ఇంతకీ పల్లవి వినే వచ్చారా మీరు? నా సంగీత పరస్థానం - పల్లవి
ఆపళంగా మాసంగీతం మాష్టారు మా ఇంటి దరిదాపులకి రాకుండా సుఖసంతోషాలతో జీవించదొడగారు.
సరే! ఆయన మానేసినా నాకు తప్పదు కదా - అసలే నాది పాడే నోరు, ఆడే కాలు -నా "సాధన" కొనసాగించాను.
అడవిరాముడు లోంచి - మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మా ... అన్న అరుపుతో మొదలు పెట్టి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు - అంటూ ఎస్పీబాలసుబ్రమణ్యం పాటతో కొనసాగించి - నాన్న పాడే - భలే మంచి రోజు పసందైన రోజు - వగైరా ఘంటసాల పాటలు నేర్చేసుకుని - అమ్మ పాడే - జయమంగళ గౌరీ దేవి దయచూడుము చల్లని తల్లీ - లాంటి భక్తి పాటలతో ఆగక - ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం - లాంటి సుశీల పాడిన క్రైస్తవ భక్తి గీతాలు - ఎంత హాయి ఎంత హాయి ఈనాడు మందహాస వదనముతో పలుకరించినాడు - అంటూ అనిల్ కుమార్ గారు కంజీర వాయిస్తూ పాడే ఘంటసాల గారు పాడిన సత్యసాయి భజనలు - ఒకటని కాదు అన్ని రకాల తెలుగు పాటలు - ఆడా-మగా గొంతులు తేడా చూడకుండా పాడేసేదాన్ని.
అది కూడా ఎవరైనా అడిగితేనే కాదు - ఎవరూ అడగకపోయినా - సాయంత్రం హోంవర్క్ అయిపోగానే కరణం గారి ఇంటి గేటుకి అటూ ఇటూ వుండే పిట్టగోడ మీద కూర్చుని పాడుకుంటూ ఉండేదాన్ని.
రోడ్డు మీద అటూ ఇటూ వెళ్తూ కనిపించే రాధాయో, చివుకుల రమణో, గొట్టిముక్కల సరోజినీనో పలకరించినా ఒక్క క్షణం వాళ్లకి సమాధానమిచ్చి మళ్లీ ఎక్కడైతే నా పాట ఆగిందో అక్కడ మొదలుపెట్టి పాడేసుకుంటూ ఉండేదాన్ని.
స్కూల్లో కూడా ఆగస్టు పదిహేను - స్వాతంత్ర్య దినోత్సవానికి, జనవరి 26 - రిపబ్లిక్ డేకి - మా మాస్టార్లకి నేనే పాటల స్టారు.
అవి కాక - దొంగా-పోలీసో, నేలా-బండానో ఆడుకుంటూ అన్ని ఇళ్లూ తిరిగేవేళ - నన్ను లోపలి పిలిచి - "లల్లీ - దా - ఓ పాట పాడు" - అని నాచేత తత్కాల-కచ్చేరీలు చేయించుకుని మురిసిపోయే అన్నపూర్ణమ్మ గారు, రాధాయ్ వాళ్లమ్మ గారైన సువర్చల గారు లాంటి - పక్కింటి అత్తయ్యగార్లు వుండనే వున్నారు.
ఇలా నా సంగీత ప్రభ దివ్యంగా వెలుగుతున్న రోజుల్లోనే ఒకసారి నాన్న కోసం ఎవరో ముగ్గురు నాన్నతో ఆఫీస్ లో పనిచేసేవాళ్లు ఇంటికి వచ్చారు. నాన్న అప్పుడు ఏదో పని మీద బయటికి వెళ్లారు.
మరి ఇంటికి వచ్చిన అతిథులని మన యధాశక్తి అలరించాలి కదా - అందుకని మా మేడ మీదనే వాళ్లకోసం ఎంపిక చేసిన పాటలతో కచ్చేరి - ఘనా ఘన సుందరా, నడిరేయి ఏ ఝాములో - అనుకుంటూ.
అసలే నాన్న ఆఫీసు వాళ్లు - అలాంటిలాంటి పాటలు పాడితే - "ఎబ్బే"అంటారు కదా - అందుకని భక్తిరసంలో ముంచి తేల్చాను. రెండు పాటలు పాడాను - ఇంక నా గొంతు పాడగా పాడగా రాగ మతిశయిల్లుతోంది - కొత్త కొత్త గమకాలు, సంగతులతో మూడు నిముషాల పాటని ఐదు నిముషాలు పాడేశాను.
మధ్యలో దగ్గొచ్చి మంచి నీళ్లు తాగుతున్న సమయంలో - నేను పాట ఆపినందుకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి వెళ్తూ వెళ్తూ - ఒకళ్లొక పావలా, ఇంకొకరు ఒక ఇత్తడి పదిపైసలు, ఇంకొకాయన ఇంకో పావలా "పిప్పర్మెంట్లు కొనుక్కోమ్మా" అంటూ నా చేతిలో పెట్టి వెళ్లారు. సాయంత్రం నాన్న ఇంటికి రాగానే నేను పాటలు "చదివిన" విశేషాలు - వాటికొచ్చిన చదివింపుల గురించి చెప్తే - నాన్న మెత్తగా కోప్పడి (గట్టిగా కోప్పడితే మళ్లీ ఏ ఏడుపు పాటో పాడేసి ఆయన్ని శోకరసంలో ముంచేస్తానని ముందు జాగ్రత్త) - అలా డబ్బులు తీసుకోకూడదు ఎవరిచ్చినా అన్చెప్పి అవి తీసేసుకున్నారు - మర్నాడు ఆఫీసుకి వెళ్లినప్పుడు తిరిగి ఇచ్చేశారు.
అలా మొదలయిన నా పాటల యాత్ర మా నాన్న బదిలీలతో ఒక ఊరి నుంచి ఇంకొక వూరికి మజిలీ మారుస్తూ వచ్చింది.
జంగారెడ్డిగూడెంలో మేమున్న ఇంటికి ఒక పావు మైలు దూరంలో ఒక లైబ్రరీ వుండేది. అమ్మ కోసం రెండు రోజులకొకసారి వెళ్లి - యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, వాసిరెడ్డి సీతాదేవి, కకుభ, R. సంధ్యాదేవి - ఇలా రకరకాల రచయిత్రు/తల నవలలు తెచ్చేదాన్ని. ఆ లైబ్రరీలో ఒకసారి పాటల పోటీలు పెట్టారు. ఆ పోటీల్లో - జయ జయ శ్రీ వేంకటేశ - జయజయ ఓం శ్రిత జన పోష - అంటూ నేను పాడిన వెంకటేశ్వర కళ్యాణం పాటకి మొదటి బహుమతి వచ్చింది. అది తెచ్చుకోవడానికి మొదటి సారిగా స్టేజ్ మీదకి వెళ్లి ఒక మెడల్ తెచ్చుకున్నాను - నాన్న, మూర్తి మావయ్య గారు (నాన్న కొలీగ్) మురిసి చూస్తుంటే.
ఆ ప్రైజ్ రాగానే మళ్లీ మా అమ్మకి ఇంకెవరన్నా సంగీతం మాష్టారు దొరికితే బావుండును అని అనిపించి తెలిసిన వాళ్లందరికీ చెప్పి వుంచింది. కానీ ఆ ఏడాది సంగీతం మాష్టార్లందరికీ రాజపూజ్యం - ఎక్కువ,అవమానం - తక్కువ అని అన్ని పంచాంగాల్లో రాసి వుండడం వల్ల ఆవిడ ప్రయత్నాలు ఫలించలేదు.
ఈలోగా అప్పటికింకా లక్ష్మి దొడ్డ దగ్గర విజయవాడలో వున్న పప్పి సెలవులకి వస్తూ - స్వామి అయ్యప్ప సినిమాలోంచి - చేతులెత్తి చెంత నిలిచి - పాట నేర్చుకొచ్చింది. లేచి నించుని సినిమాలో అమ్మాయి ఎలా అయ్యప్ప ముందు దండం పెట్టి పాడుతుందో అలాగే పాడాలని చెప్పి - నాకూ ఆ పాట నేర్పింది. పైగా ఆ పాటలో రెండో చరణం దానికి నేను అక్కని కాబట్టి పాడనే పాడకూడదు - పాపమొస్తుంది అని కూడా చెప్పింది.
అసలు పప్పి వస్తోందంటే నాకు, కుట్టికి బోల్డంత ఉత్సాహంగా ఉండేది. అది వచ్చీ రాగానే బాబ్డ్ హెయిర్ తో వచ్చే దాని జుట్టులాగే మాదీ భుజాలు దాటకుండా కట్ చేయించుకుని "బుద్ధిమంతుల" మయ్యేవాళ్లం. పప్పిని చుట్టుపక్కల అందరి ఇళ్లకీ తీసుకెళ్లి - ఇది మా పప్పీనే , కానీ మా దొడ్డ దగ్గర వుంటుంది - అని అడగిన వాళ్లకీ, అడగని వాళ్లకీ - మా ఇంటికబురు ఇంటింటా చెప్తుండేవాళ్లం.
అప్పుడే ఓ మధ్యాహ్నం కూర్చుని అందరూ మాట్లాడుకునేవేళ పక్కింటి లక్ష్మి అత్తయ్యగారు - ఈసారి పప్పి పాట విందాం - అనగానే అది లేచి దండం పెట్టి - "నేనూ, లల్లీ కలిసి పాడతాం" అని చెప్పి - చేతులెత్తి చెంత నిలిచి - అని మొదలు పెట్టింది. నేనూ దండం పెట్టి నించుని మొదటి చరణం దానితో కలిపి పాడి - అది కాగానే ఆల్రెడీ పప్పి నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేనాపేశాను.
అమ్మ, అత్తయ్యగార్లు నేనెందుకాపేశానో అని ఏదో అడగబోతూ ఉండగా - పప్పి- నన్నూ, కుట్టీని చాలా భావగర్భితంగా చూస్తూ - దానికి అక్కనైన నేను పాడకూడని రెండో చరణం -
అక్క వుంది చెల్లెలుంది ఆడిపాడగా
ఒక తమ్ముని మాకు ప్రసాదించు వంశమందునా
నడువలేని నాన్న నిన్ను చూడవచ్చినా
అతడు తోడు వచ్చి పొందు సుమా నీదు దీవెనా
- అని పాడేసింది. ఆ పాట వింటూ మా అమ్మ తెగ మొహమాట పడిపోయింది.
నా పాటల పయనంలో అలా అప్పుడప్పుడు పప్పీ తోడు - ఈలోగా మాటలొచ్చిన కుట్టీ కూడా తయారయింది - నాతో పాటకి.
ఇంతలో శంకరాభరణం రిలీజ్ అయ్యింది. ఓంకార నాదాను సంధానమౌ గానమే తో మొదలుపెట్టి సారిగరీ గపదాపా అంటూ మధ్యలో బ్రోచేవారెవరురా అన్న దాసు డైలాగులతో సహా దొరకునా ఇటువంటి సేవ అన్న ఆఖరి పాట దాకా కేసెట్ లో వున్న పాటలన్నీ నేర్చేసుకున్నాను.
శంకరాభరణం పాటలతో పాటు కొత్తగా నేర్చుకున్న విద్య ఏంటంటే నేను పాడేటప్పుడు ఎవరైనా మాట్లాడితే పాట ఆపేయడం - శంకర శాస్త్రి గారి అడుగుజాడల్లో.
ఒకసారి కజిన్స్ అందరం కలిసి సరదాగా పాటలు పాడుకునేవేళ - నేను - సామజ వర గమనా - పాట కొంచెం ఎక్కువ సంగతులతో పాడుతుంటే - ఎవరో "ఆ పాట అంత సాగదేమో సినిమాలో" అన్నారని - పాట ఆపేసి - అంతటితో ఆగక ఏడుస్తున్న నాకు - అమృతవర్షిణి - అన్న బిరుదు ప్రదానం చేశాడు మా శ్రీనన్న.
అలా కొన్నాళ్లు - పాపం - ఇప్పట్లా టీవీ సీరియళ్లు లేని ఆ కాలంలో - ఏమీ తోచని మధ్యాహ్నాలు గడపడం కోసం - నా పాట వినడానికి సిద్ధపడి - మళ్లీ మాట్లాడితే నేనెక్కడ పాట ఆపేసి ఏడుస్తానో అని - చీమలని కూడా చిటుక్కుమనకుండా నోటి మీద వేళ్లేసుకుని పాకమని చెప్పేంత నిర్బంధ కర్ఫ్యూ విధించేసి - నా పాట విన్న అనాతవరం, టంగుటూరు - గ్రామాల ప్రజలకి ఏమిచ్చినా నా పాటల ఋణం తీరదు.
శంకరాభరణం పాటలు మోసుకుని టంగుటూరు చేరాను. వారానికి ఒక్కరోజైనా ఎవరో ఒక టీచర్ నాచేత క్లాసులో పాటలు పాడించేవారు. పాడేది నేనున్న క్లాసు రూములోనే అయినా స్కూల్ మొత్తం వినిపించేది నా పాట. పక్క క్లాసులో పిల్లలు కూడా వచ్చి మా క్లాసు తలుపు దగ్గర నించుని నా పాటలు వినేవారు.
టంగుటూరులోఇంత పొడుగ్గా వుండే (పేరు మాత్రమే, నేను కాదు) - లలితా త్రిపుర సుందరి - అనే నా పేరు, నా పాటలు, నా భాష - అన్నీ నేనేదో వేరే లోకపు మనిషిని అన్నట్టు చూసేవారు. ఇక్కడికి వచ్చిన ఏడాదికి ఒంగోలు నుంచి సంగీతం నేర్పిస్తానని శ్రీనివాసరావు గారనే ఒక సంగీతం మాష్టారు వచ్చారు.
మా అమ్మ నన్ను, కుట్టిని విజయ దశమి రోజున బ్రహ్మయ్య గారి మేడ మీద శ్రీనివాసరావు గారు మొదలుపెట్టిన సంగీతం క్లాసులో చేర్పించింది.
రోజు విడిచి రోజు క్లాసు -
మధ్యలో ఇంటి-కప్పు ఎగిరిపోయేలా ప్రాక్టీసు-
మధ్య-మధ్యలో గేదె మీద చేసిన సంగీత ప్రయోగాలు [మా సంగీతం-గేదె గురించి ఇక్కడ క్లిక్ చేసి చదవండి మరి :) ]- సంగీత యాత్ర "సాగడం" మొదలయింది.
<ఇక్కడితో లలిత-సంగీతం అయిపోలేదు - ఇంకా చరణం వుంది - త్వరలోనే వినిపి(చదివి)స్తాను>
పోస్ట్ చదవటం మొదలుపెట్టాక మొదటి నుంచి చివరి వరకు నవ్వుతునే ఉన్నాను.చాలా బాగుందండీ.
రిప్లయితొలగించండిచిత్ర గారు: మీకు నవ్వులు పంచగలిగినందుకు సంతోషంగా వుంది. మీ కమెంట్ కి థాంక్స్!
తొలగించండిహహహ చాలా బాగున్నాయండీ కబుర్లు శంకరశాస్త్రి గారి వారసత్వం, అమృతవర్షిణి బిరుదు, మీ అక్కయ్యగారి పాట అన్నీ అద్భుతః :-)
రిప్లయితొలగించండిAnonymous గారు: మీ కమెంట్ ఇంకా అద్భుతః. చాలా థాంక్స్!
తొలగించండి'మనిషై పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మా!.....అన్న అరుపు' ఇది మాత్రం పోస్ట్ కంతటికీ హైలైట్!
రిప్లయితొలగించండిసినిమా లో లా, లేచి దణ్ణం పెట్టుకు నించుని...
భావగర్భితంగా చూస్తూ....
చీమలు నోటిమీద వేలువేసుకుని పాకడం.
ఇలా ఎన్నని చెప్పాలి.
అసలు మీ ఎదురింటి పిట్టగోడ మీద కూర్చుని, నీ(మీ) సంగీత సాధన చూస్తున్నట్టనిపించింది.
చాలా చాలా బావుంది.
నీ అభిమానపూరిత కమెంట్ కి ఎప్పట్లాగే బోల్డన్ని థాంక్స్! నా బ్లాగ్ కి నీ కమెంట్లు Oxygen లాంటివి!
తొలగించండిDaddy ippatiki nuvvu paadina Pushpa vilapam paata gurthu thechukuntuntaru. Amma ane varu.. Lalitha ki assalu garvam ledu, papam - paaduthaavaamma ani adagagaane paaduthundi ani.
రిప్లయితొలగించండినా పుష్ప "విలాపం" గురించి next post (in this series) లో వస్తుంది - ఆంటీకి, అంకుల్ కి బోల్డన్ని థాంక్స్ - ఇంకా నా పాటలు గుర్తు పెట్టుకున్నందుకు :)
తొలగించండి