16, ఆగస్టు 2020, ఆదివారం

మక్కికి మక్కి దింపుటే ... మహా మంత్రస్య ...


అసలు చెప్పాలంటే నా ఈ బ్లాగ్ పోస్టుకి పెట్టిన శీర్షిక - మక్కికి మక్కి దింపుటే ... మహా మంత్రస్య ... - వ్యాకరణ పరంగా - తప్పు - తప్పున్నర తప్పు - మహా తప్పు.

కాకపోతే ప్రాస కోసం పడిన ఆయాసమనండి... ఇంచుకగా మొదలై ఇనుమడించిన ఆక్రోశమనండి - అదే... సరిగ్గా అదే ... నాచేత అలాంటి టైటిలు పెట్టించింది.

సి....ని...మా...

ప్రపంచంలో మిగిలిన దేశాలూ, జాతులూ సంగతి నాకు తెలీదు కానీ - నేను పుట్టిన తెలుగు దేశంలో - నాకూ, నాలాంటి వాళ్ళకూ - సినిమా వస్తే పండగొచ్చినట్టే.

అదీ ఓ పండగ పూట రిలీజైతే ఆ పండగకే పండగొచ్చినట్టు.
పండగకే సంబరమై సందడి చేసినట్టు.

పండగొస్తే ఇంటిల్లిపాదీ సినిమా కెళ్ళేవాళ్ళం.

ఇంటికి పదిమంది బంధువులొస్తే అందర్నీ తీసుకుని సినిమా కెళ్ళేవాళ్ళం.

తోచీతోచని సెలవు పూట సైకిళ్ళెక్కి అక్కచెల్లెళ్ళం ముగ్గురం ఫ్రెండ్సుతో సినిమా కెళ్ళేవాళ్ళం.

సినిమాలో హీరో ఎంతవాడైనా తన కన్నా ఎంతో ఎత్తున్న విలన్ని ఎగిరెగిరి తంతుంటే - ఇంట్లో మొదలెట్టిన ఫైటింగు ఇల్లూ, ఊళ్ళూ దాటి - రాళ్ళల్లో, రప్పల్లో, బండరాతి కొండల్లో  'డిష్యుం, డిష్యుం' అని మోతెక్కిపోతుంటే - పోలీసులు జీపేసుకొచ్చి "హేండ్సప్పు" అని విలన్ని బేడీలేసి పట్టుకుపోయాక - హీరో, హీరోయిన్ను పాట పాడుకుంటూనో, ఫ్యామిలీ ఫోటో తీసుకుంటూనో ఉండగా - అదేదో మన ఇంట్లోనే జరిగినట్టు - ఇహ అప్పట్నుంచీ హీరో కథతో పాటు మనకి కూడా సుఖాంతమయినట్లు - మొహం నిండా నవ్వు వెలిగించుకుని - వేస్తున్న అడుగులు గాల్లో తేలుతున్నట్టుగా - సినిమాలో నవ్వించిన రాజబాబునో, అల్లురామలింగయ్యనో, బ్రహ్మానందాన్నో తలుచుకుని నవ్వుకుంటున్న నవ్వులు నాలుగింతలు చేసుకుని - ఆ తర్వాత నాలుగు రోజులపాటు నలుగురు కలిసిన వేళల తలుచుకుని నవ్వుకునేవాళ్ళం.

సినిమా సెన్సార్ సర్టిఫికెట్ చూపిస్తుండగా అందులో ఏ పధ్నాలుగో, పదహారో కాకుండా ఓ పద్ధెనిమిదో, ఇరవై ఒకటో రీళ్లు అని కనిపిస్తే ఆ సినిమా-పూటకి మహా ఆనందం - సినిమా తొందరగా అయిపోదని. ఎంచగ్గా ఓ రెండు చిప్స్ పాకెట్స్ కరకరలాడించి , కూల్డ్రింకు తాగేదాకా ఉంటుందని. 

కుర్చీలో కాళ్ళు పైకి పెట్టేసుకుని, పక్కనున్న వాళ్ళు మాట్లాడుతున్నా చెవులు మాత్రం అటొగ్గి, కళ్ళు రెండూ తెరకప్పగించేసి 'ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు' , 'ధూమపానం చేయరాదు' తో మొదలుపెట్టి - 'నిశ్శబ్దం' అన్న స్లైడు దాకా అక్షరం పొల్లు పోకుండా చదివేసుకుంటూ - ఆ తర్వాత మొదలైన సినిమాని అత్యంత భక్తితో, అనిర్వచనీయమైన ఆరాధనతో చూసేవాళ్ళం.

సరే! ఇప్పుడా రోజుల్లేవు. బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అయితే మాత్రం చిరకాల-వినోద-నేస్తం సినిమాని ఒదులుకుంటామా? పాతదైతే యూట్యూబులో చూస్తాం. కొత్తదైతే OTT లో చూడాలని ఆశపడతాం. సినిమా చూసిన ప్రతిసారీ అది బావున్నా, బాలేకపోయినా అనుకునే మాట ఒకటుంటుంది - "ఎంత కష్టపడి తీస్తారో కదా! పెద్ద ప్రాజెక్ట్ లాంటి సినిమా. ఇది బాగా ఆడితే బావుణ్ణు - ఇందులో పని చేసినవాళ్ళందరూ బ్రతికిపోతారు, బాగుపడతారు" - అని.

ఇంత ఇష్టపడతామా సినిమాని!? ఒక్కో సినిమాని చూస్తే - "ఈ సినిమా ఎలా తీశారసలు? ఏది తీస్తే అది చూసేస్తున్నామని అంత అలుసయ్యామా?" అనిపించి పిచ్చి ఉక్రోషమొస్తుంది. 

అలాంటప్పుడు "ఎహె! ఈ సినిమా గురించి అస్సలు మాట్లాడకూడదు, ఎవ్వరికీ చూడమని చెప్పకూడదు.' అనుకుంటాను నేను. 

అలా అనుకోవడం ఎందుకంటే - ఒకవేళ అనవసరంగా ఆవేశపడి 'ఫలానా సినిమా బాగాలేదు, చూడకూ!' అని చెప్పామనుకో - అప్పటిదాకా అసలు ఆ సినిమా పేరు కూడా విననివాళ్ళు కూడా ఇప్పుడు పేరు తెలిసింది కదా, బాలేకపోయినా టైం పాసుకి చూద్దామనుకుని చూసేవాళ్ళు కొందరూ - ఎందుకు బాగాలేదో అని చూసేవాళ్ళు కొందరూ - మనం చెప్పినట్టే నిజంగా బాగాలేదా, అబద్ధం చెప్తున్నామా అని చూసొచ్చి argue చేద్దామనుకునేవాళ్ళు కొందరూ - మనం బాగాలేదని చెప్పాం కాబట్టి 'బాలేకపోయినా ఫర్లేదు, నువ్వు చూడొద్దన్నావు కదా అందుకైనా చూస్తా' నని పంతం పట్టి చూసేవాళ్ళు కొందరూ - ఇలా ఆ కొందరూ, ఈ కొందరూ, ఇంకొందరూ కలిసి బోల్డంత మంది ఏ సినిమానైతే ఎవ్వరూ చూడకూడదని అనుకుంటామో అదే సినిమాని చూసేస్తారు. 

ఇది సినిమాల వరకే కాదు - ఏదైనా negative news అయినా అంతే - దాన్ని ఎంత ఇగ్నోర్ చేస్తే ఆంత propagate అవకుండా ఉంటుందని - నాకు నచ్చని సినిమాలు, విషయాల గురించి ఆట్టే మాట్లాడను. 

కానీ కొన్ని సినిమాల్లో చూసినవి ఒక్కోసారి ఉడికించేస్తాయి. వాటిని గురించి రాసేసుకోమని సతాయిస్తాయి.  

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య - సినిమా పేరు మహా గొప్పగా అనిపిస్తోంది కదూ! 

ఇంకా నేనేదేదో రాసే ముందు ఒక మహా చిన్నdisclaimer: నేను రాస్తున్న ఈ రాతలో పదేపదే 'మహా' అన్న మాట రావడం మహా-యాదృచ్ఛికమూ మరియు మహా-కాకతాళీయమూ మాత్రమే తప్ప అది ఈ రీమేకు దర్శకుడిని ఉద్దేశించి పదేపదే రాసింది కాదు. 

సరే! నేను చెప్పదలుచుకున్న సినిమా దగ్గరకొస్తే అసలు మలయాళంలో "మహేషింటే ప్రతీకారం" చూసినప్పుడే  ఆ సినిమా కథ అంత గొప్పగా అనిపించక - అంతకు ముందు చూసిన మిగిలిన మలయాళం సినిమాల ముందు కొంచెం తేలిపోయినట్టు అనిపించింది. 

మామూలుగా అయితే ఏ మాత్రం కథ బావున్నా భాషాభేదం లేకుండా సినిమా చూసే మేము - చాలా సరళంగా, సాదాసీదాగా, నిరాడంబరంగా ఉండే మలయాళం సినిమాలు సినిమా చూస్తున్నప్పుడే అనుకుంటాము - దీన్ని తెలుగులో ఎవ్వరూ తియ్యకపోతే బావుండును అని. కాకపోతే  "మహేషింటే ప్రతీకారం"ఎవరైనా తెలుగులో తీస్తారని కూడా ఊహించలేదు. 

తీశారని పేపర్లలో చదివాక, Netflix లో ఉందని తెలిశాక - పాతవీ, కొత్తవీ చూడదగ్గ సినిమాలు అన్నీ చూసేసి ఉన్నామేమో - ఈ ఉమామహేశ్వరుడి ఉగ్రరూపం కూడా ఓ సారి చూద్దాం అనుకున్నాము. 

మొదటగా సినిమా పేరే నాకు సరిగ్గా అనిపించలేదు. అది కనీసం ఉమామహేశ్వరస్య ఉగ్రరూపం అని ఉన్నా కొంచెంలో కొంచెం ఫర్వాలేకపోయేది. 

తెలుగులో కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ - షష్ఠీ విభక్తి (Genitive Case).

అలాగే సంస్కృతంలో "స్య (स्य)" అనేది షష్ఠీ విభక్తి. దానికి అర్థం "యొక్క". 

ఉదాహరణలు: 
రామస్య సఖా (रामस्य सखा ) - రాముడి స్నేహితుడు 
సూర్యస్య ఉదయః (सूर्यस्य उदयः) - సూర్యుడి ఉదయం 

షష్ఠీ విభక్తి వ్యాకరణ రూపం ప్రకారం ఈ సినిమా పేరు ఉమామహేశ్వరస్య ఉగ్రరూపః అయి ఉండాలి - తప్ప ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కానేకాదు. అది మొదటి పలుకు-రాయి. (అందుకే మొదట్లోనే చెప్పాను నా మహా మంత్రస్య మహా తప్పని... అది కూడా మహా మంత్రః - అని ఉండాలి - అంటే గొప్ప ఉపాయం అని అర్థం.)

మలయాళపు ఇడుక్కి తెలుగు అరకు అవడం బానే ఉంది. 
మలయాళపు పోస్టర్ ప్రింటింగ్ ప్రెస్ తెలుగులో నరేష్ ఆయుర్వేదపు అంగడి కావడమూ సరే!
నటీనటులూ, అరకు అందాలూ అంతా సరే సరే! 

కానీ - కేరళలో తిన్నట్టు అరటిపళ్ళు తిని, టీ ఎక్కడ తాగుతారబ్బా తెలుగు వాళ్ళు? ఏ చిన్న కార్యక్రమం జరిగినా టీతో పాటు బజ్జీలో, బోండాలో, ఉప్మావో, ఉల్లిపకోడీనో తింటారు కానీ అరటిపండుని ఆవురావురని ఎవరైనా తింటారా? 

కేరళలో 'జనగణమన' వినిపించగానే రోడ్డు మీద ఎక్కడున్నవాళ్ళు అక్కడే చెప్పులిప్పి నించున్నారని అదే తెచ్చి తెలుగులో చూపెట్టక్కర్లదేమో!?

మాండలికం పేరుతో ఏ మాటైనా మాట్లాడించెయ్యొచ్చు అనుకుంటున్నట్టున్నారు మాటలు రాసే వాళ్ళు కూడా. పదిమందిలో ఉన్నప్పుడు అనదగని మాటలని పదిమందితో కూర్చుని చూసే సినిమాలో - అందునా - నరేష్ లాంటి పెద్దమనిషితో అనిపించడం ఏం బాగు?

సరే! ఇవన్నీ కాదు. నిజంగా తియ్యాలనుకుంటే తెలుగులో ఎంత గొప్ప కథకులు లేరు? ఎంత మంచి కథలు ఎన్ని లేవు? 

ఇప్పటికిప్పుడు నాకు చటుక్కున గుర్తుకొస్తున్న కథలు - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి "కలుపు మొక్కలు", మునిపల్లె రాజు "వారాలపిల్లాడు". వాటిల్లో జీవితం ఉంది, ఆశ ఉంది, వంచన ఉంది. ఇది ఇలా జరగకుండా ఉండి ఉంటే ఎంత బావుండునో అనిపించేంత విషాదమూ ఉంది. 

ఇవి కాకుండా ఇంకా ఎన్నో, ఎన్నో వేల కథలు - శ్రీపాద, కొడవటిగంటి, భరాగో, వాకాటి పాండురంగారావు, మునిపల్లె రాజు, ఇంకా ఎందరో గొప్పగొప్ప రచయితలు రాసినవి ఎన్నో ఉన్నాయి. 

కానీ ఆ కథలని తీసుకుంటే సినిమాగా తీయాలంటే ఎంత పని? పాత్రలు, ఆహార్యాలు, పరిస్థితులు, వాతావరణాలు - ఇలాంటివన్నీ రాసి ఉన్న కథను బట్టి ఊహించాలి - ఊహకు తగ్గట్టుగా స్క్రీన్ ప్లే రాసుకోవాలి - మాటలు రాసుకోవాలి - ప్రదేశాలు వెతుక్కోవాలి. అదే వేరే భాషలో వచ్చిన సినిమా రీమేక్ చేసుకుంటే అన్నీ అందుబాటులో ఉంటాయి. 

అసలీ సినిమాల రీమేక్ నాకెలా అనిపిస్తుందంటే - ఎవరో గీసిన బొమ్మని - మనకి కావాల్సిన ఫ్రేములో పెట్టుకుని మన ఇంట్లో మేకుకి రీ-మేకు చేసుకుని - Framed by me - అని రాసుకున్నట్టుంటుంది. 


చివరాఖరికి - ఈ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య - నా మటుకు నాకు కొబ్బరినూనె వేసి చేసిన కేరళ వంటకాన్ని - కొంచెం చింతపండు చేర్చి - నూపప్పు వేసి ఇంగువ పోపేసిన ఆంధ్రా పులిహారలా చేసి వడ్డించేసినట్టనిపించింది - రుచిగానూ లేదు - అలా అని అరుచీ కాదు. ఏదో చేసేసుకున్నాం - ఈ పూటకి ఇలా కానిచ్చేద్దాం అన్నట్టే ఉంది తప్ప - ఇంకోసారి చూద్దాం, ఇంకొకరికి చూపిద్దాం అనేలా అయితే మాత్రం లేదు. 



~ సినీ-మా-లక్ష్మి 








 

14 కామెంట్‌లు:

  1. భలే రాసారు లలిత గారూ. ఇంచుమించు నా స్పందనా ఇదే... అసలు ఆ పేరేంటి.. అంత భయంకర వ్యాకరణ దోషం అనుకున్నా.. ఏదోలే వెరైటీ కోసమేమో అని సర్దిచెప్పుకొని నిన్ననే చూసా.. ముఖ్యంగా టీ తాగి అరటిపండు తినటం ఏమిటో అని,.. నేను మలయాళంలో చూడలేదు కానీ "framed by me" అనటం బావుంది. ఏదో చూసేసాం..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజం... ఈ సినిమా చూస్తుండగా ఏదో తెలీని ఉక్రోషం - తెలిసీ తెలియకుండా తీసే సినిమాల వల్ల తప్పులు కూడా ఒప్పని వాదించేవాళ్ళు తయారవుతున్నారని. మీకూ నాలాగే అనిపించిందని తెలియడం బావుంది. మీ కమెంట్‌కి చాలా థాంక్స్!

      తొలగించండి
  2. అసలు సినిమా చూడడం అంటే మనం హల్లో కూర్చునేసరికి తెర లేవకుండా వాటిమీద బల్లులు అక్కడ వాలిన పురుగుల్ని పట్టుకోడం మనం చూస్తుండగా తెర మెల్లిమెల్లిగా లేస్తుంటే మనం విజిల్స్ వేస్తుండగా ఆ స్లైడ్స్ పడుతుంటే మహదానందం కాదుటండీ

    ఇంతకీ సినిమా పేర్లోనే ప్రతీకారం అనంటున్నారు మనలాంటి ప్రేక్షకుల మీదా ఆ దర్శకుడు తీర్చుకున్న ప్రతీకారం ఏమోనండీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాస్ గారూ! మలయాళ ప్రతీకారం తెలుగులో ఉగ్రరూపం దాల్చింది. అదీ నా బాధ! మీ కమెంటుకి థాంక్సండి!

      తొలగించండి


  3. ఇప్పటికిప్పుడు నాకు చటుక్కున ....

    శ్రీపాద, మునిపల్లె భరాగో గట్రా గట్రా
    వీళ్లంతా ఎవరండీ ? కన్నడ రచయితలా ? :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ! వారు కన్నడ వారు కాదండి - వారు రాసినవి చదివేవారు కరువై కనుమరుగైన వారు. అన్నట్టు మీకు ప్రియమైన మధురాంతకం వారిని మరిచాను - మన్నించండి.

      తొలగించండి
  4. అగ్రస్యః పోస్టస్యః
    శ్రీపాదః బెంగాలీ రైటర్ అస్య

    రిప్లయితొలగించండి
  5. సినీ-మా-లక్ష్మీ hits the nail on the head yet again, with her review of this రీ-"మేకు". భలే లలితా, భలే!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరి అంతే కదా అపర్ణే! ఒక గోడ మీద మేకుకి తగిలించి ఉన్న బొమ్మని తీసి ఇంకో గోడ మీదున్న మేకుకి తగిలించడమే రీ-మేకు :)

      తొలగించండి