కిందటి వారం అనుకోకుండా ఓ నాలుగు రోజులు కలిసొచ్చి కడలి అంచున నడిచే వీలు కుదిరింది.
అలా కలిసొచ్చే కాలానికి సముద్రపొడ్డున నడిచొచ్చే పొద్దులు దొరకడానికి పూర్వపు అంకం ఏంటంటే...
మార్చ్ 18న బుజ్జిజింక స్కూల్ ఆర్కెస్ట్రాతో యూరప్ వెళ్ళాడు. మార్చ్ 20న బయల్దేరి బద్రి టెక్సస్‌లో ఉన్న కార్పస్ క్రిస్టి అనే ఊరు వెళ్ళాల్సి వచ్చింది.
ఇక ఇంట్లో నేనొక్కదాన్నే ఉండడం ఎందుకని బద్రి తనతో పాటు నన్ను కూడా కూడా కార్పస్ క్రిస్టి తీసుకెళ్లారు.
నాతో పాటే నా ఆఫీస్ లాప్‌టాపూ, సరంజామా కూడానూ.
*******
*******
అలా కిందటి ఆదివారం (3/20) బయల్దేరి వెళ్లినవాళ్లం మళ్లీ గురువారం (3/24) సాయంత్రానికి ఇంటికి తిరిగివచ్చాం.
కార్పస్ క్రిస్టిలో ఉన్న పుంజీడు రోజులూ - పగలు ఆఫీస్ పనితో ఎప్పట్లాగే ఎండ పొడ తగలకుండా గడిచిపోయాయి.
కానీ సాయంత్రాల్లో మాత్రం ఒకప్పటి సలిల్ చౌధరి మాటల్లో మురిపించిన "సాంఝ్ కీ దుల్హన్" సముద్రపు అంచుల్లో దృష్టమయ్యే అదృష్టం దక్కింది.
కాకపోతే వెంటనే ఫోటో తీయకపోవడం వల్ల కెంజాయ రంగులో ఆకాశంలో మెరిసిన ఆ సంజ-పెళ్లికూతురు నా కంటికి ఆనిన ఓ గురుతు గానే మిగిలిపోయింది.
ఆ గురుతుకి గుర్తుగా ఆ పాటలో నాకు నచ్చిన నాలుగు మాటలూ ఇక్కడ రాసుకుంటున్నా...
("ఆనంద్" సినిమాలో సలిల్ చౌధరి రాసిన పాట)
కహీ దూర్ ... జబ్ దిన్ ధల్ జాయే...
సాంఝ్ కీ దుల్హన్ బదన్ చురాయే... చుప్‌కే సే ఆయే...
మేరే ఖయాలోం కే - ఆంగన్ మే -
కోయీ సప్‌నోం కే - దీప్ జలాయే...
*******
*******
ఆదివారం సాన్ ఆంటోనియో ఏర్‌పోర్ట్‌లో దిగి, రెంటల్ కార్ తీసుకుని కార్పస్ క్రిస్టి వెళ్తూ - దార్లో ఆగి భోజనం చేస్తున్నప్పుడే బద్రి చెప్పారు - కార్పస్ క్రిస్టి వెళ్తూనే ఒకవేళ కుదిరితే USS లెక్సింగ్‌టన్ మ్యూజియం చూద్దామని.
ఎందుకంటే - ఆదివారం తప్పితే మిగిలిన వర్కింగ్ డేస్‌లో మా ఇద్దరి ఆఫీసులు అయేటప్పటికి ఆలస్యం అయితే మేముండబోయే నాలుగు రోజుల్లో ఇక ఆ మ్యూజియం చూడడం పడదు - అందుకని!
USS (United States Ship) లెక్సింగ్‌టన్
(రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్లైట్ కేరియర్‌గా పనిచేసిన పెద్ద యుద్ధనౌక)
అనుకున్నట్టుగానే - భోంచేసిన వెంటనే కారులో బయల్దేరి సరాసరి USS లెక్సింగ్‌టన్ మ్యూజియం చేరేటప్పటికి సరిగ్గా సాయంత్రం నాలుగయ్యింది.
అక్కడ మ్యూజియం తెరిచుండేది ఐదుగంటల వరకే అని రాసున్న బోర్డ్ చూసి గబగబా టికెట్లు కొనుక్కుని లోపలికి వెళ్లాము.
అప్పుడే మ్యూజియంలో ఉన్న థియేటర్‌లో "ఏర్‌క్రాఫ్ట్ కేరియర్ - గార్డియన్ ఆఫ్ ద సీ" అనే ఓ ఇరవై ఆరు నిముషాల సినిమా మొదలవుతోందని తెలిసింది. ఆ సినిమా చూసి బయటికి వచ్చేటప్పటికి మాకు ఇంకా అరగంట సమయం మిగిలింది.
ఆ ఉన్న అరగంట లోనే ఆ యుద్ధనౌకలో ప్రయాణించేటప్పుడు అమెరికన్ సైనికులు వాడిన బంక్ బెడ్లు, ఆ తర్వాత నౌక పైకి వెళ్లి అక్కడ పార్క్ చేసి ఉన్న యుద్ధవిమానాలు చూసి ఐదు గంటల కల్లా బయటికి వచ్చేశాం.
లెక్సింగ్‌టన్ మ్యూజియం ఉన్న బీచ్ పేరు నార్త్ బీచ్. చుట్టూ ఉన్న సముద్రం "కార్పస్ క్రిస్టి బే".
ఆ యుద్ధనౌక వైపు వెళ్తుంటే కుడి పక్కన ఒక గట్టులా కనిపించింది. సముద్రం నీళ్లలో దాదాపు ఒక ముప్పాతిక మైలు దూరం సేతువులా కట్టి ఉన్న ఆ గట్టు - ఒక fishing pier - అంటే చేపలు పట్టుకునే గట్టు.
బద్రి, నేను - ఇద్దరు మాత్రం పక్కపక్కన నడవగలిగే - ఆ గట్టు మీద నడుచుకుంటూ సముద్రం లోపలివెళ్లి వెనక్కి తిరిగి వచ్చాము.
అంత చిన్నగట్టు మీదే - పిల్లలతో సహా కొన్ని కుటుంబాలు కేంపింగ్ కుర్చీలు వేసుకుని కూర్చుని చేపలు పట్టుకుంటున్నారు.
అక్కణ్ణించి ఇవతలికి వచ్చి కాసేపు ఆ సముద్ర తీరం వెంబటే కాసేపు నడిచి - అక్కడ "కేర్ కేర్" మంటూ అరుస్తూ తిరుగుతున్న సముద్రపు పక్షులని చూసుకుంటూ - చీకటి పడుతుండగా భోంచేసి మా హోటల్ గదికి వెళ్లిపోయాం.
*******
*******
ఇక కార్పస్ క్రిస్టిలో ఉన్న నాలుగు రోజుల్లో - నేను చూసింతలో ... నాకు అనిపించిందేంటంటే
కడలి అలలది - అద్దరి...
ఆ దరి
కదిలే కార్లది - ఇద్దరి...
ఈ దారి
కడలి దరికి - కార్ల దారికి
నడుమనున్న కార్పస్ క్రిస్టి
అనిపించె నాకు
కడు బీదఱి
*******
*******
సోమవారం ఎక్కడికీ వెళ్ళలేదు.
ఆఫీసు వేళ మీరేటప్పటికి ఆచ్చి-వేళ కాస్తా ఆకలి వేళ అయిపోయింది.
తొందరగా ఆమ్ తినేసి "అమ్మయ్య" అయిందనిపించాం.
*******
*******
మంగళవారం, బుధవారం కూడా ఒకే ప్రదేశానికి వెళ్ళాం. అది "కోల్ పార్క్ పియర్ (Cole Park Pier)".
ఆదివారం రోజు నార్త్ బీచ్‌లో మొదటి సారి నడిచిన దాని కంటే కొంచెం షోగ్గా ఉంది గానీ ఇది కూడా ఒక చేపలు పట్టే గట్టే.
సముద్రం లోపలి నడవడానికి ఒక రాంపూ, ఆ రాంప్ చివర్న గుండ్రంగా కట్టిన రెయిలింగ్ గోడలు, ఆ గోడల వెంబడి సిమెంటు దిమ్మెల మీద బిగించి వేసిన చెక్క కుర్చీలు ఉన్నాయి.
వాటిల్లో కూర్చుని బోల్డంత మంది బోల్డుబోల్డన్ని చేపలు పట్టుకుంటున్నారు.
మేమక్కడ ఉన్నప్పుడే ఒకతను ఎంత పెద్ద చేపను పట్టాడో! అంత దగ్గర్నుంచి అప్పుడే పట్టిన అంత పెద్దచేపను చూడడం నాకు అదే మొదటిసారి.
*******
*******
ఈ కోల్ పార్క్ చేపలగట్టు నుంచి వెనక్కి తిరిగి వస్తుంటే రాంపుకి రెండు పక్కలా ఉన్న రెయిలింగ్ మీదుగా కనిపిస్తున్న సముద్రపుటలలు నాతో పాటు నడిచొస్తున్నట్టనిపించాయి.
చిన్నప్పట్నుంచీ - ఎప్పుడు సముద్రాన్ని చూసినా అలలు ఎలా కనిపిస్తాయీ ?
అక్కడెక్కడో - మింటిని తాకుదామని పైకి ఎగిసి - ఒక్కసారిగా విరిగి పడి - అందని మింటి కన్నా అందే మంటి మిన్న అనుకున్నట్టు - "పట్టుకో - పట్టుకో" అంటూ పరిగెత్తుకొస్తున్నట్టుండే అలలే కనిపిస్తాయి కదా!
కానీ - ఆ కోల్ పార్క్ చేపలగట్టు నుంచి ఒడ్డుకి నడిచొస్తుంటే - అప్పుడు మాత్రం - అప్పటి దాకా నేనెప్పుడూ చూడని తమాషా.
ఉప్పొంగుతున్న ఉప్పుసముద్రపుటలలు నాతో పాటుగా "నువ్వు ముందా - నేను ముందా?" అంటూ ఉరికురికి వస్తున్నట్టు - నేను రాంపు మీద కాక అలల మీద నడుస్తున్నట్టుగా - భలేగా అనిపించింది.
*******
*******
నా అడుగుల వెంట అలలలలుగా పరిగెట్టుకొచ్చిన ఉబ్బు-నీళ్ల సరదా నా కన్నులని ఇంకా మెరిపిస్తూనే ఉండగానే - నన్నింకా ఇంకా మురిపించే గమ్మత్తు ఒకటి ఒడ్డునున్న పార్కులో కనిపించింది.
పచ్చికలో వాలి - పక్కపక్కనే - పడుక్కుని కబుర్లు చెప్పుకుంటున్నట్టున్న రెండు చెట్లు నాకెంత నచ్చాయో!!
*******
*******
అన్నట్టు - అంబుధి అంటే సంస్కృతంలో రెండర్థాలు ఉన్నాయండోయ్!
అంబుధి - అంటే అంబు అంటే నీరు కలది - సముద్రం.
అంబుధి - అంటే నాలుగు అంకె కూడా.
అందుకే - ఇవాళ్టి నా కబుర్లకి "అంబుధి పొదికిట అంబుధి పొద్దులు" అని పేరెట్టుకున్నా.
అంటే - కడలి ముంగిట మూడున్నొక్క పూటలు - అని అర్థమన్నమాట...
*******
*******

అంబుధి పొదికిట అంబుధి పొద్దులు..
రిప్లయితొలగించండిభలే పదాలు! ఎంత ముద్దుగా, ఆశ్చర్యం గా అందం గా ఉంటాయో! మాకు కూడా కొత్త పదాలు శ్రమ పడకుండా తెలుస్తాయి.
చాలా మంచి కబుర్లు! Thank you
నా కబుర్లు మీకు నచ్చుతున్నందుకు సంతోషం! Thank You!
తొలగించండిఇలా కూడా అంటే ఒక బ్లాగ్ లో ఇంత బాగా వ్రాయటం వీలవుతుందా అనిపించింది .
రిప్లయితొలగించండివీలవుతుందండి! నా కబుర్లు చదివి మెచ్చుకున్నందుకు చాలా థాంక్స్!
తొలగించండి