9, మార్చి 2020, సోమవారం

రచ్చ గెలిచి ఇంటికొచ్చిన "మధ"

"మధ" గురించి చెప్పేయ్ పద!
అంటూ 
నిన్నట్నుంచీ నా తలలో ఒకటే రొద... 




 
అరె! అదెలా చెప్తానబ్బా?! చదివిన కథ గురించో, చూసిన సినిమా గురించో అయితే చెప్పగలను. కానీ ఇలా - చెప్పని కథ, వినని మాట, చూడని కళ - లాంటి - అసలు ఇంకా థియేటర్లకే రాని సినిమా "మధ" గురించి ఏం చెప్పను? ఎలా చెప్పను?

అంతే కదా?! నేనడిగింది సబబే కదా?!

అలా అడిగానే కానీ - చెప్పకుండా వుండలేకపోతున్నా.

ఇప్పటి దాకా చూసిన సినిమాల గురించే రాశాను. మొట్టమొదటిసారిగా చూడని సినిమా గురించి రాయకుండా ఉండలేకపోతున్నాను.

దానికి ప్రేరణ, కారణం - శ్రీవిద్య బసవ.

ప్రతి వారం యూట్యూబ్లో  iDream-TNR interviews కొత్తవి ఏమున్నాయా అని చూసి - ఏదో ఒకటి కాలక్షేపానికి మొదలు పెట్టి - నచ్చి చివరి వరకూ చూసేవి కొన్నైనా ఉంటాయి.

నిన్న రాత్రి అలవాటుగా అటు వైపే వెళ్తే 180వ ఇంటర్వ్యూ  - Women's Day Special అని కనిపిస్తే  - అంత ప్రత్యేకంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పరిచయం చేయదగ్గ వాళ్ళెవరున్నారబ్బా అనుకుంటూనే చూడడం మొదలుపెట్టిన నేను - అసలెక్కడా ఆపకుండా - దాదాపు రెండు గంటల సేపు చూశానూ అంటే అది శ్రీవిద్య బసవ కోసమే.

అన్నట్టు ఈ సినిమాకి పేరు "మధ" అని పెట్టారు కానీ సంస్కృతంలో  "మధ (मध)" అన్న మాటే లేదు - నాకు తెలిసినంత వరకు.

 "మద (मद)" అన్న మాటకు వున్న అర్థాల్లో insanity (పిచ్చి) ఒకటి.

కాకపోతే శ్రీవిద్య బసవ తన సినిమాకి పెట్టుకున్న పేరు "మధ".

మనసొప్పక నేను ముందు "మద" అని రాసుకున్నాను - కానీ సినిమా గురించి రాసేటప్పుడు ఆ పేరుని అలాగే ఉంచడం, ఉచ్చరించడం న్యాయం. అందుకే మళ్ళీ "మధ" అని మార్చేశాను.



ఆ Special Woman ని పరిచయం చేయడం వల్ల నిజంగానే టీఎన్నార్ చేసిన 180వ ఇంటర్వ్యూ Women's Day Special అనిపించుకుంది.

మా బదరి అన్నట్టు ఈ 2020 International Women's Day కి ఇద్దరు శక్తివంతమైన మహిళల గురించి తెల్సుసుకున్నాం - ఒకరు అమ్మాయి శ్రీవిద్య బసవ, ఇంకొకరు అమ్మ ఇందిర బసవ. వాళ్ళిద్దరికీ బోల్డన్ని జేజేలు!

"మధ" అనే కలను కని దాన్ని సినిమా దాకా తీసుకొచ్చిన ఆ ఇద్దరు మహిళల కథతో మొదలు పెడితే...

అనగనగా ఓ తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న అమ్మ.
ఆ అమ్మని బాధ పెట్టే నాన్న.
ఆ అమ్మకీ, నాన్నకీ ఓ ఐదుగురు ఆడపిల్లలు.
ఆ నాన్న పెట్టే బాధలు భరించలేక అమ్మ తీసుకున్న విడాకులు.
ఇక్కడి వరకూ చాలా మామూలు కథ.
అన్నట్టు ఓ సంగతి మర్చిపోయాను... భర్త చాటు భార్యగా వుండి - చదువు మీద ఇష్టంతో చాటుగా భర్తకు తెలియకుండా పిల్లలతో సమానముగా చదువుకుని B. A. పూర్తి చేస్తుంది అమ్మ ఇందిర బసవ. 

ఆ తర్వాత... మొదలవుతుంది అసలు కథ. ఏ సినిమాల్లోనూ ఇప్పటి వరకు చూడని కథ. ఒక సినిమా తియ్యడం వెనకాల కథ.

నాన్న విడిచి పెట్టిన ఆ తల్లీ పిల్లలకి మిగిలింది వాళ్ళుంటున్న ఇల్లు మాత్రమే.
అది కూడా అమెరికా వెళ్ళి  చదువుకుందామని కలలు కంటున్న చిన్న కూతురి కోసం అమ్మేస్తుంది అమ్మ ఇందిర బసవ.
ఇంతలో ఇంజనీరింగ్ చదివి సినిమా తారైంది పెద్ద కూతురు గాయత్రి గుప్తా.
చదువుతున్న ఇంజనీరింగ్‌ని మధ్యలో ఆపేసి సినిమా తీస్తానంది మూడో కూతురు శ్రీవిద్య.
ఈ లోగా అంతవరకూ సబలలా పోరాడి, ఎంత దూరమైనా ఎదురీతగానే కనిపిస్తున్న బతుకు దారిలో అలసి అబలైన అమ్మని సేదతీరమని అమెరికాలో చెల్లెలి దగ్గరికి పంపిస్తారు అమ్మాయిలు.
అమెరికా చేరిన అమ్మకి ఆరడి లేని తీరిక దొరికుతుంది.
అక్కడే ఒక restaurant తెరిచి వేళ్ళు కుదురుకున్న చెట్టులా నిలబడి కూతుళ్ళకి ఆసరా అవుతుంది. MBA కూడా చదువుతుంది.

అప్పుడే - అప్పటికే చిన్నప్పట్నుంచీ తనకు తెలిసిన వ్యధని ఓ కథ రాసుకుని - ఎప్పటికైనా ఆ కథని సినిమాగా తియ్యాలని కలగంటున్న శ్రీవిద్యకి - "ఇప్పుడు తీర్చుకో నీ కలని" అని వెన్నుదన్నుగా నిల్చుంది అమ్మ.

అమ్మ ఇచ్చిన డబ్బులు, అక్క భర్త బావ చేసిన సహాయం, అమ్మ స్నేహితురాలు దగ్గర చేసిన అప్పుతో మొత్తానికి శ్రీవిద్య సినిమా పూర్తయింది.

సినిమా తీసేటప్పుడు శ్రీవిద్య పడుతున్న కష్టానికి, మంచి సినిమా తియ్యాలన్న ఆ అమ్మాయి తపనకీ, సినిమా తీసేటప్పుడు ఆ సినిమాకి సంబంధించిన సాంకేతిక విషయాల మీద ఆ అమ్మాయికి వున్న పట్టుకీ, ఎలాగైనా సినిమా పూర్తి చెయ్యాలన్న ఆ అమ్మాయి పట్టుదలకీ - సాహో! అన్నారు అమ్మాయితో అని చేసిన వాళ్ళందరూ. సినిమా పూర్తి కావడానికి తమ వంతు సహాయమూ చేశారు.

ఇంతకీ శ్రీవిద్య సినిమా దర్శకత్వం ఎలా చెయ్యాలో ఎలా నేర్చుకుందో తెలుసా? యూట్యూబ్ వీడియోలు చూసి. కెమెరా ఏ angle లో పెట్టాలీ అన్న టెక్నికల్ విషయం దగ్గర్నుంచీ - తను సీన్ తియ్యబోయే గదిలో రంగులు ఎలా ఉండాలీ, ఆ గదిలో వెలిగే బల్బ్ ఎన్ని watts ఉండాలీ అన్న aesthatic detail దాకా ఆ అమ్మాయికి వున్న అవగాహన చాలా impressive గా అనిపించింది. ఈ అమ్మయికి సినిమా అంటే నిజ్జంగా passion - అలా అనడం మాత్రం కాదు fashion. 

సరే! సినిమా తీసేసింది. ఎన్నో దేశ, విదేశాల్లో జరిగే Film Festivals కి పంపించింది. బోల్డన్ని ఎవార్డులు గెలుచుకుంది.

ఎన్ని ఎవార్డులొచ్చినా అవి డబ్బు తెచ్చే రివార్డులు కావు కదా! సినిమా తియ్యడానికి చేసిన అప్పులు తీర్చడానికైనా సినిమాని థియేటర్లలో విడుదల చెయ్యాల్సిందే. అలా విడుదల చెయ్యాలంటే డిస్ట్రిబ్యూటర్లకి ప్రివ్యూ చూపించాలి. అలా చూపించాలంటే ప్రివ్యూ థియేటర్‌కి అద్దె కట్టాలి.

అలాంటప్పుడు శ్రీవిద్య తను తీసిన సినిమాని చూడమని తన Facebook friend అయిన నవదీప్‌ని (చందమామ Fame) పిలిస్తే, ఆ సినిమా చూసిన నవదీప్‌కి ఆ సినిమా ఎంత నచ్చిందంటే - తను కూడా తన వంతు ఎంతో కొంత అంత మంచి సినిమాని విడుదల చెయ్యడానికి సహాయం చెయ్యాలీ అనిపించేంత. వెంటనే తన ప్రివ్యూ థియేటర్లో శ్రీవిద్య ఉచితంగా సినిమా ప్రివ్యూ ఏర్పాటు చేసుకోమని చెప్పాడు. నవదీప్ భలే మంచి ఫ్రెండ్!

ఆ సినిమాని చూసిన దర్శకుడు హరీష్ శంకర్ కూడా సినిమా విడుదలకు ఎలాగైనా సహాయం చెయ్యాలనుకున్నాడు. "నాకు నా అభిమాన హీరో ఫిల్మ్ రిలీజ్ అయితే అదే ఫెస్టివల్. అది కాకుండా ఇన్ని రకాల Film Festivals వుంటాయని శ్రీవిద్య సినిమా కొచ్చిన అవార్డుల వల్లే తెలిసింది" అని చెప్పిన హరీష్ శంకర్ సి-న్సియారిటీ నాకు భలే నచ్చింది.

నవదీప్, హరీష్ శంకర్‌తో పాటు ఈ సినిమా చూసిన మహేష్ కోనేరు ఇప్పుడు ఈ "మధ" సినిమాని మార్చ్ 13 న థియేటర్లలో విడుదల చెయ్యడానికి శ్రీవిద్యకి సహాయం చేస్తున్నాడు.

నాకు శ్రీవిద్య బసవ తీసిన సినిమా "మధ" - ఆ అమ్మాయి రాసుకున్న చిన్న కథ నుంచి ఇప్పుడు థియేటర్ దాకా ఎలా వచ్చిందో విన్న తర్వాత ఇది కదా అసలు చెప్పుకోవాల్సిన కథ! అనిపించింది.

తను కష్టపడి సంపాదించిన ప్రతి పైసా సినిమా మీద పెట్టి శ్రీవిద్య చేత సినిమా తీయించి, సినిమా విడుదల కాక డబ్బు రాదేమో అని అనుకుంటున్న శ్రీవిద్యకి "మహా అయితే ఏమవుతుంది… మళ్ళీ జీరో దగ్గర మొదలెడదాం" అని చెప్పిన అమ్మ ఇందిర బసవ కోసం ఈ సినిమా చూడాలని వుంది.

ఈ సినిమా ఒక psychological thriller అట. కథ నాకు తెలియదు కానీ కచ్చితంగా కొన్ని విషయాలు మాత్రం తెలుసు.

ఇందులో ...
punచులూ- ప్రాసలతో మాటలుండవ్.
మంచుకొండల్లో పాటలుండవ్.
తన్ని ఏడిపించి నవ్వించాలనుకునే కామెడీ సీన్లుండవ్.
తన్నుకుంటూ ఊళ్ళో నుంచి కొండల దాకా వెళ్ళిపోయే ఫైటింగులుండవ్.

ఇదెందుకు చూడాలీ అంటే...
ఆరేళ్ళ క్రితం పుట్టిన కథ
మూడేళ్ళ క్రితం short film గా మొదలయి feature film గా ఎదిగిన చిత్రకథ
ముప్పై Film Festivals లో ప్రదర్శింపబడి ఇరవై ఆరు ఎవార్డులు గెలుచుకుని, మూడిట్లో finalist అయిన ఓ సినిమా కథ
ఇది తమిళ్ కాదు, మలయాళం కాదు, బెంగాలీ కాదు...
మార్చ్ 13న  థియేటర్లలో విడుదలవుతున్న ఓ తెలుగు సినిమా కథ
ఇప్పుడే కాలేజీ విడిచిన పిల్లలా, Passion అన్న మాటకి నిర్వచనంలా కనిపించే శ్రీవిద్య బసవ కన్న కల ఈ కథ

అదే... రచ్చ గెలిచి ఇంటికొచ్చిన  "మధ"
తెలుగు సినిమా చూపఱూ! తప్పక చూడాలి పద...

~ సినీ-మా-లక్ష్మి

13 కామెంట్‌లు:

  1. వావ్ బాగా రాశారండీ.. అర్జంటుగా ఆ ఇంటర్వ్యూ ఇంకా రిలీజ్ అయిన వెంటనే సినిమా చూడాలనిపించేలా రాశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనింకా చూడని సినిమా గురించి రాసింది మీకు నచ్చినందుకు సంతోషం. తప్పకుండా ఇంటర్వ్యూ, ఆ తర్వాత వీలైతే సినిమా కూడా చూడండి. తను కష్టపడి సంపాదించిన ప్రతి పైసా సినిమా మీద పెట్టి శ్రీవిద్య చేత సినిమా తీయించి, సినిమా విడుదల కాక డబ్బు రాదేమో అని అనుకుంటున్న శ్రీవిద్యకి "మహా అయితే ఏమవుతుంది… మళ్ళీ జీరో దగ్గర మొదలెడదాం" అని చెప్పిన అమ్మ ఇందిర బసవ కోసం ఈ సినిమా చూడాలని వుంది.

      తొలగించండి
  2. సినిమా తొందరగా చుసేయాలని, మీరు కూడా చూసి రివ్యూ రాస్తే చదవాలని కోరిక మొదలైపోయింది!

    పంచులూ, మంచులూ లేకపోయినా కనీసం ఒక ఐటమ్ సాంగ్, కొసరిగా ఓ లుంగీ డాన్సు ఉంటాయని కొండంత ఆశతో....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ సినిమా మా ఊళ్ళో వస్తే తప్పకుండా చూద్దామనే అండీ - చూసే అవకాశం వస్తే. కళ్ళకి అడ్డంగా చేతులు పెట్టుకుని మరీ చూసేస్తా (థ్రిల్లర్స్ నేనలాగే చూస్తాను)

      ఇక ఐటెమ్ములూ, అరవమ్ములూ అయిన ఆ డాన్స్ రకాలు వుంటాయనే ఆశ ఆశ గానే వుంటుందేమోనండి.

      తొలగించండి
  3. manchi cinema gurinchi teliyajesaru .. mee abhiruchiki mecchukoeLLu

    రిప్లయితొలగించండి
  4. ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసాను. వనస్థలిపురం అమ్మాయి. ఈ సినిమా పేరు మద కాదు "మధ". టైటిల్ లో పేరు కరెక్ట్ చేయండి.
    Madha....not mada.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "మార్చానండి, నీహారికా! ధన్యవాదాలు. అసలలా ఎందుకు రాశానో వివరణ కూడా చేర్చాను నా పోస్ట్‌లో.

      "అన్నట్టు ఈ సినిమాకి పేరు "మధ" అని పెట్టారు కానీ సంస్కృతంలో "మధ (मध)" అన్న మాటే లేదు - నాకు తెలిసినంత వరకు.

      "మద (मद)" అన్న మాటకు వున్న అర్థాల్లో insanity (పిచ్చి) ఒకటి.

      కాకపోతే శ్రీవిద్య బసవ తన సినిమాకి పెట్టుకున్న పేరు "మధ".

      మనసొప్పక నేను ముందు "మద" అని రాసుకున్నాను - కానీ సినిమా గురించి రాసేటప్పుడు ఆ పేరుని అలాగే ఉంచడం, ఉచ్చరించడం న్యాయం. అందుకే మళ్ళీ "మధ" అని మార్చేశాను.""

      తొలగించండి
  5. మదశిఖి పింఛ అలంకృత చికురే....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ ఇంటర్వ్యూ చూసినప్పట్నుంచి నిజంగానే నా "మానస" అక్కడే "సంచరరే"!

      తొలగించండి
  6. చిలుకా పద పద తెలిసే కథ కథ
    చూద్దాం మధ మధ ఇంకేం పదా ((2))
    మనసు ఒకటే రొద రొద రొదా వెంటనే చూడగా
    ఆశ కలిగెను కద కద కదా బోల్డు కబురులు తెలుపగా ...

    చిలుకా పద పద

    తరగని కబురులు రాస్తారు తరచుగ రాగం తీస్తారు
    బొమ్మల కధలే చెబుతారు కమ్మగ ఊరిస్తుంటారు

    మీ కధా చిత్రణ చూశాక సినిమాను థియేటర్ లో
    తప్పకుండా చూడాలనే ఉత్సాహం కలుగకుంటుందా!
    ఈ కబుర్లనేముంది లెండి మీరు చెప్పే ఏ కబురైనా
    వినడానికి ఎంతో హాయిగానే ఉంటుంది ... :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంటర్వ్యూ పై యన్నెంరావువారి రివ్యూ గోల్డుకుపర్ఫ్యూమ్ అంటించినట్టుంది ..మనసాపదపద మనిషీపదపదమంటూ పరుగులుతీయాల్సిందే..చదివినచదువరులంతా

      తొలగించండి
    2. ఱావుగారు! మీ అభిమానానికి ధన్యవాదాలు!
      రాజుగారు! ఱావుగారి వ్యాఖ్య మీద మీ ప్రశంసకి వాదాల్లేని ధన్యవాదాలు!

      తొలగించండి