అనగనగా ఒక ఊళ్ళో - రెండు అరుగులు, మూడు నల్లబల్లలు, నలుగురు మాష్టార్లు, ఐదు తరగతులూ వున్న ఒక బడి.
ఆ బళ్ళో ఆ రోజు తెగ సందడిగా ఉంది. ఇంకో రెండ్రోజుల్లో భాద్రపద శుద్ధ చవితి - ౘలువజోతి ౘందమామ చవితిచంద్రుడై చిక్కిన రోజు - బుజ్జిపిల్లలకి ఇష్టుడైన బొజ్జదేవర పుట్టినరోజు మరి! అందుకే ఆ హడావిడి.
అంతకు ముందు రోజే రామశేషు మాష్టారు మమ్మల్నందరిని కొత్త నోటు పుస్తకాలు - మధ్యపేజీలో "పూజ" గీసుకుని రంగులేసుకుని తెచ్చుకోమన్నారు.
అప్పటికప్పుడు కొత్తవంటే ఎక్కణ్ణుంచి వస్తాయి? అందుకని అమ్మ ఇంట్లో ఉన్న ఒక దస్తా తెల్లపేపర్లని అట్టలేసే బ్రౌన్ పేపర్ మధ్యలో పెట్టి - అన్నిటినీ కలిపి - దబ్బనంతో నోటుపుస్తకంలా కుట్టిచ్చింది.
అందులో మధ్య పేజీలో నాలుగు పక్కలా చిన్న స్కేలుతో మార్జిన్లు గీసి - అందులో నాకు చేతైన కొండల డిజైన్ వేసి - నాన్న మైసూర్ నుంచి తెచ్చిన మైనం రంగులతో ఆ కొండల డిజైనుకి ఎరుపు-ఆకుపచ్చ-పసుపు రంగులు వేశాను.
*******
నాలాగే పుస్తకాలు కుట్టుకుని రంగురంగుల పూజలు గీసుకుని వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరెవరంటే...
అన్నతో సమానంగా పోటీ పడి చదివే రంగరాజు చెల్లెలు గొట్టిముక్కల సరోజిని,
మెయిన్ రోడ్డు కవతలున్న మిల్లు వాళ్ళమ్మాయి భవాని,
బాయమ్మగారి మనవడూ, సువర్చలా-బాబూరావు గార్లబ్బాయి - రాధాయ్,
బడి పక్కనే ఉన్న ఇంట్లోంచి ఒక చిందేస్తే బళ్ళోకొచ్చేసే చివుకుల రమణ,
రాజేశ్వరమ్మ గారి మనవరాలు రెండుపొడుగుజళ్ళ చైనం రమాదేవి,
రమాదేవి ఇంటి పక్కనే ఉండే రెండుపొట్టిజళ్ళ రాజేశ్వరి,
ఎంటీరామారావు కృష్ణుడి వేషంలో ఉన్న ఫోటో పుస్తకంలో పెట్టుకునే గాలి శీను,
నల్లతాడు-తాయెత్తు మెళ్ళో కట్టుకున్న కంసాలి శీను,
హైమవతమ్మగారి రమణ, కృష్ణ.
వీళ్ళందరితో పాటు - ఒంటి పోనీటెయిల్ వేసుకున్న నేను...
చుట్టూ నించున్న మా మూడో తరగతి పిల్లలందరి మధ్యనా - పేంటు రెండు కాళ్ళూ రెండేసి మడతలు పైకి మడుచుకుని - మఠం వేసుకుని కూర్చుని - మా అందరి నోటు పుస్తకాలూ బొత్తిగా పెట్టుకుని - ఒక పుస్తకం తర్వాత ఇంకో పుస్తకం అందుకుంటూ - అందుకున్న పుస్తకంలో మధ్య పేజీలో రంగురంగులుగా ఉన్న "పూజ" మధ్యలో నీలంరంగు ఇంకు, ఆకుపచ్చరంగు ఇంకూ మార్చి మార్చి వాడుతూ - ఒక ఓం, రెండు కంద పద్యాలు రాస్తూ - రాస్తున్న పద్యాలని తాను అంటూ, మాతో కూడా అనిపిస్తూ - చకచకా రాసేస్తూ - రాయడం పూర్తి చేసిన పుస్తకాన్ని - పేరుపేరునా పిలిచి - చుట్టూ నించున్న పిల్లలమందరికి అందిస్తూ - అక్కడ కూర్చున్నదెవరూ అంటే - మా రామశేషు మాష్టారు.
నా పుస్తకం అప్పటికే నా చేతిలో ఉంది. అందులో రాసిన రెండు పద్యాలూ - మొదటి రెండు సార్లూ - రెండేసి మాటలకొకసారి - కళ్ళు సగంసగం తెరిచి చూస్తూ చదివినా - ఆ పాటికి నాకు కంఠతా వచ్చేశాయి.
అంతకు ముందు రామశేషు మాష్టారు చెప్పిన తర్వాత పద్యాలు అంటూ ఉన్న నేను - ఇప్పుడు ఆయనతో పాటే అంటున్నా. నాతో పాటే రంగరాజు, సరోజినీ, భవానీ కూడా మాష్టారితో గొంతు కలిపారు.
నా చేతిలో ఉన్న పుస్తకం ఎంత బావుందో! నేను వేసిన "పూజ" మధ్యలో రామశేషు మాష్టారు శుక్లాంబరధరం శ్లోకమూ, రెండు తెలుగు పద్యాలూ రాసిచ్చారు.
ఆ రెండు పద్యాల్లో మొదటిది నాకు బోల్డు నచ్చేసింది. "అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్" అన్న మాటలు చదివినకొద్దీ చవులూరాయి, విన్నకొద్దీ చెవులూరాయి.
నేనెందుకలా అనుకున్నానో తెలీదు కానీ మొదటిసారి నాకుగా నేను చదువుకున్నప్పుడు అటుకులకి, చిటిబెల్లానికీ మధ్యనున్న కొబ్బరి పలుకులని "పలుకులు" అని కాకుండా "పటుకులు" అని చదువుకున్నాను.
ఆ తర్వాత రామశేషు మాష్టారు నేర్పించినప్పుడు సరిగ్గానే అన్నా - నాకు నేను చదువుకున్నప్పుడు మాత్రం "కొబ్బరి పటుకులు" అనే చదువుకునేదాన్ని.
ఇలా ఎన్నిసార్లు చదువుకున్నానంటే కొబ్బరిపలుకులు నా పలుకుల్లో కొబ్బరిపటుకులు అయ్యేదాకా.
వినాయకచవితి రోజు పొద్దున్నే - ఒక స్టీలు ప్లేటులో బియ్యం పోసి, దానిమీద చిన్న అరిటాకుముక్క వేసి, ఒక పావలా నాచేతికిచ్చేది అమ్మ.
అవి జాగ్రత్తగా - గాలికి అరిటాకు ఎగిరిపోకుండా అదిమి పట్టుకుని - మేముండే మేడమీద ఇంటి మెట్లు దిగి - మా ఇంటికి రెండిళ్ళ అవతలున్న కంసాలి శీను ఇంటికెళితే - అప్పుడే నూనె రాసి అచ్చుపోసిన బంకమట్టితో చేసిన నిగనిగలాడుతూ మెరిసిపోయే వినాయకుణ్ణి నా చేతిలో వున్న స్టీలుప్లేటులో అరిటాకుముక్క మీద జాగ్రత్తగా పెడుతూ - కంసాలి శీను ఏమనేవాడో తెలుసా?
"లల్లీ! ఈ వినాయకుడి బొమ్మలు నేనే చేశా. నువ్విచ్చే డబ్బులన్నీ నావే తెలుసా?" అంటూ డబ్బులెయ్యడానికి చిల్లు పెట్టి డిబ్బీలా చేసుకున్న గులాబీరంగు పాండ్స్ పౌడర్ డబ్బా గలగల్లాడించేవాడు.
ఆ క్షణంలో కంసాలి శీను బోల్డంత గొప్పవాడైపోయినట్టనిపించేవాడు - వినాయకుడి బొమ్మలు చెయ్యడమే గొప్ప అనుకుంటే, ఆ బొమ్మలు అమ్మిన డబ్బులు కూడా తనవే అంటే...మరి గొప్ప కాక ఇంకేంటి?

Beautiful! What an apt way to worship/celebrate Ganesh (Vidya Pradata) chaturthi!
రిప్లయితొలగించండిNevenr knew what drawing "Puja"means. Thanks much for introducing.
Kobbari patukulu bellam to tintunnattu undi post. :-)
Thank You :)
తొలగించండిCute post... Recreating a slice of childhood memory is endearing. Even when everything changes, if we can retain and recall those innocent times, it is something to truly rejoice about!! Thanks for sharing this post Lalita.
రిప్లయితొలగించండిThose were the moments relive-worthy and make me feel worthy of reliving them :)
తొలగించండి