1, ఏప్రిల్ 2012, ఆదివారం

అవసరమా...అంతర్జాతీయ మహిళా దినోత్సవం?

మార్చ్ "విహంగ"లో నా వ్యాసం ఇక్కడ చదవండి.


మార్చ్ "విహంగ"  పత్రికకి వ్యాసం పంపించాలి - గడువు దగ్గర పడుతోంది - ఏ విషయం మీద వ్రాద్దామా, అంత ఆసక్తి కలిగించే విషయాలు ప్రపంచం లో ఏం జరుగుతున్నాయా అని ఆలోచిస్తూ వుండగా ప్రక్క నుంచి ఫోన్ మ్రోగుతున్న శబ్దం వినిపించింది. కాలర్ ఐడీ లో నా ప్రియ నేస్తం పేరు కనిపించగానే ఒకసారి "హాయ్ హాయ్" అనుకుని ఫోన్ తీశాను. ఎప్పటిలాగే "బావున్నావా" అంటే "బావున్నావా" అనుకుని నెమ్మదిగా సన్నటి వాన జల్లులా మొదలైన మా సంభాషణ జడివాన స్థాయి వడిని అందుకని ఒక విషయం నుంచి ఇంకొక విషయానికి పరుగులు పెడుతూ వున్నప్పుడు అలవాటు ప్రకారం మా మాటలు, మనసులు మాకెంతో ఇష్టమైన మేము కలిసి చదువుకున్న మహిళా విశ్వ విద్యాలయం వైపుగా మళ్ళాయి. వెంటనే అన్ని విషయాలతో బాటుగా మార్చ్ లో వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము పాల్గొని గెలిచిన పోటీలు, డిబేట్ పేరుతో జరిగిన సరదా వాదోపవాదాలు గుర్తుకొచ్చాయి. అంతే...అరెరే..ఇంత మంచి విషయం పెట్టుకుని ఏంటబ్బా ఇంత ఆలోచిస్తున్నాను. సరి అయిన సమయం లో ఎంత మంచి టాపిక్ గుర్తుకొచ్చింది కదా - నా మార్చ్ వ్యాసానికి  "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" కన్నా మంచి విషయం ఏముంటుంది కదా అనే తెగ మురిసిపోయాను. నా నేస్తం తో మాట్లాడడం అయి ఫోన్ పెట్టేయగానే అతి ఉత్సాహంగా వ్రాసేద్దామని (అదే టైపు చేసేద్దామని) అనుకుని లాప్టాప్ తీసుకోగానే మొట్ట మొదటగా నాకై నాకే అడగాలి అనిపించిన ప్రశ్నలు ...అవునూ ఇంతకీ "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" అంటే ఏంటి? అసలెందుకు చేసుకుంటారు? చెప్పద్దూ...కొంచెం అని మొహమాటానికి చెప్తున్నాను కానీ కొంచెం "బాగానే" సిగ్గుగా అనిపించింది - ఇంట్లో మొదటి ఆడపిల్లగా పుట్టి, ఇంకో ఇంటికి పెద్ద కోడలిగా వచ్చిన నేను, మహిళా విశ్వ విద్యాలయం లో చదివిన నేను, బోల్డంత మంది మంచి అమ్మాయిలకి స్నేహితురాలనయ్యే అదృష్టం కలిగిన నేను - గంభీరం గా చెప్పాలంటే ఒక మహిళకి పుట్టి, ఇంకో మహిళ ఇంటిని మెట్టి, అనేక మహిళా స్నేహిత బృందాదృష్ట సంహితనైన నాకు  (ఇది మహా దుష్ట సమాసం అయి ఉండొచ్చు...చదువరులూ - ఈ ఒక్కసారికీ క్షమించేయండి!) మహిళలకి అంత ముఖ్యమైన, అంతర్జాతీయ స్థాయి దినోత్సవం గురించి అసలేమీ తెలియనందుకు. 

వెంటనే గబా గబా గూగుల్ శోధనా పేటిక లో "International Women's day" అని టైపు చేశాను. వచ్చిన ఫలితాల్లో ఐదవ లింక్ అయిన వికీపీడియా మీద క్లిక్ చేసి అక్కడ వున్న విషయమంతా చదివాను. హ్మ్...ఎందుకో మరి అంత గొప్పగా అనిపించలేదు. 

 "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర  దేవతః" - అని చెప్తూ సర్వ మానవులకూ జీవనావసరమైన శక్తికి స్త్రీ రూపమిచ్చిన భారత దేశం లో పుట్టి అంత బేలగా మారి -  నన్ను గుర్తించండి, నాకు వనరులు కూర్చండి, వసతులు కల్పించండి - అంటూ అదేదో మహిళ అంటే ఒక రక్షిత పథకం లో పరిగణన లోకి తీసుకోవాల్సిన జాతిగా అనుకుంటూ, అందులో నేనూ ఒక భాగంగా - మహిళా దినోత్సవం అని ఒక రోజుని అనుకుని, దానికిఅభినందనలు తెలుపుకుని, అందుకుని, బహుమతులు తీసుకుని మురిసిపోవాలి అనిపించలేదు. అలా అని నాకు బాధిత మహిళల మీద, వాళ్ళు పడే బాధల మీద చిన్న చూపూ లేదు, వీళ్ళేమీ చేయకపోతే ఎందుకిలా అవుతుంది - చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత అనుకునే ఏక పక్ష దురభిప్రాయమూ లేదు. వీలైతే అలాంటి వాళ్లకి సానుభూతి చూపడంతో ఆగిపోకుండా చేతనైనంత సహాయం చేయాలనీ వుంటుంది. వాళ్ళనలా భయం భయంగా పెంచిన తల్లులని తలుచుకుని బాధ, ఆ స్త్రీల భయాలని, బలహీనతలని ఆసరాగా తీసుకుని తమకి అనుకూలంగా ఉపయోగించుకునే వారిని  చూసి కోపం వస్తూ వుంటాయి. అలా ఉపయోగించుకునే వారిలో వారి సాటి స్త్రీలే వుండడం వింతగా అనిపిస్తుంది. 

నేనేంటో మరీ సీరియస్ గా ఏదేదో ప్రసంగ ధోరణిలోకి వెళ్లిపోతున్నట్టు వున్నాను...బాబోయ్...బయటికి వచ్చేస్తున్నాను...నాదైన దారిలోకి...

అసలు ఎప్పట్నుంచో మన దేశం లో - కడుపు నింపే అన్నపూర్ణ, చదువులిచ్చే సరస్వతి, సంపద నిచ్చే లక్ష్మి - ఇలా మనిషికి కనీసావసారాలు తీర్చే ఆహార, విద్యా, ధనాలు అన్నీ స్త్రీ రూపాలే. గొప్పగా విద్వత్తు ప్రదర్శించే పురుషులని "పుంభావ సరస్వతి" అని పిలుస్తారు కదా! మరి మనం ఆడవారిగా పుట్టినందుకు గొప్పగా అనుకోక మనమేంటి, మనకి మనమే తక్కువ చేసేసుకుని సమానత్వం-సమాన హక్కులు అని నినాదాలు చేయడమేంటి, దినోత్సవాలు జరుపుకోవడం ఏంటి?

ఏ ఇంట్లో పని చేసే పని అమ్మాయినో, ప్రతి బిల్డింగ్ దగ్గర ఇటుకలు మోసే కూలీ యువతినో కదిపి చూడండి. వారికి తామూ సంపాదించాలి అన్న ఆలోచన, ఈ పని పోతే వేరే పని దొరుకుతుంది అన్న ధీమా తప్ప ఏ సమానత్వ వాదనకూ టైమూ, తీరికా వున్నట్టు అనిపించదు.

అదే ఏ సెలెబ్రిటి వనితనో తీసుకుంటే తన వృత్తి, అందులో తాను ఎక్కగలిగే సోపానాలు, పొందిన అర్హతలని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్ప తాము ఎవరి కన్నానో తక్కువేమో అనుకునే భావనే కనిపించదు.

 అసలు ఆలోచిస్తే ఈ సమానత్వం గొడవలు మనుషుల్లో తప్ప ఇంక ఏ జీవ రాశిలోనూ వున్నట్టు అనిపించదు- శరీర ధర్మానికి తగినట్టు విధులు నిర్వర్తించడం తప్ప ఇంకే జీవులూ ఆడ - మగ భేదాలకి  అంత ప్రాముఖ్యత ఇస్తున్నట్టు కనిపించవు. సర్లెండి! నేను పరకాయ ప్రవేశం  చేయలేను కాబట్టి ఇంత కన్నా నొక్కి క్కాణింలేను. ఇప్పటికి ఇది ఇలా వదిలేసి అసలు మహిళా దినోత్సవం మనస్పూర్తిగా జరుపుకోవడానికి ఒక గొప్ప కారణమేదైనా కనపడుతుందేమో చూడాలి.

రండి, రండి! ఇక్కడేదో పార్టీ జరుగుతున్నట్టుంది - రకరకాల చీరలు, లేటెస్ట్ నగలూ కనిపిస్తున్నాయి - పదండి మరి చూసొచ్చేద్దాము...
ఆ అమ్మాయి ఎంత బాగా అలంకరించుకుంది! ప్రక్కనే వున్న ఆవిడ తో కబుర్లు చెప్తోంది - కళ్ళల్లో మెఱుపులు మెరిపిస్తూ...ఒక చెవి అలా వేద్దామా (అవునండీ...నాకూ తెలుసు ఇంకొకళ్ళ మాటలు వినకూడదని - కానీ మనమిక్కడ ఎలాగైనా సరే మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ఒక్క మంచి కారణమైనా వెతుక్కోవాలి కదా....)

హాయ్! ఎలా వున్నారు మీరు?
బావున్నామండీ...మీరెలా వున్నారు?
మళ్ళీ ఏదో లేటెస్ట్ జుయెలరి కొనుక్కున్నట్టు వున్నారు...
అవునండీ ...మొన్ననే ఇండియా నుంచి మా అత్తగారు తెచ్చారు...
(అర్రే! అదేంటి ఆ వినే ఆవిడ మొహం అలా అయిపోయింది - ఓహో...అత్తగారితో అన్యోన్యంగా వుండడం, అత్త అమ్మలా ఆభరణం పంపడం నచ్చలేదేమో !!!??? ఎలా మాట మార్చేస్తోందో చూడండి )
ఓ అలాగా! అది సరే కానీండి. అదిగో అక్కడ నుంచున్న వనితని చూసారా? మీకు ఆవిడ తెలుసా?
వనిత, నేను ఒక టీం లోనే చేస్తున్నామండీ...నాకు మంచి ఫ్రెండ్.
నిజమా! ఆవిడ ఎంత సింపుల్ గా వున్నారో చూడండి. ఎలా అయినా తెలివైన వాళ్ళు అంతే అండీ మనలాగా డ్రెస్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళలో ఆ నాచురల్ గ్లో వుంటుంది ఏ నగలూ పెట్టుకోకపోయినా....
(:( మీరూ కనిపెట్టారా - పాపం ఆ అమ్మాయి మొహం ఎలా చిన్నబోయిందో...సర్లెండి....ఇంకిక్కడ మనకేమీ దొరకదు - ఎంత చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నా బయట పడకుండా ఉండలేని అసూయా విహారం తప్ప...పదండి, పదండి...)

అదిగదిగో అక్కడ ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటున్నారు - విందామా? (నేను వినేది మీరు వినలేరు కాబట్టి - మీరు చదవండి దయచేసి...)

ఏంటో  వదిన గారు! నల్ల పూసైపోయారు ఈ మధ్య...ఏంటి విశేషం?
కలవకూడదని ఏం లేదండీ ...ఇదిగో మా కోడలు నీళ్లోసుకుంది. చంటి పిల్ల వుంటే హడావిడి మీకు తెలియనిదేముంది. 
చంటి పిల్ల అంటున్నారు, వదినగారూ! మళ్ళీ మైనస్సేనా అయితే!
ఎంత మాటండీ ! దుర్గా, లక్ష్మీ, సరస్వతుల్లాగా ముగ్గురు మనవరాళ్ళు నాకు. అందరినీ కూడుకు కలుపుకు పోయే వాళ్ళే కానీ తీసివేయదగిన వాళ్ళు కాదు సుమండీ!

ఎంత చక్కని మాట చెప్పారు కదండీ - ఆ ముగ్గురు మనవరాళ్ళ మామ్మగారు?! అంత ఉన్నత వ్యక్తిత్వ ఛాయలో పెరిగిన ఆ ఆడపిల్లలు ఇంకెన్ని గొప్ప ఆలోచనల కొమ్మలకి అంట్లు కడతారో కదా! ఇద్దీ ...ఇదే మరి నాకు కావాల్సిన ఒక మంచి సందర్భం....

అసలు మన ఆడ వాళ్ళందరికీ వ్యక్తిత్వ వికాసపు తరగతులు తప్పనిసరి అయితే బాగుండును. ఆ తరగతిలో పాఠ్యాన్శంగా - ఇదిగో ఇవన్నీ వుండాలి...

- అసూయ కూడదు
- మాట్లాడే మాటకి అర్థమే తప్ప అపార్థాలు వుండకూడదు 
- చదువంటే కళాశాలలోనే కాదు - ఇంటిలోనూ, వంటింటి లోనూ చదవాలి 
- ఉద్యోగాలలోనే కాదు ఇంట్లోనూ గెలవాలి 
- పెళ్ళవగానే  ఒక ఆరు నెలలు తప్పకుండా అత్తా-కోడలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించాలి, సంతోషంగా కలిసి ఉండడానికి ఒకరినొకరు మన్నించుకోవాలి
- అమ్మ అయితే ఆడ పిల్ల కావాలనుకోవాలి
- మగ పిల్లవాడు పుడితే నడిచొచ్చే కూతురు (కోడలు) వస్తుందని మురవాలి 

అసలివన్నీ చెప్తున్నానని ఇప్పటికే చాల మందికి నా మీద బోల్డంత కోపం వచ్చేసి వుంటుంది - మరీ పాత చింత కాయ పచ్చడి  కబుర్లు చెబ్తున్నానని. 

కానీ - అమ్మలూ, అమ్మాయిలూ.....- చిన్నప్పట్నుంచీ మీరూ వినలేదూ? పెద్దల మాట చద్ది మూట అని....అందరితో కలిసి, అందరినీ కలుపుకుని బ్రతుకు చల్లగా సాగిపోవడానికి అది చాలదూ...

సరే ...ఇంకో మాట చెప్తాను ....

ఇదివరకటిలా కాక  - ఇది నా ఊహ మాత్రమే సుమండీ - ఇప్పటికన్నా అప్పటి ఆడవారే సుఖంగా వున్నారేమో తెలీదు - ఎందుకంటే ఆ రోజుల్లో ఆడవారు ఇంటిపట్టున వుండి ఇంటికి పరిమితమైన పనులు చేస్తూ, శారీరక, మానసిక సున్నితత్వాన్ని కోల్పోకుండా జీవితాన్ని సాఫీగా గడిపారేమో అనిపిస్తూ వుంటుంది. అందరూ సుఖమే చూశారు, బాధలు పడ్డవారు లేరని కాదు. కాకపోతే ఆ బాధలకి తోడు ఈనాటి ఉద్యోగ బాధ్యతలు, అన్నీ తామే చూసుకోవాలనే "సూపర్ వుమన్ సిండ్రోములూ" లాంటివి ఉండేవి కాదు.  కాని- పుస్తకాల్లో చదివి, సినిమాల్లో చూసి ఊహించేసుకుని ఏర్పరచుకున్న భావాల ఆధారంగా - ఆ రోజులతో పోల్చుకుంటే  ఈ రోజుల్లో చాలా వరకూ ఆంక్షలు తగ్గి అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా విదేశాలకి కూడా ఒంటరిగా వెళ్లగలుగుతూ స్వేచ్ఛని సంపూర్ణంగా అనుభవిస్తున్నారు కదా ...

అలాగే మన అందరికి "అప్ గ్రేడ్స్ " అంటే ఇష్టం కదా...
అందుకని International Women's Day ని International Humans Day గా అప్ గ్రేడ్ చేసేసుకుందామా? 
అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుంచి అంతర్జాతీయ "మానవ" దినోత్సవం గా మార్చేసుకుందామా?
ఏం ఆడవారికేనా  అవసరం - అంతర్జాతీయ దినోత్సవం?

~లలితా TS

దేవులపల్లి వారి "కృష్ణ" కౌముది

ఫిబ్రవరి "విహంగ" లో నా వ్యాసం ఇక్కడ చదవండి.


(ఫిబ్రవరి 24న శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి 32 వ వర్ధంతి సందర్భంగా ఆయన వ్రాసిన కొన్ని సినిమా పాటలను మరొక్కసారి ఇష్టంగా మననం చేసుకుంటూ నా ఈ వ్యాసం....)

మనకు తెలుగునాట కొన్ని తరాలుగా అందమైన పద జిగిబిగితో తెలుగువారిని అలరిస్తున్నరచయితలు, కవులు చాలా మంది వున్నారు. అలాంటి వాళ్ళల్లో "తన బాధ లోకం బాధగా" పంచినా తీయని హాయయిన  నొప్పినే పంచారు శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు.

సౌరభము  లేల  చిమ్ము   పుష్పవ్రజంబు ?
చంద్రికల  నేల వెదజల్లు  చందమామ ?
ఏల సలిలంబు  పారు ? 
గాడ్పేల  విసరు ?....

అని ప్రకృతిలో సహజంగా జరిగే వాటిని మరొక్కసారి ఎత్తిచూపుతూ తను భావకవిత్వం వ్రాయడం కూడా అంతే సహజంగా జరిగింది అని చమత్కారంగా మనకి చెప్పకనే చెప్పారు శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారు. ఆయన కృష్ణ పక్షం, ప్రవాసం, ఊర్వశి లాంటి కవితా సంకలనాలతో పాటు ఎన్నో తీయని తెలుగు సినిమా పాటలు తెలుగువారికి అందించారు. అందులో కొన్ని వెన్నెల తునకల వెలుగులు,  మది చల్లబరచే "సినీ గేయ" శీతలాలు ఇవిగో......

అది మల్లెల వేళయని, అది వెన్నెల మాసమని తొందరపడి కూసిన కోయిలలా కుమిలిన ఆ అన్న  చెల్లి - ఆ ఇద్దరి బాధని అది మన బాధేనేమో అనిపించేలా మన మనసంతా కృష్ణ పక్షపు అమ్మవాస్య నలుపుని నింపుతుంది దేవులపల్లి గారి "సుఖ దుఖాల " అల్లిక.

***ఇల్లు  వాకిలి ఒళ్ళు మనసు ఈశుని కొలువనిపించాలి
ఎల్ల వేళలా మంచు కడిగిన మల్లె పూవనిపించాలి - 
అలాంటి  అడుగడుగునా, అందరిలోనూ గుడి వున్న ఒక అందమైన పల్లెటూరిలో -
గురివింద పొదకింద గొరవంక , గోరింట కొమ్మల్లో కోయిల్లు  పలుకుతుంటే
కడివెడు నీళ్ళు కళ్ళాపు జల్లి, కావెడు పసుపు గడపకు పూసి, ముత్యాల ముగ్గులు వేసి, ఆ రతనాల ముగ్గుల్లో గొబ్బిళ్ళు పెట్టి "రావమ్మా మహాలక్ష్మీ" అని సంక్రాంతి లక్ష్మిని పగలంతా కొలిచి అలసిన అతివ అమ్మై-
రాత్రి పూట ఆకాశం లో సయ్యాటలాడే ఆ జాబిలికి దీటుగా ఇంకా అల్లరి చేస్తూ
దొంగ కలవ రేకుల్లో తుమ్మెదలని, సోగ కనుల రెప్పల్లో తూనీగల్నిఆడిస్తున్న తన జాబిలికూనతో చాలులే !నిదుర పొమ్మంటూ  ---
అంత దవ్వు నుంచి అయ్య  అడుగులు తెలిసేనా 
వేలెడేసి లేవు బోసి నవ్వులదానా - అని ఆ చిన్నారి నిద్రా భంగానికి ఆ పాప అయ్య అడుగులని అందంగా ఆడిపోసుకుంటుంటే-
ఆ అభాండానికి  దీటుగా  ఆ అయ్య-
అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే
చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రానీ - 
అని ఒకే చిటికెకి రెండు నవ్వులన్నట్టు -  చెప్పకనే చెబుతున్న  చిలిపి కోరికతో అటు అమ్మనీ, నిద్ర పోకపోతే తమ్ముడిని పోటీగా తెస్తానని ఇటు పాపనీ మైమరిపించాడు .  
ఆంధ్రుల పరభాషా ప్రియత్వానికి జడిసి వడివడిగా పారిపోతున్న తెలుగు పేరంటాలిని "ఉండమ్మా! బొట్టు పెడతానని" నట్టింట నిలపగలిగే పాట కదూ ఇది?!

మనసులోని మాట పైకి చెప్పలేక మూసిన పుస్తకంలో దాచి పెట్టిన పేజీ లా -

వుసురుసురనినా గుసగుసమనినా వూగదేమది నీ మది-
అని తాను కట్టుబాటు తప్పలేక ప్రియురాలు కాలేక,  స్నేహం గా ఉంటూ తన ఎదని నిష్ఠూరం ఆడుతున్నస్నేహితురాలికి-
నిదుర రాని నిశి రాతురులెన్నో, నిట్టూరుపులెన్నో 
- అని విరహపు బాధని "గోరింటాకు" దాచుకున్న మూగ ఎరుపులా తన నోరులేని ఆవేదనలన్నీ  ఆమెకి చెప్పడానికి ఆ అబ్బాయి ఎంత ఆరాపడ్డాడో  కదా!

 వన్నెలూ వగలూ నేర్వకముందూ, నేర్చిన తర్వాతా కూడా  గడుసరి అయిన  "సీతామాలక్ష్మి"  తనకి మాత్రం సిరి 
అని మురిసిన ఒక బంగారు కొండ(య్య) లాంటి అబ్బాయి ఆ సీతామాలక్ష్మి పగడాల పెదవి మీద నవ్వుతో తన కంటిలో దివిటీలు వెలిగించుకున్నాడు.

***ఆకాశ పందిరిలో  తళుకు బెళుకు నక్షత్రాల తలంబ్రాలతో, మెరుపు తీగ తోరణాల మధ్య, పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాటలు పాడుతుంటే , రాజహంస జంట రత్న హారతి ఇస్తుంటే మరపురాని వేడుకగా తనని పెళ్ళాడదామని కలలు కంటున్న ఆ "శ్రీ రాజ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్బు" వారి  అమ్మాయికి  ఆ నిరంతర సంచారి తన ప్రవర ఎలా చెప్తున్నాడో   విందామా?  

మనసైన చోట మజిలీ కాదన్న చాలు బదిలీ
తోటకి  తోబుట్టువును ఏటికి నే బిడ్డను.......
పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు 
విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనే లేదు 
అసలు నామరోపేరు ఆనందవిహారి  

***ఆకులో ఆకై, పూవులో పూవై , ఆకలీ దాహమూ లేక నిరంతరమూ తనని తాను మరిచి ప్రకృతిలో ఆనంద నాట్యం చేసే యువతికి-
తనని ఆలన చేసే,  తను ఆరాధించే  కవికుల తిలకుడు ఏ కమ్మా , ఎలాంటి కబురూ, కనీసం మేఘసందేశం అయినా పంపక-
హృదయము సంకెల చేసి బంధించలేని తన అశక్తికి  వగచే వనితకి- 
ఆ గడుసు కవి ఇదిగో - ఇలా నిన్ను వదిలి నన్ను పోనీయకు అని మాయ మాటలు చెబుతున్నాడు -

ఎద  లోపల  పూలకారు  ఏనాటికీ  పోనీయకు .....

ఉదయాన  మగత  నిదుర  చెదరిపోవు వేళ 
ముసలి  తనపు  అడుగుల సడి  ముంగిట  వినబడెనా
వీడలేడని చెప్పించు వీలుకాదని  పంపించు 

***జీవితపు "చీకటి వెలుగుల" కౌగిలిలో, చిందే కుంకుమ వన్నెలలో తమ బ్రతుకు పూదోటకి పాదులు కట్టి, గుండెల వలపులు కుమ్మరించి ప్రాణం పోసిన ముంగిట్లోకి వచ్చేపోయే అతిథులెవరంటే....
మల్లెలతో వసంతం చేమంతులతో హేమంతం 
వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలు ....
వారి రాకపోకలతో 

ఆరు ఋతువులు ఆమని వేళలే - ఆ జంట పెంచిన తోటలో  
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే - ఆ రెండు మనసుల్లో.

***కొమ్మ కొమ్మకి పూచిన పూవులు చూస్తూ వాటితో తనకున్న "ఈనాటి ఈ బంధం ఏనాటిదో" అని అబ్బురపడుతూ ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ - పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ - అని హరి పూజకు పూలు పడే తొందరని ముచ్చటగా పాటలో పాడుకుంది ఒక పడుచు.

***"అమ్మ మాట" వినే ఒక బుద్ధిమంతుడు- 
అటు పొద్దు వాలుతోంది, మన ముద్దు తీరకుంది, కోయని పిలిచే కోరికలెరిగి నన్నందుకుని పోరాదా అని తొందర చేస్తున్న గడుసు అమ్మాయిని - 
మొదట ఎవరైనా చూశారా ఏమనుకుంటారు అని బెరుకుగా అడిగాడు.
ఇంతకీ ఆ "ఎవరైనా" అంటే ఎవరో చూద్దామా -
ఇటు పువ్వు , అటు గువ్వ,  గుబులు గుబులుగా వున్న గురివింద పొదరిల్లు :)
చివరికి ఆ అమ్మాయి చొరవకి దాసోహం అని - ఎవరైనా చూసినా సరే - కొత్త మురిపెం పొద్దెరుగదని చెప్పుకుని తప్పుకుంటారని- ఆ పిల్ల నడుమున చేయేసి నీలాల నింగికి ఎగరేసుకుపోయాడు.

*** అదిగదిగో అక్కడ ఓ పల్లెపడుచు ఒళ్ళో ఒక యువకుడు-
రత్న పీఠిక లేని రారాజు బోలు, మణికిరీటము లేని మహరాజు కాబోలు 
ఆమె చూశారా ఏటి గలగలలకే ఎగసి లేచే, ఆకు కదలికలకే అదరి చూసే ఆతని నిదుర చెదిరిందంటే వూరుకోనని గాలినే బెదిరిస్తోంది.
ఇంకా పండు వెన్నెల నడిగి పాన్పు తెచ్చి , నీడ మబ్బుల దాగు నిదుర ఇచ్చి పైగా విరుల వీవన పూని విసరాలిట.
ఆ ప్రియురాలి ప్రేమకి ఏ "రాజ మకుటాలు" సాటి రాగలవు చెప్పండి !!!

***ఒకే ప్రాణదీపం కోసం "కార్తీక దీపా"లు వెలిగించి కోవెలలో కొలువైవున్న దేవికి హారతి పడుతున్న ఆ పడతులేమంటున్నారో?
ఒక ఇంతికి తన ఇంటి లోని పాపే కొండంత దీపం 
మరో వెలదికి తన మనసులో వెలిగే దీపం - మనుగడ నడిపే దీపం.
వారిద్దరూ కలిసి ఆకాశాన ఆ మణి దీపాలు ఏ ముత్తైదువలు వెలిగించారో - వారు భూమి మీద కనిపించే ఈ కార్తీక దీపాలు చూసి చుక్కలనుకుంటారేమో అని తమలో తాము మేలమాడుకుంటున్నట్టు వున్నారు. ఆ ముచ్చట కూడా విని ఆనందించండి మరి....

కన్న తల్లి ఏమంది అని, పొగడ మీది పొదరిల్లు ఎలా వుంది అని కుశలమడిగాడు ఒక ఉడికించే కొంటె భర్త. 
గుబులు గుబులుగా వున్న మనసుతో ఆ అతివకి జీవితం ప్రేమ "బలిపీఠం" లా అనిపించిందంటే ఆశ్చర్యం వేయదసలు. 

***"కలిసిన మనసుల" సంబరంలో ఒక్క క్షణమైనా సరే ఆకులలో గాలి వూసులాడకూడదు. ఏటి లోని అలలు పెదవి విప్పకూడదు అని మౌనంగా గువ్వల్లా ఒదిగిపోతున్నారొక జంట. ష్! వారిని అలాగే ఉండనివ్వండి.

***"మాయని మమత" వున్నా తనకోసం వాకిటిలో నిలబడకని, ఇంక తనకై మరి మరి చూడకనిప్రతి గాలి సడికి తడబడకని, పదధ్వనులని పొరబడకని - తను రాక పోతే వసంత మాసమే రాదనీ తన సఖిని వదిలి దూరపు సీమలకి ఎందుకిలా ఏగుతున్నాడో - పాపం!

***ఇన్ని కబుర్లు చెప్పి మన "మల్లీశ్వరి" గురించి ఏమీ చెప్పకపోతే అమ్మో! ఇంకేమైనా ఉందా - రాయలవారితో చెప్పి అంతఃపురానికి అరణంగా పంపించేస్తుంది. 
చిన్ననాటి ఆకతాయి, ప్రసాదం భక్తురాలు తన నాగరాజు బావని ఎంత ఆట పట్టించిందో మీరెరుగుదురా?
అతను కోతి బావంట, వాని పెళ్ళికి కోవెల తోట విడిదంట. ఆ పెళ్ళిలో బావ మెడలో గంధం పూసి, హారాలు వేసి, కుళ్ళాయి, కుచ్చుల తురాయి పెడుతుందట. హన్నా! ఇంత అల్లరి కనీ వినీ ఎరిగామా ఎప్పుడైనా?
బావ బండెక్కి - నల్లని మబ్బులు గుంపులు, గుంపులు- తెల్లని కొంగలు బారులు, బారులు - అని చూపించిహోరుగాలి, కారుమబ్బులు ముసిరేలోగా మూగేలోగా ఊరు చేరాలి అని తొందర చేసింది.
ఇంకేముంది! అనుకున్నంతా అయింది - ఆ వాన ముంపు రానే వచ్చింది. కాలక్షేపానికి, మళ్ళీ బావని ఆట పట్టించడానికి అదిగో ఆ మల్లి పిల్ల మళ్ళీ - పిలచినా బిగువటరా ! ఔరౌరా! చెలువలు తామే వలచి వచ్చినా - అని ఆడింది, పాడింది. రాయలవారి కళ్ళల్లో పడనే పడింది. రాణివాసం వెళ్ళింది. 
ఇప్పుడు తీరికగా కూర్చుని బాధపడుతూ నెలరాజుకి ఎన్ని జాలి కథలు వినిపిస్తే ఏం లాభం? జరగాల్సిన ఆగం జరిగేపోయింది - విరహపు భోగం నిలిచేపోయింది.
మల్లిని తలచి - ఔనా! ఇది నిజమేనా! - అని వగచి శిల్పి నాగరాజు దేశద్రిమ్మరే అయ్యాడు.
జాలి గుండెల మేఘమాలా అని పిలిచి తన బావ జాడ చెప్పమంటే మాత్రం ఇవేమన్నా కాళిదాసు మేఘసందేశం రోజులా- మేఘాలు రాగాలు మోయడానికి? పిచ్చి మల్లి! ఎన్నాళ్ళైనా తన కళ్ళు దిగులుతో రేబవలు బావకై ఎదురు తెన్నులు చూడాల్సిందే అని ఎప్పటికి గ్రహిస్తుంది?
ఆ నాగరాజుకి మాత్రం తెలీదా - మల్లికే తెలియరాని తన మనసు మేఘానికి తెలియబోదని - మల్లితో మరవలేనని చెప్పమన్నా చెప్పబోదని? ఎన్నాళ్ళు అలా విలపిస్తాడు?
హమ్మయ్య! మేఘ దౌత్యమో, మరింకే దైవ బలమో ఇన్నాళ్ళకి మళ్ళీ మల్లీ-నాగరాజులు కలుసుకున్నారు.

మన మల్లికి ఏ మాత్రం తెలిసిందో చూద్దామా- నాగరాజునింక అల్లరి పెట్టకూడదని---?
కొమ్మల గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని 
కన్నుల నీరిడి కలయ జూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా 
ఎగసిన హృదయము పగులనీకుమా...

అద్దీ! అలా దారికి రావాలి- మన ప్రసాదం భక్తురాలు! ఇప్పుడు మన మనసుల్లో మల్లెల మాలలూగినట్టు వుంది కదూ మల్లీ-నాగరాజులు మళ్లీ ఒక్కటై వూరికి వెళ్ళబోతున్నందుకు!!  

ఇంత అద్భుతమైన కవితా వారసత్వాన్ని మనకిచ్చి వెళ్ళిన శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిని కన్న మన రత్న గర్భకి   ఆయన పాటతోనే ఒకసారి జేజేలు పలుకుదాం...


(పాటల పూర్తి  అర్ధమే తెలియని తెలిసీ తెలియని వయసునుంచే దేవులపల్లి పాటంటే నాకు చాలా ఇష్టం. నేను వ్రాసిన ఈ వ్యాసం  "కృష్ణ పక్షం" లో కూడా వెన్నెలలు వెదజల్లే ఆ కవితా చంద్రునికి ఒక నూలు పోగు లాంటిది. ధన్యోస్మి!!!)

~లలితా TS