14, నవంబర్ 2021, ఆదివారం

ఆటమ్లూ - పాటలూ


    ఉత్తరమెరికాలో సెప్టెంబర్ 21 నుంచి డిసెంబర్ 20 దాకా Fall అనబడు Autumn కాలం. 

    రంగుటాకుల కాలం. 

    రంగిల్లిన ఆకులు రాలు కాలం. 

    ఆకురాలు కాలం. 

    ఎప్పుడూ అనిపిస్తూ  వుంటుంది - ఈ ఉత్తరమెరికా ఆకురాలు నేను చిన్నప్పుడు దక్షిణ భారతదేశంలో చూసిన శిశిరం ఒకటి కాదని. 

   అమెరికా ఆకురాలు శీతాకాలానికి ముందుగా వస్తే భారతదేశపు శిశిరం శీతాకాలం తర్వాత ఆకులు రాలుస్తుంది. ఇలా జరగడానికి  ఇంకేమి భౌగోళిక కారణాలు వున్నాయో ఎప్పుడైనా తీరిగ్గా వున్నప్పుడు చదువుకుంటా. ప్రస్తుతానికి నా సందేహాలని అసింటా పెట్టి ఇవాళ్టికి నా కబుర్లు రాసుకుంటా! 

*******
*******

    నాకు కాలాలన్నీ వేటికవిగా అన్నీ ఇష్టమే అయినా ఆకురాలుకారు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఎండ తగిలి చిగిర్చి పూలు పూసేటప్పుడు చెట్లు  అందంగా వుంటాయి.  ఆనందంగా ఉన్నట్టనిపిస్తాయి. ఎందుకంటే అది కొత్త మనుగడకి ఆనవాలు. 

    కానీ ఇంకొన్ని రోజుల్లో తాము నేల రాలక తప్పదు అని ఎఱిగిన ఆకులు తమ లోని పత్రహరితపు బలాన్ని చెట్లకి ఇచ్చి - తమ రంగులు మార్చుకుని - రంగులతో చెట్లను కనువిందుగా సింగారించడం - "ఇచ్చుటలో వున్న హాయీ ... వేరెచ్చటనూ లేనే లేదని (ఆరుద్ర మాటలివి)" చెప్పకనే చెప్పడం. అందుకే నాకు Fall అచ్చమైన Giving-season అనిపిస్తుంది. మనసుకి నచ్చుతుంది. 

    ఇన్నేళ్ళుగా fall colors చూస్తున్నా - ప్రతీ ఏడాది కనిపించే రంగురంగుల ఆకులు ఎప్పటికప్పుడు  అబ్బురమే నాకు!  

రాలుపూ ఓ వేడుకే... జలజలా! 
ఆకురాలు ఓ పండగే... గలగలా!



*******
*******

    కిందటి వారం దాకా మా ఇంటి చుట్టుపక్కల చెట్లు చాలా వరకు ఇంకా ఆకుపచ్చగానే అనిపించాయి. వాటిని అలా చూస్తుంటే నవంబర్ వచ్చేసింది, ఈ చెట్ల ఆకులు ఇంకా రంగు మారట్లేదు అని - నిజం చెప్పొద్దూ ! - బాగానే దిగులేసింది. 

    ఎందుకంటే - బ్రతుకంటే ఎప్పుడూ ఎలా వుంటే బావుంటుందంటే - వేసవిలో ఎండలు కాయాలి. వానాకాలంలో జల్లులు తడపాలి. చలికాలంలో గజగజ వణకాలి. ఆకురాలు వేళ ఆకు పండి నేల రాలాలి. శీతవేళ మంచు మాటున చెట్లు నిద్దరోవాలి. మంచు కరిగిన ఆమనిలో మేల్కొన్న కొమ్మలన్నీ పూతలిప్పాలి.  

    ఇందులో ఏ ఒక్కటి ముందువెనకలైనా  ఎక్కడో ఏదో సవ్యంగా లేదని అనిపిస్తూ వుంటుంది. 

    నమ్మిన మనిషి కాదని ఈసడిస్తే తమాయించుకోగలం.  పోపొమ్మని దూరం చేస్తే తేరుకోగలం. 

 కానీ... అదే... 
కినిసిన గాలి ఊగిపోయి ఈదురుగాలి వీస్తే,  
వేగిన నేల వీగిపోయి చీలిపోతే,  
అలిగిన నీరు పొర్లి పొంగిపోతే, 
కనలిన నిప్పు మంటగా మండి బుస కొడితే, 
మూగిన మబ్బు ఆగని దారలుగా కురిస్తే - 
అప్పుడు కలిగే అలజడికి  ఎదురు నిలవలేం. 
అప్పుడు తగిలే దెబ్బకి ఆయువుంటే తప్ప కోలుకోలేం.

    ఏది ఏమైనా ప్రకృతి మాత్రం గతి తప్పకుండా, ఆగ్రహించకుండా వుంటేనే మనిషి మనుగడకి మన్నిక. నవంబర్ వచ్చినా రంగులు మారని చెట్లని చూసిన నా దిగులుకి అదీ కారణం. 

*******
*******

    రంగు మారిన ఆకులు కనువిందుగానే ఉంటాయి - కానీ తొందరలోనే రాలిపోతాయి. అప్పుడు అప్పటివరకు రంగులతో కళకళలాడిన చెట్లు మోడులవుతాయి. 

    నిజానికి ఆ మోడయిన చెట్లని చూస్తే దిగులనిపించాలి. 

    కానీ నాకు మాత్రం మోడులయిన ఆ మానులు  రాబోవు చలికారుని - మౌనులై,  ధ్యానమూర్తులై -  స్వాగతిస్తున్నట్టు  కనిపిస్తాయి. 

    ఎండ పొడ దక్కనీయని చలికాలాన్ని వద్దనుకోక, రావద్దనక  - కొమ్మల తోనూ, రెమ్మల తోనూ రారమ్మని పిలిచి మరీ అందుకొంటున్నట్టుంటాయి. 

    "మంచో, చెడో - ఏది నీ దరికి వచ్చినా - అది నీది. జీవితంలో దేన్నీ వద్దనుకోకు" అని చెప్తున్నట్టుంటాయి. 

    ఆకులు రాలే వేళ కూడా అడలక - "అద్దిరబన్నా - అదరము, బెదరము - చెదరక నిలిచెదము" అని తలెత్తుకుని నించున్నట్టుంటాయి. 

    రాలుపు-పండగ చేసుకుంటున్నట్టుంటాయి. 

*******
*******


వేసవి యెండల సొక్కి 
ముసిరిన వానల సోలి 
కొలువు తీరి నిల్చినవి 
సోలుపుగా నిలకడైనవి 

వేరు పఱచి నిల్చిన చెట్లవి 
పుడమి పుట్టువులవి 
ఉసురుకి ఉనికిపట్టులవి
ఉల్లసానికి ఆటపట్టులవి  

అప్పుడె కబురందిందేమో!
ఆవల పొంచి వున్నది శీతకారు యని ... 
దయలేక దరిజేరునని!
 ఆనక ముంచుకొచ్చు చలి మంచులవి... 
 వెల్ల వెల్లువై కమ్మునని!

కొమ్మకొమ్మ అద్దిరని లేచినవి 
 రెమ్మరెమ్మ ఊసులాడుకున్నవి 
ఈనెలీనెల రంగులూరుకున్నవి 
ఆకునాకున తొగరు నింపుకున్నవి 

ఆగపు గాలిని రారమ్మని సాయమడుగుకున్నవి 
మొయిలు వంపు నీటిజాలున తానమాడుకున్నవి 

దుమ్ము కరిగి దూలి జారి 
కొమ్మలనున్న ఆకులన్ని మెరిసె - తళతళా!
రెమ్మలనున్న అలములన్ని మురిసె - మిలమిలా!

గాలి తాకి - కొమ్మరెమ్మ - ఊగు వేళ 
ఆకులన్ని - ఊగి తూలి - నేల తాకు వేళ 
రాలుపూ ఓ వేడుకే... జలజలా! 
ఆకురాలు ఓ పండగే... గలగలా!

*******
*******

    ఈ మధ్య ఇటు ఇంటా - అటు ఆఫీసంతా పనిలో మునిగిపోయి చెట్లనీ, నా చుట్టుపక్కలనీ అంతగా పట్టించుకోకుండానే రోజలు గడిచిపోతున్నాయి.  

    మొన్న బుధవారం మధ్యాహ్నం అనుకోకుండా కిటీకీ లోంచి బయటికి చూసిన నాకు కళ్ళు చెదిరాయి.
   
    నా కళ్ళు, కళ్ళతో పాటు మనసుని చెదరించిన ఆ రంగులకలని - అలాగే ఒడిసి పట్టకపోతే కల చెదిరి కన్నుమఱుగవుతుందని దడిసి - చేతిలో వున్న ఫోనుకన్నుతో క్లిక్కుమనిపించా... 






ఏమి ఎఱుపది? 
    ఎంత మెఱుపది?
    పూసిరెవరు పసుపది?
    మెత్తిరెవరు కావిరంగది?

    ఆ రంగులు చూస్తూ కన్నుని మిన్ను కేసి తిప్పానో లేదో - అక్కడేముంది?

    మిన్ను ఎత్తిన మొయిలు గొడుగది... 
    మొయిలు జారిన చినుకు జల్లది... 

    జల్లుదారుల కన్ను నిలిపి నేల వంకకి తిరిగి చూస్తే... 

    చినుకు తోడు వీచిన తూర్పుగాలది... 
    గాలి ఆగి - మబ్బు తేలి - మెఱుపులద్దిన ఎండవాలది!
    గాలి సోకి - సోలి తూలి - నేలకంటిన రంగుటాకు తివాసది!
  
    *******
    *******


      మా ఇంటి కిటికీ లోంచి కనిపిస్తున్న ఆ సింగారాల రంగురంగుల దారిని, అక్కడ ఆగిఆగి వీస్తున్న చల్లటి గాలిని చూస్తుండగా చటుక్కున నాకో పాట గుర్తొచ్చింది "మోరే అంగనా మే - జబ్ పురవైయా చలీ ....మోరే ద్వారే కీ - ఖుల్ గయీ - కివాడియా" అంటూ. 

    ఆ పాటే ... "సాహెబ్ బీబీ ఔర్ గులాం" సినిమాలో గీతాదత్ పాడిన "పియా ఐసో జియా మే సమాయ్ గయో రే... " పాట. 

    పాట రాసిన వారు షకీల్ బదాయూనీ. పాటకి సంగీతం కూర్చినవారు హేమంత్ కుమార్. 

    పాటలో నటించినవారు - అభినేత్రి బల్-మీననేత్రి మీనాకుమారి, ఇంకో ఇద్దరు అమ్మాయిలు. 

    ఈ పాటలో గీతాదత్ స్వరం -  కొంచెం కొంటెగా, ఇంకొంచెం బిడియంగా, ఒకచోట చిలిపిగా, ఇంకోచోట నవ్వుల చిలుకుగా,  సుంత అలుకగా, కసింత కినుకగా, రవంత మురిపెంగా - వెరసి బోల్డంత ప్రేమగా - సప్తవర్ణభరితసమ్మోహనం. 

   ఈ పాటలో వినిపించే హిందీ - ఏ ప్రాంతపు యాసో కానీ - భలే గీరగా గమ్మత్తుగా వుంటుంది. 

    ఈ పాటలో ఒక తమాషా అయిన వాక్యం ఒకటి  - ఇస్ డర్ సే - కే - పీ కీ - నజ్ర్  న లగే...

మామూలుగా హిందీలో "నౙర్ (nazar) అని వినిపించే మాట ఈ పాటలో "నజ్ర్  (najr)" అన్నట్టు వినిపిస్తుంది. 

    అలాగే "నజర్ న లగే" కి ముందు మాట "పీ కీ". పాటకి నటిస్తున్న మీనాకుమారి పెదవుల కదలిక చూస్తే అది "కిసీ కీ నజర్ న లగే" అన్నట్టు కాక "కే పీ కీ నజర్ న లగే" అన్నట్టే వుంటుంది. 

    ఇలాంటప్పుడు నాకు ఇంకొంచెం హిందీ వచ్చుంటే బావుండును కదా అనిపిస్తుంది. 

    ఇహ ఈ పాటలో మీనాకుమారి అద్దం ముందు కూర్చున్న ప్రతి భంగిమా ఒక అందమైన చిత్రపటంలా వుంటుంది. 

    ఎద నిండా నిండిన మనోహరుని తలపులో తనువు-మనసు మరిచి - ఆ పరధ్యానంలో ముంగురులని వేలితో రింగులుగా చుట్టుకోవడం... (పియా ఐసో జియా మే - సమాయ్ గయో రే... కే ... మై తన్ మన్ కీ - సుధ్-బుధ్ - గవా బైఠీ)

    ఏ సడి విన్నా మదినున్నవాడు వచ్చాడనుకొని కళ్ళతో వెతుకుతున్నట్టు చూడడం (హర్ ఆహట్ పే - సమ్‌ఝీ - వో ఆయ్ గయో రే)

    ఆవిడ చేసుకున్న అలంకారపు తళుకుల కన్నా మిన్నగా మెరిసిన కన్నుల వెలుగులు - ఆ సొగసు, సోలుపు - అద్భుతం! 

   మీరు కూడా ఆ అందమైన పాటని - పాడుకుంటూ - చూసెయ్యండి మరి! 

యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=tUn8NNFKXQs




పియా ఐసో జియా మే - సమాయ్ గయో రే... 
కే ... మై తన్ మన్ కీ - సుధ్-బుధ్ - గవా బైఠీ 

పియా ఐసో జియా మే - సమాయ్ గయో రే... 
కే .. మై తన్ మన్ కీ - సుధ్-బుధ్ - గవా బైఠీ 

హర్ ఆహట్ పే - సమ్‌ఝీ - వో ఆయ్ గయో రే 
హర్ ఆహట్ పే - సమ్‌ఝీ - వో ఆయ్ గయో రే 
ఝట్ - ఘూంఘట్ మే - ముఖ్‌డా ఛుపా బైఠీ... 

పియా ఐసో జియా మే - సమాయ్ గయో రే... 

మోరే అంగ్‌నా మే - జబ్ - పురవైయా చలీ  
మోరే ద్వారే కీ - ఖుల్ గయీ - కివాడియా 
మోరే అంగ్‌నా మే - జబ్ - పురవైయా చలీ  
మోరే ద్వారే కీ - ఖుల్ గయీ - కివాడియా 
ఓ దయ్యా.. ద్వారే కీ - ఖుల్ గయీ - కివాడియా
మైనే జానా - కే  - ఆ గయే సావరియా మోరే
మైనే జానా - కే  - ఆ గయే సావరియా మోరే
ఝట్ - ఫూలన్ కీ సజియా పే జా బైఠీ... 

పియా ఐసో జియా మే - సమాయ్ గయో రే... 
కే ... మై తన్ మన్ కీ - సుధ్-బుధ్ - గవా బైఠీ 
పియా ఐసో జియా మే - సమాయ్ గయో రే... 

మైనే - సిందూర్ సే - మాంగ్ అప్‌నీ భరీ
రూప్ - సైయ్యా కే కారణ్ - సజాయా
మైనే - సిందూర్ సే - మాంగ్ అప్‌నీ భరీ
రూప్ - సైయ్యా కే కారణ్ - సజాయా
ఓ ... మైనే - సైయ్యా కే కారణ్ - సజాయా
ఇస్ డర్ సే - కే - పీ కీ - నజ్ర్  న లగే
ఇస్ డర్ సే - కే - పీ కీ - నజ్ర్  న లగే
ఝట్ - నైనన్ మే - కజ్‌రా లగా బైఠీ

పియా ఐసో జియా మే - సమాయ్ గయో రే... 
కే .. మై తన్ మన్ కీ - సుధ్-బుధ్ - గవా బైఠీ 

హర్ ఆహట్ పే - సమ్‌ఝీ - వో ఆయ్ గయో రే 
హర్ ఆహట్ పే - సమ్‌ఝీ - వో ఆయ్ గయో రే 
ఝట్ - ఘూంఘట్ మే - ముఖ్‌డా ఛుపా బైఠీ... 

పియా ఐసో జియా మే - సమాయ్ గయో రే... 

*******
*******

ఆడుతూ పాడుకుంటే
ఆటలూ - పాటలూ
Autumn లో  పాట వింటే
ఆటమ్లూ - పాటలూ

~ పాటల భైరవి 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి