24, ఏప్రిల్ 2021, శనివారం

గీతం...సంగీతం...సతతహరితం - 10 - హమ్ నే దేఖీ హై, గుల్జార్ కీ గుఫ్తగూ కీ మెహక్‌తీ ఖుష్బూ...

    మా వీధిలో ఓ చెట్టుంది. ఉట్టి చెట్టు కాదు - గులాబీ రంగు పూలపూల చెట్టు. 

    అదేమంత విశేషం కాదు. 

    ఊరన్నాక వీధులుంటాయి. వీధుల్లో చెట్లుంటాయి. చెట్లకి పూలుంటాయి. ఆ పూలకి రంగులుంటాయి. 

    ఇప్పుడున్న పూలకారు వేళలో పూసే చెట్లకి పూలుండడమూ అంత విశేషమేమీ కాదు. 

    మా వీధిలో ఉన్న ఆ చెట్టు ఉన్నది కూడా మా ఇంటి ముందు కాదు. మా ఇంటికి ఓ నాలుగిళ్ళ అవతలున్న ఓ ఇంటి ముందు ఉంది. నిజానికి ఆ చెట్టు పేరేంటో కూడా నాకు సరిగ్గా తెలీదు. 

    ఇంతకీ పేరేంటో కూడా తెలీని చెట్టు గురించి ఎందుకింత చెప్తున్నానూ అంటే - ముందుగా ఆ చెట్టుని చూసీ చూడగానే నాకు రాయాలనిపించి నే రాసుకున్న కొన్ని లైన్లు ఈ కిందున్నాయి. వాటి కిందనే ఆ లైన్లు నా చేత రాయించిన ఆ చెట్టు తాలూకుదో - కొన్ని కొమ్మల -  బొమ్మ కూడా ఉంది. 

    నే రాసిన కైత చదివి, ఆ తరువు చిత్తరువులు చూసి - ఇంకొంచెం ముందుకెళితే నేనా పుడమిపుట్టువు గురించి రాసిన కబుర్లుంటాయి. ఇవన్నీ దాటి వెళ్ళాక - ఆ పుష్పదం నాకు గుర్తు చేసిన ఓ గుల్జార్ పాట గుబాళింపు ఉండనే ఉంది. 

    ఇదిగో - ముందుగా - నా కైతతో మొదలు ... 

*******
*******

నల్లమొయిలు నీడ లోన 
చలచల్లని నిదుర వేళ 
కుదురు లేని గాలి ఒకటి 
అల్లనల్లన తేలి వచ్చె 
అలల పాట నొకటి మోసుకొచ్చె 

కలల మాటున కునుకుతున్న నిదుర మబ్బు
గాలిపాటకు అదరిపాటున లేచి చూసె ... 
అలవిమాలిన పొంగుతో చినుకు చిందువేసె...   

చిందు తొణికి - చినుకు పదం తాకి 
మురిసి మురిసి తనువు - తరువు మొలకలెత్తె 

తెల్లవారి... వెలుగు చుక్క సోకి ... 
తరువు తనువు - విరిసి విరిసి - పులకలెత్తె 

తనివి తీర - తనువు మేర... 
విరుల నగలు పొదవు కొని 
వగలు పోయె తరువు తెఱవ
తన - పలుకు లేని భాషలో
తను - పలికీ పలుకక పలికిన
అలవోకల కులుకు పాటలలో 
చిలికించిన వలపు బాసలెన్నో...
ఒలికించిన పూల ఊసులెన్నో...

*******
*******

తరువు చిత్తరువులు 


   




*******
*******

    ఆమని అన్ని చెట్ల ముంగిటిలోకీ సమంగానే ఆగమించినా - ఆ పూలకారుని ఆవహించుకున్న తీరు ఏ చెట్టుకాచెట్టుకే సొంతం. 

    శిశిరపు ఆకురాలు అలసటతో - శీతాకాలపు నిదురలో మునిగిన చెట్లన్నీ - చైత్రమాసపు తొలకరి జల్లులకి - ఒక్కసారిగా మేల్కొని -  మహా అంటే - రెమ్మరెమ్మా చిగురేసి, కొమ్మకొమ్మా మొగ్గేసి, చెట్టంతా పూత పూసి - పెళ్ళికో పేరంటానికో ముస్తాబైనట్లుంటాయి. అదే మానుకైనా, మాకుకైనా మామూలే! 

    కానీ నేను చూసిన మా వీధిలో పూసిన చెట్టు -  పై చిత్తరువుల లోని తరువుంది చూశారూ! దీని తరహానే వేరు. 

    కొమ్మ కాదు, రెమ్మ కాదు - చెట్టు నిలువెల్లా - చినుకు చిందు నిలిచిన చోటా, వెలుగు చుక్క తాకిన మేరా - పూసెయ్యాలని ఆత్రమేమో - కాండం మీద కూడా గుత్తులుగుత్తులుగా పూలు నింపేసుకుంది. 


*******
*******

    ఈ చెట్టుని చూడగానే నాకు గుర్తొచ్చిన పాట - ఓ గుల్జార్ కీ గుఫ్తగూ (गुलज़ार की गुफ्तगू). 

    ముందుగా ఆ పాట వివరాలు:

    పాట పేరు: హమ్ నే దేఖీ హై - ఉన్ ఆంఖో కీ - మెహక్‌తీ ఖుష్బూ... 

    పాటున్న సినిమా పేరు: ఖామోషీ 

    పాట రాసిన వారి పేరు: గుల్జార్ 

    పాట కట్టిన వారి పేరు: హేమంత్ కుమార్ 

    పాట పాడిన వారి పేరు: లతా మంగేష్కర్ 

    పాటలో కనపడిన వారు: పాటకి కదులుతూ  స్నేహలత, అక్కడక్కడా మెదులుతూ వహీదా            రెహమాన్ (ఇంకా పాటలో వాద్యకారులు ఎంతో మంది కనిపిస్తారు - live orchestra లాగా)

    పాటకి యూట్యూబ్ లింక్Humne Dekhi Hai In Aankhon Ki Mehakti Khusboo | Lata Mangeshkar| Khamoshi 1969 Songs| Waheeda Rehman - YouTube

*******
*******

    గుల్జార్ రాసిన చాలా పాటలు నాలో నేనే - గుసగుసగా అనుకుంటూ - నాతో నేనే మాట్లాడుకునే సంభాషణల్లా అనిపిస్తాయి. అందుకే వాటికి నేను పెట్టుకున్న పేరు గుల్జార్ కీ గుఫ్తగూ. 

    అందులోనూ ఈ - హమ్ నే దేఖీ హై - పాటైతే మరీనూ. 

    ఏదో మైమఱపు సమయంలో గుల్జార్ తనలో తను అనుకుంటూ ఉండగానే - అది నచ్చేసిన హేమంత్ కుమార్ - ఆ అత్తరుభాషకి మెత్తనైన రాగం కూర్చి - తీగలాంటి మంగేష్కర్ గొంతులో పలికించినట్లు ఉంటుంది. 

    అందుకే ఈ పాట వింటూనే మేలిమి బంగారు తీగకి గులాబీలు పూసిన పూసిన పరిమళం సోకుతుంది చెవులకి. 

    చెవులకి పరిమళం సోకడమేంటా అని ఆశ్చర్యమే అక్కర్లేదు - కళ్ళ లోంచి గుబాళిస్తున్న ప్రేమ పరిమళాన్ని చూపగలిగే పాట ఇది - ఈ పాటతో ఏదైనా సాధ్యమే! 

*******
*******

    ఈ పాట వినడానికి ఎంత సౌఖ్యంగా అనిపిస్తుందో - చూడడానికీ అంతే హాయిగా ఉంటుంది. 

    ఈ పాటలో - తగిలీ తగలని చిరుగాలికి ఊగీఊగక కదిలే విరజాజి లతలా - కనిపించే నటి పేరు స్నేహలత. 

    అసలు ఈ పాట ఆమే పాడుతోందేమో అనిపించేంతగా సరిపోయింది గాన-లత గొంతు స్నేహలతకి. 

    నా వరకు నాకు ఇప్పటి వరకు నేను విన్న లతా మంగేష్కర్ పాటలన్నీ ఒకెత్తు - ఈ పాటొకటీ ఇంకొకెత్తు. ఎంత తియ్యగా ఉంటుందో! 

    అందులోనూ కొన్ని మాటల దగ్గర - ముఖ్యంగా - పల్లవిలో రిష్తోం కా ఇల్జామ్ న దో! అన్న దగ్గరా, అనుపల్లవిలో కోఈ నామ్ న దో! అనన్న చోటా - ఒక చిన్న tremolo -  గొంతులో చిన్నిచిన్ని స్వరాల అలలేవో దొర్లుతున్నట్టున్న ఓ చిన్ని ఉరుటు ఎంతగా ఊరిస్తుందో!

    ఇంకా మొదటి చరణంలో కహా కర్‌తీ హై..., బహా కర్‌తీ హై - రెండో  చరణంలో  ఝుకే రహ్‌తే హై..., రుకే రహ్‌తే హై!.. అని పాడేటప్పుడు కూడా ఇంకొన్ని ఉరుటు-మెఱుపులు వినిపిస్తాయి. 

    ఈ పాటకి హేమంత్ కుమార్ సంగీతం -  తమ మీంచి జారే నీటిజాలులకి వాలుగా  నున్నబడిన బుల్లిబుల్లి రాళ్ళ మీదుగా సాఫీగా జాలువారుతున్న సెలయేటి పాటలా ఉంటుంది. 

    పాట ఎత్తుగడ లోనే ఉనాఖోం కీ  అని తమాషాగా వినిపిస్తుంది - ఆ తర్వాత కూడా పాటంతా ఊపిరితో నే కలిసి - ప్రయాస లేకుండా - కులాసాగా సాగిపోతున్నట్టుంటుంది. 


*******
*******

    నాకీ పాట ఎంత ఇష్టమంటే - పాటలో ఉన్న మాటమాటనీ నా మాటల్లో రాసుకునేంత. 

హమ్ నే దేఖీ హై - ఉన్ ఆంఖోం కీ - మెహక్‌తీ ఖుష్బూ... 
హాథ్ సే ఛూ కే ఇసే - రిష్తోం కా ఇల్జామ్ న దో!

ఆ కనులు వెదజల్లుతున్న పరిమళాన్ని చూశానోయి 
దీన్ని చేతితో తాకి - బంధమేదో ఉందన్న నింద వేయకోయి  

సిర్ఫ్ ఎహసాస్ హై యే - రూహ్ సే మెహసూస్ కరో... 
ప్యార్ కో ప్యార్ హీ రహ్‌నే దో - కోఈ నామ్ న దో!

ఇది అనుభూతి మాత్రమే - ఎదతో చవిచూడవోయి 
ప్రేమని ప్రేమగానే ఉండనీయి - దానికో పేరు పెట్టకోయి 

ప్యార్ కోఈ బోల్ నహీ - ప్యార్ ఆవాజ్ నహీ... 
ఏక్ ఖామోషీ హై - సున్‌తీ హై - కహా కర్‌తీ హై... 
న యే బుఝ్‌తీ హై - న రుక్‌తీ హై - న ఠహ్‌రీ హై కహీ... 
నూర్ కీ బూంద్ హై - సదియోం సే బహా కర్‌తీ హై!

ప్రేమ ఒక మాట కాదు - ప్రేమ ఒక శబ్దం కాదది  
ప్రేమ ఒక నిశ్శబ్దం - తనే వింటుంది - తనే అంటుంది 
ప్రేమ ఆరిపోదు - ఆగిపోదు -  ఎక్కడా నిలిచిపోదది  
యుగయుగాల నుంచి ప్రవహిస్తున్న కాంతిబిందువది 

ముస్కురాహట్ సీ ఖిలీ రహ్‌తీ హై - ఆంఖో మే కహీ... 
ఔర్ పల్‌కోం పే -ఉజాలే సే -ఝుకే రహ్‌తే హై... 
హోఠ్ కుఛ్ కహ్‌తే నహీ - కాంప్‌తే హోఠో పే మగర్... 
కిత్‌నే ఖామోష్ సే అఫ్‌సానే రుకే రహ్‌తే హై!

కనులలో ఎక్కడో నవ్వులా విరిసి ఉంటుంది 
కనురెప్పల చివరల వెలుగై ఒదిగుంటుంది 
పెదవులేమీ చెప్పవు - కానీ వణుకుతున్న ఆ పెదవుల మాటున 
ఎన్ని చెప్పలేని కథలు దాగుంటాయో!

*******
*******





హమ్ నే దేఖీ హై - ఉన్ ఆంఖోం కీ - మెహక్‌తీ ఖుష్బూ... 
హాథ్ సే ఛూ కే ఇసే - రిష్తోం కా ఇల్జామ్ న దో!

సిర్ఫ్ ఎహసాస్ హై యే - రూహ్ సే మెహసూస్ కరో... 
ప్యార్ కో ప్యార్ హీ రహ్‌నే దో - కోఈ నామ్ న దో!

హమ్ నే దేఖీ హై - ఉన్ ఆంఖోం కీ - మెహక్‌తీ ఖుష్బూ... 
హాథ్ సే ఛూ కే ఇసే - రిష్తోం కా ఇల్జామ్ న దో!
హమ్ నే దేఖీ హై... 

ప్యార్ కోఈ బోల్ నహీ - ప్యార్ ఆవాజ్ నహీ... 
ఏక్ ఖామోషీ హై - సున్‌తీ హై - కహా కర్‌తీ హై... 
న యే బుఝ్‌తీ హై - న రుక్‌తీ హై - న ఠహ్‌రీ హై కహీ... 
నూర్ కీ బూంద్ హై - సదియోం సే బహా కర్‌తీ హై!

సిర్ఫ్ ఎహసాస్ హై యే - రూహ్ సే మెహసూస్ కరో... 
ప్యార్ కో ప్యార్ హీ రహ్‌నే దో - కోఈ నామ్ న దో!

హమ్ నే దేఖీ హై - ఉన్ ఆంఖోం కీ - మెహక్‌తీ ఖుష్బూ... 
హాథ్ సే ఛూ కే ఇసే - రిష్తోం కా ఇల్జామ్ న దో!
హమ్ నే దేఖీ హై... 

ముస్కురాహట్ సీ ఖిలీ రహ్‌తీ హై - ఆంఖో మే కహీ... 
ఔర్ పల్‌కోం పే - ఉజాలే సే - ఝుకే రహ్‌తే హై... 
హోఠ్ కుఛ్ కహ్‌తే నహీ - కాంప్‌తే హోఠోం పే మగర్... 
కిత్‌నే ఖామోష్ సే అఫ్‌సానే రుకే రహ్‌తే హై!

సిర్ఫ్ ఎహసాస్ హై యే - రూహ్ సే మెహసూస్ కరో... 
ప్యార్ కో ప్యార్ హీ రహ్‌నే దో - కోఈ నామ్ న దో!

హమ్ నే దేఖీ హై - ఉన్ ఆంఖోం కీ - మెహక్‌తీ ఖుష్బూ... 
హాథ్ సే ఛూ కే ఇసే - రిష్తోం కా ఇల్జామ్ న దో!
హమ్ నే దేఖీ హై... 


*******
*******

పూలకారు రాక చూసి చెట్టు నవ్వే 
నవ్విన నవ్వులన్నీ పువ్వులాయే 
పూచిన పూలు చూసి ఓ కైత అబ్బె  
అబ్బిన కైతలో ఓ పాట గురుతుకొచ్చె 
ఆ పాట గురుతులో కబుర్లెన్నో దొరలే 
దొరలిన కబుర్లే - దోసెడాయె బోలెడాయే
బోల్డన్ని కబుర్లాయే!

~ పాటల భైరవి 

18, ఏప్రిల్ 2021, ఆదివారం

జాస్తిరత్నాలు... ఇదో కొంగొత్త జాన్రా!

    యుద్ధం మీద, పద్మవ్యూహం మీద వ్యామోహం అభిమన్యుడికి పుట్టకముందే పుట్టినట్టు సినిమా మీద, పాట మీద ఇష్టం నాకూ అలాగే నేను పుట్టకముందే పుట్టి ఉంటుంది.

    ఆ ఇష్టాన్ని ఇంతై, అంతై, తెర అంతై అన్నట్టు పెంచి పోషించింది మాత్రం - నన్ను తమతో పాటు సినిమాలకి తీసుకెళ్ళి, సినిమాభిమానాన్ని, సినిమానురాగాన్ని మప్పిన ఎందరో వయో-తారతమ్య-రహిత హితులు, స్నేహితులు. 

    సందర్భమేదీ కాదు సిని-మా-వీక్షణకనర్హం అన్నది మా సిని-మా-నినాదం.  

    పై నినాదాన్ని నిరూపించడానికి - నొక్కి వక్కాణించడానికి సోదాహరణ తార్కాణాలు ఎన్నో, ఎన్నెన్నో. 

    సందర్భాన్ని బట్టి సినిమాలని విభజిస్తే అందులో మొట్టమొదటివి -  రాజోలు వెంకటరమణ, రవి సినిమా హాళ్ళకి - మా అమ్మ నాన్నమ్మ అయిన శివకోడు మామ్మ, ఆవిడ కోడలైన మా అమ్మమ్మతో  మా అమ్మా, దొడ్డలూ, పిన్నులూ, అత్తలూ, వారివారి పిల్లలూ, పిల్లల బొంతలూ, పాలసీసాలూ వగైరాలతో -  ఫష్షో, సెకండ్షో - చూసొచ్చేద్దామని చేసే మఱచెంబు-ఉప్పుపిండి ఫలహారం డబ్బా-సహిత ఒంటెద్దుబండి ప్రయాణం - చేసి మరీ చూసిన హష్షూ-ఉష్షూ సినిమాలు. 

    ఆ తర్వాత వరసగా ... 

    ప్రతి పుట్టినరోజుకీ అమ్మ-నాన్న తీసుకెళ్ళిన పుట్టినరోజు-సినిమాలు

    ఇంటికొచ్చిన చుట్టాలతో చూసిన చుట్టపుచూపు-సినిమాలు

    పెద్దపండగ రోజు చూసిన సంక్రాంతి-సినిమాలు

    స్కూల్ వాళ్ళ విరాళాల కోసం తీసుకెళ్ళిన బెనిఫిట్ షో -సినిమాలు. 

    తనతో వెళ్ళడానికి ఎవరూ లేరని, అమ్మకి కంపెనీగా వెళ్ళిన తోడు-సినిమాలు

    రామం బావ పెళ్ళికని అమలాపురం వెళ్ళి  - విడిదిలో ఉన్న ఉసిరికాయ చెట్టు దులిపేస్తున్న మా పిల్లలందర్నీ తీసుకుని వెళ్ళి ప్రసాదు  చూపించిన "గురువాయూరప్ప మహాత్మ్యం" లాంటి పెళ్ళికెళ్ళిన-సినిమాలు. 

    గవాస్కరూ, వెంగుసర్కారూ కలిసి కలకత్తాలో చేపలేవో తిని కడుపు నొప్పొచ్చి సరిగ్గా క్రికెట్టు ఆడక, ఇండియా వర్ల్డ్ కప్ ఓడిపోతే ఆ దుఃఖం భరించలేక మాకు మేమే ఓదార్పుగా చూపించుకున్న కన్సొలేషన్-సినిమాలు

    పరీక్షల ముందు తక్కువ చదివి-ఎక్కువ టెన్షన్ పడుతున్న నాకు  పరీక్షల ముందు టెన్షన్ తగ్గడానికి నాన్న చూపించిన "తెనాలి రామకృష్ణ" లాంటి ప్రీ-పరీక్ష-సినిమాలు

    ఇంటర్నల్ పరీక్షల ముందు రోజు టికెట్ల క్యూలో నించుని చదువుకుంటూ మరీ చూసిన "ఘరానామొగుడు" లాంటి ప్రిపరేషన్-సినిమాలు

    పరీక్షలు అయిపోయాక ఆనందంతో చూసిన "పడమటి సంధ్యారాగం" లాంటి పోస్ట్-పరీక్ష-సినిమాలు. 

    టెన్త్ క్లాస్ దాకా ఎక్కువగా తెలుగే చూసినా గుంటూరు విజయలక్ష్మీ థియేటర్లో రాజ్ కపూర్ సినిమాలతో మొదలుపెట్టి శేష్ మహల్లో వచ్చే కొత్త సినిమాలన్నీ చూసేసిన హిందీ-సినిమాలు. 

    ఇవన్నీ చాలక దూర్‌దర్శన్‌లో చూసిన ఆదివార మధ్యాహ్నపు ఆల్-భాషా-సినిమాలు.  

    చిరంజీవి సినిమాకి టిక్కెట్లు దొరికితే చాలు కొబ్బరికాయ కొడతానని మా కుట్టెమ్మ మొక్కుకుని మరీ చూపించిన "అన్నయ్య" లాంటి మొక్కు-సినిమాలు.  

    తొలిచూలు కానుపుకి ఒక్కటంటే ఒక్కరోజు ముందు "పిల్లాడు పుట్టేశాక మళ్ళీ ఇంకెప్పటికి లల్లెమ్మ సినిమా చూస్తుందో!" అని నా తరఫున బెంగెట్టేసుకుని, పట్టుబట్టి ఇంట్లో వాళ్ళందరూ నన్ను పట్టుకెళ్ళిన "పెళ్ళిసందడి" లాంటి ఆపసోపాల-సినిమాలు. 

    చుట్టూ ఉన్న అపార్టుమెంటుల్లో అమ్మాయిలందరూ "ఎబ్బే! బాలేదు" అన్నా - "పాపం! పదహారేళ్ళ అబ్బాయిలు అలాగే ఉంటారు. అంత కష్టపడి తీస్తారు. ఎవరూ చూడకపోతే ఎంత కష్టపడతారు?" అనుకుంటూ చూసిన "అల్లరి" లాంటి సింపతీ-సినిమాలు

    కలర్స్ స్వాతి అంటే ఇష్టమని చూసిన "లండన్ బాబులు" లాంటి హౌస్-నిల్లు సినిమాలు

    ఇలా చెప్పుకుంటూ వెళ్తే -  కొన్ని  సందర్భ-సహిత-సినిమాలు... ఇంకొన్ని సందర్భ-రహిత- సినిమాలు ... మరికొన్ని సందర్భ-కల్పిత-సినిమాలు - ఎన్నని ఎంచి చెప్పినా ఇంకా ఎన్ననివి, ఎంచనివి బోల్డు ఉంటాయి. 

ఇన్ని సినిమాలు చూసిన ఇన్నేళ్ళ తర్వాత - ఇంటి పట్టునే ఉండి - ఇప్పుడు చూస్తున్న క్వారంటైన్-సినిమాలు

******************************************

******************************************

    ఎలాంటి సినిమాలు చూడాలీ అన్న విషయంలో నాకు ఉన్న ఒకే ఒక్క criterion లేక కొలత - ఉన్నంతలో ఒక మంచి కాలక్షేపం. 

    ఓ మూడు నవ్వులు - ఓ ఆరు పాటలు - ఓ రెండు-మూడు ఫైటులు - ఇంట్లో మొదలెట్టి ఊరి చివరున్న కొండల దాకా దొర్లుకుంటూ వెళ్ళో, గాల్లో ఎగిరెళ్ళో కొట్టుకున్నా - కథ సుఖాంతమైతే చాలు. 

    ఇవన్నీ కాకుండా - తెర మీద ఉన్న పాత్రలన్నీ - మనింట్లో మాట్లాడేసుకునే భాష మాట్లాడేసుకుంటూ, మనలో ఒకళ్ళన్నట్టుగా ఉన్నట్టున్నా మా బాగే! 

    అదీ కాదు - మేడ మీద తెల్లచీర కట్టుకుని తిరిగే అందమైన దెయ్యాలు, వాటిని చూసి దడుపు జ్వరం తెచ్చుకునే సప్తగిరులూ ఉన్నా కాస్తో కూస్తో ఓకే!

    కథని నడిపించే నాయకుడు హాస్యనటులని కొట్టడమన్న అపహాస్యం లేకపోతే కొంతలో కొంత హాయి. 

    సినిమా చూస్తున్న ప్రతిసారీ - "సినిమా అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్. అందులో పని చేసే వాళ్ళెందరో! అది పూర్తి చేయడానికి ఎన్ని కష్టనష్టాలు భరించాలో!" అనుకుంటాను. సినిమా అంతగా నచ్చకపోయినా సర్దేసుకుంటాను. 

    ఎప్పుడైనా అంత ఆసక్తికరంగా అనిపించని సినిమా చూస్తూ - మొదటి అరగంట చూశాక, ఇక చూడాలనిపించక ఆపేస్తున్నట్టయితే - అప్పుడు కూడా "ఇంత కష్టపడి తీస్తారు, ఇంకొంచెం sensible గా తీస్తే బావుండేది కదా!" అనుకుంటాను.  

సినిమా ఒక కథ చెప్తుంది. ఆ కథకి దానిదైన మొదలు, నడక, ముగింపు ఉంటాయి. ఆ కథకే సొంతమైన logic, magic ఉంటాయి. 

    సినిమాకి ఉన్న కథ ఏదైతే ఉందో దాన్ని నేను ఆ సినిమా పరిధి లోనే చూస్తాను. అందులో సాధ్యాసాధ్యాల గురించి ఆట్టే ఆలోచించను కూడా. నేననుకునే sense and sensibility కూడా ఆ కథకి  ఉన్న logic లో ఇమిడిపోతే చాలు. 

    అదెలా అంటే - చిన్నప్పుడు నాన్నమ్మ చెప్పిన కథల్లో - అనగనగా రాజకుమారుడు ఏడు సముద్రాలు దాటి - ఏడు తాడి చెట్ల మీదున్న - ఏడంతస్తుల మేడలో - చిట్టచివరి అంతస్తులో ఉన్న - పంజరంలో ఉన్న - చిలకలో ఉన్న - మాంత్రికుడి ప్రాణం కోసం వెళ్ళాడంటే - అసలలాంటి మేడలుంటాయా, ఉన్నా ఎవరైనా అక్కడికి వెళ్ళగలరా - అన్న ఆలోచనే లేకుండా ఆ కథని కథగానే ఎలా విని ఇష్టపడ్డానో - చూసిన ప్రతి సినిమానీ అలాగే నచ్చుకోవడానికీ, నచ్చిన చోట మెచ్చుకోవడానికీ - అంతే ఉత్సాహపడతాను. 

    కానీ - ఈ మధ్య వచ్చిన చాలా సినిమాల్లో ఎలా ఉంటోందంటే - "నేను చాలా మంచి కథ చెప్పగలను, చెప్పబోతున్నాను" - అని ఓ పక్క చెప్పుకుంటూనే  - తాము చెప్తున్న కథలో చిన్నచిన్న logical controversies తమకి తెలియకుండానే చొప్పించేస్తున్నారు సినిమాలు రాసేవాళ్ళు, తీసేవాళ్ళు. అప్పుడు మాత్రం వాళ్ళు చెప్పినట్టు అంత గొప్పగా లేదే ఈ సినిమా అనిపించినప్పుడు మాత్రం గొప్ప చిరాకేస్తుంది. వాటి గురించి ఆనక ఇంకోసారి తీరిగ్గా చెప్తా. 

    ప్రస్తుతానికి ఆట్టే చుట్టుతిరుగుళ్ళు లేకుండా ఈ మధ్య చూసిన కొన్ని సినిమాలూ, వాటి తమాషా కబుర్లూ చెప్పడం ఈ నాటి నా బ్లాగు ఎత్తుకున్న జెండా, ఎజెండా కూడా. 

    కిందటి ఏడాది మార్చ్ నెల నుంచి - అత్యుత్సాహంతో - నెట్ఫ్లిక్సూ,  అమెజానూ మార్చి మార్చి  బోల్డన్ని తెలుగు సినిమాలు, మలయాళం సినిమాలు, హిందీ సినిమాలు, తమిళ్ ఏంథాలజీలు చూశాం. 

    అవన్నీ  ఒక ఎత్తైతే ఈ కొత్త సంవత్సరంలో చూసిన తెలుగు సినిమాలు కొన్ని ఇంకొహెత్తు!

    వాటి గురించి చిన్నిచిన్ని సినీ-టిట్టు-బిట్టులు... 

    రెడ్: ఇది అసలు చూడాలనుకోకపోయినా, అనుకోకుండా చూసిన సినిమా. ఇద్దరు రామ్ పోతినేనిలు హీరోలుగా చేసిన సినిమా. చూసినంత సేపు ఈ అబ్బాయి బాగానేact చేశాడు అనిపించిన సినిమా. అంతకు మించి ఇంకేమీ గుర్తు లేని సినిమా. ఇంకోసారి చూడక్కరలేదు అని గుర్తు పెట్టుకున్న సినిమా. 

    క్రాక్: మనూరబ్బాయిలా ఉండే రవితేజ సినిమా కదా అని చూశాం. ప్చ్! కుంగ్-ఫూ పాండా సినిమాల్లో ఉండే ఆడపులిని గుర్తుకు తెచ్చిన శృతి హాసన్ ఫైటొకటి తప్ప ఇంకేమీ గుర్తు లేవు. 

    నాంది: నవ్వు మరిచిపోయిన అల్లరి నరేషుని చూడడం ఈ సినిమా తోనే నాంది. చివరి దాకా చూసేశాం. కానీ అదేంటో అప్పుడెప్పుడో నిరీక్షణలో తప్పుడు కేసులో ఇరుక్కున్న భాను చందర్ని చూసినపుడు అనిపించిన "అయ్యో" ఈ సినిమాలో missing. 

    కపటధారి: ఈ సినిమా బద్రి ఓ మూడు రోజులు సీరియల్ లా చూశారు. నేను మాత్రం అక్కడక్కడా చూశానంతే. చూసిన ఆ కొంచెం లోనూ "ఈ అబ్బాయికి ఇక action అంటే ఏంటో ఎప్పటికీ తెలీదు. లేకపోతే ఇతని చేత ఎలా act చేయించాలో director కి తెలీలేదు" అని ఎన్నిసార్లు అనిపించిందో! ఇంతకీ బద్రి అయినా ఈ సినిమాని పూర్తిగా చూశారో లేదో తెలీదు. 

    గాలి సంపత్: మొదలుపెట్టిన అరగంట తర్వాత సినిమా ఆపేసి తాజా గాలి పీల్చుకోవడం కోసం బయటికి వెళ్ళిపోయాం. 

    ఉప్పెన: అస్సలు చూద్దామనుకోకపోయినా - అనుకోకుండా చూసిన సినిమా "ఉప్పెన".

     ఈనాడు సినిమా పేజీల్లో తెగ కనిపించిన ఈ సినిమాని గురించి అందరూ తెగ మాట్లాడుతుంటే "ఇదింకో hype సినిమా. చూడక్కర్లేదు" అనేనుకున్నాం. 

    అందుకే చూడాలనుకోలేదు. 

    కానీ అనుకోకుండా మొన్న శుక్రవారం Netflix లో - కనిపిస్తే - అసలెలా ఉందో చూద్దాం, అంతగా బాలేకపోతే ఆపేద్దాం -  అనుకుని మొదలుపెట్టిన వాళ్ళం - మధ్యలో కొంచెం సాగుతోంది అనిపించినా - చివరివరకు చూశాం. 

    చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అట హీరో వైష్ణవ్ తేజ. బాగా చేశాడు. హీరోయిన్ను కృతి షెట్టి. బావుంది, బాగా చేసింది కూడా. 

    విజయ్ సేతుపతి - మనిషి కదలకుండా, అరవకుండా స్థిరంగా, stern గా కనిపించిన గొప్ప నటుడు. 

    అన్నిటికీ మించి - కాకినాడ-ఉప్పాడ రేవుల అందాలు, సినిమా కథకి తగినట్లు కనిపించిన జాలరుల ఇళ్ళూ, పరిసరాలూ - సినిమా అంతా కనిపించిన సముద్రపు అలలూ - ఆ అలల నీలాలూ - అన్నీ చాలా నచ్చాయి. 

    సినిమా చూస్తూన్నంత సేపూ ఇది re-make ఏమో అని అనుమానమొచ్చేంత సహజంగా ఉన్న మనుషులూ, పరిసరాలూ - కథ ఎంత బాగా రాసుకున్నాడో బుచ్చిబాబు సానా...శానా బావుంది! 

    నాకెందుకో సినిమా చూస్తున్నంత సేపూ - కథలో ఏ మాత్రం పోలిక లేకపోయినా - సుకుమార్ "రంగస్థలం" - గుర్తొస్తూనే ఉంది. 

    సినిమాలో ఒకచోట - కనిపించకుండా పోయిన హీరోయిన్ని చీకట్లో వెతకడానికి వెళ్ళిన వాళ్ళు  - తొక్కుతున్న సైకిళ్ళు ఆపేసి వాటిని భుజాలకెత్తుకుని, చేత్తో పెడల్స్ తిప్పుతూ సైకిళ్ళకున్న హెడ్ లైట్స్ వెలిగించుకుని, ఆ లైట్ల వెలుగులో - కొంచెం ఎత్తులోంచి చూస్తే ఎవరైనా కనపడతారా అని వెతకడం - భలేగా అనిపించింది. మాస్టారు సుకుమార్ మార్క్ కనిపించింది. 

    ఈ బుచ్చిబాబు - ఇంకా ఈ మధ్య కాలంలో వచ్చిన కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ తీసిన డైరెక్టర్లందరూ - OTW (One Time Wonder) డైరక్టర్లలా కాకుండా - మళ్లీమళ్లీ మంచి సినిమాలు తీయాలని బోల్డంత అనుకుంటున్నాను. 

    జాతిరత్నాలు: చూడక ముందే యూట్యూబ్ టీజర్లతో, ఇంటర్వ్యూలతో ఎంతో నవ్వించి, ఎంతగానో ఊరించిన ఈ సినిమా మాత్రం చూస్తున్నప్పుడు "ఇది జాతిరత్నాలు కాదు, జాస్తిరత్నాలు" అనిపించింది. 

    తనకు నచ్చిన ఓ పది జోకుల్ని అక్కడక్కడా పేల్చుకుంటూ - మధ్యలో - ఏదో కథని పేర్చుకుంటూ పోయినట్టనిపించింది. 

    ఉన్న ఆ పది జోకులూ అప్పటికే యూట్యూబ్లో చూసేసున్నామేమో - ఇక అసలు సినిమాలో చూడడానికి ఏమీ మిగల్లేదు. 

    సినిమా బా...గానే సా...గింది. 

    నిజానికి ఈ సినిమాలో ఎవరికి తోచినట్లు వాళ్ళు free-style-acting చేసేసినట్టున్నారు. 

    నాకు మాత్రం నవీన్ పోలిశెట్టి తప్ప స్క్రీన్ మీద ఇంకెవ్వరూ ఆనలేదు. అతను కూడా ఇంతకు ముందు ఏజెంటుగానే బావున్నట్టనిపించాడు. 

    హీరోయిన్ చాలా బావుంది. కానీ ఈ సినిమాని దాటి ఇంకే సినిమా లోనూ ఊహించడానికి - ఆ ఆరడుగుల అమ్మాయి పక్కన ఆనడానికి - హీరోలు ఎంత మంది ఉన్నారబ్బా! అసలు ఈ సినిమాలో కూడా "చిట్టీ!" పాటలో హీరోయిన్ను భుజం మీద చెయ్యి వేసి పక్కనే నడుస్తుంటే అంతటి ఆరడుగుల నవీనుడు కూడా తానే చిట్టిగా కనిపించాడు కూడా. 

    నిజానికి ఈ సినిమాని ఇంట్లో తీరిగ్గా కాకుండా థియేటర్లో చూసుంటే - ఒక మాట వినబడీ వినబడక, పక్కనవాళ్ళెందుకు నవ్వుతున్నారో తెలీక - ఆ హడావిడిలో ఎందుకు నవ్వుతున్నామో తెలీకుండా నవ్వేసుకుని - బయటికొచ్చి సినిమా బావుందని అనేసుకునే వాళ్ళమేమో - రాజుగారి కొత్త బట్టల్లా!

    ఈ సినిమా చూడగానే బద్రి అన్నమాట - తను అనగానే విని నేనవునన్నమాట ఒకటే!

    "వీళ్ళు చాలా తెలివిగా మార్కెట్ చేసుకున్నారు సినిమాని. ఉన్న ఆ నాలుగు జోకుల్ని చూపించి సినిమా అంతా నవ్వులే అన్నట్టు అనిపించారు. తీరా చూస్తే వున్నవి, నవ్వించినవి ఆ నాలుగు జోకులే! అంతా hype (జాస్తి) అంతే " - అని. 

అందుకే అంటాన్నేను - 

ఈ జాతిరత్నాలు 
మహా జాస్తిరత్నాలు 
కనరా... వీరకుమారా! 
ఇదో కొంగొత్త జాన్రా (genre )!

~ సినీ-మా-లక్ష్మి వ్రాలు 


 







4, ఏప్రిల్ 2021, ఆదివారం

వేనెట్

నా వరకు నాకు ... 

నేను చెప్పబోయే కబుర్లలో ఒప్పొప్పులు ఎంచేటప్పుడు 

నచ్చిన విషయం గురించి చెప్పడం ఒప్పు
నచ్చని దానిని గురించి చెప్పకపోవడం ఒప్పు

ఓ మంచి విషయం గురించి తలుచుకోవడం ఒప్పు
ఓ మంచిదనిపించని దానిని తలవకపోవడం ఒప్పు 

నొప్పించే దేదైనా నీటి మీద రాత  కానీయడం ఒప్పు 
నప్పిన గురుతుని ఆలస్యమైనా ఎప్పుడోకప్పుడు రాసుకోవడం ఒప్పు 

*******
*******

    ఇప్పటికి ఎన్నో రోజులుగా పక్కన పెడుతున్నా, ఇప్పటికిప్పుడు రాసుకుని - నా రాతలో మళ్ళీ తన గురించి చదువుకుని - తలుచుకోవాలనిపించింది - వేనెట్ గురించి. 

    ఇన్ని రోజులూ ఊరికే ఉండీ - ఉన్నట్టుండి - ఈరోజే అలా ఎందుకనిపించిందో - చివరాఖర్లో చెప్తా. 

    వేనెట్ ఎవరంటే... వేనెట్. అంతే!

     వేనెట్ గురించి నేనెప్పుడు తలుచుకున్నా - ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఏదో విషయానికి తనని తలుచుకుని మాటల్లోకి  మలుచుకున్నా - అలా తలచుకున్న, తలపుని మాటగా మలుచుకున్న ప్రతిసారీ - ఆపలేని నవ్వుతో నా గొంతులో పొంగే ఆనందం నాకే వినిపిస్తూ ఉంటుంది.  దాచలేని వెలుగేదో నా కళ్ళను దాటి నా నవ్వులో మెరుస్తోందని నాకే తెలుస్తూ ఉంటుంది. వేనెట్ ఎవరంటే ఆ ఆనందపు వెలుగుకీ, నవ్వులో మెరుపుకీ ఉనికి అని మాత్రమే చెప్పగలను. 

    పదిహేనేళ్ళ క్రితం -  నేను పని చేసే టీం లోకి కొత్తగా ఇంకో అమ్మాయి చేరింది. ఆఫీసుకి వచ్చిన మొట్టమొదటి రోజు ఫార్మల్‌గా బూడిదరంగు స్కర్ట్, బ్లేజర్ వేసుకుని - రింగులు తిరిగిన జుట్టుకి హెయిర్-బ్యాండ్ పెట్టుకుని వచ్చింది ఓ నవ్వు-కళ్ళమ్మాయి - తనే వేనెట్. 

    నవ్వుతూ చేతులు కలిపిన ఆ అమ్మాయిని చూసిన మొదటి క్షణం నుంచే  తను ఒక మంచి టీమ్-మేట్ అనిపించింది.  ఇద్దరం ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ మొదలుపెట్టిన కబుర్లలో -  తను జమెయ్‌కా నుంచి వాషింగ్‌టన్ డీసీలో హోవార్డ్ యూనివర్సిటీలో అండర్-గ్రాడ్ చేయడానికి వచ్చానని చెప్పింది. అక్కడ చదువు అవుతూనే మా టీం లోకి వచ్చేసింది - అంటే fresh out of college అన్నమాట. అన్నట్టు హోవార్డ్ యూనివర్సిటీలో తను మిస్ అమెరికా-జమెయ్‌కా కూడా!

    నా క్యూబ్‌కి పక్కనే ఖాళీగా ఉన్న క్యూబ్‌ తనకి ఇచ్చారు. ఎప్పుడు ఎలా మొదలైందో గుర్తు లేదు కానీ మా ఇద్దరికీ మధ్యాహ్నం ఒక అరగంట సేపు కాఫీ షాపులో కబుర్లు చెప్పుకుని రావడం అలవాటయ్యింది. అక్కడ ఆ అరగంటలో ఎన్ని కబుర్లో. 

    అలా తనతో మాట్లాడేటప్పుడే తెలిసింది - జమెయ్‌కాలో పట్‌వా అనే భాష మాట్లాడతారని. అక్కడ కూడా మన లాగే వరి అన్నం తింటారని. 

    వేనెట్ నేను చెప్పే అన్నజింక-బుజ్జిజింకల కబుర్లు చాలా ఇష్టంగా వినేది. వాళ్ళని బుజ్జిజింకలని అంటానని అంటే దాని అర్థం ఇంగ్లీషులో అడిగి తెలుసుకుని తెగ ముచ్చట పడిపోయింది. 

    ఇంకా అప్పటికి ఏడాది మాత్రమే నిండిన బుజ్జిజింక ఊరీఊరని మాటల్ని మళ్ళీమళ్ళీ అడిగి చెప్పించుకుని నాతో ఏమనేదంటే - "వీడు చాలా స్మార్ట్. చూస్తుండు... వీడు పెద్దయ్యేదాకా ఆగి వీణ్ణే పెళ్ళి చేసుకుంటాన్నేను" అని. 

    అప్పుడప్పుడూ - వేనెట్ ఒక చిన్నపాటి lisp తో మాట్లాడి - అంటే "ask " బదులు "aks " - అని తమాషా చేసేది. 

    ఎప్పుడో రిటైర్ అయిపోయిన విప్ రిచర్డ్స్ ఆడిన క్రికెట్ గురించి, ఇప్పటి రోజుల ఉసేన్ బోల్ట్ గురించి, Boney-M పాటల గురించి బోల్డన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. 

    ఒక్కో మధ్యాహ్నం కాఫీ షాపులో చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోతే - మేమేమిద్దరం కలిసి "Brown girl in the ring - Tra la la la la la" అని పాడుకునేవాళ్ళం. 

    నాకు వేనెట్‌తో గడిపిన ఆ కాఫీ-మధ్యాహ్నాలు హాస్టల్ రోజుల్నాటి టీ-సాయంత్రాల్లా అనిపించేవి. 

    ఆఫీసులో మొదలైన ఆ స్నేహం తర్వాత్తర్వాత నెమ్మదిగా ఇంటి దాకా వచ్చి వేనెట్ మా ఇంట్లో "మన వేనెట్" అయిపోయింది. 

    అన్నజింక వాయించిన violin concerts కి వచ్చింది. చీర కట్టుకుని బుజ్జిజింకకి భోగిపళ్ళు పోసింది. వాడి పుట్టినరోజున పులిహోరలో సాంబార్ కలుపుకుని "బావుంది, బావుంది" అనుకుంటూ కళ్ళెగరేస్తూ తింది. చుక్కలు పెట్టి ముగ్గులు వేయడం నేర్చుకుంది. ఒకసారి నేను చేసిన బాదం బర్ఫీ తిని - అదెలా చేశానో అడిగి రెసిపీ రాసుకుని - ఓ రెండ్రోజుల తర్వాత బాదంబర్ఫీ చేసి - ముచ్చటైన అచ్చులుగా కోసి పట్టుకొచ్చి ఆఫీసులో అందరికీ పంచింది. 

    అన్నిటికన్నా ఎక్కువగా గుర్తుండిపోయేలా - నన్ను incorrigible అని తిట్టగలిగింది. అదెందుకో చెప్పకపోతే మజా లేదు. 

    అప్పట్లో మేమందరం - అంటే నేను, వేనెట్, బద్రి - సెయింట్ లూయిస్ డౌన్‌టౌన్ ఆఫీసులో పని చేసేవాళ్ళం. వేనెట్ డౌన్‌టౌన్ లోనే ఆఫీసుకి దగ్గరగా ఒక స్టూడియో అపార్టుమెంటులో ఉండేది. 

    నేను రోజూ పొద్దున్నే లేచి వంట చేసి నాకు, బద్రికి లంచ్ బాక్సులు సర్దుకుని వెళ్ళేదాన్ని. ఎప్పుడైనా శుక్రవారాలు ఆఫీస్ దగ్గర్లో ఉన్న సెన్-థాయ్ అనే థాయ్ restaurant కి వెళ్ళే వాళ్ళం నేను, బద్రి. 

    అలా వెళ్ళేటప్పుడు - వెళ్తున్నంతసేపూ కబుర్లు చెప్పడం తప్ప - చుట్టూ పరిసరాలూ, ఎక్కడ రోడ్డు క్రాస్ చేస్తున్నామూ, ఏ రోడ్డు లోంచి  ఇంకే రోడ్డు లోకి తిరుగుతున్నామూ - ఇలాంటి విషయాలు అస్సలు పట్టించుకునే దాన్ని కాదు. 

    అప్పుడనే కాదు - ప్రతిరోజూ ఇంటి నుంచి ఆఫీసుకి కార్లో వెళ్ళేటప్పుడు కూడా - ఆ గంట ప్రయాణంలో - కారు హైవే ఎక్కగానే నాకు నిద్రొచ్చేస్తే పడుకునేదాన్ని, నిద్ర రాని రోజు కబుర్లు చెప్పేదాన్ని - అంతే తప్ప ఎటు వైపు వెళ్తున్నాం, ఏ exit తీసుకుంటున్నాం అన్న స్పృహ, పట్టింపు ఉండేవే కావు. 

    దార్లు అంతగా పట్టించుకోని నాకు - సెన్-థాయ్ మా ఆఫీసు నుంచి పది-పన్నెండు నిముషాల నడక దూరంలోనే ఉన్నా - దానికెళ్ళే దారి మాత్రం నాకు తెలీదు. అది తెలీదని నాకేమీ బెంగ లేదు. అవసరమైన విషయాలని కూడా అత్యవసరమైనంత వరకు మాత్రమే పట్టించుకునే నాకు - బద్రి చెయ్యి పట్టుకుంటే దారి అంది పోయే చోట - ఆ దారికి నేనే చూపు-దారి కావడం, ఆ దారి ఎటెళ్తోందో చూసుకోవడం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ అలవాటు లేదు. 

    ఓ రోజు మా టీమ్ వాళ్ళందరం మధ్యాహ్నం లంచ్‌కి సెన్-థాయ్‌కి వెళ్దామనుకున్నాము. ఆ రోజేదో మీటింగ్ ఉండి - నేను, వేనెట్, జాకీ అనే ఇంకొక అమ్మాయి - మేము ముగ్గురం మిగిలిన టీం అందరూ ముందెళ్ళిపోతే - ఒక పావుగంట ఆలస్యంగా బయల్దేరాం.  

    ఆఫీస్ బిల్డింగ్ దాటి నాలుగు అడుగులు వేశామో లేదో - వేనెట్ హఠాత్తుగా ఆగిపోయి "నేనెప్పుడూ సెన్-థాయ్‌కి వెళ్ళలేదు. లలితా! నువ్వే దారి చూపించాలి" అంది. 

    "అయ్యో! నీకూ తెలీదా, వేనెట్? నేనూ ఎప్పుడూ సెన్-థాయ్‌కి వెళ్ళలేదు. తీసుకెళ్ళబడ్డాను" అని మహా-సిన్సియర్‌గా అన్న నా మాటలు వినగానే వేనెట్ ఒక్క నిముషం ఏమీ మాట్లాడలేకపోయింది. అసలు నాలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారా అని తనకి పెద్ద సందేహం వచ్చేసినట్లుంది. 

    మా తోనే ఉన్న జాకీ తనకి దారి తెలుసు అని చెప్పగానే - ముగ్గురం గబగబా నడుచుకుంటూ వెళ్ళి, లంచ్ చేసి ఆఫీసుకి తిరిగి వచ్చాక వేనెట్‌తో అన్నా - "ఒకసారి వెళ్ళొచ్చావు కదా...ఇప్పట్నించీ దారి గుర్తు పెట్టుకో " అని. 

    అలా అనగానే - కొంచెం కోపంగా చూసి - "నువ్వెప్పుడూ వెళ్ళే ప్లేసుకే దారి తెలీదంటావు. నిన్నెవరైనా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతే ఏం చేస్తావు?" అంది. 

    "ఆ భయం నాకేం లేదులే... నేను వెళ్తే బద్రితో, లేకపోతే నీతో. మీరిద్దరూ నన్నెక్కడా వదిలెయ్యరుగా!" అని నవ్వా. 

    వెంటనే  నా దగ్గరకొచ్చి చటుక్కున నా చెయ్యి అందుకుని - "లలితా! You are incorrigible!" - అంది కోపం గానే! 

    నవ్వా. 

    "థాంక్స్, వేనెట్!" అన్నా. 

    అప్పట్నుంచి ఎప్పుడు మేము సెన్-థాయ్‌కి వెళ్ళినా రోడ్డు మీద నడిచినంత సేపూ నా చెయ్యి పట్టుకునే ఉండేది వేనెట్.  తనూ, నేనూ ఆ టీములో పని చేసినన్నాళ్ళూ నా చెయ్యి వీడని తోడు వేనెట్!

    ఇంకోసారి - ఒకానొక సెన్-థాయ్ శుక్రవారం మధ్యాహ్నం పూట - జాకీ, వేనెట్, నేను - లంచ్ కని బయల్దేరాం. ఆఫీస్ దాటి ఓ పదడుగులు వేయగానే వేనెట్ ఎప్పుడూ వెళ్ళే దారిలో కాకుండా Macy's స్టోర్ ఉన్న బిల్డింగ్ పక్కనుంచి వెళ్దామంది. 

    ఇంతకీ విషయమేంటంటే ఆ రోజు బాగా ఎండగా ఉంది. ఎప్పుడూ సన్-గ్లాసెస్ పెట్టుకునే నేను ఆ రోజు వాటిని నా క్యూబ్‌లో టేబుల్ మీద పెట్టి మర్చిపోయి వచ్చాను. అది చూసి వేనెట్ - "నేను, జాకీ షేడ్స్ పెట్టుకొచ్చాం. నువ్వేమో మర్చిపోయొచ్చావు. బాగా ఎండగా ఉంది కదా! ఈ Macy's పక్క నుంచి వెళ్తే నీడగా ఉంటుంది. నీ కళ్ళకి ఇబ్బంది ఉండదు" అంది నాతో. నన్నంత అబ్బరంగా చూసుకున్న చెలిమి-చలువ వేనెట్! 

    ఆ పైన - మరోసారి ఏమయ్యిందంటే - ఓ రోజు పొద్దున్నే ఇద్దరం ఆఫీసుకి కలిసే వెళ్ళినా - బద్రి కొంచెం ముందుగా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. నన్ను సాయంత్రం మెట్రో బస్సెక్కి ఇంటికి వచ్చెయ్యమని చెప్పి తను కార్లో ఇంటికి వెళ్ళిపోయారు. అంతకు ముందు ఎప్పుడూ బస్సెక్కని నేను కంగారు పడకూడదని - నాకు ఎక్కడ బస్సెక్కాలీ, ఏ నంబర్ బస్సెక్కాలీ, ఇంటి దగ్గర ఏ స్టాప్ దగ్గర దిగాలీ - అన్నీ బద్రి చెప్పే వెళ్ళారు. 

    అవి విని గుర్తు పెట్టుకున్నానే కానీ - నాకు కొంచెం భయం గానే ఉంది.  

    కానీ వేనెట్ ఉందన్న భరోసాతో బద్రి చెప్పిన వాటన్నిటికీ తలూపాను.  

    లంచ్ టైంలో వేనెట్ దగ్గరికి వెళ్ళి "వేనెట్! ఇవాళ సాయంత్రం నేను బస్సులో ఇంటికి వెళ్ళాలి. నాకు బస్-స్టాప్ ఎక్కడో చూపిస్తావా? అని అడిగాను. 

    "నేను సాయంత్రం జిమ్‌కి వెళ్ళాలి, నా పర్సనల్ ట్రైనర్‌తో మాట్లాడాలి. నాలుగింటికల్లా తయారుగా ఉండు. నిన్ను బస్టాపులో డ్రాప్ చేసి వెళ్తాను" అంది వేనెట్. 

    "సరే! థాంక్స్, వేనెట్" అని వచ్చేశానే కానీ  - ఆ మధ్యాహ్నం అంతా మీటింగు లేవో అటెండ్ అవుతూనే ఉన్నాను కానీ ఏదో ఆలోచన తిరుగుతూనే ఉంది. 

    "నేను కరెక్ట్ నంబర్ బస్సు ఎక్కుతానా? బస్ ఎక్కిన తర్వాత నేను సరైన స్టాప్ లోనే దిగుతానా లేదా? ఒక వేళ ముందో, వెనకో దిగిపోతే బద్రికి ఎక్కడకి రమ్మని చెప్పాలీ?" - అదేదో బుల్లి Arthur గాడు  - First Day Of School  - పద్యంలో అనుకున్నట్టు ఎన్ని "What if" ఆలోచనలో. 

    ఇలా ఆలోచిస్తుండగానే - పావుతక్కువ నాలుగయింది టైము. వేనెట్ నాలుగింటికి బయల్దేరాలని చెప్పింది కదా! అందుకని నా లాప్టాప్ బ్యాగ్ సర్దుకుంటూ ఉన్నాను. అంతలోనే వేనెట్ వచ్చి నా క్యూబ్ దగ్గర నించుంది. 

    తనని చూడగానే "వచ్చేస్తున్నా, వేనెట్... ఒక్క నిముషం" అంటున్న నన్ను ఆపి "కంగారేం లేదు. నెమ్మదిగా సర్దుకో. నిన్ను బస్సెక్కించి నేను మనఃశాంతిగా జిమ్‌కి వెళ్ళలేను. అందుకే  నా ఎపాయింట్‌మెంట్ వచ్చే వారానికి మార్చుకున్నాను. నేనూ నీతో పాటు ఇంటికొస్తాను" అంది. 

    నాకేమో బోల్డంత సంతోషం - హమ్మయ్య! బస్సెక్కక్కర్లేదు కదా అని. 

    "నాకు ఇవాళ poached egg కూర చేసి పెట్టు" అంది. 

    "అంతే కదా! పద నీకేం కావాలో వండి పెడతా - ముందు ఇంటికి పద!" అన్నాన్నేను. 

    ఇద్దరం కలిసి వేనెట్ కార్లో బయల్దేరాం. తనకి auto-transmission ఇష్టం లేదనీ, అందుకే గేర్స్ ఉండే కార్ కొనుక్కున్నానని చెప్తూ, చెప్తూ డౌన్‌టౌన్ దాటి ఇవతలికి రాగానే నాకేసి తిరిగి "ఇప్పుడు ఏ exit తీసుకోవాలి" అని అడిగింది. 

    అది వింటూనే నేనేమీ తొణక్కుండా "నువ్వు ఇంతకు ముందు ఇంటికి వచ్చావు కదా! నీకే కదా తెలియాలీ?" అనడిగా. 

    ఒక్క క్షణం నోరు తెరిచి నాకేసి చూసి - ఆ తెరిచిన నోటి తోనే  - "నీ ఇంటికి నీకు దారి తెలీదా? లలితా! You're utterly incorrigible! Badri has spoilt you " అని నాకు అక్షింతలేసి - ఆ పక్కనే ఉన్న exit తీసుకుని, అక్కడున్న ఓ గ్యాస్ స్టేషన్ దగ్గర కార్ పార్క్ చేసుకుని ఫోన్‌లో మ్యాప్ చూసుకుని - మొత్తానికి నన్ను ఇంటికి చేర్చింది. 

    ఇంటికి వెళ్ళగానే తను అడిగినట్టే కొబ్బరి పాలు పోసిన poached eggs కూర చేశాను. 

    ఎప్పుడు ఇంటికొచ్చినా పిల్లలకి కలిపి ఇచ్చినట్టే వేనెట్‌కి కూడా నేనే అన్నం కలిపి ఇచ్చేదాన్ని. ఆ రోజూ అలాగే కలిపిస్తే - వేనెట్ ఆ అన్నం కలిపిన బౌల్ పట్టుకుని సోఫాలో కాళ్ళు చాపుకుని కూర్చుని - మాతో పాటు - నాగార్జున "కింగ్" సినిమా చూసింది. 

    ఆ రోజు చూసిన "కింగ్" సినిమాలో "చూపు చాలు మన్మథుడా!" పాట పాటలో త్రిష చేతులూపుకుంటూ చేసిన డాన్సుకి వేనెట్టూ, నేనూ పెట్టుకున్న పేరు "soap dance". 

    నేను పైన చెప్పిన సందర్భాల్లోనే కాకుండా ఇంకో సారి కూడా నన్ను incorrigible అంది వేనెట్. అదెప్పుడో తెలియాలంటే ఈ కిందనున్న లింకుకెళ్ళి చదవాల్సిందే!


    అలా - అలా రోజులు గడుస్తుండగా - వేనెట్ పెళ్ళికూతురయ్యింది. 

    వేన్‌కి  వధువయ్యింది. 

    Wayne's Waynette అయింది.  

    అప్పటికే వేరే టీంకి మారిన వేనెట్ - పెళ్ళి అయిన కొన్ని నెలలకే సెయింట్ లూయిస్ వదిలి డాలస్‌కి తరలింది. వెళ్ళే ముందు ఓ మూడ్రోజులు నా దగ్గర ఉంది. వెళ్తూ-వెళ్తూ వరలక్ష్మీ వ్రతం వాయనం తీసుకుని వెళ్ళింది. 

అప్పట్నుంచి - 
అప్పుడప్పుడూ, 
కుదిరినప్పుడు - 
హలో అన్న ఓ పలకరింపు, 
నాలుగు నవ్వుల చిలకరింపు, 
ఎప్పటికైనా కలుద్దామన్న ఎదురు చూపు 
వీటన్నిటి కలగలుపు 
ఓ మురిపెంపు తలపు 
వేనెట్!

     తను నాకు తెలిసిన దగ్గర్నుంచీ - తన ప్రతి పుట్టినరోజుకి - ఎప్పుడూ కూడా సరిగ్గా ఆరోజే విషెస్ చెప్పిందే లేదు. ఎప్పుడూ కూడా రెండ్రోజుల ముందు నించే "వేనెట్ పుట్టినరోజు వస్తోంది" అనుకుంటూ అనుకుంటూ - అసలు విష్ చెయ్యడమే మర్చిపోయి - ఖచ్చితంగా పుట్టినరోజు అయిన రెండు రోజుల తర్వాత belated wishes చెప్పేదాన్ని. 

    ఇన్నేళ్ళకి మొట్టమొదటి సారిగా - తన పుట్టినరోజుకి ఒక రోజు ముందుగా మాట్లాడడం, ముందుగానే Birthday wishes చెప్పడం కుదిరింది. అది celebrate చేసుకోవడానికే నేను రాసుకుంటున్న బ్లాగ్ పోస్ట్ ఇది. 

    అన్నట్టు వేనెట్‌కి సంబంధించి తనదైన ఒక Birthday tradition ఉంది. 

    ఏప్రిల్ ఐదవ తారీఖున వచ్చే Waynette పుట్టినరోజు నాడు తనకి Wayne ఇచ్చే బహుమతి ఏంటంటే - అచ్చంగా తన పుట్టినరోజుని తనకి నచ్చినట్టు గడిపే వీలు కల్పించడం.   

    ఎప్పట్లాగే - ఈ సారి కూడా - ఏప్రిల్ నాలుగో తారీఖు సాయంత్రం నుంచి ఏప్రిల్ ఆరో తారీఖు పొద్దున్న దాకా - హోటల్ రూంలో - తనకిష్టమైన క్రోషే అల్లికలు అల్లుకుంటూ, టీవీ చూసుకుంటూ పుట్టినరోజు జరుపుకుంటున్న వేనెట్‌కి బోల్డన్ని Happy Birthday Wishes



14, మార్చి 2021, ఆదివారం

అనగనగా ఒక అన్వరుడు... అను ఒక హార్టిస్టు కథ - 2

    ఆఁ ! ఆఁ ! వచ్చేశారా? నేను చెప్పే హార్టిస్టు కబుర్ల కథ వినడానికేగా!?

    ఇంతకుముందు చెప్పినవి ఇప్పటికి  చదవకుండా ఉండి ఉంటే, ఇప్పటికే చదివేసినా ఇంకోసారి చదవాలనుకుంటే - ఓ పాలి అటేపోసారి వెళ్ళిపోచ్చెయ్యండి మరి: అనగనగా ఒక అన్వరుడు... అను ఒక హార్టిస్టు కథ - 1

ఇవాళ తిప్పుతున్న మొట్టమొదటి పేజీ... 

 గుండె జేబులో

    ఒక వైపు పైకి లేచి గోపురంలా ఉన్న ఉంగరాల జుత్తు, చామనఛాయ కన్నా పిసరు తక్కువగా ఉన్న ఒంటిరంగు, కళగల మొహం ఉండి - తన ఫ్రెండ్సుకి దర్జానిచ్చే బట్టలు కుట్టిన ఫ్రెండ్లీ దర్జీ కిషోర్ కథ ఇది. 

    అన్వర్ - అందరు ఫ్రెండ్సువీ, అన్వర్ - అదర్ ఫ్రెండ్సు అందరివీ - బట్టలు కిషోరే కుట్టేవాడట. 

    ఈ పేజీల్లో ఒక వాక్యం గురించి చెప్పాలి. "డిగ్రీ సమయానికి చదువు, సంధ్య వదిలేసి సంగీతం, సాహిత్యం, చిత్రకళ, లావణ్య అని కొన్ని పట్టుకుని హైద్రాబాద్ వచ్చేశా." 

    దీని గురించి బద్రి మాటలు ఏంటంటే ..." బుజ్జాయ్! లావణ్య అంటే అన్వర్ వైఫ్ కదా! ఆ వాక్యమెంత బావుందో కదా! రెండుసార్లు వెనక్కి వెళ్ళి మళ్ళీమళ్ళీ చదువుకున్నా."

    సరే! మళ్ళీ వెనక్కి కిషోర్ కథ దగ్గరికి వెళ్తే అన్వర్ పట్టుకొచ్చిన లావణ్యతో జంటరి గొడ్డు  అయ్యాననిపించుకుంటే, కిషోర్ మాత్రం ఒంటరి గొడ్డు గానే ఉండిపోయాడు. ఇంకా ఎన్నో ఏళ్ళు ఫ్రెండుగా తోడుగా ఉంటాడనుకున్నవాడు - ఒంటిగూడు వదిలి వెళ్ళిపోయి - అన్వర్ గుండెజేబులో ఉండిపోయాడు. 

    ఆ కిషోర్ కబుర్లని అన్వర్ మాటల్లో చదువుతుంటే తట్టిన ఓ పాట... 

నువ్వు వెళ్ళిపోయినా నీ రూపు చెరిగి పోలేదు 
నువ్వు మరలి రాకున్నా నీ చోటెవ్వరికీ ఇవ్వలేదు... 


సమ్మర్ చిత్రకళ 

    ఈ సమ్మర్ చిత్రకళ చదివడం మొదలు పెట్టీ పెట్టగానే  పెటీల్మని ఓ నవ్వు చిట్లుతుంది పెదవుల మీద. దానికి కారణం అన్వరుక్రోషం. 
 
    "అవునా మీరు ఆర్టిస్టా? వావ్! నా బొమ్మ గీస్తారా?" అని చిత్రకారులని చులాగ్గా అడిగేస్తారు కానీ - దొంగల్ని మాత్రం "మీరు దొంగా? Awesome! ఓ సారి మా ఇంటికి కన్నం వేయరా...ప్లీజ్! ప్లీజ్!" అని అస్సలెవ్వరూ అడగనే అడగరు అన్నదే  అన్వరుక్రోషం.  

    నేను రాసింది చదువుతున్న వారెవరైనా సరే మీ బుజ్జితల్లికో, బుల్లితండ్రికో పెయింటింగ్ పాఠాలు నేర్పిద్దాం అనుకునే ముందు అన్వర్రాత "సమ్మర్ చిత్రకళ" చదవాల్సిందే. 

    ఇది అప్పుడెప్పుడో ఈమాట webzine లో చదివినప్పుడు నేననుకుని, నేనే అన్న మాటే మళ్ళీ ఇక్కడ చెప్తున్నా... 

    హార్టిస్టు గారూ! చిన్నప్పుడు నాకెంతో ఇష్టమైన సరదా కబుర్ల తెలుగు మాష్టారు చిట్టిబాబుగారు నేర్పిన ఓ పక్షి బొమ్మ ఇప్పటికీ ఆయన నేర్పినట్లే వేస్తాన్నేను. ఆ తర్వాత వృత్తలేఖినితో సున్నా మీద సున్నా – మూడు సున్నాలు చుట్టించీ, అందులో కొన్ని ముక్కలు చెరిపించి “శ్రీ” ని ఆర్టిస్టిక్(?)గా గీ(రా)యడం నేర్పిన డ్రాయింగ్ మాష్టారు నేర్పబోయిన బొమ్మలు మాత్రం పట్టుబడలేదు. మీర్రాసిన ఈ వేసవి పాఠం లాంటిది నాకప్పుడే దొరికుంటే నేనూ వేద్దునేమో ఓ పుంజీడు బొమ్మలు ! ప్చ్!

    మన చుట్టూ ప్రపంచంలో రంగులు నింపిన మహాచిత్రకారుణ్ణి తలుచుకుంటూ  ఓ మంచి పాటని ఈ పేజీకి జత చేస్తున్నా... 

ఏ కౌన్ చిత్రకార్ హై? ఏ కౌన్ చిత్రకార్?!
హరీ భరీ వసుంధరా పే నీలా నీలా ఏ గగన్... 
కే జిస్‌పే బాదలోం కీ పాలకీ ఉడా రహా పవన్!
దిశాయే దేఖో  - రంగ్ భరీ - చమక్ రహీ - ఉమంగ్ భరీ!
ఏ కిస్‌నే ఫూల్ ఫూల్ పే కియా శింగార్ హై?!
ఏ కౌన్ చిత్రకార్ హై? ఏ కౌన్ చిత్రకార్?!

కృష్ణస్మృతి 

    అన్వర్రాతల్లో ఈ పేజీ నాయుని కృష్ణమూర్తి గారి గురించి. 

    తనకి స్నేహం పంచిన చౌడేపల్లి - నాయుని కృష్ణమూర్తిగారి గురించి అన్వర్ రాసుకున్న ఈ పేజీ చదవగానే నాకు వెంటనే గుర్తొచ్చినవి - వరసగా -  హైస్కూల్లో పదవ తరగతిలో నెలనెలా చదువుకున్న పాఠశాల పుస్తకాలు, రామాయణంలో అరుణ్ గోవిల్,  అసలైన వ్యాస భారతాన్ని తెనిగించిన "జయమ్" పుస్తకం, "సుమం ప్రతి సుమం సుమం" పాట. 

    నాయుని కృష్ణమూర్తి గారితో తనకు దక్కిన స్నేహాన్ని తలుచుకుంటూ అన్వర్ రాసిన ఒక వాక్యం "జీవితకాలంలో ఎవరికీ అబ్బని కొన్ని అదృష్టాల్లో ఒక అదృష్టం అబ్బి, దాన్ని కోల్పోయిన దురదృష్టవంతుల కథ ఏవని చెప్పడం." 

    ఇది చదవగానే రామాయణంలో అరుణ్ గోవిల్ గుర్తుకొచ్చాడు. 

    హిందీ రామాయణం చూసే రోజుల్లో గుర్తున్న ఒక సీను, ఆ సీనులో మాటలు - రావణుడెత్తుకుపోయిన సీతా దేవిని తలుచుకుంటూ సుగ్రీవుడితో రాముడిలా అంటాడు... "నహి పానే సే దుస్సహ్, పా కర్ ఖోనా" అంటూ.  ఆ మాటలూ, ఆ సమయంలో రాముడిలా నటించిన అరుణ్ గోవిల్ దుఃఖం నాకెందుకో గుర్తుండిపోయాయి. దాని వెనకాల అసలు మాటలు రామచరితమానస్ రాసిన తులసీదాసువి అయ్యుంటాయి. 

    ఇన్నేళ్ళ తర్వాత అన్వర్రాతలో అచ్చు అదే భావం కనిపించింది. 

   ఆయనే రాసిన పాటని తలుచుకుంటూ - నాయుని కృష్ణమూర్తిగారికి నివాళిగా... ఆ పాటలో నాకు నచ్చిన లైన్లు... 

సుమం... ప్రతి సుమం సుమం..
వనం...  ప్రతి వనం వనం

వేణువా ...  వీణియా ...  ఏవిటి నాదము??

రంగులే రంగులు అంబరాలంతట
రంగులే రంగులు అంబరాలంతట!!

భానూదయాన... చంద్రోదయాలు!!


చందమామ నడక 

    చూసీ చూడగానే ఈ పేజీ శీర్షిక నాకు భలే నచ్చేసింది. 

    మొదటి పేరాలో మొట్టమొదటి గుల్జార్రాత "తుమ్ జో కెహదే తో ఆజ్ కీ రాత్ చాంద్ డూబేగా నహీ! రాత్ కో రోక్ లో..." చదివీ చదవగానే "అన్వర్రాతా! మన్ హో గయీ ఫిదా!" అనిపించేసింది. 

    నిజమబ్బా! ఈ పుస్తకమంతా గుల్మొహర్ పూల గుసగుసల్లా మూగుతున్న గుల్జార్మోహగీతోత్సవమే నాకు. 

    ఆకాశంలో ఉన్న ౘందమామని చూసి "నా వెంటే వస్తున్నాడు, నేనంటే ఇష్టమేమో" అని అనుకున్నాట్ట బుల్లి అన్వరు. 

    ఆ బుల్లి అన్వరుకి అనిపించినదే మా ఇంట్లో బద్రి మా బుజ్జిజింకలకి నేర్పించినది కూడా. 

    మునిమాపువేళ కారులో ఎక్కడికైనా వెళ్తున్నపుడు - వెనక సీట్లో కూర్చున్న బుల్లి బుగ్గల బుజ్జిజింకకి - కారుతో పాటే వస్తున్న ౘందమామని చూపించి "ౘందమామ చూడు నాన్నా ... మనతోనే వస్తున్నాడు" అంటే ఆ బుల్లిబుగ్గల మీద చమక్కుమన్న వెన్నెల ఆ పైనున్న దొంగకలువరేకుల్లోకి పాకి తళుక్కుమనేది. తన కన్నా తెల్లనైన పాలనవ్వు చూసి తెల్లబోయి చిన్నబోయేది. 

    అన్వర్ రాసిన ఇంకో మాట: "మా ఆవిడ కడుపులో ఉన్న శిశువుకు చందమామ అని పేరు పెట్టుకున్నాం." 

    అది నా తొలిచూలు రోజుల్నాడు మాకు అమ్మాయి పుడితే "వెన్నెల" అని పేరు పెడదామన్న బద్రి మాటలని గుర్తుకు తెచ్చింది. 

    ఈ "చందమామ నడక" చందమామతో నడిచిన నడకలతో మొదలుపెట్టి, వడ్డాది పాపయ్య వయ్యారి బొమ్మల చందమామ చదువుల దాకా సాగి - చేత తస్బిన్ (జపమాల) తిప్పుతూ, నోట "లా ఇలాహి ఇల్లాలాహ్" పలుకుతూ - బుల్లి అన్వర్ చేత పాలక మీద "ఓనామః, శీవాయః, సిద్ధంనమః" అని దిద్దించి అన్వరుని ఇంత గొప్ప రాతరి-గీతరిని చేసిన బంగారు జేజమ్మ బీబీ జాన్‌కి జేజేలు! 

నాయనమ్మా! నాయనమ్మా! 
మాయని ప్రేమే నీదమ్మా !
మాయని ప్రేమే నీదమ్మా!


శ్రమయేవ... & జ్ఞాపక రమణీయం 

        కొంటెబొమ్మల బాపు, బుడుగురాతల ముళ్ళపూడి - వీళ్లిద్దరి గురించి ప్రేమగా తలుచుకుంటూ అన్వర్ రాసిన ఈ రెండు పేజీలని విడదీయ బుద్ధవ్వక - ఈ రెంటినీ ఇక్కడ కలిపి తలుచుకుంటున్నాను. 

    నా వరకు నాకు తెలుగులో కార్టూన్ అంటే బాపు, కథలూ-కబుర్లూ అంటే ముళ్ళపూడి. కిలకిల నవ్వించే గీత ఒకరిదైతే, అలవోకగా సాగే రాత ఒకరిది.

    వారిద్దరితో పరిచయమున్న అన్వర్ రాసుకున్న ఆత్మీయజ్ఞాపకాలు అపురూపం. 

******************************
******************************

    పేజీపేజీలో నాకు నచ్చిన దాన్ని తరచి తరచి చదువుకుంటూ - తలచి తలచి మురుసుకుంటూ - మళ్లీమళ్లీ చదువుకుంటున్న పుస్తకం "అనగనగా ఒక చిత్రకారుడు". 

    ఇందులో నేను కావాలని - వద్దనుకుని - చదవని పేజీలు కొన్నున్నాయి. 

సత్యవతి కథలు 

    ఇది చదవలేదు. అసలు కథలు చదివిన తర్వాత మళ్ళీ వెనక్కొచ్చి చదువుదామని. 

గ్రీన్ బుక్ 

    "గ్రీన్ బుక్" సినిమా గురించి ఎక్కడో ఓ రెండు లైన్లు ఎప్పుడో చదివాను. నాకు ఇలాంటి సినిమాలంటే భయం, బాధ. కాలక్షేపంగా చూడాలంటే తప్పు చేస్తున్న ఫీలింగ్. అందుకే ఇది చదవలేదు. నాకు నా బబుల్లో నేనుండి చుట్టూ అంతా మహబాగా కాకపోయినా ఎంతోకొంత బానే వుంది అనుకుంటూ ఉండిపోవడం బావుంటుందబ్బా! అంతకు మించి ఏమీ చేయలేనప్పుడు - నా ఇగ్నోరెన్సు, నాకు బ్లిస్సు! 

నల్లమేక పూనాచ్చి 

ఇదీ చదవలేదు. నిరుడు గౌరి గారితో మాట్లాడేటప్పుడు  చెప్పాను - తప్పకుండా చదువుతానని. ఇప్పటిదాకా పుస్తకం కొనడమే పడలేదు. త్వరలోనే కొనుక్కోవాలి. చదవాలి. అప్పుడు వెనక్కి వచ్చి ఈ నల్లమేక పూనాచ్చి సంగతేంటో సూద్దారి! 


******************************
******************************

    ఇక్కడితో నా పేజీమజిలీకబుర్లు ఆపుతూ - అన్వర్ రాసిన - కొన్ని మెచ్చుతునకలు, ఇంకొన్ని మేలుమాటలు ఇక్కడ తలుచుకుంటున్నా... 

    "క్షీరసముద్ర రాజ తనయ కంటే ముందుగా పద్మపత్ర విశాలాక్షి, పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయాం దేవి పుట్టిందని, ఈ సృష్టి నశించినా మళ్ళీ సృష్టి మొదలైతే కరెన్సీ అచ్చు కాక కాల్జేతుల అచ్చులు బొమ్మలుగా జగత్తుని నాగరికత వైపు నడిపిస్తాయని అర్థం చేసుకోండి. " (మహాకళ )

    "వీలయినంత ఖాళీగా  ఎంత బావుంటుంది. ఇల్లు కాని, ఒళ్ళు కాని, మనసు కానీ... నేను ప్రతిసారీ కొత్తగా ఉంటే ఎంత బావుంటుంది? తెలిసిన ప్రతి ఒక్కరినీ తెలీనట్టు కొత్తగా చూస్తుంటే ఎంత బావుంటుంది?" (జీవితానందం)

    "ఈ హైద్రాబాద్లో నాకు పెద్ద పెద్ద విషయాలు రాసే, చర్చించే, తమ తమ కాన్వాస్‌పై రంగులు వంపే మహా గజ ఈతగాళ్ళు పరిచయం అయ్యారు. వీరికి అన్నీ తెలుసు ఒక్క మర్యాద తప్ప. తలిదండ్రులే తొక్కలోనివాళ్ళు అయినపుడు నువ్వూ నేనూ, మన పసుపు అలికిన గడప, ఆ గడప ముందు తులసి చెట్టు ఎంత?" (మర్యాద మన్నన)

    "రవ్వంత ప్రేమ, గోరంత అభిమానానికే ఉబ్బితబ్బిబ్బులవాడి పరంపర వాడిని నేను." (పుట్టిన రోజు జేజేలు)

  
    "నువ్వు ఒకరిని పెట్టే నొప్పి అది తిరిగి నీ పాలిటి భయానక బాధకు ఆరంభం." (గాలితరం)

  "స్నేహం అంటే ఏవిటో తెలుసా? ఈ నా ప్రతీదిలో నువ్వు తోడు ఉంటావని కాదు, నా కష్టాలు మోస్తావనీ కాదు. నాకు సంబంధించిన ప్రతీదిలో నువ్వు గుర్తుకు రావడమే స్నేహం. " (కృష్ణస్మృతి)

******************************
******************************

ఈ "అనగనగా ఒక చిత్రకారుడు"  చదువుతూ బద్రి అన్న ఒక మాట ఇక్కడ చెప్పాల్సిందే... "ఈ అన్వర్ రాసినది చదువుతూ ఉంటే ఎలా ఉందంటే - కాలేజ్‌లో చదివే రోజుల్లో మొట్టమొదటిసారిగా యండమూరి నవలలు - 'ఆనందోబ్రహ్మ', 'ముత్యమంత  ముద్దు' - చదివినప్పుడు అనిపించింది చూడు - especially - 'ముత్యమంత ముద్దు' -  చాలా self -introspective గా ఉంటుంది. మళ్ళీ ఇన్నేళ్ళకు అచ్చు అలాగే అనిపించింది ఈ 'అనగనగా ఒక చిత్రకారుడు' చదువుతుంటే! "

మళ్ళీ బద్రినే వెతుక్కుని మరీ flickr లో అన్వర్ బొమ్మలని చూసి "ఇతను భలే గొప్ప ఆర్టిస్టు" అంటూ అన్వర్గీతలని పదేపదే చూసి మురిసిపోయారు. (www.flickr.com/photos/anwartheartist ). 




 
    నా వరకు నాకు "అనగనగా ఒక చిత్రకారుడు" చదువుతున్నంతసేపు  - నాకు గుర్తొచ్చిన ఒక మహానుభావుడు  - "నేను కాశీ విశ్వనాథుడిని, విశాలాక్షిని  వదలనని, వారు లేని చోట నా షెహనాయ్ పలకద" ని కాశీ లోనే ఉండిపోయిన బిస్మిల్లాఖాన్. 

అందుకే అంటున్నా... 

కుంచెతో  గీసిన అన్వర్గీత చెప్పింది 
అన్వర్ ఒక ఆర్టిస్టు అని 
గుండెతో  రాసిన అన్వర్రాత తెలిపింది 
అన్వర్ ఒక హార్టిస్టు అని 

అన్వర్రాతలో విన్నా 
గుల్మొహర్ పూల గుసగుసంగీతం  
అన్వర్రాతలో విన్నా 
 గుల్జార్మోహగీతం 
అన్వర్రాతలో విన్నా 
కులమతరహిత స్నేహగీతం 
అన్వర్రాతలో విన్నా 
బిస్మిల్లాఖాన్ షెహనాయ్ సంగీతం 


******************************
******************************




6, మార్చి 2021, శనివారం

అనగనగా ఒక అన్వరుడు... అను ఒక హార్టిస్టు కథ - 1

    చిమ్మ చీకటి... చుక్క మిణుకు. 

    కిటికీకి అవతల - అప్పుడప్పుడూ దూది మబ్బు దుప్పటి కప్పుకుంటూ, అప్పుడే పక్కకి తప్పుకుంటూ - తప్పించుకున్న మబ్బులు పూర్తిగా కప్పేయకుండా ఎంత సేపుంటాడో తెలీకుండా - దోబూచులాడుతున్న వెండి జాబిలి. 

    పక్కనే దేశీ-రేడియోలో వినీ వినిపించకుండా - "ఓ బచ్‌పన్ కే దిన్! రులా న దేనా" అని అంటూ లతామంగేష్కరూ, "ఆజ్ హసే, కల్ రులా న దేనా " అని షంషాద్ బేగమూ పాడుకుంటున్న పాట వింటూ బెంగ పడిపోతున్నాను అప్పుడే - ప్రతి రోజూ లాగే!

    పగటి వెలుగులో హడావిడి పడిపోతూ తెగ ఆరాట పడే నా మైండ్ మెల్లగా అలముకునే చీకటితో చల్లబడుతుంది. 

    చిక్కబడుతున్న చీకటి పూట చెప్పుకునే కబుర్లు నాకు బోల్డంత ఇష్టం. 

    నిశ్శబ్దపు రాత్రిని చెదరగొట్టకూడదన్నట్టు తమకు తామే తగ్గి నెమ్మదిగా మోగే గొంతుల మాటలు నాకు మరీ ఇష్టం. 

    పసుప్పచ్చ దీపపు వెలుగులో సోఫాలో ఓ మూలకి ఒదిగి - ముడుచుకుని - నేను దాన్ని కప్పుకుని మూటనయ్యానో, అది నన్ను చుట్టి మూట కట్టిందో - చెప్పలేనంతగా నేనూ, నన్ను చుట్టుముట్టిన బొంతా కలిసి, చలితో దెబ్బలాడేసి, చెల్లాచెదురయ్యేలా తరిమికొట్టేసి - పుస్తకం పట్టుకున్న చెయ్యి ఒక్కటి మాత్రం బయటపెట్టి, కదలకుండా - చదువుకునే పుస్తకంతో - చెప్పే కబుర్లు నాకు మరీ మరీ ఇష్టం. 

    నాగ్గుర్తుండి ఈ మధ్యకాలంలో - చిన్నప్పటి జ్ఞాపకాలతో ఇష్టంగా కొనుక్కున్న Anne of Green Gables సిరీస్, Little House on the Prairie సిరీస్ తప్ప - ఒక్క పుస్తకం కూడా పట్టుమని పది పేజీలు కుదురుగా చదివింది గుర్తులేదు. 

    కానీ ఈ వారం మొదట్లో సోమవారం రోజు ఇండియా నుంచి అమ్మ పంపించిన ఉసిరావకాయతో పాటు వచ్చిన ఒక పసుప్పచ్చటి పుస్తకం - వచ్చినప్పటినుంచీ ఊరిస్తూనే ఉంది. దానికి తోడు - ఆ పుస్తకం చుట్టూ చుట్టిన కవరూ, దాని మీద ఊరి మట్టిలో మొలిచి, చిగురించిన పచ్చనాకు లాంటి ఆకుపచ్చ అచ్చరాలలో రాసి ఉన్న నాన్న పేరు, ఇంటి అడ్రెస్స్ చూస్తూ "భలే! ఎంత అందంగా ప్రింటు చేశారో అడ్రెస్ కూడా" అని మురిపోతున్న నాతో "అదీ... అతను చేత్తో రాసినట్టున్నాడు" అని అంటూనే ఎంతో అపురూపంగా ఆ పుస్తకాన్ని అందుకుని - అప్పుడే చదవడం మొదలెట్టేశారు బద్రీ. 

    అటు వెళ్లి ఓ రెండు పేజీలు చదవడం... వంటింట్లో ఏదో పాడుకుంటూ నా పనేదో చేసుకుంటున్న నన్ను కదిలించి  "బుజ్జాయ్! ప్రతీ పేజ్ ఒక gem!" అనడం. 

    మళ్ళీ ఇంకో గంటకో, గంటన్నరకో ఇంకో రెండో, మూడో పేజీలు చదవడం... బుద్ధిగా ఏ ఆఫీసు డాక్యుమెంటో చెక్కుతున్న నా చెవి దగ్గరకొచ్చి జేసుదాస్ కేసెట్లు పట్టుకుపోయిన టేస్టున్న దొంగ గురించి చెప్పడం. 

    మరసటి రోజు - మళ్ళీ వచ్చి - "పులక్ బిశ్వాస్ గీసిన చెట్టు, చెట్టుకి తేడా ఉంటుందట" - అనీ మెరిసే కళ్ళతో చెప్తూ - మరునిముషంలోనే "నీకు తెలుసా? మహానంది అడవుల్లో చెట్లకి ఉండే ఆకుల పచ్చరంగూ, పాపికొండల్లో చెట్ల ఆకుల రంగూ వేరు వేరుగా ఉంటాయీ" అంటూ - చేతిలో పట్టుకున్న పసుపుపచ్చ పుస్తకాన్ని పదేపదే మునివేళ్ళతో ముట్టుకుంటూ, మురుసుకుంటూ ఉన్న బద్రిని చూసి - చెప్పొద్దూ - కొంచెం కన్నా ఎక్కువగానే కుళ్ళుకున్నా. 

    మధ్యమధ్యలో నేనూ వెళ్ళి పుస్తకం పట్టుకుని పేజీలు తిప్పబోయాను. కానీ అలా చదవడానికి మనసొప్పలేదు. తిప్పబోయిన పేజీలని కుదురుగా బజ్జోపెట్టి మళ్ళీ నా పని లోకో, పాట లోకో వెళ్లిపోయేదాన్ని. అలా వెళ్ళిన ప్రతీసారీ నా రెండు చేతులనీ నా కళ్ళకెదురుగుండా పెట్టుకుని చూసుకునేదాన్ని - ఆ వేళ్ళ చివరల ఏమైనా చిత్రకారుడి రాతల రంగురంగులు ఏమన్నా అంటుకున్నాయేమో అని. 

    సోమవారం నుంచి గురువారం దాకా ఇదే తంతు. 

    ఇహ ఇలాక్కాదని గురువారం రాత్రి భోజనాలు అయ్యాక అయ్యగారు-అబ్బాయిలు ఎవరి గదుల్లో వాళ్ళు కుదురుకున్నాక - మర్నాడు శుక్రవారం ఆఫీస్ ఉందన్న స్పృహ ఎంతున్నా కూడా - ఆ స్పృహని "ఎహె! అవతలికెళ్ళు" అని కసిరేసుకుని - 

మళ్ళీ నేను, 
నా వాలుపు సోఫా పొంత, 
నే మీద వేసుకున్న బొంత, 
నా చేత రేఖాయాత్ర ప్రచురణ 
దాని గుండా మొదలయిన నా పఠనా యాత్ర.  

    ఎన్నో ఏళ్ళ తర్వాత - చదవడం మొదలెట్టి - - అక్కడక్కడా ఉన్న పుస్తకాల కబుర్లు, సినిమాల కబుర్లు తప్పించి - మిగిలిన పుస్తకమంతా - మా అమ్మ అన్నట్టు "శ్రీరామ" నుండి "చిత్తగించవలెను" దాకా - ఆపకుండా రెండున్నర గంటలు చదివిన మొట్టమొదటి పుస్తకం "అనగనగా ఒక చిత్రకారుడు". 

    అలా ఎందుకు చేశానూ అంటే... నిజానికి నేను ఆ పుస్తకం చదవలేదు. 

    ఆ పుస్తకంలో పేజీ పేజీ నాతో కబుర్లాడింది. 

    రాత్రి పూట - పక్కన పడుకున్న బుల్లి బుజ్జాయి లేవకూడదనుకుంటూ - అలా అని మాట్లాడుకోకుండా ఉండలేక గొంతు తగ్గించుకుని మెత్తగా మాట్లాడుకుంటామే - అచ్చు అలానే మాట్లాడింది ఈ పుస్తకం కూడా. 

    అంత మాట్లాడుకున్న తర్వాత - ఆ పసుప్పచ్చ రంగు పుస్తకంతో అంత దోస్తీ కుదిరాక - "భలే వుంది, అదేదో చదివినట్లుంది" - అని ఓ రెండు పొడి మాటలనేసి ఆనక అలమార అరల్లో అలంకరించేసుకుని - "అన్వరూ! ఆల్ డన్!" - అనేయాలనిపించలేదు. 

    అందుకే నాతో మాట్లాడిన పుస్తకం కబుర్లని "అనగనగా ఒక అన్వరుడు ఏమన్నాడంటే ..." అని మొదలెట్టి మీకు కథలు కథలుగా చెబ్దామనీ... 

    
    తల ఓ పక్కకి కొద్దిగా ఒంచి - కుడి అరచేతిలో కుడి చెంపని ఆన్చుకుని నే చెప్పబోయే కబుర్ల కథలు వింటారనీ... 

    మొదలెట్టేస్తున్నా.... మొదలెట్టేస్తున్నా.... 

    అన్నట్టూ... ముందే చెప్పేస్తున్నా - నాకు నచ్చిన - ఎన్ఠీఆరు, వాణిశ్రీ, కృష్ణ, ఎస్పీబీ, రఫీ, కిషోర్కుమారు, లతామంగేష్కరు, ముళ్ళపూడి బుడుగు  - లాంటి ఎన్నో నిత్య ప్రియవచనాల్లో అన్వరుడు ఇంకో ప్రియవచనం - అంతే!  గార్లూ, బూర్లూ కావాలంటే వండుకుని తిందాం గానీ పేర్ల చివర అతికించలేదని నన్నాట్టే సాధించకండి. 

    రెడీ... వన్ ... టూ... త్రీ.... గో!



అపురూపం 

    ఎవరికైనా "డూ యువర్ బెస్ట్" అని అతి మామూలుగా చెప్పేస్తాం - కానీ - ఎన్ని పనులు, ఎవరు, ఎంత బెస్టుగా చేస్తున్నామో - అంతా ఒట్టి టేకెన్ ఫర్ గ్రాంటెడేగా! 

    రోజూ మామూలుగా చెప్పే "థేంక్స్" అనే మాటని కృతజ్ఞతని నింపుకుని అంటే, ఆ మాట విన్న మనిషిని ప్రేమ కూడా తాకాలట. ఇది అపురూపానికే అపురూపమనిపించే అపురూపమైన ఆలోచన. చదువుతుండగానే "ఇద్దీ! ఇలాంటి మాటలే అనండర్రా, వినండర్రా!" అని గాఠిగా చెప్పెయ్యాలనిపించింది. 

    అంతా సవ్యంగా సాగిపోతున్నప్పుడు - స్థిరంగా పని చేస్తున్న చేతులు, తడబడకుండా నడుస్తున్న కాళ్ళు, అన్నాన్ని గుటక వేయగలిగిన గొంతు దాకా తీసుకెళ్లగలిగే నాలుక - వీటన్నిటినీ మహా-taken-for-granted ‌గా తీసేసుకుంటాం గానీ - అవి granted-to-us-for-using-consciously అన్నది - నొక్కి వక్కాణించి చెప్తున్నట్టున్న ఈ అపురూపం  చదువుతుంటే నాకు శశికపూర్ గుర్తుకొచ్చాడు. 

    కపూర్ల ఇంటి కడగొట్టు పిల్లడు, రాజ్ కపూర్, షమ్మీ కపూర్ల బుల్లి తమ్ముడు ఎంత చలాకీగా ఉండేవాడో స్క్రీన్ మీద! నవ్వితే మొహమంతా మతాబాల వెలుగే. పాటకి ఆడడం మొదలు పెడితే - ఒంట్లో చేతులూ, కాళ్ళూ దేనికవే వేటికి కావాల్సిన దిక్కులో అవి స్ప్రింగుల్లా ఆడుతూ ఉండేవి. 

    అలాంటి శశికపూర్ చివర్లో చక్రాల కుర్చీలో కూర్చుని చిన్నప్పుడు తను నటించిన సినిమాలు చూసుకుని "అది నేనేనా ? ఈ చక్రాల కుర్చేలో కూర్చున్న ఈ నేను, అక్కడ హుషారుగా గెంతుతున్న ఆ నేను ఒకరేనా?" అని ఎంతో బాధ పడేవాడట. 

    సరిగ్గా అలాంటి పరిస్థితినే అందరికీ గుర్తుచేస్తుంది అపురూపం

    చదివే ప్రతి దాంట్లో కవిత్వపు ఛాయలు వెతుక్కునే నాకు ఇందులో ఇంకో అపురూపమైన బోనస్ - "కిసీ కీ ముస్కురాహటోం పే హో నిసార్" పాట ప్రసక్తి. 

      ఈ అపురూపం చదవడం అయ్యాక - నాకు అలవాటే అయినా - ప్రతిక్షణం అపురూపంగా గడపడం మీద ప్రీతి - ఇంకొంచెం పెరిగింది నాకు.   

కిసీ కీ ముస్కురాహటోం పే హో నిసార్
కిసీ కా దర్ద్ మిల్ సకే తో లే ఉధార్ 
కిసీ కే వాస్తే హో తేరే దిల్ మే ప్యార్ 
జీనా ఇసీ కా నామ్ హై 

    పాడుకుంటూ తర్వాతి పేజీ కబుర్లలోకి... 


ప్రయాణం 

    ఇక్కడ ప్రయాణం ఒక ఊరిలో మొదలు పెట్టి - ఇంకో ఊరిలో మజిలీ చేసి - చివరికి ఏదో గమ్యం చేరి "హ్మ్!" అంటూ నిట్టూర్చే టైపు కాదు. 

    బొమ్మల కోసం ఒక చిత్రకారుడు - అనుక్షణం తన ఆలోచనే తన తోటి యాత్రికుడై - తన లోపలి ఆలోచనలని తరచి చూసుకుంటూ -తనతో తను చేసుకునే యాత్ర. 

    ఆ యాత్రలో తారసపడిన గడ్డి, చెట్టు, ఇళ్ళు, ఇంటి రేకులు, ఆ రేకుల మీదుగా వెలిగిపోయే సూర్యోదయాలు - ఇవే కాదు... ముంబాయి క్రాఫర్డ్ మార్కెట్లో - రహదారులే గృహాలుగా చేసుకుని తిరుగాడే వేలాది జనాలు - వీళ్ళందరూ కూడా ఈ చిత్రకారుడి చేతిలో జీవం పోసుకునే బొమ్మలే. ఆ అన్వరుడి ఆలోచనల్లో జీవించే బొమ్మల కథలే. 

    ఈ ప్రయాణంలో గీతకారుడు అన్వరుతో పాటు రాతకారుడు పూడూరి (?) రాజిరెడ్డి కలిసి చేసిన ప్రయాణపు విశేషం కూడా ఒకటి ఉందండోయ్ - అదే నాకు దక్కిన బోనస్ ఈ ప్రయాణం కబుర్లలో. 

    ప్చ్! ఇందులో పాటలేం లేవు. అయినా ఫర్లేదు...ముందు ముందు ఉండే ఉంటుంది మురిపించే పాటల పండగ!

    తర్వాతి పేజీలోకి వెళ్ళిపోతున్నా - నాకు తోచిన పాట పాడుకుంటూ... 

పక్షుల రెక్కలు ... అద్దెకు దొరికితే - ఒంటికి తొడిగి పైకె గురూ... 
పక్షులకెన్నడూ ... పాస్‌పోర్ట్ లేదు - ఖండాలన్నీ దాటెళ్ళు!

సామాజిక స్మగ్లర్లు 

    పుల్లయ్య అనబడే రామసుబ్బయ్య, శీను, శేఖర్, మధు, నాగరాజు, సురేష్, రమేష్, మోహన్, కుమార్, చింతపండు, సుబ్బలక్మి - 

    వీళ్ళందరూ ఏమట్లు? 

    అన్వరుకి ఏమయేట్లు? 

    వీళ్ళందరూ సామాజిక స్మగ్లర్లు అయ్యిందెట్లు? 

    అది తెలవాలంటే మీరు మాత్రం అనగనగా ఒక చిత్రకారుడు పుస్తకంలో పదో పేజీ నుంచి పన్నెండో పేజీ దాకా చదవాల్సిందేనబ్బా! 

ఆ రెండు, మూడు పేజీల్లోనే 

చూడాలని ఉంది... 
అమ్మా! చూడాలని ఉంది
నిన్ను - చూడాలని ఉంది
పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి
... ... ...  ... ... ...  ... ... ...  ... ... ...  ... ... ... 
ఒకసారి మాత్రం నిన్ను చూస్తే చాలులే అమ్మా 

    అని అమ్మ కోసం ఆశగా వెతుక్కునే పసి-అన్వర్ కూడా పలకరిస్తాడు. 


ప్రేమ ప్రకటన 

    ప్రేమప్రకటన పలు రకాలు... 

    ఆ రకాల రకరకాలు పలురకాలు. 

    ఆ పలురకాల బహుముఖాలు ఎలాంటివంటే... 

    "ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా ..." పాట వినీవినగానే నచ్చేసి -  "1942 ఎ లవ్ స్టోరీ" సినిమా పాటల  క్యాసెట్లు ఒకేసారి మూడు కొనడం ఒక రకం. 

    హెచ్‌ఎంవీ వాడు వేసిన జేసుదాసు పాటలవి - రెండు సెట్ల క్యాసెట్లని కొని - జేసుదాస్ పాటలు కాపీ చేసుకుని ఇస్తానన్న మనిషికి ఒక సెట్టు అరువిచ్చి - అది అరువు కాదు అచ్చంగా అట్టుకుపోవడం అని అర్థమయ్యాక - ఆ పట్టుకెళ్ళిపోయినవాణ్ణి మంచి టేస్టున్న దొంగ అని మెచ్చుకోవడం రెండో రకం. 

    కొడవటిగంటి, చలం, శేషేంద్రశర్మ, పెద్దిభొట్ల - వీళ్లందరి పుస్తకాలు, ఐదు సెట్ల సైగల్ పాటల క్యాసెట్లు కొనుక్కుని - వాటిని రెండు చేతులతో పట్టుకుని  - ఊరిని వాటికి, ఊరికి వాటిని చూపిస్తూ - ఊరింపుగా, ఊరేగింపుగా కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లడం మూడో రకం. 

    (ఈ మూడో రకం గురించి చదివీ చదవగానే నాకు చెప్పిందే చెప్పి "భలే! ఇలాంటి ఇష్టం - అంటే ఇష్టమైన పుస్తకాలు చేతిలో పట్టుకుని నడవాలనిపించేంత పుస్తకమోహం ఉంటుందని ఊహించలేం కదా!" అని బద్రి ఎంత మురిసిపోయారో! అది కూడా ఒక రకమైన ప్రేమ ప్రకటన రకమే మరి!)

    తమిళ కథకులు పిచ్చమూర్తిగారు రాసిన "భగవదర్చన" కథకి పది రకాల గోపురాల స్కెచ్చులు వేయడం నాలుగో రకం. 

    శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి "మార్గదర్శి" కథలోని చేబోలు శంభుశాస్త్రి పేరుని తనకి ఇంకో కొడుకు ఉంటే వాడికి పెట్టాలనుకోవడం ఐదో రకం. 

    (శ్రీపాదవారి కథల్లో నాకు అత్యంత ఇష్టమైన "మార్గదర్శి" కథ గురించిన ప్రస్తావన అన్వర్రాతలో చూడగానే నేనూ మురిసిపోయి - ఒక్కసారి లేచెళ్ళి నా లైబ్రరీలో ఉన్న శ్రీపాద వారి రెండవ కథల సంపుటం తెరిచి "మార్గదర్శి" కథనో సారి దర్శించుకొని వచ్చి కూర్చుని ఇది రాస్తున్నాను. ఇదీ ఓ రకం ప్రేమప్రకటనే!)

    ఆర్టిస్టు చంద్ర గారు చేయి అందించినా - మించిన గౌరవభావంతో - అందించిన చేయిని అందుకోకుండా - రెండు చేతులూ జోడించి దండం పెట్టడం ఆరో రకం. 

    బాపు గారి  నుంచి ఫోన్ వస్తే మాట్లాడేటప్పుడు వేసుకున్న చెప్పులు విప్పేయడం ఏడో రకం. 

    భుక్తి పెట్టే విద్య బొమ్మలేయడం, రంగులేయడం. ఆ సరస్వతి కోసం వందల కొద్దీ పెన్నులు, పెన్సిళ్లు, రంగులు, కుంచెలు కొనడం ఎనిమిదో రకం. 

    ఇంకా బోల్డు రకాలు ఉండే ఉంటాయి - కానీ ఎన్ని రకాలని ఏముంది?!  ప్రేమంటూ ఉంటే -అది ఎన్నో రకాలుగా ప్రకటితమవుతూనే ఉంటుంది. అది - ఇది, అది - అని లేని - ఎన్నెన్నో రకాలు! 

    అందుకే పాడుకుంటూ అంటున్నా ... అన్వర్! తేరా రాత బడా ప్యారా! 

అలా పాడుకుంటూ 17 వ పేజీ లోకి...  


ఐదో దిక్కున అతడు

    ఇందులోని అతడు ప్రముఖ కార్టూనిస్ట్ టి. మోహన్ గారు. 

    రాసిన సందర్భం ఆయన స్వర్గస్థులైన రోజు సెప్టెంబర్ 21, 2017. 

    ఇక్కడ నాకు గుర్తుకొచ్చిన పాట ... 

ఈ అనంత కాల గమనంలో 
ఈ రవ్వంత జీవన పయనంలో 
అందరు నీవారు - చివరకు మిగిలేదెవరూ లేరు 

తర్వాతి పేజీ లోకి కదిలిపోతూ... 


రంగు బలపం 

    చిన్నారి పొన్నారి బాలలను పుస్తకాల వైపుకి ఆకర్షించడానికి, అలరించడానికి బాలల కథల పుస్తకాలకు బొమ్మలూ, రంగులూ వేసిన మెత్తటి రంగుల బలపం లాంటి చిత్రకారుడు పులక్ బిశ్వాస్ కథ ఇది. 

     నాకు ఇది చదివే వరకు ఇండియాలో బొమ్మల పుస్తకాలు ఉంటాయని, వాటిల్లో పిల్లలని మురిపించి, మైమరపించే రంగురంగుల బొమ్మలుంటాయని అస్సలు తెలీదు. నేను కాల్విన్ గాడి దగ్గర్నుంచి లాగేసుకోవాలని చూసే హాబ్స్ పులి కన్నా అందమైన పులుల్ని పులక్ బిశ్వాస్ గారు గీసి రంగులతో నింపారని చదవగానే - వెంటనే గూగుల్లో వెతుక్కుని ఆయన వేసిన బొమ్మలు చూసి - మహా పులకితం మదీయ మానసం!

    
    ఇది చదువుతూ పాడుకున్న పాట (నా మాటల్లో)... 

రంగ్ బిరంగే ఫూల్ ఖిలే హై 
కుఛ్ లోగ్ హీ ఫూలోం జైసే ... 

    ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు తప్పకుండా కొని తెచ్చుకుంటా ఆ రంగుల-బొమ్మల-ప్రపంచాలు. 

తొలి ప్రేమలేఖ 

    వెన్నెల ఎందుకు కాస్తుంది?

    పూలెందుకు పూస్తాయి?

     కృష్ణశాస్త్రి కవిత్వమెందుకు రాస్తారు?

    ముళ్ళపూడి వారి అప్పారావు అప్పులెందుకు చేస్తాడు?

    ఎందుకు? ఎందుకు? ఎందుకు?

    చిత్రకారుడు స్కెచ్చులు అందుకే వేస్తాడు. 

    ఆ స్కెచ్చులు  వేసే స్కెచ్చుబుక్కే చిత్రకారుడి ప్రేమలేఖ. 

    ఆ స్కెచ్చు బుక్కులో ఉండేవి ఏంటంటేకదలని చెట్లు, కదిలే రైళ్ళు, ఆడే పిల్లలు, టీవీ ముందు పడతులు, ఆశాపాతకుల ఏడ్పు మొహాలు, ఊళ్ళో వీధులు, ఊరి బయటి గుట్టలు మిట్టలు, నడిచే గుంపులు, పడుకుని నిలబడి జారిగిలబడి మొబైల్ చూసుకుంటున్నవాళ్ళు, వికారంగా మొహం పెట్టుకుని కవిత్వం పుస్తకం చదివే పాపం వాళ్ళు, ఫేస్‌బుక్‌లో మొహం దూర్చి ఎన్ని లైకులు ఏమేం కామెంట్లు ఎవరెవరు ఇచ్చారు అని ఆత్రంగా చూసేవాళ్ళు; ఇంకా పెద్దపెద్ద పొట్టలవాళ్ళు, వంగిన వీపులవాళ్ళు, నడుములు లేని అమ్మాయిలు, బోలెడు బోల్డ్ మడతలు గల నడుములు గలవాండ్లు, కాటన్ ప్యాంట్ నిలువు ఫోల్డులు, స్కిన్ టైట్ జీన్స్ ప్యాంట్ మోకాలి కింది అడ్డ ఫోల్డ్స్, బూట్‌కు కట్టిన లేస్, స్నీకర్స్ సోల్-రన్నింగ్ షూ సోల్‌ల మధ్య తేడా, ....వీటన్నిటి స్కెచ్చులూ, అవి పోయే హెచ్చులూ. 

    అపుడెప్పుడో ఈమాటలో అనుకుంటా చూశా - అన్వర్గీతలు - ఒక పేజీ నిండా కిక్కిరిసినట్టుగా వేసిన బోల్డన్ని బొమ్మల స్కెచ్చులు. ఆ బొమ్మల మెరుపులకి కళ్ళు చెదిరాయి. ఆ మెరుపు-కళలు మళ్ళీ ఈ "తొలి ప్రేమలేఖ" చదువుతుంటే గుర్తొచ్చాయి.  

    ఇది చదువుతూ హమ్  చేసుకున్న పాట - బొమ్మలమ్మి సువర్ణసుందరి పాడుకున్న - బొమ్మాలమ్మా ... బొమ్మలూ... 

*********
*********

    ఒకటా, రెండా - ఏభై నాలుగు కబుర్ల కథలు. ఇప్పటికివి చాలు. వారానికి ఇన్నీ అని - రెండు వారాలకోసారి - పేజీ-మజిలీ-కబుర్లలా చెప్పుకుందామేం?!

     అడగడం మర్చిపోయాను - హార్టిస్టుగారూ! 

    సాధారణంగా రాతొచ్చినవారికి గీత రాదు. గీతొచ్చిన వారికి రాత కుదరదు. 

    గీత-రాత సవ్యంగా-దివ్యంగా తెలిసిన సవ్యసాచి మీరు. 

    మీ పుస్తకంలో రాతలకి పైనో, కిందో కొన్ని గీతలు (స్కెచ్చులు) గీసుంటే ఇంకెంత బావుండేదోనండి! 

    ఈసారి పుస్తకం వేసే ముందు ఈ మాట గుర్తుంచుకోండేం!


2, మార్చి 2021, మంగళవారం

రాలుగాయి రాత

    ఈ రోజుకి ఏ రోజూ నేను రాయని రోజు లేదు. 

    రాయడానికి సమయమూ, సందర్భమే అక్కరలేదు. 

    రాయదగ్గది ఉందా లేదా అని లేదు. 

    రాయడానికి ఏముందిలెద్దూ అనుకున్నదే లేదు. 

    నీలమో, నలుపో, ఎఱ్ఱదో, పచ్చదో, ఊదారంగుదో - రంగేదైనా పెన్నొకటి దొరికితే చాలు రాస్తాను.  

    అల్లిబిల్లిగా రాసే నా రాతకి కుదురు కావాలనిపించినప్పుడు ముక్కు విరిగి మూలనున్న పెన్సిలు నొకదాన్ని దొరకబుచ్చుకుని చెక్కిచెక్కి రాస్తాను. 

    కుదిరినప్పుడు చేతిరాత ఆపి టైపు-రాత రాస్తాను. 

    అది నాకే తట్టిన నా మాట కావొచ్చు, ఎప్పటిదో నచ్చిన పాట కావొచ్చు, అదాటుగా గుర్తొచ్చిన గాలిబ్ గీతమవొచ్చు - రాతకి వీలుగా తెరిచి పెట్టుకున్న తెల్లకాయితాల పుస్తకంలో రాసుకుంటాను నేను. 

    నా రాత నాకు నేనే రాసుకుంటూ నాకు నేనే చదువుకునే ఉత్తరం. 

    నా రాత నాకు మాత్రమే వినబడే ఊసు. 

    అనుకున్నదేదో మాటల్లో పేర్చలేని ఊసుపోని వేళ రాత నాకు ఊత. 

    ఎన్ని ఉన్నా ఇంకేదో కావాలనిపించే ఆరాటపు వేళ రాత నాకు ఊరట. 

    రాయడమంటే ఎంత ఇష్టమంటే అసలలాంటి ఇష్టమొకటి ఉంటుందనే ఎరుకే లేని చిన్నతనాన కేవలం మళ్ళీ మళ్ళీ బోల్డంత సేపు రాసుకోవచ్చు అన్న ఒకే ఒక్క  - అదేదో పైకి చెప్పుకోలేని బాల్యచాపల్యపు అనాలోచితతో - సగం సంవత్సరం పాఠాలు అయిపోయిన తర్వాత తెలుగు నోట్సు, సైన్స్ నోట్సు  కావాలని పడేసుకుని - దాదాపు వారం రోజుల పాటు అన్ని పాఠాల నోట్సు తిరిగి రాశాను. అప్పుడే - నాలుక కొనని పై పెదవికి ఆనించి - చుట్టుపక్కల ఏం జరుగుతోందో కూడా పట్టించుకోకుండా - దీక్షగా తెగ రాసేస్తున్న నన్ను చూసి మా అమ్మ కూడా ఓ రోజంతా నా నోట్సు రాసేసింది. 

    దానికి ఆవిడ "ఎంత సేపట్నుంచో రాస్తున్నావు బ్రహ్మరాతలా. చేతులు నొప్పి రావట్లేదూ? నేనూ కొంచెం సాయం చేస్తా పట్టు" అంది కానీ అసలు విషయం ఏంటంటే తలొంచుకుని తెగ రాసేస్తున్న నన్ను చూసి ఇదేదో గొప్పపని చేసేస్తోందని అనిపించి ఆ గొప్పపని ఆవిడా చేసేద్దామని inspire అయి నాకు రాత-సాయం చేసేసింది. 

    సరే! నాకు రాయడం ఎంత ఇష్టమైనా రోజూ మాత్రం రాయడానికి ఏముంటుంది కదా? అందుకని నేనేం చేస్తానంటే రకరకాల రంగుల పెన్నులు పక్కన పెట్టుకుని - ఎఱ్ఱ పెన్నుతో క్రిప్టోక్విప్, ఆకుపచ్చ పెన్నుతో వండర్ వర్డ్, నీలం రంగు పెన్నుతో జంబుల్, ఊదారంగు పెన్నుతో క్రాస్-వర్డ్ - ఇలా ఏదో ఒక పెట్టెలోనో, గడిలోనో అక్షరాలు నింపుతూ, ఇంకో అక్షరాల గుంపులో మాటలు కనిపెట్టి వాటి చుట్టూ సున్నాలు చుడుతూ నా రాత-పోతలు పూర్తి చేసుకుంటాను. 




   కాసేపు నా రాయుట గురించి రాయుట ఆపి నా ఫ్రెండ్ అపర్ణ రాసిన రాతల గురించి కూడా రాస్తా. 

    ఒకే ఆత్మ, ఒకే పాట, ఒకే రాత మా ఇద్దరిదీ. పక్కపక్కనే కూర్చుని రాసుకునే నోట్సు కూడా ఇద్దరం ఒకేలా రాసేవాళ్ళం - లైను మొదలు పెట్టడం, పూర్తిచేయడం కూడా ఒకే మాటలతో - పైగా రాసేది running notes అయినా సరే!

  అపర్ణ మంచి కవయిత్రి.  ఇంగ్లీషులో చాలా మంచి classic poetry రాస్తుంది. మొదట్లో తెలుగులో కూడా రాసేది. పదో తరగతిలో ఉన్నప్పుడే తను రాసిన కవితకి రాష్ట్రస్థాయి - శ్రీశ్రీ స్మారక కవితల పోటీలో తనకి మొదటి బహుమతి కూడా వచ్చింది. ఆ కవిత నాకు గుర్తు లేదు కానీ తనే రాసిన ఇంకో కవిత గురించి మాత్రం ఇవాళ రాయాల్సిందే. 

    అప్పుడెప్పుడో - పదో తరగతి చదివేటప్పుడే మా అపర్ణ కవితలు రాసేదని చెప్పాను కదా!

    నేను తనకి ఫ్రెండు అయీ అవగానే "రా ... నీకు నా పొయెట్రీ బుక్ చూపిస్తా"నంటూ నీలం ఇంకులో రాసిన గుండ్రటి అక్షరాలు అందంగా పేర్చిన ఒక రూళ్ళ నోట్ బుక్ నాచేతిలో పెట్టింది. 

    అందులో మొట్టమొదటి కవిత పేరు "తపన"

    అపర్ణ రాసిన ఆ కవిత ఏంటంటే... 

ఏదో వ్రాయాలని తపన 
కానీ వ్రాయలేను 
ఏమి వ్రాయాలో తెలియనందువలన 

ఏదో పాడాలని తపన 
కానీ పాడలేను 
ఏమి పాడాలో తెలియనందువలన 

ఏదో చెప్పాలని తపన 
కానీ చెప్పలేను 
ఏమి చెప్పాలో తెలియనందువలన 

ఏదో చేయాలని తపన 
కానీ చేయలేను 
ఏమి చేయాలో తెలియనందువలన 

ఇన్ని చేయలేని జీవితమెందుకో 
అయినా సాగుతూనే ఉంది 
ఆ తపన ఉన్నందువలన 


    ఈ కవిత చదివీ చదవగానే - నాకెంత నచ్చేసిందంటే - అదెప్పటికీ మర్చిపోలేనంతగా. 

    ఆ చివరి stanza లో ఉన్న "ఇన్ని చేయలేని జీవితమెందుకో  - అయినా సాగుతూనే ఉంది  - ఆ తపన ఉన్నందువలన " అన్న వాక్యాల్లో జీవితం, సాగడం అన్న మాటలకి అసలు అర్థమేమిటో - అప్పట్లో పట్టుమని పదిహేను ఏళ్ళు లేని మాకు - రాసిన తనకీ, చదివిన నాకూ - అస్సలు తెలీకపోయినా - నా వరకు నాకు end of the day ఏమీ చేయలేకపోయినా ఏ మాత్రం guilt లేకుండా "హమ్మయ్య ... ఈ రోజుకి ఇన్ని చాఫ్టర్లు చదువుదామనుకున్నా కదా - ఆ అనుకోవడమే చాలు ఇవాళ్టికి. ఈ ఛాయాగీత్ వినేసి పడుకుందాం" అనుకుని పాటలు వినేయడం నాకు దక్కిన ఓ guilt-free-bliss - అదే ఇప్పటికీ కొనసాగుతోంది. 

    హమ్మయ్య! అస్సలు రాయడానికి అంటూ విషయమేమీ లేకుండా ఏమైనా రాయాలని ఎప్పట్నుంచో అనుకుంటూ అనుకుంటూ ఇప్పటికి ఇంతమాత్రం రాయగలిగా. 

ఈ రోజుకి రాసింది - 
ఇలా రాయాలని అనుకోకపోయినా - 
అసలేమీ రాయాలని అనిపించకపోయినా  - 
విషయమేమీ లేకపోతే రాయలేనా?! అనుకుని 
ఎందుకు రాయలేను? అన్న పంతంతో 
రాయబోయి 
రాత సాగక 
రాయలేక ఆగబోయి 
ఆగిన రాతను సాగదీసి 
అరగదీసి రాగ-దీసి 
రాసీ రాయక రాసిన 
రాలుగాయి రాత...