7, జనవరి 2017, శనివారం

నేర్పించిరి (చదివించని) గురువులు - 5 - అమ్మ



అమ్మాయి

అనగనగా ఓ అమ్మాయి
అన్నదమ్ములు - అక్కచెల్లెళ్లు
ఆటలు - పాటలు
పెద్ద కళ్లు - రెండుజళ్లు
పలుకు తక్కువ - చదువు మక్కువ

వాళ్ల నాన్నగారు చెప్పేవారట - ఇలాగే బాగా చదువుకుంటే డాక్టర్ చదివిస్తానని.  
చెప్పిన నాన్నగారు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు - పైనుంచెవరో పనిగట్టుకుని పిలిచినట్లు.
పెద్దన్న మీద పడ్డ కుటుంబ భారం - పల్లకీ మోత కన్నా కుదుపు తక్కువైన బ్రాహ్మణ వ్యవసాయం. 

ఈలోగా మనువాడమని  వచ్చిన మేనబావ -
చదువాపద్దు - పిల్ల బాగా చదువుతోందని - ఇంటికి వచ్చి మరీ చెప్పారట మాష్టార్లు -
మేనబావ వింటేగా - పిల్లపేరు మల్లెమొగ్గ - నా పేర్ జమిందార్ - పిల్లనిస్తారా - పెళ్లి చేస్తారా - అని ఒకటే మాట-ఒకటే పాట.

పెళ్లయ్యింది - అంటే - ఏంటో తెలిసీ తెలియని - పదిహేనేళ్లు - వచ్చీరాని వయసులో.
అప్పుడే అనేసుకుందేమో - తాను పూర్తి చేయలేని చదువు - తనకిష్టమయిన చదువు అందిపుచ్చుకునే పాపాయిలు కావాలని.

అమ్మాయిలకమ్మ

అమ్మాయి అమ్మ అయ్యింది - వరసగా  - ముగ్గురమ్మాయిలకి.
ఎవరైనా - ముగ్గురూ అమ్మాయిలేనా అనబోతే - దుర్గా, లక్ష్మీ, సరస్వతులు పుట్టారమ్మా మా ఇంటా - అంటూ (మేన)అత్తగారి సమర్ధింపు కోడలికి.

ఆ ముగ్గురమ్మాయిల్లో పెద్ద పిల్ల - పెంకి, మొండి - పాటలే తప్ప మాట్లాడదు - రాగం అంటారని అదేదో పాటనుకుందో ఏమో - ఆ అంటే ఆరున్నొక్కరాగం , ఊ అంటేనూ  అదే రాగం. 
ఎవర్నీ ఆక్షేపించని నాన్నమ్మే ఇచ్చేశారు బిరుదు - చండిక - అని.

తన తర్వాత - ఒకరు తర్వాత ఒకరుగా - పుట్టిన ఇద్దరు చెల్లెళ్లు - చిట్టి చెల్లి, కుట్టి చెల్లి  - పుట్టినవేళ ఆసుపత్రిలో అమ్మ దగ్గరే వుంటానని గొడవ చేసేది అమ్మాయీ-చండిక.
కళ్లు తెరవని పసిపాపకి ఏమీ తెలియదు - కళ్లు నలుపుకుని మరీ ఏడ్చే ఈ ఎడపాపని మాత్రం ఏడిపించకూడదు అని అమ్మ చండికనే తన పక్కలో పడుకోబెట్టుకునేది.

చండికకి  బడికివెళ్లే వయసొచ్చినా అమ్మే లోకం.

అలా అని ఎంతకాలం బడికి వెళ్లకుండా ఉండడం?
అమ్మ బళ్లో వేసేసింది పిల్లని.

బడికి వెళ్లనని రోజూ ఏడుపు
రోజుకిద్దరు - చెరో రెక్కా పట్టి - రోడ్డు మీద ఊయలూగిస్తూ - బడికి మోసేసేవారు.

బడి ముందునించే అమ్మ వెళ్లాలి - వూరు చివర శివాలయం చెరువు దగ్గరున్న మంచినీళ్ల బావికి.
అమ్మాయి అడిగింది -మల్లయ్య మాష్టార్ని - వెక్కుతూ - "అమ్మ నీళ్లకి వెళ్లే వేళ నేను ఆ రోడ్డు పక్కగా వున్న కిటికీ ఎక్కి కూర్చోనా - అలా అయినా మా అమ్మని కాసేపయినా చూడొచ్చుకదా" - అని.

"అమ్మో - ఈ లల్లమ్మో - ఏం పిల్లమ్మో - పాపం పోన్లేమ్మో" - అనుకున్నారో  ఏమో - మల్లయ్య పంతులుగారు - ఓ చీపురు పుల్లిచ్చి కిటికీ ఎక్కించేవారు - అమ్మ ఆ దారిన వచ్చేవేళ.

ఇంక అప్పట్నుంచీ - అమ్మ ఆ దారిన వచ్చి కనబడే దాకా "అమ్మా చూడాలీ - నిన్నూ నాన్నని చూడాలీ" అంటూ కాసేపు, "చూడాలని వుంది అమ్మా - చూడాలని వుంది - పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి" అంటూ ఇంకాసేపు బడి మొత్తాన్ని తాత్కాలిక దుఃఖసాగరంలో ఓలలాడించేది.

పాటలంటే ఇష్టమని అమ్మాయికి అమ్మ దేశభక్తి గీతాలు నేర్పేది - జయ జయ భారత జాతీయానందోత్సవ శుభసమయం - ప్రియతమ భారత జనయిత్రీ చిరదాస్య విమోచన నవోదయం - అంటూ.

ప్రతి ఆగస్టు పదిహేనుకి తెల్ల పరికిణీ, జాకెట్టు - ఆప్కో జరీ అంచువేసి కుట్టించేది. బడి మొత్తంలో అమ్మ కుట్టించిన తెల్ల బట్టల్లో మెరిసిపోయే అమ్మాయిని - ఆ పిల్లని గారం చేయొద్దండీ అని చెప్పినా వినకుండా - రామశేషు మాష్టారు స్వాతంత్ర్య దినోత్సవ ఊరేగింపులో ఎత్తుకుని తిప్పేవారు.

ఇంక బడికి సెలవులిస్తే  - అమ్మాయికి అమ్మతోనే ఆటలు - అవీ తానే కనిపెట్టినవి .

ఆ ఆటలెలాంటివంటే ...

గాజుముక్కలాట
- బడికి వెళ్లే దారిలో, ఆడుకునే వీధిలో - ఎక్కడ పగిలిన చేతిగాజు ముక్క దొరికితే అక్కణ్ణుంచి అది తెచ్చి ఖాళీ బోర్నవిటా డబ్బాలో దాచేది - అమ్మాయి.

బడి లేని మధ్యాహ్నాలలో అమ్మ వంట అయిపోయి పిల్లలకి ఆమ్ పెట్టేసి "హమ్మయ్య" అనుకునేవేళ గాజుముక్కల (డ)బ్భాండం చేతబట్టి చిన్ -మోహినీ అవతారమై అమ్మాయి ప్రత్యక్షం

ఇంక అమ్మకి అలసట తీరే మార్గమేది ? అయినా సరే విసుక్కోకుండా - ఓపిగ్గా కూర్చుని - గాజుముక్కల గుట్టలోంచి అమ్మాయికి కనపడకుండా చేతికి చేయడ్డుపెట్టుకుని - ఓ గాజుముక్క తీసి - అదే రంగో అమ్మాయిని కనుక్కోమనేది. ఒకవేళ అమ్మాయి అదే రంగు గాజుముక్క చూపిస్తే అమ్మాయికి ఆ రెండు ముక్కలు, లేకపోతే అమ్మకి రెండు గాజుముక్కలు. ఇలా ఆ గుట్టలోంచి బోల్డన్ని గాజుముక్కలు ఎవరికొస్తే వాళ్లు గెలిచినట్టన్నమాట.

బొమ్మొస్తుందా - రాదా ?
బడి పుస్తకం ఒకటి  తెచ్చి అమ్మ - అమ్మాయి పక్క-పక్కన కూర్చుని ఒకరు "బొమ్మొస్తుందా-రాదా?" అనడిగితే రెండోవారు వస్తుందనో-రాదనో చెప్పాక కాయితం తిప్పితే బొమ్ముంటే వస్తుందని చెప్పినవారు గెలిచినట్లు, లేకపోతే అడిగినవారికి పాయింటు.

ఇలాంటి వింత-వింత ఆటలు ఆడుతూనే అమ్మ ఎన్నో కబుర్లు చెప్పేది అమ్మాయికి - అన్నిట్లోనూ చదువు ముఖ్యాంశం - విద్యా దదాతి వినయం - స్పర్థయా వర్ధతే విద్యా -  విద్వాన్ సర్వత్ర పూజ్యతే - చదువుకునే టైంలో చదువుకోవాలి -  గడిచిపోయిన కాలం వెనక్కి రాదు.

అమ్మాయికో అలవాటు  - రెండు నెల్లకో క్లాసు పుస్తకం - తెలుగు వాచకమో - సైన్స్ టెక్స్టో  పడేసుకోవడం - అమ్మకొచ్చి పుస్తకం పోయిందని చెప్పడం.

అమ్మ అస్సలేమీ అనకుండా - "అయ్యో! అవునా! ఆంజనేయులు కొట్టుకెళ్లి కొత్తది తెచ్చుకో" అనడం.
అమ్మాయి వెళ్లి ఆంజనేయులు కొట్లో పుస్తకం కొనుక్కుని - దాంతో పాటు శనగపప్పు-బెల్లం ప్రసాదం చేతిలో పడితేనే కదిలి ఇంటికి వచ్చేది.

ఆంజనేయులు పెట్టడం మర్చిపోతే ఇంకేమైనా వుందీ - కొట్టు కట్టేదాకా అక్కడే నిలబడివుండేది అమ్మాయి - అందుకే పుస్తకంతో పాటే ప్రసాదం ప్రసాదించేవాడు.

అసలు రహస్యమేమిటంటే అమ్మాయికి ఫెళఫెళలాడే కొత్త పుస్తకాల ఘుమఘుమలాడే వాసన ఇష్టం - అందుకని ఏడాదికి రెండో మూడో తెలుగు వాచకాలు కొనుక్కునేది. అమ్మకి అసలు సంగతి తెల్సినా - అమ్మాయి ముచ్చటపడుతోందని మురిసేది - ముద్దుకైనా విసుక్కునేది కాదు.

ఈలోగా అమ్మాయి ఐదో తరగతికి వచ్చింది - అమ్మాయికన్నా ముందు అమ్మ హడావిడి పడి ఆధునిక మూల్యాంకన దర్శిని తెప్పించింది - విజయవాడలో వున్న అక్క-బావగార్లకి చెప్పి.  సోవియెట్ భూమి - చింపి - వేసిన అట్టతో వచ్చిన ఆ పుస్తకం అమ్మాయికి సర్వకాల-హస్త-భూషణం.

అమ్మ అమ్మాయికి పుస్తకాల మీద ప్రేమ పెరిగేలా - చందమామలు, బొమ్మరిల్లులు, అమర్ చిత్ర కథలు - ఇలా ఎన్నో పుస్తకాలు కొనేది. తాను చదివే యద్దనపూడి, మాదిరెడ్డి, కోడూరి(ఆరెకపూడి) నవలలు, విశ్వనాథ వారి వేయిపడగలు, రంగనాయకమ్మ విషవృక్షం - ఇదీ అదీ అని లేదు - అర్థం అవుతుందా లేదా అని లేదు - కాయితమైతే అక్షరముంటే - తెలుగైనా, ఇంగ్లీషయినా - ఆఖరికి అప్పటికి ఇంకా  అంతగా అర్థం కాని హిందీ అయినా - అమ్మాయి చదువుతానంటే చాలు పుస్తకం కొనిచ్చేసేది అమ్మ.

పెరుగుతున్న అమ్మాయితో పాటు చెప్పీ చెప్పకుండా అమ్మ చెప్పే పాఠాలు కూడా పెరుగుతున్నాయి - అసలంటూ అందం ఉండాలి కానీ తెచ్చిపెట్టుకోకూడదు - చెప్పి పెట్టిన బుద్ధి, దెప్పి పెట్టిన మెతుకు ఒంటబట్టవు - ఒక వేలు అవతలివారికేసి చూపిస్తే మూడువేళ్లు మనకేసే చూపిస్తాయి  - Face is the index of the mind - A sound mind in the sound body - తిండి కలిగితేనే కండ కలదోయ్ - నక్క ఒకచోట ఊళలు పెట్టి ఇంకోచోట సంగీతం పాడదు - పెద్దవాళ్లు చెప్పినట్టు చెయ్యాలి, చేసినట్టు కాదు - ఇలా ఎన్నెన్నో చిన్నా పెద్దా పాఠాలు - ఇవే కాక సందర్భానికి తగినట్లు సుమతీ, కుమారీ - శతక పద్యాలు.

చిన్న తరగతులలో అమ్మాయికి అర్థం కాని లెక్కలు అమ్మే చెప్పాలి - మరి నాన్నైతే ఒక్కసారి చెప్పగానే అర్థం కాకపొతే - ఆయ్ హన్నా ! - అంటారు కదా - అందుకని.

అమ్మాయికి  పరీక్షలొస్తే ఇంటిల్లిపాదికీ పరీక్షా-కాలమే - పరీక్ష బా రాస్తే పర్వాలేదు - రాయకపోతే ఇంకంతే - ఇల్లంతా (అ)శోకవనమే. దానికితోడు పరీక్షల ముందు అసలు ఖానా మానేసి "నఖా"ని అయిపోయేది అమ్మాయి. అమ్మ అప్పుడు పక్కన కూర్చుని "హనుమంతుడిలాగా నీ బలం నీకు తెలియదు - నువ్వు బాగా రాయగలవు" అని చెప్తే అప్పుడు "హమ్మయ్య" అని కనులారా నిదరోయేది.

ఇంక పరీక్ష రాసి ఇంటికి రాగానే - పరీక్ష పేపరు అమ్మ చేతికిచ్చి ప్రతీ ప్రశ్నకీ సమాధానం పరీక్షలో ఎలా రాసిందో అమ్మకి అప్పచెప్పాల్సిందే - ఒకటో తరగతి నుంచీ డిగ్రీ ఫిజిక్స్ థీరీల  దాకా ఇదే తీరు - అమ్మకి ఎంత అర్థమవుతుందీ అనేకన్నా అమ్మకి చెప్పాలి అన్నదే ముఖ్యం.

అమ్మాయి ఏడో తరగతిలోకి రాగానే - (అప్పటినుంచి వరసగా దాదాపు పదేళ్లపాటు) అమ్మ ఇచ్చిన అందమైన బహుమతి - ప్రతీ నెల ఒక Competition Success Review (CSR), ఒక Reader's Digest (RD).  ఉన్న ఊరిలో ఆ రెండు పుస్తకాలు చదివేది ఆ వయసులో అమ్మాయి ఒక్కతే. CSR నిండా పజిళ్ల లాంటి mental aptitude టెస్టులు, RD నిండా అప్పటివరకూ పరిచయం లేని భూమికి అవతలివైపు వున్న ప్రపంచం.

ముగ్గురక్క చెల్లెళ్లలో పెద్దదైనా ముగ్గురిలో చిన్నగా కనిపించే అమ్మాయిని ఎవరైనా హేళన చేయబోతే - మా పిల్ల ఇంకో గుప్పెడుంటే బ్యూటీ కాంటెస్ట్ కివెళ్లగలిగేది - అని అమ్మాయి మనసుకి వెలితి అనిపించకుండా వెనకేసుకొచ్చేది అమ్మ.

ముగ్గురాడపిల్లలని - పెళ్లై ఎవరిళ్లకి వాళ్లెళ్లిపోతే అక్కడెలాగూ చేసుకోవాలి - నేనెలా పెళ్లయ్యాకే వంట నేర్చుకున్నానో మీరూ అలాగే నేర్చుకుందురు గాని - అని వంటింటి ఛాయలకి రాకుండా అబ్బురంగా అమ్మాయిలకి నచ్చింది వండి పెట్టి పెంచింది.

ముగ్గురమ్మాయిల తల్లి - అబ్బాయిల ముచ్చటెలా తీర్చుకుందంటే - చదువంటే ఇష్టమున్న తమ్ముడి, చెల్లెలి పిల్లల చదువులకి ఒంటిమీద బంగారాన్ని వారి చేతిలో పుస్తకాలుగా మార్చి మురిసిపోయేంతగా. ఆ మురిపెం చూసే  పక్కింటి సరస్వతాంటీ అమ్మని - జగన్మాతా - అని పిలిచేవారు.

పొద్దున్న లేచిన అమ్మకి -  రాత్రి ఏ పదింటికో పక్క చేరబోయేవేళ - అనుకునో, అనుకోకుండానో తలుపు తట్టి వచ్చిన చుట్టాలకి - అప్పటికప్పుడు ఎర్రగా వేయించిన బంగాళాదుంపలు, వేడి వేడి చారు - పెట్టి వచ్చినవారి కడుపు నింపందే నిద్ర పట్టేది కాదేమో - అప్పటికే నిద్రపోయి వంటింట హడావిడికి నిద్ర లేచిన అమ్మాయిలకి కనిపించేది - చేతి గరిటతో అన్నపూర్ణ - అలుపెరుగనిది అమ్మ.

అమ్మకి ధైర్యమూ ఎక్కువే - నాన్నYezdi చీకటిలో కనపడని గుంటలో పడిపోయి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో చేరారని ఎవరో వచ్చి చెప్తే - జాగ్రత్తగా వుండండని అమ్మాయిలకి చెప్పి - చెప్పులేసుకుని ఏ కంగారూ కనిపించనీయకుండా ఆ రాత్రిలో నాన్న దగ్గరికెళ్లింది - అది తలచుకున్న అమ్మాయికి ఇప్పటికీ ఆశ్చర్యమే - అసలంత చడీ-చప్పుడు లేకుండా అమ్మ అలా ఎలా వెళ్లగలిగిందీ - అని.

అమ్మాయి పెద్దయ్యింది - అప్పటిదాకా ఆడింది ఆట - పాడింది పాట - చదువుకి దూరం వెళ్లాల్సొచ్చింది - మొదటిసారి అమ్మని, ఇంటిని వదిలి. చదువుతో పాటు మనువుకనువైన మనసునీ అందుకుంది. అమ్మకీ, నాన్నకీ ఒక్క నిముషం ఇది నిజం కాదేమో అనిపించింది. ముందుగా అమ్మకే అర్థం అయ్యింది - అమ్మాయి పట్టు పట్టింది ఇక విడవదని. నాన్నకి నచ్చచెప్పింది - అమ్మాయి పెళ్లి ముచ్చట తీర్చింది.

అమ్మాయి పెళ్లయ్యాక - అమ్మంటే ఎంత ఇష్టం వున్నా - మరి అత్తవారింటికి వెళ్లాలి కదా! అలా వెళ్లినప్పుడు మరి కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త మాటలు - అంతా కొత్తగా వుంటుంది కదా ! అలాంటి కొత్త కొత్త గా అనిపించే తొలినాళ్లలో సరదాగా అన్న మాటొకదానికి  అమ్మాయి నొచ్చుకుంది - నొచ్చుకుని అమ్మకి చెప్పుకుంది.

అమ్మాయి చెప్పింది అమ్మ వింది - విని అంది - "ఒక అమ్మ కడుపున పుట్టిన మీ ముగ్గురే ఒకలా లేరు - అలాంటిది మీ అత్తవారింట్లో మనింట్లో ఉన్నట్లు ఎలా ఉంటుంది?  ఆడపడుచు అంటే ఆదుకునే నేస్తం లాంటిది - మరిది అంటే లక్ష్మణస్వామి  - ఆ ఇంటి కబురు మంచిదైతే పంచుకో - కానిదైతే తెలివిగా మంచిగా మలుచుకో - చదువుకున్నావు - వృధా పోనీయకు - ఆలోచించు - ఒదిగి ఉండడం ఓడిపోవడం కాదు - అదే గెలిపిస్తుంది నిన్ను".

అమ్మ చెప్పిన మాట చద్దిమూట అయింది అమ్మాయికి - తిరుగులేని ప్రేమాస్త్రమయ్యింది.
 
అమ్మలగన్నఅమ్మమ్మ

ముగ్గురమ్మాయిలకి పెళ్లిళ్లు అయ్యాయి - అమ్మలయ్యారు - అమ్మని అమ్మమ్మని చేశారు.
ఎదిగిన మనవళ్ల-అమ్మమ్మ అయిన అమ్మకిప్పుడు ఆటవిడుపు.

అమ్మాయి >>>  అమ్మాయిలకమ్మ >>>  అమ్మలగన్నఅమ్మమ్మ ~ వెరసి మా అమ్మ - పేరిందేవి.

అమ్మాయి చదువుకోసం, ముగ్గురాడపిల్లల పెళ్లిళ్ల కోసం, తను చదివించాలనుకున్న- తన పుట్టింటి పేరు నిలుపుతారనుకున్న తన మేనల్లుళ్ల కోసం, తను సహాయం చేయాలనుకుంటున్న ఎవరికోసమైనా - నాన్నకి కష్టమవుతుందని తెలిసినా - ఒప్పించడానికి అమ్మ చేసే ప్రయత్నాలు చూసినప్పుడల్లా అమ్మాయి అనుకునేది - అనుకుని నవ్వుతూ నాన్నతో అనేది - "నాన్నా! మా అమ్మ అన్నపూర్ణ, జగన్మాతే కాదు - సర్వమంగళ కూడా" - అని.

మ్రింగెడి వాఁడు విభుండని
మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంళసూత్రంబు నెంత మది నమ్మినదో?



27 కామెంట్‌లు:

  1. బాగుంది. "అమ్మకు ప్రేమతో" అనవచ్చు. పిల్లలకి మొదటి గురువు అమ్మే కదండీ.
    <"పల్లకీ మోత కన్నా కుదుపు తక్కువైన బ్రాహ్మణ వ్యవసాయం." ప్చ్, సామెత అర్ధం కాలేదు (నామటుకు). అఫ్ కోర్స్ బ్రాహ్మణ వ్యవసాయం, బ్రాహ్మణ వ్యాపారం లోకవిదితమే గానీండి, ఈ సామెత .. దాంట్లో పల్లకీ పాత్ర, కుదుపు రెలవెన్స్ ... ప్చ్ ప్చ్ 😕.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావు గారు - ధన్యవాదాలు!
      పూర్వం పల్లకి ఎక్కుతావా, బ్రాహ్మణ వ్యవసాయం (కౌలుకి) చేస్తావా అనడిగితే పల్లకిలో కూర్చున్నా కొంచెమయినా కుదుపు వుంటుంది - బ్రాహ్మణ వ్యవసాయం అంతకన్నా సాఫీగా జరుగుతుంది అనేవారట. అలాంటి వ్యవసాయం మా మామయ్య పొలం కౌలుకి చేసేవారిది అని మా అమ్మగారు అంటూ వుంటారు - దాన్ని నా పోస్ట్ లో వాడుకున్నాను.

      తొలగించండి
  2. ఒదిగి ఉండడం ఓడిపోవడం కాదు - ఆ ఒక్క ముక్క అర్ధం అవుతే చాలండీ. ప్రపంచం బాగుపడుతుంది

    రిప్లయితొలగించండి
  3. 'అమ్మ కథ' యెంత కమ్మన !
    అమ్మకు గల 'యోర్పు' జూచి యమ్మోరైనన్
    'అమ్మో' యని యదిరి పడును ,
    అమ్మాయి 'యచ్చు' తవరని యనుకొన వచ్చా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట రాజారావు . లక్కాకుల గారు: మీ పద్య వ్యాఖ్యకి బోల్డన్ని ధన్యవాదాలు. ఆ అమ్మాయిని అచ్చు నేనే!

      తొలగించండి
  4. Ma Amma na pellaina kothalo chepina matalu malli gurtukochayi.
    Amma gurnchi enta baaga chepavo 👌👍 chaala bagundi ..
    Niku best writer award ivachu Akka ah padajalam kuda enta baguntondo vinadaniki chadavadaniki..bujji jinkalu ilanti words muddu mudduga bale unnayi..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమా: నా కబుర్లు నీకు నచ్చుతున్నందుకు - అది నాకు వచ్చి చెప్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. థాంక్ యూ!

      తొలగించండి
  5. Chala chala bagundi amma nu gurinchi ni varnana.adhbhutamaina marchipoleni matalakandani Madhura Bhavana.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లలిత పిన్ని: అమ్మే ఓ మధుర భావన - కదా! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  6. లలితా! ఆంటీ గురించి ఎంత బాగా రాశావో! మీ అమ్మ గారు చెప్పీ చెప్పకుండా చెప్పిన పాఠాలు, అత్తగారింటి గురించిన మాటలు ఎంత విలువైనవో కదా!
    నాకెంతో ఇష్టమైన మీ అమ్మగారు తరచూ చెప్పే ఇంకో సామెత," ఊరుకున్నంత ఉత్తమం, బోడిగుండంత సుఖం లేదు". This is my mantra in life :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మి: నీకిష్టమయిన ఆ సామెత గుర్తుపెట్టుకునే patent నీకే ఇక ;)

      తొలగించండి
  7. లలిత గారూ,
    ఇలా ఎలా వ్రాయగలరు మీరు?
    నాకైతే చదువుతున్నట్లే అనిపించలేదు.
    ఏదో మంచి అందమైన పాట వింటూ ఆ మాధుర్యంలో కొట్టుకుపోతున్నట్లే అనిపించింది!
    అందమైన తెలుగుకన్న నమృత మేది?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం గారు! నా పోస్ట్ గురించి మీ మాటలు పూర్వకాలపు అక్షర లక్షలతో సమానం. బోల్డన్ని ధన్యవాదాలు మీకు!

      తొలగించండి
  8. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके ।
    शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते ॥
    Sarva-Manggala-Maanggalye Shive Sarvaartha-Saadhike |
    Sharannye Trya[i-A]mbake Gauri Naaraayanni Namo[ah-A]stu Te ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మకిష్టమయిన శ్లోకం అది - గుర్తు చేసినందుకు చాలా థాంక్స్ రవి!

      తొలగించండి
  9. మీ అమ్మ గారి గురించి అద్భుతంగా వర్ణించారు లలిత గారు. ప్రత్యేకించి మీ అమ్మ గారు చెప్పిన మంచి మాటలు బాగున్నాయండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పవన్ గారు: మా అమ్మని గురించిన నా కబుర్లు, మా అమ్మ మాటలు మీకు నచ్చినందుకు సంతోషం - థాంక్ యూ !

      తొలగించండి
  10. అత్తవారింట్లో మనింట్లో ఉన్నట్లు ఎలా ఉంటుంది? ఆడపడుచు అంటే ఆదుకునే నేస్తం లాంటిది - మరిది అంటే లక్ష్మణస్వామి - ఆ ఇంటి కబురు మంచిదైతే పంచుకో - కానిదైతే తెలివిగా మంచిగా మలుచుకో - చదువుకున్నావు - వృధా పోనీయకు - ఆలోచించు - ఒదిగి ఉండడం ఓడిపోవడం కాదు - అదే గెలిపిస్తుంది నిన్ను..........
    అమ్మ కి వందనాలు అక్కా!!!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమాన్: నీ వందనాలు అమ్మకి అందజేస్తాను. Thanks a lot for your comment!

      తొలగించండి
  11. మీ అమ్మగారిలో మా అమ్మ కనిపించారు. అమ్మగురించి ఎవరైనా ఇలా వ్రాస్తే, చెప్తే వొళ్ళు పులకరించిపోతుంది. పోస్టులో ప్రతి వాక్యం అద్భుతం. తరచూ చదువుకొని మురిసిపోవలసిన పోస్టు.

    రిప్లయితొలగించండి
  12. లలిత మీ అమ్మ గారి గురించిబాగా రాశావు. నువ్వు చెప్పంది చాలా కరక్టు. మాట చాలా మంచిగా ఎవరికి బాధ కలగకుండా మాట్లాడుతారు.

    రిప్లయితొలగించండి
  13. You have shown me Sripada and Kodavatiganti in your ONE post! Thank you!! Keep writing many many many many more...

    sri

    రిప్లయితొలగించండి