4, జూన్ 2016, శనివారం

WWW.వలదని-వారించినా-వదలని.NET


గణపవరం బళ్ళో రామశేషు మాస్టారు దిద్దించిన ఓనమాల అక్షరాభ్యాసంతో నా చదువు మొదలైతే ...

NAL (National Aerospace Laboratories) లో నా ప్రాజెక్ట్ గైడ్ అయిన S. కృష్ణన్ గారు వాళ్ళ అబ్బాయి K. శంకర్ కి ఈ-మెయిల్ ఇస్తూ వుంటే - కళ్ళు పెద్దవి చేసుకుని చూడడంతో - Web-అభ్యాసం చదువు పూర్తయేటప్పుడు జరిగింది.

[కృష్ణన్ గారు తన తండ్రిగారైన శంకర్ గారి పేరు వాళ్ళబ్బాయికి పెట్టుకోవడంతో - మా గురు-గురుపుత్రుల పేర్లు:
{శంకర్ కృష్ణన్; కృష్ణన్ శంకర్} - పలకడానికి పేర్ల-palindrome లా అనిపించేవి].

ఆ కృష్ణన్ గారే NAL కి కంప్యూటర్లు వచ్చిన కొత్తలో మెషీన్ లాక్ చేయడానికి Ctrl+Alt+Del కీస్ నొక్కాలి అంటే Ctrl, +, Alt, +, Del - మొత్తం ఐదు వేళ్ళూ మెలికలు పడేలా తిప్పినా ఆ కీ-కాంబినేషన్ ఎలా టైప్ చేయలేకపొయేవారో చెప్పి నవ్వుతూ, నవ్వించేవారు.

అలా ఆయన దగ్గర ప్రాజెక్ట్, దానితో పాటు చదువూ పూర్తయేటప్పటికి ఇంటర్నెట్ తో పరిచయం అయింది. 


టీవీ అంటే అసలు ఇష్టం లేని బదరి, నేను మా పెళ్ళయిన తర్వాత ఇష్టంగా కొనుక్కున్న మొదటి ఎలక్ట్రానిక్ డివైస్ - కలర్ మానిటర్ తో వున్న మల్టీ-మీడియా కంప్యూటర్.


ఈ-మెయిల్:


అద్గదీ - అలా మొదలయింది - మొదట ఒక హాట్ మెయిల్ అకౌంట్, తర్వాత అది వద్దనుకుని ఒక యాహూ అకౌంట్. అప్పటికే US లో వున్న స్నేహితులకి  ఈ-మెయిల్ పంపడం, బదులు కోసం ఎదురు చూడడం - అదో సరదా. అలా అని చెప్పి మెయిళ్ళ మీద మెయిళ్ళు ఇచ్చేసుకున్నట్టు గుర్తేమీ లేదు.

 
ఏదో - అప్పుడప్పుడూ అవసరార్థమో, ప్రియ నేస్తంతో కబుర్లు చెప్పడానికో - ఈ-మెయిల్ వీలుగా వుండేది. 

ఉద్యోగంలో చేరిన తరువాత రోజువారీ ఆఫీస్ వ్యవహారాలకి అవుట్ లుక్, ఆఫీస్ IM (instant messenger app) వాడడం తప్ప - ఇంక కావాలని కల్పించుకుని ఇంటర్నెట్ వాడిన గుర్తు లేదు. 

DSL ఇంకా రాకుండా డయల్-అప్ వున్న రోజుల్లో ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడుతూ - మొన్న ఫోన్ చేస్తే మీరు దొరకలేదండీ - అంటే అటు నుంచి సమాధానం - "నెట్టు మీదున్నానండీ", అనో , "ఆ టైం లో నెట్టెక్కానండీ", అనో - వస్తే ఆ నెట్టు-బడి (నెట్టు అనే పలుకుబడి) ఒక చిరునవ్వు మొలిపించేది. 
 
యాహూ గ్రూప్:
 
మా మొదటి బుజ్జి-జింక పుట్టినదాదిగా -  మా రెండో బుజ్జి-జింక కిండర్ గార్టెన్ లో చేరేదాకా  వాళ్ళతో గడిపిన ఆట-పాటల ఇంద్రజాలం తప్ప ఇంకో దృష్టి వుండేదే కాదు. కాకపోతే  యూనివర్సిటీలో కలిసి చదువుకున్న స్నేహితురాళ్ళతో ఒక యాహూ గ్రూప్ మొదలు పెట్టి ప్రతీ వారం కాకపోయినా అప్పుడప్పుడూ పండగలకీ, పుట్టిన రోజులకీ, పెళ్లి రోజులకీ అభినందనలు పంపడం, మా బుజ్జి-జింకల కబుర్లు చెప్పడం లాంటివి చేసేదాన్ని

బుజ్జి-జింకలు కొంచెం పెరిగారు - వాళ్ళిద్దరూ తమ తమ హోం వర్కులు అమ్మ సాయం లేకుండా చేయగలమూ - అని చెప్పేశారు. నాకింక బోల్డంత ఖాళీ వచ్చేసింది.

ఈలోగా లింక్డ్-ఇన్ లో దొరికిన ఒక బాల్య స్నేహితుడు + అతని చెల్లెలు సహాయంతో నా హైస్కూల్ స్నేహితుల ఫోన్ నంబర్లు దొరికాయి. వెంటనే ఉత్సాహం గా వాళ్ళందరితో మాట్లాడేసి ఇంకో యాహూ గ్రూప్ ని మొదలుపెట్టాను. 

అప్పటికీ మా లెక్కల మాస్టారి అబ్బాయి అయిన నాగసాయి అడగనే అడిగాడు - "అందరూ ఫేస్ బుక్ లో వుంటే నువ్వింకా యాహూ గ్రూప్ దగ్గరే వున్నావేంటి, లలితా?", - అని. 

తను అలా అడగ్గానే హఠాత్తుగా నాకు - స్వర్ణ కమలం సినిమాలో - పక్కనే కార్లు స్పీడ్ గా వెళ్లిపోతుంటే కూచిపూడి నాట్యం డ్రెస్ వేసుకుని ఒంటెద్దు బండి ఎక్కి వెళ్తున్నట్లు ఊహించుకునే హీరోయిన్ లా అనిపించాయి - నేనూ , నా యాహూ గ్రూప్. 

అయినా నేను మారలేదు - నా నెట్సంప్రదాయం మార్చుకోలేదు. 

ఫేస్ బుక్:

అప్పటికే చాలామంది కజిన్స్, ఫ్రెండ్స్ ఫేస్ బుక్ లో వుండడం వల్ల నేనెప్పుడయినా లేటెస్ట్ ఫోటోలు పంపించమంటే - ఫేస్ బుక్ అకౌంట్ లేదా - అని అడిగేవారు. "నాకు ఫేస్ వుంది కాని ఫేస్ బుక్ లేదు",  అని చెప్పి మాట మార్చేసేదాన్ని. 

చాలా రోజులు - అలా వద్దులే - అనుకుని దూరంగా వున్న నేను - చివరికి కిందటి ఏడాది ఫేస్ బుక్ - ప్రవేశం చేశాను. ప్రియ నేస్తం అపర్ణ బోల్డు మురిసిపోయి - ఒక ఫోటో కూడా పెట్టు - అంటే అదీ పెట్టాను.  ఆరంభ-శూరత్వంగా, ప్రారంభ-ఉత్సాహంతో ఎడా-పెడా ఫ్రెండ్స్ రిక్వెస్టులు పంపించీ-పొందీ నేనూ ఒక ఫేస్-బుక్కిణి అయిపోయాను అని మురిశాను. 

ఇంతకీ మొదలు పెట్టానే కానీ - ఒక నెలా, రెండు నెలల దాకా లాగిన్ అవడం కుదరలేదు. ఒకరోజు అనుకోకుండా సుహాస్ కాలేజ్ ఈవెంట్ వీడియో ఏదో చూద్దామని లాగిన్ అయితే బోల్డన్ని మెసేజులు - ఫలానా వారికి ఇది చదివారు అని ఒక వ్యాసం లింకు, వారెవరో ఇది చూశారు అని ఇంకో వీడియో లింకు - అలా లింకుల మీద లింకులు వున్నాయి. 

అప్పుడే ఈ ఫేస్-బుక్ ఏదో - ప్రపంచం తో నా లింకు - తెంపేసేలాగే వుంది అనిపించింది. అకౌంట్ క్లోజ్ చేసేద్దామా అనుకుని - మళ్ళీ సుహాస్ కాలేజ్ ఏక్టివిటీస్ తెలుస్తాయి కదా - అని అలాగే వదిలేసి వుంచాను. 

ఇంతలో ఒకరోజు ఆఫీస్ లో ఉద్యోగధర్మంలో భాగంగా ఒక డెవలపర్ కి బిజినెస్ లాజిక్ వివరించి ఫోన్ పెట్టేయబోతుంటే ... "లలితా! మీరు నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఏక్సెప్ట్ చేయలేదు ఎందుకని?", అన్న ప్రశ్న వినిపించింది - గొంతులో కొంచెం కినుకతో . 

ఒక్క నిముషం ఏం చెప్పాలో అర్థం కాలేదు - వున్న ఫ్రెండ్స్ తో మాట్లాడడానికే టైం లేదు - ఈ కొత్త ఫ్రెండ్ షిప్ ని ఎలా మేనేజ్ చేయాలో తెలీలేదు - అందుకే - "ఈ సారి లాగిన్ అయినప్పుడు చూస్తానండీ", అని చెప్పి ఫోన్ పెట్టేశాను. 

వెంటనే ఫేస్-బుక్ కి లాగిన్ అయి నా అకౌంట్ డి-ఏక్టివేట్ చేసేశాను - ఎందుకంటే - ఊరుకున్నంత ఉత్తమం - ఫేస్-బుక్ అకౌంట్ లేనంత సుఖం - లేవనిపించి :). 

ఆ విధంగా - తుమ్మితే వూడే ముక్కు లాంటి - క్లిక్కితే హేంగ్ అయ్యే లింకు - నా ఫేస్-బుక్ ముచ్చట అయ్యింది.

వాట్సాప్:

యాహూ గ్రూప్ మొదలు పెట్టిన రోజుల్లో ఇంకో బాల్య స్నేహితుడు శేషు తన ఫామిలీ ఫోటోలు పంపిద్దామని అడిగాడు - "లలితా! వాట్సాప్ ఉందా?"   అని - 2012 లో - అదే మొదటిసారి వాట్సాప్ గురించి వినడం. 

అంత వెంటనే అవసరం కనిపించకపోయినా - తరవాత ఇండియాలో, దేశ దేశాల్లో వున్నఫ్రెండ్స్ + కజిన్స్ తో వీలయినప్పుడు చాట్ చేయడానికి వీలుగా వుంటుందని ఫోన్ లో వాట్సాప్ ఇన్ స్టాల్ చేసుకున్నాను. అక్కడితో ఆగక ఒక రెండు గ్రూపులు క్రియేట్ చేసి, ఇంకో రెండు గ్రూపుల్లో మెంబర్ ని అయ్యాను. 

ఇంక తమాషా మొదలు. 

పొద్దున్నే లేచినప్పుడు చదువుకో అని నాన్నమ్మ చిన్నప్పుడు నేర్పిన "కరాగ్రే వసతే  లక్ష్మీ ..." అనే శ్లోకం ఎప్పుడో "కరాగ్రే వసతే దూరవాణీ..." అయిపోయింది.
 
శుభోదయాలతో ఇండియాలో రోజు మొదలవుతూ వుండే టైంకి నా శుభ-రాత్రి వచ్చేసి వుంటుంది. ఎలా బదులివ్వాలో తెలీని శుభ-నిశ్శబ్దం నాది. 

వాట్సాప్ గ్రూపుల్లో రోజూ ఎవరిదో ఒకరిది పుట్టిన రోజో, పెళ్లి రోజో వుంటుంది. నా నక్షత్రాలు బావున్న రోజు నేను చూసేటప్పటికి ఒకటో, రెండో మేసేజులు మాత్రమే అయి వుంటే - చూడగానే అది ఎవరిదో గుర్తు పట్టి నేనూ అభినందనలు తెల్పుతాను. ఒక్కోసారి చూడడం ఆలశ్యం అయితే ఇంకెన్నో రకరకాల సంభాషణలు అయిపోయి వుంటాయి. ఇంకప్పుడు విషెస్ చెప్పడం అంటే - అయిపోయిన పండగకి హడావిడి ఎందుకని వూరుకుంటాను.

గ్రూప్ లో బోల్డు మంది వుంటారు - వాళ్ళు మన ఫోన్ కాంటాక్ట్స్ లిస్టు లో వున్నారా లేరా అనేదాన్ని బట్టి - బాగా తెలిసినవారు, కొంచెమే తెలిసినవారు, తెలుసేమో అనిపించేవారు, తెలీదేమో అనుకునేవారు, అసలు తెలియని వారూ - కూడా వుంటారు. 

అలాంటప్పుడు ఎవరినైనా వారి ఫోన్ నంబర్ బట్టి గుర్తు పట్టలేనప్పుడు - ఏదైనా సంభాషణ జరుగుతూ వుంటే అందులో పాల్గొనాలంటే - అదేదో చిన్నప్పుడు స్కూల్ లో అందరూ జిందాబాద్ అంటూ వుంటే ఎందుకంటున్నారో తెలీకపోయినా నేనూ చెయ్యెత్తి గట్టిగా జై - అని అరిచిన రోజులు గుర్తుకొచ్చి - ఆగిపోతూ వుంటాను. 

ఇవన్నీ ఒక ఎత్తు - పండగలొచ్చినప్పుడు నాక్కలిగే కన్ఫ్యూజన్ ఏ కలలోనూ-ఈ కలిలోనూ ఎవరికీ వుండదేమో!?.

పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా శివరాత్రికి కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటారని తెలిసింది. 

Wish you a very Happy Sivarathri అన్న మెసేజ్ చూడగానే ఆశ్చర్యానుమానాలోచనానందాలు కలిగిన వైనమెలాగా అంటే ..... 

  • ముందు ఆశ్చర్యం
  • తర్వాత సరిగ్గా చదవలేదేమో అన్న అనుమానం - 
  • శివరాత్రికి శుభాకాంక్షలేంటబ్బా అన్న ఆలోచన - 
  • పోన్లే - ఉపవాసం చేసేవారికి ఓపిక రావడానికి తప్పకుండా ఇలాంటివి వుండాలని ఇప్పటికైనా గుర్తించారు అనే ఒక ఆనందం... 
- ఇన్ని అనుభూతులు ఏకకాలంలో కలిగించిన వాట్సాప్ కి జయహో !

ఇండియా లో వున్నప్పుడు - ఫాల్గుణ పౌర్ణమి రోజు - హోలీ జరుపుకున్నట్టు ఏ గుర్తూ లేదు. ఈ ఏడాది వాట్సాప్ పుణ్యమా అని మళ్ళీ హోలీ గురించి తలుచుకునే అవకాశం కలిగింది. ఆరోజు బోల్డన్ని హోలీ శుభాకాంక్షలు - తిరుగు శుభాకాంక్షలు చదివేసరికి నా తికమక-మతికి వున్న కొంచెం మతీ పోయినట్టయ్యింది.

అసలే రకరకాల టైం-జోన్లలో వుండే టీములతో పని చేస్తూ వుండడం, ఇండియా కన్నా టైంలో "వెనక" బడి వుండడంతో ఒక్కోసారి పండగలు వెనకా-ముందూ చేసేస్తూ వుంటాను.

తొందర పడి ఒక కోయిలా ... ముందే కూసింది - అన్నట్లు ఈసారి దుర్ముఖి నామ ఉగాది అలాగే ఒకరోజు ముందు చేసేశాను.

అదెలా అంటే....

హోలీ అయిపోయిన మరుసటి రోజు - గ్రూప్ లో జరుగుతున్న సాధారణ సంభాషణలు చదివి "ఎంత విడ్డూరం! మన తెలుగు వాళ్ళు ఎంత పాడయిపోతున్నారు - ఉత్తర భారతం లో చేసుకునే హోలీ కి విషెస్ చెప్పుకున్నారు - మన ఉగాదికి అసలు ఉలుకూ-పలుకూ లేదు...ప్చ్ -ప్చ్ ", అని తెగ నాలో నేనే బాధపడిపోయాను.

ఇంకా నయం - అలా అని నా అంతట నేనే వెళ్లి ఉగాది శుభాకాంక్షలు చెప్పెయ్యలేదు. మధ్యాహ్నమయ్యేటప్పటికి తట్టింది - ఉగాది వచ్చేది అమావాస్య తర్వాత పాడ్యమికి అని.

మా అమ్మ అనే - చదవేస్తే (అదీ - వాట్సాప్ చాట్ ) వున్న మతి పోవడం - అంటే ఏంటో తెలిసొచ్చింది.
 

ఇదే మాట చెప్తూ నవ్వుకుంటూ ఉగాది ఎప్పుడా అని అడిగితే మా తులసి చెప్పింది - ఏప్రిల్ 8, శుక్రవారం అని. ఈసారి తప్పకుండా గుర్తు పెట్టుకుని నేనే గ్రూప్ లో ముందు చెప్పెయ్యాలి అని తెగ అనేసుకున్నాను

ఇంతలో గురువారం (ఏప్రిల్ 7) వీడియో కాన్ఫరెన్స్ కి ఆఫీస్ కి వెళ్ళాల్సి వచ్చింది.  

నాలాంటి తికమక-మతులుంటారని ఊహకైనా అందని వాట్సాప్ గ్రూపోత్సాహులు కొంతమంది - ముందుగానే అడ్వాన్స్-శుభకామనలు పంపించడం మొదలుపెట్టారు

ఇంకేముంది నాలోని కన్ఫ్యూషిస్ జీన్ ఆక్టివ్ గా పని చేసేసింది - గురువారం నాలుగింటికి లేచి - ఇంటి ముందు వణుక్కుంటూ ముగ్గేసేసి - తలంటేసుకుని - దేవుళ్ళని హడావిడిగా లేపేసి - దీపం పెట్టేసి - మామిడికాయ పులిహార చేసేసి - మా ఆయనకి దండమెట్టేసి - హమ్మయ్య - ఉగాది చేసేశాను అనేసుకుని ఆఫీస్ కి వెళ్లి వచ్చాను

సాయంత్రం తులసికి బిలేటెడ్ ఉగాది విషెస్ చెబ్దామని ఇండియా ఫోన్ చేస్తే - "వదినా! ఇప్పుడే ఉగాది పచ్చడి తిన్నాం", - అని చెప్తే - "అదేంటి? ఇండియా లో నిన్నే అయిపొయింది కదా?" - అనడిగాను. "నిన్నేంటి - ఇవాశుక్రవారం - ఇవాళే కదా ఉగాది ?!", అంది తను

ఇంకంతే - వాట్సాప్ గ్రూప్ లో అందరికన్నా ముందుగా కాదు కదా వెనుకగా కూడా విషెస్  చెప్పాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తున్నాను ఇప్పుడు - దాంతో ఏమీ చెప్పకుండానే పండగలు వస్తున్నాయి - వెళ్తున్నాయి

వాట్సాప్ లో నాది గప్-చుప్ గ్రూప్ :)

బ్లాగ్: 

ఇంక నా బ్లాగింగ్ గురించి చెప్పాలంటే ఇంతకింతా రాయాల్సి వుంటుంది అందుకని అదింకోసారి

అలా - ఈ-మెయిల్ తో మొదలుపెట్టి బ్లాగ్ దాకా "వద్దు-వద్దు" అనుకుంటూనే సాగిన నా ఇంటర్నెట్ ప్రయాణం గురించి చెప్పాలంటే ... 

వర్ల్డ్ వైడ్ వెబ్ (WWW) లోని మూడు W లకూ నేనిచ్చుకున్న కొత్త నిర్వచనం - 

  • W = వలదని (వద్దు అని)
  • W = వారించినా (నాకు నేనే వారించుకున్నా)
  • W = వదలని (వదిలించుకోలేని)
 నెట్ .... 

వెరసి - WWW.వలదని-వారించినా-వదలని.NET :)





22 కామెంట్‌లు:

  1. Nice www. Net .... Saturday syantram pustakani ki badulu ee kabrulu chala bagunnayi.... Kottha slokam gurthuku bachindi karagre vasate watsaap.... Mee bolodanni kaburlu blog mi matarm vadalanu :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శారదా! నువ్వు చదివే బుక్ కన్నా నా కబుర్లు బావున్నాయి అన్నావు చూడు - అది పెద్ద రివార్ద్ నాకు.

      ఆ కొత్త శ్లోకం నాకు తెలియదు కానీ - రోజూ పొద్దున్నే నిద్ర మత్తులో అలార్మ్ ఆపేస్తూ మొదటగా చూసేది ఫోనే అయిపోతోంది - ఎంత వద్దనుకున్నా :( అందుకే అది "కరాగ్రే వసతే దూరవాణీ ..." అయింది నా వరకూ.

      తొలగించండి

  2. లలిత గారు,

    బాగు బాగు ! పయానం :)


    నేర్చెను "నేల" న నెట్టున్ !
    కూర్చెను మెయిలున్ జిలేబి కొంచెం! యాహూ
    చర్చలు ! వాట్సప్ జయహో
    అర్చించెను ఫేస్బుకులను బ్లాగుల లలితా !

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు,

      NAL ని మీ పద్యంలో "నేల" గా పొదిగిన తీరు అమోఘం :) మీ పద్య వ్యాఖ్యకి ధన్యవాదాలు!

      తొలగించండి
  3. "శివరాత్రికి శుభాకాంక్షలేంటబ్బా" - same feeling.

    చదువుతుంటే నవ్వాపుకోలేకపోయాను.

    శ్రవణ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రవణ్ గారు,

      :)

      వీలు చేసుకుని చదివి కమెంట్ పెట్టినందుకు థాంక్స్!

      తొలగించండి
  4. Happy Good Friday అన్న జనాలూ ఉన్నారు. ఇక శివరాత్రి శుభాకాంక్షలు చెప్పారంటే పెద్ద ఆశ్చర్యం కాదు కదా :( 🙁.
    మీ నెట్‌వైరాగ్యం సబబే :) 🙂.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావు గారు,

      మీరన్న "నెట్ వైరాగ్యం" ప్రయోగం బావుంది. వీలు చేసుకుని చదివి కమెంట్ పెట్టినందుకు థాంక్స్!

      తొలగించండి
  5. హహ కబుర్లు, www కి మీ కొత్త నిర్వచనం కూడా బాగున్నాయండీ :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేణూ శ్రీకాంత్ గారు,

      నా www నిర్వచనం మీరు మెచ్చినందుకు - థాంక్ యూ :) నాకు కొత్త కొత్త నిర్వచనాలు / పదాలు coin చేసుకోవడం ఇష్టం

      తొలగించండి
  6. బాగుంది వినీల net లోకి నీ ప్రయాణం... ఈ ఏడాది
    నీ ఉగాది confusion నాకు గుర్తే ☺

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అపర్ణే,

      కదా...! ఇప్పటికీ నవ్వుకుంటూ వుంటాను - ఆ "న-ఉగాది" కి నేను పడిన హడావిడి తలుచుకుని :))

      తొలగించండి
  7. 'కాదేదీ శుభాకాంక్షలకనర్హం' ఈ 'నెట్' ఇంట్లో, కదా!
    బాగున్నాయి లలితా! నీ 'నెట్టింటి' కష్టాలు :)
    'ఇంటి ముందు వణుక్కుంటూ ముగ్గేసి'. భలే నవ్వానిక్కడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నువ్వన్న "నెట్టిల్లు" కూడా నచ్చేసింది. ఇవాళేంటో బోల్డన్ని "నెట్టు" పదాలు - బాగు, బాగు !

      వణుక్కుంటూ - అవును మరి - గీతల ముగ్గు కూడా మెలికలు తిరిగి వయ్యారాలు పోయింది నా "న-ఉగాది" కి.
      అలా ఎందుకంటే - మాకు మొన్న మొన్నటి వరకూ చలి చాలా ఎక్కువగా వుంది. ఇప్పుడిప్పుడే కొంచెం వెచ్చబడుతోంది.

      తొలగించండి
    2. 'నెట్టిల్లు' మదీయ స్వీయ పద ప్రయోగము కాదు సుమీ! :)
      ఎక్కడో చదివిన గుర్తు.

      తొలగించండి
    3. నీది కాని దాన్ని - మాటైనా సరే - సరదాకైనా own చేసుకోవడానికి ఒప్పుకోని నీ honesty కి చప్పట్లు!!!

      తొలగించండి
  8. "తెలుగు తూలిక" మాలతి గారు తన కధల్లో "నసాంకేతికం" అని తనదైన పదం వాడుతుంటారు. అలాగ మీరు "న-ఉగాది" అనే మాట తయారుచేసారా? interesting 🙂

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా "న-ఉగాది" మిమ్మల్ని మళ్ళీ నా బ్లాగ్ కి రప్పించింది - చాలా సంతోషం :) మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  9. 90ల మధ్యలో ఒక మేగజైన్‍లో చదివిన సంగతి. అప్పుడు నేనూ యూ.ఎస్. వాసుణ్ణి లెండి, అది వేరే సంగతి. అప్పట్లో 56కెబీపియస్ మోడెమ్ రోజులు కదా, ఇంకా చాలా మంది దగ్గర 28కెబీపియస్ మోడెమ్ వ్యవహారమే. సైట్లన్నీ బాగా స్లో కూడా. అందుకే నేమో ఆ మేగజైన్ అందీ, WWW అంటే World Wide Wait అని!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్తే! నా బ్లాగ్ కి సుస్వాగతం ! మీరు పంచుకున్నWorld Wide Wait విషయం నాకు తెలియనిది - బావుందండీ! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు!!

      తొలగించండి
  10. W..w ..w నీ నిర్వచనం భలే ! ఎవరైనా డిప్రెషన్ లో ఉంటే కాసేపు నీ బ్లొగ్ లో విషయాలు చదివించి మామూలు మనుషుల్ని చెయ్యొచ్చు. నువ్వు అక్షరాలతో చూ మంతర్ చేస్తున్నావ్......రోజూ ఆఫీస్ పని మద్యలో నా చూపు బోల్డన్ని కబుర్లూ పై వెంటనే చిన్న చిరునవ్వు నా పెదవులపై !!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా బ్లాగ్ నీకంత నచ్చినందుకూ, అది మళ్ళీ వచ్చి నాకు చెప్తున్నందుకూ నీకు చాలా చాలా థాంక్స్ - హనుమాన్ !

      తొలగించండి