ఆ పాట -
అప్పటిదాకా
అంతకు ముందెప్పుడూ
వినివుండని ఓ పాట...
ఆ పాట -
ఊసుపోని ఓ సాయంకాలాన
అలలుగా సోకిన పాట...
కలలుగా తాకిన పాట...
ఆ పాట -
అప్పటినుంచీ
ఆ తర్వాతెప్పుడూ
వినకుండనివ్వని పాట...
ఆ పాట -
విన్నపాటున
గుండె మాటున
దాగి ఉండి
ఊగి ఊగి
తూగుతుంటుంది
ఆ పాట -
చిన్న మాటగ
చిగురు పాటుగ
జారి పడి
సోలి సోలి
తూలుతుంటుంది
ఆ పాట...
పదము పదము కలిసిన
అదే పాట -
పదము పదము కలిపి
నాతో పాటు -
నడు... నీతో నేనొస్తానంటుంది
ఆ పాట...
పొరపాటున-
ఆదమఱచి...
పాట మఱచి...
నేనుంటే -
మారాముల ఆ పాట
అలిగి పాపాయౌతుంది...
గారాబుల ఆ పాట
రాగమై అల్లుకుంటుంది...
*** *** ***
*** *** ***
నాకు నచ్చిన పాటలు బోల్డన్ని వింటుంటా.
నచ్చినదేదో ఒక పాట బోల్డన్నిసార్లు వింటుంటా.
ఆ పాట విన్న ప్రతి సారీ - అదే మొదటిసారన్నట్టు వింటుంటా.
వింటున్న ప్రతీ సారీ మొదటిసారి ఆ పాట విన్న రోజుని గుర్తు చేసుకుని మురిసిపోతుంటా.
ఇలా వింటూ వుండడం, తలుచుకోవడం, మురిసిపోవడం చేస్తూ - నాకు తోచినట్లు అనుకుంటుంటా...
అలా విన్న పాటని అనుకుంటూ ఉంటుండగా - అనుకున్న పాటని వింటూ వుండగా - ఆ పాట ఇక ఉన్నచోట ఊరికే ఉంటుందా?
ఉబికి ఉరికి పెదవుల మీదకొచ్చి - అక్కడే కులికి ఉలికి - అక్కడితో ఆగక - "నా గురించి కబుర్లు చెప్పూ...ఇంకా-చెప్పవేమ"ని సతాయిస్తుంది.
ఉలుకుతున్న పాటని పలుకుతుండమని - పలుకుతున్న పాటని పట్టించుకోకుండా ఉందామని - ఇంటి బయటి దారి చూసి రమ్మని చూపుల్ని పంపుతానో లేదో ... గాలి తోసుకొచ్చిన ఆగమేగాలేవో ఇక సాగలేక - అక్కడే ఆ మలుపులో ఆగి అలుపు తీర్చుకుంటుంటాయి.
ఇంతలో ఏ నల్లమబ్బో కమ్ముకొస్తుంది. వానజల్లు ౘల్లిపోతుంది.
ఆ వానకి తడిసిన ఆకొకటి మెరిసిపోతుంటుంది.
ౘల్లటి చినుకు తాకిన పువ్వొకటి నవ్వుతుంటుంది.
జల్లుకి మురిసిన మొగ్గొకటి విరిసిపోతుంటుంది.
నేల మీద సాగుతున్న ఈ కోలాహలమేమిటా అన్న కుతూహలమో ఏమో - నింగి నుండి - రంగులద్దుకున్న ఒయ్యారాల వానవిల్లొహటి - ఒంగి - తొంగి చూస్తూ వుంటుంది.
కిటికీ లోంచి - చినుకుల చిందులూ, ఆకుల మెరుపులూ, పువ్వుల మురిపాలూ, మొగ్గల విరిపాలూ, వేలుపువిల్లు సోలుపులూ - ఇన్ని చూస్తున్న నా పెదవుల మోగుతున్న పాట - పదే పదే ఆగక - అదే అదే మూగుతూ - నన్నొదలి కదిలి తనెళ్లక - తననొదిలి వెళ్ల నను కదలనీక - నా చేయి పట్టి లాగుతూ ఆడుకుందాం రమ్మని మారాం చేసే పాపాయిలా తోస్తుంది.
గారాలు పోతున్న ఆ రాగాల పాటని - నా కబుర్లలో రాస్తే - ఆ కబుర్లకి కట్టుబడి - కదలలేని పాట ఇంకెప్పటికీ నన్నొదిలిపోక - నాతోనే ఉండిపోతుంది కదా అనిపిస్తుంది.
అనిపించినదే తడవు కైత ఒకటి - మాట మీద మాటగా - తెరలి తెరలి- మాటలు మాటలుగా - మాటలమూటగా - తరలి తరలి వస్తుంది.
పాట గురించి నే రాయబోయే కబుర్లకి - అదిగో... ఆ ముందు మెట్లుమెట్లుగా రాసినదేదో ఉందిగా - ముందు రాసిన మాటలుగా - ముందుమాటై కుదురుకుంటుంది.
*** *** ***
*** *** ***
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే -
ఎప్పట్నుంచో తన గురించి రాయమని నా చెవినిల్లు కట్టుకుని రాగాలు తీస్తున్న రాలుగాయి పాటొకటుంది.
ఆ పాటకో కథ ఉంది.
ఆ కథా-కమామీషూ ఎలాంటివంటే...
అనగనగా... అమెరికాలో అడుగు పెట్టిన మొట్టమొదటి సంవత్సరం.
అప్పుడు వెళ్ళిన మొట్టమొదటి తెలుగు అసోసియేషన్ సాంస్కృతిక కార్యక్రమం.
అక్కడ - వేదిక మీద ఒకాయన, ఇంకొక ఆవిడ కలిసి - వేడుకగా - తెలుగూ, హిందీ భాషల్లో చాలా పాటలు పాడారు.
అప్పుడే మొట్టమొదటిసారి ఒక హిందీ పాట విన్నాను. ఆ పాడిన ఆయన ఎవరో ఆ పాట చాలా బాగా పాడారు. వినగానే పాట భలే నచ్చేసింది.
పాటతో పాటు - పాడిన ఆయన పాడుతూ పాడుతూ - ప్రేక్షకుల్లో కూర్చుని పాట వింటున్న తన భార్య కేసి చూస్తూ - ఆజ్ కీ శామ్...ఆప్‌కే నామ్... - అని ఆ పాటని ముగించడం - అది వింటూ ఆవిడ బోల్డంత సిగ్గుపడుతూ సంబరపడడం - ఇంకా ఇంకా బోల్డంత నచ్చింది.
కాకపోతే పాడిన ఆయన, పాట అందుకున్న ఆవిడ - వాళ్ళెవరో నాకు అప్పుడు తెలీదు. ఇప్పటికీ తెలీదు.
కానీ అప్పుడు తెలిసిన పాట ఇప్పటికీ ఆ సాయంకాలపు అందమైన జ్ఞాపకంగా నాతో ఉండిపోయింది.
*** *** ***
*** *** ***
అప్పటి ఆ పాటని - గుర్తు పెట్టుకుని, అలాగే అట్టిపెట్టుకుని - ఆ తర్వాత యూట్యూబ్‌లో ఆ పాటని వెతికి పట్టుకుని - ఇప్పటికి లెక్కపెట్టలేనన్నిసార్లు విన్నాను.
ఈ పాట ఒక మత్తుపాట. అంతటి మత్తుపాట కూడా రఫీసాబ్ గొంతులో మెత్తగా, గమ్మత్తుగా పలుకుతుంది.
ఉయ్యాల ఎక్కినట్టు తూగుతుంది. గాలి వాలున సోలినట్టు తూలుతుంది.
పాటలోని షరాబీ-నిషాని ఖరాబ్ చేసే హిచ్‌కీ శబ్దాలు ఏమీ లేకుండా హాయిగా ఊగుతూ సాగుతుంది.
ఈ పాటలో ధర్మేంద్రకి ఓ నల్లరంగు సూటూ-బూటూ వేసి, షర్మిలా ఠాగూరుని ఒక అందమైన లేసులున్న తెల్లచీరలో చుట్టి - పాటని ఒక అందమైన ప్రేమనగర్ లాంటి ఇంట్లో చూపిస్తే - వినిపిస్తున్న రఫీసాబ్ గొంతు లోని క్లాసిక్-స్థాయిని కనిపిస్తున్న దృశ్యం కూడా అందుకునేది.
ప్రస్తుతానికి పాటలో ఉన్న సెట్టింగ్, వాతావరణం గ్లాసుల-స్థాయి లోనే ఉండిపోయింది.
కాకపోతే పాటని ఇష్టపడడానికి ఆ గ్లాసుల-క్లాసు అంతగా అడ్డం రాలేదు.
*** *** ***
*** *** ***
ముందుగా ఆ పాట ప్రవర ఇదీ...
పాట ఉన్న సినిమా నేను పుట్టక ముందొచ్చిన "మేరే హమ్దమ్ మేరే దోస్త్" సిన్మా లోది.
పాటని పుట్టించినవారు - మజ్రూ సుల్తాన్‌పురి గారు.
పాటకి మేళం కట్టించినవారు - లక్ష్మీకాంత్-ప్యారేలాల్ గార్లౌ
(మీరు సరిగ్గానే చదివారు - ఒక్కరైతే "గారు", ఇద్దరికన్నా ఎక్కువ మందైతే "గార్లు", ఇద్దరైతే "గార్లౌ" - అన్నది నా సంస్కృత పాఠ పఠన జనిత జ్ఞానం.)
పాటలో కనుపట్టైనవారు - ధర్మేంద్ర, షర్మిలా ఠాగూర్, ఒక సర్వర్ వారు, ఓ పానాసక్త-పురుషాష్టకం - వెరసి తెర నిండుగా - ఓ పది మందికి పైగా మందీ, వారు తాగుతున్న మదిరా, వారిలో ఒకే ఒక్క మదిర ముట్టని ముదిర.
*** *** ***
*** *** ***
ఇహ పాట విషయానికి వస్తే...
పాటలో చూపులకి నచ్చినవి -
ఎరుపూ-ఆకుపచ్చ రంగుల్లో వేలాడుతూ కనిపించిన కొమ్మలశెమ్మెలు (Chandeliers) రెండు -
తళుకులద్దిన ఎఱ్ఱటి చీరలో విరిసిన మందార పూల కొమ్మలా మెరిసిపోతున్న కొమ్మ షర్మిలా -
షర్మిలా ఎఱ్ఱచీరకి జతగా ధర్మేంద్ర మెడలో ముడేసుకున్న ఎఱ్ఱరుమాలు-
ఈ పాటలో చెవులకి నచ్చినవి -
రంగ్-ఓ-బూ - అంటే పూలకుండే రంగూ, సుగంధమూ అట
జామ్-ఏ-మయ్ - ఇది పానపాత్రకో మజా అయిన పిలుపు
శాఖ్-ఏ-బదన్ - వాహ్...వాహ్... కొమ్మ లాంటి తనువు ఆ కొమ్మదట, అందాలబొమ్మదట...
ఈ కింద రాశాను చూడండీ ... కొన్ని వాక్యాలూ... అవి పాడేటప్పుడు - ఈ పాట రఫీసాబ్ గొంతులో డోలలూగిన లీల అద్భుతం... ఆ హేల వేరెక్కడా వినం వినం...
యే రంగ్-ఓ-బూ కే...
హోఠోం కో ఛూకే...
పీ హై సభీ నే...
ప్యాలోం కే సీనే...
బాహోం మే డాల్ లే...
వో హీ సంభాలే...
*** *** ***
*** *** ***
కింద నేను రాసుకున్న పాట పాడుకుంటూ చూడాలనుకుంటే - ఇదిగో - ఈ కిందనే ఉంది ...
యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=lsnrYj1rOKc
*** *** ***
*** *** ***
ఛల్‌కా యే జామ్... ఆయియే...
ఆప్‌కీ ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్...
ఛల్‌కా యే జామ్... ఆయియే...
ఆప్‌కీ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్...
ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్...
ఫూల్ జైసే తన్ పే - జల్‌వే...
యే రంగ్-ఓ-బూ కే...
యే రంగ్-ఓ-బూ కే...
ఆజ్ జామ్-ఏ-మయ్ ఉఠే
ఇన్ హోఠోం కో ఛూకే...
హోఠోం కో ఛూకే...
లచ్‌కాఇయే ... శాఖ్-ఏ-బదన్...
మెహ్‌కాఇయే... జుల్ఫోం కీ శామ్...
ఛల్‌కా యే జామ్... ఆయియే...
ఆప్‌కీ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్...
ఆప్‌కీ హీ నామ్ లేకర్
పీ హై సభీ నే...
పీ హై సభీ నే...
ఆప్ పర్ ధడక్ రహే హై
ప్యాలోం కే సీనే...
ప్యాలోం కే సీనే...
యహా అజ్‌నబీ - కోఈ నహీ...
యే హై ఆప్‌కీ - మెహ్‌ఫిల్ తమామ్...
ఛల్‌కా యే జామ్... ఆయియే...
ఆప్‌కీ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్...
కౌన్ హర్ కిసీ కీ బాహే...
బాహోం మే డాల్ లే...
బాహోం మే డాల్ లే...
జో నజర్ నషా పిలాయే
వో హీ సంభాలే...
వో హీ సంభాలే...
దునియా కో హో - ఔరోం కీ ధున్
హమ్ కో తో హై - సాకీ సే కామ్
ఛల్‌కా యే జామ్... ఆయియే...
ఆప్‌కీ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్...
ఛల్‌కా యే జామ్... ఆయియే...
ఆప్‌కీ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్...
ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్...
*** *** ***
*** *** ***
పాట వినబోతే బావుంది కానీ రాయబోతే తెగ సతాయించింది.
అది "ఛల్‌కా యే జామ్ ... ఆప్‌కీ ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్... " - అంటే "చిందింది ఈ మదిర నీ పెదవుల కోసం, నీ కన్నుల కోసం" - అనా?
లేకపోతే - ఛల్‌కాయే జామ్ ... ఆప్‌కీ ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్... " అంటే "చిందిద్దాం మదిర - నీ పెదవుల కోసం - నీ కన్నుల కోసం"- అనా?
అలానా - ఇలానా - అనాలోచించి - చివరికి నాకు నచ్చినట్లు - అది ఛల్‌కా యే జామ్ అన్నట్టే రాసుకున్నా.
నేనెప్పట్నుంచో రాయాలనుకున్న మత్తుపాటల్లో మొదటిదైన ఈ గమ్మత్తు పాటని - ఏ అనామత్తుఖాతా గానో జమ కట్టి పక్కకు నెట్టెయ్యక - కిమ్మత్తు కట్టలేని రఫీసాబ్ గళంలోవిని - ఆనందిస్తారని అనుకుంటూ...
~ పాటల భైరవి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి