కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 46 - ఎంత మంచి మాటదో .. ఎంత తీపి కబురదో..
నేనెప్పట్నుంచో చూద్దామని అనుకుంటున్నట్టుగా, అప్పుడెప్పుడో తిరుపతి రోజుల్లో నేనన్నది గుర్తు పెట్టుకుని - అదిప్పుడు మళ్ళీ వింటున్నట్టుగా గుర్తు చేసుకున్నట్టున్న బదరి నన్ను శనివారం అల్సూర్ తీసుకెళ్ళి, అక్కడో ఐస్క్రీం కొనిపెట్టి, లిడో థియేటర్లో కభీ-కభీ సినిమా చూపెట్టారు.
అంత మూడు గంటల సినిమాలోనూ - మై పల్ దో పల్ కా షాయర్ హూఁ, కభీ కభీ మేరే దిల్ మే - అన్న రెండు పాటలు తప్ప నాకింకేమీ నచ్చలేదు.
పైగా సినిమాలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి - "శశికపూరూ, శశికపూరూ... ఇంచగ్గా నువ్విలా నవ్వుతూనే ఉండాలంటే ఆ రాఖీని అమితాబ్బచ్చన్ దగ్గరికి పంపేయ్, లేపోతే సినిమా రెండో హాఫ్ మొత్తం ఏడుపుతో నింపేస్తుంది" అని చెప్పెయ్యాలనిపించింది. అలా చెయ్య వీలు లేక మూడుగంటల పాటు యశ్ చోప్రాని తిట్టుకుంటూ సినిమా చూసి, మళ్ళీ పొరపాటున కూడా కభీ భీ కభీ-కభీ చూస్తానని అననని అనేసుకున్నా.
ఇక ఆదివారం కబ్బన్ పార్కుకి వెళ్దామనుకున్నాం కదా... so, వెళ్ళాము బదరీ, నేను.
అప్పటికే బదరి ఫ్రెండ్స్ బాలాజీ, సాయి గిరిధర్, ప్రసాద్ రెడ్డి, రవి అక్కడికి వచ్చేసున్నారు.
అందరం కలిసి కబ్బన్ పార్క్ అంతా తిరిగాం. కొత్తిమీర, నిమ్మకాయ రసం రాసి నిప్పుల్లో కాల్చిన మొక్కజొన్నపొత్తులు కొనుక్కుని తిన్నాం.
కబ్బన్ పార్కులో వెదురుపొదలు, వాటి పక్కగా వుండే ఒక చిన్న బ్రిడ్జ్. అక్కడక్కడా వుండే కొండరాళ్ళు నాకు చాలా ఇష్టం. ఆ బ్రిడ్జెక్కి నించుని అందరం ఫోటోలు తీసుకున్నాం.
తెలుపు, నీలం, గులాబీ రంగుల్లో వున్న చీర కట్టుకుని, ఊలుదారంతో జడ చివరిదాకా అల్లుకుని - చుట్టుముడుతున్న చిరుచిరు చలికి బెదరనీకుండా కాపుగా చుట్టూ కాస్తున్న నులివెచ్చని ఎండలో - నాతో పాటే నడుస్తున్న బదరి, బాలాజీ, సాయి, ప్రసాద్, రవి చెప్పుకుంటున్న కబుర్లు వింటూ, కళ్ళు విప్పుకుని కబ్బన్ పార్కు పచ్చదనాన్ని చూస్తున్న నా చూపుల్లో అంబరం అందుకున్న సంబరం.
మరుండదేంటి మరీ?
గత రెండున్నరేళ్లుగా ఉండీ లేనట్టున్న బెంగ ఇప్పడు అసలు లేకుండా పోయింది నాన్న నుంచి వచ్చిన ఫోన్ కాల్ మూలంగా.
నాకైతే... బదరితో నా పెళ్ళి ఎప్పటికీ జరగదేమో అన్న భయం ఎప్పుడూ లేదు; ఎప్పుడు జరుగుతుందా అన్న ఆలోచన అస్సలే లేదు; ఎప్పుడోకప్పుడు జరుగుతుంది అన్న భరోసా మాత్రం ఉండేది - ఇప్పుడు నాన్న చెప్పిన మాటతో ఆ భరోసా భద్రమయింది.
సరే! అలా మేమందరం కలిసి తిరుగుతూ - వెచవెచ్చటి ఎండలో తెలతెల్లటి విధాన్ సౌధ ముందు, ఎఱ్ఱెఱ్ఱని హైకోర్ట్ బిల్డింగ్ ముందు అందరం కలిసి ఫోటోలు తీసుకున్నాం.
సాయంత్రం నాలుగింటికల్లా అక్కణ్ణించి ముందు నటికలప్ప సర్కిల్‌లో వున్న బాలాజీ గదికి వెళ్ళాము. అప్పడు బాలాజీ వాళ్ళమ్మగారు, వాళ్ళ తమ్ముడు బాబు వచ్చి వున్నారు. బాలాజీ వాళ్ళమ్మగారిని పలకరించి - అక్కణ్ణుంచి విద్యాపీఠ్ సర్కిల్‌లో సాయి వాళ్ళ రూంకి వెళ్లాం. అక్కడ సాయితో కలిసి బోల్డు ఫోటోలు తీసుకున్నాం. మొత్తానికి ఆ ఒక్క రోజులో బెంగుళూరులో నేను చూడాలనుకున్నవన్నీ చూసేశాను.
ఏడింటికల్లా బదరి నన్ను సాగి వాళ్ళింటి దగ్గర దింపేసి వెళ్తూ, ఆ వారంలో మెజెస్టిక్ బస్టాండుకి వెళ్ళి తిరుపతికి టికెట్ రిజర్వ్ చేసుకొద్దామని చెప్పారు.
ఈలోగా నా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారయింది. నా గైడ్ కృష్ణన్ గారు, NAL హెడ్ నరసింహస్వామి గారు నా ప్రాజెక్టుని attest చేస్తూ సంతకాలు చేశారు. ఇక NAL కి వెళ్ళక్కర్లేదు. నాకు ప్రాజెక్టులో హెల్ప్ చేసిన సునీతకి బోల్డన్ని థాంక్స్ చెప్పాను. ఆఖరి సారిగా NAL కాంటీన్లో నాకిష్టమైన దోశ తిని, అందరికీ bye చెప్పేసి వచ్చేశాను.
బదరి, నేను కలిసి బస్టాండుకి వెళ్ళాము. అక్కణ్ణించి MG రోడ్డుకి వెళ్ళి తన MBA ఫ్రెండ్స్ శ్రీనివాస్, సాయి సురేష్, గిరిరాజ్ వాళ్లందరితో కలిసి ఏదో ఒక సినిమా చూద్దామని ఆ రోజుకి ప్లాన్.
బస్టాండులో బదరి నన్ను ఒక బెంచ్ మీద కూర్చోమని చెప్పి తాను వెళ్ళి టికెట్ కౌంటర్ దగ్గర క్యూలో నించున్నారు. అప్పుడే నాకు మా SPMVV లో OS (Operating Systems) లాంటి సబ్జెక్టుని కూడా ఆడుతూ పాడుతూ టీచ్ చేసిన రాఘవేంద్ర సర్ కనిపించారు. నన్ను చూసి పలకరించారు.
ఆయనలా పలకరించగానే నేను "ఇక్కడ NAL లో ప్రాజెక్టు చేశాను, సర్! ఇంకో రెండు రోజుల్లో viva కోసం తిరుపతి వెళ్తున్నాము నేను, బదరి. అన్నట్టు నా పెళ్ళి కూడా కుదిరింది, సర్! - బదరి తోనే. తనని తిరుపతిలో నాతో పాటు మీరు చూసే వుంటారు.!" అని గబగబా చెప్పగానే భలే మొహమాటంగా నవ్వుతూ "కంగ్రాట్స్ అండీ!" అని చెప్పేసి తన బస్సుకి టైం అవుతోందని బదరి వచ్చేదాకా ఉండకుండానే వెళ్లిపోయారు.
ఈలోగా బదరి టికెట్స్ తీసుకుని వచ్చారు. తనకి మా రాఘవేంద్ర సర్ కనిపించారని చెప్పాను. మేమిద్దరం మా తిరుపతి రోజుల గురించి మాట్లాడుకుంటూ BTS బస్సెక్కి MG రోడ్డుకి వెళ్ళాం. అక్కణ్ణించి నడుచుకుంటూ బ్రిగేడ్ రోడ్డులో వున్న మోటా ఆర్కేడ్ దగ్గరకెళ్తే అక్కడ మా కోసం wait చేస్తూ కనిపించారు శ్రీనివాస్ వాళ్ళు.
మేమెళ్ళేటప్పటికే బాగా ఆలస్యం అయింది అందుకని ఎక్కువ దూరం వెళ్ళకుండా ఆ దగ్గర్లోనే వున్న "దిల్ ఆష్నా హై" చూద్దామనుకున్నాం. తీరా వెళ్ళాక ముగ్గురుతల్లుల flashback history - దివ్యభారతి ఎవరి కూతురో తేలాల్సిన mystery భరించలేక సగంలోనే బయటికి వచ్చేశాం బదరి, నేను.
నేను చూద్దామని వెళ్ళి, చూసి భరించలేక, పూర్తిగా చూడకుండా థియేటర్లోంచి వచ్చేసిన మొట్టమొదటి, చిట్టచివరి సినిమా "దిల్ ఆష్నా హై".
మా తిరుపతి ప్రయాణం ఆ రోజే. నేను సాగి వాళ్ళ ఇంట్లో నాకిచ్చిన గదిలో వున్న నా బట్టలు, పుస్తకాలు అన్నీ సర్దుకుని ప్రయాణానికి సిద్ధంగా వున్నాను. బదరి ఎనిమిదింటికల్లా సాగి వాళ్ళింటికి వచ్చారు. మా బస్సు రాత్రి పదిన్నరకి.
బదరి వచ్చే ముందే సాగి ఇంటికి ఎప్పుడూ వచ్చే తన ఫ్రెండ్స్, BHEL colleegues కామేష్, లక్ష్మీ నారాయణ (నాని) వచ్చి నాకు బెస్ట్ విషెస్ చెప్పి వెళ్ళారు.
బదరిని చూడగానే సాగి, ఇందిర నన్నెంత ఇష్టంగా చూస్తారో అంతే ఇష్టంతో బదరిని కూడా own చేసుకుని మాట్లాడారు. బదరి కూడా వాళ్ళిద్దరితో అంతే ఇష్టంగా మాట్లాడారు.
సాగి వాళ్ళింట్లో నాకెంతో ఇష్టమైన నా గదిని, గది కిటికీ బయట విరబూసిన నైట్‌క్వీన్ మొక్కనీ ఒకసారి చూసుకుని, సాగి-ఇందిరలకి bye చెప్పేసి బదరితో బయల్దేరాను తిరుపతి బస్సెక్కడానికి.
మేమెక్కిన బస్ పలమనేరులో ఒక పదిహేను నిముషాలు మాత్రం ఆగింది. మేము పొద్దున్నే తిరుపతి చేరి, హోటల్లో fresh-up అయ్యాక వెంటనే రైల్వే స్టేషన్‌కి వెళ్ళి అదే రోజు సాయంత్రానికి నేనొక్కదాన్ని మాత్రం గుంటూరు వెళ్ళడానికి టికెట్ రిజర్వ్ చేసుకున్నాం. ద్వారక హోటల్లో మధ్యాహ్నం లంచ్ చేయగానే - నన్ను మా యూనివర్సిటీలో దింపేసి బదరి మళ్ళీ వెనక్కి బెంగుళూరు వెళ్ళిపోయారు - తను కూడా ఉద్యోగంలో చేరి పది రోజులు కూడా కాలేదు కదా! పైగా ఉద్యోగంలో చేరీ చేరకుండానే పెళ్ళి కోసమని ఇరవై రోజుల సెలవు కూడా అడిగేశారు కూడా. తనలా అడగ్గానే వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ చొక్కలింగం గారు అడిగారట కూడా అన్ని రోజుల సెలవెందుకని.
వెంటనే బదరి "మా ఇంట్లో పెళ్ళయ్యాక పదహార్రోజుల పండగ అని చేస్తారు. అప్పటిదాకా నేనక్కడే ఉండాలి. మీరు సెలవివ్వనంటే చెప్పండి. నాకు కలకత్తాలో వేరే ఉద్యోగం సిద్ధంగా వుంది. అక్కడికెళ్ళి చేరిపోతాను" అనగానే చొక్కలింగం గారు నవ్వుకుని "సరే బాబూ! నీ పెళ్ళీ, పదహార్రోజుల పండగయ్యాకే రా. కానీ దానికి ముందూ, వెనకల్లో ఇప్పుడిప్పుడే ఇంకే సెలవూ నువ్వు నన్నడక్కు, నేన్నీకివ్వను!" అని చెప్పారట.
అదీ - బదరి అంత హడావిడిగా బెంగుళూర్ తిరిగి వెళ్ళడానికి కారణం.
ఆ రోజు నా viva మధ్యాహ్నం ఒంటిగంటకి మా CC (Computer Centre లో). నర్మద, సాహితీ మేడం, సత్యం సర్, రాజశేఖర్ సర్ నా ప్రాజెక్ట్ presentation విన్నారు. మార్కులేశారు. మధ్యాహ్నం మూడింటికల్లా నేను బయటికి వచ్చేసి మా హాస్టల్ బిల్డింగ్ కల్యాణి దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ అప్పటిదాకా మా క్లాస్‌మేటూ, ఇటీవలే కొత్తపెళ్ళికూతురూ అయిన అపర్ణ తన సహచరుడు హరితో కనిపించింది. వాళ్ళిద్దరినీ పలకరించి, అక్కడే కనిపించిన మిగిలిన క్లాస్‌మేట్స్ తోనూ ఓ ఐదు నిముషాలు మాట్లాడి అక్కణ్ణించి బయల్దేరి తిరుపతి రైల్వే స్టేషన్‌కి వెళ్ళాను. అదే మొదటిసారేమో హాస్టల్ నుంచి నేనొక్కదాన్నే రిక్షాలో రైల్వే స్టేషన్‌కి వెళ్ళడం.
నా ట్రెయిన్ సాయంత్రం ఆరున్నరకి. నేను నాలుగున్నరకే వచ్చేశాను మరి. సరే అని వెళ్ళి లేడీస్ వెయిటింగ్ రూంలో కూర్చున్నాను. ఓ పది నిముషాల్లో ఇంకో అమ్మాయి వచ్చింది అక్కడికి. తనెవరంటే BH కాలేజ్‌లో నాతో ఇంటర్ చదివిన భారతి అనే అమ్మాయి. తనతో కొంచెంసేపు మాట్లాడాక ఎప్పుడన్నా ఉత్తరం రాయమని తన అడ్రస్ నా చేతిలో వున్న చిన్న డైరీలో రాసిచ్చింది. వింతేంటంటే నేను తెలుగులో మాట్లాడుతున్నా కూడా తను అడ్రెస్ హిందీలో రాసింది. అదేంటీ అనడిగితే నీకు తెలుగు రాదేమోననుకున్నా అంది. అలా అనేసి తన ట్రెయిన్ వచ్చే టైం అయిందని వెళ్ళిపోయింది. అనుకోకుండా కనిపించిన భారతి గుర్తుగా ఆ అడ్రెస్ దాచుకున్నా. కాకపోతే తనకెప్పుడూ ఉత్తరాలు రాయలేదు - తన పేరు భారతి అని తెలియడం తప్ప BH లో చదివే రోజుల్లో ఒక excursion కి కలిసి వెళ్లడం తప్ప తనతో ఎప్పుడూ మాట్లాడిన గుర్తు కూడా లేదు మరి. తన గురించి ఏమీ తెలియకుండా ఉత్తరం రాయాలంటే మొహమాటం వేసింది.
భారతి అలా వెళ్ళగానే మళ్ళీ నేనొక్కదాన్నే అయ్యాను ఆ వెయిటింగ్ రూంలో.
అప్పుడు ... సరిగ్గా అప్పుడే నాకు కొంచెం టైం దొరికింది - గత వారం రోజులుగా జరుగుతున్నవి తలచుకుని, జరుగుతున్నది కల కాదు నిజమే అని నాకు నేనే చెప్పుకోవడానికి.
ఇంత హఠాత్తుగా నాన్న మా పెళ్ళికి ముహూర్తం పెట్టించారంటే - దాని వెనక అయన తనకి తాను సర్ది చెప్పుకోవడానికి పడ్డ బాధ, ఏం చేస్తే, ఎలా చేస్తే బావుంటుందోనని అమ్మతో కలిసి చేసిన ఆలోచన ఎంత ఉన్నాయో, అంతకు మించి నా ఇష్టాన్ని కాదనలేని ఆపేక్ష కూడా ఉంది.
ప్రసాద్ పెళ్ళికి అనాతవరం వెళ్ళినప్పుడు అప్పతో, పాపయత్తయ్యతో, లలితత్తయ్యతో మాట్లాడి వుంటారు నాన్న.
అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు - నా ముందు పుట్టిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విన్నవాళ్ళే - నేను తప్ప.
నాకోసం మా నాన్న ఆ పెద్దవాళ్ళందరితో మాట్లాడి నాకిష్టమైన బదరితో పెళ్ళి చెయ్యబోతున్నారు.
ఆనాటి నడకలో కలిసిన అడుగులు
చెలిమికి దారి చూపాయి
రేపటి రోజుకి కలగన్న ఏడడుగులు
బ్రతుకుకి బాట వేస్తాయి
ఇవన్నీ తలుచుకుంటూ అనుకున్నాను - ఇప్పటిదాకా ఇది కావాలీ అని ఎప్పుడూ అడగలేదు. అడగకుండానే అమ్మ, నాన్న అన్నీ ఇచ్చారు. ఇప్పుడు పెళ్ళి విషయంలో కూడా నా ఇష్టాన్నే మన్నిస్తున్నారు. ఇప్పటికీ, ఇంకెప్పటికీ కూడా ఇది నాకు అపురూపమైన బహుమతి - అని.
భలే! అన్నీ నా ఇష్టప్రకారంగా జరుగుతున్నా అలా జరగడాన్ని ఎలా enjoy చెయ్యాలో తోచనంత సంతోషం నాలో...
పాదం నిలవదు
పదం ఆగదు
కుదురులేని కాలమాయె
నవ్వు ఆగదు
నెమ్ముదుండదు
నిలవనీని ఆగమాయె
కల కమ్మె కంటిలోన
కలవరమె తలపులోన
కల వరమాయె నిజముగానె
నా కల ఆ వరుడి పరమాయె -
నిజముగానె - వరముగానె
కన్నుల లోనే కలలు ఊరెనో...
నవ్వుల లోనే పూలు పూచెనో...
ఈ హాయి ఏమో ...ఓ లల్లీ!
ఈ హాయి ఏమో ... ఓ లల్లీ!
నిన్నటి కన్నా - నేడు హాయిగా...
ఈనాటి కన్నా - రేపు తీయగా...
నా మనసూ.... నా తలపూ ...
హాయి హాయిగా మురిసేనే...
కన్నులలోనే కలలు ఊరెనో...
నవ్వుల లోనే పూలు పూచెనో...
ఈ హాయి ఏమో ...ఓ లల్లీ!
ఈ హాయి ఏమో ... ఓ లల్లీ!
నా ఆలోచనల్లో పడి ట్రెయిన్ ఎక్కడం మర్చిపోతే ఎలా!
ఈ కింది పాట పాడుకుంటూ
గుంటూరెళ్ళే రైలుబండెక్కుతూ నేను...
ఆ పాటేదో పాడుకుంటూ, అసలు పాటని పట్టుకుంటూ ... ఇక్కడుంటూ
మీరు...
కన్నుల లోనే కలలు ఊరెనో...
నవ్వుల లోనే పూలు పూచెనో...
ఈ హాయి ఏమో ...ఓ లల్లీ!
ఈ హాయి ఏమో ... ఓ లల్లీ!
నిన్నటి కన్నా - నేడు హాయిగా...
ఈనాటి కన్నా - రేపు తీయగా...
నా మనసూ.... నా తలపూ ...
హాయి హాయిగా మురిసేనే...
కన్నులలోనే కలలు ఊరెనో...
నవ్వుల లోనే పూలు పూచెనో...
ఈ హాయి ఏమో ...ఓ లల్లీ!
ఈ హాయి ఏమో ... ఓ లల్లీ!
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>


https://youtu.be/JM43SLeZ8z4
రిప్లయితొలగించండిమరుండదేంటి మరీ..
రిప్లయితొలగించండిAap jaise koi mere zindagi mein aaye tO
మరుండదేంటి మరీ..
చదివేను. నీ మనసంతా, నీ చేతల్లో, నీచేతలన్ని, నీ మాటల్లో, నీ మాటల్ని నీరాతల్లో, పై నుండి పల్లానికిపారే, నీరులా గలా,గలా,సాగిపోతున్నాయి.
రిప్లయితొలగించండిచాలా బాగుంది.
సరోజ,ఆంటి.
Waiting for next post..👌👌
రిప్లయితొలగించండి