నవంబర్ "విహంగ"లో నావ్యాసం ఇక్కడ చదవండి.
నీ వల్లే....నీ వల్లే...
ఎంత బాగుంటుంది కదా...జగమంత "మొహమాట" కుటుంబమైతే...
ఎంత బాగుంటుంది కదా...నే చెప్పిందే వేదమంటే వినేవారుంటే
ఎంత బాగుంటుంది కదా...మన తప్పులన్నీ మోసే పాపాల భైరవులుంటే...
ఎంత బాగుంటుంది కదా...ఏం పొరపాటు జరిగినా నీ వల్లే అంటే ఒప్పుకునేవారుంటే...
హ్మ్! హ్మ్! నిజమే ఎంత బాగుంటుందో .... జీవితం మనం అనుకున్న దారిలో కాక మనకి ఏ విధాత వ్రాసినట్టో మలుపుల్లో వెళ్తున్నప్పుడు, అందుతున్నది అనుకున్న ఫలం అందనప్పుడు, చేయవలసినది చేయక జాతకాన్నో, తాయెత్తునో, అమ్మవారి కుంకుమనో, స్వామివారి విభూదినోనమ్ముకుంటే ఆ నమ్మకం వమ్ము అయినప్పుడు - ఒక్క మాటలో చెప్పాలంటే అనుకోకుండా పొరపాటు జరిగిన ప్రతిసారీ - చూపుడు వేలు చాచి, ముక్కుకి సూటిగా పెట్టి " నీ వల్లే" అంటే మనసులో క్రుంగినా పైకి నవ్వుతూ భరించేవారుంటే....
*అనగనగా ఒక ఉమ్మడి కుటుంబం గురించి కలలు కంటూ, ఎంత తొందరగా "బాబూ! వినరా...అన్నాదమ్ముల కథ ఒకటీ" అని పాడేద్దామా అనుకునే అన్నగారు. ఆ అన్నగారు తను ఒక పెద్ద సిటీ లో సెటిల్ కాగానే తన తమ్ముడికి కూడా ఇంకో వుద్యోగం చూసి తన ఇంట్లోనే ఉండమన్నారు. కొన్నాళ్ళు సిటీ వచ్చాననే ఉత్సాహంలో తమ్ములుంగారికి బాగానే గడిచింది- అనాయాచితంగా వచ్చిన ఉద్యోగం, పబ్బులు, ఫ్రెండ్స్, పార్టీలు, వీకెండ్ రిసార్టులు. కొన్ని నెలల తర్వాత చూసుకుంటే అబ్బాయిగారికి రాబడి కన్నా "పోబడి" ఎక్కువ అయింది. దానితో ఆ తమ్ముడు అది తన తప్పే అని ఒప్పుకోక అన్నగారి మాట విని అనవసరంగా సిటీ వచ్చానని అనుకోవడం మొదలుపెట్టాడు. ఇంకంతే అవకాశం దొరికినప్పుడల్లా " చూడన్నయ్యా! ఇదంతా నీవల్లే జరిగింది. నువ్వే రమ్మనకపోతే హాయిగా మన ఊళ్లోనే ఏదో బిజినెస్ చేసుకునేవాడిని" అనడం మొదలు పెట్టాడు తమ్ముడు. ఇంత దూరం తీసుకువచ్చి తప్పు చేశానేమో అని బాధ పాడడం అన్నగారి వంతు అయింది.
**"నీ వల్లే" అని వల్లె వేయించే ఇంకో కథ. అందమైన అమ్మాయి. చక్కగా చదువుకుంది. ఇంట్లో గారాబు పట్టిగా అన్నిట్లో తన మాట నెగ్గించుకుంది. అమ్మా, నాన్న ఆరాటపడి ఒక కుదురైన అబ్బాయితో పెళ్లి జరిపించారు. అమ్మాయికి కూడా అబ్బాయి అందం, ఆరు అంకెల జీతం, అత్తా-ఆడపడుచు ఆరడి లేని వేరింటి కాపురం అన్నీగొప్పగా నచ్చేశాయి. అలా ఆరు నెలలు గడిచాయి. ఆడుతూ, పాడుతూ సాగుతున్న కొత్త కాపురం పాతబడింది. ముచ్చటగా వేసుకున్న వంతుల సంసారం ఒక తంటాలా అనిపించసాగింది. అమ్మాయి చిరాకులు, అబ్బాయి పరాకులు మొదలయ్యాయి. అమ్మాయి కాపురం ఎలా వుందో చూద్దామని అమ్మా-నాన్న వచ్చారు. అల్లుడితో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న అమ్మాయితో అమ్మ ఇలా అంది - "తల్లీ! కొంచెం నెమ్మది నేర్చుకోమ్మా! అల్లుడుగారిని అలా విసుక్కుంటే రేపు ఇంకో విషయంలో తనతో నువ్వు మాట పడాల్సివస్తుంది. సంసారం అన్న తర్వాత మంచీ-చెడూ రెండూ వుంటాయి. సర్దుకుపోవాలి"- అని. అంతే యువరాణీ గారి లాంటి అమ్మాయికి కోపం వచ్చేసింది. వచ్చేసి - ఇలా " ఊరుకోమ్మా! అంతా నీ వల్లే జరిగింది. నేనెంత అనుకున్నానో - మాస్టర్స్ అయిపోగానే పీ హెచ్ డి చేద్దామని. నువ్వే పెళ్ళో, పెళ్ళో అని గోలపెట్టి ...ఇదిగో...ఇలా ఈ జైల్లో నన్ను పడేశావు" గాఠిగా అనేసింది. అమ్మకి అమ్మాయి మాట పోటుకి కళ్ళలో తిరిగిన నీళ్ళకి ఉల్లిపాయవైపు తిరిగి "నా కళ్ళ నీళ్ళు నీ వల్లే" అనాల్సివచ్చింది.
***ఇదిగిదిగో ...ఈ బుడతడి "నీ వల్లే" ఉపాఖ్యానం విందామా? బుజ్జిబాబు స్కూల్ నుంచి ఇంటికి రాగానే బొజ్జ నిండా నూడిల్స్ పెట్టి అమ్మ చెప్పింది కదా- బుజ్జి బాబూ ! హోం వర్క్ గబగబా చేసేసుకో. డాడీ రాగానే ఎగ్జిబిషన్ కి వెళ్దాం- అని. మరి మన బుజ్జిబాబు తొందరగా చేసేస్కోవాలా- అల చేయలేదు. తొందర తొందరగా ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాననే ఉత్సాహం లో కొన్ని లెక్కలు చేయడం మర్చిపోయాడు. అమ్మకదేమీ తెలియదు కదా పాపం---చెప్పినట్టే అన్నీ చేసేశాడనుకుని తయారు చేసి ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళింది. ఎగ్జిబిషన్ లో బుజ్జిబాబు రైడ్స్ ఎక్కాడు, పిజ్జా తిన్నాడు, పెప్సి త్రాగాడు, బోల్డు బొమ్మలు కొనుక్కున్నాడు. ఇంటికి వచ్చాక ఆమ్ తిని - ఎగ్జిబిషన్ ని కలల్లో మళ్ళీ చూస్తూ హాయిగా బజ్జున్నాడు. ప్రొద్దున్నే లేవగానే బుజ్జిబాబు కి నిన్న చేయని హోం వర్క్ లెక్కలు గుర్తుకొచ్చాయి. ఇంకంతే స్కూల్ కి వెళ్లనని ఏడుస్తూ కూర్చున్నాడు. అదేంట్రా నిన్న హోం వర్క్ పూర్తి చేసేశానని చెప్పావుగా - అని అడిగిన అమ్మతో - "నువ్వే చెప్పావు ఎగ్జిబిషన్ కి వెళ్దామని. లేకపోతే నేను హోం వర్క్ మిస్ అయేవాడిని కాదు. ఇదంతా నీవల్లే ...ఊఊ...ఊఊ..." అని ఏడ్చేశాడు. పాపం! ఆ అమ్మ మాత్రం ఏం చేస్తుంది - తన పాపడి నిందతో "పాపాల భైరవి" అయింది.
****అల్లదిగో ....ఒకానొక స్నేహిత్ కుమార్ గారికి ఆయన మిత్రులొకరు ఫోన్ చేస్తున్నారు - ఆ సంభాషణ విందామా? అలా ఒకరి మాటలు వినడం తప్పే అయినా - ఏం చేస్తాం - మొబైల్ రోజులు. వద్దన్నా చెవిలో పడతాయి.
-హలో! అరె రాం! ఎలా వున్నావు? ఎప్పుడు వచ్చావు ఇండియా?
----ఏం బాగో ఏమోలే! వచ్చి వారం అయింది.
-అదేంట్రా రామ్ - మరి రాగానే కాల్ చేయాల్సింది కదా. నేనొచ్చి కలిసేవాణ్ణి. సరే గాని ఏంటి ఇంత సడెన్ గా వచ్చావు? అంతా బాగానే ఉంది కదా?
----ఏం చెప్పమంటావు స్నేహిత్? లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు మా మామగారు చెప్పినట్లు బెంగళూరు లో సైట్ కొంటే పోయేది. నువ్వు బాగా ప్లాన్ చేసి కొంటావు కదా అని నీతో పాటు హైదరాబాదు లో కొన్నాను. ఇప్పుడది అమ్మ బోతే ఎవరూ కొనడానికి ముందుకి రావట్లేదు. ఇదంతా నిన్ను నమ్మడం వల్లే.
ఇంకేమంటాడు ఆ "స్నేహితు"డు ?
ఒక విషయం అండీ బాబూ...ఎవరినైనా "నీ వల్లే" అని అనేముందు కొంచెం ఆలోచించాలి అండీ. ఎందుకంటే ఎవరైనా మనం సలహా అడిగినప్పుడు వారిచ్చిన సమాధానం తో మనం సమాధాన పడితేనే ఆ సలహా పాటిస్తాము. అంతే కానీ చెప్పారు కదా అని మన ఆలోచన లేకుండా చేసేయం- కదూ?!!. ఒక్కసారి పైన ఇచ్చిన కథలకి అనుబంధమైన ఈ పిట్ట కథలని కూడా చదివేయండి.
*అన్నయ్య తనని సిటీ కి రమ్మనగానే తమ్ముడు ఇలా అనుకున్నాడు - "నాకేమో బిజినెస్ చేయాలని ఉంది. అన్నయ్యేమో సిటీ కి రమ్మంటున్నాడు. పోన్లే ఒకసారి వెళ్లి వద్దాము. ఎలాగూ జాబ్ తనే చూసేశాడు. లెట్ మీ ఎంజాయ్!. అంతగా నచ్చకపోతే వెనక్కి వచ్చేద్దాం". ఇలా అనుకున్న తమ్ముడు అన్నకి తన బిజినెస్ ఐడియా గురించి ఏమీ చెప్పకుండా ఉద్యోగ పర్వం లో దెబ్బ తగిలేటప్పటికి అన్నగారి వల్లే తను బిజినెస్ చేయలేకపోయాడని అనేశాడు.
**ఇంక మన యువరాణి....పెళ్లనగానే అబ్బాయి అందం, ఎత్తు, ఆస్తి, హోదా చూసి- తన ఫ్రెండ్స్ అందరిలో ఎక్కువగా, గొప్పగా ఉంటానని ఊహించుకుని - మాట మాత్రం గానైనా తన పీ హెచ్ డి ఆలోచన అమ్మకైనా చెప్పక పెళ్లి చేసుకుంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరగక పోయేటప్పటికి అమ్మ ని నిందించింది. పెళ్లయేవరకూ ఈ అమ్మాయి ఆడింది ఆటగా, పాడింది పాటగా పెరిగిందండోయ్- అంత అమ్మ కూచేం కాదు!
***మన బుజ్జిబాబు- చిన్నవాడనుకోండి- అయినా వాడికి తెలిసిపోయింది తన తప్పుకి అమ్మే కారణమని ఎలా ఒప్పించాలో. జీవితంలో తన చేతికి మట్టి అంటకుండా పైన చెప్పిన తమ్ముడి గారిలాగే అవతలి వాళ్ళ మీద తప్పు నెట్టేసి తను ఒప్పై నెగ్గిపోగలడు.
****చివరాఖరికి మన రాం-రాం గారు. మామగారు బెంగళూరులో కొనమన్నారు. కానీ హైదరాబాద్ హై-టెక్ సిటీ గా ఎదుగుతోంది (ఇది ప్రస్తుత గొడవలు లేని కాలం నాటి మాట). స్నేహిత్ ఊరికే అల్లా-టప్పాగా ఇన్వెస్ట్ చేయడు - అని ఆలోచించి, చించీ స్నేహిత్ ని సలహా అడిగి అతను కొన్న సైట్ ప్రక్కనే తనూ కొన్నాడు. అది ఈరోజు రేటు తగ్గితే అది స్నేహిత్ తప్పా?
అసలు ఒక సంగతి చెప్పనాండీ?! ఒక మనిషి ఎవరికైనా వారి జీవితం లో అడుగడుగునా తానై నిలిచి, తాను ఇచ్చిన ప్రతి సలహాని తు.చ. తప్పకుండా వారు పాటిస్తే - నిజమే - వారి జీవితం లో తప్పొప్పులకి, మంచి చెడ్డలకి ఆ మనిషే భాద్యుడు. కానీ ప్రతీ విషయంలోనూ సలహా అడిగినా, తనకి నచ్చిన వాటినే పాటిస్తూ, నచ్చని వాటిని వదిలేస్తూ , ఏదైనా పొరపాటు దొర్లినపుడు వెనక్కి తిరిగి "నీ వల్లే" అంటే ఎంత సబబు? పాలు త్రాగే పసిపాప అయినా తనకి కడుపు నిండగానే ఎంత బలవంతం చేసినా తల తిప్పి వద్దని తన భాషలో చెప్పేస్తుంది. అంతే కానీ కడుపు నిండాక కూడా అమ్మ పడుతోంది కదా అని ఎక్కువ పాలు త్రాగేసి, కడుపు నొప్పి తెచ్చుకుని "నీ వల్లే" అని ఏడవదు కదా. అంటే అంత చిన్న వయసులోనే తనకి ఏది కావాలో, ఏది వద్దో ఆలోచించుకునే శక్తి ఉంటుందనే కదా. అలాంటప్పుడు ఎదిగిన మనం మాత్రం ఆ పాటి భాద్యత తీసుకోలేమా - మనం చేసే పనులకి, నిర్ణయాలకి ?
~లలితా TS
నీవల్లే నీవల్లే నాకు ఈ బ్లాగ్ పిచ్చి వల్లే నీవల్లే!! హాయిగా కాసేపు నావ్వుతున్నా నీవల్లే నీవల్లే !!!!!@@😆
రిప్లయితొలగించండినా పోస్ట్ చదివాక కూడా "నీవల్లే-నీవల్లే" అంటావా - హనుమాన్? :) ఎప్పటిదో పాత పోస్ట్ చదివి కమెంట్ పెట్టినందుకు థాంక్స్!
తొలగించండి