13, జనవరి 2019, ఆదివారం

మంచుపూట నేర్చిన మంచిమాట - సంక్రాంతుల కాంతుల మించునంట...

ఎప్పట్లాగే ఈసారి కూడా సంక్రాంతి పుష్యలక్ష్మి మా ఊళ్ళో మంచుపూల వానలో తనివి తీరా తడిసింది.
ముగ్గు లేదని ముడుచుకున్న వాకిలి మంచుపూతతో మెరిసింది, మురిసింది.
నేల మీద నిలవలేని ముగ్గు ఇంటి ముంగిట ఇనప గుమ్మటమెక్కి మంచు చుక్కల మెలికలు తిరిగింది.


పెరట్లోని చెట్లు -  కప్పుకున్న ఆకులవీ, తప్పుకున్న ఆకులవీ - మంచు చిగురులు తొడిగాయి.  



శుక్రవారం మధ్యాహ్నం మొదలైన మంచువాన శనివారం మధ్యాహ్నానికి ఓ పదంగుళాల దళసరి కంబళైంది పుడమికి.
శుక్రవారం బడులు తొందరగా వదిలేశారు - పిల్లలను చప్పున ఇంటికెళ్లి వెచ్చగా ఒదిగుండమని.
శనివారపు ఆట-బడులు, పాట-బడులు అన్నీ కూడా చలి పాలబడి మూత-బడులు. 

ఇంట కాలు నిలవని పిల్లలు కాలుగాలిన పిల్లులే ఇక !
ఊసుబోవని ఇంటి సావిట్లో ఆటల పందిరిగా పిల్లలజంట  - వంటింట్లో పాటల సందడి తోడుగా గరిట తిప్పగా సాగిన నా వంట.
అన్నాల వేళకు నోటికి హితవుగా వెచ్చావెచ్చని పులుసు కూరల బువ్వల నిండిన బొజ్జలు.
ఆకలి తీరినపాటునే మళ్ళీ మొదలైన Super Mario Odyssey ఆటలు. 
ఆటల మునిగిన పిల్లల పక్కనే ఓ మూల కూర్చుని నెమరేస్తూ నే తిరగేసిన పాత పుస్తకాల దొంతరలు.

వారానికి ఒక పూట అపురూపంగా దొరికే siesta-సమయాన్ని అందబుచ్చుకుని, మెట్లెక్కి వెళ్ళబోతున్న నాన్నగారు చెప్పిన మాట - సరిగ్గా మూడున్నరకి లేపమని. ఎందుకూ అంటే ఇంటి ముందున్న మంచుమరుగు ఇప్పుడిప్పుడే కరగదు కదా! ఎత్తిపోద్దామని.

నేనర్స్ చెప్పిన మాట విన్న పిల్లలు - ఒకరికొకరు కనుసైగ చేసుకున్నారు ముసిముసినవ్వులతో.
వాళ్ళ ఎత్తు ఏంటంటే తను లేచేలోగా చడీచప్పుడు చేయక వెళ్లి దాదాపు ముప్పావు అడుగు ఎత్తున్న మంచు-కంబళిని సంబాళించాలని.

ఈలోగా ఏమయ్యిందంటే ఇంటి బయటున్న చిరుగంట మోగింది.
ఎవరా అని తలుపు తీస్తే - ఎవరో ఇద్దరు బంగారుతండ్రులు, మా-మంచివారు, కొంచెం పైకమిస్తే మంచు తొలిగిస్తామని వచ్చారు.
వచ్చి అడిగిందే తడవు వాళ్ళడిగిన దానికన్నా ఎక్కువే ఇచ్చి, వారు చెయ్యబోయే సాయానికి మెచ్చానని ఓ మాటందించి, లోపలికొచ్చి పిల్లలకి మీ ఆట ఆపక్కర్లేదు, మంచు తొలిగించే ఆపద్బాందవులొచ్చారని చెప్పా.

ఓ గంట లోపులోనే ఇంటి ముంగిలి మంచు-నలుగు తొలిగి వెలిగిపోయింది. వచ్చినవారు నేనిచ్చినది పుచ్చుకుని నవ్వుమొహాలతో తరలిపోయారు.

ఈలోగా నిద్రనుంచి లేచొచ్చి కిటికీలోంచి బయటికి చూసిన నాన్నగారికి తళతళలాడుతున్న వాకిలి కనిపించి ఆశ్చర్యపోయారు. జరిగిందేంటో తెలుసుకుని తనను లేపనందుకు నొచ్చుకున్నారు.

"మీరెందుకు లేవడం, నేనర్స్? మంచు తీస్తామని ఎవరో వచ్చారు. అమ్మ డబ్బులు కూడా ఇచ్చింది. ఫర్లేదు! మన పని తగ్గింది. వాళ్ళకీ కొంచెం allowance దొరికింది" పిల్లల సర్దిచెప్పబోయారు.

"వాళ్లకి ఎంతసేపు పట్టింది?" నాన్నగారి ఆరా.

"ఎంతా ? మహా అంటే ఓ నలభయ్యో-ఏభయ్యో  నిముషాలు" ఆట మీంచి చూపు తిప్పకుండానే వచ్చింది ఉత్తరం. 

"అదే మరి! వాళ్ళిద్దరికీ ఏభై నిముషాలు పట్టింది. అంత చలిలో ఆరుబయట పనిచేయడం ఎంత కష్టం? మనందరం తలో చెయ్యీ వేసుంటే అందరికీ తలో పది నిముషాలే పట్టేది కదా! డబ్బులివ్వడంతో వాళ్లకేదో మనం ఉపకారం చేశాం అనుకోకూడదు. వీలైనంత వరకూ చెయ్యగలిగిన సాయం చెయ్యాలి. ఈసారి నుంచీ అలాగే చేద్దాం - సరేనా?!" - అనునయింపు చాటున ఓ చిన్న మందలింపు.

"అలాగే నేనర్స్, తప్పకుండా గుర్తుంచుకుంటాం!" ఆట ఆగి ఆలోచనయ్యింది. ఆలోచన ఆర్ద్రతయింది. ఆర్ద్రత  మరువలేని బతుకు-పాఠమయ్యింది.

Sun-కాంతి లేని మా చోట
సంక్రాంతి మనసుకి మాత్రమే తెలిసిన ముచ్చట 
మంచుపూట నేర్చిన మంచిమాట 
సంక్రాంతుల కాంతుల మించునంట... 



                                                                                    

9 కామెంట్‌లు:

  1. భలే మంచి మంచు పోస్ట్ లలిత గారు, చదువుతుంటే మనసుకు హాయిగా అనిపించింది.

    రిప్లయితొలగించండి
  2. Learned a very valuable, basic yet forgotten lesson.

    Thanks a lot !!

    రిప్లయితొలగించండి
  3. పండగరోజున మాక్కూడా ఒక బెత్తెడు మంచు పడింది. మిత్రులు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. నైస్! మాకు ఈసారి మంచు ముగ్గుల భాగ్యం ఇంకా లేదు. సో... తోచిన ముగ్గు వేసుకునే భాగ్యం దక్కింది. మీరు రాసే విధానం దృష్టి మరలకుండా చదివేటట్లు చేస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకు మాత్రం నీ కమెంటు-భాగ్యం దక్కింది, శారదా :)

      తొలగించండి
  5. Awesome! మీ Snow-క్రాంతి బాగుంది.

    రిప్లయితొలగించండి