సెప్టెంబర్ విహంగలో నా వ్యాసం ఇక్కడ చదవండి.
ఈ సంవత్సరం మా వూళ్ళో వరలక్ష్మి వ్రతం బాగా జరిగింది. శ్రావణ మాసం పేరంటాళ్ళు చక్కగా పట్టుచీరలు కట్టుకుని వివిదాభరణాలంకృతులై శ్రావణ లక్ష్ముల్లా వచ్చి వాయనాలు తీసుకుని వెళ్ళారు. అదే సమయానికి చిరుజల్లులతో వర్షం పడి చిన్నప్పుడు అమ్మ వెనకాల పట్టు పరికిణీలు కట్టుకుని, పసుపు పూసిన పాదాలతో ఒక్కొక్క ఇంటికి పేరంటానికి వెళ్తూ చెల్లెళ్ళతో, స్నేహితురాళ్ళతో ఎవరి కాలి మువ్వల పట్టీలు ఎక్కువ శబ్దం చేస్తాయో చూద్దామని పోటీలు పడుతూ వర్షపు నీటి మడుగుల్న్ట్టి దాటుతూ పెట్టిన పరుగులు జ్ఞాపకం వచ్చాయి. అందరమూ చిన్ననాటి సంగతులు గుర్తు తెచ్చుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.
ఆ సంభాషణ సారాంశం ఏంటి అంటే - పేరంటం లో కలిసిన వాళ్ళు అందరూ దాదాపుగా పదేళ్ళ నుంచి వున్న ఊరిని వదిలిపెట్టి ఉత్తర అమెరికా ప్రవాసదీక్షలో ఉంటున్న వాళ్ళు :) . అందులో ఒక స్నేహితురాలు నాతో ఇలా అంది - మీరు అన్నీ చాలా చక్కగా చేశారు, లలితా ! ఎప్పుడూ నేనూ అనుకుంటూ వుంటాను గానీ ఎందుకో గానీ కుదరట్లేదు. ఇండియా కి ఫోన్ చేసినప్పుడల్లా మా అమ్మ తిడుతూ వుంటారు - అలా మన పూజలు మానేయకూడదు, మంచిది కాదు అని. మనసులో చేయకపోతే ఎలా అని బెరుకుగానే వుంటుంది. కానీ ఏం చేస్తాను - పిల్ల్లల చదువులు, నా ఉద్యోగం, ఉరుకుల పరుగుల జీవితం - ఏదీ కుదరట్లేదు అని.
వెంటనే చెప్పాను నేను తనకి - అబ్బే అలాంటివి మనసులో పెట్టుకోకండి. మనం మంచి మనసుతో ఒక నమస్కారం చేసినా చాలు. దేవుడు మనలా మనిషి కాదు, పట్టించుకోలేదని కక్ష సాధించడానికి. ఇదే విషయం మీద నేనొక వ్యాసం వ్రాశాను. చదవండి అని ఈ విహంగ పత్రిక లింక్ ఇచ్చాను.
ఎవరి నమ్మకాలు వారికి వుండడం మంచిదే- కుదిరినప్పుడు ఇష్టపడి, కుదరనప్పుడు కష్టపడుతూ అయినా ఆ నమ్మకాలకి తగినట్టు ఆచరించడమూ మంచిదే. కానీ ఇంకొకరు అవే పద్ధతులు పాటించలేదని, అలా పాటించకపోవడం వల్ల ఏదో చెడు జరుగుతుందని భయపెట్టడం తగదు. అదెలా అంటే మాకు తెలిసిన ఒకరు ఒకానొక వ్రతం ఆచరించడానికి కావాల్సిన పద్ధతులు, మడి పాటించడానికి అశక్తులయి ఆ ఎప్పట్నుంచో చేస్తున్న ఆవ్రతం చేయడం మానుకున్నారు. తర్వాత ఆ ఇంటి యజమాని రోడ్డు ప్రమాదానికి గురి అయారు. అదృష్టవశాత్త్హూ తొందరగానే కోలుకున్నారు. మళ్ళ్లీ ఎప్పట్లాగే తమ వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ కష్టంతో ఇంట్లో వారందరూ ఇంకొంచెం దగ్గర అయారు. ఒక రకంగా ఇంతకుముందు కన్నా ఇప్పుడు హాయిగా వున్నారు. ఏదో ఒక కష్టం తర్వాత ఒక సుఖం అని తమ మనసులకి సర్ది చెప్పుకున్నారు. ఇటీవల వారిని కలిసిన మిత్రులొకరు ఏడాది క్రితం జరిగి, అసలు వాళ్ళే దాదాపుగా మరచిపోతున్న ఆ ప్రమాదం గురించి తెలుసుకుని - అయ్యో! మీరు ఆ ఫలానా వ్రతం మానేశారు కాబట్టే ఇలా జరిగింది. ఏమైనా సరే మీరలా చేయడం మానేయకుండా వుండాల్సింది - అనేశారు. అంతే! పాపం - మర్చిపోయి కుదుట పడుతున్న ప్రాణాలకు ఒక్కసారి మళ్ళీ - నిజమే ..చేయకపోతే ఎంత నష్టమో - అన్న అనుమానం మొదలయింది. అది విన్న నాకు - అరెరే! ఆ భగవంతుడి పేరు చెప్పి ఎన్ని భయాలు కల్పిస్తారో కదా - అనిపించింది.
ఇక్కడ ఒకసారి మన ముందు తరాలవారు ఇలాంటి పరిస్థితులని ఎదుర్కొన్నప్ప్పుడు - అంటే అనుకున్న విధంగా పూజలు, వ్రతాలు చేయలేనప్పుడు - ఎలా ఎవరినీ నొప్పించకుండా, ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా తగిన ఉపాయంతో ఎలా అధిగమించేవారో చెప్పాలి. పూర్వం కొన్ని కుటుంబాల్లో పెద్దవారు సూర్య నమస్కారాలు చేసి, ఆదిత్య హృదయం చదివిన తర్వాతనే భోంచేసేవారు. అలాంటివారికి వర్షాకాలంలో మబ్బు పట్టి సూర్యభగవానుడు కనిపించని రోజుల్లోఇబ్బందిగా వుండేది. వయసులో వున్నప్పుడు ఎలాగోలా భోజనం చేయకుండా ఉండగలిగినా వయసు మీరేకొద్దీ ఆకలికి ఉండలేక - సూర్యనారాయణ మూర్తీ! తండ్రీ! నేనింక ఈ వ్రతం చేయలేను గానీ- మన్నించు.మా ఇంట్లో పుట్టే పిల్లలకి నీవి మువ్వరుస పేర్లు పెట్టుకుంటాను - అని ఒక దండం పెట్టి వ్రతాన్ని ముగించేవారు. అందుకే కోనసీమలో చాలా ఇళ్ళల్లో - పెద సూర్యనారాయణ, చిన సూర్యనారాయణ , సూర్యనారాయణ మూర్తి, రవి, సూర్య కుమారి, సూర్య ప్రసాద్ - అని పేరులో "సూర్య" శబ్దం లేక అర్థం కలిసి వచ్చేలా పిల్లల పేర్లు వరసగా వుంటాయి. ఎంత మంచి పద్ధతి కదా - అనుకున్నది చేయలేనప్పుడు ఎవరికీ ఇబ్బంది కలిగించని విధంగా అందులోంచి విరమించుకోవడం కూడా హుందాగా చేయగలగడం!
ఇది చదివిన తర్వాత మీరే చెప్పండి - నా ఆలోచన సరి అయినదో, కాదో - ఒక ఇంట్లో అసహాయురాలైన కోడలు పాపకి పట్టడానికి పాలు ఎక్కువ పోయించుకోమంటే ఆ కోడలి కుటుంబంలో అటూ, ఇటూ ఏడు తరాల వాళ్ళని ఆడిపోసుకుని, నకార మంత్రం జపించిన ఒక అత్తగారు మరుసటి రోజు నాగుల చవితి అని పుట్టలో పోయడానికి అని ఎక్కువ పాలు పోయించుకుంటే ఆవిడని - ఆహ! ఎంత గొప్ప భక్తురాలు - అని ఆ నాగదేవుడైనా అనుకుంటాడా?
నోటితో సహస్రనామం చదువుతూ, అదే నోటితో ఇంకొకరి మనసు నొప్పిస్తే ఆ నామ ఫలితం దక్కుతుందా?
అవసరం లేని ఆర్భాటాలతో పూజలు చేసి, ఆకలితో ఉన్నవారికి కడుపు నింపడానికి ఒక్క మెతుకు కూడా రాల్చని వారికి భగవతుడి కటాక్షం లభిస్తుందా?
ఇలా అంటున్నానని నేనేదో నాస్తికురాల్ని, దేవుడంటే భక్తి లేనిదాన్ని అనుకోకండి. మనకి తెలీకుండా మనం వెళ్ళాల్సిన దిశని నిర్దేశించే శక్తి ఒకటి వుందని నేను నమ్ముతాను. ఆ శక్తి కి వున్న అనేక రూప, నామాలని ఇష్టంగా దర్శించి, జపిస్తాను. కానీ ఎలాగూ కనిపించడు కదా అన్న ధైర్యంతో ఆ దేవుడి ప్రతినిధుల్లా ప్రతీ దానికి తమదైన భాష్యాలని చెప్పే వారిని చూసినప్పుడల్లా వాళ్ళ వల్ల ఇంకెంతమంది బాధ పడాలి కదా అనిపిస్తూ వుంటుంది.
ఒక మాట మాత్రం నిజమండీ - దేవుడు చాలా మంచివాడు.
పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయచ్చతి
తదాహం భక్త్యుపహృతం
అశ్నామి ప్రయతాత్మనః
చిత్త శుద్ధి గల భక్తితో మనం సమర్పించే ఆకు, పువ్వు, పండు , నీరు - ఏదైనా ఎంతో ప్రీతితో స్వీకరిస్తాడు.
కుల, మతాలకి అతీతంగా రాముడైనా, అల్లా అయినా, జీసస్ అయినా - ఏ పేరుతో పిలిచినా మన దేవుళ్ళందరూ ఎంతో మంచివాళ్ళు. మంచితనం తప్ప భక్తులనుంచి ఏమీ ఆశించనివారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి