29, మార్చి 2020, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 18 - కవలపాటలు - సావన్ మే లగ్ గయీ ఆగ్...గుచ్చి గుచ్చి చంపకే...

మింటి మేడల
ఉరిమి కసరే కరిమబ్బు... 
అది విన్న వీనుకది 
మొదలయీ మొదలవని వాన పాట

కిటికీకావల 
మెరిసి కురిసే వాన... 
అది చూసిన కన్నుకది 
కదలాడీ ఆడని మెరుపు ఆట 

ఆ ఆటపాటల మఱఁగి - మైమరచి 
మురిసిన మది మరుగున ఉన్నవేవో పాటలు 
మరిచితివేమో నీ మది మాటున మేముందుమని...!
మరొక్కసారి ముందుకొచ్చి నీ వీనుల విందవుదమని... 
పదేపదే పెదవుల మూగినవి
అదే పనిగ ఎడదల మోగినవి 

మూగిన పాటల మోసి 
మోగిన పాటల సోలి 
మోయలేని హాయి బాధతో 
తీపి గాయమాయె నా ఎదకు 
పాటే పూత ఆయె ఆ తీపికాటుకు 
******
*******


ఇపుడున్నది చిత్రవర్ణాల చైత్రమే! 

మొన్నోరోజున ఇంకా చురుకెక్కని ఎండ పొరలో చుట్టూ చూస్తే... 
నీలాకాశపు గొడుగు నీడన...
ఎఱ్ఱెఱ్ఱని చివుర్లతో మేపుల్ చెట్లు... 
తెలుపు, లేత గులాబీ రంగు పూలు మాత్రం పూసి ఆకులే కనిపించని తరు-వధువులు... 
కాసంత ఎండ పొడకే తలలెత్తే లిల్లీలు, ఐరిస్లూ... 
చిరుగాలి అలల తూగే చిన్నిచిన్ని గడ్డిపూలు... 
ఈ రంగులన్నిటినీ చూస్తూ -  ఆ రంగుల హంగుకి మురుస్తూ పాడుకున్నా చిన్నప్పటి పాట

"ఏడు రంగులాకాశం ఆడునుగా మన కోసం ...
పాడునుగా మన కోసం 
చుక్కలింట వాసము, చుక్కలె సావాసము... 
వచ్చె చైత్ర మాసము...వాసంత విలాసము... 
చల్లగాలి వీచె వీచె - 
మెల్ల మెల్ల జల్లు కురిసె - 
పిల్ల లతల పూతలిప్పి ... 
వచ్చె చైత్ర మాసము...వాసంత విలాసము..."

పాటలో తలుచుకున్నానో లేదో - ఆకాశంలో మిణుకుమిణుకుమనే చుక్క-పేరంటాళ్ళు - భూమ్మీది రంగుల వేడుకను చూడడానికి చిట్టిచిట్టి చినుకు-పేరంటాళ్ళై విచ్చేశాయి - వానవిల్లు జారుడుబల్ల మీద జారుకుంటూ వచ్చేశాయి.

ఆ వర్షపు మధ్యాహ్నపు పూట - గాజు పలకల కిటికీ పక్కన కూర్చుని - మబ్బు గొడుగుకి కట్టిన జలతారు దారాల్లా నేలకి జాలువారే వాన చినుకుల జలజలల్లో - తడుస్తూ, మురుస్తూ, మెరుస్తున్న పూల పరాగాల సరాగాలకి నేను పెట్టుకున్న పేరు "చిత్రవర్ణ రాగం". ఇది అచ్చంగా నేను పెట్టుకున్న పేరే! ఎవరైనా పాటలను మచ్చిక చేసుకున్న నేస్తులని అడిగి చూడాలి - నిజంగా అలాంటి రాగమొకటి ఉందేమోనని!


అసలు పాట: మైకాసింగ్ ఆడుతూ పాడిన సావన్ మే లగ్ గయీ ఆగ్...

ఆ చిత్రవర్ణరాగం - కంటూ, వింటూ నేనున్నప్పుడు - వున్నది చైత్రమైనా- మహ చిత్రంగా, కడు విచిత్రంగా ఉన్నట్టుండి గుర్తొచ్చే రోజులు -  - ఒకప్పటి శ్రావణమాసపు మోజులు.

ఒక బుట్టలో - ముందురోజు రాత్రి పసుపేసి నానబెట్టిన శనగలు, వాటి మధ్య అక్కడక్కడా కనిపిస్తూ తెలతెల్లని కొబ్బరి ముక్కలు - వాటి పక్కనే తమలపాకులు, వక్కలు, పూలు, ఆవునెయ్యి రాసి కాల్చి కాటుక పట్టిన అట్లకాడ - ఇవన్నీ పెట్టుకుని... ఆ వాయనాల బుట్టకున్న రెండు చెవుల్లో ఒకటి నా ఎడం చేత్తో పట్టుకుని...

వర్షం నీళ్ళలో తడవకూడదన్నది ఒక సాకుగా - కానీ నిజానికి గోరింటాకు పారాణి మీద పసుపు పూతతో, కొత్త వెండి పట్టీల సోకుతో మెరిసిపోతున్న పాదాలు తలొంచినప్పుడల్లా చూసుకొని మురిసిపోవడానికే - పాదాలకి కొంచెం పైగా కట్టుకున్న పెళ్ళినాటి బంగారపురంగు పట్టుచీరని కుడిచేత్తో కుచ్చిళ్ళు ఇంకొంచెం పైకి పట్టుకుని, తలలో చేమంతులు, అమ్మ చేయించిన పూజలో అగరొత్తుల సెగని ఇంకా తలుచుకుని మండుతున్న కళ్ళని కాటుకతో చల్లబరుస్తున్న కాటుకతో...

వాయనాల బుట్టకున్న రెండో చెవిని పట్టుకున్న కుట్టీతో కబుర్లాడుతూ - "అమ్మో! అసలే ఐదో ఏడు - పాతిక మంది ముత్తైదువులకి వాయినాలు ఇవ్వాలి అని చెప్పింది అమ్మ... ఇప్పటికి పదిమంది మాత్రమే అయ్యారు" - అంటూ లెక్కలేసుకుంటూ - ఇంటింటికి బరువు తగ్గుతున్న వాయనాల బుట్టని ఊపుకుంటూ - అప్పటికి MTV లో చూసిన కొత్త ఇండీ-పాప్ పాటల గురించి మాట్లాడుకుంటూ, మాటల్లో తలచుకున్న పాటలన్నీ ఓ సారి పాడుకుంటూ - తిరిగిన రాజమండ్రి వీధులు వనరైన వానాకాలపు గుర్తు.

అదుగో...ఆ వానకాలపు రోజుల్లోనే - చూస్తూ విన్నాను పంజాబీ అబ్బాయి మైకా సింగ్ పాడిన పాటని.

వర్షపు చినుకుల తాకిడికి మదిలో రగిలే వెచ్చని చిచ్చుని పాటలా పాడుకుంటూ వచ్చే అబ్బాయి...
ఆకుపచ్చని పచ్చిక బయల్లో - పసుప్పచ్చ ఓణీల్లో - గాలికి మెలికలు తిరిగే చేమంతిపూల చెండుల్లా అలవోకగా  ఆడుతున్న అమ్మాయిలు...
ఆ అమ్మాయిల్లో - తనవారిలో తానెఱుపైన - ఓ మెరుపు తీగలాంటి కన్నెపేరంటాలు...
ఆ కన్నెని తరుముకొచ్చే రాహువులాంటి ఇష్టుడు కాని దాష్టీకపు వరుడు...
అతన్ని తప్పించుకుని నచ్చిన వాడిని, మెచ్చిన పాటగాడిని ఆ అమ్మాయి చేరుకోవడం - కొండా, కోనా సాక్షిగా మనువాడడం - ఇదీ మైకాసింగ్ పాడిన పాటలో కథ.

ఆ పాటలో కనిపించే అమ్మాయికి అనిష్టుడు - ఎవరో కాదు - గుల్షన్ గ్రోవర్. అతన్ని చూసినప్పుడల్లా నాకెందుకో మన - దక్షిణ "భారతీయుడు", సలక్షణ "దక్షిణ నాయకుడు" - కమల్ హాసన్ గుర్తుకొస్తాడు. అందుకే గుల్షన్ గ్రోవర్‌కి  నే పెట్టుకున్న పేరు - హిందీ కమల్ హాసన్.

అప్పటి ఆ పాట జ్ఞాపకం ఇప్పటి వర్షపు పుణ్యమాని ఇలా గుర్తు చేసుకుంటున్నా...
ఆ గుర్తు ఇక్కడ ఇలా పంచుకుంటున్నా...
చూస్తూ, పాడుకోవడానికి వీలుగా రాసి పెట్టుకున్నా...





హో... సావన్ మే లగ్ గయీ ఆగ్ - దిల్ మేరా హాయ్
హో... సావన్ మే లగ్ గయీ ఆగ్ - దిల్ మేరా హాయ్
సున్ ఏ హసీనా! పాగల్ దివానీ - సున్ ఏ హసీనా! పాగల్ దివానీ
ఆజ్ న సోయా సారీ రాత్ - దిల్ మేరా హాయ్

హో... గజ్‌రా లగాకే ఆయీ కేస్ మే... హాయ్ కేస్ మే
హో... గజ్‌రా లగాకే ఆయీ కేస్ మే.. హాయ్ కేస్ మే
జమ్‌తీ హై గోరీ కాలే భేస్ మే...  హాయ్ భేస్ మే
జానా హై కిస్ పర్‌దేస్ మే... హాయ్ దేస్ మే
ఖన్‌కీ జో చూడీ ఆధీ రాత్ - దిల్ మేరా హాయ్
హో...  సావన్ మే లగ్ గయీ ఆగ్ - దిల్ మేరా హాయ్

హో... పాయల్ పెహన్‌కే ఆయీ పావ్ మే... హాయ్ పావ్ మే
హో పాయల్ పెహన్‌కే ఆయీ పావ్ మే... హాయ్ పావ్ మే
పీపల్ కీ ఠండీ ఠండీ ఛావ్ మే... హాయ్ ఛావ్ మే
తుమ్‌సా కోయీ న గోరీ గావ్ మే... హాయ్ గావ్ మే
ఆజ్ హుయీ జో బర్సాత్ - దిల్ మేరా హాయ్

హో... సావన్ మే లగ్ గయీ ఆగ్ - దిల్ మేరా హాయ్

సున్ ఏ హసీనా! పాగల్ దివానీ - సున్ ఏ హసీనా! పాగల్ దివానీ
ఆజ్ న సోయా సారీ రాత్ - దిల్ మేరా హాయ్


కొసరు పాట: రవితేజ ఆట పట్టిస్తూ పెదవులు కలిపిన చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే... 

అన్నట్టు - ఎంత వద్దనుకున్నా - ఎంత చిత్రవర్ణరాగమని పేరు పెట్టుకుని సరిపెట్టుకుందామనుకున్నా - ఎప్పట్లా కాకుండా - ఎందుకో వర్షాన్ని చూస్తుంటే కొంచెం బెంగగా వుంది.

అందుకే ముసురు పట్టిన మధ్యాహ్నం మనసుకి పట్టిన బెంగని వదిలించుకోవడానికి కవలపాటల్ని సాయం అడగాల్సొచ్చింది.

అప్పుడే గుర్తుకొచ్చింది - 2002 లో రవితేజ సినిమా ఇడియట్ చూస్తుంటే అందులో ఓ పాట రాగానే "అరె! ఇది ఎప్పుడో విన్న పాటలా వుందే!" అనుకుని, అప్పటికి హాచ్చెర్యపోయి అలా ఉండిపోయిన జ్ఞాపకం.

ఆ అచ్చెరువు ఒడ్డునే ఉండిపోయిన్నేను తేరుకుని ఈ కవల పాటల గురించి రాయడానికి - ఇన్నేళ్ళు పట్టింది. ఇలా వర్షం రావాల్సొచ్చింది.

ఈ పాటలో వర్షం వుండదు కానీ చుట్టుముట్టే గాలినే ఉక్కిరిబిక్కిరి చేసేలా dance చేసే రవితేజ energetic aura ఉంటుంది. చూడ్డానికి బావుంటుంది.

ఈ పాట రాసింది కందికొండ యాదగిరి.
పాడింది శంకర్ మహదేవన్.
అప్పటికే వున్న ట్యూన్‌ని సినిమా కోసం  అప్పనంగా వాడుకున్నది చక్రి.
ఆడింది హీరో అయిన రవితేజ, వెనకాల  అతనితో సమానంగా ఆడిన కొంతమంది యువతేజాలు. 

ఈ పాట కూడా - చూస్తూ, వింటూ, పాడుకోవటానికి వీలుగా రాసుకున్నా...






చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే ... మేరే హాయ్...
ఓ... లల్లా... గుండెల్ని గుల్ల చేసి జారకే... మేరే హాయ్...
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణై పోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణై పోయానే
నీ కళ్లు పేలిపోను చూడవే... మేరే హాయ్...
నీ ప్రేమే నాలో నింపే మైకమే... హాయ్... మైకమే
నీ ప్రేమే నాలో నింపే మైకమే... హాయ్... మైకమే
ఏదోలా కొత్తగా ఉంది లోకమే... హాయ్...  లోకమే
నిలువెల్లా నీరై పోయె దేహమే... హాయ్...  దేహమే
లైఫంతా అయిపోయింది భారమే... హాయ్
నీ అందం అడవైపోను చూడవే... మేరే హాయ్... హాయ్
ఓ... లల్లా... చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్...హాయ్...
నవ్వుల్తో పిండేస్తావు హృదయమే... హాయ్... హృదయమే
ఓ... లల్లా... నవ్వుల్తో పిండేస్తావు హృదయమే... హాయ్...  హృదయమే
నిను విడిచి ఉండలేను నిమిషమే... హాయ్...  నిమిషమే
సై అంటే చూపిస్తాను స్వర్గమే ... హాయ్...  స్వర్గమే… 
ఛీ అంటే జిందగీ మొత్తం నరకమే... హాయ్ 
నీ ఈడు బీడైపోను చూడవే... మేరే హాయ్... హాయ్ 

ఓ... లల్లా... చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్...
గుండెల్ని గుల్ల చేసి జారకే... మేరే హాయ్...
ఓ... లల్లా... నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణై పోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణై పోయానే
నీ కళ్లు పేలిపోను చూడవే... మేరే హాయ్...

*****


జరుగుతున్న కాలం తెచ్చిన నిట్టూర్పు బరువు మోతల నొప్పిని మరిచిపోవడానికి-
నేను అప్పుతెచ్చుకున్న గతకాలపు ఓదార్పు పూత - 
ఈ కవలపాటలు... 
నాతో పాటు మీరూ వింటారని 
వింటూ - ఓ క్షణమైనా - హాయిగుంటారని... 

~ పాటల భైరవి

4 కామెంట్‌లు:

  1. ముసురులో చిరు ఎండలా ఉంది.

    మైకాగారి మైకం చక్రిగారు సొంతం చేసుకుంటే మీ చిత్రవర్ణరాగాన్ని మేం సొంతం చేసుకున్నాం!

    ఆ రాగం అన్ని రాగాలకి జన్యరాగం అనీ, అందులోంచి వసంతాన్ని, మలయమారుతాన్ని లలితంగా పాడుకుంటూ ప్రపంచంలో శ్రీ రాగం కోసం ఆశిస్తూ ఉండాలని గుర్తు చేసింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భలే! నా చిత్రవర్ణరాగానికి నిర్వచనంలా వుంది మీ వ్యాఖ్య. బోల్డన్ని థాంక్స్!

      తొలగించండి
  2. లలిత గారు ఎంత బాగా రాసారండి. చిత్ర వర్ణ రాగం, ఈ మాట ప్రయోగం అద్భుతం. నేను వాన పాడేటప్పుడు అవే చినుకు సవ్వడులు అలా వింటూ, తొలకరి చినుకులు మట్టి వాసన ఆఘ్రాణిస్తూ చాలా సార్లు మైమరిచి పోయా. ఇప్పుడు మీ చిత్రవర్ణ రాగం దాని వర్ణన వాన పాటలను మరీ మరీ గుర్తుకు తెచ్చాయి. చిత్రవర్ణ రాగం ఇది లలితా సరాగం. ఎంత అద్భుతమైన వర్ణన. చాలా చాలా బాగుందండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా చిత్రవర్ణరాగ వర్ణన మీకు నచ్చడం చాలా గొప్పగా అనిపించింది. ధన్యవాదాలు, మురళీకృష్ణగారు!

      తొలగించండి