కాకుండా మా అత్తగారు చేసినప్పుడు తిని, మహబాగా నచ్చేసి - నేను చేసుకునే తొమ్మిదో రకం - పాలుపోసి చేసే ఆనపకాయ కూర. 

    మొత్తానికి - నవనవలాడే ఒక్క ఆనపకాయతో - నవ-కాయ-వంటలు చేసేసుకుంటూ ఉంటా.   

    ఇప్పటికీ ప్రతివారం కూరలు తెచ్చుకునేటప్పుడు నేను ఆనపకాయ కొనకుండా ఇంటికి రాను. ఒకేవేళ నేను మర్చిపోయినా తను గుర్తు చేసి మరీ నా చేత ఆనపకాయ కొనిపిస్తారు బద్రి. 

    కూరల మధ్యలో లేతాకుపచ్చ రంగులో మెరిసిపోయే ఆనపకాయలని చూడగానే మెరిసే నా కళ్ళు చూసి "కూర బాసలు తెలుసు లల్లికి" అనుకుంటూ, ఆ నాటి పూలబాసల ఎంకిని తలిచి మురిసిన నాయుడుబావలా, ముసిముసినవ్వులు నవ్వుకుంటుంటారు కూడా. 

    ఇక్కడితో నా ఆనపకాయోపాఖ్యానం సమాప్తం. 


*******
*******


    అమెరికా వచ్చిన కొత్తలో ఒకానొక శనివారం... 

    మేము అంతకుముందు రోజే ఆనపకాయ కొనుక్కొచ్చినవారం. 

    నేను అత్యుత్సాహంగా పెసరపప్పు-ఆనపకాయ ముద్దకూర చేసి - వేడివేడి అన్నంలో నెయ్యి వేసి, నే చేసిన ముద్దకూర కలిపి, కోతీ-ఢాం-ఢాం కథ చెప్తూ - అన్నజింకకి ఆమ్ తినిపిస్తున్నాను. 

    గుండ్రటి కళ్ళతో - కనురెప్ప వేస్తే చెప్పే కథ ఆపేస్తానేమోనన్నట్టు - నన్నే చూస్తూ - నే చెప్తున్న కథ వింటూ వాడూ తింటున్నాడు. 

    పెసరపప్పు-ఆనపకాయ ముద్దకూర కలిపిన అన్నం తినిపించడం అయ్యింది. తర్వాత పెరుగు-అన్నం కూడా గబగబా తినేశాడు. 

    అంతా అయ్యాక -మూతి కడుక్కుని,  బుజ్జిగ్లాసులో మంచినీళ్ళు తాగేసి - ఎప్పట్లా వెళ్ళి వాడి బొమ్మలతో ఆడుకోకుండా - నాకేసే చూస్తూ నించున్నాడు. 

    ముందు నేను పట్టించుకోలేదు కానీ - ఒక రెండు నిముషాలయ్యాక వాడేదో చెప్పాలనుకుంటున్నాడేమో అనిపించి "ఏం మున్నుగాడూ! ఇంకా ఇక్కడే ఉన్నావూ? ఏమన్నా కావాలా?" అని అడిగాను. 

    బుజ్జిగాడు వెంటనే నా దగ్గరకొచ్చి - నా చేతిని వాడి బుల్లిబుల్లి చేతులతో పట్టుకుని - "అమ్మా! నువ్వు ఆ yellow పప్పు చాలా బాగా చేశావు. కానీ... నాకు ఇంకెప్పుడూ కల్పొద్దమ్మా..." అని నెమ్మదిగా -  నేను నొచ్చుకోకుండా - నేను చేసిన పప్పుని మెచ్చుకుంటూనే - అది తనకి నచ్చలేదని - నాకు నచ్చచెప్తున్నటు - వాడు చెప్పిన తీరుకి - ఏమనగలను?! 

    ఆ తర్వాత పెసరపప్పు-ఆనపకాయ వండడం మానలేదు కానీ - అది వండినరోజు బుజ్జిగాడి కోసం వేరే పప్పు చేసేదాన్ని. 

*******
*******


    ఇప్పుడు అన్నజింకకి తమ్ముడు బుజ్జిజింక తోడయ్యాడు. 

    నేనెప్పుడైనా  - seasonal గా దొరికే చిక్కుడుకాయలతో కూర చేసినా, అరుదుగా దొరికే గోంగూరతో పులుసు కూర చేసినా -  తినము అంటే తినమని ఇద్దరూ ఒక మాట మీదే ఉంటారు. 

    "ఇది చేసి చాలా రోజులయ్యిందిరా! నేను ఎప్పుడో కానీ చెయ్యను కదా! మీకు అన్ని రుచులూ తెలియాలంటే ఇలా అన్ని రకాల కూరలూ తినాలి" అనంటాను నేను.  

    బద్రి కూడా "అమ్మ ఈ కూర చాలా బాగా చేస్తుంది. కొంచెం అన్నంలో కలుపుతుంది. తిని చూసి నచ్చకపోతే వదిలెయ్యండి" అని ఎంత చెప్తారో!

    దానికి అన్నదమ్ములిద్దరూ "నాన్నగారూ! మీరు అబద్ధం చెప్పకండి. అమ్మ ఇది last week చేసింది - మాకు తెలీదనుకున్నారా?" అని దబాయించేసి నా చేత వేరే అన్నం కలిపించేసుకుంటారు.  

    కిందటి వారం అన్నజింక ఆఫీస్ పని మీద బోస్టన్ వెళ్ళాడు. 

    ఇక ఇంట్లో ఉన్న బుజ్జిజింక - నేను వండుతున్నప్పుడు వాడికి వాసన నచ్చిందని - వంకాయ-కొత్తిమీర కారం కూర అడిగి మరీ తిన్నాడు. 

    ఇదే మంచి అవకాశం అని చెప్పి మరసటి రోజు పెసరపప్పు-ఆనపకాయ ముద్దకూర చేశాను - వాడి చేత ఎలాగైనా తినిపించాలని. మళ్ళీ అన్నగాడు వస్తే నా మాట వినడు మరి! 

    అసలే ఆన్లైన్ స్కూల్.  

    మధ్యాహ్నం  lunch time -  స్కూల్ మధ్యలో వచ్చి తినడం కదా చాలా హడావిడిగా తినేస్తాడు.  పైగా ఈ కొత్త కూర అప్పుడు పెట్టి వాణ్ణి విసిగించడం ఎందుకులే అని రాత్రి భోజనంలో అన్నం కలిపేటప్పుడు వాడికి చెప్పే కలిపాను. 

    "నాన్నగాడూ! నిన్న వంకాయ-కొత్తిమీర కారం కూర నీకు నచ్చింది కదా! అసలు నువ్వు ఇంతకుముందు అన్నీ తినేవాడివి. ఇదిగో! ఇవాళ పెసరపప్పు-ఆనపకాయ కలుపుతున్నాను. తిని చూడు. నీకే తెలుస్తుంది. ఎంత బావుంటుందో!" అంటూ కలిపిన కంచం వాడి చేతికిచ్చాను. 

    పేపర్లో కార్టూన్స్ చదువుకుంటూ తింటున్నాడు. 

    తింటూ తింటూ "అమ్మా! ఒక పేపర్ తీసుకుని, దాని మీద  నేను ఇవాళ ఈ పప్పు తిన్నానని రాయి" అన్నాడు. 

    అది వింటూనే నేను  - ఏదో సరదాగా అంటున్నాడని "రాస్తాలేరా! ముందు తిను" అన్నాను. 

    ఈ లోగా వాడు ఆ అన్నం తినేసి, తర్వాత టొమాటో పచ్చడి అన్నం కలపమని వంటింట్లోకి వచ్చాడు. పచ్చడి వాడికి చాలా ఇష్టం. 

    వచ్చాడే కానీ కంచం నా చేతికివ్వడే!

    "కంచం ఇటివ్వరా నాన్నా! పచ్చడి అన్నం కలుపుతాను" అని నేనంటే "ముందు నువ్వు పేపర్ మీద నేను చెప్పినట్టు రాయి" అన్నాడు. 

    "సరే! నీకు అన్నం కలిపాకే రాస్తాను!" అని నేను. 

    "నువ్వు రాశాకే అన్నం కలుపుతావు" అంటూ వాడు. 

    "చూద్దాం! కంచం ఇవ్వకుండా ఎంత సేపుంటావో!" అని నా సవాల్. 

    "నీ ఇష్టం! నేనెంతసేపైనా తినకుండా ఉంటాను" అని వాడి జవాబు. 

    ఇంకేం చేస్తాను?!

    పక్కనే ఓ sticky note ఉంటే అది, దాంతోపాటే ఒక పెన్ను తీసుకున్నా. 

    వాడు చెప్పింది రాశాను. 

    రాయగానే "అమ్మా! కింద sign చేయి" అన్నాడు. 

    సంతకం చేశాను. 

    "ఇవాళ్టి Date రాయి" అన్నాడు. 

    రాశాను. 




    వెంటనే వాడి కంచం నా చేతికిచ్చి, టొమాటో పచ్చడి - అన్నం  కలపమని చెప్పి - ఆ నోట్ పట్టుకుని వాడి రూం లోకి వెళ్ళి - ఒక ఫోటో తీసుకుని, ఆ నోటుని వాడి టేబుల్ మీద పెట్టుకుని -అప్పుడు కిందకొచ్చి అన్నం తిన్నాడు. 

    "అలా ఎందుకురా చేశావ్?" అంటే "ఈసారెప్పుడైనా 'నువ్వు ఈ పప్పు తినలేదు, ఒకసారి ట్రై చెయ్యి'  అని నువ్వో, నాన్నగారో అంటే ఆ నోట్ చూపిస్తా"నన్నాడు. 

    వాడలా అనగానే.... చెప్పే తీరులు వేరైనా - ఒకప్పటి నోటిమాట, ఇప్పటి నోటుమాట - రెండూ ఒకటే అనిపించాయి "అదే కాయ - అదే పప్పు - అదే వద్దు!" అన్నట్టు. (హేండ్సమ్ విలన్ ఆర్నాగేశ్వర్రావ్‌కి సొర్గంలో పొలమారే ఉంటుంది.)


*******
*******

    అప్పుడే అయిపోలేదు - ఇవాళ్టి కబుర్లు. 

    వాతావరణంలో చలి తగ్గి - కొంచెం వెచ్చగా అనిపించగానే మా చీమ-చుట్టాలు గోడలు దిగి వస్తూ ఉంటాయి. 

    ఇల్లంతా పాకినా వాటికి ఏమీ దొరకదు కదా పాపం! అన్జెప్పి మా వంటింటి సింక్ పక్కనే పొడిగా తుడిచి - ఆ గోడ వారగా మూడ్రోజులకోసారి ఓ చిన్న చెంచాడు పంచదార వేస్తాను. 

    పొద్దున్నే morning walk కి వచ్చిన మొదటి చీమ ఏదో ఒకటి  అటూఇటూ తిరుగుతూ అక్కడ పంచదార ఉందని కనిపెడుతుంది. 

    వెంటనే హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మిగిలిన చీమల్ని లేపి పిలుచుకొస్తుంది. మొత్తానికి చిన్నా, పెద్దా చీమలన్నీ - జుట్లు ముడులేసుకుని, నైటీల్లోనే వచ్చేసి - ఆ చెంచాడు పంచదార పలుకుల్నీ దొర్లించుకునో, నెత్తిమీదకెక్కించుకునో పట్టుకెళ్ళిపోతాయి. 

    ఇలా ప్రతి మూడు రోజులకోసారి వాటికి రేషనిస్తాను నేను. 

    నిన్నేమయ్యిందంటే -  బద్రికి చైనీస్ ఫ్రైడ్ రైస్  తినాలనిపించి, మా ఇంటి పక్కనున్న చైనా-ఫస్ట్ restaurant నుంచి తెచ్చుకున్నారు. దాంతో పాటు ఓ మూడు fortune-cookies కూడా ఇచ్చారు చైనా-ఫస్ట్ వాళ్ళు. 

    సరే! రోజూ పంచదారే పెడితే చీమలక్కూడా bore కొడుతుంది కదా - కొంచెం వెరైటీ ఉంటుంది అని ఒక cookie లో ఒక చిన్నముక్క విరిచి, మళ్ళీ పెద్దముక్కలైతే చీమలకి మోసుకెళ్ళడం బరువవుతుంది అని చెప్పి - నేను ఇంగువ దంచుకునే రాయితో కుకీని పొడిపొడిగా చేసి - చీమలొచ్చే గోడ వారగా పోశాను. 

    నిన్నటి  ఉంచి ఒక్కటంటే ఒక్క చీమ కూడా ఆ కుకీ పొడి జోలికే వెళ్ళలేదు. 

    "ఇంగువ దంచిన రాయితో దంచాను, చీమలకి ఆ వాసనతో ఉన్న కుకీ పొడి నచ్చలేదేమో!" అని సందేహమొచ్చింది నాకు. 

    ఇవాళ పొద్దున్నే ఆ పొడిని తీసేసి - మళ్ళీ ఇంకో కుకీ లోంచి చిన్నముక్క విరిచి - దాన్ని పొడి చేసి - చీమలొచ్చే దారిలో పోశాను. 

    ఉహూఁ ! ఒక్క చీమంటే ఒక్కటి కూడా కుకీ పొడి తినడానికి, తీసుకెళ్ళడానికి రానే లేదు. చీమలన్నీ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయాయి. 

    ఇలాక్కాదని ఇవాళ సాయంత్రం ఒక చెంచాడు పంచదార ఆ కుకీ పొడి పక్కనే పోశాను. 

    ఓ పది నిముషాల తర్వాత చూస్తే ఒక చీమ పంచదార గుట్ట మీద హడావిడిగా డాన్సాడేస్తోంది. 

    రెండు నిముషాల్లో పరిగెత్తుకుంటూ మా వంటింటి వాల్-పేపర్ చాటునున్న దాని అపార్టుమెంటుకెళ్ళి ఓ నాలుగు చీమల్ని పిలుచుకొచ్చింది. 

    అవన్నీ కలిసి - చాలా జాగ్రత్తగా కుకీ పొడి కేసి అస్సలు కన్నెత్తి కూడా చూడకుండా - పంచదార పలుకుల్ని నెత్తికెత్తుకుని మోసుకెళ్ళడం మొదలెట్టాయి. 




    అది చూడగానే నాకేమనిపించిందంటే - మనిషిగా నాకు తెలియని కల్తీ ఏదో చీమలకి ఆ చైనీస్ కుకీలో కనిపించిందేమోనని! 

    వెంటనే మిగిలిన కుకీ ముక్కలని trash లో పడేశాను.         

    అదృష్టపు-కుకీ(Fortune Cookie)ని చీమలు తినవూ అని తెలియడమూ, నేను వాటిని పడెయ్యడమూ -  ఆ కుకీలు తెచ్చిన అదృష్టం ఇన్నేళ్ళకి. 

    ఇంకెప్పుడూ మా చీమలకి కూడా వాటికి ఇష్టం లేని కుకీలని పెట్టనబ్బా! 

*******
*******


9 కామెంట్‌లు:

  1. ఆనపకాయ ఆవపెట్టి చేస్తే కూడా బాగుంటుంది కదా.
    అన్నట్లు ఈ ఆనపతొక్కల పచ్చడిని మేము రేడియోపచ్చడి అనేవాళ్ళం. బాగుంటుంది చాలామంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్తే అండి, శ్యామలీయం గారు ! ఆవపెట్టి ఆనపకాయ ఎప్పుడూ తినలేదు. ఒకసారి చేసి చూస్తాను. రేడియో పచ్చడి పేరు కూడా ఇదే వినడం 😀

      నా బ్లాగ్ చదివి వ్యాఖ్య ఉంచినందుకు ధన్యవాదాలు మీకు .

      తొలగించండి
    2. చెయ్యండి చెయ్యండి. ఆనపకాయ ముకసృలు మరీ చిన్నగా కాకుండా చేయండి. మరీ హల్వా ఐపోయేదాకా ఉడికించకండి. ఆవఘాటు కొంచెం గట్టిగానే తగిలించండి.

      ఆనపతొక్కలపచ్చడి గురించి రేడియోలో విని మాఅమ్మగారు నవ్వుకుని ఇది రేడియోవాడు చెప్పాలా అని ఆపేరు తగిలించారు. అలా అది స్థిరపడింది మా ఇళ్ళలో.

      తొలగించండి
    3. మీ అమ్మగారు భలే పేరు పెట్టారు :)

      మీ recipe నచ్చింది. ఇవాళ చేస్తున్నా. ధన్యవాదాలు, శ్యామలీయం గారు !

      తొలగించండి
  2. సొరకాయ కి ఇంత సీన్ ఉందా ? కొప్పున్నమ్మ ఎన్ని ముడులేసినా బాగుంటుంది. సొరకాయ పాలు పోసిన కూర ఎంత ట్రై చేసినా మా అమ్మ బాగా వండుతుంది అనే డైలాగ్ వినీ వినీ విసుగెత్తి వండడమే మానేశాను.
    సొరకాయ తొక్కు పచ్చడి కూడా చేస్తారా ? కూరగాయలు పండించడానికి కూడా పెస్టిసైడ్స్ వాడుతున్నారు అని బీర కాయ తొక్కు పచ్చడి కూడా మానేశాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనపకాయకి పెద్ద సీనే ఉండండి, నీహారికా !

      ఇంకా కొన్ని వెరైటీలు మర్చిపోయాను - (ఆనపకాయ-నువ్వుపప్పు , ఆనపకాయ-తెలగపిండి).

      Thanks for your comment.

      తొలగించండి
  3. ఇక్కడ ఒక రహస్యం ఉందండీ. తనకంటూ‌ ఒక ప్రత్యేకమైన రంగూ రుచి వాసనా ఆట్టే లేని కాయగూరల్ని రకరకాలుగా ఇష్టమైన రంగు రుచి వాసనలు వచ్చేలా కూరలు పచ్చళ్ళు వగైరా చేయవచ్చును. స్వతస్సిధ్ధంగా తమదైన ముద్ర ఉన్న కాయగూరలను ఆయా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినని విధంగా మాత్రమే చేయవచ్చును కాని వేరేగా చేస్తే అవంటకం అంత ఖాదయోగ్యంగా ఉండదు. ఇది జనరక్ రూల్ అన్నమాట. ఎక్సెప్షన్ అక్కడక్కడా ఉందవచ్చును లెండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి పరిశీలన!

      IT, తెలుగు-సంస్కృత-భాషల మీద పట్టు, పురాణాల విశేషాలు, mathematical 𝕡𝕦𝕫𝕫𝕝𝕖𝕤, వంటలు, చిట్కాలు, రాజకీయ పరిశీలన ...ఇలా ఒకదానికొకటి సంబంధం లేని ఎన్నో విషయాల గురించి మీకున్న అవగాహనా, విషయపరిజ్ఞానం నాకెప్పుడూ ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తాయండి ! Kudos to you !

      తొలగించండి
    2. దన్యవాదాలు లలిత గారూ, మీరిచ్చిన ప్రోత్సాహంతో నేనూ ఒక మంచి కొత్తరకం స్వీటు చేసే రెసిపీని పోష్టు చేస్తాను తప్పకుండా.

      తొలగించండి