19, ఫిబ్రవరి 2018, సోమవారం

త్వామనురజామి - 22 - అదే ట్రెయినూ, అదే బోగీ, అదే అబ్బాయి


కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 21 - చిట్టిపిట్టలు మా చుట్టాలే - వచ్చీ పోయే అతిథులే!

న్యూఇయర్స్‌డే.

అప్పటికి రెండ్రోజుల ముందే పాపాయి అత్తయ్య కూడా వచ్చివున్నారు. ఇల్లంతా ఎప్పట్లాగే శ్రీరామనవమి పందిరిలా, పెళ్ళివారిల్లులా వుంది.

ముగ్గురాడపిల్లల మా ఇంట్లో ఆరడి-పాలై-అలమటించినవాడు - అప్పటికి ఇంకా మా ఇంట్లోనే వుండి  - KLCE లో ఇంజనీరింగ్ చేస్తున్న తమ్ముడు శ్రీనివాసుడు .

కాలేజ్ వున్న రోజైనా, సెలవు రోజైనా పొద్దున్నే ఏడుగంటల టైంలో మా ఇంటి ముందు సైకిల్ బెల్లు మోగేది. మోగించేవాడు సీతారాముడు - శ్రీనివాసుడి నేస్తుడు.

ఆ బెల్లుమోత వినగానే పిన్నికిం జెప్పడు బ్రష్షుపేస్టుయుగముం జేదోయి విడవడే అన్నట్లు చొక్కాలేకుండా, ఒంటిమీదున్న ఓ బుజ్జి-తువాలు-ధారుడై పరిగే..త్తుకుంటూ గేటు దగ్గరికి వెళ్ళేవాడు శ్రీను.

అసలే పాపం - మా చిన్నపాప్పిన్నేమో -  ఏదో మా ఇంట్లో మా ముగ్గురాడపిల్లల మధ్యనా వుంటే మేమెలాగూ చెయ్యని పనీ-పాటా వాడికి నేర్పి ప్రయోజకుణ్ణి చేస్తామని - కొండంత ఆశతో, ఆశయాలతో వాణ్ణి గుంటూరు పంపించింది.


మా అమ్మకేమో బెంగ - ఈ తెల్ల-కూబరుణ్ణి అరా-కొరా కోరా-రంగు తువ్వాల్లో చూసేసి, మోహించేసి నాలుగోలైనులో విహారం చేసే అమ్మాయిలెవరైనా మోసుకెళ్ళిపోతారేమోనని.

అసలే వాడు మా ఇంటి కమల-హాసనుడు, రోజుకోసారైనా మా మీద అలిగి ఎర్రబడే అరుణాననుడు.

అందుకని వాడో - పావుగంటో, అరగంటో గేటు దగ్గర నించుని - క్రీగంటో, వాలుగంటో - బ్రాడీపేట నాలుగోలైనులో ట్యూషన్లకోసమని సైకిళ్ళెక్కి వెళ్ళే రంగురంగుల చుడీదార్లు-or-పరికిణీఓణీ-ధారిణులని చూస్తూ సీతారాముడితో కబుర్లాడేసుకుని - ఎగురుకుంటూ ఇంట్లోకి వచ్చేటప్పటికి - రెండు తలంట్ల టైమూ అయ్యేది.

ఒక తలంటు మా అమ్మ చేతిలో -  అదెలా మొదలయేదంటే....

"ఏంట్రా శ్రీనూ - ఇంతసేపు వీధిలో నించుని ఎం చేస్తున్నావ్?"

"ఏం లేద్దొడ్డా! ఫ్రెండొస్తేనూ ...."

"ఫ్రెండా - ఎవరూ సీతారామేనా  - లోపలకి రాకుండా ఆ గేటు దగ్గర కబుర్లేంటి?"

"అదీ..."

"నువ్వూ,  వాడూ ఏం మాట్లాడుకుంటారో నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు - వెనకటికి ఎవరో అన్నట్లు face is the index of the mind... "

"....."

"చదువుకునేటప్పుడు చదువుకోకపోతే తర్వాత బాధ పడాలి   - మనకన్నా బాగా చదువుకునే వాళ్ళతో తిరిగితే మనకీ చదువు మీద ఇంట్రెస్టు ఉంటుంది - స్పర్థయా వర్ధతే విద్యా అన్నారు అందుకే"

"అలాగే దొడ్డా!"

ఇలా ఇంగ్లీషు, సంస్కృతం సామెతలతో తలతిరిగి ఉన్న వాణ్ణి రష్కించడానికి  వెళ్ళి - నేనూ ఓ చిలక-పలుకన్నా- కొంచెం వినయంగా - "అవునమ్మా - విద్యా దదాతి వినయం అని కూడా అన్నారు కదా - వీడికి పాపం నీ దగ్గర వినయం ఎక్కువే - అంటే విద్యున్నట్లే కదా !" - అంటూ.

 (ఇంతకీ "అన్నారు కదా - అన్నారు కదా " అంటున్నాం కానీ అవన్నీ ఎవరన్నారో నాకూ, మా అమ్మకీ కూడా నిజ్జంగా తెలీదు.)

"వాళ్ళే అతివినయం ధూర్తలక్షణం అని కూడా అన్నారు - ఇంక తలంట్లూ అవీ కానివ్వండి" అంటూ వాడితో పాటు నాకూ రెండు అక్షింతలు వేసేది.

ఆ రకంగా వాడికి రెండోదీ, అసలుదీ ఐన ఇంకో తలంటు కూడా పూర్తయేది మా అమ్మ చేతిలో.

వాడికప్పటికే నా మీద బోల్డు కోపం వచ్చేసుండేది - మా అమ్మ ఏదో మూడు పాఠాలతో ఆపేస్తుందీ అనుకుంటే దాన్ని నేనింకోటి చేర్చి పెంచానని.

తమ్ముడు-శ్రీనుకి అప్పటికి ఆషికి (రాహుల్ రాయ్, అను అగర్వాల్) పాటలంటే చాలా ఇష్టం.

పాపం - కొత్తేడాది పొద్దునపొద్దున్నే వాడికి మా అమ్మ ప్రైవేటు చెప్పిందని - అది మర్చిపోయేలా చేసి వాడికో సిల్వర్ లైనింగ్ ఇద్దామని - ఆరోజు మధ్యాహ్నం భోజనాల తర్వాత - మూడింటికి - పప్పి, కుట్టి, నేను అరండల్‌పేటలో వున్న సంగీత్‌సాగర్‌కి వెళ్ళి శ్రీనుకోసం ఆషికి పాటల కాసెట్ తెద్దామని అనుకున్నాము.

అనుకున్నట్టే బయల్దేరాం - నడుచుకుంటూ వెళ్ళొద్దామని. శీతాకాలపు ఎండ - భలే హాయిగా వుంది.

కోరారంగులో నారింజరంగు అంచున్న బెంగాల్ కాటన్ చీర కట్టుకుని బయటికి రాగానే - చూసీ చూడగానే పాపాయత్తయ్య - "మధుపర్కంలా వుంది ఈ చీర లల్లీ - పెళ్ళి కళొచ్చింది నీకు" అని మురిసిపోతూ తెగ మెచ్చేసుకున్నారు.

అది విని పప్పి, కుట్టి - "లల్లెమ్మా! జాగ్రత్త - కొంచెం చూసుకుని నడు - కళ్ళు నెత్తికెక్కేసి ఉంటాయి ఈ పాటికి" అంటూ తెగ మోసేయడం మొదలుపెట్టారు. వాళ్ళని పట్టించుకోకపోతే అక్కడితో ఆపేస్తారు. అందుకే అసలేం వినిపించుకోనట్టు ఇంకేదో సంబంధం లేని టాపిక్కేదో మొదలుపెట్టేసరికి నేననుకున్నట్లే మాట-మళ్ళిపోయారు.

బ్రాడీపేట - జనవరి ఒకటి చాలా షాపులకి సెలవేమో - ట్రాఫిక్ అస్సల్లేక ఖాళీగా వుంది. రోడ్ల మీద ఎవరూ తిరగట్లేదు. మేం ముగ్గురం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాము.

సరిగ్గా బ్రాడీపేట 4/10 దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇద్దరమ్మాయిలు మాలాగే నడుచుకుంటూ ఎదురొచ్చారు. వాళ్ళెవరో మాకు తెలీదు. వాళ్ళు మమ్మల్ని చూడగానే హఠాత్తుగా ఆగి - నా దగ్గరికి వచ్చి "మీరీ చీరలో చాలా బావున్నారండి", అనగానే నాకేం చెప్పాలో తెలీక మొహమాటంగా "థాంక్స్" అని చెప్పాను. వాళ్ళటు వెళ్ళీ వెళ్ళగానే కుట్టెమ్మ "ఇంక దీన్నివాళ పట్టలేం" అంటూ ఒకటే నవ్వు.

మొత్తానికి ఎలా అయితేనేం - మాక్కావాల్సిన పాటల కాసెట్ కొనుక్కుని ఇంటికి వచ్చాము - శ్రీనివాసుకిచ్చాము.

అలా కొత్తసంవత్సరపు సందడి ముగిసింది.

సంక్రాంతి రోజులు - రోజూ రాత్రి తొమ్మది దాటాక  రోడ్డు ఖాళీగా వున్నప్పుడు ముగ్గులు వేసేదాన్ని. నాకు తోడుగా కబుర్లు చెప్తూ పప్పి, కుట్టి, ప్రశాంతి, శ్రీను నించుని వుండేవారు.

ముగ్గులేస్తూ పరిసరాలు మర్చిపోయే నన్ను " లల్లీ! జరగవే బాబూ - పందిలా వుంది ఈ పంది - నిన్ను తొక్కేస్తుందేమో!" అంటూ కేకలేసేది కుట్టి - రాత్రిపూట నగరసంచారానికి బయల్దేరి - పిండితో కలిపి వేసే ముగ్గుని నాకేసి నాకమంపేయడానికి వచ్చే సంతానసహిత-వరాహ పరివారాన్నిచూసి.

అవొచ్చినప్పుడు ఒక్క గంతేసి మా గేటు గట్టెక్కి - అవెళ్ళగానే మళ్ళీ ముగ్గులోకి దిగేదాన్ని :)

ఓరోజలాగే పదిహేను - మధ్య చుక్క - ఎనిమిది వచ్చేవరకూ చుక్కలు పెట్టి సాల్టు-బిస్కెట్ల ముగ్గు వేస్తుంటే అప్పటిదాకా ఏవో మామూలు కబుర్లు చెప్తున్న శ్రీను - ఒక్కసారిగా ఆర్గానిక్కెమిస్ట్రీ పూనినవాడై - "లల్లీ - ఇవి బెంజీన్ రింగుల్లా వున్నాయి కదా" అంటూ ఏదో చెప్పబోయాడు.

ఇంకంతే - కామర్సు చదివే నా చెల్లెళ్ళు calm గా వుంటారా ?

"శ్రీనివాసూ - నీకు లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అంటే తెలుసా - ఈరోజేదో పాపం బెంజీన్ రింగులు సాల్టు బిస్కెట్లలా వున్నాయి అని ఉత్సాహపడితే రేపు ఆ ఆర్గానిక్ ఈక్వేషన్స్ చేసేటప్పుడు ఇంత ఆనందముండదని" అంటూ వాడి చెవి దగ్గర హోరెత్తించేసి వాడు మామీద అలిగి ఇంట్లోకి వెళ్ళిపోయేదాకా వదల్లేదు.

ఇలా ముగ్గేసే రోజుల్లో 4/19 లో మా ఏసీ కాలెజ్ ఫిజిక్స్ లెక్చరర్ హనుమంతరావుగారి ఇంటి దగ్గరున్న ఎలక్ట్రిక్ స్తంభం కింద ఎవరో ఇద్దరు నేను ముగ్గేసినంతసేపూ నించుని చూస్తున్నట్టు అనిపించేది - మొదట్లో అంతగా పట్టించుకోలేదు. నాల్రోజుల తర్వాత అర్థమయ్యింది - వాళ్ళు సరిగ్గా నేను ముగ్గు వెయ్యడం పూర్తి చేయగానే - వెళ్ళిపోతున్నారని. కాకపోతే ఎవరో సరిగ్గా తెలీలేదు. తెల్సుకోవడానికి వీలూ కుదరలేదు. అవసరమూ అనిపించలేదు - వాళ్ళేమీ గొడవ చేయకుండా నించుని వెళ్ళిపోతూ వుండడంతో.

పగలు మాటలు, పాటలు - రాత్రి పూట చిత్రహార్, చిత్రలహరి అయ్యాక ముగ్గులు - ఆ తర్వాత నిద్రొచ్చేదాకా మూడు కాలేజుల కబుర్లు - సంక్రాంతి పండగ సందళ్ళు - అన్నీ ముగిసి మళ్ళీ నేను హాస్టల్‌కి తిరిగి వెళ్ళే రోజొచ్చింది - జనవరి 21.

షరా మామూలే -  స-స్వ-పరివారసమేతంగా వచ్చి - స"మేత"గా (పచ్చళ్ళూ, నెయ్యీ, జంతికలూ, చక్కిలాలూ, సొజ్జప్పాలూ వగైరాలతో) నన్ను రైలెక్కించారు - అమ్మా, నాన్నా.

ట్రెయిన్ ఎక్కిన నాకు - లోపలున్నవాళ్ళందరినీ ఒకసారి చూసి నా లగేజ్ సర్దుకోబోతూ నా సీట్ వైపు చూసింతర్వాత అనిపించిందొకటే - అదే ట్రెయినూ, అదే బోగీ, అదే అబ్బాయి (ఒక  ప్రముఖమైన పాత సినిమాలో ఒకానొక డైలాగు వరసలో) - అంటూ.

టైటిల్: అదే ట్రెయినూ, అదే బోగీ, అదే అబ్బాయి కి అసలు మాటేది?
ఈ కింది కొసరు పాటకి అసలు పాటేది?
 
తలచిచూడు సినిమాలని - దొరుకుతుంది ఆ పదము 
గుర్తు పడితే ఆ పదాన్ని - తట్టుతుంది ఆ మూలం 
ఆ మాటా ఎక్కడిదో - ఆ మూలం ఎప్పటిదో
చెప్పుకుంటే చాలును - నీ క్విజ్జు నెగ్గిపోవును...    



<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

16 కామెంట్‌లు:

  1. కొసరు పాట:

    మీటి చూడు నీ హృదయాన్ని ... పలుకుతుంది ఒక రాగం (చిత్రం: చీకటి వెలుగులు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇట్టే పట్టేశారండి - క్విజ్జులో నెగ్గేశారండి!

      తొలగించండి
  2. చిత్రం : అభినందన (1988)
    సంగీతం : ఇళయరాజా
    సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
    గానం: బాలు
    అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా
    అదే నీవు అదే నేను .. అదే గీతం పాడనా
    కథైనా... కలైనా... కనులలో చూడనా
    ఈసారి ఈజీ పాటల పోటీ పెట్టారు.

    >>>ఏదో మా ఇంట్లో మా ముగ్గురాడపిల్లల మధ్యనా వుంటే మేమెలాగూ చెయ్యని పనీ-పాటా వాడికి నేర్పి ప్రయోజకుణ్ణి చేస్తామని - కొండంత ఆశతో, ఆశయాలతో వాణ్ణి గుంటూరు పంపించింది.>>>
    ప్చ్...పాపం కదా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అరే! అది పాట కాదండి - అప్పుచేసి పప్పుకూడు సినిమాలోంచి "అదే దెబ్బ, అదే చెయ్యి, అదే మనిషి" అన్న డైలాగ్. ప్రయత్నించినందుకు, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

      తొలగించండి
  3. మీ కమిట్‌మెంట్ కు జోహార్లు లలిత గారు. 19 కి క్రమం తప్పకుండా ఈ సీరీస్ లో పోస్ట్ రాస్తున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా రోజుల తర్వాత కమెంట్‌తో వచ్చారు. చాలా థాంక్స్, పవన్‌గారు.
      మీరెప్పుడు బ్లాగ్ రాస్తారా, చదువుదామా అని ఎదురుచూస్తున్నాను.

      తొలగించండి
  4. ఎప్పుడో జరిగిన సంగతులని అంత ఫ్రెష్‌గా చెప్పడం యువర్ స్పెషాలిటీ. సందర్భానుసారం సాంగ్స్ కూడా చక్కగా సెట్ అవుతాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎప్పటికప్పుడు నన్ను ఫ్రెష్‌గా మెచ్చుకోవడం నీ స్పెషాలిటీ మరి! Thank You!

      తొలగించండి
  5. ఇక నుంచి ఈ బ్లాగ్ ఎప్పుడూ మిస్ కాకుండా చదూతాను.....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కుమార్‌గారు! నా బ్లాగ్ చదివినందుకు, చదవబోతున్నందుకు చాలా థాంక్స్!

      తొలగించండి
  6. లలిత గారు, ఎన్ని రోజులు ఇలా తెలుగు సీరియల్ లా లాగిస్తారు :) ఇంతకీ ఆ మూగబ్బాయి అదే రైల్లో అదే బోగీలో అదే సీట్లో ఉన్నాడా లేదా ? ఇక పొడిగించకండీ బాబూ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా బ్లాగ్ కదా - సాగదీసినా, రాగం తీసినా చెల్లుబాటు అయిపోతుందని - అంతే అంతే :)

      తొలగించండి
  7. ఈ పోస్టంతా నీదైన humour తో నిండిపోయింది లలితా!
    తెల్ల కూబరుడు...
    అరా- కొరా కోరా- రంగు తువాలు
    సంస్కృతాంగ్లాంధ్ర సామెతలతో శ్రీనివాసుడి తలంట్లు
    సాల్టు బిస్కెట్ల ముగ్గు... బెంజీను రింగులు....ఎన్నని చెప్పను?
    సామెతల వెతలు; నీ మేతల కతల కలబోత...హాయిగా నవ్వుకుంటూ చదువుకున్నా.
    BTW, 15 to 8 మధ్య చుక్కలతో ఓ కొబ్బరి బోండాం ల ముగ్గు కూడా ఉండేది కదా!






    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనో హ్యూమర్-బీయింగ్‌ని కదా - అంతే మరి :)
      నువ్వు బాగా గుర్తు చేశావు - 15-8 కొబ్బరిబొండాల ముగ్గూ వుంది.

      తొలగించండి
  8. కొబ్బరి బొండాల ముగ్గు ఒకసారి పోస్ట్ చెయ్యగలరా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారికగారు! తప్పకుండా పోస్ట్ చేస్తాను - వచ్చే వారం.

      తొలగించండి