నేను దేన్నీ ఎప్పుడూ వద్దనుకోను
మూడు విషయాల్లో నేను వద్దనుకున్నదే కద్దైంది
ఒకటి
మేమున్న చోట్లో నెలవు.
ఇంకోటి
నేను కొలువు చేస్తున్న చోటు.
మరింకోటి
ఇటీవలే మా నెలవుకొచ్చి కొలువు తీరిన కొత్త-తోమరి
వద్దనుకున్న చోటే కుదిరిన నెలవు:
సెయింట్ లూయిస్ వెస్ట్ కౌంటీలో మాంచెస్టర్ రోడ్ అని ఒక అందమైన రోడ్ వుంది.
దానికి అనుబంధంగా రెయిన్కీ రోడ్ అని ఒక చిన్న రోడ్ వుంది.
మేము అప్పుడెప్పుడో అపార్ట్‌మెంట్లో వున్న రోజుల్లో రెయిన్కీ రోడ్‌లో వుండే తెలిసిన వాళ్ళెవరైనా ఏ శనాదివారాల్లోనో పుట్టినరోజు పార్టీకో, ఇంకే పూజకో పిలిచేవారు.
అలా పిలిచిన వాళ్ళింటికి వెళ్ళాలంటే మాంచెస్టర్రోడ్డు మీద నుంచి ఎడమ చేతి వైపున్న రెయిన్కీ రోడ్‌లోకి తిరగాల్సి వచ్చేది.
అప్పుడున్న ట్రాఫిక్కుని బట్టి ఒక్కోసారి ఐదూ-పది నిముషాల దాకా ఆ మధ్య లేన్‌లో వేచివుండాల్సి వచ్చేది.
అలాంటప్పుడు మనసులో "అబ్బా! సెలవు రోజుల్లోనే ఇంతసేపు పడుతోంది. ఇక రోజూ ఈ దార్లోనే ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఇంకెంత ఆలస్యమవుతుందో. అసలెప్పుడూ ఈ రోడ్డులో మాత్రం ఇల్లు కొనుక్కోకూడదు" అనుకునేదాన్ని.
అమెరికాలో వుందామనుకుని ఇల్లు కొనుక్కుందామని అనుకున్నప్పుడు ఎక్కడెక్కడో తిరిగి ఎన్ని ఇళ్ళు చూసినా ఏదీ నచ్చక - మళ్ళీ అదే మాంచెస్టర్రోడ్డు మీద నుంచి ఎడమ చేతి వైపున్న రెయిన్కీ రోడ్‌లోకి తిరిగి - ఇప్పుడు మేమున్న ఇల్లు నచ్చి కొనుక్కున్నాము.
మా ఇల్లు కొనుక్కునేటప్పుడు "అసలెప్పుడూ ఈ రోడ్డులో మాత్రం ఇల్లు కొనుక్కోకూడదు" అని నేననుకున్నానన్న సంగతే నాకు గుర్తు రాలేదు.
కాకపోతే మాకు రెయిన్కీ కన్నా ముందు రోడ్డు లోనే తిరిగి ఇల్లు చేరే వీలుంది కాబట్టి అంత ఇబ్బందేమీ లేదు. కానీ వద్దనుకున్నదే వరించినట్టయింది.
వద్దనుకున్న చోటే చేరిన కొలువు:
ఒకానొక ఏడాది ఆగస్టు ఐదో తేదీన రెండు విషయాలు తెలిశాయి.
ఒకటి పాస్ అయ్యానని. ఇంకొకటి తప్పానని.
ఇంటర్వ్యూలో పాసయ్యాను.
ఇంట్లో నెల తప్పాను.
సరిగ్గా - ఇలాంటి సందర్భమే - అంతకు ముందు - అన్నజింక పుట్టేటప్పుడు - ఎదురైనప్పుడు అనివార్య కారణాల వల్ల ఉద్యోగాన్ని వదులుకోవల్సి వచ్చింది.
ఈసారి మాత్రం వచ్చిన అవకాశం పోగొట్టుకోకూడదూ, ఎలాగైనా రెండిటినీ నిభాయించాలీ అనుకుని ఉద్యోగంలో చేరాను.
సరిగ్గా ఏడు నెలలు పని చేసి కనడానికి పదమూడు రోజుల ముందు మానేశాను.
ఆ ఉద్యోగం చేసినన్నాళ్ళూ నా బాసు ఆడ-బాసు - literally, figuratively.
అదెలా అంటే - ఆవిడ ఆడావిడ obviously.
ఈడ (నేనున్న సిటీలో) కాకుండా ఆడ (వేరే సిటీలో) వుండేది.
ఆవిడెందుకో - పాపం! - నన్ను చూడకుండానే ఎందుకో నా మీద అనిష్టం పెంచుకుంది.
చాలా విసిగించింది. ఎలాగూ కొన్ని నెలల్లో మానేస్తాను కదా అని భరించాను.
అనుకున్నట్టుగానే delivery date దగ్గర పడుతుండగా ఉద్యోగం మానేశాను.
బుజ్జిజింక పుట్టాడు. ఆఫీసన్న మాటే తలవకుండా హాయిగా ఆడుతూ-పాడుతూ కాలం గడిచిపోతోంది.
వాడికి పదకొండు నెలలప్పుడు ఓ రోజు బద్రి ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనే "ఆఫీసులో మురళి నీ CV అడిగాడు. వాళ్ళ టీంలో ఖాళీలు ఉన్నాయట" అన్నారు.
నేను వెంటనే "అమ్మో! ఆ ఆఫీసుకా ...నేను జన్మలో మళ్ళీ అటుకేసే రాకూడదనుకున్నాను, బావా!" అని అస్సలొప్పుకోలేదు.
కానీ ఆ మురళి బద్రి వెంటపడి అడిగి మరీ నన్ను తన టీం లోకి తీసుకున్నాడు. అప్పట్నుంచి నేను ఎన్ని టీములు మారినా అదే ఆఫీసులో పని చేస్తున్నాను.
మళ్ళీ వద్దనుకున్నదే వరించినట్టయింది కదా!
వద్దు వద్దనుకున్నా వచ్చేసిన వైఫై-వాషర్:
దాదాపు మూడున్నరేళ్ల క్రితం మా తోమరి ఇక సాగలేనని ఆగింది. కానీ దెబ్బకి దడిచి మళ్ళీ సాగింది. ఆ కబుర్లు మళ్ళీ ఇక్కడొకసారి గుర్తు చేసుకున్నా.
తొందరపడి మా తోమరి - ఎందుకో ఆగిందీ... దెబ్బకి సాగిందీ...
ఒక దెబ్బకి ఆ రోజు సర్దుకుని పనిచేయడం మొదలు పెట్టిన ఆ తోమరి ఇంకా పనైతే చేస్తూనే వుంది.
కానీ పై ర్యాకు ఓ పక్కకి ఒరిగిపోయింది. కింది ర్యాకుకి చక్రాలు వూడిపోయాయి.
ఎప్పుడోప్పుడు లోపల లోడ్ చేసిన గిన్నెలూ, కంచాలూ దొర్లుకుంటూ బయటికి వచ్చేస్తాయేమో అనిపించేలా తయారైంది.
అన్నట్టు - అప్పుడప్పుడూ మా తోమరికి ప్రేంనగర్ - వాణిశ్రీ పూనుతూ వుంటుంది.
అంతే ... ఆవేశంతో వూగిపోతూ -----
-----అని పాడుకుంటుంటుంది.
సర్లే! ఆవేశాలతో ఊగిపోయి, ఆయాసంతో అదాగిపోయేదాకా ఆగే కన్నా ముందే ఓ కొత్త డిష్వాషర్ కొనేసుకుంటే మంచిదనిపించింది.
ఎప్పుడైతే కొత్త-తోమరి కొనుక్కుందామనుకున్నామో - మా ఇంట్లో వున్న నలుగురం - అమ్మా-నాన్నా-ఇద్దరబ్బాయిలం - ఏకగ్రీవంగా డంబ్-డిష్వాషర్ మాత్రమే కొనుక్కోవాలని అనుకున్నాము.
అసలే ఈ మధ్య అన్నీ స్మార్ట్ అయిపోతున్నాయి.
చెవిలో ఫోను స్మార్టు.
చేతికున్న వాచు స్మార్టు
బట్టలుతికే వాషర్ స్మార్టు.
గిన్నెల్తోమే డిష్వాషర్ స్మార్టు.
అసలు గిన్నెలు తోమడానికి భుజబలముండాలి కానీ బుద్ధిబలమెందుకంట - అడిగేవాళ్ళు లేక ఆఖరికి యంత్రాలక్కూడా అలుసైపోతున్నాం.
తీరా ముచ్చటపడి స్మార్ట్ డిష్వాషర్ కొనుక్కొచ్చి ఇంట్లో వైఫైకి కనెక్ట్ చేస్తే అదేమన్నా ఊరికే వుంటుందా?
రోజుకి నేనెన్ని సార్లు దాన్ని on చేస్తున్నానూ, ఎప్పుడెప్పుడు on చేస్తున్నానూ, అందులో ఏ డిష్వాషర్ లిక్విడ్ వాడుతున్నానూ, ఎన్ని గిన్నెలు పెడుతున్నానూ, ఎన్ని కంచాలు కడుగుతున్నానూ, ఎన్ని గరిటెలు వాడుతున్నానూ - ఇలాంటివన్నీ లెక్కేసి దాన్ని తయారు చేసిన కంపెనీ వాడికి పంపిస్తుంది.
వాడు ఆ డేటానంతా ఇంకెవరెవరికి అమ్ముతాడో!
ఇహప్పట్నుంచీ - నువ్వు గిన్నెలెక్కువ తోముతున్నావ్, నీ తోమరిని అరగదీసేస్తున్నావ్, మీ home appliance insurance పెంచేస్తామని బెదిరింపులొస్తాయేమో!
ఏమైనా కొనుక్కోవడానికి ఏదైనా కొట్టుకెళ్తే నా తోమరి పంపించిన కడుగుడు-డేటా లెక్కలతో నా మొహాన్ని గుర్తు పట్టేసి ఇహ నేను ఆ స్టోర్ లోంచి బయటికి వచ్చేదాకా రకరకాల గిన్నెలు తోమే సబ్బులూ, బిళ్ళలూ, పీచుల గురించి అడ్వర్టైజ్మెంట్లతో నా చెవులు చేటలైపోతాయేమో!
లేకపోతే నా స్మార్టు-తోమరికే తెలివెక్కువై - నేను రోజుకోసారే తోముతా అని మొండికేస్తుందేమో!
అందుకే మా ఇంటికి రాబోయే తోమరికి "నాచురల్-ఇగ్నోరెన్స్ ముద్దు... ఆర్టిఫిషియల్-ఇంటెలిజెన్స్ వద్దు" అనుకున్నాం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి