16, ఆగస్టు 2011, మంగళవారం

లివింగ్ రూం సిండ్రోం

మే నెల వనితా మాలికలో నా వ్యాసం ఇక్కడ చదవండి.


మా ఇంటికి ఎవరు వచ్చినా మా బుజ్జి జింక (అంటే మా జింక కళ్ళ కిరణ్ అన్నమాట)ఎగురుకుంటూ ఇది మా అన్న మ్యూజిక్ రూంఇది మా అన్న బెడ్ రూంమా మాస్టర్ బెడ్రూం,మా బొమ్మల క్లోసెట్ అంటూ ఒక చిన్న టూర్ ఆఫ్ ది హౌస్ కార్యక్రమం జరిపిస్తాడుఅదృష్ట వశాత్తూ వీలైనంత వరకూ ప్రతీ వారం క్లీనింగ్ పేరుతో ఇల్లు పీకి పందిరేసే అలవాటు నాకునా ఇద్దరి బుడుగులకి వుంది కాబట్టి మా అతిథులకి మనస్తాపం కలిగించే దృశ్యాలు ఎక్కువ వుండవు మా ఇంట్లో :) )

కాని అప్పుడప్పుడూ ఆఫీసులో మేజర్ రిలీజ్ టైం లోనోఇంకే కారణాలవల్లనో  ఒక్కోసారి ఎక్కడివి అక్కడే వదిలేసి చిన్న కిష్కింధని మరిపించేలా చేసి మా సృజనాత్మకతకి మేమే జై చెప్పుకుంటూచేతికికాలికి అడ్డు వచ్చిన వాటిని కంటికి ఆననీయకుండా (దీనికి నా ముద్దు పేరు - becoming selectively blind) – మా జీవ వ్యాపారాలుఅంటే వంటహోమ్వర్కులు-అన్నీ కానిచ్చేస్తూ ఉంటాముఅలాంటప్పుడు  హఠాత్తుగా మా శ్రీవారు బదరి మా ప్రశాంత జీవితాల్లో ఒక కలకలం వచ్చేలా ఒక అనూహ్య ప్రకటన చేస్తారు సాయంత్రం మనింటికి చంద్ర శేఖర్ వస్తున్నారు తెలుగు సినిమా డివిడిల కోసం అనిఅసంకల్పిత ప్రతీకార చర్యలా కళ్ళు ఇల్లంతటినీ ఒకసారి స్కాన్ చేస్తాయిఇంకేముంది గబగబా పోటీలు పడుతూ నేనూనా సుపుత్రులూ ప్లానింగ్ డెస్క్ మీద వున్న పుస్తకాలుకాగితాలు అన్నీ హడావిడిగా క్రింద నున్న సొరుగుల్లో తోసేస్త్తాం లివింగ్ రూం సోఫాల్లో వున్న ఆఫీసు లాప్ టాపులుహోమ్వర్క్ పేపర్లు,సగం మడతేసిన బట్టలు వగైరాలు పై ఫ్లోర్ కి రవాణా చేసేస్తాంఅలా యుద్ధ ప్రాతిపదిక మీద ఇల్లంతా సర్దేసి (క్రింద భాగమే సుమా!) డివిడిల సముదాయాన్ని సిద్ధంగా ఉంచుతాంమేము కూడా బొమ్మల కొలువులో అప్పుడే అమర్చిన బొమ్మల్లా కూర్చుంటాంరావాల్సినవారు వచ్చి కావలసినవి తీసుకువెళ్లగా మళ్ళీ మా పనుల్లో పడిపోతాంఅసలు తమాషా ఇక్కడే ప్రారంభం.పాపం వచ్చినాయన కాలికి తట్టుకుంటాయనోకంటికి బాధ కలిగిస్తాయనో అనేక దిక్కులకి రవాణా కాబడ్డ వస్తువులన్నీ ఎక్కడికి చేరాయో అక్కడే ఉండిపోతాయి (సెలెక్టివ్ మెమరీ :) ).ఆ తదుపరి వచ్చు దినాల్లో ఎవరికి ఏం కావాలన్నా అంజనం వేసి కనిపెట్టాల్సిందే :) ).అలాంటప్పుడే అనిపిస్తుంది ఇంకెపుడూ ఏదీ వాయిదా వేయకూడదు అనిదానితోపాటు ఇంకో ఆలోచన కూడా వస్తుంది అసలెందుకుఏ ఉద్దేశ్యంతో అంత పడుతూ లేస్తూ ఎవరో వస్తున్నారని లివింగ్ రూం మాత్రం శుభ్రం చేశాం అని.

అంటే ఎవరికైనా ఇల్లు   చూపించేటప్పుడు గానిమనని మనం పరిచయం చేసుకునేటప్పుడుగాని ఎందుకు మన మంచి” వైపునే చూపించడానికి ఇష్టపడతాంఅలా అని మన ఇంట్లో ప్రతీ గదిని,మన వ్యక్తిత్వంలో ప్రతీ కోణాన్ని ఎప్పుడూ ఎందుకు శుభ్రంగాస్వచ్ఛముగా ఉంచుకోం?

ఉదాహరణకి ఒక ఇంట్లో పిల్లాడి చదువు విషయమై హోరా-హోరీ గొడవ జరుగుతోంది అమ్మ,నాన్నఅబ్బాయిల మధ్యతండ్రి అంటాడు ఒరేఇలా చదివితే ఆఫీసుల్లో కాఫీ కప్పులు మోయడానికి కూడా పనికిరావుఆ సుబ్బారావు గారి అబ్బాయిని చూడు ఎప్పుడూ చదువుతూనే ఉంటాడువాడిని చూసి బుద్ధి తెచ్చుకోఅలా గాడిదలా తిరక్క అనిఆ తల్లి కూడా తమ పుత్రరత్నం బాగుపడాలనే మంచి ఉద్దేశ్యంతోనే తన వంతు అక్షింతలు కూడా వేస్తుందిఒక్కోసారి చదివిన చదువులకివ్యక్తిగత ప్రపంచంలో వాడే భాషకి ఏమీ సంబంధం వుండదు అనిపిస్తుందికొందరి పదాల వాడుక వింటుంటేఆరకంగా ఆ తలిదండ్రుల నుంచి తన వారసత్వపు పదసంపదని మననంతో వృద్ధిచేసుకుంటూ ఆ సుపుత్రుడుండగా ఇంటి కాలింగ్ బెల్ మ్రోగుతుందిఅంతే డైరెక్టర్ కట్ చెప్తే మారిపోయే సీనులా గబగబా ముఖాలకి నవ్వు రంగులద్దుకుని తలుపులు తీస్తారుచాల సభ్యతాయుతమైన ప్రవర్తనతోభాషతో అతిథిని అలరిస్తారుఅవే నవ్వులతో సాగనంపుతారుతలుపు మూయగానే మళ్ళీ ఇందాకటి అంకానికి తెర తీస్తారుమరి అంతకు ముందు వాడిన అచ్చ” తెలుగులోనే అతిథితో కూడా మాట్లాడవచ్సుగాఅమ్మోఅలా అయితే ఇంకేమైనా ఉందామన పరువు పోదూపోనీ ఆయనతో మాట్లాడినట్టే ఇంట్లో సమస్యలు కూడా సామరస్యంగాఅనునయంగా మాట్లాడి సాధించుకోరాదూబయటి వాళ్ళతో ఎలాగూ తప్పదు ఇంట్లో కూడా మనం మనలా ఉండకపోతే ఎలాచాలా విచిత్రమైనఒప్పుకోదగిన వాదనే ఇది :) 

ఇంకో కోణంలో చూస్తే కొందరుంటారుజీవితం అంటే సరైన అవగాహన వుండదుమనంమన సుఖం తప్ప ఇంకోటి పట్టదుఇతరుల కష్టసుఖాలకి తమ ప్రమేయం లేదు కాబట్టి పట్టించుకోవక్కర్లేదు అంటూ ఉంటుంటారుకానీ వీరికి అన్నివేళల్లోనూ తాము చేసే ప్రతీ పనిని ఎవరో గుర్తించాలనే కోరిక వుంటుందిదానితో గొప్పకోసం తమ ఇంటికి వచ్చేవారికి (ఈ వచ్చేవారికి అన్నీ వుంటాయిడబ్బూహోదా మరి అలాంటి వారికి చేస్తేనే కదా గుర్తింపు!)అవసరం అయిన దానికన్నా ఎక్కువ మర్యాదలు చేస్తారు మనసులో వారంటే నిజంగా ఇష్టం లేకపోయినాఆ వున్న కాసేపట్లో తమ గురించి అవతల వాళ్ళ మనస్సులో మంచి ఇంప్రెషన్ కలిగించడానికి తాపత్రయ పడతారువాళ్ళు వెళ్ళాక షరా మామూలే వారి మీద తమదైన చెడు ఉద్దేశ్యాన్ని బయటపెట్టడానికి ఆలోచించరువెనకాడరుదురదృష్ట వశాత్తూ ఇలాంటి ప్రవర్తనకే చాలా మంది అలవాటు పడ్డారు.

ఇదిగిదిగో ఇలా వుండేవుండాలనిపించే వైఖరికే నేను పెట్టుకున్న పేరు లివింగ్ రూం సిండ్రోం.ఎవరైనా వస్త్తున్నారంటే-సర్దబడే ఇల్లు చుడిదార్లోకోచీరలోకో మారే నైటీలు కొత్తగా ఇంగ్లీషు,కొంచెం సంస్కారం చేరే భాష ముక్కులు తుడవబడి ముద్దు చేయబడే పిల్లలు -సందర్భానుసార ముసుగేసుకున్న వ్యక్తిత్వాలు ఇవీ ఈ లివింగ్ రూం సిండ్రోం లక్షణాలలో కొన్నిదీనికి మందేమిటయ్యా అంటే ఎవరికి వారి మనస్సాక్షివిచక్షణపరిసరాల శుభ్రతే కాదు ఆలోచనకీమాటకీమనసుకీ శుభ్రత ఉండాలనే ఎరుక
.

పంచుకుందాం రా…!! పంచేయ్!! పంచేసేయ్!! పంచి పెట్టేసేయ్!!

ఆగష్టు విహంగ సంచికలో నా వ్యాసం ఇక్కడ చదవండి. 



పంచుకుందాం రా...!! పంచేయ్!! పంచేసేయ్!! పంచి పెట్టేసేయ్!!

అబ్బే ఇది ఏ బాబుగారి కొత్త సినిమా టైటిల్సో  కాదండీ. అమెరికా నుంచి ఆంధ్రదేశం దాకా అమ్మలూ, నాన్నలూ, మామ్మలూ, తాతలూ అందరూ చేరి తమ పిల్లలని "పంచు"దార చిలకల్లా   పెంచుదామని వాళ్ళతో చేయిస్తున్న పంపక నినాదం.  అంతగా అర్థం కాలేదు కదూ....సరే! ఈ క్రింది ఉదాహరణలు చదవండి, దయచేసి.

"మా బాబుకి షేర్ చేసుకోడం ఎలా నేర్పాలో తెలీట్లేదండి. మా  పాపకి ఏమైనా తినడానికి పెట్టాననుకో - అది తమ్ముడికి కొంచెమైనా పెట్టకుండా తినదు. అదే వాడికి ఇస్తే ఇచ్చినదంతా గబగబా తినేసి దాని దగ్గర చేరతాడు అదేమో వెర్రి మొహం - అది సగం తిని సగం వాడికి పెట్టేస్తుంది. వీడికి ఈ బుద్దులేలా వచ్చాయో తెలీట్లేదు" - ఇది ఒక ఆరేళ్ళ బాబు తల్లి ఫిర్యాదు పక్కింటి ఆవిడతో.

********అసలు ఒక ఆరేళ్ళ బాబు నుంచి మనం ఎలాంటి ప్రవర్తనని ఆశిస్తున్నాము? ఒక ప్రహ్లాదుడిలాగానా? ఒక శిబి చక్రవర్తి లాగానా?    చిన్న పిల్లలకి ఏమైనా ఇవ్వగానే వాళ్ళు నోట్లో పెట్టుకోవడం అనేది సహజ ప్రవర్తన. ఆక్షణం లో వాళ్లకి ఇలా చేద్దామా , అలా పంచుదామా అనే ఆలోచనలు రావు. పిల్లలు ఎంత మంది వున్నా తల్లి గాని, ఇంకెవరైనా పెద్దవాళ్ళు గాని ఒకళ్ళ చేతిలో అంతా పెట్టి  పంచుకోమనడం అంత సరి అయిన పద్ధతి కాదు. పిల్లల చిన్ని మనసులు అంత ఆలోచించలేవు. అదీ కాక బాల్యసహజమైన చిన్న చిన్న కోపాలతో అందరికీ ఒకలా పంచలేకపోవచ్చు. అది మరిన్ని గొడవలకి దారి తీస్తుంది. అందుకని పెద్దలే పిల్లలకి తగినట్లు ముందే పంచి ఇవ్వాలి. అమ్మ ఇద్దరినీ సమానం గా చూస్తుంది అన్న నమ్మకం పిల్లలలో కలిగించాలి. ప్రతి ఇంట్లోను రెండో బిడ్డ పుడుతుంది / పుడతాడు అని తెలిసిన దగ్గర్నుంచీ పెద్ద పిల్లలకి చెప్పడం మొదలు పెడతారు - చెల్లి / తమ్ముడు తో ఎలా పంచుకోవాలి అని. దానితో తెలీకుండానే పెద్ద పిల్లలు పంచుకోవడానికి ముందుకొస్తారు. చిన్న పిల్లాడని ముద్దు చేసి అడిగిందల్లా అక్క/ అన్నతో ఇప్పించి  వాళ్ళని తెలీకుండానే పంచే ఆలోచనే రాని వాళ్ళలా తయారుచేసి మళ్ళీ మనమే ఈ బుద్ధులెలా వచ్చాయంటే - నీవు నేర్పిన విద్యయే నను కన్నతల్లీ - అని ఆ పిల్ల/పిల్లాడో అంటే- ఆ బాధని ఎవరితో పంచుకోగలం?
*******************************************************************************

ఒక బామ్మగారు వాళ్ళ మనవడితో - "ఇదెక్కడ ఒంటెత్తు రాకాసి బుద్ధులురా - మన లక్ష్మత్త కొడుకు సాయి చూడు ఎంత బాగా వాడి బొమ్మలతో నిన్ను ఆడుకోనిస్తాడో ! నువ్వూ వున్నావు నీ కారు బొమ్మ ఎవరైనా చూసి ఇస్తామంటే "ఈ " అని ఏడుస్తూ. మాకొద్దమ్మా ఇలాంటి చుప్పనాతి పిల్లలు" అంటుంటే ఆ మనవడు, ఆ మనవడి మాత బిక్కమొహం వేసారు.

*******ఆ బామ్మగారి పంపిణీ ఘనత ఎలావుందో చూద్దామా?
నమస్తే బామ్మగారు! మీరు ఆమధ్య భద్రాచలం  వెళ్ళినప్పుడు తెచ్చుకున్నారే - ఆ రామ పట్టాభిషేకం విగ్రహం నాకిస్తారూ. నాకు  చాలా నచ్చిన్దండీ.
ఆ! అది నేను పూజలో వాడేశాను కదండీ- అబ్బే ఇస్తూ, ఇస్తూ మీకు పాతది ఎందుకండీ.  ఈ సారి మళ్ళీ మా మేనత్త కూతురు వాళ్ళు భద్రాచలం నుంచి వచ్చినప్పుడు మీకు తెప్పిస్తానండి.
సరే లెండి ...పోనీ ఆ  కుంకుమ రాయి రంగు ధర్మవరం చీర...అది పోయినసారి నాకిస్తాననారు - ఈసారి నేను జాకెట్టు కుట్టించుకుని పట్టుకెళ్ళనా? 
నాకు మాత్రం ఎన్ని చీరలున్నాయని. అదిగో - ఇన్ని పెళ్ళిళ్ళు చేయించాను ఆఒక్క చీరతో. మన రామం పెళ్లి కూడా అయిపోతే ఆ చీర గంజి పెట్టించి నీకే ఇస్తాను. మహారాజులా పట్టుకెళ్దువుగాని.  

ఔరా బామ్మగారూ ! ఎంత చక్కగా నాతో కబుర్ల చక్కర తినిపించారూ! మీరు పెద్దవారు కాబట్టి అలా తిప్పి తిప్పి ఇవ్వనని తీపిగా చెప్పారు. అదే వాడికి ఇష్టమైనవి తన బావతో పంచుకోనన్న మనవడిని చుప్పనాతిని చేసారు. 

ఇంత పెద్దవాళ్ళమై , ప్రపంచాన్ని చూసినవాళ్ళమై మనమెంత వరకు పంచుకోగలమో చెప్పండి. మనకిష్టమైన చీరో, నగో, అంతెందుకు ఇష్టమైన పండే దొరికితే "పండు పంచివ్వకూడదు" అని వంక చెప్పి తినేవారు తెలుసు నాకు.

ఇక్కడ ఒక సంఘటన మీతో పంచుకోవాలని వుంది - ఒక బాబు తన దగ్గర వున్న కొన్ని కారు బొమ్మలు ఎవరికీ ఇచ్చేవాడు కాదు. ఎవరైనా వాటిని ముట్టుకుంటే పేచీ పెట్టి ఎలాగోలా తీసేసుకునేవాడు. ఆ ప్రవర్తన ఇంటికి ఎవరైనా పిల్లలతో వచ్చినప్పుడు వాళ్ళ నాన్నమ్మ గారికి చాలా ఇబ్బందిగా వుండేది. ఒక రెండేళ్ళు ఇలా గడిచాక ఆ కారు బొమ్మలు చక్రాలు విరిగిపోయి, రంగులు పోయి చాలా పాతగా అయిపోయాయి. ఒకరోజు ఆ బాబు నాన్నమ్మ గారు పాడయిపోయాయి కదా అని వాటిని చెత్త బుట్టలో వేసేశారు. ఆరోజు బడి నుంచి రాగానే బాబు తన బొమ్మలు పెట్టుకునే అలమారు దగ్గరికి అలవాటు ప్రకారం వెళ్లి కార్ల కోసం వెతికితే కనిపించలేదు. ఇంకంతే - అవి దొరికేదాకా అన్నం తిననని ఏడుస్తూ కూర్చున్నాడు. చివరికి వాళ్ళ తాతగారు చాలా సేపు - నాన్నా! అవి విరిగిపోయి కదమ్మా. పోతే పోయాయి. రేపు బజారుకి వెళ్లి కొత్త బొమ్మలు కొనుక్కుందాము. వచ్చి ఆమ్ తినమ్మా - అని బ్రతిమిలాడారు. అలా ఒక  రెండు గంటలు రకరకాల బుజ్జగింపులతో, చిన్న చిన్న బెదిరింపులతో అన్నివిధాలుగా ఆ బాబుని సముదాయించడానికి, మరిపించడానికి ప్రయత్నించి - చివరికి ఆ బాబు చెప్పిన ఒకేఒక్క మాటతో ఆ తాతగారు దిగ్గున లేచి వెళ్లి చెత్తబుట్టలో పడేసిన ఆ విరిగిపోయి, రంగుపోయిన కారు బొమ్మలను తీసి శుభ్రంగా సబ్బుతో కడిగి, పొడిగా తుడిచి బాబుకి ఇచ్చి- సారీరా నాన్నా! ఇంకెపుడూ ఇలా పడేయ్యోద్దని ఇంట్లో అందరికీ చెబుతాను - అని చెప్పారు. ఆరోజు ఆయనకి బాబు మాటల్లో తెలిసింది ఏంటంటే ఆ కారు బొమ్మలు బాబుకి ఐదేళ్ళ వయసులో తను చనిపోయేముందు వాళ్ళమ్మ కొనిచ్చినవి. బాబుకి ఆ కారు బొమ్మల్లో అమ్మ జ్ఞాపకం వుంది. అందుకే వాడు ఎవరితోనూ అవి పంచుకోవడానికి ఇష్టపడేవాడు కాదు.

ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మనకు బొమ్మలుగానో, చిన్నవిగానో కనిపించే ప్రతి వస్తువు ఆఆ పిల్లలకి చాలా అపురూపమైనవి అయి ఉండొచ్చు - రకరకాల కారణాలవల్ల. వాళ్లకి అవి ఏ విదేశం నుంచి ఏ మామయ్యో తెచ్చి ఇచ్చిన బార్బీ బొమ్మో, ప్లే స్టేషనో అవొచ్చు. లేక ఏ పల్లెటూరు నుంచో అమ్మమ్మ, తాతగారు తెచ్చి ఇచ్చిన తాటాకు బొమ్మో కావొచ్చు. దానికి విలువ ఆపిల్లల మనసుతో చూస్తే తప్ప మనకి అర్థం కాదు.

ఇంకొన్ని సందర్భాల్లో అమ్మ, నాన్న పరీక్షల్లో  ప్రథములుగా వచ్చారని  ఖరీదైన వస్తువులు బహుమతిగా ఇచ్చి వాటిని ఎలా జాగ్రత్తగా వాడాలో చెప్తారు. పిల్లలూ అంతే భాద్యతగా వుంటారు. అలాంటప్పుడు ఇంటికి చుట్టపుచూపుగా వచ్చిన చిన్నపిల్లలో, లేక ఆ వస్తువు ఎలా వాడాలో తెలియని పిల్లలో అడిగితే సున్నితంగా మాటమార్చి ఆవస్తువుని భద్రపరచడమే మంచిది. తప్పితే అక్కరలేని మొహమాటాలకి పోయి తమ పిల్లలని షేర్ చేసుకోమని తర్వాత వస్తువు పాడయాక మీ పిల్లల బాధని "షేర్" చేసుకోలేక ఇబ్బంది పడకండి. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు :)

పిల్లలు మన మాట వింటారని, వినాలని, వినితీరాలని శాసిస్తాము కాని వాళ్ళకీ ఇష్టమైనవి పంచుకోవాలంటే మనలాగే కష్టంగా ఉంటుందని ఎందుకు ఆలోచించలేము కదా? అలా అని పిల్లలకి అసలు పంచుకోవడమే అలవాటు చేయకూడదని కాదు. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారని తెలిసినప్పుడు ముందే పిలల్లని సిద్ధం చేయాలి - ఎలా అంటే బాబునో /పాపనో పిలిచి వాళ్లకి చాలా ఇష్టమై వాళ్ళు ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్ట పడనివి ముందే తీసి ప్రక్కన పెట్టుకోమని చెప్పాలి. మిగిలిన బొమ్మలతో వచ్చిన పిల్లలతో ఆదుకోమని చెప్పాలి. అలాగే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వచ్చిన పిల్లలు ఏదైనా బొమ్మకోసం ఏడిస్తే - మా ఇంటికి తీసుకెళ్ళి మా బాబు ఏడుపు ఆపాక పంపిస్తాము - అంటుంటారు వారి తల్లులు (అందరూ కాదులెండి - కొందరు మాత్రమే). అది అంత మంచి పద్ధతి కాదు. ఆ ఇంటి పిల్లలకి అది బాధ కలిగించి ఇంకోసారి వీళ్ళు వస్తున్నారంటేనే అన్నీ దాచేసుకోవడానికి సిద్ధపడతారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎవరి తల్లులు వాళ్లకి ముందే చెప్పి  ఉంచాలి - పిల్లలు ఎలా ప్రవర్తించాలో. అప్పుడింక కలిసి ఆడుకునే ఆనందాన్ని పంచుకోవడానికి పిల్లలు పోటీ పడతారు.
*******************************************************************************


"అబ్బబ్బబ్బబ్బా ! మీకు ముందే చెప్పానా ఒకటే గేమ్ బాయ్  కొంటే వీళ్ళు నా ప్రాణం తీసేస్తారని. ఇప్పుడు చూడండి - ఎవరికీ చెప్పలేను. పెద్దవాడు ఇవ్వడు, ఈ చంటి గాడేమో వదలడు. ఒరేయ్ చంటీ ! ఇలా రామ్మా అమ్మ నీ చెవులో ఏదో చెప్తాను - (దగ్గరికి వచ్చిన ఆ బాబు చెవిలో - అన్న ఇప్పుడు స్కూల్ కి వెళ్ళిపోతాడు కదా - ఎంచగ్గా నువ్వొక్కడివే సాయంత్రం దాకా ఆడుకోవచ్చు- సరేనా? నా బంగారు కొండవు కదూ. వాడినొదిలేయ్!)" - ఒక మాతృమూర్తి చేసిన సంధి ప్రయత్నం.


********ఈ పై ఉదాహరణ  పిల్లల్లో తోబుట్టువులలో విభేద మనస్తత్వము (సిబ్లింగ్ రైవల్రీ) కి బీజాలు ఎలా పడతాయో తెలుపుతుంది. ఆ బడికి వెళ్ళే అన్నకు తెలుసు - అమ్మ తమ్ముడి చెవిలో ఏం చెప్పి వుంటుందో. ఎందుకంటే ఇంకో సందర్భంలో తనకీ అలాంటిదే ఏదో చెప్పింది కాబట్టి. తను బడికి వెళ్ళగానే తమ్ముడు తన గేమ్ బాయ్ తో ఆడుకున్టానీ తెలుసు. కానీ ఏమీ చేయలేడు. ఆ ఉక్రోషంతో ఇంట్లో వున్నప్పుడు తమ్ముడితో పంచుకోవడానికి ఇష్టపడడు. 
అలా కాకుండా తల్లి తన పిల్లల మనసుని అర్థం చేసుకుని వారి, వారి  ఇష్టాలని గౌరవిస్తూ తన మీద నమ్మకం కలిగేలా ప్రవర్హ్తించాలి. అన్న వస్తువులు తమ్ముడు కావాలన్నా, తమ్ముడి బొమ్మతో అన్న ఆడాలన్నా - ఒకరితో ఒకరిని అడిగించి ఓపికగా సర్ది చెప్పి వాళ్ళలో వాళ్లకి పంచుకోవాలి అన్న ఆలోచన పెంచాలి.

ఈ పైనవి చెప్పినవి ఆచరణలో అంత తేలిక కాకపోయినా పిల్లల ఏడుపుకి, పేచీలకి భయపడకుండా కొంచెం గట్టిగా అమ్మా, నాన్నలు వ్యవహరిస్తే పిల్లలందరూ మనం చెప్పకుండానే  "పంచుకుందాం రా" అని పాటలు పాడుకుంటూ ఆడుకుంటారు ....

పంచుకుదాం పకపక నవ్వుకుందాం 
పంచుకుందాం సరదాని పెంచుకుందాం 
పంచుకుందాం ఆడి పాడుకుందాం
పంచుకుందాం పండుగ చేసుకుందాం ....

అంతర్జాలంలో పిల్లలు

జూలై విహంగ సంచిక లో నా వ్యాసం ఇక్కడ చదవండి.





"మా మనవడికి రెండేళ్ళు లేవు నిండా ...కానీ ఎంత బాగా ఆడతాడో కంప్యూటర్ మీద" - ఒక అమ్మమ్మ గారి మురిపెం
"మా బాబు తెలుసా - Windows Media Player ఓపెన్ చేసి వాడికిష్టమైన పాటలు వింటుంటాడు, వాళ్ళ డాడీ ఒక్కసారి చూపించారంతే" - ఒక  Kindergartener  Mommy ముచ్చట
"మా వాడేముంది సార్! ఒకసారి చూస్తే పట్టేస్తాడు - వాడి గొడవ భరించలేక వాడికి ఒక mac కొనిచ్చాను. ఇంకంతే మనకి దొరకడు - ఎప్పుడూ online లో ఫ్రెండ్స్ తో చాటింగ్ లో బిజీ గా ఉంటాడు" - ఒక  ట్వీన్ డాడీ గర్వం
"Trisha is always busy- she loves texting her friends. She shares her pics with her Facebook friends" - this is how a teen keeps her friendship alive.

అసలు విషయం లోకి (మన తెలుగులో) వద్ద్దాం...

ఏ అమ్మా నాన్న కైనా వాళ్ళ పిల్లలు  బాగా చదవాలని, అన్ని కొత్త కొత్త  టెక్నాలజీలు తొందరగా నేర్చుకోవాలని వుంటుంది. కాని ఏది ఎంతవరకూ అవసరమో, మొదలు పెట్టిన దాన్ని ఎక్కడ ఆపాలో పిల్లలకి తెలియదు. పెద్దవాళ్ళు వాళ్ళ అవసరం కోసమో, వీలు కోసమో, గొప్ప  కోసమో తెలియకుండానే పిల్లలని చాలా పెద్దదైన, దాపరికం వుండనివ్వని ఒక జాలానికి పరిచయం చేస్తున్నారు. అందులో పడితే పెద్ద, చిన్న, మంచి, చెడు అని విభజించడానికి వీలు కాదు. ఏదైనా ఒక వెబ్ సైట్ తెరిస్తే  రకరకాల ప్రకటనలు వుంటాయి.  ఒక్కొక్కసారి అవి అనవసరమైన కుతూహలాన్ని సృష్టిస్తాయి - పిల్లలలోనే కాదు పెద్దలలో కూడా. అలా ఒకదాని తర్వాత ఒకటి పట్టుకుని వెళ్తూ మన చుట్టూ మనకే తెలియని ఒక వలని అల్లుకుంటాము. అదే అంతర్జాలం (ఇంటర్నెట్).

ఈరోజుల్లో 90% వరకూ న్యూక్లియర్ ఫామిలీస్. అమ్మా, నాన్న - ఒకరు లేక ఇద్దరు పిల్లలు. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతగార్లు. ఒకవేళ మనవలతో వుండే వీలు వున్నా మరి వాళ్ళకీ వాళ్ళ కాలక్షేపాలు కావాలి కదా. అందుకని  మాతా/పితా మహి/మహులతో వచ్చే, వారు మెచ్చే జెమిని సీరియల్సు - మా టీవీ సినిమాలు.

ఆమ్మ ఆఫీసు, నాన్న ఆఫీసు. ఇంటికి వచ్చేదాకానే  వుండే ఓపికలు. ఓపిక వున్నా ఆ క్లాసు, ఈ కోచింగ్ అని పరుగులు. ఒకవేళ ఇంట్లో వుండే అమ్మ  అయితే ఆవిడకి కావాల్సిన me-time ఇంకా నెట్ మీద ఎక్కడాలు వగైరా వ్యాపకాలతో టైం వుండదు  (ఉత్తర అమెరికా  వచ్చిన కొత్తలో ఈ "నెట్ మీద ఎక్కడం" అంటే ఏంటో అర్ధమయేది కాదు :) తర్వాత నెమ్మదిగా తెలిసింది- మేడం గారు browses the internet అని)

ఇంక మరి  మన భావి భారత (మరియు ఉత్తర అమెరికా మరియు ఏ-ఏ-దేశ) పౌరులతో ఆడడానికి, పాడడానికి ఎవరు వున్నారు? పక్కింటి ఇంకో భాభాపౌ . కాని మన భాభాపౌ, పక్కింటి భాభాపౌ స్కెడ్యూల్సు వేరు. పోనీ అన్నీ కుదిరి ప్లే-డేట్ అని ఒక ఫాన్సీ పేరుతో ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళామనుకోండి . ఒక పది నిముషాలు - all'z well :) ఆహ - మన పిల్లలు బంగారం - అనిపిస్తారు. ఒకే మాట, ఒకే టీవీ షో అన్నట్టు వుంటారు. అరగంట తర్వాత ఒకరికి డిస్నీ ఛానల్ లో సినిమా, ఇంకొకరికి కార్టూన్ నెట్వర్క్లో టాం & జెర్రీ కావాలి. చిన్న సైజు కోల్డువారు మొదలు. అప్పటిదాకా కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్న మామ్మీలు సోఫాల్లో ఇబ్బందిగా కదుల్తూ వుంటారు. ఇంతలో కోల్డువారు ఇరాకువారు స్థాయికి చేరుకుంటుంది. ఒక మామ్మీకి ఐడియా వస్తుంది - అసలే పాపం చాల రోజుల తర్వాత కలిసారు - ఇంకా చీరల గురించి, మొన్న కొన్న డైమండ్స్ గురించి, ఆ ఫలానా వాళ్ళింట్లో డైవోర్స్ కేసు గురించి, ఆఫీసు లో ఏమీ రానివాళ్ళకి వచ్చే ప్రమోషన్స్ గురించి - అమ్మో! ఇంకా ఎన్నో మాట్లాడాలి. అప్పుడే ఎవరికీ కదలాలని వుండదు. ఐడియా !!!!ఒక ఐడియా మీ జీవితాన్నే  మార్చేస్తుంది - పిల్లల గొడవేం లెక్క...ఇంకేముంది మామ్మీ డెస్క్ టాప్ / లాప్ టాప్ ఆన్ చేస్తుంది. అదేం విచిత్రమో - అందులో ఏం మంత్రం వుందో - ఒకళ్ళు ఆడుతుంటే ఇంకొకళ్ళు అంతగా గొడవ చేయకుండా చూసేది కంప్యూటర్నే!! అంతే- గపచుప్!ఇంకెంత సేపు అయినా అదేదో దీర్ఘకాల శాంతి ఒడంబడికలు చేసుకున్న ఇండియా-పాకిస్తానుల్లా ఆడేసుకుంటారు. అంతా అయి ఇంటికి వచ్చాక మరి మామ్మీ వంట చేయాలి - మరి భాభాపౌ అడ్డు రాకుండా వుండాలి అంటే మళ్ళీ కంప్యూటర్  మాతే శరణ్యం.

అలా..అలా..నెమ్మదిగా పిల్లల వయసుతో పాటు కంప్యూటర్తో పరిచయం, పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. ఈమెయిలు అకౌంట్లు, ట్విట్టర్ ఐడిలు, ఫేస్ బుక్ పరిచయాలు, గూగుల్ బజ్లు, యాహూ మేస్సేంజర్లు   - అన్నీ బావుంటాయి - మన పిల్లలే  కదా జాగ్రత్తగానే వుంటారు. పెద్దవుతున్నారు- ఆ మాత్రం తెలియదా అనిపిస్తుంది. మన పెంపకం మీద మనకి నమ్మకం వుండడం మంచిదే. కానీ ఇల్లు దాటిన తర్వాత పిల్లల మీద మన ప్రభావం కన్నా వాళ్ళ స్నేహితుల, పరిసరాల ప్రభావం  ఎక్కువ వుంటాయి. దానికి తోడు ఏ వయసుకి ఆ వయసుకే వుండే తప్పించుకోలేని  peer pressure. దానితో తెలియకుండానే తెలియకూడని విషయాలకి తెలిసీ తెలియని వయసులో మన పిల్లలు ఎక్స్ పోజ్  అవుతున్నారు.

చాలా వరకూ సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్స్ మెంబర్ కావడానికి మనం ఇచ్చే వివరాలు బై డిఫాల్ట్ ఏ రకమైన ఫిల్టరింగ్ లేకుండా అన్నీ అందరికీ కనిపిస్తాయి. జాగ్రత్త తీసుకోకపోతే మనది అన్న ప్రతి విషయం చాలా మందికి తెలుస్తుంది. అదే పిల్లలు అయితే ఇంకా ప్రమాదం - వాళ్లకి ఏది చెప్పకూడదు, ఏది చెప్పాలి అనేది అంతగా తెలియదు.  అది అలుసుగా తీసుకుని సరదాగా పరిచయాలు, స్నేహాలు మొదలుపెట్టి వాళ్ళ అమాయకత్వంతో ఆడుకునే సైబర్ క్రిమినల్సు, సెక్సువల్ ప్రిడేటర్స్ - ఇలా కనిపించని ఎన్నో ప్రమాదాలు వున్నాయి, ఇంకా కొత్తవి పుట్టుకొస్తున్నాయి.

నాకు తెలిసి ఈ ఉత్తర అమెరికాలో వున్న పెద్దలు కొంచెం అవగాహనతో  (వాళ్ళకై వాళ్లకి తెలుసో, లేకపోతే ఎవరైనా హెచ్చరిస్తే జాగ్రత్త పడో ) టీవీలకి, కంప్యూటర్లకి పేరెంటల్ కంట్రోల్స్ పెట్టుకుంటున్నారు. కనీసం అలా అయినా పిల్లలు చూసే కంటెంట్ కొంచెం మన హద్దులో వుంటుంది. అలా అని పిల్లలకే వదిలేయడం మంచిది కాదు. ఎంత పేరెంటల్ కంట్రోల్ వున్నా అప్పుడప్పుడు కొంచెం వీలు చూసుకుని పిల్లలకి వాళ్లకర్ధం అయ్యేలాగా ఇంటర్నెట్ బ్రౌజింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తూ వుండాలి. మొదట్లో కొంచెం మన మాట వినేలా చేయడం కష్టమనిపించినా "వినగ వినగ రాగమతిశయిల్లు " అన్నట్లు చెప్పగా, చెప్పగా వాళ్ళ ధోరణిలో మార్పు వస్తుంది. కానీ ఈ వీలు ఇండియాలో ఉండకపోవచ్చు. అక్కడ ఇంటర్నెట్ కెఫేల్లో కంటెంట్ విషయంలో ఎలాంటి నిబంధనలూ లేవు-ఎవరూ పట్టించుకోరు.  వాటికి వెళ్ళడానికి కూడా ఎవరికైనా ఎప్పుడైనా కుదురుతుంది. మనది అన్ని రకాల స్వేచ్ఛలూ వున్న స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం. అలాంటప్పుడే ఇంకా జాగ్రత్త అవసరం.

అందులో కొన్ని జాగ్రత్తలు:

1. ఇంటర్నెట్ కెఫేలు "నో-గో-జోన్స్" అని పిల్లలకి ఖచ్చితంగా చెప్పండి. ఒకవేళ ఏ కారణాల వల్లనైనా వెళ్ళాల్సి వస్తే ఎవరైనా పెద్దవారితో పంపించండి. పిల్లలకి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందే చెప్పి వుంచండి.

2. మీ ఇంట్లో పర్సనల్ డెస్క్ టాప్ / లాప్ టాప్ మీద పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్స్  పెట్టండి. దీనిమీద కావాల్సిన సమాచారం అంతా మన అంతర్జాలంలో దొరుకుతుంది. దీనిలో పిల్లలు కంప్యూటర్ మీద గడిపే కాలాన్ని, వాళ్ళు ఆడే గేమ్సుని, సందర్శించే వెబ్ సైట్సుని నిర్దేశించగలరు.

3. కంప్యూటర్ని ఇంట్లో సెకండ్ లెవెల్లో రూంలోనో, పిల్లల బెడ్ రూం లోనో పెట్టకుండా  అందరికీ అందుబాటులో, కనిపించేలా లివింగ్ / డ్రాయింగ్  రూంలో పెట్టుకోండి.

4. మీకు పని ఉన్నప్పుడో, మీరు టీవీ చూడాలని అనుకున్నప్పుడో, ఫోనులో మాట్లాడాలి అనుకున్నప్పుడో పిల్లలు వచ్చి డిస్టర్బ్  చేస్తున్నారని ఆ తొందరలో వాళ్ళు అడిగినప్పుడల్లా కంప్యూటర్ మీద కాలం గడపడానికి ఒప్పుకోకండి. దానికి కేటాయించిన సమయంలోనే వాళ్ళని అనుమతించండి.

5. మీ పిల్లల స్నేహితుల గురించి తెలుసుకోండి. కుదిరినప్పుడల్లా మీ సంభాషణలో వారిని గురించిన వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తిని పిల్లలకి తెలిసేలా చేసి వాళ్ళు మీతో ఫ్రీగా చెప్పగలిగేలా స్నేహపూరిత వాతావరణం కలిపించండి. వీలైతే ఆ స్నేహితుల తల్లిదండ్రులతో కూడా మీ కంప్యూటర్ preferences వాళ్ళకు అర్ధం అయ్యేలా సున్నితంగా వివరించండి.

6. పిల్లల సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ఆక్టివిటీస్ మీద ఒక కన్ను వేసి వుంచండి.

7. అన్నిటికన్నా ముఖ్యం - అన్నీ బాగున్నప్పుడు "శభాష్" అని భుజం తట్టడమే కాదు - పిల్లలు వారికి తెలియకుండా తప్పులు (అవి తప్పులని కూడా వాళ్లకి తెలియదు) చేస్తుంటే వాళ్ళతో  ఏ దాపరికాలు లేకుండా ఆ పని చేయడం వల్ల వాళ్లకి  కలిగే కష్టనష్టాల గురించి  మాట్లాడండి. తల్లిదండ్రులుగా వారి వెనక మీరు ఎప్పుడూ వుంటారు అనే నమ్మకం ఇవ్వండి. ఇంతకు ముందు రోజుల్లో మన కుటుంబాల్లో expression of love చాలా తక్కువగా వుండేది. ఈరోజుల్లో టీవీ ప్రభావం కానీయండి,  Global Village Syndrome వల్లనైతే కానీయండి చూపిస్తేనే ప్రేమ వున్నట్లు అని పిల్లలు అనుకుంటున్నారు. అందుకని మీ పిల్లల మీద ప్రేమని , ఇష్టాన్ని మాటల్లో, చేతల్లో వీలైనన్ని ఎక్కువసార్లు reinforce చేయండి.

చివరిగా మీ పిల్లలకి చెప్పేముందు వాళ్లకి తెలిసేలా మీరు చేస్తున్న కంప్యూటర్ ఆక్టివిటీస్ ని  ఒకసారి తరచి చూసుకోండి. :)

వార్త, కథ , కవిత...
వివరం, వ్యథ, యువత...
ఏమైనా లంకెలలో వుండే మహా జాలం...
కమ్మేస్తుంది మనసుపై మాయాజాలం
తస్మాత్! జాగ్రత్త...
అదే అంతర్జాలం...

చిన్న సూచన: నా  స్నేహితురాలు ఒక సందర్భంలో వాళ్ళ పాపని FaceBook లో అనుమతించేముందు తను ఎంత ఆలోచించిందో చెప్తూ - లలితా! ఇదే నీ నెక్స్ట్ బ్లాగ్ పోస్ట్ టాపిక్ అన్నప్పుడు కొంచెం తమాషాగా ఫన్నీగా ఏమైనా చెప్పాలనుకున్నాను. కానీ ఎంత సరదాగా చెప్పాలని ప్రయత్నించినా కొందరు పిల్లల Internet Activities ని ప్రత్యక్షంగా చూసాక ఎవరికో ఏదో చెప్పాలని కాక నాకై నేను నాకు ఒక REMINDER లాగా వ్రాసుకున్న (టైపు చేసుకున్న)  సీరియస్  బ్లాగ్ పోస్ట్ ఇది.

Safe Browsing,  ALL!!!!

~లలితా TS

13, ఏప్రిల్ 2011, బుధవారం

ఆర్గానిక్ జీవితాలు ("విహంగ"ప్రచురణ)

నా "ఆర్గానిక్ జీవితాలు" వ్యాసం అంతర్జాల పత్రిక "విహంగ" లో  ఇక్కడ  చదవండి.
~లలిత 


                               ఆర్గానిక్ జీవితాలు 



ఈ మధ్య ఎక్కడ చూసినా ఆర్గానిక్-అవే కొనండి, ఆర్గానిక్-ఇవే తినండి అని ప్రకటనలు, ప్రక్కనే వాటి ధరలకి మనం పెట్టే డబ్బుల తేడాలు,  ఇంకొంచెం ప్రక్కకి జరిగితే – అదే… చూపు జరిపితే – పాలకూర, ద్రాక్ష వగైరావి ఆర్గానిక్ కానివి తింటే వచ్చే రకరకాల – పేరు ఎప్పుడూ వినని-నోరు తిరగని జబ్బుల వివరాలు… అవి చదివిన మైకంలో ఏదో కలకాలం భూమ్మీద వుండిపోదామనే ఆశతో సరే-వాళ్ళు చెప్పినట్టే అన్నీ ఆర్గానిక్ కూరలు, పప్పులు కొనుక్కుందామని అటువేపు వెళ్లి వచ్చినా, హస్తి-మశకాంతరం అన్నట్టు వుండే ఆ ఆర్గానిక్ , ఆర్గానిక్-కాని ధరల వల్ల – ఆరోగ్యం మాట ఎలా వున్నా బస్తాల్లో డబ్బులు తీసుకువెళ్ళి సంచీలో సరుకులు తెచ్చుకోవాలనే బెంగతో, ఆలోచనతో మనుషుల ఆయుర్దాయం తగ్గిపోతోంది.
కూరలు, పప్పులు ప్రక్కన పెడితే ఈమధ్యనే ఎవరో చెప్తూవుండగా విని “హా”శ్చర్యపోయాను – మన ఆంధ్ర రాజధానిలో ఒక డిపార్టుమెంటల్ స్టోర్ లో ఆర్గానిక్-కుంకుడు కాయలు, ఆర్గానిక్-చింతపండు అమ్ముతున్నారట.    ఔరా కలికాలం అంటే ఎక్కడో లేదు అనిపించింది. అడవుల్లో ఎక్కడో మబ్బులు పోసిన నీళ్ళు త్రాగి, తమ నుంచి రాలి, వడలిన ఆకులే ఎరువుగా అమాయకంగా పెరిగి, తమకన్నా అమాయకమైన కోయవాళ్ళు, భిల్లులు కోసి తలకెత్తుకుని, మోసి సంతలలో దళారీలకి ఐదు, పది రూపాయలకి అమ్మితే – ఆ కుంకుడు కాయలకి, చింతపండుకి దుమ్ము దులిపి, అందమైన ప్లాస్టిక్ కవర్లో పోసి వందల రూపాయలకి అమ్మే మనిషి దురాశ వినాశాహేతువే కదా!
అమెరికా ఆర్గానిక్ స్టోర్ లో ఆర్గానిక్-క్లోత్స్ వాషర్ ఒక పౌండ్ ఇరవై డాలర్లు – అని షోగ్గా ఒక గోనెసంచి (ఇదే సంచి మన వూళ్ళో కాళ్ళకడ్డం వస్తే   గోనె అని తన్నేసి పడేస్తాము – ఇక్కడ షాప్ లో ఇస్తే మాత్రం ఆ షాప్ లోగో కనిపించేలాగా ముందు రూం గోడ మీదో, వంటింటి గోడలమీదో స్టైల్ గా “డిస్ప్లే”పెడతాము.) కనిపిస్తే  ఏంటా అని కుతూహలం ఆపుకోలేక విప్పి చూశాను – అందులో ఏమున్నాయో ఊహించగలరా – కుంకుడు కాయలు. వెంటనే చిన్నప్పట్నుంచి తన పట్టుచీరలని  కుంకుడుకాయ రసంతో వుతుక్కునే మా  లక్ష్మి దొడ్డ ని తలుచుకుని – అబ్బా! మా దొడ్డ చెప్తే వినలేదే నేను – ఇప్పుడీ అమెరికా వాడు చెప్తే కాని నా తలకంటలేదు – నిజంగా నా తల కుంకుడుకాయతో తలంటుకుని శుభ్రం చేసుకోవాల్సిందే – అని మనసులోనే చెంపలు వేసుకున్నాను.
అంతా సహజంగా జరిగిపోయే రోజుల్లో – ఆవులకి బలం కోసమని, ఎక్కువ పాలిస్తాయని, అలా వచ్చిన  పాలు త్రాగితే పిల్లలకి బలమని చెప్పి – పాలల్లో డి-విటమిన్ అనీ, ఇంకోటనీ రకరకాల హోర్మోన్స్ కలిపి, పాలు కాచకపోయినా పర్వాలేదు అని చెప్పి  ఇన్నేళ్ళూ కొన్ని తరాలకొద్దీ చల్ల పాలు త్రాగించి ఇప్పుడు హఠాత్తుగా , అదేదో కొత్తగా కనుక్కున్న సత్యంలాగా – హార్మోన్స్ కలిపిన పాల వల్ల పిల్లలు తొందరగా, ఎక్కువగా వయసుకు మించి ఎదిగిపోతున్నారని, చల్ల పాల వల్ల కూడా నష్టాలు వున్నాయని, ప్లాస్టిక్ డబ్బాలో పాలు మంచివి కావని  చెప్పి – మళ్ళీ గాజు సీసాల్లో పాలని బంగారంలా రెట్టింపు రేటుకి అమ్ముతున్నారు – దట్ ఈజ్ కార్పోరేట్ అమెరికా అని. మన దురదృష్టమేంటంటే ఇదే గొప్ప అని ఇలాంటి ఎన్నో అవలక్షణాలను దిగుమతి చేసుకుంటోంది మన భారత దేశం.
అన్నట్టు ఇంకో విషయం అండోయ్  - సహజంగా పెరిగి దొరికేవి ఆర్గానిక్ అయితే మన పిల్లల్లో కూడా ఆర్గానిక్, ఆర్గానిక్ కాని వాళ్ళు వున్నారు – ఎలాగో తెలుసా – నార్మల్ డెలివరీ అయితే ఆర్గానిక్-బేబీ, సిజేరియన్ తో పుడితే నాన్-ఆర్గానిక్-బేబీ :)) డాక్టర్లు అలాంటి బోర్డులు అంటే- “ఆర్గానిక్-బేబీ మా ప్రత్యేకత” – అని పెట్టే రోజులు ఎంతో దూరంలో లేవు.
ఆలోచించాల్సిన విషయమే మరి !!!!

-లలిత

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

మా కుట్టి పాడిన పాటలు-1-మంచి గంధం ముద్ద మీద

(మా చిన్న చెల్లి కుట్టి చాలా బాగా పాడేది. కొన్ని సంవత్సరాలు కర్ణాటక సంగీతం మరియు లలిత సంగీతం కూడా నేర్చుకుంది. తను ఇప్పుడు లేకపోయినా తన పాట మాతోనే వుంది. కుట్టి  పాడిన  లలిత సంగీతం పాటల్లో నాకు గుర్తున్నవి ఈ బ్లాగ్ లో పొందు పరుస్తున్నాను.)


మంచి గంధం ముద్ద మీద 
నల్ల కస్తూరి బొట్టు లాగ 
చందమామ ఆకసంలో
అందగించాడు...చిందులేశాడు  


నీలి నీలి సాగారానా ఆ ఆ ఆ 
నీలి నీలి సాగరాన
తెల్ల తెల్లని తెరచాపెత్తి             ||నీలి||
సాగిపోయే పడవలాగా ఆ ఆ ఆ 
సాగిపోయే పడవలాగ
చందమామ ఆకసంలో
అందగించాడు...చిందులేశాడు  ||మంచి||

నల్ల నల్లని కొప్పులోనా ఆ ఆ ఆ 
నల్ల నల్లని కొప్పులోన 
తెల్ల మల్లియ దండవోలె          ||నల్ల||
చీకటింట్లో దివ్వెలాగా ఆ ఆ ఆ 
చీకటింట్లో దివ్వెలాగ 
చందమామ ఆకసంలో
అందగించాడు...చిందులేశాడు  ||మంచి||

7, ఏప్రిల్ 2011, గురువారం

నాకు కోపం పోతోంది... :)

మా సుహాస్ సెయింట్ లూయిస్ "మన బడి" లో నాలుగో సంవత్సరం - ప్రభాసంలో తెలుగు చదువుతున్నాడు. అప్పుడప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు కొంచెం తికమక పడతాడు :) 


ఒకసారి ప్రభాసం తరగతి గదిలో మాస్టారు "I lost my temper" అంటే "నాకు కోపం వస్తోంది" అని అర్థం చెప్పారట. వెంటనే మా బుజ్జి సుహాస్ కి సందేహం వచ్చేసింది. మాస్టారుని ఇలా అడిగాడట - అంకుల్! "losing" అంటే పోవడం కదా అందుకని "నాకు కోపం పోతోంది" అనాలి కదా అని :)) 


కోపమేమో గాని నేనే అక్కడ టీచర్ ని అయుంటే నేను తరగతి గది బయటికి "పోయి" వుండేదాన్ని. ఆ తెలుగు చెప్పే ఆయన మంచివారు కాబట్టి సందర్భానుసారంగా సుహాస్ కి బదులిచ్చారు.


ఇంక మాబుల్లి తెలుగు పండితుడు ఇంటికి రాగానే కిరణ్ ఏదో అల్లరి చేస్తుంటే - తమ్ముడూ! అలా చేయకు. నాకు కోపం పోతోంది - అని అల్లరిగా నవ్వాడు. అదేంట్రా అని అడిగిన మాకు (అమ్మా, నాన్నగార్లకి) తెలుగు తరగతి గదిలో జరిగిన సంభాషణ గురించి చెప్పాడు.

6, ఏప్రిల్ 2011, బుధవారం

కళా రత్నం గీతం...

నాన్నమ్మ పద్యం:


 (చిన్నప్పుడు మా నాన్నమ్మ పాడగా విన్న శ్లోకాలలో ఇది ఒకటి...ఆవిడ ఈ శ్లోకం పాడిన ఆడియో టేప్ కూడా వుంది నా దగ్గర.)


కళా రత్నం గీతం
శ్రవణ సుఖ రత్నం హరికథా
రణే రత్నం వాజీ
గగనతల రత్నం దినకరః
నిశా రత్నం చంద్రా 
శయన సుఖ రత్నం శశిముఖీ
సభా రత్నం విద్వాన్ 
నృపతికుల రత్నం రఘుపతీ

4, ఏప్రిల్ 2011, సోమవారం

శ్రీ ఖర నామ ఉగాది - పొద్దున్న పులిహోరు, సాయంత్రం సాంబారు - గులాబ్ జామూన్ గుర్!

శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు ....


మాకు ఈఉగాదికి వేపపూత దొరకలేదు. పోన్లే కొంచెం సర్దుకుందాం అనిచెప్పి కాకరకాయ పైచెక్కుతో ఉగాది పచ్చడి చేసుకుని వేపపూతని ఊహించుకుంటూ ఉగాది పండగ చేసుకుందామూ అనుకుంటే ఎందుకో అంత బాగా అనిపించక కలిపిన పచ్చడి అలాగే ఉంచేశాను. ఇంతలో సోమవారం కదా - మా బుజ్జికిరణ్ స్కూల్ కి వెళ్దామని ఏడింటికి లేచి వచ్చాడు. సుహాస్ కిరణ్ కి గుర్తు చేసాడు - తమ్ముడూ! ఇవాళ తలస్నానం చేయాలి -అల్లరి చేయకుండా అని. కిరణ్ దానికి ఏదో "కుహు - కుహు" అంటున్నాడు (అంటే బుజ్జి పక్షిలా తల అడ్డంగా తిప్పి చేయను అన్నాడు కానీ - మళ్ళీ అన్న చెప్పాడని బుద్ధిగా తలంటు పోయించుకున్నాడు). రోజూలాగే వాడి లంచ్ క్యాలెండర్ చూస్తున్నాను - ఏంటా ఇవాళ స్కూల్ లో లంచ్ కి అని. అందులో చీస్ రావియోలి అని వుంది. పోన్లే కాఫెటేరియా కి ఏమీ నోట్ పంపించక్కర్లేదు అనుకుంటూ వున్నాను (లంచ్ క్యాలెండర్ లో బీఫ్, పోర్క్ ఐటమ్స్ వుంటే స్కూల్  కాఫెటేరియా కి నోట్ పంపిస్తాను-వేరే ఐటం పెట్టమని కిరణ్ కి ). 


ఈలోగా కిరణ్ ఇవాళ - ఇండియా లో న్యూ ఇయర్ అని చెప్పావు. నాకు లంచ్ కి పులిహోరు (వాడి భాషలో పులిహార) కావాలీ..ఈ..ఈ.. అన్నాడు. వాడు ఇంకా ఎన్ని ఈ..ఈ..లు కలుపుతాడో దానికి అని గబగబా "పులిహోరు" చేసి బాక్స్ లో పెట్టాను. నిన్న రాత్రి (ఆదివారం) వాడికి ఆమ్ తినిపిస్తూ వుంటే అడిగాడు - సాంబారు ఎప్పుడు చేస్తావు అని. అలవాటుగా "రేపు డిన్నర్ కి " అనేశాను. వెంటనే కిరణ్ ఇవాల్టి  మెన్యూ ఇలా చెప్పాడు -అదీ- అలా పుట్టింది - "పొద్దున్న పులిహోరు-సాయంత్రం సాంబారు" అనే టైటిల్ :)) 


ఆగండాగండి - అమ్మయ్య మీ కొత్త సినిమాకి టైటిల్ దొరికిందని అప్పుడే సంబరపడి పోకండి -అక్కడితో కథ అయిపోలేదు - మా కాపీ రైటెడ్ టైటిల్ ఇంకొంచెం పెద్దది. మా మున్ను సుహాస్ కి గులాబ్ జామూన్ చాలా ఇష్టం. నేను ఉగాది కోసం మామిడికాయ, కొబ్బరికాయ లాంటి పచ్చడి సామాగ్రి కొనడానికి వెళ్తుంటే కనీసం నాలుగుసార్లు గుర్తుచేశాడు - గులాబ్ జామూన్ ప్యాకెట్ తెమ్మని. ఓ..అలాగే అని ఆ నాలుగుసార్లూ తలవూపి మాంచెస్టర్ రోడ్ మీద వున్న కొత్త ఇండియన్ స్టోర్ - హర్ష గ్రోసరీస్ లోకో వెళ్లి కూడా తేవడం మర్చిపోయాను. అయ్యో అనుకునేలోగా దార్లో "జబీహా గ్రోసరీస్" లో అదృష్టవశాత్తూ గిట్స్ గులాబ్ జామూన్ పాకెట్స్ దొరికాయి. పాపం! ఇంటికి రాగానే చేయమని అడిగినా పండగకి చేస్తాననగానే ఊరుకున్నాడు. సుహాస్ కి చెప్పాను - రేపు (సోమవారం) స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చేసి ఉంచుతానని. ఇవాళ... అదే... ఉగాది రోజు మధ్యాన్నం నాలుగున్నరకి ఆఫీసు వర్క్ అయిపోగానే - సుహాస్ ఆరింటికి వచ్చేలోగా తొందరగా చేసేయాలని - చాలా శ్రద్ధగా ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ మీద నమ్మకం లేక నా ఫ్రెండ్ విజయకి ఫోన్ చేసి, విసిగించి ;) గులాబ్ జామూన్ పర్ఫెక్ట్ గా రావాలని మ్రొక్కుకుని జాగ్రత్తగానే చేసాను - ఎప్పుడు సుహాస్ వస్తాడా అను ఎదురుచూస్తూ వుంటే వాలీ బాల్ అయిపోగానే వచ్చాడా- ఆశగా ఒక రెండు జామూనులు బౌల్ లో వేసుకుని తిని - "ప్చ్" అని పెదవి విరిచి స్నానం కి వెళ్ళిపోయాడు.  స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చేసి వుంచుతానంటే - వాడు వచ్చే టైం కి అప్పుడే వేడిగా చేస్తూ వుంటాననుకున్నాడట :( కుంచెం కమ్యూనికేషన్ గ్యాప్ :( ఏం చేస్తాం...రేపు మళ్ళీ చేసి పెడదామనుకున్నాను. వాడికి చెప్పలేదు. హుష్! మీరూ చెప్పకండేం!!? 


అదండీ - అలా ఒక కొత్త టైటిల్ సినిమా కోసం కాపీ రైట్  చేసి పెట్టాను - "పొద్దున్న పులిహోరు, సాయంత్రం సాంబారు - గులాబ్ జామూన్ గుర్!" అని. మీకెవరికన్నా సినిమా తీయాలని వుంటే చెప్పండి.



పేరులో  "ఖరం" వున్నా ఈ  ఖర నామ సంవత్సరం మీ అందరికీ -
శ్రీకరం
శుభకరం
శ్రేయస్కరం -
కావాలని శుభాకాంక్షలు తెలుపుతూ....



~లలిత