5, ఆగస్టు 2017, శనివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 3 - మూడాటలు-ఆరుస్వారీలు

గతనెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 2 - ఇంటూ-ఫస్టుఫారం టూ ఫోర్తుఫారం


నేను థర్డ్‌ఫారంలో వుండగా - మా అన్నయ్యకి - అంటే వడ్లమాని సోమేశ్వరరావుగారు ఆయన పేరు - నాని గారంటారు -  ఆయన పెళ్ళి  కాకినాడ-గాంధీ నగర్‌లో మా వదినగారి మేనత్తగారి ఇంటి దగ్గర జరిగింది.

అనాతారం నుంచి - వూళ్ళోవాళ్ళు,  బంధువులు, మా నాన్న గారు, మేమందరం - చగ్గా కోటిపల్లి వరకు వెళ్లి - కోటిపల్లిలో గోదావరి దాటి - SRMT బస్సుల్లో కాకినాడ పెళ్ళికి తరలి వెళ్ళాము అందరమునూ.

మా దివాణం ఇంట్లో ఓ పే... ద్ద  విసనకర్ర  ఉండేది. అది ఎంత పెద్దదంటే - మామూలు విసనకర్రలకి  పదిరెట్లు ఉంటుందన్న మాట. దాన్ని ఊపుతూ విసరడానికి మా ఆస్థాన క్షురక-విద్వాంసుడు వీరన్న అని ఉండేవాడు. 

ఆ విసనకర్ర-వీరన్న, నన్ను సినిమాలకి తీసుకెళ్ళే పళ్ళయ్య - వీళ్ళు కూడా పెళ్ళికి మాతో కాకినాడ వచ్చారు.

అది మూడు రోజుల పెళ్ళి. ఆ రాత్రి పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక సదస్యం, మర్నాడు నాగవెల్లి.

మర్నాడు పొద్దున్న పూట పన్లేవీ లేవు.

కాకినాడలో కుళాయిచెరువు అని - గాంధీ నగర్ పక్కన  రామారావు పేట దగ్గరుంటుంది.

ఆ కుళాయి చెరువు పక్కన పేద్ద గులాబ్జాం తోట ఒకటుండేది.

మా కుర్రాళ్ళందరూ - అసలే న-వాల-(వా)-నరావతారులం కదా! - అలవోకగా తోటలో అలా దూరి - అవలీలగా చెట్లెక్కి - ఆ గులాబ్జాంపళ్ళు - అందినవి అందినట్టు, అందనివి అందిపుచ్చుకుని - కోసుకుని - తింటూ మళ్ళీ వెనక్కి పెళ్ళివారింటికి వెనక్కి నడుచుకుంటూ వస్తున్నాం.

మాతో పాటే - వీరన్న, పళ్ళయ్య కూడా వచ్చారు.

గాంధీ నగర్‌పార్కు  దగ్గరకొచ్చేటప్పటికి - వీరన్న మెల్లిగా నా పక్కకొచ్చాడు.

"బాబీగారూ! నేనొకటికి వెళ్ళాలి. కడుపుబ్బరంగా వుంది. ఎక్కడెళ్ళాలో తెలియట్లేదు. ఎక్కడెళ్ళాలండి?" అన్నాడు.

అప్పుడే పార్క్ దగ్గరకి వచ్చాం కదా!

నేను చుట్టూ చూసి - "ఈ పార్కంతా మనోళ్ళదే  - మనదే ఈ స్థలమంతా -  అంచేత నీ ఇష్టం!  ఎక్కడో అక్కడ కానిచ్చేసేయ్" అన్నా.

అనగానే వీరన్న గబగబా పార్క్ గోడ దగ్గర పనికానిచ్చుకున్నాడు.

అది ఓ పోలీసాయన చూసి -  వీరన్నని పట్టుకుని తీసుకెళ్ళి  పోలీస్‌స్టేషన్‌లో కూర్చోపెట్టేశాడు. మేం కుర్రాళ్ళం, మాతోపాటు పళ్ళయ్య - భయపడి పరిగెట్టుకుంటూ వచ్చేశాం ఇంటికి.

ఈ లోపులేమో - వధూవరులకి - విసనకర్ర విసరాల్సిన టైం వచ్చింది.

మా నాన్నగారేమో - "ఏడీ వీరన్న? పిలవండి"  అంటే - అప్పుడు పళ్ళయ్య - వీరన్నని పోలీసులు తీసుకు పోయారు - అంటూ - భయపడుతూనే జరిగిన సంగతి చెప్పాడు.

అయ్యో అని చెప్పి - అప్పుడు మా వదినగారి తండ్రి పేరి ప్రసాదరావుగారు, మా వదినగారి మేనత్త భర్త అయిన  శిఖా  కామేశ్వరరావుగారు - వీళ్ళిద్దరూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి వీరన్నని విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చారు.

అదుగో - అలా తెలిసీ తెలియని వయసులో - ఆడుకుంటూ-పాడుకుంటూ - అన్నిటినీ చులాగ్గా తీసుకుంటూ - నెమ్మదిగా ఫిఫ్తుఫారం దాకా వచ్చాను.

ఫిఫ్తుఫారంలో ప్రవేశించేటప్పటికి నాకు గుర్రపు స్వారీ అదీ బాహా అలవాటైపోయింది.

అదెలా అంటే...

నేను లెక్కల్లోనూ, ఇంగ్లీషులోను బాగా పూరు. అందుకని మా నాన్న గారేం చేసారంటే - లెక్కలూ, ఇంగ్లీషు ప్రైవేటు చెప్పే ముక్కామల కృష్ణ మూర్తిగారికి - మా ఇంట్లో ఓ మూడు గదులు  అద్దెకిచ్చారు - ఒక పోర్షన్ కింద.

ముక్కామల కృష్ణ మూర్తిగారికి - సుబ్బారావు, శేషగిరిరావు అని ఇద్దరు మగపిల్లలు - బాగా చిన్నవాళ్ళు.  ఆయన, ఆయన భార్య, తల్లి, ఓ తమ్ముడు - వీళ్ళందరూ ఆ ఇంట్లో ఉండేవారు.

నాతో పాటు మా వూళ్ళో కుర్రాళ్ళు - నాయనరాజుగారి సూరిగాడు, నారాయణమూర్తి సత్తిగాడు, మెహబుల్లా అని ఓ ముస్లిమూ- ఇలా మొత్తం ఏడెన్మండుగురు ప్రైవేటుకి వచ్చేవాళ్ళు.  రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటలవరకు చదువు. తర్వాత అరుగుమీదే పడుకునేవాళ్ళం.

నాకసలు చీకటన్నా, దొంగలన్నా, ఆఖరికి పాములన్నా - అందరూ చీకటి రాత్రుల్లో అనవసరంగా తలచుకుని అంతకన్నా అత్యనవసరంగా భయపడిపోయే దెయ్యాలన్నా - భయం లేదు.


అందరూ పడుక్కున్నాక - పదీ-పదిన్నరకి గంటలకు లేచేవాళ్ళం - నేను, నాయనరాజుగారి సూరిగాడు. లేచి - స్మశానానికి వెళ్ళేవాళ్ళం.

ఆ సమయంలో అక్కడ గుఱ్ఱబ్బండివాళ్ళ గుఱ్ఱాలు గడ్డి మేస్తూ ఉండేవి. అవి రాత్రల్లా స్మశానంలో గడ్డి మేసి ఏ తెల్లవారుఝామునో ఇంటికి తిరిగి వెళ్ళేవి.

నేను వెళ్తూ నాతోపాటు ఒక కొబ్బరితాడు పట్టికెళ్ళేవాడిని.

అప్పటికి గుఱ్ఱానికి - నాలిక పైకెత్తి కింది దవడకి కళ్ళెం ఎలా వెయ్యాలో నేర్చుకున్నాను. అంతే - గడ్డి మేస్తున్న గుఱ్ఱాల్లో ఒకదాన్ని పట్టుకుని - దానికి కళ్ళెమేసి - దాన్నెక్కి నెమ్మదిగా చెరువు గట్టున స్వారీ చేస్తూ ఉండేవాణ్ణి. మళ్ళీ రాత్రి ఏ పన్నెండు, ఒంటిగంటకో గుఱ్ఱాన్ని విదిలేసేవాణ్ణి.

ఇదంతా ఎవరికీ తెలీకుండా చేసేవాణ్ణి.

ఓ రోజు మంచి వెన్నెలగా వుంది. రోజూలాగే ఓ గుఱ్ఱాన్ని పట్టుకుని ఎక్కి - ఇవాళ పొలం వైపు వద్దు - ఊరి వీధుల్లో తిరుగుదాం - అనుకుని రెండో వీధిలో తిరుగుతున్నాను - పాండురంగమహాత్మ్యంలో ఎన్టీఆర్ లాగా తెల్ల చొక్కా వేసుకుని.

అదేమో మహాపేచీ-గుఱ్ఱం - ఓ పట్టాన లొంగలేదు. ఎలాగో లొంగదీసుకుని కళ్ళెం వేశాను. మాంచి దౌడు మీద వెళ్తోంది.

రెండోవీధిలో చిన్నమేష్టారు ఓరుగంటి అప్పారావు గారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆ పెంకిగుఱ్ఱం ముందు రెండు కాళ్ళు తన్నిపెట్టి తలకాయ వంచేసి - హఠాత్తుగా ఆగిపోయింది. దాంతో - చిన్నమేష్టారి ఇంటికి వున్న ఇనుపగేటు మీద పడిపోయాను. ఆ గేటుకి ఇనపఊసలు - బల్లేల్లా ఉండేవి. అందులో ఒక ఊస కంటి పైన దిగిపోయింది. ఇంకా - నయం కన్ను పోలేదు.

నా తెల్లచొక్కా అంతా ఎర్రగా రక్తం. ఒక్కసారిగా "అయ్యబాబోయ్" అని అరిచాను. ఆ ఎదురుగుండా కృష్ణమూర్తిగారి కాముడు అని ఉండేవారు - అనిపిండివారు. నా అరుపు విని లేచొచ్చి - నా దెబ్బ చూసి - "అమ్మయ్యో-ఎంత రక్తమో" అంటూ నా చొక్కానే విప్పి కట్టుకట్టి ఇంటికి తీసుకెళ్ళారు.

ఇంటికి వెళ్ళగానే - మా నాన్న ఆ రక్తం అదీ చూసి - అంత రాత్రిపూట ఏదో దెబ్బలాటకెళ్ళి తన్నులు తినొచ్చాననుకుని - నాకు దెబ్బ తగిలిందని కూడా చూడకుండా - ఇంకో నాలుగు దెబ్బలు గా...ఠిగా వడ్డించారు.

ఇంతలో గమ్మున మా అమ్మ - "అయ్యో పిల్లాడికి దెబ్బ తగిలింది" - అంటే అప్పుడు చూసి ఆయన - మా పొలాలు అవీ చూసే దాట్లరాజుగారిని పిలిచారు. ఆ రాజుకిగారికి కొంచెం ఆయుర్వేదం తెలుసు. ఆయనచేత కట్లు కట్టించి - అంత రాత్రిపూట గుఱ్ఱబ్బండి కట్టించి - మా నాన్న, నేను, దాట్లరాజుగారు కలిసి - అమలాపురంలో - MBBS డాక్టర్ మంథా  సుబ్బారావుగారని - మా వదినగారి చుట్టం ఉండేవారు - ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి రాత్రి రెండున్నరో-మూడో అయింది. అక్కడ పప్పు సత్యం గారని కాంపౌండరు ఉండేవారు. ఆయన్ని లేపుకొచ్చారు. డాక్టరుగారు - దెబ్బ చూసి - దీన్నిలా వదిలేస్తే కాదు కుట్టాల్సిందే - అని అన్నారు.

ఆ రోజుల్లో ఏంటంటే - అలా ఏమన్నా దెబ్బ తగిలి కుట్టాలంటే - అనస్తీషియా ఇచ్చేవారు కాదు - సూదిలో దారమెక్కించి బొంత కుట్టినట్టు కుట్టేసేవారు.

నేను - డాక్టరుగారి మాట వినగానే - కాళ్ళతో చేతుల్తో అందరిని తన్నేసి ఎవర్నీ దగ్గరికి రానీయకుండా, నా దెబ్బని ముట్టుకోనీకుండా - గొడవ గొడవ చేసేశాను.

డాక్టరుగారు - "వీడింక కుట్టనీడు - మచ్చుంటే ఉంటుంది" - అంజెప్పి డ్రెస్సింగ్  చేసేసి మందులిచ్చి పంపించేశారు.

అప్పట్నుంచి - రెండేసి రోజులకొకసారి - మా మేనత్తకొడుకు నాగన్నకి సైకిలిచ్చి - నన్ను వాడితో అమలాపురం పంపించి - డ్రెస్సింగ్ మార్పించేవారు. నెమ్మదిగా ఆ దెబ్బ తగ్గిపోయింది.

అలా అని గుఱ్ఱాలెక్కడం మానలేదు. పైగా వాటినెక్కి పంట బోదెల్లొ ఇట్నుంచి అటు దూకిస్తూ వుండేవాణ్ణి. ఓసారి అలా దూకిస్తుంటే కళ్ళెం తెగిపోయి బోదెలో పడి ఎడం చెయ్యి విరిగింది.  మళ్ళీ దానికో కట్టు.

మా నాన్న అమలాపురం వెళ్ళడానికి గుఱ్ఱబ్బండి వచ్చేది. ఆ బండతనికి మా అమ్మ - ఏదో ఒక టిఫిను, కాఫీ తినడానికి-తాగడానికి ఇచ్చేది. అతను సందులోంచి పెరట్లోకి వెళ్ళి తింటుండగా - ఈ లోపులో నేను ఆ బండేసుకుని మూడు వీధులూ తిరిగొచ్చేవాణ్ణి.

"అయ్‌బాబోయ్! బాబీగారు బండేసుకుని వెళ్ళిపోయారండి ! " అని వెతుక్కుంటూ వచ్చేవాడు బండతను.

అప్పటికి మా నాన్న కొట్టడం తగ్గించారు - కళ్ళెఱ్ఱజేసేవారు అంతే.

ఈలోగా అమలాపురానికి కొత్తగా రిక్షాలొచ్చాయి. రిక్షా వచ్చి ఇంటిముందు ఆగితే అది కూడా వేసుకెళ్ళిపోయి మూడు వీధులూ తిరిగి తొక్కేసేవాణ్ణి.

ఈలోగా విత్-హెల్డ్ నుంచి మామూలు హాజరుకొచ్చేశాను. నడక-పనిష్మెంటు కూడా ముగిసిపోయింది. ఆ రోజుల్లో - ర్యాలీ, హెర్క్యులెస్, రాబిన్‌హుడ్ - అని మూడు రకాల సైకిళ్ళు ఉండేవి. నాకు మా నాన్న రాబిన్‌హుడ్ సైకిలు కొనిచ్చారు.

ఆ సైకిలు మీద భీమనపల్లి హైస్కూలుకి వెళ్ళడం, రావడం - స్కూల్లో కబడ్డీ, బాల్-బాడ్మింటను, బేస్‌బాలు - లాంటి స్పోర్ట్స్ ఆడేవాణ్ణి.  అమలాపురం, కొత్తపేట, ముక్తేశ్వరం- స్కూళ్ళతో గ్రిగ్స్ ఆటలపోటీలు ఉండేవి.

అలా మూడు స్వారీలు-ఆరు ఆటలుగా ఫిఫ్తుఫారం గడిచింది.

<వచ్చేనెల తరువాయి కథ>

14 కామెంట్‌లు:

  1. Bagunnai babi gari allari gurrapu swareelu,👏👏
    -Prasad Oruganti

    రిప్లయితొలగించండి
  2. నేను అమలాపురం కాలేజీలో చదువుకున్నాను.ఒకసారి నాకు మంథా సుబ్బారావు గారు వైద్యం చేసారు.
    నేను కొత్తపేట హైస్కూల్లో చదువుకున్నాను. కొత్తపేటలో అప్పట్లో గ్రిగ్స్ అని నాలుగేళ్లకో మూడేళ్ళకో ఒకసారి ఆటలపోటీలు జరిగేవి. మాకు చాలా విశాలమైన ఆటస్థల‌ం ఉండేది. బాస్కెట్బాల్ ఆడటానికీ త్రోబాల్ ఆడటానికీ స్థలాలుండేవి. అవికాక స్కూలు ఆవరణలో బోలెడు ఖాళీ‌ స్థాలాలుండేవి.ఇప్పుడు అంతపెద్ద ఆటస్థలమూ చాలా చిన్నదైపోయింది. కారణం అందరూ సులువుగానే ఊహించుకోవచ్చును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం గారు: మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. గ్రిగ్స్ ఆటలపోటీలు ఇప్పటికీ స్కూళ్ళ మధ్య జరుగుతున్నట్టున్నాయి. గూగుల్ చేస్తే ఇదిగో ఈ లింక్ దొరికింది: http://www.sakshi.com/news/district/grigs-games-in-chiyyedu-427372

      తొలగించండి
  3. మహా బాహా👌👌రాహేహేస్తున్నారు😊👏👏👏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. YVR గారు: మీరు మహా బాహా పొగిడేహేస్తున్నారు - ధన్యవాదాలు :)

      తొలగించండి
    2. ఇంకా నయం. ఈ కామెంట్ పెట్టే టైంకి ఇంకా మీ నానమ్మగారిపై రాసిన పోస్టు చదవలేదు. ముందే చదివుంటే ఇంకో రెండు "హే"లు కలిసేవే 😊

      తొలగించండి
    3. నా బ్లాగ్‌లో పాత పోస్టులు చదువుతున్న మీకు ధన్యవాదాలు, YVR గారు!

      తొలగించండి
  4. అయ్ బాబోయ్ లలితా! అయితే మీ నాన్నగారు చిన్నప్పుడు తగిలిన దెబ్బలు, తగిలించబడ్డ దెబ్బలు కూడా లెక్క చేయకుండా మహా అల్లరి చేహేవారన్నమాట.
    చగ్గా పగలు బళ్ళో రకరకాల ఆటలు, మరి అర్ధరాత్రి పూట స్మశానంలో గుఱ్ఱంస్వారీ ప్రాక్టీసు!
    అంచేత చెప్పటానికింకేం లేదంతే! అంకుల్ కు ఎదుర్లేదంతే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీ మాటలు నాన్నకి చేరవేస్తాను, లక్ష్మీ - తెగ మురిసిపోతారు :)

      తొలగించండి
  5. మీ నాన్నగారి కబుర్లు చాలా బావుంటున్నాయి :)

    రిప్లయితొలగించండి