9, ఆగస్టు 2020, ఆదివారం

ఒకే పాట పలుకుతోంది వేరు వేరు గొంతుల్లో...

ఓ ఆషాఢ మాసపు మధ్యాహ్నం.

గుంటూరు బ్రాడీపేట రెండోలైనులో బండ్లమూడి హనుమాయమ్మ హిందూ గర్ల్స్ జూనియర్ కాలేజ్‌లో ప్రిన్సిపాల్ కాకాని లీలా సీతారాం గారి ఆఫీస్ ముందు - గుళ్ళో పూజారి శఠగోపం పెట్టడానికి వచ్చే ముందు అటూ ఇంటూ నించుంటామే - అలా నుంచున్నాం అమ్మ, నేను, లక్ష్మి దొడ్డ, ప్రశాంతి. 

లేతగులాబీరంగు పరికిణీ - అంచు దగ్గర వెడల్పాటి తెల్లపూలు, వాటిని కింద నుంచి పైకి లాక్కెళ్తున్నట్టుగా - ముదురాకుపచ్చ ఆకుల సాయంతో పైకి సాగిన లేత ఆకుపచ్చ రంగు తీగలు - ఆ పరికిణీ మీద అరండల్ పేట సికేరా టైలర్స్ దగ్గర కుట్టించిన అంతే లేతగులాబీ రంగులో కాలర్ ఉన్న బ్లౌజ్ వేసుకుని - చేతిలో పదోతరగతి మార్కుల లిస్టు పట్టుకుని - ముక్కు చిట్లించుకుని - చుట్టూ చూస్తున్నాను.

అప్పటికి ఓ రోజు ముందు వర్షం పడిందేమో - కాలేజ్‌లో పరిచిన నాపరాళ్ళ మీద పల్లంగా ఉన్న చోట అక్కడక్కడా నీళ్ళు నిలిచి ఉన్నాయి. చుట్టూ ఎత్తుగా కాంపౌండ్ వాల్. దాని పక్కనే వరసగా నుంచుని గోడవతలకి తొంగి చూస్తున్న అశోకా చెట్లు. ఆ చెట్ల నుంచి రాలి కిందపడి - అటూ ఇటూ నడుస్తున్న వాళ్ళ పాదాల కింద పడి నలిగి పగిలిన చిన్నచిన్న కాయలు - వాటి చుట్టూ ఆషాఢ మాసపు అనాహ్వానిత అతిథులు - ఈగలు.

ఓ పక్క వెళ్ళొద్దే అన్నా వినకుండా ప్రశాంతి (దానికప్పుడు నాలుగేళ్లు) పరిగెత్తుకుంటూ వెళ్ళి మడుగులుగా ఉన్న నీళ్ళల్లో తపతపా అడుగులేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళ మీద పడేలా తకిట తధిమి తకిట తధిమి తందానా ఆడేస్తోంది. దాన్ని ఇవతలికి లాక్కొస్తుంటే రానంటూ సాగుతూ ఏడుస్తోంది. వాతావరణం చెమ్మగా, ఉక్కగా, చిరాగ్గా ఉంది.

నేనప్పుడే - నెమ్మదిగా అమ్మకి మాత్రమే వినిపించేలా - ఏడుపు గొంతుతో గొణుగుతున్నాను "నాకీ కాలేజ్ అస్సలు నచ్చలేదమ్మా! ఇక్కడ అమ్మాయిలు ఒక్కళ్ళే ఉంటారు. నేనెప్పుడూ గర్ల్స్ స్కూల్లో చదవనేలేదు. అందరూ అమ్మాయిలే అయితే ఇక competition ఏముంటుంది? నువ్వే అంటావుగా 'స్పర్థయా వర్ధతే విద్యా' అని - కాంపిటిషనే లేకపోతే ఇంకేం విద్య? పైగా ఇక్కడ అన్నీ ఈగలే. నాకు వాటిని చూస్తేనే దురదొచ్చేస్తోంది. ఇంతకు ముందు మనమున్న SVN కాలనీ ఇంటి దగ్గరున్న JKC లో చేరతాను నేను. కావాలంటే రోజూ బస్సులో వెళ్ళొస్తా." అంటూ చుట్టూ ఉన్న ఈగల రొద కన్నా ఎక్కువగా మా అమ్మ చెవిలో సొద పెడుతూ.

అమ్మ - మరి నాకు అమ్మ కదా!

నేను మాట్లాడేది వింటూనే -"అలాక్కాదు లల్లీ! ఇది చాలా మంచి కాలేజ్. మంచి మార్కులొచ్చిన వాళ్ళకే సీట్లు ఇస్తారు. పైగా పప్పి, కుట్టి కూడా ఇక్కడే హైస్కూల్లో చేరారు. ఆ జేకేసీ చాలా దూరం. నిన్నక్కడ చేరిస్తే సాయంత్రం నువ్వు ఇంటికొచ్చే దాకా నాకు బెంగగా ఉంటుంది. ముందిక్కడ చేరు. ఓ ఏడాది చూద్దాం. నీకు నచ్చకపోతే అప్పుడే జేకేసీకి వెళ్దూగానివి, సరేనా?!" అంటూ నేను మాట్లాడిన దానికి దీటుగా తను చెప్పాలనుకున్నది చెప్పేసింది.

ఇంకేం చేస్తాను? మొహం చిట్లించుకుంటూనే - నా ఎదురుగా - నాలాగే ఓ ఫైల్ పట్టుకుని వాళ్ళమ్మగారితో నించున్న ఓ అమ్మాయిని చూశాను.

Off White రంగు మీద ఆకుపచ్చ అల్లిబిల్లి పూలు-లతల డిజైన్ ఉన్న కాటన్ చుడీదార్, దాని మీద అదే రంగూ-డిజైన్లతో ఉన్న చున్నీ వేసుకుని, కాళ్ళకి హవాయి చెప్పులు వేసుకుని ఉంది తను.

అప్పుడు నేనూ హవాయి చెప్పులే వేసుకుని ఉన్నాను. కానీ నేను వేసుకుంది పరికిణీ కదా - ఏ చెప్పులేసుకున్నా  ఫర్లేదు. ఆ అమ్మాయి చుడీదార్ మీద హవాయి చెప్పులు వేసుకుంది. అదీ నాకు నచ్చనిది.

"హుఁ ! ఇదిగో ఇల్లాంటి ఫేషన్ తెలీనివాళ్ళతో చదవాలి ఈ బండ్లమూడి హనుమాయమ్మలో చేరితే. అసలెవరైనా చుడీదార్ మీద హవాయి చెప్పులు వేసుకుంటారా? అసలీ కాలేజ్ పేరే బాలేదు - బండ్లమూడి హనుమాయమ్మట - బండ్లమూడి హనుమాయమ్మ." - నాకేం చెయ్యాలో తోచని చిరాకుతో - ఏవేవో రకరకాల అసహనాలతో - అర్థమే లేని ఆలోచనలతో - నాలో నేనే పళ్ళు కొరికేసుకున్నాను. ఇహ ఆ చుడీదార్ అమ్మాయి కేసే చూడకుండా ఇంకెటో చూస్తూ నించున్నాను.

సరే! నా పళ్ళు కొరుక్కున్నా, నా కాళ్ళు నేనే తొక్కుకున్నా - BH ఆఫీస్ వాళ్ళు నా మార్కులు చూసి నాక్కావాల్సిన MPC లో సీటు ఇచ్చేసి, ఫీజు కూడా కట్టించేసుకున్నారు. రోజూ మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఐదింటిదాకా ఇంటర్మీడియట్ క్లాసులు జరుగుతాయి - ఆగస్టు ఆరు నుంచి కాలేజ్ కొచ్చెయ్యి అని చెప్పారు.

ఆఫీస్ రూం దాటగానే కుడివైపున్న వరండాలో మొట్టమొదటి గదే మా క్లాస్. అందులో MPC, BiPC గ్రూపులు రెండిటి నుంచి అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఇంగ్లీష్, ఇంగ్లీష్ నాన్-డీటెయిల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి కామన్ సబ్జక్ట్స్ క్లాసెస్ మాత్రం ఆ గదిలో జరిగేవి. 

మొదటి రోజు కాలేజ్ కెళ్ళిన నాకు - మొదటి బెంచులో సీట్ దొరకలేదు. ఎక్కడో నాలుగో బెంచ్ మధ్యలో - ఇటు లక్ష్మీ ప్రసన్న అనే MPC అమ్మాయికీ, అటు బీనా అనే BiPC అమ్మాయికి మధ్యలో - కూర్చున్నాను.

నా ముందు రెండు బెంచీలకి అవతల ఆ చుడీదార్-హవాయి చెప్పుల అమ్మాయి కనిపించింది.  క్లాసులో చాలా మంది అమ్మాయిలు - తనని చూడగానే - "హాయ్ K. R. అపర్ణా!" అని పలకరిస్తూ మాట్లాడుతున్నారు. నా పక్కనున్న బీనా కూడా ఆ అపర్ణతో మాట్లాడి, నాకేసి తిరిగి "Aparna studied in Brodiepet Bal Kuteer. I went to Syamala Nagar branch" అంది. నాకేమో అసలు ఆ బాలకుటీర్ అంటే ఏంటో అర్థం కాలేదు. కాకపోతే అమ్మాయిలతో అంత కిక్కిరిసి ఉన్న క్లాస్ వాతావరణం నాకు కొత్త కావడంతో అసలు నాతో ఎవరేమంటున్నారో, నేనేం వింటున్నానో అంతా చాలా గజిబిజిగా అనిపించి నిశ్శబ్దంగా చుట్టూ చూస్తూ కూర్చున్నాను.

BH లో చేరిన మొదటి రెండ్రోజులు చాలా uneventful గా గడిచిపోయాయి.

మూడో రోజు ఆగస్టు ఎనిమిదో తారీఖు.

ఆ రోజు ఇంగ్లీష్ క్లాస్ తీసుకోవాల్సిన యశోధరా మేడంసెలవు పెట్టారు. వరండాలో తిరుగుతుండే అమ్మాయిలని అదిలిస్తూ తిరిగే వరండా-ప్రిన్సిపాల్ వీరాస్వామి మా క్లాసులోకొచ్చి "అమ్మాయిలూ... మీకివ్వాళ క్లాస్ లేదు. గొడవ చెయ్యకుండా గ్రౌండుకెళ్లి ఆడుకోండి. స్పోర్ట్స్ రూంకి వెళ్ళి మీక్కావల్సిన బేట్లూ, బంతులూ పట్టుకెళ్ళండి. క్లాసురూంలో ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు" అని గట్టిగా చెప్పాడు.

క్లాసులో ఉన్న అమ్మాయిలందరూ - అప్పటి వరకు కుదురుగా కట్టి ఉంచిన దారం ముడి సడలగానే నేలకి జారి ఘల్లుఘల్లుమనే మువ్వల్లాగా - గలగలా మాట్లాడుకుంటూ జట్లుజట్లుగా ప్లే గ్రౌండ్ వైపు వెళ్ళిపోయారు.

వాళ్ళల్లో వాళ్ళకి ఒకళ్ళొకళ్ళు బాగానే తెలుసు గుంటూరు లోనే ఏదో ఒక స్కూల్లో చదివి ఉండడం వల్ల. అప్పటి వరకు టంగుటూరులో చదువుకుని ఆ ఏడాదే గుంటూరు వచ్చిన నాకేమో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలీదు.

 నిజానికి చిన్నప్పట్నుంచి నాన్నకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండడం వల్ల నాకు జరిగిన ఒక మంచి ఏంటంటే - నాకు ఎక్కడికక్కడ మాట కలుపుకోవడం, నాతో కలిసి చదువుతున్న అందరితో ఒకే లాగా మాట్లాడుతూ - ఎవరెలా ఏం మాట్లాడినా - ఎవరి ప్రభావం నా మీద పడకుండా నేను నేనుగా ఉంటూ - ఎవరితో నేను మాట్లాడితే వాళ్ళకే నేను ఫ్రెండేమో అనిపించేలా ఉండడం - అలవాటు అయింది. దాంతో ఏ కొత్త వాతావరణం లోకి వెళ్ళినా తొందరగానే కలిసిపోయేదాన్ని.

కాకపోతే ఈ కొత్తగా చేరిన అమ్మాయిల కాలేజులో మిగిలిన అమ్మాయిలందరూ - ఎవరి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళతో వాళ్ళలో వాళ్ళు తప్ప - కొత్తగా వచ్చిన నాతో మాట్లాడడానికి అంతగా ఉత్సాహ పడలేదు.

నా అంతట నేను పలకరించినా, నేనడిగిన దానికి సమాధానం చెప్పి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వైపు తిరిగి మాట్లాడేసుకుంటూ ఉండేవాళ్ళు.

ఇంతలో కొంతమంది అమ్మాయిలు స్పోర్ట్స్ రూం వైపు వెళ్దామనుకోవడం విని, ఏం చేయాలో తోచని నేను వాళ్ళతో వెళ్ళాలని అనుకోకపోయినా - వాళ్ళ వెనకాలే నడుచుకుంటూ వెళ్ళాను. తీరా స్పోర్ట్స్ రూంకి వెళ్ళాక వాళ్ళందరూ కావాల్సిన షటిల్ రేకెట్స్, షటిల్ కాక్స్ పట్టుకుని వెళ్ళిపోయారు.

నాకైతే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ స్పోర్ట్స్ రూమ్ పక్కనే అటూఇటూ హడావిడిగా తిరుగుతున్న వేరే క్లాసుల అమ్మాయిలని చూస్తూ నించున్నాను.

ఇంతలో 'KR అపర్ణ' అని అందరూ పలకరిస్తున్న అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అప్పుడు తను ఒక తెల్ల frock వేసుకుని, రెండు జళ్ళు వేసుకుని ఉంది.

వస్తూనే నాకేసి భలే friendly గా చూసి నవ్వి "Hi! My name is Aparna Raghunath. What's yours?" అంది.

నేను మొహమాటంగా నవ్వుతూ "లలిత" అన్నాను.

"లలితా! రింగ్ బాల్ ఆడదామా?" అంది.

నా కళ్ళు ఒకసారి వెలిగాయి - భలే భలే - నన్ను పలకరించడమే కాకుండా - నన్ను తనతో ఆడడానికి రమ్మంటోంది.

నోరంతా తెరిచి నవ్వుతూ - ఓ! - అన్నాను.

ఇద్దరం కలిసి ఓ రింగ్ తీసుకుని గ్రౌండు లోకి వెళ్ళాము.

ఓ చోట నించుని ఒకరికొకరం రింగ్ విసురుకుంటూ ఆడుకుంటూ - ఒకరి గురించి ఒకరం బోల్డన్ని ప్రశ్నలేసుకుంటూ - సమాధానాలు చెప్పుకుంటూ - ఆ మాటల్లోనే - మేమిద్దరం ఒకే నెలలో - తను నాకన్నా మూడ్రోజుల ముందు - పుట్టామని తెలుసుకున్నాక - మేమిద్దరమూ Virgos అని తెలిశాక - మా మధ్య affinity - మాట మాటకీ పెరుగుతున్నట్టు మా ఇద్దరికీ తెలుస్తోంది.

"నీ పేర్లో KR అంటే ఏంటి? మరి నీ పేరు చివర రఘునాథ్ అంటే ఏంటి?" కొంచెం different గా అనిపిస్తున్న తన పేరు గురించి నాకున్న సందేహాలు.

"KR అంటే కొడిగెనహళ్ళి రఘునాథ్ అపర్ణ. కొడిగెనహళ్ళి మా ఇంటి పేరు, రఘునాథ్ మా డేడీ పేరు. నేను నా పేరు అపర్ణా రఘునాథ్ అని రాసుకుంటాను. మరి నీ పూర్తి పేరు ఏంటి? Just లలితేనా?"

"నా పేరు లలితాత్రిపురసుందరి. మా ఇంటిపేరు వడ్లమాని. నా పేరు కొంచెం పొడుగు కదా - అందుకని నాకు లలితా TS వడ్లమాని అని రాసుకోవడం ఇష్టం - అచ్చు మా సుబ్బారావు పెదనాన్న రాసుకుంటారే SR అయసోల అనీ ?! -  అలాగ!" అంటూనే "అవునూ! నీ White Frock చాలా బావుంది. ఎక్కడ కొనుక్కున్నావ్?" నాకు చాలా నచ్చిన తన గౌను గురించి అడిగాను.

"ఇది మా రత్నాంటీ జెర్మనీ నుంచి తెచ్చారు. నాకో కజిన్ కూడా ఉంది. హేమ - రత్నాంటీ'స్ డాటర్." తన సమాధానం.

ఇలా మా పేర్ల గురించి, పేర్ల వెనకాల పెద్దల గురించి, siblings, cousins గురించి, మా ఇష్టాలు, hobbies - ఇలా అవీ-ఇవీ అని లేకుండా అన్నీ మాట్లాడేసుకుంటూ ఉన్నాం.

అప్పుడే చెప్పింది - శ్రీశ్రీ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయికవితల పోటీలో తనకి మొదటి బహుమతి వచ్చిందని, అది తీసుకోవడానికి వైజాగ్ వెళ్ళొచ్చానని. నాకు అంత గొప్ప ప్రైజ్ వచ్చిన అమ్మాయి తెలియడం భలే గొప్పగా అనిపించింది.

(ఆ తర్వాత వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆ బహుమతితో భాగంగా తనకి ఇచ్చిన శ్రీరంగం రాజేశ్వర రావు గారి ఎఱ్ఱచీర కథా సంకలనం నాకు చదవమని ఇచ్చింది.)

అంతలో - ఇద్దరం ఒక్కసారిగా - ఒకళ్ళనొకళ్ళం - "నీ best friend ఎవరు?" అని అడుగుకున్నాం.


అప్పుడే ఇద్దరం - "ఇవాళ్టి నుంచి మనిద్దరం Best Friends. ఇవాళ ఆగస్టు ఎయిత్. ఇప్పట్నించీ ఇది మన ఫ్రెండ్షిప్ డే. "అనుకున్నాం.

అలా అనుకుంటూ ఉండగానే - అపర్ణకి చెప్పాను - ఫ్రెండ్షిప్ మీద నాకొక మంచి పాట వచ్చని - అది తన కోసం పాడతానని... అంటూనే పాడేశా "స్నేహబంధమూ...ఎంత మధురమూ... చెరిగిపోదు... తరిగిపోదు.... జీవితాంతము...ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో - ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో " - అంటూ.

అది పాడాక, ఆ పాట తనకి నచ్చాక - నేను తనని మొదట చూసినప్పుడు తన డ్రెస్సు, హవాయి స్లిప్పర్స్ చూసి ఏమనుకున్నానో కూడా చెప్పేశాను - మరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య రహస్యాలు ఉండకూడదు కదా!

అలా మొదలు.... "Two is a company - Company is important for each other !" అన్న motto తో మా స్నేహం!



ఆ రోజు నుంచి అంతకు ముందు నాకు అస్సలు నచ్చని బండ్లమూడి హనుమాయమ్మ పేరు కూడా నచ్చేసింది.

అప్పుడే ఇంకోటి కూడా అనుకున్నాము - ఆ తర్వాతి రోజు నుంచి First bench - first two seats మావి మాత్రమే అని. దాని కోసం పన్నెండున్నరకి మొదలయ్యే కాలేజ్‌కి పొద్దున్నే పదిన్నరకల్లా వెళ్ళిపోయేదాన్ని. Morning shift లో జరుగుతూ పన్నెండు గంటలకి పూర్తవ్వాల్సిన డిగ్రీ క్లాసులు ఒక్కోసారి పదకొండూ-పదకొండున్నరకల్లా అయిపోయేవి మరి!

ఇంట్లో అమ్మ కూడా నా కోసం గబగబా వంట చేసేసి నన్ను పంపించేసేది. ఆవిడకి బాగా తెలుసు - నాకు కావాలీ అని పట్టించుకున్నది ఏదైనా నన్ను చెయ్యనిస్తేనే - నేను ఆలపించే అమృతవర్షిణి రాగం బారిన పడకుండా వుండే సౌలభ్యమూ, సుఖమూ కూడానని.

సరే! అలా పదిన్నరకల్లా కాలేజ్ చేరే నేను - వెళ్ళి మా క్లాసుకి ఎదురుగుండా ఉన్న చిన్న తోటలో - బండ్లమూడి హనుమాయమ్మగారి విగ్రహం కింద మెట్టు మీద కూర్చుని - డిగ్రీ క్లాస్ ఎప్పుడు అయిపోతుందా? ఆ అమ్మాయిలు ఎప్పుడు బయటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. వాళ్ళ క్లాస్ అయిపోయి బయటికి రాగానే - గబగబా లోపలికి వెళ్ళి - మొదటి బెంచులో - మొదటి రెండు స్థానాల్లో డెస్క్ మీద రెండు పుస్తకాలు పెట్టి - అప్పుడు BH కాలేజ్ వెనక సందులో వేంకటేశ్వర బాలకుటీర్ పక్కనే ఉన్న అపర్ణ వాళ్ళింటికి వెళ్ళేదాన్ని.

అక్కడ ఆంటీ "నువ్వు ఇంట్లో ఎంత తినొచ్చుంటావో నాకు తెలుసు - మళ్ళీ నేను పెట్టింది తినాల్సిందే" అని అపర్ణతో పాటు నాకు అన్నం కలిపి ఇచ్చేవారు. అది తిని మేమిద్దరం క్లాసుకి వెళ్ళేవాళ్ళం.

మొదటి సీటులో అపర్ణ, తన పక్కనే నేను - కూర్చుని - మేము రాసే నోట్స్ కూడా - రాసే లైనులో ఏ మాటతో మొదలు పెడతామో, ఏ మాటతో ముగిస్తామో - ఇద్దరివి అచ్చంగా ఒకేలా ఉండేవి.

అప్పట్నుంచి - మా రాతలో పదాలు, బాటలో పాదాలు - ఒకే రీతి, ఒకే లయ.
అప్పట్నుంచి - మేమిద్దరం గుంటూరులో కలిసి (BH లో ఇంటర్ + ఏసీ కాలేజ్‌లో డిగ్రీ) చదువుకున్న ఐదేళ్ళూ  - ప్రతిరోజూ, ప్రతి నిముషం మాతో మేమిద్దరమే ఉన్నాం. నాకు అపర్ణ తప్ప వేరే ఫ్రెండ్ ఎవరూ లేరు.

యశోధరా మేడం చెప్పిన O. Henry రాసిన After 20 years కథ పాఠం విన్నాక బండ్లమూడి హనుమాయమ్మ గారి విగ్రహం దగ్గర మట్టి తవ్వి రూపాయి నాణేలు పాతిపెట్టి  -  ఓ ఇరవై ఏళ్ళ తర్వాత వెళ్ళి అవి ఉన్నాయో లేదో చూద్దామని అనుకున్నది మేమిద్దరమే!

యశోధరా మేడం డైరెక్ట్ చేసిన A Pound of Flesh (based on Shakespeare's drama TheMerchant of Venice) లో అపర్ణ పోర్షియా, నేను నెరిస్సాగా act చేశాం.

గాయత్రీ మేడం Guy De Maupassant రాసిన The Chair Mender కథ పాఠం చెప్తూ చెప్తూ - ఆవిడ ఫేవరెట్ హీరో శోభన్ బాబు సినిమాల ఉదాహరణాల్లోకి వెళ్ళిపోయినప్పుడు - ఆవిడ చూడకుండా రహస్యంగా మాలో మేమే కిసుక్కుమన్న girly girly giggles మా ఇద్దరివే!

అపర్ణ వాళ్ళింట్లో తనకో రూం ఉండేది. ఒక చిన్నమంచం మాత్రం పట్టి - బయటి వైపుకి ఉన్న ఒకే ఒక కిటికీ మీదుగా సన్నజాజి తీగ పాకి ఉండే ఆ చిన్నగది అంటే నాకు బోల్డంత ఇష్టం. ఆ గది లోనే ఫైనల్ ఎగ్జామ్స్ కోసమని కంబైన్డ్ స్టడీ చేద్దామని కూర్చుని, చేస్తున్న ఫిజిక్స్ థీరమ్స్ తో పాటు - ఇంకో పక్క  దేవులపల్లి కవితలు, Anne of Green Gables కథలూ - చదువుకున్నది మేమే!

నవోదయాలో కొనుక్కున్న తెల్ల కాయితాలు పుస్తకంలో - మాథ్స్ చేస్తూ పక్కన మార్జిన్లో హిందీ పాటలు రాసుకున్నది మేమే!

వేసవిలో పవర్-కట్ రోజుల్లో - వాళ్ళింటి ముందున్న బాలకుటీర్ గోడ మీంచి ఇవతలకి వాలి ఉన్న గోరింటాకు పూల వాసన పీలుస్తూ మౌసమ్ హై ఆషికానా ... ఆజావో మై బనాదూ పలకోం కా శామియానా అని పాడుకుంటూ - మెరిసిన starry-eyes మావే!

సంక్రాంతి నెల పట్టగానే నేర్చుకున్న కొత్త ముగ్గులు వాకిళ్ళలో వేసుకుని - అవి చూడడానికి రాత్రి ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి వచ్చిందీ మేమే!

నవోదయాలో తెలుగు పుస్తకాలు కొనుక్కోవాలన్నా - ఏసీ కాలేజ్ సెంటెనరీ జరుగుతున్నప్పుడు మా కలెక్షన్ కోసం స్టాంపులు కొనుక్కోవాలన్నా - మా పప్పి పుట్టినరోజుకి దానికిష్టమైన గులాబీ మొక్క surprise gift కొనడానికి ఏసీ కాలేజ్ ముందున్న నర్సరీకి వెళ్ళాలన్నా - ఏసీ కాలేజులో లంచ్ చెయ్యగానే నాజ్ సెంటర్ వైపు నడుచుకుంటూ వెళ్ళి  అక్కడున్న Florist షాపులో బొకేలు window-shopping చేసి రావాలన్నా - ట్యూషన్లకి వెళ్తున్నా - రిక్షాపై టాప్ తీసేసి ఏసీ కాలేజ్‌కి వెళ్ళే దారిలో వచ్చే ఓవర్ బ్రిడ్జ్ వాలులో జోరుగా జారుతున్న రిక్షాలో - మొహానికి తగులుతున్న గాలికి ఇంకొంచెం పెరిగిన హుషారులో పకపకలాడాలన్నా - పుట్టిన రోజులకి ముందే అనుకుని ఎవరికి నచ్చినవి వాళ్ళు ముందే చెప్పుకుని  ఒకళ్ళకొకళ్ళం gifts కొనుక్కున్నా - Royal Ice Creams కి వెళ్ళి బాదంఖీర్ తాగాలన్నా - డిగ్రీ అయిపోయాక PG చేయడానికి యూనివర్సిటీలకి అప్లికేషన్లు పెట్టాలన్నా - ఏం చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా - మేమిద్దరమే! నాకు గుర్తుండి డిగ్రీ మొదటి ఏడాదిలో ఒకసారి మాత్రం అపర్ణ లేకుండా నేను, ఇంకోరోజు నేను లేకుండా అపర్ణ  ఏసీ కాలేజ్‌కి వెళ్ళాం అంతే!

డిగ్రీ అయ్యాక - కొండల కోనల తిరుపతిలో నేనూ, కోటల తోటల మైసూరులో తనూ చదువుకున్నా - పెళ్ళిళ్ళయ్యాక - మళ్ళీ ఇద్దరం బెంగుళూరు చేరాం.

ఆ తర్వాత అనుకోకుండా- చెరో చోటయ్యాము కానీ - ఈ దూరాలు మా మధ్య పేరుకే కానీ మా మాటల-పేరుకి అడ్డమే కాలేదు.

ఇప్పటికీ ఓ రెండు సార్లైనా పలకరించుకుని - ఒకప్పుడు తిరిగిన దారులని గుర్తు చేసుకోందే వారం గడవదు మాకు.

ఇప్పటికీ ఇండియా వెళ్తే - ఒక వేళ నేను బెంగుళూరు వెళ్తే సరే సరి - లేకపోతే నేనెక్కడ ఉంటే అక్కడికి వచ్చి నాతో ఓ రెండ్రోజులు గడిపివెళ్తుంది అపర్ణ.

ఇప్పటికీ - నాకిష్టమని - ఎఱ్ఱెఱ్ఱని పూల కాశీరత్నాలని, లేతగులాబీరంగు బఠాణీ పూలని బెంగుళూరులో తనింట్లోని తోటలో పెంచుతోంది అపర్ణ.

ఎన్ని చెప్పుకున్నా - చెప్పుకున్న కొద్దీ ఊరే కబుర్లు
ఎంత నవ్వుకున్నా - నవ్వుకున్న కొద్దీ మీఱే నవ్వులు
రాశి పోసుకున్న ఆ కబుర్లు - పూలు పూసినట్లాయే నవ్వులు
చెప్పుకుంటూ - నవ్వుకుంటూ -
ఒకరికొకరం - ఎప్పటినుంచో - ఇంకుతో రాసుకోకపోయినా - synch లో ఉంచుకున్న Walking డైరీలం!

అందుకే...
అప్పడూ... ఒకే పాట పలికింది వేరువేరు గొంతుల్లో...
అప్పటినుంచి ఇప్పటిదాకా... ఒకే పాట పలుకుతోంది వేరు వేరు గొంతుల్లో...
ఇప్పటి నుంచి ఎప్పటికైనా... ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గొంతుల్లో...

16 కామెంట్‌లు:

  1. మీ పోస్ట్ చాలా బాగుంది.నాకూ నా గుంటూరు రోజులు గుర్తొచ్చాయి.మీ స్నేహం గురించి చదువుతుంటే చాలా హాయిగా ఉంది.ఈ మధ్య హనుమాయమ్మ స్కూల్ గురించి, కాలేజ్ గురించి గుంటూరు పిల్లల దగ్గర వింటున్నాను చాలా.మీ ఈ లింక్ మా కజిన్ కు పంపుతున్నాను.వాళ్ళంతా అదే స్కూల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా బ్లాగ్ చదివి మీ కజిన్స్‌తో పంచుకున్నందుకు చాలా థాంక్స్, మాలా కుమార్ గారు!

      తొలగించండి
  2. స్వరములు వేరైనా
    రాగం ఒకటే..
    గొంతులు వేరైనా, గీతం, గానం ఒకటే..
    ఎందుకంటే,ఒకరి గుండె మరొకరి గూడు కాబట్టి అని అర్థం అయింది.

    అందమైన writeup..
    ఇంకా అందమైన friendship!!

    ఈ బంధానికి ఇంకా,ఇంకో అందమైన పేరు కనిపెట్టి అది మరొక పోస్ట్ రాయాలని కోరిక.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అందమైన వ్యాఖ్యకి బోల్డన్ని థాంక్స్! మళ్ళీ కుదిరినప్పుడు తప్పకుండా ఇంకో పోస్ట్ రాస్తాను మా friendship గురించి.

      తొలగించండి
  3. మీరు, మీనాన్నగారు ఒకే నెలలో పుట్టినట్లు మీరు వ్రాసింది చదివినట్లు గుర్తు....మీ నాన్నగారు నవంబరు కదా ? మీరు virgo ఎలా అయ్యారు ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు వేదిక్ అస్ట్రాలజీని ఫాలో అవ్వండి నీహారిక గారూ ! బేసిగ్గా వేదిక్ అస్ట్రాలజీ చంద్రున్ని భట్టి ఉంటుంది.

      తొలగించండి
    2. భలే గుర్తు పెట్టుకుని అడిగారండి, నీహారికా! నాది నక్షత్రం ప్రకారం వృశ్చిక రాశి, తేదీల ప్రకారం కన్యా రాశి (Virgo). అందుకే మీకు నా పుట్టినరోజు మా నాన్నలా నవంబర్లో నేమో అనిపించి వుంటుంది.

      తొలగించండి
  4. మీరు గమనించారో లేదో మీ బ్లాగులో వ్యాఖ్య వ్రాసిన తరువాత మీ సమాధానం కోసం సంవత్సరాల తరబడి వేచి చూడవలసి వస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరన్నది నిజమేనండి, నీహారికా! బోల్డు comments కి బదులే ఇవ్వలేదు నేను. ఇప్పుడు పూర్తి చేసేశాను నా home-work. ఇక ముందు వీలయినంత తొందరగా బదులిస్తాను. Thanks for your friendly reminder!

      తొలగించండి
  5. చాలా బాగున్నాయి మీ స్నేహం కబుర్లు. ఎంత బావుండేవి కదా ఆ రోజులు.
    చేయి పట్టుకు తీసుకెళ్లి , మీరంతా తిరిగిన దారుల్లో తిప్పేసి, చెప్పుకున్న కబుర్లన్నీ పంచేసి , నేను కూడా మీతోనే అక్కడే ఉన్నాను కదా అనిపించేలా రాస్తావు లలితా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నే రాసిన రాతల్ని ఇంత ఇష్టంగా చదువుతున్న నీకు చాలా థాంక్స్, ఇంద్రాణీ!

      తొలగించండి
  6. ఎంత బావుందో చెప్పలేనంత బాగుంది ... ఆ picture కూడా భలే కుదిరింది ... Thanks for turning back the time.. Time travel అంటే ఇదే కదా 💕

    రిప్లయితొలగించండి
  7. Only special people get blessed with friendships like these ... Sweet, innocent and above all, enduring!

    రిప్లయితొలగించండి