14, అక్టోబర్ 2018, ఆదివారం

ఆకురాలుకారు ఆ మలుపులో…


పూలకారు గడిచె.
ఎండకారు ముగియవచ్చె.
ముంగిట వాలిన రంగుటాకు ఆకురాలుకారు ఆ మలుపులో నిలిచెనంటూ కబురందించె.



మా ఊళ్ళో ఆకురాలుకారులో చెట్లు ధరించే ఆకుల వర్ణాంబరాల సంబరం చూడాల్సిందే.
చూసి సంబర పడాల్సిందే.

 అప్పటిదాకా ఒక్క రంగుతో వుండి ఒకే మచ్చులో అచ్చేశారా అన్నట్లు ఆకుపచ్చగా మెరిసే పచ్చనాకులన్నీ రంగులు పులుముకుని ఒక్కసారిగా రంగుటాకులై పోతాయి.

అల్లప్పుడెప్పుడో దేవుల్లపల్లి వారు పాట కట్టారు.
ఏమనీ?
ఆమనినే నిలుపుకొమ్మని.
కొమ్మల ఆకులు తెంపి పోగులు పెట్టే ఆకురాలుకారుని పొమ్మని.

ఆ పాటేంటంటే ...

శీతవేళ రానీయకు, రానీయకూ
శిశిరానికి చోటీయకు, చోటీయకూ
ఎద లోపల పూలకారు
ఏ నాటికీ పోనీయకూ


సరేనబ్బా! అదీ ఆలోచిద్దాం.

పూలకారు పూసే మొక్కల ముస్తాబుతో బావుంటుంది.
ఎవరూ కాదనం. 
మరి  మానులయి ఆకసపు అంచుల చేరి ఊసులాడుకునే తరువుల సంగతేంటి?
ప్రతి మానూ చినుకు పలకరింపుకి పులకరించి చివురులెత్తునేమో కానీ పూల నగలను అరువు తెచ్చుకోలేదు కదా!
పూలేవని, పూల్లేవని చెట్లు బెంగెట్టుకుని చిన్నబుచ్చుకుంటే అస్సలు బావుండదు కదా!
అందుకని పూలు పూయని ప్రతి చెట్టుకూ ఆకు పచ్చల తాపడం కావాల్సిందే!

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ ...పూలిమ్మని రెమ్మరెమ్మకూ?! అన్న భావకవి దేవులపల్లి వారి పల్లవిని తిరగరాసి  ఎవరు చెప్పేరమ్మ ఈ చెట్టుకూ... ఆకు పొదగమని కొమ్మ కొమ్మకూ?!  అని పాడి పల్లవముల చిరుగాలుల ఊయలలూచు పల్లవీ మణిని మురిపించాల్సిందే!

సరే! ఎండ పొడన వెచ్చగా ఉండిపోయి రాలకుండిన పచ్చనాకుల చూసుకుంటూ ఉంటే కొన్నాళ్ళు బానే ఉంటుంది. మరి ఎప్పుడూ ఒకే రంగంటే ఎలా?
కారు కారుకీ మారుతూ, మార్పు మార్పుకీ హొయలొలికించే తరువు తనువు మురిపెం చూడాలంటే ఆకు రంగులద్దుకోవాలి, పండాలి, రాలాలి.
శీతకారున మోడువారాలి.
ఆమని వేళకి చిగురెత్తాలి.
చిగురు చిగురుకూ పరువంపు పొగరెక్కి తల ఎత్తాలి.

ఇన్ని జరగాలంటే ...
ఇంతవరకూ పూలకారు నిండిన మదిలో ఈ ఆకురాలుకారు రంగుటాకుల సొగసూ పండాలి, ఉండాలి.
శీతవేళ మోడువారిన పుడమిపుట్టువుని చూసి ఎద బావురుమనకుండా ఉండాలంటే రంగుటాకుల నెమరు కావాల్సిందే! 

అన్నట్లు... ఇంకో మాట! పసుపు, ఎరుపు, నారింజ, కెంపు, సిందూరం... ఒకటా రెండా ఎన్నెన్నో వన్నెల నద్దుకుని, కళకళలాడే పూలకి దీటుగా కలకలమంటూ, కలకాలముంటామనుకుంటూ కుదురుగా కొమ్మల నిండా పరచిన రెమ్మల దారుల వరసలు పేర్చుకుని సర్దుకునుంటాయా రంగుటాకులు.

వాటి రంగుని చూసి నీ ఎదలో బెంగ రాక మానదు - మెరిసే ఈ రంగుటాకులు రేపో మాపో రాబోయే చినుకుల జడికి తడిసి, బిగిసి, బరువెక్కి, పండి - పండుటాకులై  రాలి ఎండుటాకులుగా కాలికింద నలిగే క్షణం ఇంకెంతో దూరంలో లేదు కదా అని.

పొరపాటున కూడా పండుటాకను మాట వాటి చెవిన పడనీయకు. 
ఆ వన్నెల జాతర మూన్నాళ్ళ సంబరమేనని నీకూ తెలుసు, నాకూ తెలుసు. 
కానీ రాలేదాకా హాయిరెమ్మల వూగుతుండే ఆకుకి తెలియనీయకు.
ఆకుని సోలనీయకు.
తొందరపడి రాలనీయకు.

అందుకే ఈ ఒక్కసారికీ కృష్ణశాస్త్రిగారి పాట నే వినిపించుకోదల్చలేదు.

దాన్నే మార్చి పాడుకుంటా ... నా మాటల్లో...

శీతవేళ ఏనాటికొ, ఏనాటికో !?
శిశిరానికి రంగేసుకొ, రంగేసుకో
ఎద లోపల పూలకారు
ఏ నాటికీ ఉంచేసుకో!


2 కామెంట్‌లు:

  1. Fall colors అందం చూపించడానికి మరీ ఒక్క ఆకు ఫొటోయేనా? మొత్తం చెట్టుది ఫొటోలు ఒకటిరెండు పెడితే ఆ అద్భుత దృశ్యం మరింత బాగా తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Fall ఇప్పుడే మొదలవుతోందండి - చెట్లు పూర్తిగా రంగు మారలేదు. మీ కమెంట్‌కి థాంక్స్, నరసింహారావుగారు!

      తొలగించండి