23, ఆగస్టు 2020, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 21 - కవలపాటలు - శత్‌రంజ్‌ ముందా? జీవితచక్రం ముందా?


ఒక్కోసారి పాటను గమనించను నేను 
అప్పుడా పాట... నా కోసం గాలిలా మారుతుంది 

ఆదమరుపు వేళ 
అలవోకల లీల 
అలలుగా వస్తుంది 
ఆకుల కదలికల ఉనికిలా మసలి 
తాకి తాకి పలకరించి పోతుంది 
తావి పూసి పులకరింత తానౌతుంది

తనని చూడమని నన్ను... 
తాకి తాకి 
తావి పూసి 
పలకరించి పోతుంది

ఒక్కోసారి పాటను వినను నేను 
అప్పుడా పాట... నా కోసం పాపలా పాకుతుంది 

దోబూచులాటల 
చిన్నారి మాటల
చిలిపి చిందులేస్తుంది 
అమ్మ మదిలో కలిమిలా నిలిచి 
చిలికి చిలికి మువ్వలా మోగుతుంది 
 మురిసి మెరిసి సవ్వడై సాగుతుంది 

తనని వినమని  నాకై  - 
చిలికి చిలికి 
మురిసి మెరిసి  
మువ్వలా మోగుతుంది  
******************
******************


ఎన్నో మాటలు...
మాటలు పేర్చగా పుట్టిన పదాలు
పదాల రాగం కూర్చగా మోగిన పాటలు
పాటలు ఎన్నని వింటాను?
పాట విన్న హాయి ఎంతని మోస్తాను?
హాయి మోయలేక అశ్రువై ఎంతని కురుస్తాను?

ఇలా అనుకునే -  నేను నా దారిన నే పోతుంటానా?!

అదేంటో కానీ...  కొన్ని పాటలు - ఆడబోయిన తీర్థాల దొరికిన పాడబోయిన పదాలై - ఏ గోడ చాటునుంచో "దోబూచ్చి!" అని ఒక్క ఉదుటున నా మీదకి దూకి పలకరిస్తాయి.

నిన్న కాక మొన్నటి రోజున - సరిగ్గా ... అల్లాంటిదే ఓ పాట - అదాటున నన్నల్లుకొని - "నన్నాలకించు"మని నన్నాటకాయించింది.

ముందు నేను బెట్టు చేశాను. .

"నీకన్నా ముందు విన్నవే ఇంకా వదిలించుకోలేకున్నాను, విన్న పాటలే పదేపదే వింటూ పలవరిస్తున్నాను. ఇహ ఇప్పుడు ఇంకొక నువ్వా? చాలు, చాలు! నన్ను వదులు" అని విదిలించుకుని ముందుకి పోబోయాను.

నేను విదిలించుకుని వెళ్ళిపోతే "పోన్లెమ్మ"ని నన్ను వదిలి వెళ్ళడానికి - అది పాటా? మరొహటా?

"ఇంతకుముందు విన్నవేవో విన్నావు. ఇక ముందు వినబోయేదాన్ని నేనొక్కదాన్నే నీకు ఎక్కువయ్యానా? అంత వెక్కసమయ్యానా? నన్నొక్కసారి వినవూ?" అని నన్ను పీడించింది. పదేపదే వినిపించింది.

అప్పుడిక నాకు నిలిచి వినక తప్పలేదు.

విన్నాను.

విన్న పాటలన్నీ విన్నపాటునే నచ్చుకుని నెత్తికెక్కిచ్చుకోవాలనేమీ లేదుగా!

నచ్చలేదంటే అలిగి వదిలిపోతుందని "చాల్లే! ఇంతోటి పాటవు - విన్నాను గానీ ఏముందని నీలో? విన్నానుగా ... ఇహ నీ పల్లవిని చరణాల మీద మోసుకుంటూ వెళ్ళిరా!" అని వెక్కిరించి పారిపోబోయా.

వదులుతుందా పాట? పోబోయిన నన్ను గాలిలా చుట్టేసింది. పసిపాపలా మారి ఎత్తుకోమని మారాం చేసింది. చివరికి భుజాలెక్కి చెవుల చేరి మోగింది. దానితో చేరి నన్నూ మోగమంది.

మొగమాటం లేకుండా తను మోగి నన్ను మోగిస్తున్న రాలుగాయి పాటతో చేరిన నా పాట రాగాల మోతల మా ఇల్లు ఆగమయింది.

మోగుతున్న పాటతో పాటు ఊగుతున్న నేను అలుపొచ్చి ఓసారి ఆగాను.


ఆగి పాటతో  "నచ్చలేదన్నానా? ఏ గాలితో పాటు వచ్చావో ఆ గాలిలో తేలిపో. నెలవు లేదిక్కడ. నీకిదే నా సెలవు" అన్నానో లేదో - అప్పటివరకూ విచ్చిన మువ్వలా గలగల్లాడుతున్న పాట కాస్తా - మూసిన ముత్యమై,  ముడుచుకున్నదై - సన్న గొంతు రాగాల "నన్ను కూర్చిన వారే పేర్చిన నా అప్పో, చెల్లో ఒహతుంది. తనంటే నీకిష్టమనీ, తనలాగే ఉన్న నన్నూ చేరదీస్తావనీ చెప్పి గాలి అలల మీద నన్నంపింది." అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది.


"ఏమన్నా చెప్పు. నిన్నానమాలు కట్టలేకపోతున్నాను." ఎలా అయినా పాటని 'పద పద పమ్మక్క' అని పంపేద్దామనే నా పాట్లు.


"సర్లే! ఎంత చెప్పినా వినేట్లు లేవు. నన్నంపకాలు పెట్టక మానేట్లు లేవు. ఎలాగూ వెళ్ళిపోయేదాన్నేగా - నా మాటొహటి వింటావా?" చరణాల మీద పల్లవినెత్తుకుని లేచింది పాట.


జాలేసింది నాకు "అసలే చెప్పుల్లో కాళ్ళెట్టుకుని ఉన్నావు - ఆ మాటేదో తొరగా చెప్పు మరీ!" అన్నా.


అప్పుడు మొదలెట్టింది - పదే పదే పాడుతున్నా పాడిన పాటే - అన్నట్టు మొట్టమొదటినుంచీ చెప్పడం తన కథ.


"నువ్వు నన్ను విన్నావుగా - తెలుగు మాటలతో మొదలయ్యే నేను అసలుకే హిందీ పాటను. నన్ను సరిగ్గా విను - మధ్యలో నేను యెంకన్నా... యెంకన్నా...బత్కమ్మా... బత్కమ్మా... అని వినిపిస్తాను కదా?! అది వింటే నీకేమీ గుర్తు రావట్లేదూ?" అడిగింది పాట. 

"ఆ... నిజమేనోయ్... ఇప్పుడు గుర్తొస్తోంది - మాకూ తెలుగులో జీవితచక్రం సినిమాలో మా ఘంటసాల అచ్చు ఇలాగే వస్తావా? మురిపిస్తావా? అని పాడినట్టు గుర్తు. అన్నట్టు ఆ పాటకి సంగీతం కట్టింది శంకర్ - జైకిషన్ కదూ? అందులో శంకర్ మా హైద్రాబాద్ వాడేగా? భలే! అయితే నిన్నూ వాళ్ళిద్దరే కట్టారంటావ్?"

"అదే కదా మరి! అందుకేగా బత్కమ్మని నా మాటల్లో చేర్చిందీ?! మీ తెలుగు 'జీవితచక్రం' లో కూడా 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో - బంగారు గౌరమ్మ ఉయ్యాలో' అనే పాట కూడా ఉంది - నీవు జ్ఞాపకం ఉందా? అంతే కాదు మీ ఘంటసాల 'వస్తావా? మురిపిస్తావా? 'అంటూ పాడిన పాటనే ఇంకో అమ్మాయి కూడా పాడింది 'ఆశలు... దాచకు..' అంటూ " తనని గుర్తుపడుతున్నానని ఉత్సాహపడి ఊపిరోసుకుంది పాట. 

"ఆ... ఆ... గుర్తుందిలే ... అదే 'కంటి చూపు చెప్తోంది - కొంటె నవ్వు చెప్తోంది- మూగ మనసులో మాట...  ఓ రాజా!' అనే పాటేనా?" పాట నన్ను రెట్టిస్తోందని నా ఉక్రోషం. 

"అద్దీ ... అద్గదే! నా తోబుట్టువైన ఆ పాటను పాడింది, నన్ను రఫీ సాబ్‌తో పాటు పాడింది ఒక్కళ్ళే - శారద అని" అంటూ గెంతింది పాట. 

"ఎవరూ శారదా? అంటే మా ఊర్వశి శారదే? ఆవిడ పాడుతుందని నాకు తెలీదే?" కళవెళ పడి తికమకలయ్యా. 

"బానే ఉంది సంబడం! పుట్టినప్పట్నుంచీ పాటలు వింటున్నానంటావ్. నటనమాడే శారద, పాట పాడే శారద ఒకరే ననుకుంటావ్. నన్నూ, మీ 'కంటి చూపు చెప్తోంది' తెలుగు పాటనూ పాడింది ఒకటే శారద  - శారదా రాజన్ అయ్యంగార్." నన్ను వెక్కిరించింది పాట. 

"ఛ" నాలుక్కరుచుకున్నా. "ఎంత పనయ్యింది. ఇన్ని పాటలూ పాడి, అన్ని పాట్లూ పడి ఓ పాట చేత ఇవన్నీ చెప్పించుకోవాల్సి వచ్చిందే" అని సతమతమయ్యా. 

పాట అప్పటికే నా భుజమెక్కేసింది. 

చెవి మీదుగా ఒరిగి "ఒకసారి విని చూద్దూ... నీకే తెలుస్తుంది నేనెలాంటిదాన్నో" అంటోంది. 

నాకేమో ఇంకొక్క సందేహం మిగిలిపోయింది. ఇంతవరకూ వచ్చాక ఇక ఈ పాటతో మొహమాటమెందుకు అనేస్కుని అడిగేశా..."శత్‌రంజ్‌ ముందా? జీవితచక్రం ముందా?" అని. 

"ఏమో... మీ మనుషులు రాసుకున్న వికీలో చూసొచ్చా...ఒకటి 69, ఇంకోటి 71 అని. ఏది ముందైతే ఏముంది చెప్పు. రెంటినీ కట్టినవారు ఆ ఇద్దరే , రెండిట్లో పాడిన ఇద్దరిలో ఒకరు ఆ శారదే! ఆ రెండు ముక్కలూ చాలవూ - ఈ రెండు పాటలని నీ కవలపాటల్లో చేర్చుకోవడానికి?" దబాయించింది పాట. 

నా మీద పాట గెలిచిందనక ఇంకేమంటాను?

కిమ్మనక ఆ పాటలు రాసి ఈ కింద పెట్టుకున్నా ... వాటి బొమ్మలూ తెచ్చి ఇక్కడ అట్టే పెట్టుకున్నా...

శత్‌రంజ్‌ పాట: బత్కమ్మ ... బత్కమ్మ...  బత్కమ్మ...  బత్కమ్మ... 

ఈ పాటలో హెలెన్ నాకు భలే నచ్చేసింది. అందులోనూ పాట మొదట్లో ఆవిడ వేసుకున్న డ్రెస్సు ఎలాంటిదంటే నా చిన్నప్పడు నాలుగుస్తంభాలాట ఆడుకున్న శ్రీరామనవమి పందిట్లో కట్టిన ప్లాస్టిక్ పూల హారాల్లోంచి తీసిన పూలతో కుట్టినట్లుంది.

అంతే కాదు ... హెలెన్ మొహం మీద మెరుపులు, ఒంటిలో తిరిగిన మెలికలు.... వాహ్! చూడాల్సిందే!





బత్కమ్మా!  ఓ బత్కమ్మా!
 ఏమి?
ఏమైందిరా...?

బత్కమ్మ ... బత్కమ్మ...  బత్కమ్మ...  బత్కమ్మ... 
ఎక్కడ పోతోరా? ఎక్కడ పోతోరా? ఇక్కడ ఇక్కడ రా!

యెంకన్న... యెంకన్న... యెంకన్న... యెంకన్న... 
ఎక్కడ పోతోరా? ఎక్కడ పోతోరా? ఇక్కడ ఇక్కడ రా!

చిన్నమ్మ...  చిన్నమ్మ ... చిన్నమ్మ...  చిన్నమ్మ...
ఎక్కడ పోతోరా? ఎక్కడ పోతోరా? ఇక్కడ ఇక్కడ రా!

అరే... యెంకన్న... యెంకన్న... యెంకన్న... యెంకన్న...
ఎక్కడ పోతోరా? ఎక్కడ పోతోరా? ఇక్కడ ఇక్కడ రా!

ఓయే జానే పాషా బత్కమ్మా  బత్కమ్మా
రాం జానే పాషా బత్కమ్మా  బత్కమ్మా

మై ఆజ్ బజానేవాలా హూ తేరే దిల్ కా తాషా బత్కమ్మా
దిల్ క తాషా బత్కమ్మా బత్కమ్మా

యెంకన్నా... యెంకన్నా...
బత్కమ్మా... బత్కమ్మా... 
బత్కమ్మా!  ఓ బత్కమ్మా!

యెంకన్న... యెంకన్న... యెంకన్న... యెంకన్న...
ఎక్కడ పోతోరా? ఎక్కడ పోతోరా? ఇక్కడ ఇక్కడ రా!


బత్కమ్మ ... బత్కమ్మ...  బత్కమ్మ...  బత్కమ్మ... 
ఎక్కడ పోతోరా? ఎక్కడ పోతోరా? ఇక్కడ ఇక్కడ రా!

మేరే  హోష్ ఉడా దే యెంకన్నా యెంకన్నా   
ఉడాదూంగా  
ఆంఖో సే పిలా దే యెంకన్నా యెంకన్నా
పిలాదూంగా  
మస్తీ మే డుబా కర్ దిల్ కో మేరే దివానా బనా దే యెంకన్న 
దివానా బనా దే యెంకన్న యెంకన్నా

బత్కమ్మా... బత్కమ్మా... 
యెంకన్నా... యెంకన్నా...
బత్కమ్మా!  ఓ బత్కమ్మా!


బత్కమ్మ ... బత్కమ్మ...  బత్కమ్మ...  బత్కమ్మ... 
ఎక్కడ పోతోరా? ఎక్కడ పోతోరా? ఇక్కడ ఇక్కడ రా!

యెంకన్న... యెంకన్న... యెంకన్న... యెంకన్న...
ఎక్కడ పోతోరా? ఎక్కడ పోతోరా? ఇక్కడ ఇక్కడ రా!

తేరే సద్ కే జాఊ  బత్కమ్మ బత్కమ్మ
తుఝే అప్‌నా బనాఊ బత్కమ్మ బత్కమ్మ

తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో పల్‌కో మే ఛుపాఊ ఎంకన్న
పల్‌కో మే ఛుపాఊ ఎంకన్న
ఛుపాఓ 

బత్కమ్మా... బత్కమ్మా... 
యెంకన్నా... యెంకన్నా...
బత్కమ్మా!  ఓ బత్కమ్మా!

యెంకన్న... యెంకన్న... యెంకన్న... యెంకన్న...
ఎక్కడ పోతోరా? ఎక్కడ పోతోరా? ఇక్కడ ఇక్కడ రా!

బత్కమ్మ ... బత్కమ్మ...  బత్కమ్మ...  బత్కమ్మ...  
ఎక్కడ పోతోరా? ఎక్కడ పోతోరా? ఇక్కడ ఇక్కడ రా!

ఏ ... యెంకన్న... యెంకన్న... యెంకన్న... యెంకన్న...
ఎక్కడ పోతోరా? ఎక్కడ పోతోరా? ఇక్కడ ఇక్కడ రా!

ఏ... బత్కమ్మ ... బత్కమ్మ...  బత్కమ్మ...  బత్కమ్మ...  
ఎక్కడ పోతోరా? ఎక్కడ పోతోరా? ఇక్కడ ఇక్కడ రా!
బత్కమ్మా!  ఓ బత్కమ్మా!
అరే బత్కమ్మ 
ఏ ... మేరీ దిల్ కీ రానీ బత్కమ్మా!
మేరే హోనేవాలే బచ్చోం కీ అమ్మా!


జీవితచక్రం పాట: కంటి చూపు చెప్తోంది...

'కళాభినేత్రి' వాణిశ్రీ గురించి చెప్పేదేముంది?

కాకపోతే రెండో చరణంలో 'కొమ్మ మీదా ... గోరువంకా  - రామచిలుకా ముద్దు పెట్టుకున్నాయి' అన్నదగ్గరా, ఆ తర్వాత "ఓయ్... " అనే దగ్గర ఎంత కులుకుగా చేసిందో వాణిశ్రీ. అది చూస్తుంటే నాకింకేదో పాట గుర్తొస్తున్నట్టుగా ఉంది కానీ - అదేంటో, ఎందుకో గుర్తు రావట్లేదు. 

సర్లే! ఇప్పటికే ఈ రెండు పాటలు నా చెరో భుజం ఎక్కి చెవిలో జుయ్-జుయ్ మంటున్నాయి. ఇప్పుడింకో పాట-హాయిని మోసే సోయి లేదు నాకు. అందుకే ఇప్పటికి గుర్తొచ్చినవి చాలు, మిగిలినవాటిని ఆనక్కి అట్టే పెట్టుకున్నా... 





కంటి చూపు చెప్తోంది - కొంటె నవ్వు చెప్తోంది
మూగ మనసులో మాట...  ఓ రాజా!

కంటి చూపు చెప్తోంది - కొంటె నవ్వు చెప్తోంది
మూగ మనసులో మాట...  ఓ రాజా!

ఆశలు... దాచకు!
ఆశలు... దాచకు!

కంటి చూపు చెప్తోంది - కొంటె నవ్వు చెప్తోంది
మూగ మనసులో మాట...  ఓ రాజా!
ఓ... రాజా !

ఆడపిల్ల - పూలతీగే - ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్లా ... పూలతీగే... ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్లా - పూలతీగే - ఒక్కలాగే అండ కోరుకుంటాయి
ఓయ్ !
అందమైన జవరాలు  - పొందు కోరి వచ్చింది  
ఎందుకలా చూస్తావు, ఓ రాజా?!
స్నేహము...  చేయవా?  
స్నేహము...  చేయవా?

కంటి చూపు చెప్తోంది - కొంటె నవ్వు చెప్తోంది
మూగ మనసులో మాట...  ఓ రాజా!
ఓ... రాజా !

కొమ్మ మీద... గోరువంక - రామచిలుక జోడు కూడే
కొమ్మ మీదా ... గోరువంకా  - రామచిలుకా  జోడు కూడే
కొమ్మ మీదా ... గోరువంకా  - రామచిలుకా ముద్దు పెట్టుకున్నాయి
ఓయ్...!
మెత్తనైన మనసు నాది  - కొత్త చిగురు వేసింది 
మత్తులోన మునిగింది, ఓ రాజా!
మైకము...  పెంచుకో!
మైకము...  పెంచుకో!

కంటి చూపు చెప్తోంది - కొంటె నవ్వు చెప్తోంది
మూగ మనసులో మాట...  ఓ రాజా!
ఓ... రాజా !

 
******************
******************

నాలో మోగిన పాటలనూ రాశా
ఆ పాటల మోతల రాతలనూ రాశా 
మోగిన పాటల వింటూ... మోతల రాతలను చదూకుంటారని... 

~ పాటల భైరవి


14 కామెంట్‌లు:

  1. This, ideally should be spread across 3 posts.

    Could not breath till the end.

    I meant that breathtaking beauy of words.. !!

    Your posts are making me a writer I guess!!

    Just wonderful.

    I don't wish to use any more words, leave all those to you as they turn lot more beautiful gardens.

    Salam
    Hatsoff
    Adbhutam..

    Enkanna, batkamma, any amma, any Aiyya..

    Can't go anywhere after being in this beautiful gardens of words!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. The haunting pallavi of "Batkamma" song haunted me until I wrote this post. Glad you also liked it. Thanks for your comment!

      తొలగించండి
  2. శతరంజ్ పాట, జీవితచక్రం పాట ట్యూన్స్ ఒక్కలాగే లేవనిపిస్తోంది. ఈ పాటలు వినడమే కష్టం, మళ్ళీ పాడుకోవడం కూడానా ? ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతారా ? రచయిత్రులను భరించడం కష్టం సుమండీ !
    మీరు నిజంగా పాతాళభైరవి !(JK)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ రెండు పాటలకి ఓ రెండు మాటల దగ్గర తప్ప ఆట్టే పోలికలు లేవు... కానీ చెప్పానుగా పాట పట్టుబట్టి నా చేత రాయించేసింది అలా...

      మీరన్నట్టే మా ఇంట్లో నన్ను అతి కష్టం మీద భరిస్తూ ఉంటారు :))

      నా బ్లాగ్ ఓపిగ్గా చదువుతున్నందుకు మీకు థాంక్సండి, నీహారికా!

      ఐతే నేను కొత్తాళభైరవి కాదంటారు మీరు?!

      తొలగించండి
    2. జగదేక వీరుడు సినిమాలో శ్రీదేవిలా మీరు మాట్లాడుతుంటే చిరంజీవి గారి ఫీలింగ్స్ లాగా బదరిగారిని ఊహించుకుంటున్నాను !

      తొలగించండి
    3. మీరు భలేవారు, నీహారికా!

      తొలగించండి
  3. Correction:

    @ they turn in to beautiful gardens..

    రిప్లయితొలగించండి
  4. కంటి చూపు చెబుతుంది పాట ఒక 100 సార్లు చూసివుంటాను. మొదటి సారి మా ఊర్లోని గొడ్ల చావిడిలొ.
    పాట స్టార్టింగ్ లొ గిటార్ బిట్ ఇప్పటికీ నా చెవుల్లొ మోగుతూ ఉంటుంది.

    ఇక మా ఎంటీవోడు వాణిశ్రీ అదుర్స్.

    పాట గుర్తు చేసిందుకు కృతజ్ఞతలు.

    బద్కమ్మ పాట ను వినటం ఇదే మొదటి సారి. మంచి పాట పరిచయం చెసినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గిరిరాజ్! పాటలు బాగా నచ్చినట్టునాయి. థాంక్స్ :)

      తొలగించండి
  5. ఎక్కడో ఒక జోక్ విన్నాను. "నీకూ రెండు కళ్ళున్నాయి, నాకూ రెండు కళ్ళున్నాయి. మనిద్దరం కవల పిల్లలం కాదు గదా" అంటాడొకడు. అలాగ మీరు, రెండు పాటల్లో, కేవలం రెండు వేరే పదాల్ని ఒకే ఇ-స్టైల్లో పాడేరని చెప్పి, రెంటినీ కవలలు చేసి పారేయడం ఏం బాగాలేదు. BTW, ఈ బత్కమ్మ పాట గురించి ఇక్కడ చాల పెద్ద డిస్కషనే ఉంది. కావాలంటే చదవండి.

    https://www.hindigeetmala.net/view_comments/batkamma_batkamma_ikad_potorra_yenkana_yenkana.htm

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏదో ఈసారికి అలా రాసేశాను - చదివేసుకోండి :) Thanks for the comment & URLs!

      తొలగించండి