19, జనవరి 2017, గురువారం

త్వామనురజామి - 9 - అసలేం జరిగిందంటే...(మా నాన్న చెప్పిన కబుర్లు)

కిందటి 19 చెప్పిన కబుర్లు

నా రాని MCA సీటు గురించి మర్చిపోవడానికి  ప్రయత్నిస్తూ - ఆంధ్రా యూనివర్సిటీ MCA కి చదువుకోవడం మొదలు పెట్టాను - దాంతో పాటే నాన్న తెచ్చిన BSRB application కూడా పూర్తిచేసి ఆ పుస్తకాలూ చదవడం మొదలుపెట్టాను. 

నన్నోదార్చడానికన్నట్టు - పాపం - మా అమ్మ "పోన్లే లల్లీ - తిరుపతిలో రావకపోవడమే మంచిదయింది - ఎంచక్కా ఏ బ్యాంక్లోనో ఉద్యోగం అయితే ఇస్త్రీ చీర నలక్కుండా ఇంటికి రావొచ్చు - నీలాంటి వాళ్లకి అదే సుఖం" అంటూ BSRB టెస్ట్ మీద నాకు ఆసక్తి కలిగించడానికి కబుర్లు చెప్పేది. నాకేమో అస్సలు BSRB అంటేనే ఇష్టం లేదు. 

ఒకరోజు మధ్యాహ్నం ఇలాగే ఏవో BSRB మాటలు వస్తే నాన్న గుర్తు చేశారు - వచ్చే వారమే రెండు టెస్టులు - AU - MCA ఎంట్రెన్స్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో - BSRB ఇంకో చోట -  విజయవాడ వెళ్లి రాయాలి - నువ్వూ నేను Yezdi  మీద వెళ్లివచ్చేద్దాం - అని. 

నాన్న అలా అనగానే  అడిగాను -"మరి BSRB రాయాలంటే నా అప్లికేషన్ పెట్టే ముందే చెప్పాను - నాకొక బొమ్మ కొనియ్యాలని - కొంటారా?" - అని. 

పక్కనే నేలమీద తరగడ వేసుకుని టీవీ చూస్తున్న కుట్టి చటుక్కున పైకి లేచి - "ఇంకెన్ని బొమ్మలే బాబూ?
నువ్వూ, అపర్ణా కలిసి ప్రతి పుట్టినరోజుకి, న్యూ ఇయర్స్ డేకి , ఆగస్టు 8న మీ ఫ్రెండ్షిప్ డేకి ఒకళ్లకొకళ్లు నాకిది కావాలంటే నాకిది కావాలి అని ముందే చెప్పేసుకుని ఇచ్చిపుచ్చుకున్న బొమ్మలు, రవి మెడ్రాస్ వెళ్లినప్పుడు తెచ్చిచ్చిన ఆ ఎర్ర మాక్సీ బొమ్మ,  అవి కాక ప్రశాంతి ఇచ్చిన ఆ స్విట్జర్లాండ్ బొమ్మ - ఇన్ని బొమ్మలుండగా ఇంకో బొమ్మా? నువ్వేమో కొనడం -  నాన్నేమో ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలున్నవాళ్లు వస్తున్నారని తెలియగానే 'లల్లి బొమ్మలు బీరువాలో దాచండి' అని నా చేత నీ బొమ్మలన్నీ ఆ బెడ్ రూమ్ బీరువాలో పెట్టించడం - మళ్లీ ఇప్పుడింకో బొమ్మ అంటే - కొనే ఆయనా - కొనిపించుకునే నువ్వూ బానే వుంటారు - మధ్యలో సర్దలేక నా చేతులు పడిపోతున్నాయి" అని ఆపకుండా ఓ పది నిముషాలు తిట్టింది. 

"నా బొమ్మల సంగతి నీకెందుకు?" అని దాన్ని విసుక్కుని "చెప్పండి నాన్నా - టెస్ట్ అయిపోగానే కొంటారా?" అని నాన్న నడిగాను. 

మా ఇద్దరి గొడవా చూసి అసలే భుక్తాయాసంతో ఉన్నారేమో "కొంటాలే - ముందా టెస్ట్ సంగతి చూడు" అని పక్కకి తిరిగి పడుకున్నారు. 

మొత్తానికి టెస్ట్ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు గుంటూరు బస్సు-స్టాండ్ దగ్గర ఆగి అక్కడ ఒక తోపుడు బండిమీద నేనడిగిన రెండు బొమ్మలేవో కొనిపెట్టారు నాన్న. 

రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాను - ఇంతలో ఒకరోజు అపర్ణ వచ్చి చెప్పింది తనకి మైసూరు SJCE లో MCA సీట్ వచ్చిందని - తనకి వచ్చిందని ఎంత సంతోషంగా అనిపించిందో ఒకచోట ఇద్దరం చదివే అవకాశం ఇంక లేదు అని తలుచుకుని అంతకు రెట్టింపు బాధేసింది. 

వేసవి రోజులు - అపర్ణ కూడా వెళ్ళిపోయింది. ఏమీ తోచట్లేదు - తరవాత ఏంటి అని తలుచుకుంటే మొదటిసారి బెంగగా అనిపించింది.

గుంటూరు NCC కాంటీన్ లో పనిచేసే - రామారావుగారు (ఈయన శివకోడులో చంద్రావతి గారి అల్లుడు - అమ్మ ఫ్రెండ్ ఆండాళ్ ఆంటీ భర్త) నెలకొకసారైనా ఇంటికి వచ్చేవారు - మమ్మల్ని పలకరించడానికి. 

ఆ రోజూ అలాగే వచ్చారు - ఎప్పట్లాగే సరదాగా కబుర్లు చెప్తూ -"ఏంటీ - పెద్ద పాప కొంచెం డల్లుగా వుంది అంత  హుషారు లేదు" అనడగ్గానే మళ్లీ మొదట్నుంచీ నా తిరుపతి-శోక గాథ రీప్లే అయింది. 

ఆయన అదేమీ అంత పట్టించుకోదగ్గ విషయం కాదన్నట్టు  "కామేశ్వరరావు గారూ - మొన్న ఎవరో నన్నడిగారండీ ఈ ప్రశ్న - మీకు సమాధానం తెలుసేమో చెప్పండి" అంటూ " వాట్ ఈజ్ హు - హు ఈజ్ వాట్ - అదీ ప్రశ్న" అన్నారు.

అది వినగానే - నేను వెంటనే " అంకుల్ - వాట్ ఈజ్ హు కి ఆన్సర్ World Health Organization (WHO),
హు ఈజ్ వాట్ అంటే James Watt అంటే స్టీమ్ ఇంజిన్ ఇన్వెంట్ చేసినాయన" అనగానే రామారావు అంకుల్ చప్పట్లు కొట్టి " అదీ - నాకు తెలుసు - నువ్వు చెప్పేస్తావని - ఇన్ని విషయాలు తెలిసుండి ఇలా బెంగ పెట్టుకుంటారా ఎవరైనా? మా సంతోష్ ఆల్ఫ్రెడ్ గారికి నీగురుంచి చెప్పాను - నీ దగ్గరికి వాళ్ల పాపల్ని లెక్కలు నేర్చుకోవడానికి పంపిస్తామన్నారు - నీకూ కొంచెం టైం పాస్ అవుతుంది - సరేనా?! " అన్నారు. 

సరే -నాకసలే కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్ చేసుకోవడం ఇష్టం - ఇదేదో బావుంది అనుకుని రోజూ ఓ గంట సంగీత, అనహితలకి మాథ్స్ చెప్తూ - వాళ్లతో నా దగ్గరున్న Enid Blyton పుస్తకాలు షేర్ చేసుకుంటూ - పప్పి, కుట్టీలతో సినిమాలు చూసుకుంటూ - రోజులు దొర్లేలా చూసుకుంటున్నాను. 

ఇలా ఉండగా ఒకరోజు పొద్దున్నే కుట్టి బ్రష్ చేసుకుంటూ ఉంటే మధ్యాంటీ "ఏమ్మాయ్ కుట్టీ! నీ రిజల్ట్స్ వచ్చాయా?" అనడిగారు. 

 అది నోట్లోంచి బ్రష్ తీయకుండానే "ఏమో" అన్నట్టు చెయ్యూపింది. 

వెంటనే ఆంటీ "అదేంటమ్మాయ్ - నీ రిజల్ట్స్ సంగతి నీకే తెలీపోతే ఎట్టా?" అనింకేదో అనబోతూ ఉంటే - కుట్టి బ్రష్ నోట్లోంచి తీసి "నా సంగతి మా అమ్మ-నాన్న చూసుకుంటారు గానీ మీరు మీ సుపుత్రుడి సంగతి చూసుకోండి ముందు" అనేసింది. 

మా వంటింటి తలుపు దగ్గర నుంచుని మా అమ్మ - నోటి మీద చెయ్యి పెట్టుకుని కుట్టికి "ఊరుకో ఊరుకో " అని సైగ చేస్తోంది  - ఆంటీ ఏమనుకుంటారో అని ఆవిడ బెంగ. 

కుట్టికి అవేం లెక్క లేవు - అనేసి లోపలికి వచ్చేసింది. 

ఆంటీ కూడా కుట్టి సంగతి తెల్సు కదా - "నువ్వూ, మా లక్ష్మణూ - మీ ఇద్దరి లా పాయింట్లకి హై కోర్టుకెళ్లినా అప్పీలుండదు" అని నవ్వేసుకుని వాళ్ళింట్లోకి వెళ్లిపోయారు. 

ఒక గంట తర్వాత ఆంటీ వాళ్ళింట్లోంచి - మధ్యాంటీ -లాయరంకుల్  మధ్య సంభాషణ:

"కోర్ట్ కి టైం అవుతోంది - తొందరగా టిఫిన్ పెట్టు"
"ఒక్క ఐదు నిముషాలు ఆగరాదూ - పూజ్జేస్తున్నాను"
"ఎంత సేపా పూజ - అంతసేపు దేవుణ్ణి మనింట్లోనే కట్టేస్తే ఎలా - కొంచెం పక్కింటికి కూడా వెళ్లనీయ్"
"పక్కిల్లు అంటే గుర్తొచ్చింది - ఆ లల్లి సీట్ సంగతేంటో కనుక్కోరాదూ - కామేశ్వర్రావుగారినడిగి ? బా చదివే పిల్ల - ఎందుకా సీట్ రాలేదో ఏంటో?"
"ఇప్పుడే పక్కింటమ్మాయ్ చెప్పిందా లేదా నీకు - నీ కొడుకు సంగతి చూసుకోమని? తొందరగా కానియ్ - నే వెళ్లాలి"

వినొద్దనుకున్నా వినిపించే ఆ మాటలు విని నవ్వుకున్నాము మేమంతా.  

తర్వాత నాన్న లాయరంకుల్ దగ్గరికి వెళ్లి మాట్లాడారు అని తెల్సింది కానీ నేనంత పట్టించుకోలేదు - ఆల్రెడీ అన్ని సీట్లూ ఫిల్ అయిపోయి ఉంటాయి - పెద్ద ఉపయోగం వుండదు అని.

జులై నెలాఖరుకి తిరుపతి పద్మావతి యూనివర్సిటీ నుంచి టెలిగ్రామ్ వచ్చింది - వెంటనే వచ్చి MCA లో చేరమని. 

ఆ టెలిగ్రామ్ చూడగానే మా ఇంట్లో వాళ్తో సమానంగా మధ్యాంటీ సంతోషించారు - అదేదో వాళ్ళింట్లో పిల్లకే సీటొచ్చినట్లు. 

వెంటనే ఒక వెండి పెన్ను కొని నాకు గిఫ్టుగా ఇచ్చారు. 



మొత్తానికి నాకు రాదు అనుకున్న సీట్ మళ్లీ నన్నేవెతుక్కుంటూ వచ్చింది - నా పరీక్షాకాలం పూర్తయింది. 

------------------------------------------------------------------------------------------------------------
అసలేం జరిగిందంటే... (మా నాన్న చెప్పిన కబుర్లు):

 అవీ - నాకు గుర్తుండి నేను రాద్దామనుకున్న కబుర్లు. 

కానీ కిందటి నెల పోస్ట్ కింద విన్నకోట నరసింహారావు గారు పెట్టిన ఒక వ్యాఖ్య (తర్వాత ఎందుకో ఆ వ్యాఖ్య తీసివేయబడింది) చదివి మా నాన్న నాకు ఫోన్ చేశారు. 

"ట్రింగ్.... ట్రింగ్"

 టైం చూస్తే పొద్దున్న ఏడు. 

ఫోన్ కాలర్ ఐడీ లో Out of Area అని కనిపిస్తోంది. 

వారం మధ్యలో అలాంటి కాల్ నాన్న తప్ప ఎవరూ చేయరు. 

ఫోన్ తీశాను - అనుకున్నట్టుగానే నాన్న - "లల్లీ - ఒకసారి ఫోన్ చెయ్" అని పెట్టేశారు.  

వెంటనే చేశాను - ఆయన ఫోన్ కి. 

"ఆయనెవరో కామెంట్లో అడిగినట్టు మనం ముందు పద్మావతి యూనివర్సిటీకే వెళ్ళాం - నీ రాంక్ కార్డు తీసుకుని - ఆ తర్వాత SVU లో మా అమలాపురం SKBR ప్రిన్సిపాల్ గా చేసిన KVV రాజు గారు వున్నారని - ఆయన్ని కలవటానికి వెళ్ళాము"

"అవునా నాన్నా ! అదేంటో నాకు గుర్తు రాలేదు మరి"

"నువ్వప్పుడు సీట్ రాలేదని బాధ పడుతున్నావు కదా - అంతగా పట్టించుకుని వుండవు - నేను చెప్తా రాసుకో  ఏం జరిగిందో"

"భలే వారు - మీరు ఉండాల్సిన వారు నాన్నా!" 

ఫోన్లో నవ్వులు. 

"అదే మీ అమ్మ అంటుంటుంది కదా - నా బారసాల నాటి సంగతులు కూడా నాగ్గుర్తుంటాయని"

"సరే చెప్పండి - మీ పుణ్యమా అని నా వచ్చేనెల పోస్ట్ కి గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడక్కర్లేదు నేను"

"అసలేం జరిగిందంటే ..." అని మొదలు పెట్టి తర్వాతి ఇరవై ముప్పై నిముషాల్లో మా నాన్న గుర్తు చేసిన  మర్చిపోయిన కబుర్లు ఇవి :

"నీకసలు వచ్చింది  వెంకటేశ్వర-పద్మావతి కామన్ ఎంట్రెన్స్ లో 14 వ రాంకు, పద్మావతి లో 6వ రాంకు. మనిద్దరం నీ రాంక్ కార్డు పట్టుకుని తిన్నగా డైరెక్ట్ గా పద్మావతి యూనివర్సిటీకే వెళ్లాం. 

వెళ్తే అక్కడ ఆఫీసులో సుజాతగారని ఒకావిడ నీ రాంకు కార్డు చూసి  - "మీ అమ్మాయికి సీట్ ఇవ్వలేమండి" అన్నారు. 

ఎందుకూ అనడిగితే అప్లికేషన్లో అక్కడేదో ఒక చెక్బాక్స్ ఉందట - చిన్నది ఒక మూలకి - 'ఎంట్రెన్స్లో రాంక్ వస్తే MCA లో చేరతావా' - అని. అది నువ్వు టిక్ పెట్టలేదట. అందుకని సీట్ ఇవ్వరని చెప్పిందావిడ. 

అప్పుడు ఆవిణ్ణి  నేను - "అసలు ఎంట్రెన్స్ రాసేదే MCA లో చేరడానికి అయినప్పుడు  ఆ చెక్ బాక్స్ కి  అర్థమే లేదు.  పైగా మీరు అప్లికేషన్ చెక్ చేశాకే రాంక్ కార్డు పంపించారు కదా - ఇంటర్వ్యూకి రమ్మని? తీరా ఇక్కడికి వచ్చాక ఇలా చెప్తే ఎలా? అందులోనూ  అమ్మాయికి మంచి ర్యాంకు కూడా వచ్చింది" అనడిగాను. 

వెంటనే ఆవిడ "నిజమేననుకోండి - కానీ యూనివర్సిటీ రూల్స్ -  నేనేమీ చేయలేను" అనేసి ఇంకేదో పనిలో పడిపోయింది. 

సరే, ఏం  చేస్తాం ఇంక - అని బయటికి వస్తే  అక్కడ మనలాగే అయిన ఇంకో ఐదారుగురు పేరెంట్స్, పిల్లలు వున్నారు. బయటికి వచ్చిన మనల్ని చూసి యూనివర్సిటీ మీద  గొడవ చేద్దాం - కేసు పెడదాం అన్నారు. 

అప్పటికే సుజాతగారితో వాదించి విసిగిపోయి వున్నాను - అందులోనూ నీకు ఇంకో నెలలో ఆంధ్రా యూనివర్సిటీ MCA ఎంట్రెన్సు, BSRB టెస్టు వున్నాయి - ఇక్కడ కాకపోతే అందులో  వస్తుంది అనుకుని - వాళ్లతో "ఎందుకొచ్చిన గొడవ - వాళ్ళ రూల్సేవో వాళ్ళకున్నాయి - మనకిది కాకపొతే ఇంకో కాలేజ్ వుంటుంది "  అని సర్దిచెప్పి వెంటనే వెంకటేశ్వర యూనివర్సిటీ లో SKBR ప్రిన్సిపాలొకాయన KVV రాజు గారు వున్నారని - ఆయన్ని కలవటానికి వెళ్ళాము - ఆయన దొరకలేదు - ఇంక తిరుమల వెళ్లి మన వైఖానస-రామారావు గార్ని కలిసి - దేవుడి దర్శనం చేసుకుని గుంటూరు వచ్చేశాం. 

అలా తిరిగొచ్చేశాక ఒకసారి ఎందుకైనా మంచిదని మా కంపెనీ లాయరు మాధవపెద్ది రాధాకృష్ణ మూర్తి గారని - ఆయన దగ్గరికి వెళ్లి అడిగాను -  కేసు పెడితే సీటు వచ్చే మార్గం ఏదైనా ఉందా - అని.

ఆయన - "ఇది చాలా చిన్న విషయమయ్యా - కేసు నిలవదు"  అనేశారు. 


ఆ తర్వాత మన పక్కింట్లో ఉండేవారు కదా - వలివేటి వెంకటేశ్వరరావుగారు - పబ్లిక్ ప్రాసెక్యూటర్గా చేస్తుండేవారు. ఆయన దగ్గరకెళ్ళి కూర్చున్నానో రోజు. 

నీ రాంక్ కార్డు చూసి, చెప్పిందంతా విని  - "కామేశ్వరరావు గారు - మీరు డైరెక్ట్ గా హై కోర్ట్ కి లెటర్ రాయండి -  కార్డు  కాకుండా ఇన్లాండ్ లెటర్  రాయండి. కార్డయితే జడ్జ్ దాకా వెళ్లదు. ఇన్లాండ్ అయితే జడ్జ్ కే ఇస్తారు" అని సలహా చెప్పారు. 

ఆయన చెప్పినట్టే ఏం జరిగిందో అంతా వివరంగా రాసి ఇన్లాండ్ లెటర్ పోస్ట్ చేశాను. అది ఆ టైంలో హై కోర్ట్ లో బెంచ్ లో వున్న సిట్టింగ్ జడ్జ్ K. అమరేశ్వరి గారని ఆవిడ దగ్గరికి వెళ్ళింది. 

అమరేశ్వరి గారు ఆ లెటర్ చదివి - "ఇంత మంచి రాంక్ వస్తే సీట్ ఇవ్వకపోవడం ఏంటి - వెంటనే  ఈ అమ్మాయికి సీట్  ఇవ్వండి" - అని పద్మావతి యూనివర్సిటీకి టెలెక్స్ పంపించారు . మనక్కూడా  ఆ ఆర్డర్ కాపీ పంపించారు - నా దగ్గర దాచాను కూడా అది - ఉండాలి అదెక్కడో. 

ఆ తర్వాత పద్మావతి యూనివర్సిటీ నుంచి  టెలిగ్రామ్ వచ్చింది. 

వెంటనే బయల్దేరి తిరుపతి వెళ్ళాము - మళ్ళీ వచ్చిన మనల్ని చూసి ఆ సుజాత గారే అడిగారు - "ఎలా సాధించారండి సీటు?" - అని. 

హై కోర్టుకెళ్లామండి అని చెప్తే బోల్డు ఆశ్చర్యపోయింది ఆవిడ - "మీరు తప్ప ఇంకెవ్వరూ అలా చేయలేదండి" -  అని. 

అలా వచ్చింది నీ MCA సీటు - బోల్డన్ని  కబుర్లు నువ్వు చెప్పడం కాదు - నేను చెప్తాను రాసుకో - హ హ హ"

[మా నాన్న చేత హై కోర్ట్ కి లెటర్ రాయించిన లాయరంకుల్, అసలు నేనెవరో తెలియకపోయినా నా రాంక్  కార్డుని బట్టి  సీటిమ్మని టెలెక్స్ పంపించిన జడ్జ్ అమరేశ్వరి గారు -  ఆ రోజు అలా చేసివుండకపోతే నేనీరోజు ఈ కబుర్లు చెప్పగలిగేదాన్నే కాదు - అసలిలా వుండేదాన్నే కాదేమో.  వాళ్లిద్దరికీ నా మనః పూర్వక కృతజ్ఞతలు!

గుంటూరు లో మేజిస్ట్రేట్ గా రిటైరయ్యి సొంత వూరు పెదవడ్లపూడి లో విశ్రాంతజీవనం సాగిస్తున్న లాయరంకుల్ - వలివేటి వెంకటేశ్వరరావుగారికి - కొన్ని నెలల క్రితం  - ఫోన్ చేసి - "US లో ఉద్యోగం చేస్తున్నాను - ఇదంతా మీ వల్లే, అంకుల్ " అంటే - ఎంతో సంతోషించారు - "నాదేముంది లేమ్మాయ్! - నువ్వు చదివావు , సీటు తెచ్చుకున్నావు" - అంటూ. ]

 
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

22 కామెంట్‌లు:

  1. "నా బారసాల నాటి సంగతులు కూడా నాగ్గుర్తుంటాయని" మీ‌నాన్న గారు అనటం‌ భలేగా అనిపించింది. నాక్కూడా నేను చిన్నప్పుడు ఊయలలోనుండి దూకేసిన సంఘటన కూడా గుర్తుంది! మీ నాన్నగారు గుర్తుచేసిన విశేషాలు బాగున్నాయి. దైవం‌ మానుష రూపేణ అని ఎవరో‌ ఒకరి రూపంలో సత్పాత్రులకు దైవసహకారం అందుతూనే ఉంటుంది. మీరు చాలా చక్కగా వ్రాస్తున్నారు. ఇదంతా ఒక పుస్తకం చేయండి చివరన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం గారు: మీరు నా బ్లాగ్ పోస్టుని మెచ్చుకోవడం నాకెంతో సంతోషమండి. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు!

      తొలగించండి
  2. ఆ విషయాన్ని అలా వదిలేయకుండా హై కోర్ట్ జడ్జి కి లెటర్ రాసి మరీ సాధించగలిగారంటే మీ నాన్న గారు రియల్లీ గ్రేట్ లలిత గారు. బోర్ కొట్టించకుండా జరిగిన విషయాలన్నీ చాలా బాగా రాస్తున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పవన్ గారు: మీ మంచిమాట మా నాన్నగారికి అందజేస్తానండి. ధన్యవాదాలు.

      తొలగించండి
  3. మీ సమాధానం చదివే దాకా " వాట్ ఈజ్ హు - హు ఈజ్ వాట్" అనే ప్రశ్నఅర్థం కాలేదు. శ్యామలరావు గారి వాక్యం - దైవం‌ మానుష రూపేణ అని ఎవరో‌ ఒకరి రూపంలో సత్పాత్రులకు దైవసహకారం అందుతూనే ఉంటుంది. - మీనాన్నగారి ఋజువర్తనకి అద్దంపడుతోంది.

    రిప్లయితొలగించండి
  4. సరిగ్గా ఆలోచన చెయ్యని రూల్స్ అలాగే ఉంటాయి కాబోలు. Anyway all is well that ends well. అమరేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో మొదటి మహిళా జడ్జ్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావు గారు: ఔనండి - అమరేశ్వరి గారు జడ్జ్ కావడం - మా ఉత్తరం ఆవిడ దగ్గరికి వెళ్లడం - నాకు మహిళా యూనివర్సిటీలో సీటు రావడం కోసమేనేమో అనిపిస్తోంది ఇప్పుడు తలుచుకుంటే :) మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  5. Hi lalli super pen gift ఇప్పడకి దాచుకున్నావు మొన్ననే అనుకున్నా lalli blogs ఇంకా రాలేదు అని thanks

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామల: నా బ్లాగ్ కోసం ఎదురుచూస్తున్న మీకు చాలా థాంక్స్!

      తొలగించండి
  6. లలితా! మీ నాన్నగారి గురించిన మీ అమ్మగారి మాట భలే!
    నీకు మీ నాన్నగారి పోలికే వచ్చినట్లుంది, చిన్నప్పటి విషయాలు గుర్తు పెట్టుకోవడంలో.
    నీ వెండి పెన్ను ఎంత బావుందో! నీ(మీ) బొమ్మల పేచీ భలే నవ్వొచ్చింది.
    చాలా ఇన్ట్రెస్టింగ్ గా రాస్తున్నావు
    .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బొమ్మల పేచీ - ఇప్పటికీ అలాగే వుంది :)) Interest తో చదివే నువ్వుండగా interesting గా రాయడానికి interest వుంటుంది మరి!

      తొలగించండి
  7. Bommala saga maku chala nachindi antunnara Ramya, Rapthi 🤗😇

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Aparne! I am so happy that you still remember Ramya (my doll in Red maxi). I will try to find Ramya's pic & add it to this post.

      తొలగించండి
  8. "త్వామనురజామి - 9 - అసలేం జరిగిందంటే...(మా నాన్న చెప్పిన కబుర్లు)"
    ---- మీ/మీ నాన్నగారి సు'స్వగతాలు' చదువుతున్నట్టుగా ఉంది.

    మనలో చాలా మందికి సహాయం చేసినవారెవరిని గుర్తించకపోవడం అనేది చాలా సాధారణం అయింది.
    మీరు వాళ్ళను స్మరించుకోవడం చాలా ముదావహం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట్ గారు: సహాయం చేసిన వారందరూ - నాకు ప్రాతఃస్మరణీయులు :)

      తొలగించండి
  9. Lalitha Gaaru: I too echo Shyaamaleeyam sir's words.
    <<

    దైవం‌ మానుష రూపేణ అని ఎవరో‌ ఒకరి రూపంలో సత్పాత్రులకు దైవసహకారం అందుతూనే ఉంటుంది.

    >>

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వీరుభొట్ల వెంకట గణేష్ గారు: నా బ్లాగ్ చదువుతున్న మీకు ధన్యవాదాలు!

      తొలగించండి