24, మార్చి 2020, మంగళవారం

శక్తినియ్యి శార్వరీ...

 నేల దున్నాం 
నీరునీదాం
నింగికెగిశాం
గుట్టనెక్కాం 
పుట్ట తవ్వాం
చెయ్యలేని, చేతకాని దేమి లేదని 
విఱ్ఱవీగాం... 

మెకము కాలు కట్టి 
చేపల దారపు వలల పట్టి  
పక్షి రెక్కలు విరిచి పెట్టి 
పాము కోరల పీకివేసి 
పంజరాల, బోనులలో అట్టిపెట్టి 
వినోదించాం...

కారులో జోరుగా తిరిగిన - నేలనే - కాలు కదపలేకున్నాం
ఓడపై విలాసాలాడిన - నీటనే - ఒడ్డు చేరలేక ఊగిసలాడుతున్నాం
విహంగాలతో పోటీ పడిన - నింగినే - రెక్క విరిగి పడున్నాం 
మా ఇంటి బోనులో చిక్కి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం...
నేల మీద మెకము
నీటి లోని చేప 
నింగిలోని పక్షి 
పుట్టలోని పాము 
బురదలోని పురుగు సైతం 
ఇంటి కిటికీల కీవలున్న మమ్ము జూచి 
"చూడు... చూడు... మనిషి వీడు 
వీడు నొదిలి రాలేడు... "
అని నవ్వుతున్నాయి 
వీలు చిక్కిన ఈ వేళ 
మనిషి చేతిలో చిక్కిన 
వాటి బ్రతుకు వాడల చేజిక్కిచ్చుకుంటున్నాయి... 

మనిషి ప్రదర్శనశాలలో నేనుండి 
వసంతలక్ష్మిని నా బోను దాకా తీసుకొచ్చిన ఉగాది-శార్వరిని వేడుకుంటున్నా... 
ఎండ తగలనియ్యి, శార్వరీ... 
గాలి సోకనియ్యి, శార్వరీ...
చుక్కల వెలుగు చూడనియ్యి, శార్వరీ... 
విముక్తినియ్యి శార్వరీ...
శక్తినియ్యి శార్వరీ...






కొన్నేళ్ళుగా ...
చెట్టు వేరుల తుంచి బాటలేశాం
పిట్టల దారుల కూల్చి బురుజుల కట్టాం
చేపల నీరుల చీల్చి ఓడ దారుల చేశాం 
మెకపు ఉనికి కమ్మివేసి మనిషి వాసన నింపి వేశాం 

ఈవేళేమో... 
చెట్టు నీడ లేదు, పిట్ట సాయం రాదు, చేప అంటనీదు, మెకపు జాడ లేదు 
మా ఉనికికి శక్తినియ్యి శార్వరీ...

కొన్నేళ్ళుగా ...
కాయ కోసం కొమ్మనొంచాం
పండు కోసం కాయ దాచాం 
పువ్వు కోసం రెమ్మ విరిచాం 
కూడుకంటూ, గూడుకంటూ, మై దాపు కంటూ కోసం చెట్టు నరికాం 

ఈవేళేమో...
కూడు చేరక, గూడు వీడక, బిక్కుబిక్కుమంటూ దాపునే వున్నాం 
మా మనసుకు శక్తినియ్యి శార్వరీ...

కొన్నేళ్ళుగా ... 
ఆటలో కుదురులేదని కోతి తోక నలిపాం 
మాట వినలేదని ఏనుగు తొండం మెలిపెట్టాం
పాట కాడలేదని పాము కోరలు పీకాం
వేటాడకూడని పంజాలను, పక్షులను బోనులోన పెట్టి, పంజరాన పట్టి చూపెట్టాం 

ఈవేళేమో...
కనిపించని పీడల బెదిరి, మనసు చెదిరి మా ఇళ్ళే బోనులయి బందీలయ్యాం 
మా కుదురుకు శక్తినియ్యి శార్వరీ...

కొన్నేళ్ళుగా ...  
పక్షి కొదలని గింజలెన్నో అన్నం వార్చి, పప్పు వండి చెత్త కుండీల పాలు చేశాం 
పురుగు ముట్టని కాయలెన్నో వేయించి, ఉడికించి మురికికాలువల కలిపాం 
చిలకని ముట్టనివ్వని పళ్ళనెన్నిటినో రసము పిండి కడుపునిండిన వెక్కసానికి నేల పాల్జేసాం
కోడినొగ్గాం, మేకనొండాం, రుచుల మఱిగి తిన్నది తినకుండా తినాలన్న పంతంతో ప్రతిదీ తిన్నాం, తింటున్నాం 

ఈవేళేమో...
అవే రుచులు వండే చేతికి ఒణుకు, తినే నోటికి బెరుకు - కడిగామా లేదా అని పదేపదే చూసుకుంటున్నాం 
మా మనికికి శక్తినియ్యి శార్వరీ...

కొన్నేళ్ళుగా ...   
ప్రతి ఉగాదికి...
కోయిలమ్మల కూతలతో గొంతు కలిపి పాడుకున్నాం  
కొత్త చివురుల పూతల స్పూర్తితో కొత్త తీర్మానాలు తలకెత్తుకున్నాం 
ఆరు రుచుల ఉగాది పచ్చడి తిని ఏ చేదునైనా తీపిగా అనుకోగలమనుకున్నాం
ప్రతి శార్వరి అంతాన ఒక ప్రభాతముంటుందని ధీమాగా వున్నాం 

ఈవేళేమో...
ఈ ఉగాదికి... 
పెదవి కదిపితే గొంతు వేసే గుటకకి బెదురుతున్నాం 
పొరుగువారితో చెయ్యి కలిపిన పాత రోజులు తిరిగి వస్తే చాలనుకుంటున్నాం
తాకినంతనె చెడుపు చేయక కడుపు నింపే కూర, నార దొరికితే చాలనుకుంటున్నాం 
"శార్వరీ నామ సంవత్సర ఉగాది" - పేరుకే రాత్రి గానీ అంతటా వెలుగు ఉంటే బావుండుననుకుంటున్నాం 
మాలోని మనిషికి శక్తినియ్యి శార్వరీ...

18 కామెంట్‌లు:

  1. ఉగాది సందర్బంగా రాసిన ఈ కవిత ప్రస్తుత పరిస్థితి ని చక్కగా అద్దం పట్టింది లలిత గారూ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా బ్లాగ్ చదివి మెచ్చినందుకు, అదిలా వచ్చి చెప్పినందుకు ధన్యవాదాలు, శ్రీ నన్నయ్యగారు!

      తొలగించండి
  2. అద్భుతం.
    నిజాలని చాలా నిజాయితీగా, సున్నితం గా అల్లి, ఇంట్లో దేముడు పటానికి వేసి రోజూ చూసే ఒక మాల ఒక మాల లాంటి దాన్ని తయారు చేశారు.
    మనిషి సమూహం మాత్రమే సంఘం , ప్రకృతి లో మిగిలిన ప్రాణులన్నీ, వనరులన్నీ, ఆ సంఘానికి వస్తువులు..

    అనికొడం వల్ల వచ్చిన social distance situation

    చాలా అలతి పదాల్లో చెప్పారు.

    ఉగాది పూట మంచి మాట.

    ధన్యవాదాలు, ఉగాది శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా బ్లాగ్ గురించి మీర్రాసిన మంచి మాటలకి ధన్యవాదాలు!

      తొలగించండి
  3. లలిత గారు,
    శార్వరీ నామ ఉగాది కి మీరు రాసిన వినతి అద్భుతంగా వుంది. ఎంతో అందంగా, హృద్యంగా, నేను చదువుతుంటే మీరే చదువుతున్నట్టు వీనుల విందుగా పసందుగా పంచాంగ శ్రవణం జరిగినట్టుగా మాటల లోనే ఉగాది షడ్రుచుల రుచి చూపించారు.
    చాలా బాగుంది లలిత గారు.
    ~మురళీ కృష్ణ రాయవరం.

    రిప్లయితొలగించండి
  4. వికారి కరోనా తొలగి పోవాలని,బ్లాగుల్లో వికారమైన చర్చలు సమసిపోవాలని, ఎల్లెడలా ' పచ్చదనం ' వెల్లి విరియాలనీ, వ్యక్తిగత వైమనస్యాలు తొలగిపోవాలనీ, ధర్మ మార్గం లో పయనించాలని కోరుకుంటూ శ్రీ శార్వరీ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.

    రిప్లయితొలగించండి
  5. లలిత గారు : చాలా చక్కగా చెప్పారు . ప్రతి మాట అక్షర సత్యం . "వీడు వీడు వదిలి రాలేడు " అనే పద ప్రయోగం బాగుంది . ఆ జగన్మాత మనందరికీ తగిన శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తూ ...

    మీ మిత్రుడు , మీ కలానికి అభిమాని - ప్రసాద్ రాణి

    రిప్లయితొలగించండి
  6. చాలా బాగుందండి మీ కవిత. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  7. కొంచెం తెలిసి, కొంచెం తెలియక తప్పు చేసాము తండ్రి, మా తప్పు కాయి, మా రాత కి ఊతం ఇవ్వు, అని దేవుడికి మరవం, ధవనం తో మల్లెపూల మాలిక బాధ తో, భయం తో, వినమ్రం తో పొందికగా అల్లి పటానికి అలంకరించినట్టు ఆ భావాల్ని మాటలతో అల్లినట్టు వుంది. 👏👏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా కవితకి మీరల్లిన ఈ మాటల మాల భలే వుంది. ధన్యవాదాలు!

      తొలగించండి