12, జూన్ 2023, సోమవారం

Hearty కబుర్లు about Pots & Pans...


    నిన్ననే నా మూడో సెమిస్టర్ సంస్కృతం పరీక్ష అయింది. "సంభాషణతః శాస్త్రపర్యంతం" course లోని "ప్రగత-భాషా " level దాటాననిపించా. ఆ కబుర్లు తీరిగ్గా ఇంకెప్పుడైనా. 

కుదురుగా కూర్చుని చదువు చదవడం అంతగా అలవాటు లేకో 
చదువుగా చదివి చాలా రోజులయినందుకో
చదివో - చదవకో 
చదవక చదవక - చదివో
చదివీ - చదవకో
చదవకపోయినా - చదివాననిపించో
మొత్తానికి నాకు చాలా కష్టపడ్డట్టనిపించింది. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇవాళ పొద్దున్న లేస్తూనే ఇంకివాళ బుఱ్ఱుపయోగించే ఏ పనీ చేయాలనిపించలేదు. 

    అందుకే ఆఫీసుకి సెలవు పెట్టేశా. 

    తెల్లటి ఇడ్లీలు మూడు తిని, ఒక బుల్లి గ్లాసులో బ్-రూ కాఫీ తాగేశా.  

    ఓ మూడు పుస్తకాలు కొంచెం కొంచెం చదివా... 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



    ఆ తర్వాత తీరిగ్గా వంట మొదలుపెట్టా. 

    ఉల్లిపాయలేసి పప్పులుసుని ఉత్సాహంతో పొంగి పొర్లేలా చేశా. 

    ఇంతలో బుజ్జిజింకగాడు వాడి laptop పట్టుకుని వంటింట్లోకి వచ్చేశాడు. 

    "హాయ్ నాన్నగాడూ! నేనొకద్దాన్నే వున్నానూ అని కబుర్లు చెబ్దామని వచ్చేశావా?" వుడికించిన చేమదుంపలు వలుస్తూ అడిగా. 

    "Yeah!" అంటూ dining table దగ్గర కూర్చున్నాడు జింకిరణ్. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    నేనేమో వలిచిన చేమదుంపలని అతి జాగ్రత్తగా - ముందు చక్రాలుగా - తర్వాత అరచక్రాలుగా - చివరికి పావుచక్రాలుగా - ముక్కలుముక్కలుగా కంచంలో పేర్చా. 

    "అమ్మా! How does చేమదుంప taste?" బుజ్జిజింక ప్రశ్న. 

    "ఓ ముక్క తిని చూడు - ఉప్పు వుండదు మరి" అన్నా.  

    వాడో ముక్క మాత్రం తిన్నాడు. నచ్చిందన్నాడు. మళ్ళీ వాడి పనిలో వాడున్నాడు. 

    నేనేమో stove మీద నూనెలో చేమదుంపలు దోరదోరగా వేయించడం మొదలుపెట్టా. 

    ఒక వాయ వేయించడం అయిందో లేదో బద్రి భోజనానికి వచ్చేశారు. 

    అప్పటికి వేగిన చేమదుంపలలో వెల్లుల్లి కారం వేసిచ్చాను. వాటికి తోడుగా పప్పులుసుతో పాటు బద్రి భోంచేసి - మళ్ళీ office work చేసుకోవడానికి పైకి వెళ్ళారు. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    నేనేమో బుజ్జిజింకతో ఏవో కబుర్లు చెప్తూ మిగిలిన చేమదుంపలు వేయిస్తూ వున్నాను. 

    వాడు "చేమదుంప is smelling really good!!" అని ముక్కు పీలుస్తూ నా పక్కకొచ్చి నించున్నాడు. 

    నేనెందుకో తల తిప్పి చూస్తే dining table మీద బద్రి పెట్టి వెళ్ళిన ముఘలాయి పాన్ డబ్బా కనిపించింది. 

    "నాన్నగాడూ! ఆ డబ్బా కొంచెం అలమార్లో పెడతావా?" అనడిగా పక్కనే నించున్న బుజ్జిజింకని. 

    వాడు సరేనని ఆ డబ్బా పట్టుకుని "Where does it go?" అన్నాడు. 

    "అదుగో ఆ fridge పక్కనే ఆ చిన్న cupboard లో పెట్టెయ్" అన్నా. 

    వాడు ఆ cupboard తెరిచి "Where, in here?" అనడిగాడు. 

    "ఎక్కడోక్కడ  place చూసుకుని పెట్టెయ్...నువ్వే రాశావుగా నీ college essay లో...'In our house, everything has its own place; it could be anywhere' అని. మర్చిపోయావా?" అంటూ నవ్వా.

    వాడు కూడా డబ్బా లోపల పెట్టేసి ముసిముసిగా నవ్వుకుంటూ వచ్చి నా పక్కన నించుని నేను చేమదుంపలు వేయిస్తుంటే చూస్తూ  నించున్నాడు. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    నేను నా మాటలు continue చేస్తూ "మనింట్లో గిన్నెలకూ, డబ్బాలకూ అస్సలు bore కొట్టదు తెలుసా!. ఎప్పుడూ కూడా ఒక్కచోటే వుంటున్నాము, nobody is taking us out anywhere అని complain చేయనే చెయ్యవు. ఎందుకంటే అవి ఒకసారి వున్నచోటికి మళ్ళీ వెళ్ళవు కదా!" అని నవ్వుతున్నా. 

    వాడు కూడా నవ్వుతూ "Noone else talks to pots and pans as you do, అంమా!" అన్నాడు. 

    (నిజం! బుజ్జిజింక "అమ్మా" అని పిలిస్తే "అంమా!" అన్నట్టుంటుంది.)

    వాడలా అనగానే నేను గొప్పగా feel అయిపోతూ "అవున్నాన్నా! I understand them. I know what thier heart says" అని ఇంకా నాకు మహాభారతంలో నకులుడికి అశ్వహృదయం తెలిసినట్టు నాకు Pots & Pans -హృదయం తెలుసని గొప్పలేవో చెబ్దామని అనుకుంటూ వున్నాను. 

    ఇంతలో నా చెవి పక్కగా చిన్నగా వినిపించింది... మెరుపుకి ముందు వినిపించే చిఱు-ఉరుములా. 
    
    "Yeah...at same intelligence level" 

    తలతిప్పి చూసిన నాక్కనిపినిపించింది జింకకనుల నిండా పాకిన ఓ mischievous smile - వాన చినుకు మీద తళుక్కుమని మెరిసే మెరుపులా. 



30, ఏప్రిల్ 2023, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 16 - బంగరు సంజె పొద్దుల్లో ఓ పాట విన్నా... "పొన్ మాలైప్ పొళుదు"




జిలుగుల ముగ్గులేసే 
మలిసంజ వెలుగులు

కిలకిలమని పాటలాడే 
పులుగు ఎలుగులు

బిరబిరమని నేల చేరే 
కడలి పొర్లింతలు

కలకలమని నింగికెగసే 
పిల్లల కేరింతలు

వీటన్నిటికీ తోడుగా...

"హే...ఓ....మ్మ్...లల్లల్లా" మంటూ 
పాటే ప్రాణమన్నట్టున్న 
ప్రాణమే పాటైనట్టున్న 
"బాల" గంధర్వుడి 
ప్రాణస్వరం 


అలలు అలలుగా నీటిపై తేలుతున్నట్టు
అల్లరల్లరిగా గాలిలో తూలుతున్నట్టు
పువ్వుల పుప్పొడిని అద్దుకున్నట్టు 
నవ్వులో ముంచి తీసినట్టు 
తళుక్కుమన్న తమిళ తేనె పదాలు 
కూనిరాగాలు... 
హాయిగానాలు... 

ఇలాతలంపై 
ఈ పాటని ఇంకెవరు పాడినా 
ఇలా - తళుకు మలాము - రాసినట్టుండదండీ... 
అలాగని నే రాసిస్తానండీ!
ఒట్టండీ! 
ఒప్పుకోవాలండీ!

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



ఇల కోడి కూతతో తెల్లవారి మెలకువలైనది మొదలు 
ఇలకోడి సద్దుతో సద్దుమణిగి కలలూరు వేళల వరకు... 

చెప్పాలంటే - నాకది మామూలే! 

తలచిన తలపుకి నవ్వొస్తే ఆ నవ్వుకి ఇంకో నవ్వు కలుపుకోవడానికో -
ఏదో గుర్తొచ్చి ఎదలో ఎక్కడో ఏదో గుచ్చిన కంటి తడుపుకి తుడుపుగానో -
ఓ పాటని తోడు తెచ్చుకోవడం...
ఆ పాటలో నవ్వు పెంచుకోవడం...
ఆ పాటతో నొవ్వు తుంచుకోవడం...
చెప్పానుగా... నాకిది మామూలే! 

ఏ నాటికీ - పాటకది పరిపాటే!

ఒక్కోసారి - ఒక పాట - పాతనేస్తమల్లే చేరి - వాడుకగా - అందేస్తుంది. 
అంది - అప్పటికి మురిపించి - మళ్ళొస్తానని - మనసు మఱగున - ఒదుగుతుంది. 
ఇంకో మాటు - ఒక పాట - అనుకోని అతిథిలా వచ్చి - వేడుకగా - అలరిస్తుంది. 
అలరించి - ఎప్పటికీ మరవకని - నను వీడనని - మదిని నెయ్యమై - ఒద్దికౌతుంది. 
ఏనాటికైనా ... పాటకిది పరిపాటే!

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    సరిగ్గా నెల క్రితం - పైన నే చెప్పినట్టు - అచ్చు అలానే - అనుకోని అతిథిలా - నాకో పాట దొరికింది. 

    అదెలాగో - అదేం పాటో - ఆ పాట ఊసులే ఈనాటి నా కబుర్లు. 

    ఇళయరాజా పాటలు ఇప్పటివి కాదు కానీ 80 లు - 90 ల నుంచి వెతుక్కుని వినడం - ఆ nostalgia తో ఒకప్పుడు వుండొచ్చిన వూళ్ళన్నిటిలో నడిచొచ్చిన దారుల్లో ఆ పాటల్ని విన్న మొట్టమొదటి క్షణాల్ని గుర్తు చేసుకోవడం నాకిష్టమైన వ్యాపకం. 

    ఓ రోజలాగే ఇళయరాజా పాటల్ని వెతుక్కుంటున్న నేను - యూట్యూబ్లో "SPB | Ilaiyaraja song" అన్న మాటలు చూసి అనుకోకుండా ఓ పాట మీద click చేశాను. 

    ముందు కొన్ని పిట్ట కుహుకుహూలు - వెంటనే ఇళయరాజా గిలిగింతల జంత్ర గతులు - ఆ వెంటనే.... "హే... ఓ.... మ్మ్... లలల్లా... అంటూ సుబ్బయ్య గొంతూ... విన్నాను. 

    అంతే! 

    అప్పట్నుంచీ ఇప్పటి దాకా ఆ పాట ఎన్నిసార్లు  మళ్లీ మళ్లీ విన్నానో లెక్కలేదు. 

    విన్నకొద్దీ చెవులకి చవులూరించే పాట. 

    వినకపోతే "నన్ను వినవా?!" అంటూ వీనుల చేరే పాట. 

    ఇంత ఆరాట పెడుతున్న పాట పుట్టుపూర్వోత్తరాలు ఏంటా అని ఆరా తీస్తే తెలిసింది ఏమిటీ అంటే ఇది వైరముత్తు రాసిన మొట్టమొదటి పాటట. భారతీరాజా తీసిన నిళగళ్  (1980) అనే సినిమా లోది. ఈ పాటలో కనిపించిన S. రాజశేఖర్‌కి ఇది మొదటి సినిమాలాగా అనిపించింది. 

    ఈ పాటలో సముద్రపుటొడ్డు  దగ్గర మొదలుపెట్టి, సరివి తోటలు దాటి, రోడ్డు మీద చెట్ల దాకా పరిగెడుతూ - మధ్యమధ్యలో డాబా ఎక్కి ఆకాశం కేసి కళ్ళు తిప్పి చూస్తూ ఈ ఎస్రాజశేఖరుడు చేసిన అభినయం రొంబ నల్లా ఇరుక్కు! 

    పాడింది ఎస్పీబీ, పాడించింది ఇళయరాజా కాకపొతే ఈ పాట గురించి ఈ నాటి ఈ రాతే లేదు కాబట్టి వాళ్ళ గురించి ముందే చెప్పేశా కదా! 

    పైన చెప్పిన పెద్ద వాళ్లందరికీ పేరుపేరునా దండాలెట్టుకుంటూ ఇహిప్పుడు అసలు పాట గురించి. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ పాట వినగానే - ఇందులో చప్పున అర్థమైన ఒక వాక్యం "వానమ్ ఎనక్కొరు  బోధి మరమ్". ఇంతకు ముందు విన్న కొన్ని తమిళ పాటల వల్ల నాకు "వానమ్***" అంటే ఆకాశం అని తెలుసు. 

    కన్నడ "మర" పరిచయం వుండడం వల్ల "మరమ్" అంటే తరువు అనిన్నీ తెలుసు. 

    "ఎనక్కు", "ఒరు" - అంతమంది తమిళ నన్బర్గళ్ ఉన్న నాకు ఈ మాటలు తెలీవంటే ఎల్లాగూ?!

    మొత్తానికి ""వానమ్  ఎనక్కొరు  బోధి మరమ్" అనగా "ఆకాశం నాకొక బోధి తరువు" అన్న తాత్పర్యం బోధపడింది. 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఆ ఒక్క వాక్యం అర్థం కాగానే నాకమాంతం ఆ పాట మీద అభిమానం అంతై ఇంతై ఎంతెంతో ఐపోయింది. 

    దాంతో పాటలో మాటమాటనీ పలకడమెలాగో నేర్చుకుని - మాటమాటకీ తెలుగు పలుకేదో రాసుకుందామనుకున్నా. 

    ఇదిగో - ఇప్పుడదే చేస్తున్నా!

    ముందుగా పాట చూస్తూ   వినడానికి వీలుగా యూట్యూబ్ లింక్ ఇస్తున్నా:  https://www.youtube.com/watch?v=Ux0LERGc1cc

    ఆ తర్వాత ఆ కింద పాటలో మాటలు - మాటమాటకీ తెలుగు మాటలు కూడా రాసుకున్నా. 

    అన్నట్టు ఇక్కడో మాట చెప్పాలి. 

    ఈ పాటలో పల్లవీ, మొదటి చరణం అర్థమయ్యాయి - నాకు చాలా నచ్చాయి. 

    రెండో చరణంలో మాటలు తమిళంలో వినడానికి చాలా బావున్నాయి కానీ వాటి అర్థం పూర్తిగా తెలియాలంటే "నిళగళ్"సినిమా అయినా చూడాలి లేకపోతే తమిళ పాటలు బాగా వినే స్నేహితులని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఈ కబుర్లు update చేసుకోవాలి. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***





హే... ఓ.... మ్మ్... లలల్లా... 

పొన్ మాలైప్ పొళుదు - బంగరు సంజె పొద్దు
ఇదు ఒరు ... పొన్ మాలైప్ పొళుదు - ఇది ఒక ...బంగరు సంజె పొద్దు
వానమగళ్ - నానగిరాళ్ - నింగికన్నె సిగ్గుపడుతోంది
వేరు ఉడయ్ - పూనగిరాళ్ - వేరే (రంగు) వలువ కట్టుకుంటోంది  

ఇదు ఒరు... పొన్ మాలైప్ పొళుదు
  మ్మ్...  హే... ఆ.... ఓ ... మ్ మ్ మ్మూ ... 

ఆయిరమ్ నిఱంగళ్ - జాలమిడుమ్ 
రాతిరి - వాసలిల్  - కోలమిడుమ్ 
ఆయిరమ్ నిఱంగళ్ - జాలమిడుమ్ - వేల రంగులు మాయ చేస్తాయి 
రాతిరి - వాసలిల్  - కోలమిడుమ్ - రాత్రి వాకిట ముగ్గులేస్తాయి 
వానమ్ ఇరవుక్కుప్  పాలమిడుమ్ - నింగి రాత్రికి వంతెన వేస్తోంది
పాడుమ్ పరవైగళ్ తాళమిడుమ్ - పాడే పక్షులు తాళమేస్తున్నాయి
పూ మరంగళ్ - సామరంగళ్ - వీసాదో?! - పూల తరువులు చామరలు వీచవో?

ఇదు ఒరు ... పొన్ మాలైప్ పొళుదు
వానమగళ్ - నానగిరాళ్
వేరు ఉడయ్ - పూనగిరాళ్

ఇదు ఒరు... పొన్ మాలైప్ పొళుదు

వానమ్ - ఎనక్కొరు బోధి మరమ్ 
నాళుమ్ - ఎనక్కదు - సెయ్‌ది తరుమ్ 
వానమ్ - ఎనక్కొరు బోధి మరమ్ - నింగి నాకొక బోధి తరువు
నాళుమ్ - ఎనక్కదు - సెయ్‌ది తరుమ్ - రేపు నాకది సుద్ది (కబురు) తెస్తుంది
ఒరు నాళ్ ఉలగం నీది పెరుమ్ - ఒక నాటికి లోకం న్యాయం పొందు 
తిరునాళ్ నిగళుమ్ తేది వరుమ్ - మంచి జరిగే రోజు వచ్చు
కేళ్విగళాల్ వేళ్విగళై నాన్ సెయ్‌వెన్ - అడుగుటతో నా విన్నపం నేను చేస్తాను

ఇదు ఒరు ... పొన్ మాలైప్ పొళుదు
వానమగళ్ - నానగిరాళ్
వేరు ఉడయ్ - పూనగిరాళ్

ఇదు ఒరు... పొన్ మాలైప్ పొళుదు

ఆ... హే... ఓ... లలల్లా... 
మ్మ్...  హే... ఆ.... ఓ ... మ్ మ్ మ్మూ ... 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    మళ్ళీ అదే చెప్తున్నా... చెప్పకుండా వుండలేకపోతున్నా... 

ఇలాతలంపై 
ఈ పాటని ఇంకెవరు పాడినా 
ఇలా - తళుకు మలాము - రాసినట్టుండదండీ... 
అలాగని నే రాసిస్తానండీ!
ఒట్టండీ! 
ఒప్పుకోవాలండీ!
ఆయ్! అంతేనండి మరీ!

~ పాటల భైరవి 



16, ఏప్రిల్ 2023, ఆదివారం

ౘందమామ! నీ మీద నిందాయె!

    ఎప్పటికప్పుడు నాకు నచ్చినట్టుగా ఓ రోజు నడిస్తే ఆ రోజుకి నా నక్షత్రాల నడకలేవో సరిగ్గా కుదిరాయని మురిసిపోతూ వుంటాను. 

    అల్లాగే... ఒక్కోసారి చాలా అరుదుగా -  
తలలో ఏవేవో తలపులు నడుస్తూ - 
అన్నది వింటున్న చెవికి, 
విన్నదానికి బదులిస్తూ అంటున్న నోటికి 
పొంతన కుదరనప్పుడు 
నా గతి తప్పిన మతికి 
అప్పటి స్థితికి - పరిస్థితికి 
మతి-గతికి మామైన 
ౘందమామ మీద 
నిందేహేస్తూ వుంటా! 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఫాల్గుణ పౌర్ణమి (2023, మార్చ్ నెల 8వ తేదీ) నాడు ౘందమామ మీద నింద వేసే సందర్భమొకటి కుదిరింది. 

    ఆ కబుర్లు చెప్పబోయే ముందు ౘందమామని పిలిచి పలకరించి - పలకరింపుతో ఆగక - పాటంతా మామతో మాటలు చెప్పుకునే - పాటలు కొన్ని తలుచుకుంటున్నా. 

    తలుచుకుంటున్న పాటలతో ఓ చిన్న ఆట ఆడదామనుకుంటున్నా! 

    ఈ పాటల్ని గుర్తు పట్టి ఏ సిన్మాలో ఎవరు పాడారో చెప్పి పెట్టగలరా? 

    పదారు కళల ఱేడు చందురుడి మీది పాటలు ఓ పదహారు పట్టుకొచ్చా - మొత్తం 16 మార్కులకి ఈనాటి పాటల పరీక్షాపత్రం. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


1. 
ఓ ౘందమామ! 
అందాల భామ... ఎందున్నదో తెల్పుమా!

*** *** *** 

2. 
రావోయి ౘందమామా! 
మా వింత గాథ వినుమా!

*** *** *** 

3. 
మామా! ౘందమామా! 
వినరావా నా కథా! 

*** *** *** 

4. 
ఓ జాబిలీ! 
వెన్నెలా ఆకాశం ...
వున్నదే నీ కోసం! 

*** *** *** 

5. 
ౘల్లని రాజా! ఓ ౘందమామా! 
నీ కథలన్ని తెలిశాయి 
ఓ ౘందమామా! నా ౘందమామా!

*** *** ***

6. 
ఓ నెలరాజా! వెన్నెల రాజా! 
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనోయ్! 
మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయ్!

*** *** *** 

7. 
ఓ చంద్రమా! ఒక నాటి ప్రియతమా! 
ఈ పేద కలువ నీకు గురుతేనా... చెప్పుమా!

*** *** *** 

8. 
ౘందమామ రావే! జాబిల్లి రావే! 
కొండెక్కి రావే! గోగుపూలు తేవె! 
వెండి గిన్నెలో వేడి బువ్వ తేవె! 
పైడి గిన్నెలో పాలబువ్వ తేవె! 
అందాల పాపకు అందించి పోవే! 

*** *** *** 

9. 
నెలరాజా! ఇటు చూడరా! 
ఉలుకేలరా? కులుకేలరా?  వలరాజా! 
తగువేళరా? తగువేలరా? రవితేజా! 

*** *** *** 

10.. 
పండగంటి ఎన్నెలంతా... 
చందరయ్యా! 
దండగై పోయింది... చందరయ్యా! 

*** *** *** 

11.
చక్కనయ్యా ... ౘందమామా! 
ఎక్కడున్నావూ? 
నీవు లేక - దిక్కు లేని చుక్కలయ్యామూ!

*** *** *** 

12. 
మల్లెపందిరి నీడ లోన - జాబిల్లీ! 
మంచమేసి వుంచినాను - జాబిల్లీ!

*** *** *** 

13. 
ఒకసారి ఆగుమా! ఓ ౘందమామా! 
మనసార నా మాట ఆలించి పొమ్మా! 

*** *** *** 

14. 
తెలిసిందిలే! తెలిసిందిలే! 
నెలరాజ! నీ రూపు తెలిసిందిలే! 

*** *** *** 

15.
రా... వెన్నెల దొరా! 
కన్నియను చేరా! 

*** *** *** 

16. 
అందౘందాల సొగసరి వాడు...
విందు భోంచేయ వస్తాడు నేడు...
ౘందమామా! ఒహో ౘందమామా! 

*** *** ***  


1. 

    పై పాటలు పట్టుకున్న వారికి ౘందమామ అందేసినట్టే ...
పాటలు పట్టుకోవడంలో వారి చేయి అందె వేసినట్టే...

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఇవాళ  నే చెప్పబోయే జరిగిన కథ అర్థం కావాలంటే మీక్కొన్ని  కబుర్లు  - మరికొన్ని సమీకరణాలూ చెప్పాలి. 

    

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
    అనగనగా నేను. 
      
    అంతకన్నా అనగనగా ...  

    నాకో సంగాతి అపర్ణ. 

    అపర్ణాపతి కిషోర్. 

    అపర్ణకో సోదరి ఆర్‌తి. 

    (తన పేరు ఆరతి - కానీ మా పలుకుల బడి పలుకుబడిలో "ఆర్‌తి" అయింది - "ఆర్తి" కాదు - "ఆ...ర్...తి"...)

    సంవత్సరాలని ఓ పక్కకి పెట్టి నెలలూ, తారీఖులూ మాత్రమే లెక్కకి తీసుకుంటే... 

    ఆర్‌తి పుట్టినరోజు = నా పెళ్ళిరోజు = మార్చ్ 11.  ఈ ఏడాదికి అది శనివారం నాడు వచ్చింది. 

    తిథులూ, నక్షత్రాలే లెక్కనుకుంటే, ఆర్‌తి పుట్టినరోజు = ఫాల్గుణ పౌర్ణమి = ఈ ఏడాదికి అది వచ్చిన తేదీ = మార్చ్ 8, బుధవారం. 

    అపర్ణ నేను మొట్టమొదటిసారిగా మాట్లాడుకుని నువ్వూ-నేనూ ఎప్పటికీ ఫ్రెండ్స్ అని ఒకరికొకరు చెప్పుకున్న రోజు = ఆగష్టు  8. అదెప్పుడో ఇంకో ఐదు నెల్ల తర్వాత. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    కథాకాలం: బుధవారం, 8 వ తారీఖు, మార్చ్ నెల, 2023 వ సంవత్సరం.  

    అప్పటికి ఒక నెల ముందు నించీ  - వారానికోసారి మాట్లాడుకుంటున్నప్పుడల్లా - అపర్ణ " నీ వెడ్డింగ్ యానివర్సరీ మార్చ్ 11 కదా? ఆర్‌తీ బర్త్‌డే కూడా అప్పుడే!" అంటూ వుంది.
 
    ఆ వెంటనే నేనేమో "భలే కదా! అంటే ఈ వీకెండ్ నీకు ఫోన్ చేసినప్పుడు ఆర్‌తీ నీతోనే వుంటుందన్నమాట.   తప్పకుండా తనకి విషెస్ చెప్పాలి నేను" బదులంటూ వుంటున్నాను. 

    ఏదో ఓ పూట - మేమేం మాట్లాడుకున్నా - ఎక్కడో ఒక చోట - ఒకరితో ఒకరం - ఈ రెండు అనడాలు-వినడాలు వుంటూ వుండేవి. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఆ అనడాలు అంటుండగా - వినడాలు వింటుండగా రోజులు, వారాలు నడుస్తూ వుండగా...

    ఓ రోజు సరిగ్గా పొద్దున్న పదిన్నరకి... 

    అప్పుడే ఒక ఆఫీసు కాల్ ముగిసి ఇంకోటి మొదలవడానికి ఇంకో అరగంట వుంది. 

    సరే! ఒక్కాఫీ తాగుదామని పాలుపంచదారసహితబ్రూపానపాకం చేస్తూ వున్నాను. 

    ఆ పానపాకంతో పాటు పరధ్యానం కూడా నడుస్తూ వుంది ముందు జరగబోయే కాన్ఫరెన్స్ కాల్ గురించి. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇంతలో సెల్ఫ్-ఫోను సెల్ఫోను మోగలేక వూగింది - దాన్నోరు నొక్కి మ్యూట్‌లో వుంచినందువల్ల. 

    మూగగా ఊగుతున్న ఫోన్ తెర మీద "అపర్ణే" అన్న పేరు కనిపించింది. 

    "ఇదేంటబ్బా! ఇవాళ వీకెండు కాదే... ఈ టైంలో చేస్తోంది!?" అనుకుంటూనే ఫోన్ తీసి "హలో" అనగానే అవతలి నుంచి చాలా ఉత్సాహంగా అపర్ణ గొంతు వినిపించింది. 

    "హాప్పీ ఏనివర్సరీ, లలితా" అంటూ...

    అది వింటూనే ...తలలో ఒక చిన్న బల్బు వెలిగి ఆరిపోయింది. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    "ఏం ఏనివర్సరీ అబ్బా ఈ రోజూ?" అనుకుంటూ కంటికెదురుగా వున్న ఆఫీసు లాప్‌టాప్‌లో తేదీ చూసిన నాకు 03.08.2023 అని కనిపించింది. 

    ఆరిన బల్బు ఒక్కసారిగా ధగధగలాడింది. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    "ఓహ్! ఇవాళ ఎయిత్ కదా! అద్దీ సంగతీ..." అని ఆలోచనల్లోనే సాగతీసుకుంటూ నేను కూడా అంతే ఉత్సాహంగా "థాంక్స్ అపర్ణా! నీక్కూడా హాప్పీ ఏనివర్సరీ!" అనేశా. 

    వెంటనే ఫోన్ తీగకి అవతల్నుంచి "హాఁ ! నాక్కూడా హాప్పీ ఏనివర్సరీ చెప్తున్నావా? భలే! సరే ... సరే...  నాక్కూడా హాపీనే" అని అరసున్నా-సహిత హాఁ-కారంతో amusing గా నవ్వేసింది అపర్ణ.

    నవ్వి అంతటితో ఆగిందా ...?!

    "ఇదిగో ఆర్‌తి కూడా వుంది ఇక్కడే... బర్త్‌డే విషెస్ చెప్పు " అంది.

    వెంటనే నా బుద్ధి నాలుక్కరుచుకుంది.   

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    "అర్రే ! ఆర్‌తీ పుట్టినరోజు ఈ వీకెండు అనుకున్నానేంటి ఇవాళైతే ?!" అనుకుంటూ "హాపీ బర్త్‌డే, ఆరతీ!" అన్నా.

    నేనలా అంటుండగానే ఆర్‌తి కూడా "హాపీ ఏనివర్సరీ, లలితా" అంటోంది. 

    ఇంతలో తన పక్కనుంచి అపర్ణ "ఇదిగో కిషోర్ కూడా నీకు విషెస్ చెప్తున్నారు" అంది.

    "హాపీ ఏనివెర్సరీ, లలితా! టు బద్రి ఆల్సో" అని కిషోర్ గొంతు వినిపించింది. 

    మళ్ళీ నా తలలో బల్బు మినుకుమినుకుమనడం మొదలయింది. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    "ఇదేంటి మా ఫ్రెండ్‌షిప్ ఏనివర్సరీకి బద్రికి ఎందుకు విషెస్ చెప్తున్నారు కిషోర్?" అని ఒక్కసారి అయోమయంగా ఆరిపోయి "ఓహ్...అంటే అపర్ణ, నేను ఏం సెలబ్రేట్ చేసుకున్నా కిషోరూ, బద్రీలకి కూడా అందులో పాలు వుంటుంది కదూ..." అని మళ్ళీ చమక్కుమని వెలిగింది నా తల్లో బల్బు. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    నేను మాటలు కొనసాగిస్తూ అడిగా "ఏంటీ! అంతా హడావిడిగా వుంది...ఏం చేస్తున్నారు మీరంతా?" అని.

    దానికి బదులుగా అపర్ణ "ఇవాళ హోలీ కదా! ఆర్‌తీది స్టార్ బర్త్‌డే - అందుకే ౘందమామని చూస్తూ దోసె తింటూ కబుర్లు చెప్పుకుంటున్నాము" అంది. 

    ఇంతలో ఆరతీ అందుకుని "నువ్వేం చేస్తున్నావు లలితా నీ వెడ్డింగ్ ఏనివర్సరీకి?" అంది.

    "నాది మార్చ్ లెవెంత్ కదా ఆర్‌తీ! ఆ రోజు ఏం చెయ్యాలో ఇంకా ఆలోచించుకోలేదు" అన్నా.

    "అదేంటి? నీ ఏనివర్సరీ ఇవాళ కాదా? మరి అక్క నీకు విషెస్ చెప్తోందేంటి?" అనాశ్చర్యపోయేసింది ఆరతీ. 

    "ఇవాళ ఎయిత్ కదా - మేము ఫ్రెండ్స్ అయిన రోజు కదా...." అంటుండగా నాకు తట్టింది ఇది మార్చ్ ఎయిత్ కానీ ఆగస్టు ఎయిత్ కాదని. 

    ఓ...అందుకా "నీక్కూడా హాపీ ఏనివర్సరీ" అనగానే ఒక్ఖ నిముషం అపర్ణ అంతగా అక్కజపడిందీ అని అప్పుడర్థమయ్యింది నాకు. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    అలా ఆర్‌తీ, నేనూ మా మా ఆలోచనల్లో వుంటుండగా అపర్ణ ఆర్‌తి చేతి లోంచి ఫోన్ తీసుకుని "అసలేమైందో తెలుసా లలితా! మనం ఎప్పట్నుంచో ఆర్‌తీ బర్త్‌డే, నీ వెడ్డింగ్ ఏనివర్సరీ ఒకే రోజు అని తలుచుకుంటూ వున్నాం కదా! ఇవాళ హోలీ రోజు ఆర్‌తీ స్టార్ బర్త్‌డే. దాంతో కన్ఫ్యూజ్  అయి నీ వెడ్డింగ్ ఏనివర్సరీ అనుకుని నీకు ఫోన్ చేశాను. అందుకే కిషోర్ కూడా నీకూ, బద్రీకి విషెస్ చెప్పారు" అంది.

    నాకిక పకపకలాగలేదు. 

    "ఓహ్హొహ్హొహ్హో! అపర్ణా... నువ్వు నాకెందుకు ఇవాళ ఏనివర్సరీ విషెస్ చెప్తున్నావా అనుకుంటూ డేట్ చూస్తే 03.08.2023 అని కనిపించింది. ఎనిమిది అన్న ఒక్క అంకె మాత్రం తలలోకెక్కింది. వెంటనే మన ఫ్రెండ్స్-డే అని నీక్కూడా హపీ ఏనివర్సరీ చెప్పాను. నువ్వేమో నీకు నేనెందుకు చెప్తున్నానా అని తికమకపడి, మంచితనంతో మొహమాటపడి 'నాకూ చెప్తున్నావా...సర్సరే' అనేశావు" అని ఇంకా పకపకలాడా...

    నాతో పాటే పకపకలాడుతూ అపర్ణ... "ఇవన్నీ ఆర్‌తీ స్టార్-బర్త్‌డే వల్ల వచ్చిన తిప్పలూ" అని ఇంకా ఏదో చెప్పబోయింది. 

    నేను తనని ఆపి సరి చేశా " కాదు... కాదు...  ఇవాళ పున్నమి కదా... అమాసకీ పున్నానికీ ఇలా అవుతుందని వినడమే కానీ నిజంగా ఇప్పుడు జరగడం చూస్తున్నా" అంటూ. 

    అలా అంటున్నానో లేదో... అవతల నుంచి ఆర్‌తీ నవ్వులు, దాంతో పాటే "లలితా! ఇక్కడ ఆర్‌తీ ుర్చీ మీంచి కింద పడి మరీ నవ్వుతోంది నువ్వు ౘందమామ మీద వేసిన నింద వినీ..." అంటూ మిగిలిన మాటలన్నిటినీ మింగేసిన అపర్ణ నవ్వులూ వినిపించాయి. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***







పున్నమి పుట్టినరోజాయె
పదకొండు ఎనిమిదాయె
మార్చ్ ఆగష్టాయె
ఏనివర్సరీ అదేదో ఆయె

అది ఇదాయె
ఇది అదాయె
అదీ...  ఇదీ...  ఏదో ఆయె
ౘందమామ! నీ మీద నిందాయె!

మతి గతి మకతికలాయె
మకతికలైన తికమకలో
పకపకలు మా పాలాయె
మా తికమకలకి వూత నీవని
ౘందమామ! నింద నీ పాలాయె! 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


9, ఏప్రిల్ 2023, ఆదివారం

రంగమార్తాండ - అమ్మానాన్నలదెలా అయిందా అనిపించిన కథ!

     






    రంగమార్తాండ సినిమా. 

    ప్రతి సినిమా చూసినట్టే "రంగమార్తాండ" సినిమా చూస్తున్నంత సేపూ "ఇది సినిమా అంతే...దీని కథింతే" అనుకుని చూశా కూడా. 

    సినిమాలో అందరూ బాగా నటించారు కూడా. 

    అయినా కూడా ఎందుకో ఒక మంచి సినిమా చూసినట్టనిపించలేదు. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    అన్నీ బావుంటే ఇబ్బందేంటీ అంటే...నేనూ అదే ఆలోచిస్తున్నా. 

    "రంగమార్తాండ" సినిమాకి మూలం మరాఠీ సినిమా "నటసామ్రాట్".

    మరాఠీ సినిమాకి మూలం  మరాఠీ స్టేజ్ నాటకం "నటసామ్రాట్". 

    దానికి స్ఫూర్తి షేక్స్పియర్ రాసిన "కింగ్ లియర్" డ్రామా - అట. 

    ముందు షేక్స్పియర్ దగ్గర మొదలెడతా. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    షేక్స్పియర్ డ్రామాలో కింగ్ లియర్‌కి ముగ్గురు కూతుళ్ళు - వాళ్ళల్లో ఇద్దరికి తన రాజ్యం ఇచ్చేస్తాడు. మూడో కూతురు తనకెంత ప్రీయమైనదైనా ఆ పిల్ల తన మీద ఇష్టం మాటల్లో చెప్పలేదని అలిగి దూరం చేసుకుంటాడు. చివరికి ఆ చిన్నకూతురు పోయిందన్న బాధతో తనూ చనిపోతాడు. నాకస్సలు ఈ కింగ్ లియర్ డ్రామా చాలా dark tragedy అని అప్పుడెప్పుడో డిగ్రీ చదివే రోజుల్లో మొదటిసారి చదివినప్పుడే పేజీలు skip చేసుకుంటూ చదివాను. ఆ తర్వాత ఆ కథనే ఎప్పుడూ తల్చుకోలేదు. 

    అది "నటసామ్రాట్" దాకా వచ్చేసరికి కింగ్ లియర్ కాస్తా ఒక ప్రముఖ రంగస్థల నటుడయ్యాడు. కింగ్ లియర్ పంచిన రాజ్యమేమో ఇల్లూ, ఆస్తీ, నగలూ అయ్యాయి. రాజ్యం దక్కిన ఇద్దరు కూతుళ్ళు కాస్తా ఒక కొడుకూ, ఒక కూతురూ అయారు. తండ్రి కోపానికి గురైన మూడో కూతురు నటసామ్రాట్ సర్దార్ అని పిలుచుకునే ప్రియమైన భార్య అయింది. అక్కడి రాజ్యం వదులుకున్న కింగ్ లియర్ ఇక్కడి నాటక రంగస్థలం దాటి నిజజీవిత సమరం లోకి దిగిన నటసామ్రాట్ అయాడు. అంతవరకు బాగానే వున్నట్టనిపించింది. 

    భాష పూర్తిగా అర్థం కాకపోయినా మరాఠీ సినిమా "నటసామ్రాట్" కూడా చూశాన్నేను. ఆ సినిమాలో కథ నాటకరంగంలో జీవించిన నటుడిగా, జీవితంలో నటించలేని మనిషిగా నానాపటేకర్ సటిల్ (subtle) నటన నాకు నచ్చింది. భాష అర్థమయుంటే ఎంత నచ్చిందో ఇంకొంచెం గట్టిగా అనుకోగలనేమో అనిపించింది. పైగా ఆ సినిమాకి వాళ్ళు పెట్టుకున్న tag line - "నటసామ్రాట్ - అసా నట హోణే నాహీ" (నటసామ్రాట్టునే కానీ ఇలాంటి అసమర్థ నటుణ్ణి  అయుండకూడదు అనేమో!)

    ఇప్పుడు రంగమార్తాండ చూస్తుంటే అటు - న డ్రామా కా, న సినిమా కా...- అయిందా అన్నట్టనిపించింది. 

    "నటసామ్రాట్"ని దాటి "రంగమార్తాండ" దాకా వచ్చిన కథ కాస్తా - నాటకరంగం కూడా దాటి - సినిమా, తెలుగు భాష - అంటూ ఎక్కడెక్కడో తిరిగినట్టనిపించింది. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
   

    మొట్టమొదటగా... "రంగమార్తాండ" సినిమా ముందు పేర్లు పడేటప్పుడు చూపించిన రంగమార్తాండుల్లో ఫోటోలు అన్నీ కూడా చాలా వరకు సినిమా వాళ్ళవే. 

    సినిమా వాళ్ళవి వేస్తే వేశారు కానీ ఒక్కొక్కళ్ళవి డబుల్సూ, త్రిపుల్సూ, మల్టిపుల్సూ అన్నన్ని ఫోటోలు వేసేసే బదులు - మా డీజే టిల్లు సిద్దూదీ, అల్లరి నరేషుదీ, వాళ్ళన్న ఆర్యన్రాజేషుదీ, ఆ పక్కనే ఓ చిన్న స్టాంపు సైజులోనైనా జాతిరత్నం నవీన్ పోలిశెట్టిదీ, కిరణ్ అబ్బవరానిదీ, విష్వక్సేనుడిదీ - ఇంకా ఇలాంటి పాత్రలో జీవించేవాళ్ళో, జీవించడానికి పాత్రలు వేసేవాళ్ళో బోళ్డు మంది ఫొటోలు వేస్తే వాళ్ళూ మిగిలిన నటమార్తాండులతో ఒక ఫ్రేములో కుదురుకున్నామని మురిసిపోయేవారేమో! 

    అవునూ! పాత్రల్లో జీవించి పాత్రలకి జీవం పోసి పాత్రపాత్రకీ పుట్టి, పాత్రపాత్రకీ నలిగి, పాత్రపాత్రకీ మలిగినవాళ్ళందరూ మగవాళ్ళేనా, అందరూ రంగమార్తాండులేనా? అలనాటి-కన్నాంబాది-ఈకాలపు-రష్మికాపర్యంత-రంగమార్తాండాంబలు లేరా? 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    నాకస్సలు నచ్చనిది  -  ఈ సినిమాకి కింద వున్న tag line - "మన అమ్మానాన్నల కథ".  అదెందుకో ఇంకొంచెం ముందుకెళ్ళాక చెప్తా. 

    సినిమా అంతా చూశాక "ఇది అమ్మానాన్నల కథ ఎందుకయిందీ? నాటకరంగానికీ, నిజజీవితానికీ అన్వయమూ, సమన్వయమూ కుదుర్చుకోలేని ఒక మామూలు మనిషి కథ అయితేనూ...?!" అనిపించింది. 

    తడబడుతూ తీసిన కథకి తల్లిదండ్రుల సెంటిమెంటు మెరుపులంటించి అమ్ముకుందామనుకున్న ఒక తెలివైన దర్శకుడి తాపత్రయం కనిపించింది.  

    ఈ సినిమా పేరు "రంగమార్తాండ - ఒక అసమర్థ నటుడి కథ" అయుంటే apt గా అనిపించేదేమో! 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    సినిమాలో నటించిన అందరి కన్నా ముందు రాజుగారు అనిపించుకున్న మిసెస్ రాఘవరావు గురించి. 

    రాజుగారు రమ్యకృష్ణది తల్లి పాత్రే. 

    కానీ సినిమా మొత్తంలో నటించిన ఆడవారందరిలో కొట్టొచ్చినట్టు కనిపించిన పదహారణాల తెలుగుదనం ఆమెది. ఆమె సౌందర్యప్రభ ముందు మిగిలినవన్నీ దివిటీలే. 

    కాకపోతే సినిమా మొదట్నుంచీ చివరి దాకా పడుక్కున్నప్పుడు కూడా పట్టుచీరలే కట్టేసుకుంది. అది మాత్రం నాకు నచ్చేసింది. 

    నవ్వు మొహం లేకపోయినా నలిగిపోయిన పుల్లేటికుఱ్ఱు జరీచీరల్లో ఈసురోమని కాకుండా ఎంచగ్గా పట్టుచీరల్లో, మొహాన ఇంత పెద్ద కుంకం బొట్టుతో నయనానందకరంగా భాసిల్లింది. 

    నాకనిపించిందేంటంటే ఈవిడ ఈ సినిమాలో నటిస్తున్నంతసేపూ రంగమార్తాండ-రాఘవరావు స్థానంలో "ఇలాంటి సినిమా తీస్తున్నాడేంట్రా మా ఆయనా?!" అనుకుంటూ నిజభర్తని ఊహించుకుందేమో అని. అందుకే ఆ అసహాయతా, అసహనాన్నీ అవలీలగా, అలవోకగా అభినయించేసింది. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఇక పోతే రంగమార్తాండ రాఘవరావు పాత్రధారి ప్రకాష్‌రాజ్‌కి ఆయన ధరించిన పాత్ర కొట్టిన పిండి, దంచిన పప్పు,  పిండిన బట్ట, నమిలిన పిప్పి, వగైరా వగైరా. 

    తనకిచ్చిన పాత్రోచితంగా తాగి తూగిపోయాడు, తూగి మోగిపోయాడు, మోగి ఊగిపోయాడు - మొత్తానికి ఆ యొక్క పాతర్లో రకరకాలుగా ఒదిగిపోయాడు, ఒరిగిపోయాడు. 

    ఈయనకి సినిమా మొదట్లో సన్మానం జరిగినప్పుడు ఉపన్యాసం ఇస్తూ "నేను రెండు పాత్రలకి న్యాయం చేయలేకపోయాను" అంటూ దానికి కొనసాగింపుగా "మా రాజుగారు, నా వజ్రాల్లాంటి పిల్లలూ" అంటాడు కానీ తను న్యాయం చేయలేకపోయిన రెండు పాత్రలూ ఆ రాజుగారికి భర్తా, ఆ వజ్రాలకి తండ్రీ అని చెప్పడం మర్చిపోయాడేమో అనిపించింది. నాకైతే మాత్రం ఆ ఉపన్యాసం ఉప్పులేనిఉత్తపప్పులా ౘప్పగా అనిపించింది. మొట్టమొదటిసారి కథ లాజిక్కు తప్పిందనిపించడం ఇక్కడే మొదలయ్యింది నాకు. 

    

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    అసలీ రంగమార్తాండ రాఘవరావు పాత్ర డిజైనే నాకు సరిగ్గా అనిపించలేదు. 

    అన్నట్టూ... 

    నాటకాల్లో కోట్లు సంపాదించడమేంటి? 

    రాజుగారు రమ్యకృష్ణని పట్టుచీరల్లో అందంగా - ఒక మంచి ఇంట్లో చూపించాలంటే రాఘవరావుకి నాటకాల్లో కోట్లు రావడం సబబే! ఏదో కథకి తగ్గ లాజిక్కు అనుకుని సర్దేసుకున్నా.  చిన్నప్పుడు "నా పుట్టలో వేలెడితే కుట్టనా?" అని చీమ మాట్లాడిందీ అంటే నమ్మలేదూ - ఇదీ అలాగే అనుకున్నా! 

    నాటకం నుంచి రిటైర్ అవ్వడమేంటి? ఇదీ సరే! నాటకమే వృత్తి అనుకున్నవాడికి నాటకాలాడ్డం మానేయడం వృత్తివిరమణ. కథకి తగ్గ లాజిక్కే. బానే వుంది.  

    'వాళ్ళ పాటికి వాళ్ళేవో ఉద్యోగాలు చేసుకుంటున్న కొడుకూ-కోడళ్ళని పిలిచి కోడలు పేరు మీద ఆస్తి రాయడమేంటి? నాకొద్దు  మొఱ్ఱో అంటున్న కూతురికి తన భార్య నగలు ఇచ్చేయడమేంటి?' అనిపించినా పోన్లే ఇస్తే ఇచ్చాడు, ఈ కథలో ఇలాగే చెయ్యాలేమో - అలా అయితే కథ లాజిక్కు ఓకే అనుకున్నా.

    తన పాప బాగా చదువుకోవాలని కోడలు కష్టపడి సంపాదించుకున్న ఇంటర్నేషనల్ స్కూల్లో చిందులు తొక్కి తన మనవరాలిని బళ్ళోంచి తీసుకొచ్చేయడమేంటి? 

    పగలూ రాత్రీ లేకుండా తాగితందనాలు తొక్కడమేంటి? ఇవన్నీ కూడా ఓకే, ఓకేనే! 

    తెలుగు సినిమా షూటింగ్ సీనులో తెలుగు డైలాగు చెప్పలేక ఆ అమెరికా-రిటర్న్డ్ తెలుగబ్బాయి తెలుగు నాటకాలన్నీ చాల "లౌడ్" గా వుంటాయీ అన్నాడే అనుకో ... 

    దానికి బదులుగా రాఘవరావు ఏం చేశాడు?

    హామ్లెట్ తనలో తను మాట్లాడుకుంటున్నట్టుండే "To be or not to be" అనే స్వగతాన్ని (soliloquy ని) రాఘవరావు అరచి చెప్పాడు. 

    "ఆయ్ - హన్నా!... నువ్వేమన్నా షేక్స్పియర్ డ్రామాలో హామ్లెట్ గట్టిగా అరవలేదని చెప్పగలవా?" అనంటాrరా? ఆ అరవడం ఈ కథకి నప్పే లాజిక్కు అనుకోమంటే సరే, సరే!

     ఈ సినిమాకి పెట్టిన tag line వల్ల  సినిమా చూసినవాళ్ళూ, చూడనివాళ్ళూ కూడా అమ్మానాన్నల్ని పిల్లలు సరిగ్గా చూడట్లేదో అని గగ్గోలు పెట్టడమే! 

    నిజ్జంగా అమ్మా-నాన్నలని పిల్లలు అష్టకష్టాలు పెట్టారని చూపించదలుచుకుంటే లాజిక్కు మార్చాలి కదా?!  

    అపార్టుమెంట్లు కొనుక్కుని ఎదురెదురుగా వుందామంటే అత్తామామలు మాట వినట్లేదని, అనవసరంగా ఆస్తి తనకిచ్చి తనే వాళ్ళని వేరు చేస్తున్నాననిపించేట్లు చేస్తున్నారని కోడలు కళ్ళనీళ్ళు పెట్టుకుని బాధ పడిపోతే ఎలా? 

    కథ లాజిక్కు అడ్డంగా తన్నేసింది -  అనసూయా - ఆదర్శ్ బాలకృష్ణల అటూ-ఇటూ కాని అయోమయపు ప్రవర్తన వల్ల. 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇందులో ఇంకో పెద్ద జంట... రాఘవురావు స్నేహితుడు చక్రపాణి, వాళ్ళ ఆవిడ సుభద్ర / సుబ్బు.  

    ఈ చక్రపాణినీ, రాఘవరావునీ చూస్తే నాటకాలాడేవాళ్ళు తాగడానికి పగలూ, రాత్రీ లేకుండా తాగుతూనే వుంటారనీ, చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు పట్టించుకోకుండా గొంతెత్తి సత్యహరిశ్చంద్ర నాటకంలోని కాటిసీను పద్యాలు పాడుతూ వుంటారని అనుకోవాలా? 

    అయినా చక్రపాణికి నిద్రమాత్రలు గ్లాసు నీళ్ళలో కలిపి పానకం తాగించినట్టు తాగించేస్తే ఆ హాస్పిటల్లో డాక్టర్లు ఆ రెండో రోజు తాగించిన రాఘవరావుని పట్టుకుని పోలీసు కేసు పెట్టి తన్నించరా? 

    ఆ చక్రపాణి మాత్రం.... ఆ నీళ్ళు ఎత్తిన గ్లాసు దించకుండా గటగటా తాగేసి కడుపులో మంటతో విలవిల్లాడకుండా "బ్రేవ్" మని త్రేన్చి పడుకుండి పోతాడా? 

    మరీ...ఉండబట్టలేక ఊరికే అడుగుతున్నా!  అంతే! అంతే!

    మూలకథ నుంచి ఎలాగూ చాలా వరకు పక్కకొచ్చిన కథ ఈనాటి వాతావరణానికి సరిపోని ఇలాంటి సంఘటనలని మార్చి వుంటే ఇంకొంచెం బావుండేదేమో! 

    అన్నిటికీ మించి ఇందులో చక్రపాణిగా బ్రహ్మానందం బ్రహ్మాండంగా నటించాడు అనుకోమంటే ఈ ఒక్కసారికి అనుకుంటా గానీ ఇంకెప్పుడూ ఇలా చేయకపోతేనే బావుండుననుకుంటా. 

    ఇహ పోతే చక్రపాణి భార్య సుబ్బు - జయలలిత. ఎప్పుడు ఏ సినిమాలో ఈవిణ్ణి చూసినా "గుంటూరు బ్రాడీపేట రెండో లైన్లో వీళ్ళింటి ముందు నుంచే వెళ్ళేవాళ్ళం కదా" అని ఒకసారి అనుకోవడమే గుర్తు. ఆ గుంటూరభిమానం తోనే ఇక్కడింకోసారి తలుచుకుంటున్నా - అంతకు మించి ఇంకేమీ లేదు. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ సినిమాలో నాకు భలే బాగా చేశారు అనిపించిన ఇద్దరు - రాఘవరావు కూతురు బంగారం శివాత్మిక, మిస్టర్ బంగారం రాహుల్ షిప్లిగంజ్. వీళ్లిద్దరి నటన ఒక pleasant surprise నాకు. వాళ్ళతో పాటు అనసూయ కూడా బాగా చేసింది. 

    ఆనందం కలిగినప్పుడు నిండుసభలో గంతులేసుకుంటూ "ఐ లవ్యూ నాన్నా!" అని అరచి చెప్పినా, ఆవేశం వచ్చినప్పుడు ముందూవెనకా చూసుకోకుండా "రాహుల్ డబ్బులెందుకు తీశావు నాన్నా, చీప్‌గా" అని చెప్పింది వినిపించుకోకుండా అరిచినా - తనున్న ప్రతి ఫ్రేంలో తన మెరుపు తెలిసేలా చమక్కుమని మెరిసిన తళుకు తార - శివాత్మిక. బోల్దంత సహజంగా, హాయిగా "నిజంగా ఈ పిల్ల ఇలాగే ఉంటుందేమో" అనిపించేంతలా భలే నటించింది. 

    అక్కడక్కడ కొంచెం ఎక్కువ చేసిందేమో అనిపించినా అది కూడా చెప్పి చేయించినవారి చిట్టాలో వేయాల్సిందే తప్ప చేసిన శివాత్మిక ఖాతాలో కాదు. 

    రాహుల్ షిప్లిగంజ్ కూడా అంతే. ఎప్పుడూ ఇలాగే వుంటాడేమో అనిపించేలా మహ-సులువుగా అస్సలు నటిస్తున్నట్టే అనిపించనట్టు  నటించినట్టనిపించాడు. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇక పాటలు. నేను ఇంతకుముందు సినిమాల్లోని ఇళయరాజా పాటలే వింటా. ఇందులోవి ఆయన ఖాతా లోంచి తీసేస్తా. 

    ఏదో కొంచెం బావుందేమో అనిపించబోయిన "దమిడి సేమంతీ!" పాట అసలు నాటకాల్లో పద్యాలు పాడిన రాఘవరావు పాడితే కంచు మోగినట్లు ఎంత ఖంగుమనాలీ?  అబ్బే! పాట అదేదో తేలిక గొంతులో తేలిపోయి మబ్బుగొంతులో ఉరమాల్సిన పాట నీటి బుడగలో పేలినట్టయ్యింది.  కొంచెం గొంతు లావు చేసుకుని మనో పాడుంటే ఎంత బావుండేదో ఈ పాట! 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఎంత రాస్తే ఏం గానీ... ఏ మాటకామాట చెప్పుకోవాలీ అంటే - ఈ మాత్రం సినిమాలు కూడా ఈ మధ్య రావట్లేదు. పైగా రమ్యకృష్ణ వుంది అంజెప్పి కదలకుండా ఈ సినిమా చూశాం. 

    ఇక ముందూ ఇలాంటివే ఏవో చూస్తాం. అంతే తప్ప రాజుగారి కొత్త బట్టల్లా కథకే అతకని లాజిక్కేదో వెదుక్కుని బావుందని మాత్రం చెప్పలేను. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

~ సినీ-మా-లక్ష్మి 


22, మార్చి 2023, బుధవారం

మీ మనోశోభ కృతమగుగాక

 

మనసులు కలిసొచ్చే కాలంలో
గడిచే గడియ గడియకీ
మిగిలేదొకటి - గుఱుతు 
ఎదిగేదొకటి - ఎఱుక

ఆ గుఱుతు... ఒక ఉగాది
ఆ ఎఱుక... ఒక ఉగాది

కలిసిన మనసులు విచ్చే మేలంలో
తరిగే రోజు రోజుకీ
కలిగేదొకటి - పేరిమి
కలిసేదొకటి - కూరిమి

ఆ పేరిమి... ఒక ఉగాది
ఆ కూరిమి... ఒక ఉగాది

ఏడాదికేడాదికీ
కొమ్మకొమ్మ చిగిర్చి
రెమ్మరెమ్మ పూతలిచ్చి
ఉల్లములుల్లాసంగా
ఉగగా... ఉప్పొంగగా...
పువ్వునవ్వు కన్న కన్ను - మినుమించు
సోలుగాలి పలకరించిన మేను - పులకరించు
ఆ ఉగ... ఒక ఉగాది
ఆ పొంగు... ఒక ఉగాది





యుగయుగాలుగా 
ఆద్యంతాలు అంతుపట్టని అనాదిగా
ఏడాదికి ఆదిగా
వెలుగుతున్న ఉగాది
ఈ ఏడాదికి
శోభకృతై 
మీ మదికి ఆనందాదియై 
మీ హృదికి సంతోషాదియై 
మీకూ మీ వారికీ మమతావారధై 
మీ జీవనం శోభావృతమై
మీ మనోశోభ కృతమగుగాక




12, మార్చి 2023, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 27 - కవలపాటలు - మలరే...! మౌనమా...? అని పలుకుతున్నది ప్రాణమా?

 

గాయమైన ఎదకి హాయి పూయ
గేయమొకటి తోడువచ్చె
మోయలేని బాధ మాపు సేయ
మాయ యేదొ తోడ తెచ్చె

తోడు వచ్చిన పాట పొదవుకుంది
పదము పదమున -
మది తుళ్ళే పూలబాసలు... 
ఊరడించిన గీతి ఒదుగుకుంది 
అడుగు అడుగున -
ఎద గిల్లే గాలిఊసులు... 

గుసగుసలుగ... 
హాయి తెచ్చిన పదము 
పొలుపున -
ఎద గాయమది... 
మాయమయ్యె

ఉసురుసురున...  
మాయ జేసిన పాట 
నెఱవున -
మది హాయియది... 
సోలుపయ్యె 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    పూవు తూగేది గాలిలో ... 
    పూవు నేల రాలేది గాలితో... 
గాలి తోటి చెప్పేదెలా జోరొద్దని?

    మనసు విరిసేది మాటతో ...
    మనసు విరిగేది మాటతో... 
మాట తోటి చెప్పేదెలా మీరొద్దని?

 గాలి జోరెక్కకుండా ఆపడమెవ్వరి తరం?  
మాట మీరొద్దని అనగలమెవ్వరం? 

అందుకే.... జరిగేది జరగనీ అనుకుంటా... 
జరిగేది ఏదీ ఆపబోననుకుంటా.... 

గాలికి రాలిన పూలకి దోసిలొగ్గుతా... 
మాటకి చెదిరిన గుండెకి పాట నేర్పుకుంటా!  
    
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ పూటకి నే ఏరికోరి తెచ్చుకున్న పాట - "మలరే ... మౌనమా!".  పాటున్న సినిమా తమిళ "కర్ణ".  పాటలో వున్నవారు - అర్జున్, రంజిత. 

    ఇది  ఒక తీపిరాగాల మధుమంత్రం. ఎదను గిల్లు గాలిగానాల హాయిజంత్రం. 

    ఈ పాటకి సంగీత దర్శకుడు - తెలుగులో అంతగా ఎవరూ తలుచుకోని విద్యాసాగర్. 

    విద్యాసాగర్ ఎవరబ్బా అని కదా? అప్పుడెప్పుడో "ముగ్గురు మొనగాళ్ళు" లాంటి కొన్ని తెలుగు సినిమాలకి వృత్తిధర్మ-మాత్ర సంగీతం చేసి ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాల్లో మనోధర్మ-పాత్రమైన అద్భుతమైన పాటలు కూర్చిన సంగీత-స్వర-మాంత్రికుడు. 

    ఇంకా చప్పున ఈయనెవరో తలచుకుని-గుర్తు పెట్టుకోవాలంటే - ఇంకో పాట గురించి చెప్తా. 

    నయనతార గాలిపటాలెగరేసి, రజనీకాంత్ పిల్లిగడ్డమెట్టుకుని లకలకలాడిన సినిమా ఒకటుంది చూశారూ? 

    అదే... అందులో జ్యోతిక టార్చ్‌లైట్లలా వెలుగుతున్న కళ్ళ చుట్టూ ఇంత కాటుక పూసుకుని, జుట్టంతా పీక్కుని వినీత్‌తో కలిసి డాన్స్ చేస్తుందే - "రారా సరసకు రారా" అంటూ - గుర్తుందా? ఆ సిన్మా ఏదో మీరే కనుక్కోండి. ఆ పాటకు జాతీయపురస్కారం కూడా దక్కింది మన సంగీత-విద్యాసముద్రుడికి. 

    అదే కాదు - కాశీనాథుని విశ్వనాథుడి "స్వరాభిషేకం" సిన్మాకి కూడా విద్యాసాగరుడే సంగీత-గంగావతరణ-భగీరథుడు. సంగీతం బావుంటుంది - కాకపోతే ఆ సినిమా నాకంతగా సొక్కలేదు. 

    ఇవే కాకుండా - ఇంకో ఊరూపేరూ లేని రీలుముక్క లాగా గాలికెటో కొట్టుకుపోయిన ఒకానొక  సినిమాలో ఒక అద్భుతమైన పాట వుంది ఈ విద్యాసాగర్‌దే. దాని గురించిన కబుర్లు మళ్ళింకోసారి చెప్తా. ఎందుకంటే ఆ పాట నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఓ రెండు ముక్కలు చెప్పేసి ఆ ఇష్టాన్ని కొంచెపఱచుకోవడం నాకిష్టం లేదు. 

    అన్నట్టు ఈ విద్యాసాగర్‌గారిది మా అమలాపురమేనట. భలే! 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఇహిప్పుడు - అసలు పాట పాట గురించి. 

    నేనిన్ని కబుర్లు చెప్తుంటాను కానీ - మా ఇంట్లో లేస్తూనే పాట వింటూ - చెవికి నచ్చిన పాటనల్లా పాడుకుంటూ - రాత్రి పాట వింటూ నిద్ర లోకి జారుకుంటూ - ఎప్పటికైనా తనకు నచ్చిన పాటలన్నీ పాడుకోవాలనుకునే వీర-పాటాభిమాని బద్రి. 

    తను రకరకాల పాటలు వింటూ అందులో అనుకోకుండా దొరికిన మిణుకు-చుక్కల్లాంటి పాటల్ని పట్టి నాకిస్తూ వుంటారు. అలా దొరికిన బాల-గంధర్వ-జానకీ-మధురయుగళజనిత-గానమే ఈ "మలరే...మౌనమా?" పాట. 

    వేణుగానంతో మొదలయ్యే విద్యాసాగరుడి మధుర సంగీతం...
    చెవికింపైన వైరముత్తు రాసిన తమిళ-పలుకులు... 
    పాలూ-తేనె-మీగడ-పంచదార-నవ్వు-అచ్చర పరిచే అచ్చరపు పలుకు... అన్నీ కలిపి చిలికిన హాయిపాటల మా సుబ్బయ్య గొంతు... 
    తోడుగా పాటకి తళుకు అద్ది, బెళుకు తొడిగి, జిలుగు కూర్చే ఎస్జానకి స్వరం...

    ఇన్ని కుదిరిన పాట ఇంపుగా కాక ఇంకెలాగుండగలదు?

    తమిళసలు పాటలో వున్న ఈ పూల-గాలి మాటలు నాకు బోల్డు నచ్చాయి. 

కాట్రే! ఎన్నై కిళ్ళాదిరు... 
(గాలీ! నన్ను గిల్లెయ్యకూ ...)
పూవే! ఎన్నై తళ్ళాదిరు... 
(పూవా! నన్ను తోసెయ్యకూ!)

    కాకపోతే ఈ పాటలో వినిపించే "అన్బే" అన్న మాట అనునాసిక / అనుస్వార సూత్రానికి విరుద్ధంగా అనిపించింది. లెక్కప్రకారం అది "అమ్బే" అన్నట్టు పలకాలి - కానీ ఎస్జానకి తమిళ ఉచ్చారణలో "అన్బే" అన్నట్టు వినిపిస్తుంది.

    "అమ్బే" అనే ఎందుకు పలకాలని నాకెందుకు అనిపించిందో ఎవరికైనా తెలుసుకోవాలనిపిస్తే ఇదోమాటు చదవండి: సున్నాలెయ్ ...బోల్డు సున్నాలెయ్!

    అన్నట్టు ఈ పాటకి వెన్నెలకంటి రాసిన తెలుగు-డబ్బింగు కూడా బాగానే కుదిరింది. తెలుగులో పాడిన మనో గొంతులో కూడా చాలా బావుంటుంది. 

    సర్సరే! ముందుగా తమిళసలుపాటకి, తెలుక్కొసరుపాటకి యూట్యూబు లింకులు ఇవిగో... 

    మలరే... మౌనమా?!: https://www.youtube.com/watch?v=gRjKULlhot4
    పలికే మౌనమా! : https://www.youtube.com/watch?v=Q1CR6a1_o2w


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    
   


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

మలరే...! మౌనమా...?
మౌనమే...  వేదమా...?!

మలర్‌గళ్ - పేశుమా... ?
పేశినాళ్ ఓయుమా... అన్బే!

మలరే...! మౌనమా... ?
మౌనమే...  వేదమా... ?!

ఆ... 

పాది జీవన్ కొండు దేగం వాళ్న్దు వందదో...ఆ ..ఆ ఆ.. ఆ ..ఆ!
మీది జీవన్ ఎన్నై పార్థ  పోదు వందదో...?

ఏదో సుగం - ఉళ్ళూరుదే...!
ఏనో మనం - తళ్ళాడుదే...!
ఏదో సుగం - ఉళ్ళూరుదే...!
ఏనో మనం - తళ్ళాడుదే...!

విరళ్‌గళ్ తొడవా?
విరుందై పెరవా?
మార్బోడు కంగళ్ మూడవా...?!

మలరే...! మౌనమా...?
మలర్‌గళ్ - పేశుమా... ?

కనవు కండె ఎందన్ కంగళ్ మూడి కిడందేన్... 
కాట్రై పోల వందు కంగళ్ మెల్ల తిరందేన్... 

కాట్రే! ఎన్నై కిళ్ళాదిరు... 
పూవే! ఎన్నై తళ్ళాదిరు... 
కాట్రే! ఎన్నై కిళ్ళాదిరు... 
పూవే! ఎన్నై తళ్ళాదిరు... 

ఉరవిల్  ఉరవే... 
ఉయిరిన్ ఉయిరే... 
పుదు వాళ్కై తంద వళ్ళలే....!

మలరే...! మౌనమా...?
మౌనమే...  వేదమా...?!

మలర్‌గళ్ - పేశుమా... ?
పేశినాళ్ ఓయుమా... అన్బే!

మలరే...! 
మ్మ్ ... 
మౌనమా?
మ్మ్... 
మౌనమే... 
మ్మ్ ... 
వేదమా?!
ఆ... 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***






*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

పలికే మౌనమా...
మౌనమే వేదమా...

పలుకే ప్రాణమా... 
ప్రాణమే బంధమా...ప్రియా!

పలికే మౌనమా...
మౌనమే వేదమా...

ఆ... 

మదిని దేవి కొలువైన వేళ వచ్చెనో - ఆ ..ఆ ఆ.. ఆ ..ఆ!
మనసు నీదే అని మరులు పూలు విచ్చెనో!

ఏదో సుఖం శృతించగా...
ఏదో స్వరం లిఖించగా...
ఏదో సుఖం శృతించగా...
ఏదో స్వరం లిఖించగా...

ఒకటే ఎదగా ... 
ఒదిగే కధగా... 
ఒడిలోన ఊయలూగగా!

పలికే మౌనమా...
పలుకే ప్రాణమా... 

కలలు కన్న నా కనులు మూసుకొనెనే!
కలిసిపోతే వయసింక మాట వినదే!

గాలే ఎదే గిల్లేనిలా...
పూలే సుధే చల్లేనిలా...
గాలే ఎదే గిల్లేనిలా...
పూలే సుధే చల్లేనిలా...

చొరవే విడవా...?
మనవే వినవా...?
మధు మంత్రమేదో పాడవా!

పలికే మౌనమా...
మౌనమే వేదమా...

పలుకే ప్రాణమా... 
ప్రాణమే బంధమా...ప్రియా!

పలికే... 
మ్మ్ ... 
మౌనమా...
మ్మ్ ... 
మౌనమే... 
మ్మ్ ... 
వేదమా...
ఆ... 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    పాటలు వింటూ, నే రాసిన పాటల-మాటలని మీ గొంతుతో పాడుకుంటూ పాటల-పండగ చేసుకుంటారని అనుకుంటూ.... 

~ పాటల భైరవి 


17, జనవరి 2023, మంగళవారం

తథా భవేత్ - లలితమనోగత చింతనమతి తరళం...

ఒక్కో  పొద్దు  ఒక్కోలా... 
నిలకడ లేని నీరులా
ఆగమాపలేని గాలిలా 
సాగుతూ...  సోలుతూ... 

కంటికానినవి - వీనుకందినవి 
అన్నీ నావేనని 
అనుకుంటుంటుండగా... 

ఒక్కో సద్దు ఒక్కోలా... 
పాటనంటివున్న నవ్వులా 
మోగకుండలేని మువ్వలా 
తుళ్ళుతూ... మోగుతూ... 

మోవి మీరినవి - మది మీటినవి 
అన్నీ నావేనని 
అనుకుంటుంటుండగా... 

ఆవరించిన 
వేకువ వెలుగు - మాపటి గుబులు 
చలువనిచ్చిన 
ౘందమామ - చల్లగాలి 
నాకే ... నావే... 
అనుకుంటుంటుండగా... 

కంటికందిన 
దూది మబ్బు - వెండి వెన్నెల 
కన్ను చూసిన 
చిమ్మ చీకటి - చుక్క మిణుకు 
నాకే ... నావే... 
అనుకుంటుంటుండగా... 

తాకకుండని 
మండుటెండ - వేడి గాడుపు 
తాకిపోయిన 
రంగుటాకు - రాలినాకు 
నాకే ... నావే... 
అనుకుంటుంటుండగా... 

కమ్ముకొచ్చిన 
కారుమబ్బు - వానగాలి 
కంపమిచ్చిన
మంచు జల్లు - మించు జిల్లు 
నాకే ... నావే... 
అనుకుంటుంటుండగా... 

తొలకరి మొలకల తొగరు - పులకల మొగ్గ చిగురు
మెలకువల ఎద ఎలుగు - మరపుకలల మది సోలుపు 
నాకే ... నావే... 
అనుకుంటుంటుండగా... 

ఎదురు చూడని గెలుపు - ఏడిపించిన తోలుపు 
మది మెచ్చిన చేఱుపు - ఎద వగచిన ఎడవు 
నాకే ... నావే... 
అన్నీ నావేనని
అనుకుంటుంటుండగా... 

అదాటుగా... 
అనిపించిందోనాడు... 
అనుకున్నవన్నీ - అనుకోవటానికే - నావనీ 
అనుకున్నట్టుగా - అవేవీ - నావి కావేమోనని 
అనుకోనివేవో కూడా - నాకౌననీ
 
నేనౌనన్నది అవబోదనీ 
నే కాదన్నది కాకుండదనీ 

ఔనూ-కాదుల కథ ఒకటి నాదన్నది
ఆది నుంచి ఎప్పుడో 
నే పుట్టక మునుపే 
అనాది ఐన వారెవరో 
రాసినది ఒకటున్నదనీ 
ఉనికందింది 

నేననుకున్న ఔను రాసున్న ఔను ఒకటే అయితే 
అదే...  అదే - నవ్వు అయింది  

నేననుకోని కాదు - రాసున్న ఔనైతే - 
అదే అదే నొవ్వు అనిపించింది
నేననుకున్న ఔను -  రాసున్న కాదైతే... 
అదే... అదే - నొవ్వు అనిపించింది 

ఔననుకున్న నవ్వూ నాదేనన్నా 
అదిక్కడే వుండిపోలేదు 
ఆ క్షణమూ తెరలి పోయింది 

కాదనుకున్న నొవ్వూ నాదే ఐనా 
అదక్కడే ఆగిపోలేదు 
ఆ సమయం తరలి పోయింది 

తెరలిన నవ్వు 
చిలికించె
ఓ నీటిబొట్టు  

తరలిన నొవ్వు 
చిందించె 
ఓ ఊట తొట్టు 

నేనన్న ఉనికి 
నవ్వు-నొవ్వుల జంటకి 
ఆనవాలైనది 

నాదన్న మనికి 
నవ్వు-నొవ్వులంటక 
తామరాకైనది 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    చిన్నప్పట్నుంచి పుస్తకాల్లో చదివినప్పుడో, ఎవరి దగ్గరో విన్నపుడో  - తామరాకు మీద నీటిబొట్టులా వుండడమనేది - అదేదో గొప్ప విషయమనిపించేది. 

    కానీ - ఇన్ని రోజులకి - రోజులంటే రోజులు కాదు కానీ... ఇన్నేళ్లకి నాకు అర్థమైంది ఏంటంటే - తామరాకు మీది నీటిబొట్టులా వుండడం అంత గొప్పేమీ కాదని. 

    ఉంటే గింటే తామరాకు లాగే వుండాలని. 

    అసలు తామరాకు గొప్పేంటో చెప్పెయ్యాలి నేను. 

    తామరాకుకున్న ఒక మంచి లక్షణం ఏమిటీ అంటే - ఆ ఆకు superhydrophobic. 

    అంటే రోజుకి ఇరవైనాలుగ్గంటలూ, ఏడాదికి మూడొందలరవయ్యైదు రోజులూ నీళ్ళలోనే తేలుతూ, ఊగుతూ, తూలుతూ వున్నా కూడా ఏ మాత్రం ఆ నీటి మీద అమాంతం ఆసాంతం ఆపేక్ష పెంచుకోదన్నమాట.  

    పైగా తన మీద ఏ నీటిచుక్కో అదాటుగా పడితే దాన్నీ ఊరికే విదిలించదు. తన మేను మీద దుమ్మేదన్నా వుంటే ఆ నీటిచుక్కకి బొట్టుగా పెట్టి మరీ దులపరించుకుంటుంది. 

    తామరాకు ఇంత తెలివిగా తన మీద పడ్డ నీటినీ, దుమ్మునీ వదిలించుకుని నిమ్మకు నీరెత్తినట్టు నిబ్బరంగా వుంటుందనే బహు ముచ్చటపడి ఆదిశంకరాచార్యులు తన భజగోవింద శ్లోకంలో తామారాకుని గురించి "నళినీ దళ గత జలమతి తరళం" అని ముచ్చటించారు. 

    బావుంది కదా ... విలక్షణ నళినీ దళ లక్షణమ్! 

    
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇప్పటికి ఏడాది క్రితం - నిరుడు (అంటే 2022) జనవరి చివర్లో నేను చాలా చిరాగ్గా వున్నాను. 

    అసలే ... మా అమ్మ చెప్పినట్టు విసుగు ముందు పుట్టి తర్వాత నేను పుట్టానేమో - దాదాపు గత ఆరేళ్లుగా - నేను చేస్తున్న పనులు నా మీద నాకే తెగ విసుగు, చిరాకు తెప్పిస్తున్నాయి. 

    మౌనముత్తమ భాషణమ్  - అన్న ఉత్తమమైన సూక్తిని ఉత్త-ఉక్తిగా కొట్టి పారేసి కావల్సినవీ-అక్కర్లేనివీ మాట్లాడడం చేస్తూ "అహం-రైట్" అనేసుకుంటూ, అవతలి వాళ్ళని స్టెప్పిన్గాన్దటోస్ చేసేస్తూ - మహా ఇబ్బంది పెట్టేస్తున్న అహం-కారపు రోజుల నుంచి ఎప్పుడెప్పుడు బయట పడదామా అని మహా-ఆతృతగా ఎదురు చూస్తున్న రోజులవి.  

    సరిగ్గా అప్పుడే - వాట్సాప్‌లో అపర్ణ నాకెవరో రాసిన మాటలు కొన్ని పంపించింది. ఇదిగో - ఈ కిందున్నాయే .... ఇంగిలీషు భాషలో ... అవే !

am beginning to learn to love the sound of my feet walking away from things not meant for me. 

    ఏ బంగారుతల్లో-తండ్రో - ఎవర్రాశారో కానీ ఆ పై మాటలు - "లలితా! చూడు ఇవేవో నువ్వు కావాలనుకున్న మాటల్లా ఉన్నాయి" అంటూ అపర్ణ నాకు పంపగానే -  నా వరకు రాగానే ఇవి నావేననిపించాయి. 

    అనుకున్నకొద్దీ - "ఇవి నాకోసం రాసినవే - ఈ రోజు నుంచి నావే" అనుకుని own చేసుకుని - రోజూ  చదువుకుని నా తల మీద నేనే మొట్టుకుని గుర్తుపెట్టుకుని - నిత్యపారాయణ చేసుకోవలసిన అనునిత్యసత్యాలనిపించాయి. 

    ఆ మంచి మాటలతో పాటే నాకొక తామరాకు బొమ్మ కూడా పంపించింది అపర్ణ. దాంతో పాటే తామరాకు మీద నీళ్ళు జల్లుతూ అవి జారిపోతుండగా తీసిన ఒక బుల్లి వీడియో కూడా పంపించింది. 

    అంతే... అస్తవ్యస్తంగా వున్న నా మస్తకానికో తిన్ననైన తెన్ను దొరికినట్టయింది. 

    ఇది కదా - ఇన్నాళ్ళూ నాకు తెలియకుండా వున్న విశేషమైన విషయం అనిపించింది. 





    అప్పుడనుకున్నా... నేనిక తామరాకు నేర్పిన పాఠాన్ని నేర్చుకోవాలని. 

    అలా అనుకున్న దగ్గర్నుంచి కొంచెం కొంచెంగా మాటకి అదుపూ, మనసుకి మరపూ నేర్పుకుంటున్నా. నెమ్మదిగానే అయినా అవి రెండూ నేననుకున్న దార్లోకి వస్తున్నాయి. 

    అందుకే - అలా నేను నేర్చుకోవడం, నాకు నేర్పుకోవడం మొదలుపెట్టిన ఏడాదికి - ఈ నాటికి ధైర్యంగా లలితోవాచ రాసుకుంటున్నా...

యథా - నళినీ దళ గత జలమతి తరళం
తథా భవేత్ - లలితమనోగత చింతనమతి తరళం!


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    నా మాటకి పాట తోడు తెచ్చుకోకపోతే నా బ్లాగ్రాత పూర్తయినట్టనిపించదు నాకు. 

    నా మాటకి దగ్గరగా అనిపిస్తూ - అలా అని మరీ పాఠం చెప్తున్నట్టు కాకుండా - చెవులకి హుషారిచ్చే పాటలా అనిపిస్తూ - కళ్ళకి చలాకీగా కనిపించే పాటొహటి - నాకిష్టమైనదొహటి - యూట్యూబు నుంచి పట్టుకొచ్చుకున్నా. 

    దేవానంద్ (నట) - రఫీ (గాయక) - సాహిర్ లూధియాన్వి (రచన) జయదేవ్ (సంగీత) - విశిష్టచతుష్టయభరితమైన ఈ పాటని రాసి పెట్టుకున్నా. 

    పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=ivBhqDtJeiw

      దేవానంద్ సిగరొత్తులు వూదేస్తూ - హర్ ఫిక్‌ర్ కో ధుయే మే ఉడా... - అంటూ చివర్లో భలేగా "ఉడా"యిస్తూ - చిత్తంలో వున్న చింతలన్నిటినీ పొగలో ఉడాయించేలా చెయ్యడం చూడ్డానికి భలేగా వుంది. అక్కడక్కడా నీటి అద్దంలో మెరిసిన సాధనా మురిపించింది. 

    "హమ్ దోనో" సినిమాలోదట ఈ పాట. ఈ వారం తప్పకుండా ఈ సినిమా చూడాలి అనుకుంటున్నా. యూట్యూబ్‌లో వెతుక్కోవాలి.


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***







మై జిందగీ కా సాథ్ - నిభాతా చలా గయా
హర్ ఫిక్‌ర్ కో ధుయే మే - ఉడాతా చలా గయా
హర్ ఫిక్‌ర్ కో ధుయే మే ఉడా... 

బర్‌బాదియోం కా సోగ్  - మనానా ఫుజూల్ థా
బర్‌బాదియోం కా సోగ్ - మనానా ఫుజూల్ థా
మనానా ఫుజూల్ థా
మనానా ఫుజూల్ థా
బర్‌బాదియోం కా జష్‌న్ - మనాతా చలా గయా
బర్‌బాదియోం కా జష్‌న్ - మనాతా చలా గయా
హర్ ఫిక్‌ర్ కో ధుయే మే ఉడా... 


జో మిల్ గయా - ఉసీ కో - ముకద్దర్ సమఝ్ లియా
జో మిల్ గయా - ఉసీ కో - ముకద్దర్ సమఝ్ లియా
ముకద్దర్ సమఝ్ లియా
ముకద్దర్ సమఝ్ లియా
జో ఖో గయా - మై ఉస్‌కో - భులాతా చలా గయా
జో ఖో గయా - మై ఉస్‌కో - భులాతా చలా గయా
హర్ ఫిక్‌ర్ కో ధుయే మే ఉడా... 


ఘమ్ ఔర్ ఖుషీ మే ఫర్క్ - న మెహ్‌సూస్ హో జహా
ఘమ్ ఔర్ ఖుషీ మే ఫర్క్ - న మెహ్‌సూస్ హో జహా
న మెహ్‌సూస్ హో జహా
న మెహ్‌సూస్ హో జహా
మై దిల్  కో - ఉస్ మకామ్ పే - లాతా చలా గయా
మై దిల్  కో - ఉస్ మకామ్ పే - లాతా చలా గయా

మై జిందగీ కా సాథ్ - నిభాతా చలా గయా
హర్ ఫిక్‌ర్ కో ధుయే మే - ఉడాతా చలా గయా


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    "భవేత్ - లలితమనోగత చింతనమతి తరళం... " అన్న నా మాట పదికాలాలపాటు పదిలంగా నిలబెట్టుకోవాలని నాకు నేనే చెప్పుకుంటూ...

~పాటల భైరవి