1, మే 2022, ఆదివారం

డీ జే టిల్లు డాన్సు చూడ - దిల్లంతా తిల్లాన పాడు...

ముందుగా నాదో సినీ-మాట...

తెర నిండా వెలిగిపోతూ 
కదిలే బొమ్మలు చెప్పే కబుర్లూ, 
మాటలూ, పాటలూ, ఆటలతో నడిపే కథలూ 
ఇంతకుముందెన్ని చూశానో!
ఇపుడెన్ని చూస్తున్నానో!
ఇకముందెన్ని చూడబోతానో!

ఎన్ని చూసినా - 
ఇంకెన్ని చూస్తున్నా - 
మరిన్ని చూడబోతున్నా - 
నే నేర్చుకున్న సిని-మా-పాఠమేంటీ అంటే...

ఎప్పటికే సినిమా చూస్తుంటే 
అప్పటికదే ప్రస్తుతం...
ఇంకేదైనా మరి అప్రస్తుతం...

అలా చూడగలగడం నాకు దక్కిన సిని-మా-వరం
అలాక్కనుకే చూడగలుగుతున్నా వారం వారం... 

*** *** ***
*** *** ***



    ఈ మధ్య కాలంలో - అనుకోకుండా ఒకసారి చూసి - చూసీ చూడగానే తెగ నచ్చేసి - చూసిన సిన్మానే మళ్ళీ చూద్దామా అనిపించి - అనిపించిన వెంటనే 'మళ్లింకెప్పుడైనా' అనుకోకుండా - మళ్లింకొక్కసారి చూసిన సినిమా "డీజే టిల్లు". 

    మొదట్లో "డీ జే టిల్లు" పేరు విన్నప్పుడు నేనసలు ఇది తెలుగు సినిమా అనుకోలేదు. నిజం చెప్పాలంటే అంతగా పట్టించుకోలేదు. 

    నేను ఎప్పుడూ వచ్చే వార్తాపత్రికల్లో వార్తలు అసలెప్పుడూ చదవను, కానీ ఎప్పుడైనా సినిమా వార్తలు మాత్రం చదువుతుంటాను. 

    ఓ సారలా చదువుతుంటే "డీ జే టిల్లు" హీరో సిద్ధు జొన్నలగడ్డ ఎవరో ఒక విలేఖరి ఆ సినిమా హీరోయిన్ గురించి అసందర్భంగా అడిగిన ఓ ప్రశ్నకి మహా సందర్భోచితంగా సమాధానం చెప్పి తప్పించుకున్న వార్త నాకు భలే నచ్చింది. 

    ఈ అబ్బాయి ఎవరో నిజంగానే "వీరో" అనిపించింది. 

    అలా అనిపించింది కానీ సిద్ధు జొన్నలగడ్డ పేరు వినగానే పాండెమిక్ రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన "కృష్ణ ఎండ్ హిజ్ లీలా" గుర్తుకొచ్చి "వద్దులే...బాబూ... మాటలు కూడా ఆ అబ్బాయే రాసుకుంటాడు. నాకు నచ్చవు. చూడడమెందుకు... మళ్లీ ప్చ్..ప్చ్ అనుకోవడమెందుకు" అని నాలో నేనే అనుకుని, నాతో నేనే గట్టిగా మాట్లాడుకుని "డీ జే టిల్లు" చూడొద్దంటే చూడొద్దనుకున్నా. 

    కానీ "సీన్ సీన్ పే లిఖా హై దేఖ్‌నేవాలే కా నామ్!" అన్న నా-నుడి ప్రకారం ఆ నామం రాయబడ్డ సీను డీ జే టిల్లుదయ్యింది.

    ఆ సీను మీద రాయబడ్డ నామం నాదయ్యింది. 

    వెరసి పతీసహితంగా "డీ జే టిల్లు"ని  చూడడమయ్యింది. 

    బద్రికి , నాకు మా ఇద్దరికీ టిల్లు తెగ నచ్చేశాడు. ఎంత నచ్చాడంటే తోచీతోచని ఓ సాయంకాలం పూట రెండోసారి చూసేంతగా. 

*** *** ***
*** *** ***


    సినిమా మొదలైందగ్గర్నుంచీ ముగింపు దాకా - తెర నిండా చెమ్కీల తళతళలు, గుంగురు జుట్టుల గింగిరాలు, జోరుగ సాగే తెలంగాణ జిలుగులు - నాకు భలే నచ్చేశాయి. 

    సినిమా అంతటా సిద్ధు జొన్నలగడ్డ మాత్రమే వెలిగినా - ఆ వెలుగులకి మిగిలిన నటులందరూ కూడా తమ వంతు తళుకుల్ని కూడా కలిపి ఇంకొంచెం మెరిపించారు - కానీ వెలవెలపోలేదు. 

    కాఫీలో నెయ్యి కలుపుకుని తాగే క్రేజీ డీజే టిల్లు, 
    ఆ క్రేజీనెస్సుని చూసి కళ్ళు తేలేసే  టిల్లు వాళ్ళ నాన్న, 
    ఊళ్ళో కొన్న టీషర్టుకి ప్ర్రాడా లేబుల్ని ఇస్త్రీపెట్టెతో అతికించుకునే డీజే టిల్లు, 
    ఆ క్రేజీ పనుల్ని ఈజీగా తీసుకుని మురిసిపోయే టిల్లు వాళ్ళ అమ్మ,
    గల్లుగల్లుమనే డీజే టిల్లునే తల్లడిల్లేలా చేసిన నల్లచీర రాధిక,
    ప్రిన్స్ మహేష్బాబుకి చుట్టమేమో అనిపించే ప్రిన్స్ సిసిల్,  
    చలాకీగా ఉంటూ చులాగ్గా నవ్వించేసే బ్రహ్మాజీ, 
    చిట్టచివర్లో హాస్పిటల్లో T-man టిల్లు పట్టుకు తిరిగే ఎఱ్ఱ టెడ్డీబేరు, 
    టిల్లుకి ఆ బేరునిచ్చిన మెంటల్ డాక్టరు... 
    అందరూ బాగా చేశారు - 
    నవ్వించారు. 

*** *** ***
*** *** ***

    సినిమా చివర్లో - తనని మోసం చేసి డబ్బులున్న సూట్కేసుని పట్టుకుని షికారెళ్లిపోయిన రాధికని క్షమించేసి బెయిలిప్పించి - జైల్లోంచి బయటికి తీసుకొస్తాడు టిల్లు. 

    అంతే! అంతకు మించి ఇంకేం చెయ్యడు. 

    సినిమా మొదట్నుంచీ నాతో హీరోయిన్నుగా చేసింది కదా అని ఓ ఫీలైపోయి - చివరాఖరికయినా సరే దొరికేసిందని - ఓ చిందేసి, రాధిక మెళ్ళో దండేసి పెళ్లి చేసేసుకోడు. 

    ఎందుకంటే టిల్లు ఓ మామూలు గల్లీబాయ్-టిల్లు అంతే. సిన్మా హీరో కాదు. 

    అందుకే టిల్లు అంత నచ్చాడు. 

      

*** *** ***
*** *** *** 

    నాకు ఈ సినిమాలో బోల్డు నచ్చిన ఒక సీను. 

    పచ్చరంగు చెమ్కీ కుర్తా వేసుకుని పుట్టినరోజు పార్టీ చేసుకుంటున్న టిల్లు తన గర్ల్‌ఫ్రెండ్ రాధిక పార్టీకి రానందని బోల్డు దిగులు పడిపోతాడు. 

    ఎలాగైనా పార్టీకి రావల్సిందే, నువ్వు రాకపోతే పార్టీ చేసుకోనని అలుగుతాడు. 

    రాధిక వస్తానంటే ఆ అమ్మాయిని తీసుకురావడానికి బుగ్గల నిండా ఆపుకోలేని నవ్వునీ, నేల మీద కాలు ఆనకుండా పడే చిందులనీ తోడు తీసుకుని బయల్దేరుతాడు. 

    ఆ టిల్లు చిందుల వెనకాల వినిపించే వాద్యసంగీతం హుషారుగా -  "టిల్లు... టిల్లు... టిల్లు... టిల్లు" అంటూ లీలగా వినిపించే కోరస్ తమాషాగా ఉంటాయి. 

    అప్పుడు చూడాలి టిల్లుని...

ఒళ్లంతా మువ్వలైనట్టు ఘల్లుఘల్లుమంటుంటాడు
గుంగురుల ముంగురులతో గింగిరాలు తిరుగుతుంటాడు
తళుకుబెళుకు మిణుకుచుక్కలా మెరిసిపోతుంటాడు
తొణికితొణికి తుళ్ళుతున్న నీటిజల్లులా మురిసిపోతుంటాడు



    ఆ చిందులన్నీ అయ్యాక అపార్ట్‌మెంటు దగ్గర సంతకం పెట్టమన్న వాచ్‌మన్‌తో "తుంచి దాచిపెట్టుకో - తర్వాతదే ఆటోగ్రాఫైతది" అన్న టిల్లు మాటకి నవ్వులు జల్లుజల్లే! 

    ఆ తర్వాత - హత్య జరిగిన రాధిక ఇంట్లో  తన వేలిముద్రలు పడ్డ చోటల్లా టిష్యూతో తుడుస్తూ "ఓషన్ పార్కులో తిరిగినట్టు తిరిగా..." అని తనని తనే తిట్టుకోవడం - భలేవాడు టిల్లు. 


*** *** ***
*** *** ***


    
    ఈ సినిమా మొత్తమ్మీద నాకు ఎక్కువగా నచ్చినవి ఏంటంటే రెండు. 

    ఒకటి - ఎవరు మాట్లాడినా - ఎవరి మాటకైనా తడుముకోకుండా మాటకి మాట సమాధానం ఇచ్చేస్తూ - అప్పటికప్పుడు impulsve గా, spontaneous గా తెలంగాణ తెలుగులో జోరుగా హుషారుగా టిల్లు మాట్లాడిన తీరు. 

    రెండోది - టిల్లుగా నటించేటప్పుడు సిద్ధు జొన్నలగడ్డ body language, చాలా ప్రత్యేకంగా, సహజంగా ఉన్న అతని డాన్సు స్టెప్పులు. 

*** *** ***
*** *** ***


    అన్నట్టు  - ఈ సినిమాలో "టిల్లు అన్న డీజే పెడితే" పాటలో టిల్లుని వర్ణించే ఈ లైన్లు భలే వున్నాయి. 

    అరె చెమ్కీ షర్టు - ఆహా 
    వీని గుంగురు జుట్టు ఓహో 
    ... .... .... ... 
    ఈ గల్లీ సుట్టు ... ఆహా 
    అత్తరే జల్లినట్టు ... ఓహో 
    మస్తుగా నవ్విండంటే
    పోరిల దిల్లు ఫట్టు ... అదీ  


*** *** ***
*** *** ***

    ఈ సినిమాలో కనిపించే టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ ఎంత నచ్చాడో, ఆ టిల్లుతో కథని నడిపించిన దర్శకుడు విమల్ కృష్ణ కూడా అంతగా మెప్పించాడు. 

    విమల్ కృష్ణ, సిద్ధు జొన్నలగడ్డ కలిసి చేసిన టీం వర్క్ "డీ జే టిల్లు"కి బాగా కుదిరింది. 

    వీళ్ళిద్దరూ OTW లా  అంటే One-Time-Wonder లా ఇక్కడే ఆగిపోకుండా ఇంకా మంచి క్రియేటివ్ ఐడియాలతో బోల్డన్ని సినిమాలు తీస్తే బావుండును.  

*** *** ***
*** *** ***

    
    చివరాఖరిగా నాదో చిన్న మాట - ఓ సినీ మాట... 

    "డీ జే టిల్లు" చూసేటప్పుడు "మాయాబజారు" కళ్ళో, "మిస్సమ్మ" కళ్ళో, "అందాలరాముడు" కళ్ళో "శంకరాభరణం" కళ్ళో, "అడవిరాముడు" కళ్ళో, "జగదేకవీరుడు -అతిలోకసుందరి " కళ్ళో, "గీతాంజలి " కళ్ళో - ఇంకా చెప్పాలంటే  - ఇంతకు ముందు చూసిన ఏ ఒక్క సినిమా చూసిన కళ్ళ తోనో కాకుండా - "డీ జే టిల్లు" చూసే కళ్ళతో మాత్రమే చూశాను నేను. 

    ముందే చెప్పినట్టు...

    ఎప్పటికే సినిమా చూస్తుంటే 
    అప్పటికదే ప్రస్తుతం...
    ఇంకేదైనా మరి అప్రస్తుతం...

~సినీ-మా-లక్ష్మి




8 కామెంట్‌లు:

  1. నేను ఈమధ్య కాలంలో Theater lo బాగా ఎంజాయ్ చేసిన సినిమా DJ టిల్లు.

    అసలు ఎన్ని సార్లు చూసినా (ఆహా OTTకి ధన్యవాదాలు) హాయిగా నవ్వుకోవచ్చు..

    సిద్ధు బోయ్ అదరగొట్టేశాడు.. డైలాగ్స్ కూడా తానే రాసాడు అనుకుంటా.. చాలా ఈజీగా నటించాడు అనిపించింది.. వాళ్ల నాన్న క్యారెక్టర్ , నేహా శెట్టి ఇద్దరూ బాగా చేసారు.

    డీజే టిల్లు సాంగ్ అయితే ఎన్ని సార్లు విన్నా ఇంకా నచ్చుతుంది.. జోష్ తెస్తుంది విన్నప్పుడల్లా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి...మేమూ బాగా ఎంజాయ్ చేశాం - థియేటర్లో చూస్తే బావుండేది అని చాలాసార్లు అనుకున్నాం. Thanks for your comment.

      తొలగించండి
  2. D.J టిల్లు మీద నైస్ పోస్ట్ లలిత గారూ, నాకూ ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన సినిమా, ప్రత్యేకించి సిద్ధు డైలాగ్స్, నటన, ఎనర్జీ బాగా ఆకట్టుకుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పవన్‌గారూ! ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీ కమెంట్ నా బ్లాగ్‌లో! మీరు కూడా కొత్త పోస్టులు రాసినట్టున్నారు. వీకెండులో తప్పకుండా చదువుతాను. మీరన్నట్టు సిద్ధు energy, spontaneity భలే వున్నాయి.

      తొలగించండి
  3. డి జే టిల్లూ ముంగుర్లూ ఘుంఘుర్లూ భలేగా నచ్చేశాయి. ఇహ ఈ టిల్లూని చూడాల్సిందే. 😃

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చూడండి, చూడండి ...చూస్తే ఇంకా నచ్చుతాయి గుంగుర్లూ, గింగిరాలూ... :)

      తొలగించండి
  4. సినిమా చూడలేదు కానీ, టిల్లు చాలా నచ్చాడు. Trailer లో dialogues సరదాగా fresh గా ఉన్నాయి. టిల్లు పాట అయితే రోజూ వింటుంటాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కదా, పద్మజా! నాకు నచ్చిన టిల్లు నీకూ నచ్చాడని తెలియడం బావుంది. :)

      తొలగించండి