ఫిబ్రవరి "విహంగ" లో నా వ్యాసం ఇక్కడ చదవండి.
(ఫిబ్రవరి 24న శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి 32 వ వర్ధంతి సందర్భంగా ఆయన వ్రాసిన కొన్ని సినిమా పాటలను మరొక్కసారి ఇష్టంగా మననం చేసుకుంటూ నా ఈ వ్యాసం....)
మనకు తెలుగునాట కొన్ని తరాలుగా అందమైన పద జిగిబిగితో తెలుగువారిని అలరిస్తున్నరచయితలు, కవులు చాలా మంది వున్నారు. అలాంటి వాళ్ళల్లో "తన బాధ లోకం బాధగా" పంచినా తీయని హాయయిన నొప్పినే పంచారు శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు.
సౌరభము లేల చిమ్ము పుష్పవ్రజంబు ?
చంద్రికల నేల వెదజల్లు చందమామ ?
ఏల సలిలంబు పారు ?
గాడ్పేల విసరు ?....
అని ప్రకృతిలో సహజంగా జరిగే వాటిని మరొక్కసారి ఎత్తిచూపుతూ తను భావకవిత్వం వ్రాయడం కూడా అంతే సహజంగా జరిగింది అని చమత్కారంగా మనకి చెప్పకనే చెప్పారు శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారు. ఆయన కృష్ణ పక్షం, ప్రవాసం, ఊర్వశి లాంటి కవితా సంకలనాలతో పాటు ఎన్నో తీయని తెలుగు సినిమా పాటలు తెలుగువారికి అందించారు. అందులో కొన్ని వెన్నెల తునకల వెలుగులు, మది చల్లబరచే "సినీ గేయ" శీతలాలు ఇవిగో......
అది మల్లెల వేళయని, అది వెన్నెల మాసమని తొందరపడి కూసిన కోయిలలా కుమిలిన ఆ అన్న చెల్లి - ఆ ఇద్దరి బాధని అది మన బాధేనేమో అనిపించేలా మన మనసంతా కృష్ణ పక్షపు అమ్మవాస్య నలుపుని నింపుతుంది దేవులపల్లి గారి "సుఖ దుఖాల " అల్లిక.
***ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈశుని కొలువనిపించాలి
ఎల్ల వేళలా మంచు కడిగిన మల్లె పూవనిపించాలి -
అలాంటి అడుగడుగునా, అందరిలోనూ గుడి వున్న ఒక అందమైన పల్లెటూరిలో -
గురివింద పొదకింద గొరవంక , గోరింట కొమ్మల్లో కోయిల్లు పలుకుతుంటే
కడివెడు నీళ్ళు కళ్ళాపు జల్లి, కావెడు పసుపు గడపకు పూసి, ముత్యాల ముగ్గులు వేసి, ఆ రతనాల ముగ్గుల్లో గొబ్బిళ్ళు పెట్టి "రావమ్మా మహాలక్ష్మీ" అని సంక్రాంతి లక్ష్మిని పగలంతా కొలిచి అలసిన అతివ అమ్మై-
రాత్రి పూట ఆకాశం లో సయ్యాటలాడే ఆ జాబిలికి దీటుగా ఇంకా అల్లరి చేస్తూ
దొంగ కలవ రేకుల్లో తుమ్మెదలని, సోగ కనుల రెప్పల్లో తూనీగల్నిఆడిస్తున్న తన జాబిలికూనతో చాలులే !నిదుర పొమ్మంటూ ---
అంత దవ్వు నుంచి అయ్య అడుగులు తెలిసేనా
వేలెడేసి లేవు బోసి నవ్వులదానా - అని ఆ చిన్నారి నిద్రా భంగానికి ఆ పాప అయ్య అడుగులని అందంగా ఆడిపోసుకుంటుంటే-
ఆ అభాండానికి దీటుగా ఆ అయ్య-
అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే
చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రానీ -
అని ఒకే చిటికెకి రెండు నవ్వులన్నట్టు - చెప్పకనే చెబుతున్న చిలిపి కోరికతో అటు అమ్మనీ, నిద్ర పోకపోతే తమ్ముడిని పోటీగా తెస్తానని ఇటు పాపనీ మైమరిపించాడు .
ఆంధ్రుల పరభాషా ప్రియత్వానికి జడిసి వడివడిగా పారిపోతున్న తెలుగు పేరంటాలిని "ఉండమ్మా! బొట్టు పెడతానని" నట్టింట నిలపగలిగే పాట కదూ ఇది?!
***మందారంలా పూచి మంచి మొగుడ్నో, గన్నేరులా పూచి కలవాడినో ఇస్తానని అరచేతిలో పూచిన గోరింట ఆ ఎరుపు మనసుకి పూస్తే,
మనసులోని మాట పైకి చెప్పలేక మూసిన పుస్తకంలో దాచి పెట్టిన పేజీ లా -
వుసురుసురనినా గుసగుసమనినా వూగదేమది నీ మది-
అని తాను కట్టుబాటు తప్పలేక ప్రియురాలు కాలేక, స్నేహం గా ఉంటూ తన ఎదని నిష్ఠూరం ఆడుతున్నస్నేహితురాలికి-
నిదుర రాని నిశి రాతురులెన్నో, నిట్టూరుపులెన్నో
- అని విరహపు బాధని "గోరింటాకు" దాచుకున్న మూగ ఎరుపులా తన నోరులేని ఆవేదనలన్నీ ఆమెకి చెప్పడానికి ఆ అబ్బాయి ఎంత ఆరాటపడ్డాడో కదా!
***మావి చిగురు తినగానే కోయిల పలికేనా , లేక కోయిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా అని అమాయకంగా అడుగుతున్నట్టే అంటూ
వన్నెలూ వగలూ నేర్వకముందూ, నేర్చిన తర్వాతా కూడా గడుసరి అయిన "సీతామాలక్ష్మి" తనకి మాత్రం సిరి
అని మురిసిన ఒక బంగారు కొండ(య్య) లాంటి అబ్బాయి ఆ సీతామాలక్ష్మి పగడాల పెదవి మీద నవ్వుతో తన కంటిలో దివిటీలు వెలిగించుకున్నాడు.
***ఆకాశ పందిరిలో తళుకు బెళుకు నక్షత్రాల తలంబ్రాలతో, మెరుపు తీగ తోరణాల మధ్య, పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాటలు పాడుతుంటే , రాజహంస జంట రత్న హారతి ఇస్తుంటే మరపురాని వేడుకగా తనని పెళ్ళాడదామని కలలు కంటున్న ఆ "శ్రీ రాజ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్బు" వారి అమ్మాయికి ఆ నిరంతర సంచారి తన ప్రవర ఎలా చెప్తున్నాడో విందామా?
మనసైన చోట మజిలీ కాదన్న చాలు బదిలీ
తోటకి తోబుట్టువును ఏటికి నే బిడ్డను.......
పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు
విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనే లేదు
అసలు నామరోపేరు ఆనందవిహారి
***ఆకులో ఆకై, పూవులో పూవై , ఆకలీ దాహమూ లేక నిరంతరమూ తనని తాను మరిచి ప్రకృతిలో ఆనంద నాట్యం చేసే యువతికి-
తనని ఆలన చేసే, తను ఆరాధించే కవికుల తిలకుడు ఏ కమ్మా , ఎలాంటి కబురూ, కనీసం మేఘసందేశం అయినా పంపక-
బ్రతుకంతా ఎదురు చూచుపట్టున రానేరాక, ఎదురరయగని వేళ వచ్చి యిట్టే మాయమవుతున్నాడని కినిసి
హృదయము సంకెల చేసి బంధించలేని తన అశక్తికి వగచే వనితకి-
ఆ గడుసు కవి ఇదిగో - ఇలా నిన్ను వదిలి నన్ను పోనీయకు అని మాయ మాటలు చెబుతున్నాడు -
ఎద లోపల పూలకారు ఏనాటికీ పోనీయకు .....
ఉదయాన మగత నిదుర చెదరిపోవు వేళ
ముసలి తనపు అడుగుల సడి ముంగిట వినబడెనా
వీడలేడని చెప్పించు వీలుకాదని పంపించు
***జీవితపు "చీకటి వెలుగుల" కౌగిలిలో, చిందే కుంకుమ వన్నెలలో తమ బ్రతుకు పూదోటకి పాదులు కట్టి, గుండెల వలపులు కుమ్మరించి ప్రాణం పోసిన ముంగిట్లోకి వచ్చేపోయే అతిథులెవరంటే....
మల్లెలతో వసంతం చేమంతులతో హేమంతం
వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలు ....
వారి రాకపోకలతో
ఆరు ఋతువులు ఆమని వేళలే - ఆ జంట పెంచిన తోటలో
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే - ఆ రెండు మనసుల్లో.
***కొమ్మ కొమ్మకి పూచిన పూవులు చూస్తూ వాటితో తనకున్న "ఈనాటి ఈ బంధం ఏనాటిదో" అని అబ్బురపడుతూ ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ - పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ - అని హరి పూజకు పూలు పడే తొందరని ముచ్చటగా పాటలో పాడుకుంది ఒక పడుచు.
***"అమ్మ మాట" వినే ఒక బుద్ధిమంతుడు-
అటు పొద్దు వాలుతోంది, మన ముద్దు తీరకుంది, కోయని పిలిచే కోరికలెరిగి నన్నందుకుని పోరాదా అని తొందర చేస్తున్న గడుసు అమ్మాయిని -
మొదట ఎవరైనా చూశారా ఏమనుకుంటారు అని బెరుకుగా అడిగాడు.
ఇంతకీ ఆ "ఎవరైనా" అంటే ఎవరో చూద్దామా -
ఇటు పువ్వు , అటు గువ్వ, గుబులు గుబులుగా వున్న గురివింద పొదరిల్లు :)
చివరికి ఆ అమ్మాయి చొరవకి దాసోహం అని - ఎవరైనా చూసినా సరే - కొత్త మురిపెం పొద్దెరుగదని చెప్పుకుని తప్పుకుంటారని- ఆ పిల్ల నడుమున చేయేసి నీలాల నింగికి ఎగరేసుకుపోయాడు.
*** అదిగదిగో అక్కడ ఓ పల్లెపడుచు ఒళ్ళో ఒక యువకుడు-
రత్న పీఠిక లేని రారాజు బోలు, మణికిరీటము లేని మహరాజు కాబోలు
ఆమె చూశారా ఏటి గలగలలకే ఎగసి లేచే, ఆకు కదలికలకే అదరి చూసే ఆతని నిదుర చెదిరిందంటే వూరుకోనని గాలినే బెదిరిస్తోంది.
ఇంకా పండు వెన్నెల నడిగి పాన్పు తెచ్చి , నీడ మబ్బుల దాగు నిదుర ఇచ్చి పైగా విరుల వీవన పూని విసరాలిట.
ఆ ప్రియురాలి ప్రేమకి ఏ "రాజ మకుటాలు" సాటి రాగలవు చెప్పండి !!!
***ఒకే ప్రాణదీపం కోసం "కార్తీక దీపా"లు వెలిగించి కోవెలలో కొలువైవున్న దేవికి హారతి పడుతున్న ఆ పడతులేమంటున్నారో?
ఒక ఇంతికి తన ఇంటి లోని పాపే కొండంత దీపం
మరో వెలదికి తన మనసులో వెలిగే దీపం - మనుగడ నడిపే దీపం.
వారిద్దరూ కలిసి ఆకాశాన ఆ మణి దీపాలు ఏ ముత్తైదువలు వెలిగించారో - వారు భూమి మీద కనిపించే ఈ కార్తీక దీపాలు చూసి చుక్కలనుకుంటారేమో అని తమలో తాము మేలమాడుకుంటున్నట్టు వున్నారు. ఆ ముచ్చట కూడా విని ఆనందించండి మరి....
***దూరాన వున్న ఇల్లాలు బెంగతో ఆగలేక సోలుగాలి రెక్కలపైన, నీలిమబ్బు పాయలపైన ఎన్నో కమ్మలంపిస్తే
కన్న తల్లి ఏమంది అని, పొగడ మీది పొదరిల్లు ఎలా వుంది అని కుశలమడిగాడు ఒక ఉడికించే కొంటె భర్త.
గుబులు గుబులుగా వున్న మనసుతో ఆ అతివకి జీవితం ప్రేమ "బలిపీఠం" లా అనిపించిందంటే ఆశ్చర్యం వేయదసలు.
***"కలిసిన మనసుల" సంబరంలో ఒక్క క్షణమైనా సరే ఆకులలో గాలి వూసులాడకూడదు. ఏటి లోని అలలు పెదవి విప్పకూడదు అని మౌనంగా గువ్వల్లా ఒదిగిపోతున్నారొక జంట. ష్! వారిని అలాగే ఉండనివ్వండి.
***"మాయని మమత" వున్నా తనకోసం వాకిటిలో నిలబడకని, ఇంక తనకై మరి మరి చూడకని, ప్రతి గాలి సడికి తడబడకని, పదధ్వనులని పొరబడకని - తను రాక పోతే వసంత మాసమే రాదనీ తన సఖిని వదిలి దూరపు సీమలకి ఎందుకిలా ఏగుతున్నాడో - పాపం!
***ఇన్ని కబుర్లు చెప్పి మన "మల్లీశ్వరి" గురించి ఏమీ చెప్పకపోతే అమ్మో! ఇంకేమైనా ఉందా - రాయలవారితో చెప్పి అంతఃపురానికి అరణంగా పంపించేస్తుంది.
చిన్ననాటి ఆకతాయి, ప్రసాదం భక్తురాలు తన నాగరాజు బావని ఎంత ఆట పట్టించిందో మీరెరుగుదురా?
అతను కోతి బావంట, వాని పెళ్ళికి కోవెల తోట విడిదంట. ఆ పెళ్ళిలో బావ మెడలో గంధం పూసి, హారాలు వేసి, కుళ్ళాయి, కుచ్చుల తురాయి పెడుతుందట. హన్నా! ఇంత అల్లరి కనీ వినీ ఎరిగామా ఎప్పుడైనా?
బావ బండెక్కి - నల్లని మబ్బులు గుంపులు, గుంపులు- తెల్లని కొంగలు బారులు, బారులు - అని చూపించిహోరుగాలి, కారుమబ్బులు ముసిరేలోగా మూగేలోగా ఊరు చేరాలి అని తొందర చేసింది.
ఇంకేముంది! అనుకున్నంతా అయింది - ఆ వాన ముంపు రానే వచ్చింది. కాలక్షేపానికి, మళ్ళీ బావని ఆట పట్టించడానికి అదిగో ఆ మల్లి పిల్ల మళ్ళీ - పిలచినా బిగువటరా ! ఔరౌరా! చెలువలు తామే వలచి వచ్చినా - అని ఆడింది, పాడింది. రాయలవారి కళ్ళల్లో పడనే పడింది. రాణివాసం వెళ్ళింది.
ఇప్పుడు తీరికగా కూర్చుని బాధపడుతూ నెలరాజుకి ఎన్ని జాలి కథలు వినిపిస్తే ఏం లాభం? జరగాల్సిన ఆగం జరిగేపోయింది - విరహపు భోగం నిలిచేపోయింది.
మల్లిని తలచి - ఔనా! ఇది నిజమేనా! - అని వగచి శిల్పి నాగరాజు దేశద్రిమ్మరే అయ్యాడు.
జాలి గుండెల మేఘమాలా అని పిలిచి తన బావ జాడ చెప్పమంటే మాత్రం ఇవేమన్నా కాళిదాసు మేఘసందేశం రోజులా- మేఘాలు రాగాలు మోయడానికి? పిచ్చి మల్లి! ఎన్నాళ్ళైనా తన కళ్ళు దిగులుతో రేబవలు బావకై ఎదురు తెన్నులు చూడాల్సిందే అని ఎప్పటికి గ్రహిస్తుంది?
ఆ నాగరాజుకి మాత్రం తెలీదా - మల్లికే తెలియరాని తన మనసు మేఘానికి తెలియబోదని - మల్లితో మరవలేనని చెప్పమన్నా చెప్పబోదని? ఎన్నాళ్ళు అలా విలపిస్తాడు?
హమ్మయ్య! మేఘ దౌత్యమో, మరింకే దైవ బలమో ఇన్నాళ్ళకి మళ్ళీ మల్లీ-నాగరాజులు కలుసుకున్నారు.
మన మల్లికి ఏ మాత్రం తెలిసిందో చూద్దామా- నాగరాజునింక అల్లరి పెట్టకూడదని---?
కొమ్మల గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ జూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా...
అద్దీ! అలా దారికి రావాలి- మన ప్రసాదం భక్తురాలు! ఇప్పుడు మన మనసుల్లో మల్లెల మాలలూగినట్టు వుంది కదూ మల్లీ-నాగరాజులు మళ్లీ ఒక్కటై వూరికి వెళ్ళబోతున్నందుకు!!
***ఒళ్లంతా ఒయ్యారి కోక కట్టి, కళ్ళకు కాటుక పెట్టి, మెళ్ళో తాళితో, కాళ్ళకు పారాణి, నుదుటను మెరిసే కుంకుమ బొట్టు తో ఒక "అమెరికా అమ్మాయి" నోటను మన తెలుగు పాటను పలికించి పరవశను చేయగలిగిన-
ఇంత అద్భుతమైన కవితా వారసత్వాన్ని మనకిచ్చి వెళ్ళిన శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిని కన్న మన రత్న గర్భకి ఆయన పాటతోనే ఒకసారి జేజేలు పలుకుదాం...
(పాటల పూర్తి అర్ధమే తెలియని తెలిసీ తెలియని వయసునుంచే దేవులపల్లి పాటంటే నాకు చాలా ఇష్టం. నేను వ్రాసిన ఈ వ్యాసం "కృష్ణ పక్షం" లో కూడా వెన్నెలలు వెదజల్లే ఆ కవితా చంద్రునికి ఒక నూలు పోగు లాంటిది. ధన్యోస్మి!!!)
~లలితా TS