30, డిసెంబర్ 2016, శుక్రవారం

ఇండియాలో ... అమెరికాలో ...

మళ్లీ సెలవులొచ్చాయి ఈసారి
ఇంటిల్లిపాదికీ కలిసొచ్చేలా - ఒకేసారి
కబుర్లతో పెరిగిన కాలక్షేపాలు
హాస్యాలలో దొరికిన నవ్వుల నిక్షేపాలు
ఇష్టపడిన కష్టాలు - కష్టపెట్టిన ఇష్టాలు
అవేంటంటే - మేం చూసిన సినిమాలు
సూర్యుణ్ణి దాగుడుమూతలాటలో కళ్లు మూసి 
ముసురుకున్న మంచు మబ్బులు 
చలి చలి మధ్యాహ్నాలలో సోఫాల్లో
ముడుచుకున్న బుజ్జిజింకలు
Wimpy kid డైరీలు చదువుతూ
మురుసుకున్న పిల్లల బుగ్గలు
నేల మీదికి దిగిన నక్షత్రాలు
ఊరంతా కట్టిన తారా-తోరణాలు
పాత ఏడాదితో  నెమరేసుకుంటున్న కలవరింపులు
కొత్త ఏడాదికై  వల్లె వేసుకుంటున్న పలకరింపులు

మరి ఇంటా - బయటా
ఇంత సందడీ - హడావిడీ
మెండుగా - పండగలా -
వున్నప్పుడు బోల్డన్ని కబుర్లొస్తాయి  కదా!

అలాంటి కబుర్ల వేళ బదరి విసిరిన హాస్య గుళికల (ఉదా: తోమాలి - తోటమాలి; బీదవాళ్ల health care) ఒడిసిపట్టి - వాటికి ఇంకొన్ని జోడించి - సాగదీసి పుట్టించిన - సరదా పట్టిక - ఈ  ఇండియాలో ... అమెరికాలో ...


ఇండియాలో ... 
ఇంటి పేరు ముందు, అసలు పేరు తర్వాత 
అమెరికాలో ...
అసలు పేరు ముందు, ఇంటి పేరు తర్వాత

ఇండియాలో ... 
అడగకపోయినా సలహాలు ఇవ్వడానికి ఆలోచించరు
అమెరికాలో ... 
అడిగితేనే ఆలోచించి సలహా ఇస్తారు

ఇండియాలో ... 
ఆముష్మిక లోకపు మోక్షాలకై  ప్రవచనాలు 
అమెరికాలో ... 
ఐహిక ప్రపంచపు సుఖాలకై ప్రయోగాలు


ఇండియాలో... 
బ్యాంక్ కి వెళ్తే మన డబ్బులు వాళ్ల దగ్గరుంచుకుని కూడా మనల్ని కష్టమర్ లా చూస్తారు
అమెరికాలో... 
బ్యాంక్ కి వెళ్తే మన డబ్బులు వాళ్ల దగ్గర దాచుకున్న కస్టమర్ లా చూస్తారు


ఇండియాలో... 
పెళ్లికి బోల్డుమందిని పిలుస్తారు - దగ్గరగా వచ్చి తమ సంపద, వైభవం చూస్తారని
అమెరికాలో... 
పెళ్లికి కొంతమంది దగ్గరవారినే పిలుస్తారు - ఎక్కువమంది వస్తే తమ సంపద తగ్గుతుందని
  
ఇండియాలో... 
పెళ్లికి బహుమతులు ఏమొస్తాయో ఊహించలేరు (పది కుక్కర్లు, పదహారు గడియారాలు, ఇరవై టేబుల్ లాంపులతో ఎంచక్కా ఓ చిన్న ఫర్నిచర్ షాప్ పెట్టుకోవచ్చు)
అమెరికాలో... 
పెళ్లికి బహుమతులు ఊహకొదలరు (gift registry వుంటుంది)
  
ఇండియాలో 
రంగు తక్కువగా వున్నవారు తెల్లబడడానికి బ్యూటీ పార్లర్ కి వెళ్లాలనుకుంటారు
అమెరికాలో 
తెల్లగా వున్నవారు తెల్లరంగు తగ్గడానికి టానింగ్ సెంటర్ కి వెళ్లాలనుకుంటారు

ఇండియాలో ... 
పదేళ్లుగా తెలిసినవారైనా కావాలనుకుంటే పలకరించుకుండా - చూసీ చూడనట్టు పక్కనుంచి తప్పుకు వెళ్లగలరు
అమెరికాలో ...
పదేళ్లుగా "హాయ్" చెప్తున్న వారి పేరు తెలీకుండా వుండడానికి కూడా అవకాశం వుంది

ఇండియాలో ... 
కారుంటే మామూలు పోలీసు అయుండడు (ఏ సీనియర్ అధికారో అయితే తప్ప)
అమెరికాలో ... 
మామూలు పోలీసులకి కార్లుంటాయి

ఇండియాలో ... 
ఎంత సాధించినా మెచ్చుకోవడానికి కొంచెమైనా ఆలోచిస్తారు
అమెరికాలో ...
సాధించినది కొంతైనా ఆలోచించకుండా ఎంతో పొగిడేస్తారు


ఇండియాలో ... 
భార్య  అంటే స్త్రీ, భర్త అంటే పురుషుడు
అమెరికాలో ...
భార్య - భర్త :: { స్త్రీ - పురుషుడు;  స్త్రీ - స్త్రీ ;  పురుషుడు - పురుషుడు}

ఇండియాలో ...
బయట తిరిగి ఇంటికి రాగానే ముందు కాళ్లు కడుక్కుంటారు
అమెరికాలో ...
బయట తిరిగి ఇంటికి రాగానే ముందు చేతులు కడుక్కుంటారు

ఇండియాలో ... 
మామూలు మనుష్యులు హోటల్లో  దోసెలు, ఇడ్లీలు తింటారు 
అమెరికాలో ...
మామూలు మనుష్యులు Mc Donalds లో బర్గర్లు తింటారు

ఇండియాలో ... 
డబ్బులున్నవారు Mc Donalds లో బర్గర్లు తింటారు 
అమెరికాలో ...
డబ్బులున్నవారు  Indian Cuisine Restaurant లో  దోసెలు, ఇడ్లీలు తింటారు

ఇండియాలో ...
డబ్బుల్లేక మితాహారం తీసుకున్నవారు సన్నగా వుంటారు
అమెరికాలో ...
డబ్బుల్లేక (అ)మితాహారం (Mc D burgers) తీసుకున్నవారు లావుగా వుంటారు

ఇండియాలో ... 
తిన్నది అరిగేదాకా నడవక తప్పదు ఒక్కోసారి (ఆటోలు, రిక్షాలు దొరక్క)
అమెరికాలో ...
తిన్నదరగడానికి నడవక తప్పదు చాలాసార్లు


ఇండియాలో ... 
బీదవాళ్లకి వాడుకోవడానికి హెల్త్ కేర్ ఉండదు
అమెరికాలో... 
హెల్త్ కేర్ వాడుకున్నవాళ్లు బీదవాళ్లవుతారు

ఇండియాలో ...
పెళ్లి చేసుకుని - ఇల్లు చూసుకున్నమగవారు ఇలా వుండడానికి అవకాశం వుంది - ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య
అమెరికాలో ... 
పెళ్లి చేసుకుని - ఇల్లు చూసుకున్నమగవారు ఇలా మాత్రమే వుండడానికి అవకాశం వుంది - ఇంట తోమాలి - బయట తోటమాలి 


ఇండియాలో... 
దెబ్బ తగిలితే వేడి కాపడాలు
అమెరికాలో... 
దెబ్బ తగిలితే చల్ల-తాపడాలు (ice pack)

ఇండియాలో... 
On-site పనిచేయడానికి ఉత్సాహం
అమెరికాలో... 
పనిని off-shore లో చేయించడానికి ప్రోత్సాహం

ఇండియాలో... 
నా అనుకునే ఆత్మీయులు
అమెరికాలో... 
నమ్మి ఆత్మీయత పంచినవారు 

ఇండియాలో... 
సంక్రమించిన విలువైన వారసత్వం
అమెరికాలో... 
సంప్రాప్తించిన పదిలమైన పౌరసత్వం

ఇందులో రాసినవి -
రాసేటప్పటికి ఆనిపించినవి -
రాసే ముందురోజు కళ్లకి కనిపించినవీ - తప్ప -
తెగ ఆలోచించి వాలూ - వరసా వుండేలా రాసినవి కావు.

ఒక విషయం నుంచి ఇంకోదానికి గెంతుతూ
చిన్నప్పుడెప్పుడో ఆడిన కోతి-కొమ్మచ్చి ఆనవాలుతో
రాసుకున్న ఇంకో(తి)-రకం-కొమ్మచ్చి ఇది.




17 కామెంట్‌లు:

  1. బాగుంది బాగుంది. ఇలాంటివి మరికొన్ని ఇంకా మీకు స్ఫురించే ఉంటాయి. అవికూడా వ్రాయండి తప్పకుండా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం గారు: నా ఈ ఆషామాషీ బ్లాగ్ చదివినందుకు, వ్యాఖ్య వుంచినందుకు బోల్డన్ని ధన్యవాదాలండి.

      తొలగించండి
  2. తాము దారి తప్పినా మరొకరు దారి తప్పకుండేందుకు సలహా ఇవ్వడం భారతదేశపు అలవాటు ( ఇండియా కాదు)
    తమరు దారితప్పి మరొకర్ని దారి తప్పించటం అమెరికా దేశపు అలవాటు :)

    భారతదేశం లో పేదవానికి పెళ్ళామే భార్య...
    ( Take it easy)

    ఆంగ్ల నూతన వత్సర శుభకామనలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారు: మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీకు కూడా నూతన సంవత్సర శుభకామనలు.

      తొలగించండి
  3. నాకు కొన్ని స్ఫురించాయి ��

    ఇండియాలో...
    తమ ఇంటి చెత్త పక్కింటి గోడ దగ్గర వేస్తారు.
    అమెరికాలో ...
    మూట కట్టుంచి చెత్తట్రక్ కి ఇస్తారు.

    ఇండియాలో...
    విమానంలోంచి తోసుకుంటూ దిగుతారు.
    అమెరికాలో ...
    సీట్ నంబర్ వరసలో దిగుతారు.

    ఇండియాలో...
    కౌంటర్ దగ్గర ఎంత తక్కువ మంది ఉన్నా గుంపు లాగా నిలబడతారు.
    అమెరికాలో ...
    ఇద్దరే ఉన్నా క్యూ కడతారు.

    ఇండియాలో...
    కిలోమీటర్లంటారు.
    అమెరికాలో ...
    మైళ్ళు అంటారు (ఇప్పటికీ).

    ఇండియాలో ...
    కిలోలు అంటారు.
    అమెరికాలో ...
    పౌండ్లు అంటారు (అవును ఇప్పటికీ).

    ఇండియాలో ...
    కరెంట్ స్విచ్చ్ ఆన్ చెయ్యడానికి పైనుంచి కిందకి వేస్తారు.
    అమెరికాలో ...
    కింద నుంచి పైకి వేస్తారు ��.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావు గారు: నా సరదా-పట్టికకి మీ పొడిగింపు బహు బాగు! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  4. లలితా!
    భలే ఉన్నాయిగా నీ compiled observations.

    ఇంట తోమాలి! బయట తోటమాలి! ;-)
    నాకు తోచిన ఇంకో రెండు చెప్పనా?

    ఇండియా లో ముందు తేదీ, తరువాత నెల ( తేదీ రాసే పధ్ధతి లో)
    అమెరికా లో ముందు నెల, తరువాత తేదీ.


    ఇండియా లో 'క్యూ' బోర్డ్ ఉన్నా ఎవరూ పట్టించుకోరు.
    అమెరికా లో 'క్యూ' బోర్డ్ లేకున్నా క్యూ లోనే నించుంటారు.

    ఇంక అసలు విషయానికి వస్తే....
    కోతి కొమ్మచ్చి! ఇంకో(తి) రకం కొమ్మచ్చి.
    పదాలతో ఆడుకుంటావు గా నువ్వు!
    పద్యాలు, కవితలు, ఆటలు, పాటలు, parodyలు, Variety topics, variety presentation లతో నీ బ్లాగు కళకళలాడుతుంటుంది.
    అసలు నిజం చెప్పాలంటే Versatility కి చిరునామా నీ బ్లాగు.
    పేరుకు తగ్గట్లే వారం వారం బోల్డన్ని కబుర్లు చెప్తూ బ్లాగులకు నిజమైన కళ తెచ్చావు.
    Wishing that the new year brings you many more happy, funny and interesting moments and that you will continue to enthrall us all with your posts.
    Happy New Year Lalitha!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నువ్వే ఇలా నా వెంట వుండి రాయించి వుండకపోతే ఈ బోల్డన్ని కబుర్లు ఇంత బోలెడు అయేవి కావు, లక్ష్మీ! నీ ప్రోత్సాహమే నా ఉత్సాహం. Thanks a LOT for all your support. Happy New Year!

      తొలగించండి
    2. ఇది ఇంకా బావుంది! కష్టపడి వారం వారం షడ్రసోపేతమైన విందు భోజనం లాంటి పోస్టులు నువ్వు కష్టపడి రాసి, credit మాత్రం అంత generous గా చదివి enjoy చేసిన నాకు ఇచ్చేయడమా!

      విందు భోజనంలో అయినా పంటి కింద రాయి తగలొచ్చేమో కానీ, నీ రాతల్లో మట్టుకు ఓ 'పలుకురాయి' కూడా రాదు.
      Yours is a truly dignified blog by all means.

      తొలగించండి
  5. మీ ఇంకో(తి)-రకం-కొమ్మచ్చి బాగుందండి .

    రిప్లయితొలగించండి
  6. "పెళ్లి చేసుకుని - ఇల్లు చూసుకున్నమగవారు ఇలా మాత్రమే వుండడానికి అవకాశం వుంది - ఇంట తోమాలి - బయట తోటమాలి"

    హ్హ హ్హ .. ఇది భాలే నచ్చింది నాకు.
    ఇండియా - అమెరికాలు, తూర్పూ-పడమరలని వూరికే అన్నారూ!!
    --ప్రసాద్ చరసాల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చరసాల ప్రసాద్ గారు: "తోమాలి-తోటమాలి" - ఈ రెండు మాటలే నాచేత ఈ పోస్ట్ రాయించాయి - అవే మీకు నచ్చినందుకు నాకు భలే మంచిగా అనిపించింది. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి