పాతపాత ఇంగిలీషోళ్ళు అప్పుడెప్పుడో అనేశారు కదా... There's many a slip 'twixt the cup and the lip అని!
అంటే తాగే కప్పుకీ, అది తాకే లిప్పుకీ మధ్య బోల్డు స్లిప్పులుండొచ్చనీ... కప్పులోంచి తాగబోయినదేదో లిప్పుకి తాకకుండానే స్లిప్పయి పోవచ్చుననీ కదా - దానర్థం!
దాన్ని నేనిట్ఠా రాసుకుంటా: There's many a slip 'twixt the సినిమా-రావడం and దాన్ని-నేను-చూడడం.
అనగా... సినిమా వచ్చినా నేను దాన్ని చూడడం అనేది ఎలాంటి స్లిప్పులూ లేకుండా జరగాలంటే ఎన్ని కుదరాలో!
నేనెప్పుడో రాసి పెట్టుకున్నా కదా... సీన్ సీన్ పే లిఖా హై దేఖ్‌నేవాలే కా నామ్! - అని.
తినే గింజల మీదా, నమిలే బ్రెడ్డుముక్కల మీదా, ఇంకా చెల్లని నూకల మీదా నా పేరు రాసి ఉన్నట్టే - తీసే సినిమాల సీను, సీను మీదా నా పేరు రాసి వుంటేనే - ఆయ్! అప్పుడేనండి - ఆ సినిమా టిక్కెట్టు ముక్క నా పేర్న కొయ్యబడేది.
ఆయ్! అది నిజమండి! నేనేదన్నా సినిమా చూసి రాగానే నాకల్లాగే అనిపిస్తుందండి.
అదెలాగో చెప్తా వినండి.
*******
*******
ఈ సినిమాలు తీసేవాళ్ళున్నారు కదా! ఓ సిన్మా తీస్తున్నారనుకోండి! అదేమన్నా వంటింట్లో వండే వంట లాగా చడీ-చప్పుడూ లేకుండా చేసేస్తారనుకుంటున్నారా?
సినిమా తీయడం మొదలు పెట్టిన దగ్గర్నుంచి - సినిమా తీస్తున్నామని చెప్తుంటారు.
చెప్తూనే సినిమా తీస్తుంటారు.
తీస్తున్నప్పుడే - తీస్తున్న సినిమాలోని పాటలు, అక్కడక్కడి మాటలు - టీవీల్లో, యూట్యూబు వీడియోల్లో - చూడబోయే సినిమాని రుచి చూపించడానికో, అరుచిగా ఉన్నా అలవాటు చేసి చూపించెయ్యడానికో వేస్తుంటారు.
అలా చేస్తూ చేస్తూ ఉండగానే సినిమా తీయడం పూర్తి చేస్తారు.
ఇక ఆ సినిమా ఎక్కడ వస్తుందీ అనుకుంటే - అక్కడ థియేటర్లోనా, ఇక్కడ ఓటీటీలోనా అని ఊరిస్తారు.
మొత్తానికి ఎక్కడోక్కడ సినిమా వేసేస్తారు.
*******
*******
సినిమా నేనెప్పుడూ ఒంటరిగా చూడను. నాతో పాటు బద్రి ఉంటేనే చూస్తాను. లేకపోతే అందులో మజానే వుండదు. సినిమా చూడడం కంటే చూసింతర్వాత దాన్ని గురించి మేం మాట్లాడుకునే మాటలు నాకు బోల్డు ఇష్టం.
ఓటీటీలో అయితే పెట్టిన మొదటి పది నిముషాల్లో బోర్ కొట్టకుండా ఉంటే చాలు. చూసేస్తాం. ఆ తర్వాత నచ్చితే ఆ రోజే పూర్తిగా చూసేస్తాం. నచ్చకపోతే రోజుకో అరగంట చొప్పున కుదిరినప్పుడు చూస్తాం. అలాంటప్పుడు అప్పటప్పటి కాలక్షేపం తప్ప ముందు జరిగిన కథ గురించి ఆట్టే పట్టించుకోం.
అదే సినిమా థియేటర్లో వచ్చిందనుకోండి! మరప్పుడు - ఏమేం కావాలీ? ఏమేం కుదరాలీ ?
ముందుగా ఆ సినిమా మా ఊళ్ళో వున్న థియేటర్లోకి వచ్చుండాలి.
అలా వచ్చిందని నాకు తెలిసుండాలి.
ఆ సినిమా వీకెండులో చూసే వీలుండాలి.
సినిమా మొదలయ్యే టైము - రాత్రి ఎనిమిది తర్వాత అయుండాలి.
ఆన్లైన్లో టిక్కెట్లు వెతికితే పై రెండు వరుసల్లో ఒకదానిలో - మరీ మూలకి కాకుండా ఓ రెండు సీట్లు ఉండాలి.
వీటన్నింటికన్నా ముందు సినిమా తీసిన దర్శకుడో, హీరోనో, హీరోయిన్నో - ఎవరో ఒకరు నాకు నచ్చాలి.
ఇన్ని కుదరాలంటే - నేను ముందే అన్నట్టు - సినిమా సీనుసీను మీద నేను చూడాలని రాసుండాల్సిందే!
నిన్నటికి నిన్న ఇల్లాంటివన్నీ కుదిరి - సినీ-మా-కాలం కలిసొచ్చి ఓ సినిమా థియేటర్లో చూశాం.
ఆ సినిమా కబుర్లే ఇవాళ్టి బోల్డన్ని కబుర్లు.
ఈ సినిమా శేఖర్ కమ్ముల చెప్పాలనుకున్న sensitive విషయాలన్నీ - ఒకేసారి చెప్పెయ్యాలన్నట్టు రాసుకుని చెప్పిన కథ.
సినిమాలో చూపించిన కొన్ని విషయాలు అంత సమకాలీనంగా అనిపించకపోయినా (పటేల్ ముందు చెప్పులు విడిచి నడవాలి లాంటివి) నేను వాటిని అంతగా పట్టించుకోలేదు.
అలాంటివి ఇంకా కొన్ని ప్రదేశాల్లో జరుగుతున్నాయేమో! అవి దర్శకుడు చూశాడేమో - అనుకుని అతను చెప్పిన కథని చెప్పినట్లు విన్నా!
కొత్త సినిమా వస్తే అది ఏ మాత్రం బావున్నా "భలే వుంది" అనుకుని చూసేసే నాకు ఈ సినిమా నచ్చిందబ్బా!
*******
*******
సినిమా మొదటి రెండు తెరల్లోనే - ఓ రెండు పంటికింద రాళ్ళు. కంటిలో నలుసులు.
అవేంటంటే ప్రేమని నిర్వచిస్తూ రాసిన ఓ నాలుగు వాక్యాల్లో "కంచె" బదులు "కంచ", "యుద్ధం" బదులు "యుద్దం" లాంటి తెలుగుమాటలు, వాటితో పాటు సరిగా లేని వాక్యనిర్మాణం.
సినిమాలో మాటలు-పాటలు-ఆటలు, రంగులూ-హంగులతో పాటు ఆ ముందు రాసి చూపించే మాటల్లో కూడా శ్రద్ధ వుంటే బావుండునేమో అనిపించింది.
ఎందుకంటే ముందుముందు తరాలు ప్రామాణికంగా తీసుకోబోయేది సినిమాలే. ఈరోజుకీరోజు సినిమాలో ఫేవరేట్ హీరోనో, హీరోయినో చెప్పిందే వేదం - చేసిందే ఆమోదం.
అందుకే సినిమాల్లో ఏ మాత్రం మంచి చెప్పే అవకాశం వున్నా దాన్ని వాడుకుంటే బావుండుననిపిస్తుంది.
సినిమా తెర మీద రాసిన భాష గురించిన ఘోషా-కంఠశోషా వదిలేస్తే - "లవ్‌స్టోరి" సినిమా నాకు నచ్చింది.
నాగచైతన్య చేసిన జుంబా-డాన్స్ బావుంది.
సాయిపల్లవి తన బుగ్గ మీద ముద్దు పెట్టినప్పుడు అది కలా-నిజమా అనుకుంటున్నట్టు, అంతలోనే అది నిజమే అని తనలో తనే నవ్వీనవ్వకుండా నవ్వుకోవడం బావుంది.
ఆశ, ఆశయం, ఆవేశం, ఆక్రోశం, ఇష్టం, ప్రేమ, పట్టుదల, నిస్సహాయత, తెగింపు - ఇలా అన్ని రకాల భావాలనూ, భావావేశాలనూ ఎక్కడా వంక పెట్టలేనట్టు నటించగలడు నాగచైతన్య అనిపించాడు ఈ సినిమాలో.
సాయిపల్లవి నాకు చాలా ఇష్టమైన dancer. ఇప్పట్లో తెలుగు సినిమాలో ఈ అమ్మాయిని మించిన నర్తకిని చూడబోము. Technicality ని మించిన grace వుంది తనలో. తెర మీద సాయిపల్లవి వుంటే మెరుపుతీగ మెలికలు తిరిగినట్టే! దానికి తోడు ఆడపిల్లకి అందాన్నిచ్చే - కనీకనిపించని సిగ్గు, దాంతో పాటే నవ్వితే వెలిగే కళ్ళు సాయిపల్లవికి సహజాభరణాలు.
ఈ సినిమాలో నాగచైతన్యకి అమ్మగా నటించింది - ఒకప్పటి బాపు బొమ్మ ఈశ్వరీ రావు (రాంబంటు సినిమా హీరోయిన్). నిజానికి ఈ సినిమాలో తను అసలు నటించినట్లే లేదు. ఒక తల్లిగా తనకి అనిపించినట్టు మసలినట్టనిపించింది. చూడ్డానికి చాలా బాగా అనిపించింది.
సాయిపల్లవికి తల్లిగా చేసిన దేవయానిని చూసిన వెంటనే ఓ పట్టాన పేరు గుర్తు రాలేదు. చూడగా చూడగా - అప్పుడెప్పుడో అరవడబ్బింగ్-అజిత్ సినిమా "ప్రేమలేఖ" లో రైలెక్కి దిగిన అమ్మాయి కదా - అని గుర్తొచ్చింది.
సినిమాలో అందరూ బాగా నటించారు - వాళ్ళ పాత్ర నిడివితో సంబంధం లేకుండా.
అన్నిటికన్నా నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే - రాజీవ్ కనకాలని ఈ సినిమాలో కనిపించిన ఐదు నిముషాలకి చంపేయకుండా సినిమా చివరిదాకా ఉంచడం. "అతడు" సినిమాలో తెర మీద కనిపించిన రెండంటే రెండు నిముషాల్లో తుపాకీతో కాల్చేస్తారు. అప్పట్నుంచి నేను చూసిన ఏ సినిమా లోనూ రాజీవ్ కనకాలని సినిమా చివరి దాకా చూసిన గుర్తు లేదు. ఈ "లవ్‌స్టోరి" సినిమాలో ఇతన్ని చూస్తే - కనిపించిన ప్రతీసారీ "ఇదేం మనిషిరా!" అనిపిస్తుంది. కొట్టెయ్యాలన్నంత కోపం వస్తుంటుంది. అంటే విలన్‌గా రాజీవ్ అద్భుతంగా చేసినట్టేగా!
ఈ సినిమా మొత్తంలో - నచ్చిన ఇంకొన్ని విషయాలు:
హీరోయిన్ని, హీరోయిన్ వాళ్ళమ్మని బుఱ్ఱ లేనట్టు చూపించకుండా
- ఆలోచించగలిగి నిర్ణయాలు తీసుకోగలిగే నిజజీవితపు ఆడవాళ్లలా చూపించడం.
హాస్యపాత్రధారులని హీరో చేత కొట్టించకపోవడం.
వయసులో పెద్దవాళ్లయిన హాస్యపాత్రధారులని హీరో చేత "ఏంట్రా, ఒరే" అనిపించకపోవడం.
సినిమాలో ఉన్న ఇళ్ళన్నీ బాపు-కుటీరాల్లా, కళాఖండాల్లా కాకుండా ఆర్ధిక పరిస్థితికి తగ్గట్టు పరిసరాలని సహజంగా ఉంచడం.
ఈ సినిమాలో ముఖ్యంగా నచ్చినది - ఆడపిల్లలకి సంబంధించిన చాలా సున్నితమైన విషయాలని ఏ మాత్రం అసభ్యత లేకుండా - చెప్పాల్సిన విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ఎంతో clean గా చూపించడం శేఖర్ కమ్ములకే చెల్లింది. దర్శకులకి కూడా నక్షత్రాలు ఇవ్వగలిగితే శేఖర్ కమ్ముల మాత్రం "శుభ్ర-నక్షత్రం" (Clean Star) అబ్బా!
ఇక పాటలు - అక్కడ సినిమాలో వినడానికి బానే ఉన్నాయి కానీ ఇప్పుడేమీ పాడుకునేంతగా గుర్తు లేవు.
గుర్తున్న రెండు పాటల్లో - ఒకటి - "నీ చిత్రం చూసి - నా చిత్తం చెదిరి - నే చిత్తరువైతిరయ్యో!... ఇంచు యించు లోన పొంచి వున్నఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో!" పాటలో మాటలు బావున్నాయి. "ఇంచు యించు (inch) బదులు ఇంకేమైనా అచ్చతెలుగు మాట పడి వుంటే ఇంకా బావుండేది.
ఇంకో పాట "సారంగదరియా" మాత్రం సినిమాలో చూడడానికి బానే ఉంది కానీ - కానీ ఏంటో తేలిపోయినట్టనిపించింది. ఏదో missing! పాటలో హార్ట్ లేదబ్బా!
చివరాఖరిగా ఈ సినిమాలో నాగచైతన్య గురించిన నా మాట "జీరోకెళ్ళి ఒచ్చినాడు సర్ ... శానా కష్టపడినాడు సర్!"
సైన్మా జూడాలె ... నచ్చితే జెప్పాలె !
ఇగో జెప్తున్నా... "లవ్‌స్టోరి" చూశినామబ్బా!
~ సినీ-మా-లక్ష్మి

mee post sadivinamabba. manchitanam ga undaadabba!
రిప్లయితొలగించండిశానా ట్యాంక్సబ్బా!
తొలగించండిఅక్కా మీ కూలంకషమైన విశ్లేషణ చదివిన తర్వాత ఇప్పటి సినిమా విశ్లేషకుల కంటే ఎంతో చక్కగా ఎక్కడ ఏ కోణంలో వ్యాఖ్య చెయ్యాలో అక్కడ అత్యంత పరిణితి తో కూడుకున్న తెలుగు పదాల కూర్పు తో చేసిన నిర్మాణాత్మకమైన వ్యాఖ్యానమునకు జోహార్లు చెప్పకుండా ఎలా ఉండగలం.
రిప్లయితొలగించండిఇంకా సాయి పల్లవిని, ఈశ్వరీ రావుని, శేఖర్ కమ్ముల ప్రతిభని వర్ణించిన తీరు అమోఘం. కొన్ని పేరాలూ, పదాలూ మళ్ళీ మళ్ళీ చదవసొంపుగా ఉన్నాయి. శుభ్ర - నక్షత్రం
సంభాషణలో కోస్తా, తెలంగాణా భాష వాడారు, ఎక్కడోక్కడ రతనాలసీమ భాష కూడా వాడేయాల్సింది.
మొత్తానికి ఓవర్సీస్ సినీ క్రిటిక్ గా ఎంటర్ అయిపోవచ్చు. ఆ పోస్ట్ లోటు తీర్చెయ్యచ్చు మీ ద్వారా
తెగ పొగిడేశావ్ తమ్ముడూ...ఎంతైనా అక్కని కదా మరి! థాంక్స్!
తొలగించండిలవ్ స్టొరీ సినిమా నాకూ నచ్చింది. మీకు అనిపించినట్లుగానే నాకూ అనిపించింది.
రిప్లయితొలగించండిబావుంది కదా, పద్మజా! థాంక్స్ నా బ్లాగ్ చదివినందుకు.
తొలగించండి