19, జులై 2021, సోమవారం

గీతం...సంగీతం...సతతహరితం - 13 - కుఛ్ దిల్ నే కహా?! - మది ఏమి పలికిందో?

 
అనుకున్న మాటలన్ని
పెదవి చాటునాగిపోయి 
చెప్పలేని ఊసులాయె  
ఊసులన్ని ఊహలూరె 
చెప్పబోతె పలుకు చాలదాయె 

అనలేని మాటలేవో 
ఎదల మాటు దాగి పోయి  
చెప్పరాని ఊహలూరె 
ఊహలన్ని ఊసులాయె 
చెప్పలేక పలుకు మూగబోయె 

*******
*******

    మాట, నవ్వు - మనిషికే దక్కిన వరాలు. 

    మన్ననగా వాడుకుంటే మనిషికి మనిషిని దగ్గర చేసేవి ఆ రెండే. 
    మేర మీరితే మనసులు విరిచి దూరం పెంచేవీ ఆ రెండే. 

    అదసలెలా మొదలవుతుందంటే... తిరుగులేని చూనమా-మంత్రంతో.  
    తెలుగు నేర్వడానికి ఓనమాలెలాగో - చెలిమి చెయ్యడానికి చూనమాలు అలాగన్నమాట!. 

    పెదవి కదపక ముందే కన్ను కన్ను కలిస్తే చూపు నిలుస్తుంది. 
    పెదవులాని మొలిచిన చిరునవ్వు నిలవరిస్తుంది. 
    పెదవి దాటిన మాటతో పరిచయం నిలకడౌతుంది. 

    ఇంత జరిగిన తర్వాత ఆ మొదటి మాట దగ్గరే ఆగిపోంగా?!
    మాట మీద మాట వేసుకుంటూ - ఊసులాడుకుంటాం. 
    ఉబుసుపోక మాటల్లో ఒకరి మనసొకరికి తెలుస్తుంది. 
    ఎరిగిన మనసుతో పెరిగిన పరిచయం నెయ్యంగా మారుతుంది. 
    మనసెరిగి మసలడం అలవోకగా అలవడుతుంది. 

    అక్కడితో ఆగిపోతే కథేముంది?
    చనువు పెరుగుతుంది. 
    తెలిసిన మనసు అలుసవుతుంది. 
    పలుకుతున్న మాట పలచనవుతుంది. 
    ఇద్దరుగా వున్నప్పుడు మేలమాడిన మాట - నలుగురిలో పడ్డప్పుడు నవ్వులాటవుతుంది. 

    ఏదో ఆదమరచిన ఆవేశపు వేళలో అదుపు తప్పిన మాట పెదవి మీరుతుంది. 
    
    అంతే! అప్పటివరకు అర్థవంతంగా వున్న మాట - మాట మీద మాటై - మాట మీరి ఎద మీద పోటై - ప్రతి పదార్థం అనేకార్థాల అపార్థమై మిగులుతుంది. చెలిమితీగ వాడుతుంది. 

    అసలెందుకు మాట్లాడేమా అన్న తీరని బాధ మొదలవుతుంది. 

    మాటలతో ఒకరినొకరు గుచ్చుకుని నొచ్చుకున్న గడిచిన క్షణాలన్నీ - తిప్పగలిగిన గడియారం ముళ్ళలా మళ్ళొక్కసారి వెనుతిరిగి - అది నాటికీ, నేటికీ, ఏనాటికీ గడవని కాలమైతే  ఎంత బావుండుననిపిస్తుంది. 

    అనిపించింది, అనుకున్నది - అనుకున్నట్టుగానే జరిగితే  - ఇంక అనుకునేదేముంది? అలా జరగనే జరగదు. 
    
    జారిన మాట ఆరని గాయమై, మాయని జ్ఞాపకమై అట్టే నిలబడిపోతుంది. తదుపరి మాటల తూనికకి ఊనికౌతుంది. నేరవకనే నేర్చుకున్న మరపురాని పాఠమౌతుంది. నేర్చిన పాఠం నిశ్చలమై నిచ్చలౌతుంది. 
    
    *******
    *******

    ఒంటికి నొప్పి కలిగితే మందుంటుంది. 

    మనసుకి నొప్పి కలిగితే మంచి మాట మందల్లే పని చేస్తుంది. కానీ అనుకున్న అన్ని వేళలా మనసైన మాట అందుబాటులో వుండదు. 

    మరప్పుడెలా? 

    మాటైతే దొరకదు కానీ మాయ చేసి మనసుకి మలాము పూసే హాయిపాట ఒకటి ఎప్పుడూ 'నీకు నేను తోడున్నా' నంటూ గుర్తుకొస్తుంది. 

    అలాటిదే ఒకానొక పాట - తనకు తానే సాటైన పాట - ఒకనాటి మేటి పాట. 

    ఆ పాట కథా-కమామీషూ ఏంటంటే... 

    పాట: కుఛ్ దిల్ నే కహా...?!
    సినిమా పేరు: అనుపమ 
    పాట తీసినవారు: హృషీకేశ్ ముఖర్జీ 
    పాట రాసినవారు: కైఫీ అజ్మీ 
    పాట చేసినవారు: హేమంత్ కుమార్ 
    పాట పాడినవారు: గానకోకిల - లతా మంగేష్కర్ 
    పాట పాడుతున్నట్టు నటించినవారు: షర్మిలా ఠాగూర్ 
    పాట వింటున్నట్టు కనిపించినవారు: ధర్మేంద్ర 
    పాటకి యూట్యూబ్ లింక్https://www.youtube.com/watch?v=uc8RBLMFLgI

   *******
   *******


    ఇహిప్పుడు ఈ పాటకి పని చేసిన వారి గురించి కొన్ని చమక్కులు - తళుక్కులు. 

    'అనుపమ' సినిమాని హృషీకేశ్ ముఖర్జీ ప్రఖ్యాత దర్శకుడు బిమల్ రాయ్‌కి అంకితమిచ్చారు. 

    బిమల్ రాయ్ తీసిన 'మధుమతి' సినిమా లోని పాట 'సుహానా సఫర్' పాటని చాలా రోజులు పాడిందే పాటగా పాడా!

    పాట రాసిన కైఫీ అజ్మీ ఇద్దరు పిల్లలూ మనకి బాగా తెలిసిన వాళ్ళే! ఒకరు బాపు సినిమాల కెమెరా మాంత్రికుడు బాబా అజ్మీ అయితే ఇంకొకరు హిందీ సినిమా నటి షబానా అజ్మీ. అన్నట్టు ఒకప్పటి హిందీ సీరియల్ నటి తన్వి అజ్మీ బాబా ఆజ్మీకి భార్య. 

    ఇక పోతే పేరు లోనే ఠాగూర్ వంశనామం చేర్చుకున్న షర్మిలా ఠాగూర్ అచ్చంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చుట్టమే!

    చివరాఖరుగా నే చెప్పబోతున్న ధర్మేంద్ర అందరికీ తెలిసినట్టే డ్రీం గర్ల్ హేమమాలినికి నిజజీవితకథానాయకుడు. అంతకు ముందే సన్నీ దేవల్, బాబీ దేవల్ అనబడు ఇద్దరబ్బాయిల తండ్రి కూడా. 

    
 *******
  *******

    పాట ఆనుపానులు తెలిశాయి కదా! 

    మరిప్పుడు ఈ పాటలో నాకు నచ్చిన విశేషాలు. 

    మొదటగా - పాట మొదలవుతుండగా కనిపించిన చెట్లు. 

    వరసగా ఆకాశాన్ని తాకుతున్నట్టుగా నించున్న ఆ చెట్లేమిటో గానీ నలుపు-తెలుపుల తెర మీద కూడా ఎంత రాజసంగా కనిపిస్తాయో!

    ఆ చెట్లని చూస్తూ మురుస్తుండగా - ఆ చెట్ల మీదుగా తేలి వస్తున్న గాలిపాటలా తీగ సాగే  లతామంగేష్కర్ గొంతు ఎంత నచ్చుతుందంటే - ఆ పాటని దోసిటిలో పట్టి అట్టే పెట్టేసుకోవాలన్నంతగా. 

    ఈ పాటలో మంద్రస్థాయిలో వినిపించీ వినిపించనట్టుండే లతాజీ గాత్రం అద్భుతంగా వినిపిస్తుంది. విచ్చీవిచ్చని మొగ్గేదో తనలో తాను గుసగుసలాడుకున్నట్టుంటుంది. మోయలేని తీపిహాయినేదో మనసుకి పూసిపోతున్నట్టుంటుంది. 

    ఈ పాటకి హేమంత్ కుమార్ కూర్చిన సంగీతానికి హేమంత మాసపు మంచుతెరల సున్నితపు చాలు ఏదో పొసగినట్టనిపిస్తుంది. 

    అన్నిటికన్నా ఎక్కువగా నాకు ఈ పాటలో నచ్చినది ఏమిటీ అంటే - విరిసీ విరియని మొగ్గలా అనిపించి, ముక్కుపచ్చలారని అచ్చరలా కనిపించే షర్మిలా ఠాగూర్. 

    పాట సాగిన ఆసాంతం గాలికి అల్లలాడే తెల్లగులాబీ తీగ లాగా సున్నితంగా కదులుతూ కనిపిస్తుంది ఆవిడ. పెదవుల మీద కనీకనిపించని చిరునవ్వు, చెంపలలో దాచలేని చిఱుసిగ్గు, లతాజీ పాడిన పాటకి తగినట్టు అలవోకగా కదిలిన పలుచని పెదవులు - ఓహ్! ఎంత సుకుమారమో! అది నటనేనా లేక ఆవిడకి సహజమైన ప్రవర్తనా అని అనిపిస్తుంది. 

    కట్టుకున్న పూల పూల చీర - దానికి తగినట్టు మెడ చుట్టూ, బుట్టచేతుల అంచులకి కుట్టిన పూలపూల అంచు రవికతో - షర్మిల పూబాలలా కనిపిస్తుంది ఈ పాటలో. 

    ఈ పాటలో నాకనిపించిన, కనిపించిన ఒక ప్రత్యేకత - షర్మిలా ఠాగూర్ కనిపించిన ప్రతి ఫ్రేము - ఒక అందమైన ఛాయాచిత్రంలా అనిపిస్తుంది. 

    యూట్యూబులో పాట మాత్రమే వున్న వీడియో ఉన్నా - పాటకి ముందు కనిపించే చెట్లూ, పాటకి చివర్లో ధర్మేంద్ర చెప్పే డైలాగులు నాకిష్టం - అందుకని ఈ వీడియో అప్పు తెచ్చుకున్నా! 

    కైఫీ అజ్మీ తన కలాన్ని ఆకుల కొనల నుండి జారే చల్లని పాలమంచులో ముంచీ,  పూల రెక్కల అంచులకి తాకించీ పాటని రాశారేమో ! అందుకే ఆ సౌకుమార్యం మహ సౌఖ్యంగా అమరింది ఈ  పాటలో. 

    లేకపోతే కనురెప్పల చల్లని పానుపుపై  - కలల వేలుపులు పవళించేనన్న ఊహ ఉట్టుట్టినే అందిపోదు కదా! 

    అర్థం చదివినప్పుడు కొంచెం melancholic గా అనిపించినా - పాటలో రాసిన పదాల అందమూ, పాట పాడిన వారి గళమాధుర్యమూ, షర్మిలా ఠాగూర్ graceful beauty ఆ విషాదాన్ని మదికి అంటనీయవు. 

    నాకు ఈ పాట ఎంతగా నచ్చిందంటే - ప్రతి పదార్థం రాసుకుని మీ అందరితో పంచుకునేంతగా! 
    

    



కుఛ్ దిల్ నే కహా?!  - మది ఏమి పలికిందో?
కుఛ్ భీ నహీ... - అరె! ఏమీ లేదింకా!
కుఛ్ దిల్ నే సునా?! - ఎద విన్నదేమిటో?
కుఛ్ భీ నహీ...-  ఉహుఁ! ఏదీ కాదింకా!

ఐసీ భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!
ఐసే భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!

కుఛ్ దిల్ నే కహా?!  - మది ఏమి పలికిందో?
కుఛ్ భీ నహీ... - అరె! ఏమీ లేదింకా!

లేతా హై దిల్ అంగ్‌డాయియా - నా ఎదకేమో ఆగామి చింతా!
ఇస్ దిల్ కో  సమ్‌ఝాయే కోఈ - ఈ మదికెవరైన చెప్పండి సుంత! 

అర్‌మాన్ న ఆంఖే ఖోల్ దే - నాలో కోరిక కనుతెరవనీక!
రుస్‌వా న హో జాయే కోఈ - ఎవరికో పెనునింద పడనీక!

పల్‌కోం కీ ఠండీ సేజ్ పర్ - కనురెప్పల చల్లని పానుపుపై
సప్‌నోం కీ పరియా సోతీ హై - కలల వేలుపులు పవళించే! 

ఐసీ భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!
ఐసే భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!

కుఛ్ దిల్ నే కహా?!  - మది ఏమి పలికిందో?
కుఛ్ భీ నహీ... - అరె! ఏమీ లేదింకా!

దిల్ కీ తసల్లీ కే లియే - మది ఊరడింపు కోసమే... 
ఝూఠీ చమక్,  ఝూఠా నిఖార్! - ఈ కపటపు తళుకు, కపటపు మిణుకు!

జీవన్ తో సూనా హీ రహా - జీవితమిది శూన్యమనిపించునిలా...   
సబ్ సమ్‌ఝే ఆయీ హై బహార్! - ఆమని వచ్చెనని ఎవరేమనినా!

కలీయోం సే - కోఈ పూఛ్‌తా ? - ముకుళమునెవరైన అడిగిరా?
హస్‌తీ హై వో - యా రోతీ హై?! - అది నగవేమో, మరి వగపేమో?! 

ఐసీ భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!
ఐసే భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!

కుఛ్ దిల్ నే కహా?!  - మది ఏమి పలికిందో?
కుఛ్ భీ నహీ... - అరె! ఏమీ లేదింకా!
కుఛ్ దిల్ నే సునా?! - ఎద విన్నదేమిటో?
కుఛ్ భీ నహీ...-  ఉహుఁ! ఏదీ కాదింకా!


 *******
  *******

తెలిసినదే అయినా నాకు నేను మళ్ళీమళ్ళీ నేర్పుకునే పాఠం 

అనలేని మాట
అనకపోతే - 
అది అవసరమైన అదుపు 

అనదగ్గ మాట
అనకపోతే - 
అది అనవసరపు పొదుపు 

~ పాటల భైరవి 


2 కామెంట్‌లు:

  1. Don't know why..tears in my eyes ..

    అంతులేని అందం , ఏదో ఇంకా బయటకి కరగని బోల్డు అందం, ఆహ్లాదం.చాలా ఎక్కువగా కనిపించింది ఉక్కిరి బిక్కిరి చేసేసాయి. Just wonderful song, post, write up, very specially.. prologue!!

    రిప్లయితొలగించండి