11, ఆగస్టు 2018, శనివారం

మనసే జతగా పాడిందిలే - 11 - కవలపాటలు - కన్నడ కల్పన ముడిద మల్లిగెహూవిన మాలె... మన తెలుగు దివిలో విరిసిన పారిజాతం...


చిన్నప్పుడు మా శివకోడు ఇంటి మండువాలో కురిసే వాననీళ్ళలో పడవలు ఒదులుతూ ఆడుకునే వేళల్లో మా ప్రసాద్ మామయ్య గదిలోంచి అలలు అలలుగా ఓ పాట వినిపించేది అప్పుడప్పుడూ - అంటే రేడియోలో ఆకాశవాణి వాళ్ళు వినిపించినప్పుడు.

అవి సినిమాలకి బ్లాక్ & వైట్ రోజులు. విచిత్రంగా ఆ రోజుల నాటి నా బాల్యం ఇప్పుడు తలుచుకుంటే బ్లాక్ & వైట్ లోనే గుర్తొస్తుంది. అప్పుడాడిన ఆటలూ, విని-పాడిన పాటలూ, చెల్లెళ్ళతో గిల్లికజ్జాలు - ఏ అహంకారపు రంగూ అద్దుకోని నలుపుతెలుపుల ఛాయాచిత్రంలా అనిపిస్తాయి.

సరే! అలాంటప్పుడు వినిపించిన అలల-అలల పాట ఇప్పటికీ ఎప్పుడు విన్నా ... 
ఆ పాటకి అంత బాగా కుదిరిన స్వరసమైన వరసకి,
ఆ వరసకి రాసిన సరసమైన పాటకి,
ఆ పాటని పాడిన సురసమైన బాల-గంధర్వ స్వరానికి  -
ముమ్మారు జేజేలు చెప్పుకుంటూ ఆ పాటలో తూగి తేలుతూ వుంటాను.

నా వంటింటి యూట్యూబ్-గానలహరిలో వారానికి రెండు సార్లైనా ఆ పాట వినందే చెవులూరుకోవు. ఆ పాటేంటంటే ఎప్పుడో దివికేగిన చెళ్ళపిళ్ళ సత్యంగారు మన చెవులకప్పగించగా, ఇప్పటికీ విన్నప్పుడల్లా ఇప్పుడే విరిసిందా అనిపించే నిత్య నవ గీత పారిజాతం - 'కన్నెవయసు' సినిమాలోని 'ఏ దివిలో విరిసిన పారిజాతమో...'.

ఆ పాట విన్నప్పుడల్లా అపుడున్నది మండుటెండైనా నల్లమబ్బు గొడుగులో వున్నట్లనిపిస్తుంది నాకు. అంత ఇష్టంగా ఆ పాట వినే నాకెప్పుడూ ఇంకోటి కూడా అనిపించేది - "డోలక్ సత్యంగారు ఎంత బాగా చేశారు ఈ పాటని?! ఇది అచ్చంగా ఆయన సొంత ట్యూనే అయుంటే బాగుణ్ణు. ఆయన్ని ఏ నిర్మాతో, దర్శకులో ఇబ్బంది పెట్టి వేరే భాషలోంచి పట్టుకొచ్చిన పెట్టుడు-ట్యూన్ కాకపోతే బాగుణ్ణు" అని.

ఎప్పుడూ వినే తెలుగు పాటలతో పాటే వాడుకగా కన్నడ, హిందీ - అవాడుకగా తమిళ పాటలు వినడం నాకు వేడుక. కిందటి వారం Radio City Kannada Gold లో పాత కన్నడ పాటలు వింటుంటే ఒక పాట అచ్చు  'ఏ దివిలో విరిసిన పారిజాతమో...' పాటలాగే వినిపించింది. అది వినగానే "అయ్యో! ఇదసలే పీబీ శ్రీనివాస్, సుశీల పాడిన పాట. అంటే చాలా పాత పాట అయ్యుంటుంది. అంటే మన సత్యంగారిది అసలు పాట కాదేమో!" అని బెంగేసేసింది. "అదేంటి? ఆ మాత్రానికే బెంగేసేస్తుందా - అసలదొక పట్టించుకోదగ్గ విషయమేనా?" అనడిగితే నేనేం చెప్పలేను కానీ ఇదీ ఓ రకమైన అపరాగ-పరిశోధనా-జనిత-బెంగే అని మాత్రం చెప్పగలను.

సరే! నేననుకున్నానని అన్నీ జరిగేస్తాయా? అనుకోలేదని ఆగేస్తాయా? తెలుగులో వున్న నాకిష్టమైన పాట కన్నడాలో కూడా వుంది. నా కవల-పాటలకొక పాటల-జత దొరికిందని సరిపెట్టేసుకున్నాను.

PBS గొంతులో విన్న కన్నడ పాట నాకు అంతగా నచ్చలేదు. అందులోనూ సత్యంగారి పాట అసలు-పాట కాదూ అన్న ఉక్రోషంతో విన్నానేమో అస్సలింకా నచ్చలేదంటే నచ్చలేదు.  మొదటి మూడు మాటలు మాత్రమే గుర్తున్నాయి - "నీ ముడిద మల్లిగె... " అంటూ.

ఆ మూడు మాటలూ పట్టుకుని యూట్యూబ్‌లో వెతికితే కన్నడ పాట దొరికింది. చెవిలో హెడ్-ఫోన్స్ పెట్టుకుని వింటుంటే - "వెన్న తిని పాడతారేమో...  అందుకే ఆయన పలుకంత మెత్తన" - అనిపించేసింది పీబీ శ్రీనివాస్ గొంతు వింటూ ఉంటే. ఆయన వెన్నపూసల పూసిన కంఠానికి తోడు సుశీల తేనెలూరే గాత్రం. ఏదో తెలియని ఉక్రోషంతో పాట వినడం మొదలుపెట్టిన నాకు పాట పూర్తయేసరికి ఈ పాటా నచ్చేసింది. అందులోనూ గాయనీగాయకులు పాడేటప్పుడు  వెనకాల మువ్వల శబ్దంలా పాటకి అలంకారంలా వినిపిస్తున్న నేపథ్య సంగీతం భలే ఉపశమనంగా, నా ఉక్రోషపు-చెవులకు సంగీత-లేపనంగా అనిపించింది. చూడకూడదనుకుంటూనే "ఎవరబ్బా ఇంత బాగా ఈ పాటను చేసిందీ?" అని చూస్తే - ఇంకెవరూ? మనవారు, మన తెలుగువారు,  మన తెలుగు-వెలుగువారు, మన విజీనగరపు చెళ్ళపిళ్ళ సత్యం గారే!

అది చూడగానే నాకెంత సంతోషం వేసేసిందంటే -  స్వయంప్రకాశమైన సూర్యుడి లాంటి అసలు పాటా మనవారిదే. ఆ సూర్యకాంతితో వెలిగే చంద్రుడిలాంటి సిసలు పాటా మనవారిదే - ఇది సత్యం, నిత్యసత్యం - అనేసుకున్నాను. అనేసుకునీ...  ఆ పాటలు రాసేసుకునీ...  ఇదిగో...  ఇలా ఈ రోజుకి మీకందించేస్తున్నాను.

మీరూ ఓ పాలి సెవొగ్గేసి ఇనేసి - ఆ బ్లాకెండువైటు బొమ్మలు సూసేసి సత్తెంగోరికి సప్పట్లు కొట్టేయండి మరి!

అసలు పాటేంటంటే... 

ఆనాటి సినేమా: గాంధీనగర (1968)
ఆనాటి పాట రాత: చి. ఉదయశంకర్
ఆనాటి పాట కూర్పు: సత్యంగారు
ఆనాడు పాడినవారు: పీబీ శ్రీనివాస్, పీ సుశీల
ఆనాడు ఆడినవారు: రాజ్ కుమార్, కల్పన

ఈ పాటలో PBS వెన్నపూసల పూసిన కంఠానికి కన్నడ కంఠీరవుని నటనా విలాసము, సరిజోడుగా తేనెలూరే సుశీల గాత్రానికి  'మిణుగుతారె' కల్పన లాస్యం చూడాల్సిందే మరి!




నీ ముడిద మల్లిగెహూవిన మాలె
నినగెందే బరెద ప్రేమద ఓలె
అద ఓదలు హరివుదు జేనినా హొళే...

నా ఓదిదె ఒలవినోలెయను
మనసారెన ముత్తనిత్తెను
హెరళేరిసి నిన్నా నెరళ కండెనూ...

నీ ముడిద మల్లిగెహూవిన మాలె
నినగెందే బరెద ప్రేమద ఓలె

నిన్నాసెయ నోటద కథె యేను?
సెరె మీరద యౌవన జతె యేను?
నిన్నాసెయ నోటద కథె యేను?
సెరె మీరద యౌవన జతె యేను?
బెళదింగళ హుణ్ణిమె మాతేనూ...?

ఆ హుణ్ణిమె మాతనాడితు
నన్న కణ్ణలి మనెయ మాడితు
సరితూగువ బెళకల్లి కూడియాడితూ...

నా ముడిద మల్లిగెహూవిన మాలె
ననగెందే బరెద ప్రేమద ఓలె

మధు మాసది హాడువ కోగిలెయ
ఆకాశదె తూగువ సిహి నుడియ
మధు మాసది హాడువ కోగిలెయ
ఆకాశదె తూగువ సిహి నుడియ
అనురాగద అలెయలి తేలి హోగువే...

తేలాడువ దోణి నీనాదె
నీ నోడువ నోటకె కణ్ణాదె
అదు తోరిద ఊరిగె సాగి హోగువే...

నీ ముడిద మల్లిగెహూవిన మాలె
ఆఆఆ
నినగెందే బరెద ప్రేమద ఓలె
ఆఆఆఆ

ఆ... హా... హా...
ఆ... హా... హా...

ఇక సిసలు పాటేంటంటే... 

ఈనాటి సినేమా: కన్నెవయసు (1973)
నాటి పాట రాత: దాశరథి
ఈనాటి పాట కూర్పు: మళ్ళీ సత్యంగారే!
ఈనాడు పాడినవారు: బాల బాలు
ఈనాడు ఆడినవారు: లక్ష్మీకాంత్, రోజారమణి, ఎంపీ ప్రసాద్

అసలు పాటని మెత్తగా నడిపించిన సత్యంగారు ఈ సిసలు పాటని ఎత్తుగడలోనే గుండె ఝల్లనేలా పలికించారు. నూనూగుమీసాల హీరోకి పాడిన బాల-బాలు స్వరంలో పాట పల్లవిలో మొదటి రెండు లైన్ల చివర "మో..." అన్న అక్షరం దగ్గర, "బుగ్గలను... సిగ్గులను... నిదుర మబ్బులను ...మెరుపుతీగవై..." అన్న మాటల దగ్గర ఒక stylish lag ఉంటుంది - అది వింటుంటే అప్పుడే కాలేజీలో చేరిన అబ్బాయి స్ట...యిలుగా మాట్లాడడం అలవాటు చేసుకుంటున్న ఒక గీర-జీర వినిపిస్తుంది.

దానికి తోడు కన్నెపడుచు రోజారమణి రెండో చరణానికి ముందు తాడాట ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన బాల్య-చాంచల్యం ముచ్చటగా అనిపిస్తే, ఆ తర్వాత ఆట ఆపి నడిచిన అడుగుల్లో కనిపించిన పరువపు గర్వం మురిపిస్తుంది.

ఇంకాలశ్యం ఎందుకు - చూస్తూ వినేద్దామా?




ఏ దివిలో విరిసిన పారిజాతమో..?!
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...?!
నా మదిలో నీవై నిండిపోయెనే...!

ఏ దివిలో విరిసిన పారిజాతమో..?!
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...?!

నీ రూపమే దివ్య దీపమై - నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే...

ఏ దివిలో విరిసిన పారిజాతమో..?!
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...?!

పాల బుగ్గలను - లేత సిగ్గులు పల్లవించగా రావే...
నీలి ముంగురులు - పిల్ల గాలితో ఆటలాడగా రావే...
కాలి అందియలు ... ఘల్లుఘల్లుమన...
కాలి అందియలు ... ఘల్లుఘల్లుమన...
రాజహంసలా... రావే...

ఏ దివిలో విరిసిన పారిజాతమో..?!
ఏ కవిలో మెరసిన ప్రేమగీతమో...?!
నా మదిలో నీవై నిండిపోయెనే...!

ఏ దివిలో విరిసిన పారిజాతమో..?!
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...?!

నిదుర మబ్బులను - మెరుపు తీగవై కలలు రేపినది నీవే...
బ్రతుకు వీణపై - ప్రణయరాగములు ఆలపించినది నీవే...
పదము పదములో ...  మధువులూరగా ... 
పదము పదములో ... మధువులూరగా
కావ్యకన్యవై... రా... వే...

ఏ దివిలో విరిసిన పారిజాతమో..?!
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...?!
నా మదిలో నీవై నిండిపోయెనే...!

ఏ దివిలో విరిసిన పారిజాతమో..?!
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...?!

ఇప్పుడు చెప్పండి నేను చెప్పింది నిజమేగా ... 
కన్నడ కల్పన ముడిద మల్లిగెహూవిన మాలె (కన్నడ కల్పన ముడుచుకున్న మల్లెపూల దండ) 
మన తెలుగు దివిలో విరిసిన పారిజాతమేగా?!
అది అన్నదీ, ఇది అన్నదీ సత్యంగారేగా!
అదీ ఇదీ వింటూ మీరిటనే వుందురుగా!
ఇంకో పాటల పల్లకి మోసుకు వస్తా నే తొందరగా! 

 ~ పాటల భైరవి 



4 కామెంట్‌లు:

  1. Paatalani polchina vidhaanamu,vaati venuka vunna nalupu telupu cinemala rojula gnaapakaalu chaalaa bagunnai.

    రిప్లయితొలగించండి
  2. అసలు పాట బాగుంది. కాని తెలుగు పాట ఇంకా చాలా బాగుంది. చాలా ఇంప్రూవ్ చేసారు సత్యం గారు.
    మరపు రానివి ఆ బ్లాక్ అండ్ వైట్ రోజులు. ముఖ్యంగా పాట మధ్యలో ఆ స్మూత్ ఇంటెర్లూడ్స్ అమోఘం.

    ముఖ్యంగా పదప్రయోగం " అపరాగ-పరిశోధనా-జనిత" కేక .

    మరిన్ని పదప్రయోగాలు మరియు పాటల కై తరువాయి బ్లాగు కోసం వెయటింగ్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా మాటలతో-ఆటలు మీకు నచ్చినందుకు సంతోషం, గిరిరాజ్! Thanks for taking time to read my blog and comment.

      తొలగించండి
  3. మీ శుభాకాంక్షలకి బదులివ్వడం కొంచెం ఆలస్యం అయింది, K. S. చౌదరి గారు. మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభకామనలు!

    రిప్లయితొలగించండి