మూసిన కనురెప్పల మాటున
నాకొచ్చే కలలు
కంటి తెర మీద తేరగా కానవచ్చే
కదిలే బొమ్మలాటలు
కొన్ని కలలొచ్చినప్పుడు -
ఓపలేని ఏడుపులాంటిదేదో - బహు దుఃఖమొచ్చేస్తుంది.
వెక్కివెక్కి ఏడుస్తూ లేచిన గుర్తొకటుంటుంది
ఆ కలల్ని మరిచిపోగలిగితే బావుండుననిపిస్తుంది
కానీ అవే గుర్తుంటాయి.
మోయక తప్పని దించుకోలేని బరువులవి
మరిచిపోదామనుకున్నా వెంటాడి వేధించే కలవరాలవి
కొన్ని కలల్ని కనేటప్పుడే -
బోల్డు నచ్చేసి, నవ్వొచ్చేస్తూ వుంటుంది.
కలకల నవ్వుతూ లేచిన తలపొకటుంటుంది.
ఇవి పొద్దున్నకి గుర్తుంటే బావుండునని వుంటుంది
కానీ ఇవస్సలు గుర్తుండవు.
మాయలో ముంచి హాయిని పెంచే మురిపాలవి.
మరవకూడదనిపించి దాచుకోవాలనిపించే కల-వరాలివి.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
కలలు - కలవరాలో, కల-వరాలో - నా వరకు నాకు రెండు రకాలు.
కావాలనుకోకపోయినా మగత నిదరలో కనుగొనేవి ఒక రకం.
కావాలననుకుని పగటి వెలుగులో అనుకునేవి ఇంకో రకం.
ఇవాళ ఈ రెండు రకాల గురించి కబుర్లాడుకునే అదనూ, అవకాశమూ అదాటుగా అమిరాయి.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ముందుగా అనుకోకుండా కనుగొన్న రకం:
అనుకోకుండా వచ్చిన ఈ కల గురించి చెప్పాలంటే రెండువేలఇరవయ్యో సంవత్సరం మార్చ్ నెల ఇరవయ్యో తారీఖు (20-3-2020)కి వెళ్ళాలి. అక్కడ మొదలు పెడితే కానీ ఈ కల వ్యవహారం ఓ పట్టాన తేలదు.
అనగనగా ...అంటూ మొదలెడితే కానీ చెప్పే కబుర్లకో రూపూ, ఆ కబుర్ల నుంచి పుట్టే కథకో ఊపూ వుండవని నాకో నమ్మకం. అందుకే నేనిప్పుడలానే చెప్పబోతున్నా.
అనగనగనగా.... అప్పుడే కోవిడ్ కామ్‌గా పుట్టి కార్చిచ్చుగా మారిన కాలం.
వీధి తలుపు తెరిచి గాలి పీలిస్తే ఊపిరి ఆగిపోతుందని అడలిపోతున్న రోజులు.
అప్పటికి నా ఆఫీసు లాప్‌టాప్ నా దగ్గరికొచ్చి మూడేళ్ళు అయింది. దాన్ని లీజ్-రోల్ ప్రాసెస్‌లో వెనక్కి పంపేసి కొత్త లాప్‌టాప్ తెప్పించుకోవాలి. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఒకట్రెండు ఈ-మెయిల్స్ కూడా వచ్చాయి.
సరే! అప్పు తెచ్చుకున్న ఆఫీసు లాప్‌టాప్‌ని అప్పగింతలకి సిద్ధం చేస్తూ ఉండగా ఇంతలో - "కోవిడ్ వల్ల అన్ని ఆఫీసులూ మూసేస్తున్నామనీ - అందరూ ఎక్కడివాళ్ళు అక్కడే ఎవరింట్లో వాళ్ళుండి పోవాలనీ - ఎవరి దగ్గరున్న లాప్‌టాపులు ప్రస్తుతానికి వాళ్ళవాళ్ళ దగ్గరే వుంచేసుకోవాలనీ" ఒకదాని తర్వాత ఒకటిగా - గొలుసు కథల్లా - బోల్డు ఈ-మెయిళ్ళు వచ్చాయి.
అలా - అప్పట్నుంచీ అదే లాప్‌టాప్ వాడుతూ వున్నాను.
2020 వరకూ అయిన మూడేళ్ళూ, అప్పట్నుంచి ఇవాళ్టి దాకా అయిన ఇంకో ముప్పై మూడు నెలలూ - వెరసి మొత్తం మూణ్ణెల్లు తక్కువ ఆరేళ్ళుగా అదే లాప్‌టాప్ లీజ్-రోల్ కాకుండా నా దగ్గరే వుండిపోయినట్టు.
ఇలా వుంటుండగా ఏమైందంటే ఈ ఏడాది జూన్ లోనో, జులై లోనో ఒక రోజు రాత్రి నాకో కలొచ్చింది. అదేంటంటే నేను ఆఫీసు పని చేస్తుండగా నా లాప్‌టాప్ స్క్రీన్ మీద "నీ లీజ్-రోల్ అయిపోయింది. ఇక నువ్వు దీని మీద పని చెయ్యలేవు" అని ఠప్ మని లాప్‌టాప్ ఉలుకూ-పలుకూ లేకుండా ఉట్టేక్కేసినట్టు.
ఆ కల రాగానే నాకు హఠాత్తుగా మెలకువొచ్చేసింది.
"అమ్మో! అలా జరిగితే ఇంకేమన్నా వుందా? ఆ లాప్‌టాప్‌లో వున్న ఫైల్స్ అన్నీ పోతే అవన్నీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో కదా?!" - అన్న ఆలోచనతో కాసేపు నిద్ర పట్టలేదు.
మళ్ళీ నాకు నేనే - "ఇది కలే కదా! నిజంగా ఇలా జరిగే అవకాశమే లేదు"- సర్ది చెప్పుకుని పడుకున్నాను.
మరుసటి రోజు బద్రికి నాకొచ్చిన కల గురించి చెప్తే - మేమిద్దరం అదెంత వింత కలో అని నవ్వుకున్నాం.
ఆ తర్వాత ఆ కల గురించి మర్చిపోయాను.
కానీ... మొన్న గురువారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకి ఆఫీసులో అప్పటికి అరగంట ముందు మొదలైన ఒక మీటింగులో చేరి మాట్లాడుతూ వున్నాను.
ఇంతలో నా లాప్‌టాప్ స్క్రీన్ మీద "నీ లాప్‌టాప్ క్వారంటైన్ కాబడుతోంది. నువ్వింక దీని మీద పని చెయ్యలేవు. OK!" అని ఒక బెదిరింపు (warning-message) కనిపించింది.
వెంఠనే నా లాప్‌టాప్ తెర మీద చక్రాలు తిరగడం మొదలయ్యాయి. అవి తిరిగీ-తిరిగీ ఆగేటప్పటికి నా లాప్‌టాప్‌కి కళ్ళు తిరిగినట్టయ్యిందేమో పాపం! కిటికీలన్నీ మూసేసుకుని ముసుగు తన్నేసింది.
నేనేమో అలాంటి బెదిరింపులు లాప్‌టాప్ మీద ఇంతకు ముందెప్పుడూ చూసిన గుర్తు లేదు.
అందులోనూ ఆ quarantined అన్న మాట చూడగానే "అమ్మో! లాప్‌టాపులక్కూడా కోవిడ్ వస్తోందా ఏమిట్రా బాబూ!" అని బెంగేసేసింది.
అది కనిపిస్తూనే నా ఆఫీసు కనెక్షన్ పోయింది. అదృష్టవశాత్తూ ఫోన్ డిస్‌కనెక్ట్ కాలేదు కాబట్టి అస్క్రీన్‌వాణి లాగా మా టీముతో ఇంకా మాట్లాడగలుగుతున్నాను.
వెంటనే మీటింగులో నాతో మాట్లాడుతున్న వాళ్ళతో ఆ బెదిరింపు గురించి చెప్పి ఇంకెవరికైనా అలాంటి మెసేజ్ వచ్చిందా అనడిగాను.
వాళ్ళెవరికీ అదేంటో తెలీదని చెప్పి - అది ఏదో spam ఏమో అని ఒకళ్ళెవరో అన్నారు.
అది వింటూనే ఎందుకైనా మంచిదని నా లాప్‌టాప్‌ని రీ-స్టార్ట్ చేశాను. అయినా సరే ఆఫీసుకి కనెక్ట్ కానియ్యట్లేదు.
వెంటనే ఆ మీటింగు లోంచి బయటికొచ్చేసి మా ఆఫీసు హెల్ప్-డెస్క్‌కి ఫోన్ చేశాను.
అప్పుడు ఇనామ్ అనే అబ్బాయి సపోర్ట్ అబ్బాయి ఏం చెప్పాడంటే "మీ లాప్‌టాప్ మీ దగ్గరుండే రోజులు అయిపోయాయి. మీరు ప్రస్తుతానికి దీని మీద పని చెయ్యలేరు. కొత్త లాప్‌టాప్‌కి దరఖాస్తు పెట్టుకోండి.అదొచ్చాక దీన్ని unquarantine చేసి మీ ఫైల్స్ అన్నీ ఈ పాత లాప్‌టాప్ లోంచి ఆ కొత్త దాంట్లోకి మారుస్తాం" అని చెప్పేశాడు.
అది వింటూనే ఇనామ్‌కి - నాకంతకుముందొచ్చిన - నన్ను కలవరపరచిన - కల గురించి చెప్పకుండా వుండలేకపోయాను.
అది విన్న ఇనామ్ "మీ కల భలే నిజమయ్యిందే!" అని నాకో కితాబిచ్చి ఫోన్ పెట్టేశాడు.
మొదట నిద్రలో వచ్చినప్పుడు, తర్వాత నిజమై గుర్తొచ్చినప్పుడు కొంచెం కలవరపెట్టినా ప్రస్తుతానికి నా కల సుఖాంతమే.
నా కొత్త లాప్‌టాప్ ఆగ-మేఘాల మీద రేపొచ్చేస్తోంది.
ఇదీ... అనుకోకుండా నిద్రలో వచ్చేసి నిజమై పోయిన కలవరపు-కల కథ!
నా కల గురించి తలుచుకుంటే "ఇలా కలలన్నీ నిజమయ్యే కార్యక్రమాలు పెట్టుకుంటే ఎలాగబ్బా!" అనిపించింది. ఒకప్పుడు ఆత్రేయ రాసిన పాట వద్దనుకున్నా గుర్తొచ్చింది. అది ఈ కింద రాసిపెట్టా. పల్లవి గుర్తున్న వాళ్ళు పాడేసుకోండి.
కలలకు భయపడిపోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా!
సత్యాలన్నీ నరకాలేగా!
స్వప్నం సత్యమైతే వింత...
సత్యం స్వప్నమయ్యేదుందా ?
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఇహిప్పుడు అనుకుని కలగన్న రకం:
నాకెప్పుడూ - "రేపు ఇలా ఉండాలీ. ఇలా ఉంటేనే బావుందనుకోవాలీ" అనుకోవడమూ, దాని కోసం పెద్దపెద్ద కలలు కనడమూ తెలీదు.
కానీ నా కోసం నేను - అనుకుని మరీ - నాకు నేనుగా తీర్చుకోగలిగిన - చిన్నచిన్న కలలు కంటూ ఉంటాను.
ఓ కాయితం మీద నాలుగ్గీతలు కుదురుగా గీసి బొమ్మేయడం, దాని కింద పేరు రాయకుండా నేను గీసిన బొమ్మేదో నేనే గుర్తించలేకపోవడం కల ఎంత మాత్రం కాదు. అది కల కాలేని నిజం. అందుకని బొమ్మలు గీయాలనే నా కలని ఎవరో వేసిన బొమ్మలకి రంగుపెన్సిళ్ళతో నింపేసి తీర్చేసుకుంటూ వుంటా. ఇది నేను అనుకుని కని తీర్చుకునే చిన్నకల.
ఏడాదికోసారి దసరా నవరాత్రులొచ్చేలోగా పాత అలిండియా-రేడియో వారి భక్తిరంజని స్తోత్రమేదో వెతికి పట్టుకుని దానిని కంఠస్థం చేయడం కూడా నేను పదేపదే కావాలనుకుని కనే ఇంకో కల. ఇది ప్రతీ ఏడాదీ తీరుతుందని పూచీ ఏమీ లేదు. ఒక్కో ఏడాది - నచ్చిన పాట దొరకలేదనో, దొరికినా నేర్చుకునే వీలు కుదరలేదనో - ఈ చిన్నపాటి పాట-కల కూడా నెరవేరదు.
ఈసారి మాత్రం నా ఈ రెండు కలలూ తీరాయి.
ఒకటి బొమ్మలకి నే వేసిన రంగుల కల.
అటొచ్చి ఓ రంగూ, ఇటొచ్చి ఓ రంగూ - చేతికొచ్చినదేదో వేసి - రంగులు నింపేశా. ఇదిగో ఈ కిందున్నది అదే!
చిన్నప్పుడు చదువుకున్న కథలో పరుగు పందాలేసుకునే కుందేలు-తాబేలు ఈ బొమ్మలో మాత్రం బోల్డంత ఫ్రెండ్లీగా కనిపిస్తున్నాయి. అదే నాకు బోల్డంత నచ్చేసింది. ముందసలు ఆ తాబేలుకి నలుపూ-తెలుపూ రంగులేసేద్దామనుకున్నాను. కానీ తాబేల్ని ఎక్కడ చూసినా మరీ రంగుల్లేకుండా వెలవెలా పోతుండడం గుర్తొచ్చింది. అందుకే తాబేలు-డిప్పలో ఒక్కో గడికి ఒక్కో రంగేశా.
ఈ ఏడాది నా పాట-కల కూడా నిజం చేసుకున్నా.
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలుపెట్టి ద్వాదశి నాటికి దేవీ నవరత్నమాలికా స్తోత్రం నేర్చుకున్నా.
అదే ఈ కింద రాసి పెట్టుకున్నా.
ఈ దేవీ నవరత్న మాలికా స్తోత్రానికి పాఠాంతరాలు వున్నాయి కానీ నేను విన్న భక్తిరంజని (ఆలిండియా రేడియో) వారి స్తోత్రాన్ని అనుసరించి ఇది నేర్చుకున్నా - రాసుకున్నా.
ఈ స్తోత్రం భుజంగ-ప్రయాత వృత్తంలో రాశారట ఆదిశంకరులు. ఈ విషయం నాకు తెలియకముందే ఈ స్తోత్రం విన్నప్పుడు ఇందులోని పాదాలన్నీ ఒక దీర్ఘమైన గతిలో మెలికలుగా సాగుతున్నట్టనిపించింది. నేర్చుకోవడానికి కొంచెం కష్టపడ్డాను.
పది-పదిహేను రోజులుగా పొద్దున్నే లేవగానే ఒకసారి, రాత్రి పడుకోబోయేముందు ఇంకోసారి వింటూ మొత్తానికి నేర్చేసుకుని నా కల-వరాన్ని సొంతం చేసుకున్నా.
కాకపోతే నేను విన్న స్తోత్రంలో కొన్ని చోట్ల సంస్కృతపదాలు స్పష్టంగా వినిపించలేదు. అక్కడక్కడా బ్లాగుల్లో దొరికిన పాఠాంతరాల్లో ఈ స్తోత్రం లోని కొన్ని మాటలు సరిగ్గా అర్థవంతంగా అమరినట్టనిపించట్లేదు. అందుకని ప్రస్తుతానికి ఇక్కడ నేర్చుకున్న గుర్తుగా రాసిపెట్టుకున్నాను, కానీ మళ్ళీ వెనక్కి వచ్చి ఏమన్నా తప్పులుంటే సరిచేసుకుంటాను.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
హార నూపుర కిరీట కుండల విభూషితావయవ శోభినీం
కారణేశవరమౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికాం
కాలకాల ఫణిపాశ బాణ ధనురంకుశావరమేఖలాం
ఫాలభూతిలకలోచనాం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం ||
గంధసార ఘనసార చారునవనాగవల్లిరసవాసినీం
సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం
మందరాయతవిలోచనాం అమల బాలచంద్ర కృతశేఖరీం
ఇందిరారమణసోదరీం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం ||
స్మేరచారుముఖమండలాం విమలగండలంబిమణిమండలాం
హారదామ పరిశోభమాన కుచభారభీరుతనుమధ్యమాం
వీరగర్వహరనూపురాం వివిధకారణేశమణిపీఠికాం
మారవైరిసహచారిణీం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం ||
భూరిభారధర కుండలీంద్రమణిబద్ధ భూవలయపీఠికాం
వారిరాశి మణిమేఖలావలయ వహ్నిమండల శరీరిణీం
వారిధారవహకుండలాం గ్రహశేఖరీం చ పరమాత్మికాం
చారుచంద్రరవిలోచనాం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం ||
కుండలీ త్రివిధకోణమంటపవిహారిణీ పరివిభాసినీ
షట్-పుండరీక ముఖభేదినీం చ ప్రచండభానుభాసముజ్జ్వలాం
మండలేందు పరిహాహితామృతతరంగిణీం అమృతరూపిణీం
మండలాంత మణిదీపికాం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం ||
వారణానన మయూరవాహముఖ దాహవారణ పయోధరాం
చారణాది సురసుందరీ చికుర శేఖరీకృతపదాంబుజాం
కారణాది పతిపంచక ప్రకృతి కారణాం ప్రథమమాతృకాం
వారణాంత ముఖ పారణాం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం ||
పద్మకాంతి పదపాణిపల్లవ పయోధరానన సరోరుహాం
పద్మరాగ మణిమేఖలావలయనీ విశోభిత విలంబినీం
పద్మసంభవ సదాశివాంతమయ పంచవర్ణ మణిభాసురాం
పద్మినీం ప్రణవరూపిణీం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం
ఆగమ ప్రణవపీఠికాం అమలవర్ణ మంగళశరీరిణీం
ఆగమావయవ శోభినీం అఖిలవేదసారకృతశేఖరీం
మూలమంత్ర ముఖమండలాం ముదిత నాదబిందు నవయౌవనాం
మాతృకాం త్రిపురసుందరీం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం
కాళికా తిమిర కుంతలాంత ఘన భృంగ మంగళ విరాజినీం
చూలికా చికుర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం
వాలికా మధుర గండమండల మనోహరానన సరోరుహాం
కాళికాం అఖిలనాయకీం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం
ఫలస్తుతి:
నిత్యమేవ నియమేన జప్యతాం
భుక్తి ముక్తి ఫలదాం అభీష్టదాం
శంకరేన రచితాం సదా జపేత్
నామరత్న నవమాలికాపదాం
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఆదిశంకరులు ఈ దేవీ నవరత్నమాలికా స్తోత్రాన్ని భుజంగప్రయాత వృత్తంలో రచించారని కొన్ని బ్లాగుల్లో చదివి కాబోసనుకుని - అదే రాసుకున్నా.
కానీ నా బ్లాగ్ చదివిన శ్రీ నాగేశ్వరరావుగారి వ్యాఖ్యల పుణ్యమా అని - అది భుజంగప్రయాత వృత్తం కాదూ, సురనర్తకీ (తరంగక) వృత్తంలో వుందని తెలిసింది. (https://eemaata.com/em/issues/200707/1127.html)
నేనింతకు ముందే చెప్పినట్టు స్తోత్ర పాదాలు పాడుకోవడంలో తరంగ-గతి లోనే సాగుతున్నట్టనిపించడం, ఆ పైన అవన్నీ సురనర్తకీ (తరంగక) వృత్తంలో వున్నాయని తెలియడం - ఈ స్తోత్రం మీదా ఇష్టాన్ని ఇంకా పెంచాయి.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

చాలా మంచి స్తోత్రం గురించి రాసి, మళ్ళీ వినేటట్లు చేశారండీ, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిభుజంగప్రయాత వృత్తాన్ని భక్తిరంజనివారు అద్భుతంగా స్వరపరిచారు. గొప్ప కళాకారులు మనసుకు హత్తుకునేలా పాడారు.
నమస్తే అండీ! మీరన్నట్టే ఈ స్తోత్రాన్ని భక్తిరంజని వారు చాలా గొప్పగా స్వరపరిచారు. నా బ్లాగ్ చదువుతున్న మీకు ధన్యవాదాలు.
తొలగించండినమస్కారం లలితగారు, నా పేరు నాగేశ్వర రావు.
రిప్లయితొలగించండిపై అజ్ఞాత కామెంట్ కూడా నాదే. నా గూగుల్ అకౌంట్ తో కామెంట్ చేయాలని ట్రై చేస్తున్నా, కానీ ఈ పేజీ allow చేయడం లేదు.
ఈ పద్యాల ఛందస్సును శారదా భుజంగ స్తోత్రంతో పోల్చి చూస్తే, భుజంగప్రయతంలా అనిపించలేదు.
మాన్యులు, పెద్దలు డాక్టర్ బెజ్జాల కృష్ణమోహన్ రావు గారి అద్భుతమైన వ్యాసంలో సమాధానం దొరికింది. వివరాలు క్రింద ఇస్తున్నాను.
నమస్తే అండి నాగేశ్వరరావు గారూ! మీరు share చేసిన జెజ్జాల కృష్ణమోహన రావు గారి "శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము" అనే ఈమాట పత్రిక లోని వ్యాసం చదివాను. ఎంతో అమూల్యమైన ఆ వ్యాసవివరాన్ని పంచుకున్న మీకు కృతజ్ఞతలు.
తొలగించండినా బ్లాగ్‌లో కూడా ఈ కింద నోట్ చేర్చాను.
"ఆదిశంకరులు ఈ దేవీ నవరత్నమాలికా స్తోత్రాన్ని భుజంగప్రయాత వృత్తంలో రచించారని కొన్ని బ్లాగుల్లో చదివి కాబోసనుకుని - అదే రాసుకున్నా.
కానీ నా బ్లాగ్ చదివిన శ్రీ నాగేశ్వరరావుగారి వ్యాఖ్యల పుణ్యమా అని - అది భుజంగప్రయాత వృత్తం కాదూ, సురనర్తకీ (తరంగక) వృత్తంలో వుందని తెలిసింది."
సురనర్తకీ (తరంగక)
రిప్లయితొలగించండిసంగీతలయతో తాళబద్ధమై పాడుకొనుటకు వీలైన వృత్తములను ఎన్నియో ఆచార్యులవారు తమ స్తోత్రములకు ఎన్నుకొన్నారు. అట్టి వృత్తములలో సురనర్తకీ లేక తరంగక అను వృత్తము ఒకటి చాల అందమైనది, వినుటకు ఇంపుగా నుండును. ఈ వృత్తమునందలి ప్రతి పాదమునకు మూడు రగణ-నగణములు, చివర మరొక ర-గణము. దేవీ నవరత్నమాలికలోని నవరత్నాలు ఈ వృత్తమే. ఇందులో ద్వితీయాక్షర ప్రాస కూడ ఉన్నది. అందులో ఒకటి-
వారణానన మయూరవాహ ముఖ దాహ వారణ పయోధరాం
చారణాది సురసుందరీ చికుర శేకరీకృత పదాంబుజాం
కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం
వారణాంత ముఖ పారణాం మనసి భావయామి పరదేవతాం – దేవీనవరత్నమాలిక (6)
https://eemaata.com/em/issues/200707/1127.html
రిప్లయితొలగించండి