6, అక్టోబర్ 2025, సోమవారం

కాంతార ఛాప్టర్ 1 ... దృశ్యవిధ్వంసం

    దాదాపు మూడేళ్ల క్రితం నేనేం రాశానో ఒక్కసారి గుర్తుచేసుకుంటున్నాను.


    కాంతార... దృశ్య విశిష్టం!


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    నిన్న అనగా అక్టోబర్ ఐదవ తేదీన వెళ్లి "కాంతార ఛాప్టర్ 1" చూసి వచ్చాము. 

సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదు
అదొక న-స్మరామి సినిమా. 
అంటే...
ఏం చూశానో గుర్తు లేదు
ఏం విన్నానో గుర్తు లేదు
మాట, పాట ఏమీ గుర్తు లేవు
అసలు సినిమా చూసినట్టే లేదు

    సినిమా బావుందేమో - దాంట్లో బోల్డంత అర్థం, ఇంకా బోల్డంత పరమార్థం వున్నాయేమో - కానీ నా సింప్లెస్టాతిసింప్లెస్టు మెదడుకి - ఏంటో ...ఏమీ అర్థం కాలేదు, ఏ పరమార్థమూ తోచలేదు.

    ఈ సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఈ prequel కి ముందొచ్చిన దీని sequel తో కలిపి ఏదో ఒకటి చెప్తా. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    "కాంతార" అసలు థియేటర్లో చూద్దామనే అనుకోలేదు - కానీ రెండుసార్లు వెళ్లి చూసొచ్చాం.

    "కాంతార ఛాప్టర్ 1" గురించి తెలియగానే తప్పకుండా వెళ్లాలి అనుకుని అనుకుని వెళ్లి చూశాము. ఒక్కసారి కూడా ఎందుకొచ్చామురా బాబూ అనుకున్నాం. 

*** *** *** *** *** *** ***


    "కాంతార" చూస్తూ థియేటర్లో మైమరచిపోయాం. 

    "కాంతార ఛాప్టర్ 1" చూస్తూ థియేటర్ మరచి పారిపోదామనుకున్నాం.

*** *** *** *** *** *** ***


    "కాంతార" కథ గురించి "రిషభ్ షెట్టి అనే దర్శకుడు తనకు తెలిసిన కథని తరతరాలకి నిలిచిపోయేలా తెర మీద తీరుగా తెలిపిన కథ." అని రాసుకున్నా.

    "కాంతార ఛాప్టర్ 1" కథ గురించి "రిషభ్ షెట్టి అనే దర్శకుడు తనకు తెలుసనుకున్న కథని తనకు తోచినట్టుగా తీసుకున్న కథ." అని రాసుకుంటున్నా.

*** *** *** *** *** *** ***


    "కాంతార" లో వున్న కథ వెనకాల కథలన్నీ తరచి తరచి చదువుకున్నా.

    "కాంతార ఛాప్టర్ 1" లో వున్న కథే అర్థం కాక - కథ వెనక కథలు వున్నాయో, లేవో కానీ - నాకు వెతికే ఓపిక లేక వూరుకున్నా. 

*** *** *** *** *** *** ***



    "కాంతార" లో పాటలు ఇప్పటికీ వింటున్నా - గొంతు చేర్చి పాడుకుంటున్నా.

    "కాంతార ఛాప్టర్ 1" లో పాటలున్నాయా అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. 

*** *** *** *** *** *** ***


    "కాంతార" లో చెప్పదలుచుకున్న విషయానికి కొంచెం కూడా అటూ-ఇటూ జరగలేదు సినిమా కథ.

    "కాంతార ఛాప్టర్ 1" లో చెప్పదలుచుకున్నా విషయమే లేక అడవుల పట్టిపోయింది సినిమా కథ.


*** *** *** *** *** *** ***


    "కాంతార" లో దొర దేవేంద్ర వచ్చి కుర్చీలో కూర్చుని ఊళ్లో వాళ్లందరినీ హింస పెట్టి చపుతాడు.

    "కాంతార ఛాప్టర్ 1" రాజు కులశేఖరుడు గుఱ్ఱమ్మీదొచ్చి తిరుగుతూ అడవిలో వాళ్లని చంపుతాడు.


*** *** *** *** *** *** ***


    "కాంతార" లో శివని ఒకసారి గుళిగ ఆవహిస్తాడు. అద్భుతంగా అనిపిస్తాడు. 

    "కాంతార ఛాప్టర్ 1" లో బెర్మెని గుళిగ రెండు, మూడుసార్లు ఆవహిస్తాడు. ఆవలింతలు తెప్పిస్తాడు. 


*** *** *** *** *** *** ***

    ఇహ చాలు బాబూ! ఇంత కన్నా చెప్పడానికేమీ లేదు.

    కానీ ఇక్కడ సినిమా కన్నా మహా -ఇంట్రష్టింగు విషయం ఒహటుంది. 

    అదేంటంటే... నాకు ఏదన్నా సినిమా చూడాలనుకున్న తర్వాత ఆ సినిమా చూసే ముందు రివ్యూలు చదవాలనిపించదు. చదవను కూడా. 

    కానీ...బద్రి ఎక్కడో చదివిన రివ్యూలో "కాంతార ఛాప్టర్ 1"  చూసిన తర్వాత కథేంటీ అనడిగితే ఎవరూ చెప్పలేరు అన్నారట ఎవరో. 

    అంత తెలిసీ నాకవేమీ చెప్పకుండా, నేను "కాంతార ఛాప్టర్ 1" చూద్దామనుకోగానే టికెట్లు కొని, ఓ నలభై ఐదు నిముషాలు drive చేసి నాతో సినిమాకొచ్చి, తను కొవ్వొత్తిలా కరిగిపోతుంటే ఆ వెలుగులో - నేను సినిమా చూశానట. 

    ఇది కూడా తనే చెప్పారు. 

    మహాత్యాగి బద్రి!

    అన్నట్టు... నేను సినిమా చూస్తూ - తెర మీద ఏం జరుగుతోందో ఏమీ అర్థం కాని ఒకానొక అయోమయ క్షణంలో - ఒకసారి అసలు బద్రి ఎలా చూస్తున్నారా ఈ సినిమా అని - తల తిప్పి చూస్తే - తను నవ్వుతూ నాకేసి చూస్తుండేసరికి - నాకు ఇంకా అయోమయంగా అనిపించింది. 

    మొదలైందగ్గర్నుంచి ఎప్పటికప్పుడు ఇప్పటి కన్నా ఇకముందు బావుంటుందేమో అనుకుంటూ  - ఎప్పటికీ బాగుండేలా అనిపించక - ఎప్పటికి అవుతుందో అనుకుంటూ -  సినిమా మొత్తం చూసి లేచి వస్తుంటే చివర్లో "అదింకో దంతకథ" అన్న మాట విని, ఆ వెంటనే "కాంతార ఛాప్టర్ 2" అన్న రాత చదివి - "దొంతర్ల కొద్దీ దంతకథలెన్ని తీసినా ఇక థియేటర్‌కి రానేరాము" అని ఒట్టు పెట్టుకుని మరీ బయటికొచ్చాము. 

    మామూలుగా అయితే ఏదైనా సినిమా చూశాక ఇంటికి తిరిగి వస్తూ - ఇల్లు చేరే దాకా - ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ వుండే మేము - మాట్లాడుకోడానికి ఏమీ లేక, అస్సలు మాట్లాడుకోకుండా వున్నది ఈ  "కాంతార ఛాప్టర్ 1"  సినిమాకే. 



*** *** *** *** *** *** *** 

చివరాఖరిగా ఓ రెండో, మూడో మాటలు...

ఇప్పటికి - అప్పుడు
కాంతార... దృశ్యవిశిష్టం
కావాలని మరీ - రెండుసార్లు చూశా

ఇప్పటికి - ఇప్పుడు
కాంతార ఛాప్టర్ 1 ... దృశ్యవిధ్వంసం
కావాలని - చూసినదే మర్చిపోయా

ఇప్పటికి - ఎప్పుడో...
కాంతార ఛాప్టర్ 2... దృశ్యవిముక్తం
కావాలని అనుకోను - చూడను

ఇట్లు,
సినీ-మా-లక్ష్మి 

4 కామెంట్‌లు:

  1. చాలా బాగా రాసావు. భలే నాచురల్ గా రాసావు. ఇంతకీ నన్ను వెళ్ళమంటావా? లేదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీకు చూడాలనిపిస్తే తప్పకుండా వెళ్లి చూడండి. నేను రాసినది నా view మాత్రమే. 😊 నేను రాసింది మెచ్చుకున్నందుకు బోల్డన్ని thanks! మీరు ఎవరో తెలిస్తే బావుండేది .

      తొలగించండి
  2. చాలా దశాబ్ధాల క్రిందట చీకటివెలుగులు అన్న సినిమా చూసాను మిత్రులతో కలిసి. సగం చూసి ఇంటర్వెల్ సమయంలో అమ్మయ్య ఇక చీకటి పార్టు ఐపోయిందిలే వెలుగుపార్టు మొదలు రెండవభాగంలో అనుకున్నాం. తరువాత అర్ధమైనది ఏమిటంటే మేము చూసిన మొదటిభాగమే వెలుగుభాగం అని! కొన్ని సినిమాలంతే మనని హింసించటానికే వస్తాయి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్తే అండి 🙏 మీరు ఎలా వున్నారు?

      ఈ సినిమా తీయడానికి బోలెడంత కష్టపడ్డారట. ఆ కష్టమేదో డబ్బులు ఖర్చు పెట్టటమ్మీద, గ్రాఫిక్స్ మీదా, పోరాటాల మీద కాకుండా కథ మీద, clarity మీద, నటన మీదా, మంచి dubbing రాత మీద పెట్టుంటే బావుండేది. మొదటి సినిమాని మించి ఆసక్తికరంగా వుంటుందనుకుని వెళ్తే ఆవలింతల-పరమయ్యింది.

      నా blog చదివి వ్యాఖ్య వుంచినందుకు మీకు ధన్యవాదాలు ! మీ శ్యామలీయం blog చదవడానికి నాకు access ఇస్తారా దయచేసి ?

      తొలగించండి