19, జులై 2018, గురువారం

త్వామనురజామి - 26 - మాటే మంత్రమూ ... ముందుకాళ్ళ బంధమూ...


కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 25 - మమ్ము ఎవరో చూసిరి - అమ్మకపుడే చెప్పిరి

సాయంకాలపు నడక - ఎప్పట్లాగే అలిపిరి దాకా కాకుండా శిల్పం వైపుకి. అక్కడకి వెళ్లి నా పుట్టినరోజుకి నాకు అబ్బాయి ఇవ్వబోయే గ్రీటింగ్ కార్డ్ నేనే ఎంచుకుందామని.

ఆ అలవాటు ఎక్కడ మొదలయిందీ అంటే - గుంటూరులో అపర్ణ నేను ఫ్రెండ్స్ అయినప్పటినుంచి. మేమేమిద్దరం మా పుట్టినరోజులకి, న్యూఇయర్‌కి తప్పకుండా ఒకళ్ళకొకళ్ళం గిఫ్ట్సూ, గ్రీటింగ్సూ ఇచ్చిపుచ్చుకునేవాళ్ళం. మా ఇద్దరికీ కూడా surprises ఇష్టం ఉండేవి కావు. పైగా నచ్చని గిఫ్ట్ ఇచ్చినా, తీసుకున్నా దానికి మా పాకెట్‌మనీ లోంచి పెట్టిన డబ్బులు waste కదా! అందుకని బాగా ఆలోచించి మాలో మేము ఒక ఒప్పందం చేసుకున్నాము. మా ఇద్దరి పుట్టినరోజులకి మధ్య మూడు రోజులు తేడా అంతే - అందుకని ఒక వారం ముందుగా మా బీహెచ్ కాలేజ్ ఎదురుగా వున్న నీహారిక ఫాన్సీ స్టోర్‌కి వెళ్లి నాకో బొమ్మ తను, తనకో బొమ్మ నేను, లేకపోతె చెరో brooch కొనుక్కునేవాళ్ళం. అందులో ఎంత జాగ్రత్తంటే ఇద్దరి ఖర్చూ సమానంగా ఉండాలి :) అలా కొనుక్కున్న gifts మా ఇళ్ళకి తీసుకెళ్లి వాటిని మంచి రంగురంగుల పేపర్లలో చుట్టి మా మా పుట్టినరోజులకి ఒకళ్ళకొకళ్ళం ఇచ్చుకునేవాళ్ళం.

అదే అలవాటుతో ఇప్పుడు - నచ్చనివాటిని దాచుకునే అలవాటు లేని నేను - నాకు నచ్చిందే కొనుక్కుని అందులో పుట్టినరోజు శుభకామనలు రాయించుకుందామని - అబ్బాయి చేత గ్రీటింగ్ కార్డ్ కొనిపించడానికి శిల్పం వైపుగా వెళ్ళాను ఆ రోజు.

అప్పటికి రెండు రోజుల్నుంచీ కురుస్తున్న వర్షాలతో తిరుమల కొండల్లో అప్పుడే పుట్టి అంతలోనే లేచి చిందులేసే బుజ్జి-తువ్వాయిల్లాంటి తెల్లగా మెరుస్తున్న బుల్లిబుల్లి జలపాతపు పాయలు. చల్లటి కొండగాలి.  పాదాల్లో స్ప్రింగులున్నట్లు పడుతున్నాయి అడుగులు - మరి అంత దూరం నడిచి వెళ్ళి వెనక్కి ఆరున్నరలోగా వచ్చేయాలి కదా!

ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడే నాకు ఆ రోజు మాటలు రావట్లేదు. ఊరికే చేతులూపుకుంటూ march past చేస్తున్నట్లు ఎంతసేపు నడుస్తాం కదా?!

అబ్బాయికి కొంచెం విసుగొచ్చినట్లు వుంది.

నా చెవి పక్కనే చిన్నచిన్న రాగాలు వినిపించాయి.

యూ హీ తుమ్ ముఝ్‌సే బాత్ కర్‌తీ హో 
యా కోయీ ప్యార్ కా ఇరాదా హై ?

అలా అడిగితే ఏం చెప్తాను కదా - బదులుగా ఓ నవ్వు నా నుంచి - అంతే!

అబ్బాయికి నా వరస అస్సలు అర్థం కాలేదు. ఇంకో పాట-బాణం వదిలారు. 

తన్ భీ సుందర్, మన్ భీ సుందర్
తూ సుందర్‌తా కీ మూరత్ హై
కిసీ ఔర్ కో షాయద్ కమ్ హోగీ
ముఝె తేరీ బహుత్ జరూరత్ హై
పెహలే భీ బహుత్ దిల్ తర్‌సా హై
తూ ఔర్ న దిల్ కో తర్‌సానా


అబ్బే!  మామూలుగా పాటకి పాట, మాటకి మాట అప్పచెప్పే నేను అంత నిశ్శబ్దంగా నడవడం కొంచెం వింతగా, ఇంకొంచెం విశేషంగా, ఇంకింకొంచం విడ్డూరంగా అనిపించి ఆ హిందీ పాటలను పాడడం కాసేపు ఆపి ...

"ఏంటీ! ఇవాళ ఒంట్లో బాలేదా? వెనక్కి వెళ్లిపోదామా? నీ పుట్టినరోజు వచ్చేవారం కదా - ఆ లోగా శిల్పంకి వెళ్లలేకపోము"

"బానే వుంది -ఇప్పుడే వెళ్దాం."

"మరి... ఏమైనా మాట్లాడు"

"ఊఁ "

"ఊఁ - ఉహు కాదు ఇంకేమైనా... ఇవాళ క్లాస్‌లో కబుర్లు ఏం లేవా?"

"ఊఁ "

"ఇదిగో ...ఇలా అయితే నిన్ను మీ హాస్టల్ దగ్గర దింపేసి నేను వెళ్ళిపోతానంతే!"

"అది కాదు... అమ్మొస్తోంది."

"ఓహ్ అదా సంగతి? ఇది మనల్ని కాళహస్తిలో చూసిన సుబ్బారావు పుణ్యమేనా? థాంక్స్ చెప్పాలి అతనికి."

"... ... "

"మీ అమ్మగారు వస్తుంటే ఇలా ఉంటారేంటి? ఎంత హుషారుగా ఉండాలీ?!"

"అది కాదు - అమ్మ వచ్చే టైంకి నేను స్టేషన్‌కి వెళ్ళలేను - ఆ రోజు ఫస్ట్ పీరియడ్‌లోనే నా సెమినార్ వుంది - ఎనిమిదింటికల్లా CC (Computer Centre) కి వెళ్ళాలి. మామూలు క్లాస్ అయితే మానేసేదాన్ని - మరిప్పుడు కుదరదు."

"ఓహ్ అంతేనా?! ఇంకేంటో అనుకున్నాను. నేను వెళ్తాను స్టేషన్‌కి - కాబోయే అత్తగారిని రిసీవ్ చేసుకునే అవకాశం  ఎందరికొస్తుంది చెప్పు!"

"మీకు ఫర్లేదా? అమ్మని మీరెప్పుడూ ఇంతకూ ముందు కలవలేదు కదా! మరెలా?"

"అవన్నీ నాకొదిలేయ్. ఆంటీ పేరు పేరిందేవి కదా! నేను కనుక్కుంటాను."

అప్పటికి నవ్వొచ్చింది నా మొహంలోకి. ఇంక ఆ తర్వాత అబ్బాయికి పాటలు పాడడానికే కాదు - అసలు నోరు తెరవడానికే ఛాన్స్ లేకపోయింది - అమ్మ నా హాస్టల్‌కి రావడం ఇది రెండో సారి అని, మొదటిసారి నేను ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు రాసేటప్పుడు వచ్చిందని, అప్పుడు షిప్లీకి జడ వేసిందని, నాతోపాటే డైనింగ్ హాల్లో భోంచేసేదని, ఇప్పుడు మళ్ళీ అలాగే చేస్తామని, ఇంకా గోవిందరాజస్వామి గుడికి తీసుకెళ్తానని - ఇలా జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ చెప్తూ ఉంటే శిల్పంకి ఎలా వెళ్ళామో, అక్కడేం కొన్నామో కూడా తెలీలేదు అబ్బాయికి. అంతా నా talk-trance లో జరిగిపోయిందంతే!  అంతే! ఇంక తిరిగి వచ్చేదారిలో గాంధీబజార్లో మేమెప్పుడూ వెళ్లే ఒక షోడా షాపులో ఆగి - అక్కడుండే షాపు-ఓనరైన ఒక పెద్దాయన మమ్మల్ని చూడగానే భలే ఇష్టంగా కూర్చోమని రెండు చిన్న స్టూల్స్ వేసి - మా ఇద్దరి కోసం చాలా శ్రద్ధగా - చిటికెడు జీలకఱ్ఱ పొడి, ఉప్పు, ఓ అరచెక్క నిమ్మకాయ రసం వేసి తయారు చేసిచ్చిన షోడా తాగితేనే కానీ అబ్బాయి తేరుకోలేదు.

అమ్మ వచ్చేరోజు రానే వచ్చింది.

ఆ రోజు నేను స్టేషన్‌కి వెళ్లలేకపోయినా తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే - అమ్మొక్కతే రాలేదు, కూడా బాబు కూడా వచ్చాడు. వాళ్లిద్దరూ నా బదులు స్టేషన్లో బదరిని చూసి బాగానే ఆశ్చర్యపోయివుంటారు. అందులోనూ బదరి తన ఆనంద-మార్కు నవ్వుతో వెలుగుతున్న ఆననంతో ముందుకెళ్లి  "బావున్నారా ఆంటీ! ప్రయాణం బాగా జరిగిందా" అని ఆవిణ్ణి అడుగుతూ బాబెవరో తెలుసుకున్న తర్వాత "లల్లి ఉండేది అమ్మాయిల హాస్టల్ కదండీ, బాబూ! ఆంటీని అక్కడ దింపేసింతర్వాత మనిద్దరం నా హాస్టల్‌కి వెళ్దాం. మీరక్కడ ఫ్రెష్ అవొచ్చు" అనగానే వాళ్ళిద్దరికీ బదరి మాట మంత్రమయింది - ముందుకాళ్ళ బంధమయింది. 

మా అమ్మ - ఎన్నెన్ని అనుకుని వచ్చి ఉంటుందో - అమ్మాయి తడబడుతుందని, అబ్బాయి అసలు కనిపించడేమోనని - వాళ్ళిద్దరికీ ఎన్నో బుద్ధులు చెప్పాలని. తీరా చూస్తే ఎదురుగా అబ్బాయి నవ్వుతూ కనిపించగానే - మనసులోనే - "పిల్లాడు మంచి వాడి లాగానే వున్నాడు. మా చండికకి చెప్పలేకపోయినా ఈ అబ్బాయికి చెప్పి ఒప్పించగలను" - అని ధైర్యం తెచ్చేసుకుంది.

ఫస్ట్ పీరియడ్ నా సెమినార్ అయిపోగానే గబగబా హాస్టల్ రూంకి వచ్చేశాను. నా పక్కన ఒక మంచం ఖాళీగా వుంది ఎలాగూ - అమ్మ దానిమీద పడుకోవాలి కదా - అందుకని దాన్ని తుడిచి శుభ్రం చేశాను - షిప్లీ జుట్టు దువ్వి పోనీటెయిల్ వేశాను. ఇంక సర్దడానికి ఏమీ కనిపించలేదు. అందుకని వచ్చి కళ్యాణి బ్లాక్ ముందు మెట్ల మీద కూర్చున్నానో లేదో బదరి, బాబు వచ్చి అమ్మని దింపేసి వెళ్లారు.

అమ్మకి నన్ను ఇంకేమీ అడిగే, నిలదీసే అవసరం కలగలేదు. నాకు అమ్మకి ఏదేదో చెప్పే, సంజాయిషీ ఇచ్చే అవస్థా తప్పింది - అంతా అబ్బాయి పుణ్యం.

ఆ రోజంతా బాబు బదరితోనే వున్నాడు. సాయంకాలం బాబుని SVU దగ్గరగా బాలాజీ కాలనీలో వుండే మొబైల్ క్యాంటీన్ల లాంటి బళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ బదరి "I know what you are fond of eating"  అంటే అప్పుడు బాబు అడిగాట్ట - "మీకు నా ఇష్టాలేంటో కూడా తెలుసా?" - అని. అప్పుడు బదరి అన్నారట - " మీ గురించి చెప్పండి - నాకేం తెలీదో అందులో వెతుక్కుంటాను" - అని. అలా రోజంతా బదరితో గడిపేసి బాబు ఆ రాత్రికి బస్సెక్కి గుంటూరు వెళ్ళిపోయాడు. తర్వాత వారం రోజులకి అమ్మ గుంటూరు వెళ్ళాక బాబు చెప్పిన మొదటి మాట "లల్లి ఆ అబ్బాయినే చేసుకుంటుంది అని నాకనిపిస్తోంది" అని.

సరే! మరి మా అమ్మనాతో ఓ వారం వుండడానికి వచ్చింది కదా! అందులోనూ వారం మధ్యలో నా పుట్టినరోజు.  తేదీల ప్రకారం చేసుకునే అలవాటు అప్పటివరకు ఎప్పుడూ లేకపోయినా మరి ఏదో ఒక వంక కావాలి కదా అమ్మ రావడానికి, నాతో ఉండడానికి! మొట్టమొదటిసారిగా తేదీ-పుట్టినరోజు పార్టీ ఇచ్చాను - హాస్టల్లో నా ఫ్రెండ్స్‌కి - శ్రీలత, సంగీత హెల్ప్‌తో బేకరీ నుంచి తెచ్చిన సమోసాలు, అమ్మ తెచ్చిన జంతికలు, పాలకోవాలు పెట్టి. అప్పుడే నా క్లాస్‌మేట్ సునీత రాజ్‌కపూర్ సంగమ్ లోది  'ఓ మెహబూబా, ఓ మెహబూబా తేరే దిల్ కే పాస్ హి హై మేరి మంజిల్-ఎ-మక్‌సూద్, వో కౌన్ సీ మెహఫిల్ హై జహా తు నహీ మౌజూద్' పాడింది.  అది తన కిష్టమైన పాట - అది తను పాడగా విని నాకింకా ఇష్టమయింది.

నా పుట్టినరోజు అయింతర్వాత అమ్మ ఇంకో రెండు రోజులుండి శనివారం బయల్దేరి గుంటూరు వెళ్ళిపోయింది. ఆ మధ్యలో బదరి గురించి ఏదో రెండో మూడో మామూలు ప్రశ్నలు - ఆ అబ్బాయి ఎవరు, గుంటూర్లో వాళ్ళిల్లు ఎక్కడ, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఎవరు - ఇలాంటివి తప్ప నన్నేమీ అడగలేదు.

అమ్మ వెళ్లే రోజు కూడా ట్రెయిన్ ఎక్కించడానికి బదరినే వెళ్లారు. అక్కడ ట్రెయిన్ కదిలే లోగా మా అమ్మతన విశేషాలు అడుగుతూ - "చూడండి బాబూ! ఇప్పటివరకూ మీ మాటల్ని బట్టి మీకు మీ అమ్మగారంటే చాలా ఇష్టం, గౌరవం అని తెలుస్తోంది. మీ నాన్నగారు పోయాక ఆవిడ కష్టపడినా పిల్లలుగా మిమ్మల్ని ఎంతో చక్కగా పెంచారని అర్థమయ్యింది. తల్లి మీద ఇంత గౌరవం వున్నవాళ్ళెప్పుడూ తప్పటడుగు వేయరని నా నమ్మకం. మేము మా వాళ్లలోనే ఎవరికీ శాఖాభేదం వున్న పెళ్లిళ్లే చేసుకోలేదు. అందులోనూ ఇలా వేరే వాళ్లంటే ఎవరూ చేసుకోలేదు. నా మాట విని మీరు మీ పెద్దవాళ్ళు చూసిన అమ్మాయిని చేసుకోండి. నేనెలా అనుకుంటున్నానో మీ అమ్మగారు కూడా అలాగే అనుకుంటూ వుండి వుంటారు. ఆవిడ చెప్పిన మాట మీరు వినండి. పెద్దదాన్ని,  మీకన్నా జీవితంలో ఎన్నో చూసినదాన్ని ఎందుకు చెప్తున్నానో  అర్థం చేసుకోండి." అంటూ ఆపకుండా ఒక పది నిముషాలు మాట్లాడాక - అదంతా బదరి చిరునవ్వుతో ప్రశాంతంగా విని - అమ్మ అన్నదానికి 'అవునూ, కాదూ' అనకుండా - అసలే మాత్రం తొణకకుండా  ఇచ్చిన సమాధానం "ఆంటీ! మీరేం టెన్షన్ పెట్టుకోకండి. అంతా బాగానే జరుగుతుంది. క్షేమంగా ఇంటికెళ్ళండి" అని. అమ్మకి అది ఎలా తీసుకోవాలో తెలీక - "పోన్లే! ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా ఆలోచించే మనస్తత్వం వున్న అబ్బాయి లాగే వున్నాడు. లల్లీకి చెప్పే కన్నా ఇతనికి చెప్పి ఒప్పించడమే మంచిది" అనుకున్నట్లుంది - ఇంకేం మాట్లాడకుండా కదిలిన ట్రెయిన్ లోంచి బదరికి చెయ్యూపేసి గుంటూరు వెళ్ళిపోయింది -

తరచి అడిగినా - బతిమిలాడినా 
ఉలకదు కదా - చండికా... !
రుసరుసమనినా - మరిచిపొమ్మనినా 
అవుననదు కదా - ఇంకెలా?

--- అనుకుంటూ!




<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>


7 కామెంట్‌లు:


  1. గాంధీ బజారు సోడాబడ్డీ మీకూ ఫేవ రెట్టే ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబిగారు: ఆ సోడాబడ్డీ మీకూ తెలిసినట్టే?!

      తొలగించండి


    2. తిరుపతే మనదాయె :)

      అన్ని గుళ్ళూ,గుండ్లూ, బాజారూ, బేజారూ,బండ్లూ బడ్డీలు, కొట్లూ, కొట్లాటలూ మనవే :)


      జిలేబి

      తొలగించండి
  2. లలితా! నువ్వూ అపర్ణ గిఫ్ట్స్ ఇచ్చుకోవడంలోని లాజిక్ మోస్ట్ యునీక్!
    నీ బాధల్లా ఆంటీని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ కు
    వెళ్ళడానికి వీలు కావట్లేదనే కానీ, ఆంటీ వస్తే ఏం జరుగుతుందో అన్న భయం కాదన్నమాట.
    ‘Talk-trance’ ఈ పదం బావుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మ వస్తే భయమెందుకు లక్ష్మీ? అమ్మ కదా - నన్ను అమ్మ కన్నా ఇంకెవరంత అర్థం చేసుకోగలరు కదా! వస్తుంటే "హమ్మయ్య" అనిపించింది

      తొలగించండి
  3. 1. మాటే మంత్రమూ - మనసే బంధమూ

    2. పిలిచి పిలిచినా పలుకరించినా
    పులకించదు కదా నీ ఎద
    ఉసురుసురనినా గుసగుసమనినా
    ఊగదేమదీ నీ మదీ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ రెండో పాట - దేవులపల్లివారి పాటలో చరణాన్ని కనిపెట్టిన మీకు బోల్డన్ని చప్పట్లు, దీపా!

      తొలగించండి