10, ఫిబ్రవరి 2019, ఆదివారం

కాఫీ విత్ కలిమి - 5 - అనగా వంచించారు - తినగా వంచినచారు

తోచీతోచని అసుర సంధ్య
మామూలు రోజుల్లో ఇప్పటికింకా వెలుగుండేదే
ముసురుకున్న మబ్బుల్లో చిక్కి సూర్యుడు తొలిగాడేమో
కమ్ముకోవడానికిదే అదనని అలముకున్న చిక్కనైన చీకటి
వెదకబోని దారిలో దొరకబోని రత్నాల్లా కనిపిస్తున్న ఇంటి కిటికీలోంచి కనిపిస్తున్న వచ్చీపోయే కార్ల హెడ్‌లైట్లు
అంత కన్నా మంచి సమయమేది కాఫీ పీనే కీ, కలిమితో బాతాఖానీకి?!
పొగలు కక్కే కాఫీ ఓ చేత, మీట నొక్కిన ఫోన్ ఓ చెంప
కలిమితో కబుర్లు మొదలిక...

"హలో!"

"హలో! హలో! ఎన్నాళ్ళకెన్నాళ్ళకి? ఏంటి విశేషం?"

"ఫోన్ చెయ్యగానే నువ్వు తీశావ్ చూడు  - అదే విశేషం! ఇప్పటిది ముత్యంగా మూడోసారి నేను నీతో మాట్లాడాలని ప్రయత్నించడం. ఏదీ నువ్వు దొరికితేగా! కలిమి... బా...గా బిజీ!"

"హహహ అదేం లేదులే. మొన్నెప్పుడో నువ్వు పెట్టిన మెసేజ్ విని తను నవ్వుకున్నారు కూడా - ఏమన్నావ్ -  అదే...  - 'తల్లీ! ఎన్నిసార్లు చేసినా VM కే వెళ్తోంది. ఇప్పటిప్పట్లో ఫోన్ చేసేలా లేవు, తీసేలా లేవు. ఇక నే చేయను. ఉలకని పలకని రాయిలా కాక పందార పలుకుల పావురాయిలా ఉందూ కొంచెం! నీ call-చెయ్యని తనంతో నన్ను కాల్చక గబగబా కాల్చెయ్యి మరీ' అని పెట్టావుగా. నేనే call చేద్దామనుకుంటున్నాను. ఇంతలో చేశావ్. పోన్లే! సరే గానీ ఏంటి ఇంతకీ విశేషాలు? మీకు టైం ఎంతయింది ఇప్పుడూ?"

"అసురసంధ్య వేళ కలిమి దొరికె దేవీ...కలిమి చెలిమి దొరికె దేవీ! "

"పాట వరస బావుంది. మీకిప్పుడు సాయంత్రం అన్నమాట! సర్లే. ఇంతకీ దాన్ని అసుర సంధ్య అనెందుకన్నారో, రాక్షసులు తిరిగే వేళనో, ఏమో కదా!?"

"అదేమో కానీ మా బదరి మాత్రం అది బారు-విహారులు తాగం-పానం-అల్లరి ఇంకా మొదలు పెట్టని వేళయి ఉంటుంది అందుకే అసుర సంధ్య అయింది అంటారు"

"సరి పోయింది ... మాటలల్లుకోవడంలో మీ ఇద్దరూ ఇద్దరే!"

"ఇంతకీ నువ్వెందుకు అంత బిజీయో చెప్పలేదు... ఏమన్నా రిలీజ్ నడుస్తోందా?"

"అదేం కాదు. మా అపార్టుమెంట్ కమ్యూనిటీలో ఒకళ్ళింట్లో పెళ్లి.  మా అందరిళ్ళలో హడావిడి అంతే. అన్నట్టు మరిచిపోయాను. వాళ్ళదీ గోదావరి పక్కే. అందుకే ఆవిడ వాళ్ళ పిల్లాణ్ణి  పెళ్ళికొడుకు చేసిందగ్గర్నుంచీ 'పెళ్ళికొడుకుని చేశాక నది దాటకూడదు, పొలం వెళ్ళకూడదు అని మా చిన్నప్పుడు చెప్పేవారు.' అని ఆ అబ్బాయిని ఇల్లు దాటనివ్వట్లేదనుకో. ఇప్పుడు నదులు, పొలాలు ఎక్కడున్నాయి. అయినా అప్పుడా ఆచారాలు ఎందుకు పెట్టారో. ఇప్పుడు కూడా అలాగే నడిపించాలంటే ఇప్పటి జెనరేషన్ వాళ్లకి నచ్చద్దూ?"

"ఊఁ "

"ఏంటి ఒట్టి 'ఊఁ' తో ఆపేశావ్?"

"వాళ్ళమ్మగారు చెప్పింది కరెక్టే! ఆ అబ్బాయి ఆవిడ మాట వినాలి"

"సరి! మీ గోదావరి వాళ్ళనా ఆవిణ్ణి వెనకేసుకొస్తున్నావ్?"

"గోదావరిని వెనకేసుకు రావడం, కావేరికి ఎదురీదడం కాదు. ఒకసారి పెళ్లి కుదిరాక, అందులోనూ పెళ్ళికొడుకుని చేశాక జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అప్పటికే ఇంకో అమ్మాయి జీవితం ఆ అబ్బాయితో ముడిపడింది. అనుకోనిది ఏమైనా జరిగితే రెండు కుటుంబాలు బాధ పడతాయి. అందుకే అలా చెప్పి వుంటారు మన పెద్దవాళ్ళు"

"కదా! నిజమే! నేనింత ఆలోచించలేదులే! నీకు భలే తడ్తాయి ఈ రీజనింగ్స్!"

"మెచ్చావు సరే! మేకతోలేది? హహహ!"

"అవునూ... మీ ఊళ్ళో ఎస్పీబీ లైవ్-ఇన్ కాన్సర్ట్ ఉందట కదా? వెళ్తున్నారా మీరు?"

"ఉహూ! నాకు ఆయన దగ్గరికి వెళ్లి పలకరించాలని, మాట్లాడాలని ఏమీ లేదు. అలా అని ఆయనకీ నేను తెలీదు. వెళ్లకపోతే ఏమనుకుంటారో అన్న మొహమాటాల్లేవు. ఇది వరకంటే సినిమాల వాళ్ళు అపురూపంగా కనిపించే వాళ్ళు కాబట్టి ఇలాంటి ప్రోగ్రాము లేమన్నా జరిగితే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండేదేమో...ఇప్పుడు పొద్దున్న లేస్తే టీవీల్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా వాళ్ళ ఇంటర్వ్యూలే. మన ఇంట్లో మనతో కూర్చుని వాళ్ళ విశేషాల్ని చెబుతున్నట్లే వుంటోంది. నాకు ముందు ఆ ప్రోగ్రాం గురించి తెలియగానే ఒక్క క్షణం వెళ్దామా  అనిపించింది. మళ్ళీ ఒద్దులేబ్బా అనేసుకున్నా"

"ఔనౌను ... నాగ్గుర్తుంది నీ సెలబ్రిటీస్-చార్మినార్ పోలిక. అది సరే! రథసప్తమి వస్తోంది కదా - రేపు పన్నెండో తారీఖు."

"ఔను కదా! చిన్నప్పుడు జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు తల మీద పెట్టుకుని స్నానం చేయడం, ఆ తర్వాత చిక్కుడాక్కుల్లో బియ్యప్పరవాణ్ణం తినడం - అవన్నీ తలుచుకుంటే ఇప్పటికీ భలే మంచిగా అనిపిస్తుంది."

"కదా! ఇప్పుడలా చెయ్యాలి అని తెలిసినవాళ్ళూ, తెలిసినా చేసేవాళ్ళూ బాగా తగ్గిపోతున్నారు. అదే బాధ!"

"తల్లీ కలిమీ! మనకి మనకే బాధ పడాల్సిన విషయాలు సవాలక్ష. ఇప్పుడింకో కొత్త బాధ add చేసుకోకు. ప్రపంచంలో మనం తప్పకుండా చెయ్యాలి, చెయ్యకపోతే మన జీవితం బావుండదు అని చేసే rituals గురించి అస్సలు ఐడియాయే లేకుండా మన కన్నా ఆనందంగా, ఆరోగ్యంగా బతుకుతున్నవాళ్ళు కోటానుకోట్లు. నా వరకు నాకు తెలిసి తెలిసి ఎవరినీ ఇబ్బంది పెట్టకపోవడమే మంచి సంప్రదాయం - అది పూజైనా, పునస్కారమైనా!"

"నేనొప్పుకోను! నువ్వు మాత్రం రోజూ స్తోత్రాలు, పాడుకుంటావ్, లలిత నేర్చుకోవాలి పూర్తిగా అర్థం చేసుకుంటూ అంటావ్. నీకు లోపల్లోపల దేవుడంటే భయమే! ఆంటీ అంటుంటార్లే 'మా లల్లి పెళ్ళికి ముందు ఇలా ఉండేది కాదు, ఇప్పుడే ఇలా కొత్తగా మాటాడుతోంది' అని. నువ్వు మాత్రం ఆచారాలున్న background నుంచి రాలేదా? వాటినెప్పుడూ కాదనకుండా ఆచరించలేదా?"

"నువ్వన్నది నేను ఏదీ కాదనను."

"మరి..."

"అరె! నన్ను పూర్తిగా చెప్పనీయ్! చిన్నప్పుడు నాన్నమ్మతో గుడి కెళ్ళేదాన్ని. తర్వాత మా శివకోడు శివుణ్ణి చూడ్డానికీ వెళ్లేదాన్ని - ఎందుకంటే ఆ గుడిలో మా తాతగారు కట్టించిన మండపం, దాని పక్కనున్న బిళ్ళగన్నేరు చెట్టూ ఇష్టం కాబట్టి. మా అమ్మ పూజ్జేస్తుంటే పక్కనే కూర్చుని ఆవిడకి వరలక్ష్మీ వ్రత కథలూ, వినాయకచవితి కథలూ చదివేదాన్ని.  అది చదవడం మీద ఇష్టం, దేవుడు కొడతాడన్న భయంతో కాదు. తర్వాత్తర్వాత పెళ్లయ్యాక ఏదైనా చేయను అంటే దాంతో వచ్చే conflict ని భరించడంలో వున్న బాధ కన్నా - ఒక్క గంటో, అరగంటో నాది కాదనుకుని పెద్దవాళ్ళు చెప్పింది చెప్పినట్లు చేస్తే దాని వల్ల వాళ్ళకొచ్చే ఆనందం బావుందనిపించేది. అందులోనూ నాలా ఎవరైనా ఒక అబ్బాయి మాట్లాడితే 'Wow! ఎంత progressive గా మాట్లాడుతున్నాడు' అనుకునే వాళ్ళే ఆడపిల్లనైన నన్ను aggressive అనేస్కునే వారు తప్పకుండా. ఎందుకొచ్చిన తిప్పలు కదా! నా వరకు నాకు ఈ భక్తి, నమ్మకం అనే విషయాలు చాలా personal. అనవసరంగా వాటిని exhibit చేసి నేను ఏ ఒక్క groupకో మాత్రమే చెందుతానని అనిపించుకోవడం నచ్చదు."

"మరి స్తోత్రాల మాటో - అవెందుకో మరి?"

"ఇవాళ నన్ను ఒదిలిపెట్టేలా లేవు - హహహ!"

"మరి... ఎప్పుడూ మాట్లాటేనా? అప్పుడప్పుడూ నీతో ఇలా పోట్లాడితేనే సరదా!"

"అల్లాగే కానిద్దాం... కానీయ్. మాట్లాటో, పోట్లాటో నీతో ఏదైనా సరదాట్లాటే"

"నేనడిగిందానికి చెప్పు - మనసులో ఏమీ లేకుండానే ఈ భాగవతాలూ, భగవంతుడి స్తోత్రాలూ - వీటి సంగతి ఏంటి?"

"తల్లీ! భాషానురక్తికీ, భక్తికీ ముడిపెట్టకు. నాకు అర్థాలంకారాలూ, శబ్దాలంకారాలూ వుండేవి ఏవైనా చదవడం, పాడుకోవడం ఇష్టం. పోతన పద్యం, కృష్ణశాస్త్రి కవిత, ముళ్ళపూడి వచనం - ఇవన్నీ తీపి తీపి తెలుగు, అవి తేట తేట తెలుగు... అంతే! అది కృష్ణుడి కథా, కృష్ణశాస్త్రి వ్యథా అనే తేడా లేదు నాకు."

"హ్మ్ ...పోన్లే - ఇంక విసిగించనులే... అయినా చెప్పావుగా ఇంతకు ముందెప్పుడో - రెలిజియన్, పాలిటిక్స్, గ్రేట్ పంప్కిన్, పిల్లలూ, ఫిల్ములూ... కావవీ నా టాపిక్కులకి top-pick లని! ఇంతకీ ఇవాళ్టి ఘుమఘుమలేంటి నీ వంటింట్లో?"

"వంచించారు"

"ఏమది? ఏమని వచించావు. వంట చేయక యింటివారిని వంచించావా?"

"ఉండు మరి! నా పచనం గురించి ఈ  వచనం కూడా విను. ఇవాళ మా వంటింటి వంట బస్సారు, అంటే కన్నడంలో బగ్గిసువ సారు, దాన్నే తెలుగులో గబగబా అనగా వంచించారు  - తినగా వంచినచారు. ఆక్కూరలు ఉడికించిన నీళ్ళని వంచి (వార్చి), ఆ నీళ్లతో చేసే చారిది."

"తల్లీ! నీ పచనం, నీ వచనం, ఆ పైన నీ రచనం ...చేయబోయి నిర్వచనం - నేనాయె నిర్-వచనం"

"భలే!  చూశావా ...నాతో పోట్లాట అన్నావు కానీ మాటలతో ఆట్లాడుతున్నావ్!"

"నీతో మాటే ఒక ఆట. నాదేం లేదులే ... పూలల్లిన నారని. ఆ మాత్రం వాసనంటక పోదు"

"పూలల్లిన నారవి కాదు - పూవంటి నారివి, పూవింటి నారివి"

"ఆహా.. హా ... హా - నువ్వంటూ నే వింటూ ఉంటే బావుంటుంది సుమీ!"

"అలా నేనన్నది తలుచుకుంటూ నవ్వుకుంటూ అక్కడ నువ్వుండు. నువ్వన్నది బావుందనుకుంటూ వండుకుంటూ ఇక్కడ నేనుండు. టాటా...  వీడుకోలు. ఇప్పటికి bye - ఇంక సెలవు"

"హహహ ...bye bye"

చివరాఖరి సిప్పు

Love, affection, friendship... Give unconditionally - take nonjudgmentally ~meSayIt

6 కామెంట్‌లు:

  1. బాగుంది మీ పోస్ట్ లలిత గారు. ఈ వంచించారు అనబడే వంచిన చారు అప్పుడప్పుడూ మా ఇంట్లో కూడా చేస్తూ ఉంటుంది మా ఆవిడ, అప్పుడు తనని కన్నడ హుడిగి అని అంటూ ఉంటాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీతో ఓ మంచి వ్యాఖ్య రాయించిన వంచించారు మహా మంచిచారండి, పవన్‌గారు!

      తొలగించండి
  2. Adbhutamgaa vachinchaaru!!

    Upiri tippukonivvani sudigali vegam valla, enni vishayaalu okka post lo vacheseyo kada..bhaoe!!

    Anipinchaaru!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరున్నూ మీ ఈ కమెంట్ మహా మంచిగా వుందనిపించేహారు...

      "అద్భుతంగా వచించారు!! ఊపిరి తిప్పుకోనివ్వని సుడిగాలి వేగం వల్ల, ఎన్ని విషయాలు ఒక్క పోస్ట్‌లో వచ్చేసేయో కదా..బావోయ్!! అనిపించారు!!!"

      తొలగించండి
  3. "పెద్దవాళ్ళు చెప్పింది చెప్పినట్లు చేస్తే దాని వల్ల వాళ్ళకొచ్చే ఆనందం బావుందనిపించేది." - దీని మీద ఒక గ్రంథం వ్రాసేయొచ్చు. పెద్దవాళ్లమయ్యి మన పిల్లలకి వాళ్ళడిగింది ఏమి ఆశించకుండా ఇస్తాం కదా, అలాగే మన పెద్దవాళ్ళు అడిగింది ఇవ్వగలిగితే ఆనందం తాలూకు క్రొత్త తలుపులెన్నో తెరుచుకొంటాయి. మీ కాఫీ కలిమి కబుర్లలో ఇప్పటిదాకా ఇది ఉత్తమమైన పోస్ట్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరెప్పుడూ నా పోస్టులని భలే మెచ్చుకుంటారు, అన్యగామిగారు! బోల్డన్ని ధన్యవాదాలు!

      తొలగించండి