19, జులై 2019, శుక్రవారం

త్వామనురజామి - 38 - రూఠియే న, నాన్నా! ఆప్ యూ రూఠియే న!


కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 37 - సాయంత్రానికి ఏమి జరుగునో...



శ్రావణ భాద్రపదాలు వర్షఋతువు - వర్షములు విశేషముగా ఉండును.
చిన్నప్పుడు ఎక్కాల పుస్తకంలో చదువుకున్న ఋతువుల వర్ణన అది.
బెంగుళూరులో మబ్బులు తు. చ. తప్పకుండా పాటిస్తాయేమో ఋతువుల్ని... ఊరు ఊరంతా తలంటోసుకుని - తార్రోడ్లు నల్లగా నిగనిగలాడుతూ, చెట్ల ఆకులు పచ్చగా తళతళలాడుతూ, కొమ్మల విరిసిన రంగురంగుల పూలు కళకళలాడుతూ - శ్రావణ మాసపు పేరంటాలకి ముస్తాబు చేసుకుని మెరిసిపోతూ ఉండేది.

పొద్దున్న అమ్మా, నేనూ గుడికి వెళ్ళొచ్చేటప్పటికి అప్పటి దాకా ఎండ మండించిన సూరీణ్ణి మూసేస్తూ మబ్బులు...ఆ వెనకనే బడొదిలి పెట్టగానే బూట్లు టకటకలాడించుకుంటూ, ఖాళీ టిఫిన్ డబ్బాలు డబడబలాడుతూ  గబగబా ఇంటికి పరిగెట్టే పిల్లల్లాగా ఫెళఫెళ ఉరుములు, తళతళ మెరుపులతో బోల్డన్ని చినుకులు - ఇంకేముంది ఓ   పెద్ద వాన.

అసలే బెంగుళూరు మధ్యాహ్నం - అందులోనూ చల్లగా వుంది - ఆ పైన వాన కురిసింది. బద్ధకం నేనొచ్చాలే నీకు తోడంది. ఇంకేముంది... నా చేతి లోంచి  పుస్తకం కిందకి, నేనేమో నిద్ర లోకి ఒకేసారి జారాము. సాయంత్రం నాలుగింటికో ఏమో అమ్మ లేపుతుంటే కళ్ళు విడవే! వాటికీ పగలో, రాత్రో తెలియని అయోమయమేమో... అలవాటు లేని చలవ-ఝాముకి పగటికలలు, రాత్రికలలు అన్నీ కనేసుకుంటూ బిజీగా ఉన్నట్టున్నాయి. తెరవమంటే కుదరదని మొండికేశాయి.

ఇంతలో అమ్మ నెమ్మదిగా "లే! లల్లీ... లేచి మొహమదీ కడుక్కుని రా.  జడ వేస్తాను.  పాలు కలిపిస్తాను" అంటూ తడుతోంది.

అమ్మ గొంతు వినగానే చటుక్కున లేచాను. ఆవిడ చెప్పినట్లే బుద్ధిగా జడ వేయించుకుని, దానికి ఎప్పట్లా చివర్న నల్లరిబ్బను అల్లుకుని పైక్కట్టుకోకుండా ఓ రబ్బర్ బాండ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత పాలు తాగి ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాక మళ్ళీ సోఫాలో ఓ పక్కక్కూర్చుని బుక్ చదువుదామని తీసుకున్నాను. కానీ చదవాలనిపించలేదు. అంతకు మించి మంచి excuse లేదు కాబట్టి చదివిన పేజీనే పదిసార్లు ఒక్కో సెంటెన్సులో a, an, the ఎన్నిసార్లు వస్తున్నాయి, వాటికేదన్నా pattern ఉందా అంటూ ఏదో పనిలేని పజిల్ ఒకటి నాకు నేనే అడిగేసుకుని లెక్కలేసేస్తున్నాను. నాకు లోపలంతా ఒకటే గాబరా. అప్పటికప్పుడు బయటికెళ్ళిపోయి విజయనగర్ రోడ్లన్నీ తిరిగి రావాలనిపించింది. ఆ మాట బైటికంటే ఇంకేమన్నా ఉందీ? మా అమ్మ నన్ను మళ్ళీ సంస్కృతంలో తిడుతుంది. అందుకని కంగార్లూ, గాబరాలూ వగైరావగైరాలన్నీ పక్కకి పెట్టి సైలెంటుగా కూర్చున్నాను.

ఐదూ, ఐదున్నర అవుతుండగా శ్రీను, నాన్న వెళ్లి ఇంటి గేటు దగ్గర నించున్నారు. ఓ పది నిముషాల్లో "బావున్నారా?" అంటూ పలకరింపులు, "రండి. రండి" అంటూ ఆహ్వానాలతో హడావిడి మొదలయింది. పెద్ద సుందరి పిన్ని, బాబయ్య, వాళ్ళతో వచ్చిన ఇంకొకతను - ముగ్గురినీ దగ్గరుండి శ్రీను, నాన్న లోపలికి తీసుకొచ్చారు.

అమ్మ, శ్యామల కూడా వచ్చిన వాళ్ళు ముగ్గురినీ పలకరించి "మంచి నీళ్లు కావాలా? కూర్చోండి " అంటూ సోఫాలు చూపించారు.

సుందరిపిన్ని నన్ను చూస్తూనే "జ్ఞాపకం ఉన్నానా? అప్పుడో సారి మీ శ్రీనన్న జయనగర్లో మా ఇంటికి తీసుకొచ్చాడు. పేరూర్లో శ్రీను పెళ్ళికి నువ్వు, నేను, ప్రశాంతి పల్లకి ఊరేగింపులో కలిసి తిరిగాము" అంటూ చనువుగా మాట్లాడుతూ ఇంతకు ముందు మేమెక్కడెక్కడ కలిసిందీ ఇష్టంగా గుర్తు చేసుకున్నారు. నేను కూడా మొహమాటంగా నవ్వి వాళ్ళ ఇద్దరమ్మాయిలు - కాము, ప్రశాంతిల - గురించి అడిగాను.

ఆ తర్వాత ఇంకేం మాట్లాడాలో తోచక నా చేతిలో వున్న పుస్తకం అట్ట కేసి చూస్తూ దాని డైమెన్షన్స్ మనసులో ఎస్టిమేట్ చెయ్యడం మొదలుపెట్టాను. ఏమీ లేదు... ముందు ఏం జరగబోతోందో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకంతగా క్లారిటీ లేదు. అందుకే అటూ, ఇటూ పరిగెడుతూ అడ్డదిడ్డంగా ఆలోచిస్తున్న నా బుర్రని కొంచెం కంట్రోల్లో పెడదామని ఆ తిప్పలు అంతే ... అంతే!

ఈలోగా కాఫీలు తాగుతూ, పకోడీలు పలారం చేస్తూ, కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ ఓ అరగంట గడిచింది. అవీ, ఇవీ, అన్నీ అయ్యాక నాన్న నాకేసి చూసి "లల్లీ! తనేదో నీతో మాట్లాడాలంటున్నాడు. చగ్గా ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకోండి సరదాగా" అన్నారు ఏదో చులాగ్గా తేల్చేస్తున్నట్లు.

సరే! మాటలేగా! అవెలాగూ నాకు బానే ఒచ్చుగా! మా అమ్మ కూడా అంటూ వుంటుందిగా - "నీకు చిన్నప్పుడు వసెక్కువ పోసినట్టున్నాం" అని! నా ప్రాజెక్టుల కోసం ఎలిసిటేషన్లు, ఇంటర్వ్యూలు చేసినట్లే ఇది కూడా - ఇలా నాకు నేనే చెప్పుకుంటూ వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. నాతో మాట్లాడాలనుకున్న తను కూడా వచ్చి నాకెదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు.

కుర్చీలో వెనకాల చిక్కుకున్న జడని తప్పించుకుంటున్నట్టు ఓ పక్కకి ఒంగి ఇంట్లో వున్న మిగిలినవాళ్ళందరూ ఏం చేస్తున్నారా అని చూస్తే వాళ్ళు ఇంటి గడపకి అవతల గేటు దగ్గర నించుని మాటలతో గలగల్లాడుతూ, నవ్వులతో కిలకిల్లాడుతున్నారు.

హ్మ్! చూద్దాం! ఎలా జరుగుతుందో మా మాట్లాట! పేర్లు ముందే తెలుసు కదా - పూర్తి పేర్లు కాకపోయినా ఇంట్లో పిలుచుకునే ముద్దుపేర్లు - అందుకని పేరేంటంటే పేరేంటని అనుకోలేదు.

మా వింటర్వ్యూ మొదలు.

నేను గట్టిగా అనుకున్నా - నన్నేమడిగినా సరే  - రెండు మార్కుల ప్రశ్నకి ఐదు మార్కుల సమాధానంలా కాక - ఒక్కటంటే ఒక్క మార్కొచ్చే బిట్టు పేపర్లా ఏన్సర్ చెయ్యాలని.

“ఏం చేస్తున్నారిప్పుడు?” మొదటి ప్రశ్న నాకే. 

“MCA ఫైనలియర్ ప్రాజెక్ట్ కోసం వచ్చాను. రేపు థర్డ్ నుంచి NAL లో మొదలవుతుంది.” నా స్టూడియస్ సమాధానం బిట్టు పేపర్ ఒట్టుని పక్కన పెట్టి.

“ఎందులో?” మళ్ళీ ఇంకో ప్రశ్న నాకు.

“అంటే?” NAL లో అన్నాక ఇంకా 'ఎందులో' ఏంటి? అనుకుంటూ ప్రశ్నకు సమాధానంగా నా ప్రశ్న. 

“అదే, ఏ లాంగ్వేజ్ లో?”

“సి++” బ్యాక్ టు బిట్టు పేపర్.

“హ హ హ”

“ఎందుకు నవ్వుతున్నారు?” ఉక్రోష-ప్రశ్న.

“ఏం లేదూ, మా ఆఫీసులో నేను ఇంటర్వ్యూలు చేస్తూ వుంటాను. ఇదిగో ఇలాగే మీలాగే C ఒచ్చూ, ఇంకోటొచ్చూ అనుకుంటూ వస్తారు. తీరా ఓ రెండు ప్రశ్నల తర్వాత తెలుస్తుంది చెప్పినంత ఏదీ రాదనీ” ఓ బ్లాంకెట్-స్టేట్మెంట్ ఇంటర్వ్యూల్లో సమాధానాల గురించి.

“నేనెప్పుడూ ఇంటర్వ్యూలకి వెళ్ళను. వెళ్ళినా నాకు రానిదాన్ని ఒచ్చని చెప్పను.”

“అదేం? MCA చదువుతున్నారు.  ప్రొఫెషనల్ కోర్స్. ఉద్యోగం చేయరా?”

“నాకు ఒకళ్ళు చెప్పే మాట వినడం అలవాటు లేదు. ఉద్యోగం నా ఒంటికి పడదు." కచ్చితంగా చెప్పాను.

“అంటే, ఎవరి మాటా వినరా?” ఆశ్చర్యం-ప్రశ్న.

“వినను” స్థిర-సమాధానం.

“మీ మంచి కోసం చెప్పినా వినరా?” Poking-ప్రశ్న. 

“ఉహూ!”

“అంటే, ఇదిగో టేబుల్ మీద ఈ నూనెగిన్నుంది. చేయి తగిలితే ఒలికిపోతుంది, జాగ్రత్త అని చెప్పాననుకోండి…” ఇంకా అతని మాట పూర్తి కానే లేదు-

చటుక్కున అందుకుని “చేయి తగిలించి పారబోసి, ఒలికిపోయిన నూనెని - ఇదిగో ఈ స్పాంజ్‌తో తుడిచి క్లీన్ చేస్తాను” అని గబగబా అనేశా పెంకితనంగా.

అంతే ! ఇంక అడిగించుకోవడానికి ప్రశ్నలూ, అడిగి వినిపించుకోవడానికి సమాధానాలు ఏమీ మిగల్లేదు.

ఇద్దరం డైనింగ్ టేబుల్ దగ్గర్నుంచి లేచి ఇవతలికి లివింగ్ రూం లోకి వచ్చాము.  మళ్ళీ అందరం అక్కడే కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నాక శ్రీను, నాన్న వచ్చిన వాళ్ళని పంపించి వస్తామని వెళ్లారు.

ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర అసలా సాయంత్రం జరిగిన విషయాలేవీ మాట్లాడుకోకుండా మరసటి రోజు అమ్మా, నాన్నల గుంటూరు ప్రయాణం గురించి మాత్రమే జరిగింది మా సంభాషణ. ఏం మాట్లాడితే నేనేం హర్ట్ అవుతానో అన్నట్లు చాలా డెలికేట్‌గా ఆ సాయంత్రాన్ని నడిపించిన మా అమ్మకీ, నాన్నకీ ఎంత థాంక్స్ చెప్పుకున్నానో నేను మనసులో.

ఇక ఆ రోజు రాత్రి అమ్మ,నాన్న, నేను గెస్ట్ బెడ్‌రూమ్‌లో పరుపులు వేసుకుని పడుక్కున్నామే కానీ ముగ్గురం చాలా సేపటి దాకా నిద్ర పోలేదు. మాలో ఎవ్వరూ ఇంకా నిద్రపోలేదని మా ముగ్గురికీ తెలుసు. కానీ కదలకుండా మెదలకుండా నిశ్శబ్దంగా వున్నాము. నాకైతే నా ఊపిరి తీసే శబ్దం కూడా బయటికి వినిపించకపోతే బావుణ్ణు అనిపిస్తోంది.

ఇంతలో నాన్న నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టారు... "లల్లీ! నీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. ఆ తిరపతబ్బాయి వాళ్ళింట్లో పెద్దకొడుకు. వాళ్ళ నాన్నగారు లేరు. అతని తర్వాత ఇంకా ఇద్దరున్నారు. భాద్యతలెక్కువ. కష్టపడతావ్. నువ్వే ఆలోచించుకో" అని ఆపేశారు.

అంతే! అలా అని పక్కకి తిరిగి పడుకుండిపోయారు. నాన్న గొంతులో కన్సర్న్ తప్ప కోపం వినిపించలేదు.

అమ్మ మాత్రం ఏమీ మాట్లాడలేదు. అమ్మ మౌనంలో బెంగ తప్ప నేనంటే వెగటు అనిపించలేదు.

వాళ్ళిద్దరినీ బాధ పెడుతున్నానని నాకూ తెలుసు ...కానీ ఆ బాధకి లొంగి నా ఇష్టాన్ని కాదనుకుంటే కలగబోయే కష్టాన్ని తలుచుకుంటే...అమ్మో!  దానికన్నా ఎలాగోలా అమ్మా, నాన్నలని ఒప్పించడమే నయం! వాళ్ళు ఒప్పుకుంటేనే ముందుకి సాగడం... దానికెన్ని రోజులూ, నెలలూ పట్టినా ఫర్వాలేదు - అలా అనుకోగానే హాయిగా అనిపించింది...

అలీషాని అడిగో హిందీ పాట అప్పు తెచ్చుకున్నా... మా నాన్న కోపం తగ్గాలని నా మాటల్లో పాడుకుంటూ... పడుక్కున్నా!

రూఠియే న, నాన్నా! ఆప్ యూ రూఠియే న!
జరా సా సోచియే మేరే లిఏ
క్యా కోఈ ముఝ్‌సే హుఈ ఖతా?!

ముఝే వో హర్ కిసీసే ప్యారా హై...
జైసే ఆప్ ముఝే ప్యారే హై !
మై ఉస్‌కే బినా కైసే జీఊంగీ బోలియే!

నహీ హూ ఐసీ మై నాదాన్…
జానే న దూంగీ ఆప్‌కీ షాన్...
జరా తో సమఝియేనా, నాన్నా!  హా భీ కహ్ దే! 

మేరే నాన్నా! దీజియే  మేరా సాథ్!
ఐసే తో న హోనా ఆప్ ఉధాస్
ఆప్‌కో  మేరీ కసమ్!  ముఝే ఐసే న రోకియే !
ఐసే న రోకియే

  <<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

8 కామెంట్‌లు:

  1. Ruth hi gaye lalli ji aap ke saath
    Ruth gaye

    Kijiye na puraa ye kahaani ek saath
    Kijiyee

    Mushkil ye dil ki
    Samajhiye naa aap zara samajhiye

    రిప్లయితొలగించండి
  2. Well written as always👏👏.... Appude ayyipoyinda anipinchidi.... waiting for next one

    రిప్లయితొలగించండి
  3. What an episode in every girl's life... Each with her own ending, her own version of happily-ever-after.. Nicely penned. The bonus was the description of Bangalore monsoons!

    రిప్లయితొలగించండి
  4. కింద ఒలకబోసి స్పాంజ్ తో తుడిచేస్తారా? 😊 బాగుంది లలిత గారు మీ పోస్ట్ ఎప్పటిలాగే.

    రిప్లయితొలగించండి