7, నవంబర్ 2021, ఆదివారం

వలల తలపోతల అలలు

    నవంబర్ 07,2021. 

    ఇవాళ్టి రోజు ఓ గంట ఆలస్యంగా తెల్లారింది. 

    అలాగని ఈ రోజు ప్రపంచంలో చెప్పకోతగ్గ మార్పేమీ జరిగిపోలేదు. 

    సూర్యుడేమీ ఆలస్యంగా పొద్దు పొడవలేదు.  

    భూమి ఏమీ ఒక చుట్టు ఎక్కువో, తక్కువో తిరగట్లేదు. 

    సాగే సెలయేరుల్లో, పారే నదుల్లో, ఉప్పొంగే సముద్రపుటలల్లో జలజల చిందులాడే నీటి లయ మారలేదు. 

    ఊగే చిటారు కొమ్మల్లో, జారి రాలే ఆకుల్లో గలగలల రాగాలు పాడే గాలి సడి శృతి మించలేదు. 

    జరిగిందల్లా ఏంట్రా అంటే - మనిషి - అందులోనూ ఉత్తరమెరికా లోని మనిషి - ఇప్పటి వరకు గడియారాల్లో ముందుకు తిప్పి పెట్టుకున్న  Daysight Saving Time ముగిసింది. 

    మార్చ్ నెలలో Spring Forward అనుకుంటూ  గడియారపు ముళ్ళని ముందుకు తోసుకున్న సమయాన్ని - నవంబర్ నెలలో Fall Back అని చెప్పుకుంటూ, అవే గడియారపు ముళ్ళని వెనక్కి నెట్టుకుని - ఇవాళ్టి రోజు ఓ గంట ఆలస్యంగా తెల్లారింది. 

    ఆ మాత్రానికే ఈ ఒక్క రోజు "ఇవాళ్టి రోజు ఓ గంట ఆలస్యంగా తెల్లారింది" అనుకోవడం - దాంతో పాటే ఓ గంట ఆలస్యంగా లేచామని సంబరపడడం - ఇవాళ మాత్రమే కాదు - ఇరవైఒక్కేళ్లుగా మా సాలువారీ రివాజు. 

*******
*******

    ఇంట్లో వున్న ముగ్గురం ఇవాళ పొద్దున్నే తొమ్మిదింటికల్లా తయారయి మా ఇంటి పక్కనే వున్న ఓ Assisted living అనగా ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి వచ్చాము. ఎందుకూ అంటే అక్కడ ఏమైనా volunteering కి అవకాశం వుంటుందా అని కనుక్కోవడానికి. 

    చెయ్యాలనుకోవాలే కానీ  స్వచ్ఛందంగా సేవ చేస్తామంటే చేతులు చాచి అందుకోవడానికి ఎంత మందో, ఎన్ని సంస్థలో. 

    అక్కడ ఆక్టివిటీస్ డైరెక్టర్ జూలియాన్ అడిగిన ఒక ప్రశ్న "ఎన్ని గంటలు అవసరం మీ స్కూల్ లెక్కల ప్రకారం?"

    ఆ ప్రశ్నకి బుజ్జిజింక ఇచ్చిన సమాధానం "నేను చేయాలనుకుంటున్న సేవకి అలాంటి గంటల పరిమితులు లేవు". 

    ఆ బదులు ఊహించనిదని అనిపించిన ఆనిక ఊనిక - మాటల్లో చెప్పలేని ఆనందం పెట్టుకున్న మాస్క్ మాటు దాటి జూలియాన్ కన్నుల వెలిగిన చిరునవ్వు. 

    ఆ సమయంలో నాలో కలిగిన సంతోషాన్ని వ్యక్తపరచడానికి నాకు దొరికిన ఒకే దారి - అక్కడ నాకు కూడా ఏమైనా సేవ చేయడానికి అవకాశం ఉంటుందా అని అడిగి నన్ను కూడా మీలో కలుపుకోండి అని సూచించడమే. 

    ఇవాళ్టి రోజు ఓ గంట ఆలస్యంగా తెల్లారింది - కానీ తొందరగా మనసులో వెలుగు నింపింది. 

   

*******
*******

    అక్కడి నుంచి ఇంటికొచ్చాము. 

    మా ముందు గదిలో ఒక టేబుల్ దగ్గర రెండు ఆఫీసు కుర్చీలు ఉంటాయి. 

    ఒకటి నేను నా ఆఫీసు పని కోసం వాడేది. 

    ఇంకోటి - ఇంట్లో ఎవరూ వాడట్లేదని - ఎవరికైనా డొనేట్ చేద్దామని - వాడకుండా పక్కన పెట్టింది. 

    ఇప్పుడా కుర్చీల విషయం ఎందుకూ అంటే... ఇవాళ్టి కబుర్లకి ఊతం ఆ ఇంకో-కుర్చీకి సంబంధించిన విశేషం కాబట్టి. 

    ఇంటికి రాగానే ముందు గది లోకి వెళ్ళి "నేనర్స్!" అని పిలిచిన బుజ్జిజింక గొంతులో ఒక చిన్ని ఉత్సాహం. 

    వెంటనే అటెళ్ళిన నేనర్స్ (బద్రి) అడుగుల చప్పుడు. 

    అటు తర్వాత "ఎంత బావుందిరా ఇది నాన్నా! చాలా intricate గా అల్లింది కదా?!" అన్న పిత్రాశ్చర్యం, పిత్రోత్సాహం ఒక దాని తర్వాత ఒకటిగా. 

    "Yes, నేనర్స్! It made a mansion" అంటూ మోద-పూరిత పుత్రామోదం. 

    "ఎంత కష్టపడి అల్లి వుంటుందో? ఇలా అల్లడానికి దానికి ఎన్ని రోజులు పట్టిందో?" అని ఇద్దరూ మురిసిపోతున్నారు. 

    "దీనికి ఫోటో తీయడం ఎలా?" అని ఫోన్లు అటుపెట్టి, ఇటుపెట్టి సతమతమవుతున్నారు. 

    అప్పటిదాకా వంటింట్లో వుండి వాళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారో అని తెగ ఊహించడానికి ప్రయత్నిస్తున్న నేను - ఆ ఊహ ఎటూ సాగక - ఇహ ఇలాక్కాదని - ముందు గదిలోకి వెళ్ళి ఏంటా అని చూస్తే - వాళ్ళిద్దరూ - పక్కనే డొనేషన్ కోసం పెట్టుంచిన ఆ ఇంకో-కుర్చీ కాళ్ళ చుట్టూ అల్లుకున్న సాలెగూడు వలల కేసి చూస్తూ అబ్బురపడుతూ తబ్బిబ్బవుతూ కనిపించారు. 

    పక్కనే వున్న కిటికీ లోంచి పడుతున్న ఎండకి మిలమిలలాడుతూ కంటికి సన్నదారాల సరిగెలా కనిపిస్తోంది ఆ సాలె-వల. 

    అదెలా వుందంటే... 

    జలజలల వల 
     జలతారు వల 
    తళతళల వల 
    వెలుగు రేకల వల 
    మిలమిలల వల 
    మినుకు మించుల వల 
    అలవోకల వల     
    అల్లిబిల్లి అల్లికల వల 


    కానీ కుర్చీ కింద లేతరంగు కార్పెట్ ఉండడంతో కెమెరా కంటికి అందనంటోంది. 

    ఓ ఐదు నిముషాలు ఆ వల నేతని,  దాన్ని నేసిన సాలీడు చేతని మెచ్చుకుని నేనర్స్-బుజ్జిజింక ఇద్దరూ తమతమ ఆఫీసు-స్కూల్ హోంవర్కులు చేసుకోవడానికి తమతమ నెలవులకి చేరిపోయారు. 

*******
*******

      అప్పుడు మొదలయ్యాయి నా తలలో వలల తలపోతల అలలు. 

   ఆఫీసు మీటింగుంటే మాటలు అంటూ-వింటూనో, మీటింగు లేనప్పుడు పాటలు అంటూ-వింటూనో - అదే పనిగా మోగుతూ నేనేదో తెగ పని చేసేస్తున్నానని నేననుకుంటుంటాను కదా?!

    అదే సమయంలో నేనంటున్నవాటిని అన్నిటినీ వింటూ - తను సైలెంటుగా వుంటూ - తన ఉనికే నాకు తెలియకుండా నా పక్కనున్న కుర్చీ నాలుగు కాళ్ళకి ఎంత అందమైన వల అల్లింది ఆ ఎనిమిది-కాళ్ళ సాలీడు?

    ఇంతకీ ఎందుకు అల్లిందో? 

    అల్లింది అక్కడే హాయిగా ఉయ్యాలూగుతూ వుండక ఎక్కడికెళ్ళిపోయిందో? 

    ఆకలి వేళల ఆదరువు కోసమా? ఒక వేళ ఆ వలలో ఏ చీమో, దోమో పడితే ఆ సాలీడుకెలా తెలుస్తుంది?

    ఉబుసుపోక సరదా కోసమా? ఇలా నచ్చిన చోటల్లా గూడు అల్లేసుకుని "నాకెన్ని ఇళ్ళున్నాయో!" అని మురిసిపోతుందా - అచ్చు మనుషుల్లాగే?

    ఒక చిన్ని సాలె-వల కలిగించిన ఇన్ని తలపోతలు అలలుగా సాగుతూనే ఉన్నాయి. 

*******
*******

    ఏ సాలీడో అంత కష్టపడి అల్లుకున్న అంత పెద్ద అల్లికని చెదరగొట్టాలని అనిపించలేదు. 

    నేనూ ఓ ఫోటో తీద్దామని ప్రయత్నించాను. ఎటు తిప్పి ఎలా చూసినా కెమెరా-కంటికి చిక్కట్లేదు. 

    ఆ ఇంకో-కుర్చీని కార్పెట్ పక్కనే వున్న చెక్కనేల మీదకి జరిపి చూశాను. 

    ఉహూఁ ! లాభం లేదు. 

    ఆ వల తళతళలాడుతూ కంటికి ఆనుతోంది కానీ కెమెరాకి అందట్లేదు. 

    వెంటనే వెళ్ళి నాదొక నల్లరంగు చున్నీ పట్టుకొచ్చి కుర్చీ కింద వేసి చూశా! 

    అంతే! వల ఫోటోకి చిక్కింది! 

    వల వలన కలిగిన తలపోతల అల ఆగింది. 

    కానీ ఆ వల అలాగే వుంటుంది - మా ఇంటి నుంచి ఆ కుర్చీ ఇంకో గూటికి చేరే దాకా.

    
  

*******
*******





    


*******
*******


     మదిని హాయిని నింపుకోవడం
    పెదవికి నవ్వు పూసుకోవడం 
    తీరు-తెన్నూ అనుకుంటే 
    అదే అలవాటు చేసుకుంటే 
    ఊహించని చోట - 
    ఉనికి అందని చోట కూడా - 
    ఆశించని ఆనందం దొరుకుతుందని 
      ఇంకోసారి- నేర్వకనే నేర్చిన కొత్త చదువిది - నాది
నాకది నేర్పకనే నేర్పిన ఒజ్జతనం - నా మేలిసగానిది!

    

*******
*******

1 కామెంట్‌:

  1. Bhale బాగుంది!

    మీ బుజ్జి సగం నేర్పిన పెద్ద పాఠం వల,

    ఆకాశం లో వెండి జలతారు అల్లిక లాంటి ముచ్చటైన వల..

    అన్నీ చాలా బాగున్నాయి.

    Boldu thanksulu halaa!!

    రిప్లయితొలగించండి