మే నెలలో అస్సలు మంచిదే కాని ఒక కారణానికి భారతదేశం వెళ్ళాల్సి వచ్చింది. జూన్ పదో తేదీకి మళ్ళీ వెనక్కి వచ్చేశాను.
ఏదో చెప్పలేని చికాకు, ఏమీ చెయ్యలేని విసుగు.
ముళ్ళపూడినీ, P. G. Wodehouse నీ మార్చి మార్చి చదువుకుంటూ, కృష్ణగీత మననం చేసుకుంటూ, నడకలో పగళ్లనీ - నిద్రలో రాత్రులనీ కొలుచుకుంటూ - ఆఫీసు పని కూడా అన్యమనస్కంగా జరుపుకుంటున్న రోజులవి.
ఈలోగా అందరూ ఆహా-ఓహో అంటున్న సినిమా విశేషాలు యూట్యూబ్‌లో కనిపించాయి.
కాలక్షేపానికి ఎప్పుడు టీవీ పెట్టినా తెర నిండా నాగార్జున, ధనుష్, దేవిశ్రీప్రసాద్, వాళ్లతో పాటు ఎక్కడ చూసినా దర్శకుడు శేఖర్ కమ్ములతో ముఖా-ముఖీ కార్యక్రమాలు.
నాకూ కొంచెం ఆసక్తీ, ఆశా కలిగాయి.
అంతటి అనుభవం వున్న కథానాయకుడు నాగార్జునే గొప్పగా వచ్చింది సినిమా అంటున్నాడు. ధనుష్షుని సెట్లో పోల్చుకోలేనంత అద్భుతంగా వున్నాడూ అని కూడా చెప్పాడు. ఇంకా విలేఖరులు, సినిమా నిర్మాతలూ సినిమా గురించి ఒక కళాఖండమన్నట్టు పరవశంతో మాట్లాడుతున్నారు.
దాంతో ఈ సినిమా ఎలా తీశారో అన్న ఆసక్తీ, దీన్ని చూస్తే కొంచెమన్నా వేరే విషయాల మీదకి మళ్లి - మనసులో వున్న చికాకు తగ్గుతుందన్న ఆశా కలిగాయి నాకు.
ఓ రోజు సాయంత్రపు నడకలో బద్రీని అడిగాను "బావా! కుబేర సినిమాకి వెళ్దామా?" అని.
సినిమా అన్న మాట నా నోట్లోంచి పూర్తిగా రాకుండానే టికెట్లు కొనేసే బద్రి ఆ రోజు మాత్రం - చాలా క్లుప్తంగా "వద్దు" అన్నారు.
అంతే ! అక్కడితో ఆ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసి మిగిలిన దారంతా వేరే కబుర్లతో కొలిచి ఇంటికొచ్చేశాం.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
సరే! థియేటర్‌కి వెళ్లకపోతే ఏమయ్యింది OTT లో రాకపోదా, నే చూడకపోతానా అనుకున్నాను.
అనుకున్నట్టే నిన్న - అంటే జులై 18వ తేదీన - Prime లో "కుబేర" వస్తుందని తెలిసింది. ఇక బద్రీ, నేనూ మా శుక్రవారపు సాయంత్రానికి ఆట్టే వెతుక్కోకుండా ఓ సినిమా దొరికిందని ముర్సిపోయాం.
రాత్రి తొమ్మిదింటికి చూడడం మొదలు పెట్టాము.
మధ్యలో ఆపుతూ, ఇక ఆపేద్దామనుకుంటూ, మొదలెట్టాం కదా ఆపకుండా చూసేద్దామనుకుంటూ - మొత్తానికి రాత్రి పన్నెండున్నర దాకా కూర్చుని సినిమా చూడడం పూర్తి చేశాం.
సినిమా అయ్యాక - 'ఒక వేళ ఈ సినిమా చూడడానికి థియేటర్‌కి వెళ్లి వుంటే ఏం చేసేవాళ్లమా?' అని మాకు మేమే ఒక ప్రశ్న వేసుకున్నాము.
ఆ ప్రశ్నకి మా ఇద్దరికీ ఏకగ్రీవంగా తట్టిన సమాధానం - "కుబేర" ఇచ్చిన యాచక-స్ఫూర్తితో - ఆ సిన్మాహాలువాడుగారి దగ్గరికి వెళ్లి - 'బాబ్బాబూ... మమ్మల్ని ఇంటికి పంపించెయ్‌రా బాబూ!' అని అ*క్కునేవాళ్లం.
మొత్తానికి "కుబేర" బెంబేరెత్తించి - బేరుమనిపించింది.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
సినిమా తెర మీద చాలా చెత్త కనపడుతుంది. చెత్త అంటే నిజంగా చెత్త.
సినిమా మొదలైందగ్గర్నుంచీ ఎక్కడో అక్కడ చెత్త అంటే trash కనబడుతూనే వుంటుంది.
చివరాఖరికి వచ్చేటప్పటికి అందరూ ఆహా-ఓహో అన్న real location shooting ఇదేనా అనిపించింది.
చాలా వరకు సినిమా నేను కళ్ళు మూసుకునే చూశాను.
చాలా హింస కూడ వుంది సినిమాలో - పిల్లల మీదా, ఆడవాళ్ల మీదా.
సినిమా చూస్తున్నంత సేపూ బోల్డన్ని లాజిక్కు లేని సీనులు - మాట్లాడుకోవడం కూడా అనవసరం.
అన్నట్టు రష్మిక మీద తీసిన ఓ సరదా పాటేదో OTT లో ఎత్తేశారు.
OTT లో వుంచిన ఒకే ఒక్క ("పోయిరా మామా!) పాటలో సందర్భశుద్ధి లేని expressions తో రష్మికతో కూడా నాలుగు స్టెప్పులు వేయించారు.
ఇహ ఇందులో చెప్పుకోవడానికి ఏమీ లేదు.
కొట్టుకోవడం, పొడుచుకోవడం, పేల్చుకోవడం, కాల్చుకోవడం, ఇంకా చెప్పలేని హింసలతో కూడుకున్న ఈ సినిమా నిజ్జంగా "కళా-ఖండనమే"!
ఏదేమైనా చాలా రోజుల తర్వాత నా చేత బ్లాగ్ రాయించింది.
~ సినీ-మా-లక్ష్మి
చాలా రోజుల తర్వాత వచ్చారు...welcome back...మళ్ళీ మొదలెట్టండి...నిజమే చెత్త సినిమా కుబేర
రిప్లయితొలగించండిసినిమా ని ఎలా ముగించాలో తెలీక కమ్ములు బద్దలు కొట్టుకుని శేఖర్ ముగించినాడు
రిప్లయితొలగించండిమల్లే వుంది :)
Good see your post again in your blog!
రిప్లయితొలగించండి