17, ఫిబ్రవరి 2017, శుక్రవారం

వనచరకొండల్లో నక్షత్ర దర్శనం - నాంది

2014 సంవత్సరం 

అమ్మా, నాన్నా జులై లో రావడం, వాళ్ళతో వెళ్లి అన్నగాణ్ణి కాలేజ్ లో చేర్పించడం, మళ్ళీ వాళ్ళని షికాగో విమానాశ్రయంలో ఎయిర్-ఇండియా విమానం ఎక్కించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. 

అసలు హైద్రాబాదులో విమానం ఎక్కి - ఇక్కడికి వచ్చేముందే చెప్పింది అమ్మ - నాన్నకి నడుము నొప్పి వస్తోందని - కానీ నాన్న డాక్టర్ దగ్గరికి అమెరికా నుంచి వెనక్కి వెళ్ళాక వెళ్దామని అనుకుంటున్నారని. 

నాకెందుకో అనిపించింది - నాన్నకేదో అది మామూలు నొప్పి కాదు, ఆయన కావాలనే డాక్టర్ దగ్గరికి వెళ్లడాన్ని వాయిదా చేస్తునారని. మళ్ళీ వాళ్ళేమన్నా టెస్టులు అవీ అంటే అమెరికా రావడం కుదరదని. 

మరి నేనేమో ఏడాది నుంచీ అంటూనే వున్నాను - "నాన్నా! మీరు వాడి అక్షరాభ్యాసానికి గుంటూరు వచ్చారు, మళ్ళీ వాణ్ణి కాలేజ్ లో చేర్పించడానికి కూడా రావాలి" - అని.

సరే - మొత్తానికి అమెరికా వచ్చారు.  

మేమిక్కడ నుంచి టికెట్లు కొంటే ఆరు నెలలకి కొనేస్తామని - మూడు నెలల్లో తిరిగి వెళ్ళేలాగా - అక్టోబర్ రెండవవారంలో ప్రయాణం ఉండేలా - టు అండ్ ఫ్రో టికెట్లు ఆయనే బుక్ చేసుకున్నారు. 

ఇక్కడ వున్నప్పుడు - వారానికి ఒక పది గంటలు ఆఫీస్ పని చేసేవారు

రాజమండ్రి నుంచి ఆఫీస్ వాళ్లు రిపోర్ట్స్ అవీ -మెయిల్ చేస్తే అవి సరి చూస్తూ - అవసరమైతే ఫోన్ లో కాన్ఫరెన్స్ కాల్స్ జరుపుతూ

బయటకి ఎక్కడకి వెళ్ళినా ఎక్కువసేపు నడవలేకపోయేవారు. నడుము మీద చేయి వేసుకుని కూర్చుండిపోతూ వుండేవారు. 

"కాలిఫోర్నియా అంటే బోల్డు తిరగాలి నాన్నా - పోనీ ఇంట్లో వుండండి నేనూ, తనూ వెళ్లి వాణ్ణి కాలేజ్ లో చేర్పించేసి వచ్చేస్తాము",  అంటే - "అబ్బే! ఇంత దూరం వచ్చాను - అమెరికా వెస్ట్ కోస్ట్ చూడాల్సిందే" అన్నారు.

బదరి - నాన్న ఉత్సాహం ప్లస్ ఆయన నడవడానికి పడుతున్న ఇబ్బంది చూసి అన్నారు నాతో - "అంకుల్ కి వాకింగ్ స్టిక్ కొంటే ఆయనకి నడవడానికి సపోర్ట్ గా వుంటుంది, కొంచెం హాయిగా నడవగలుగుతారు" - అని. 

వాకింగ్ స్టిక్ అన్న మాటే నాన్నకి నచ్చలేదు మొదట. 

ఆయనకి - తానెప్పుడూ ముచ్చటగా నెమరేసుకుని - చుట్టూ వున్న అందరితో పంచుకునే కుర్ర-తనం తాలూకు గత కాలపు జ్ఞాపకాలనుంచి నుంచి - వర్తమానంలో కర్ర-తనానికి జరగబోతున్న బదిలీ - అంత ఇష్టంగా అనిపించినట్లులేదు. 

కాని బదరి రోజూ ఆన్లైన్ లో రకరకాల మోడల్స్ లో చేతికర్రలు వెతికి - "అంకుల్! ఇది బావుందా, అది బావుందా" - అని అడుగుతూ - మొత్తానికి తనకి మాత్రమే సొంతమైన సమ్మోహనాస్త్రంతో - నాన్నలో మెల్లిగా చేతికర్రాసక్తిని పెంచారు. 

షాపింగ్ కి వెళ్ళిన ప్రతీ చోటా వాకింగ్ స్టిక్ గురించి వాకబు చేస్తూ చేస్తూ చివరికి Unlce Sam's అనే షాప్ లో లాఠీలా కనిపించే ఒక చేతికర్ర కొన్నారు. 

అది చిన్న బాటన్ లా వుండి  అవసరం అయినపుడు తెరుచుకునేలా గొడుగుకర్రలా పని చేస్తుందన్నమాట.

నాన్నకి అది నచ్చింది - సినిమాల్లో మిలిటరీ పాత్రధారులు పట్టుకునే స్టైలిష్ స్టిక్ లా. 

మొత్తానికి రోజూ సాయంకాలం ఒక గంట వాకింగ్ కి  వెళ్లి వచ్చేవారు. ఇదంతా ఎందుకంటే కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు నడవడానికి కావాల్సిన స్టామినా సమకూరుతుందని. 

అమ్మా, నాన్న వచ్చిన పని నిర్విఘ్నంగా జరిగింది. 

అందులో భాగంగా - అన్న ఈగిల్ స్కౌట్ సెరెమనీ చిన్నప్పట్నుంచి కారులో తిప్పిన తాతగారిని అన్న తన కార్లో షికారుకి తీసుకెళ్లడం - తాతగారు అన్నని లంచ్-డేట్ కి తీసుకెళ్ళడం - అన్నిటికన్నా ముఖ్యంగా తాతగారు-అమ్మమ్మ, నాన్నమ్మ - ముగ్గురూ కలిసి కాలిఫోర్నియా వచ్చి వాడిని కాలేజ్ లో చేర్పించడం - అన్నీ ఒకదాని తర్వాత ఒకటి - అనుకున్నట్టుగా కొన్ని- అనుకోకుండా కుదిరి కొన్ని - జరిగిపోయాయి. 

"టికెట్లు పోస్టుపోన్ చేసుకుని - అక్టోబర్ లో ఆకులు రంగులు మారతాయి - అవి చూసి ఇంకో నెలన్నరలో ఏదో ఒక  రోజు ఖచ్చితంగా స్నో పడుతుంది అది చూసి వెళ్ళండి" అంటే "అబ్బే - ససేమిరా కాద"న్నారు నాన్న. 

పాపం అమ్మకి ఉండాలనే వుంది. కానీ నాన్న వింటేగా. అనుకున్నట్టుగానే అక్టోబర్ లో ఇండియా వెళ్లారు. 

ఇండియా వెళ్ళిన వారం రోజుల్లో ఫోన్ లో అమ్మ గొంతు దిగులుగా వినిపించింది - "నాన్న నిన్న వెళ్లి అన్ని టెస్టులూ చేయించుకున్నారు. మన అపార్ట్ మెంట్ లో తెలిసిన డాక్టర్ గారు ఆ రిపోర్టులు చూడగానే - 'కామేశ్వర్రావుగారూ ముందు మీరు అర్జెంటుగా హైద్రాబాదు వెళ్లాల్సివుంటుంది ' అంటే - నాన్నేమో - 'డిసెంబర్ లో మావాళ్ల ఇంట్లో పెళ్లి వుంది అప్పుడు వెళ్తాను' అన్నారు. అది వినగానే డాక్టరు గారు - 'మీకెలా చెప్పాలో తెలియట్లేదండీ కానీ మీరు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది' అని చెప్పేశారు. ఇంకో వారంలో ప్రయాణం. పప్పీ దగ్గరకి వెళ్తున్నాము" -అని చెప్పింది

హైదరాబాదులో పప్పీ దగ్గరికి వెళ్లారు - అమ్మా, నాన్న

స్టార్ హాస్పిటల్ లో డాక్టర్ గోపీచంద్ గారి దగ్గర appointment దొరికింది. 

Angiogram, ఇంకా మిగిలిన ప్రిలిమినరీ టెస్టులు అన్నీ అయ్యాక - రిపోర్టులు వచ్చాక వాటి గురించి మాట్లాడడానికి డాక్టర్ గోపీచంద్ గారి దగ్గరికి వెళ్లారు - అమ్మ, నాన్న, పప్పి

రిపోర్టులు అవీ చూసి డాక్టర్ గారు - తొందర్లోనే సర్జరీ చేయాలి అని చెప్పగానే - నాన్న ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడాలి అని చెప్పి - అమ్మని, పప్పీని డాక్టర్ గారి రూంలోంచి బయటికి వెళ్లమన్నారట

వాళ్లలా వెళ్లగానే - నాన్న, డాక్టర్ గోపీచంద్ గార్ల మధ్య జరిగిన సంభాషణ:

"డాక్టర్ గారు! ఎంతవుతుందండి ఈ ఆపరేషన్ కి? 

"దాదాపు XX లక్షల దాకా అవుతుందండి - రెండు స్టెంట్లు వెయ్యాలి - అదీ కాక Aortic Aneurysm మీకున్న ఇంకొక ప్రాబ్లెమ్. అది ఎప్పుడైనా రప్చర్ అవొచ్చు"

"ఎప్పుడైనా అంటే ఎన్నాళ్లు పడుతుందంటారు?"

"ఇవాళ కావొచ్చు - ఇంకో రెండేళ్లు పట్టొచ్చు"

"ఆపరేషన్ చేస్తే ఎన్నాళ్లు ఉంటానంటారు?"  

"ముందు మీరు సిగరెట్లు మానేయాలి - ఆపరేషన్ చేయాలి - అదికూడా 50-50 ఛాన్స్ - ఆ తర్వాత ఓ పదేళ్ల దాకా పర్వాలేదు"

"నాకిప్పుడు 69 ఏళ్లు - ఆపరేషన్ చేయకపోయినా రెండేళ్లుంటాను - చేస్తే 50-50 ఛాన్స్ అంటున్నారు - ఎందుకొచ్చిన గొడవ - నన్నొదిలేయండి - హాయిగా ఇంటికెళ్లిపోతాను"

డాక్టర్ గారేమీ మాట్లాడలేదు

ఎదురుగా టేబుల్ మీద వున్న బజర్ నొక్కారు -  నర్స్ లోపలికి వచ్చింది

నర్స్ తో డాక్టర్ గారు "బయట కామేశ్వరరావుగారి భార్య వుంటారు - ఒకసారి పిలు" అని చెప్పారు

నాన్న వెంటనే కంగారుగా "ఇప్పుడావిడని పిలవడం ఎందుకండీ డాక్టర్ గారు?!" అని కుర్చీలో ఇబ్బందిగా కదిలారు

"ఆపరేషన్ కాకపోయినా రెండేళ్లు వుంటాను కదా - చేయించుకోకూడదు అన్న మీ ప్లాన్ కూడా బావుంది - మీరన్నది ఆవిడకి కూడా చెబ్దామండి" - అన్నారు డాక్టర్.

.... ..... ..... 

(నాన్న ఆలోచిస్తున్నారు - డాక్టరు అమ్మని పిలవకుండా ఎలా ఆపాలా అని)

"మీ ఆవిడ నాకు ఆల్రెడీ చెప్పారు - మీరు ఆపరేషన్ వద్దంటారని. అందుకే" అంటూ మళ్లీ నర్స్ కేసి తిరిగి - "ముందావిణ్ణి పిలుచుకురా" అని చెప్పారు డాక్టర్ గోపీచంద్ గారు

నాన్న వెంటనే సర్దుకుని "వద్దు లెండి - ఆపరేషన్ కి ఎప్పుడు రావాలో ఆ వివరాలు చెప్పండి" అంటూ బయటికి నడిచారు.

హైద్రాబాదు హాస్పిటల్స్ అంటేనే పట్టపగలే చుక్కలు కనిపించే వైనం - అలాంటి నక్షత్ర దర్శనం - ఆపరేషన్ జరగబోతున్నా - చుట్టూవున్నవాళ్లందరూ కంగారు పడుతున్నా - అంత హడావిడిలోనూ నాన్న కావించిన  హాస్యప్రియత్వ-దర్శనానికి ఇది నాంది. ఇంక వనచరకొండలు అంటే ... ముక్తాయింపులో చెప్తాను

<ముక్తాయింపు వచ్చే నెల ఇంకొన్ని కబుర్లతో.... >

10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

నాని 'నేను లోకల్' - నాన్న 'నేను వోకల్'

కిందటి గురువారం  ఫోన్లో టింగుమని శబ్దం చేస్తూ వచ్చిన ఈమెయిల్లో - నమస్కార్దేశిడాట్కామ్ వాళ్ల నుంచి ఒక సినిమెయిల్ మెరిసింది - నాని "నేను లోకల్" విడుదల అవుతోంది - చూడండహో అంటూ.

అది చూడగానే - ముందుగా వచ్చిన ఆలోచన - టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేని చిన్నప్పటి రోజుల్లో సినిమాగమనం ఎలా తెలిసేదా - గుర్తు చేసుకుందాం ఒకసారి - అని.

ఒక గూడు రిక్షాలో - ముందుపక్క రిక్షా అబ్బాయి నెమ్మదిగా తొక్కుతుంటే - వెనకగా కూర్చుని ఒక చేత్తో పట్టుకున్న మైకులో - "నేడ్డే చ్చూడండి (ఆ 'డే' మీద - 'చూ' మీద ఒత్తి పలుకుతూ) మీ అభిమాన థియేటర్ <పేరేదైనా కావొచ్చు>   మీ అభిమాన నటుడి <పేరేదైనా కావొచ్చు>  సినిమా" అంటూ - ఇంకో చేత్తో రంగురంగుల సినిమా వివరాలున్న పాంఫ్లెట్ / కరపత్రాలు వెదజల్లుతూ - వెళ్లే సినిమా-బండబ్బాయి ప్రతి శుక్రవారం వచ్చే సిని-మా-చుట్టం.

ఆ సినిమా-బండ్ల సరదాలనుంచి ఈమెయిళ్ల పరదాలకి అప్డేట్ అయ్యాము.

బదరి, నేను - సినిమాల్లో కూడా అప్డేట్ అయ్యాము బాగానే. భాషాభేదం సరే - వయోభేదం కూడా చూడం - బుజ్జిజింకలతో కలిసి Finding Dory చూడడానికైనా వాళ్లకన్నా ముందే మేం తయారు.

సినిమా అంటే - మాకు - ముఖ్యంగా నాకు - ఇలాగే వుండాలి - చూసే మూడుగంటల సినిమా ఇంకో ముప్పై గంటలు ఆలోచించేలా చేయాలి - అన్న పట్టింపులేం లేవు.

తెలుగు భాష - యాస ఏదైనా సరే - మంచి మాటలతో వుండి, పాటలు అంతో ఇంతో వినసొంపుగా వుండి, హాస్యం పేరుతో సాటి మనుషులని తన్నకుండా-వెక్కిరించకుండా వుండి, హీరో-హీరోయిన్లు చూడముచ్చటగా వుండి - తెరంతా రంగురంగులుగా - "అబ్బా! కాసేపు అన్నీ మర్చిపోయి హాయిగా వేరే లోకం చూసొచ్చాము" అనేలా ఉంటే చాలు.

అసలు నిజం చెప్పాలంటే మొదట 'నేను లోకల్' సినిమా పేరు వినగానే వెంటనే ఇది చూసి తీరాలి అనిపించలేదు.

కానీ అప్పుడెప్పుడో ఈ నానిదే భలే భలే మగాడివోయ్ తర్వాత - అసలే ఈ మధ్య థియేటర్లో  తెలుగు సినిమాలు చూడలేదేమో - మా సినిమాకలి మిక్కిలిగా వుంది.

సరే - మన అచ్చతెలుగబ్బాయి -  చలాకీగా చులాగ్గా సినిమాని నడిపించేస్తాడసలే - నాని సినిమా కదా - వెళ్దామా అనుకున్నాము - కిందటి శుక్రవారం.

మేము తలిస్తే సరిపోదు కదా - బుజ్జిజింక దయతలచాలి - అసలే వాడికి శనివారం ఏదో లెక్కల పోటీ స్కూల్లో.

శుక్రవారం రాత్రి - బుజ్జిజింక కలల వేళ - దుప్పటి చెవులదాకా కప్పి - బుగ్గ మీద ముద్దు పెడుతూ - నాన్నగారు అడిగారు - "నాన్నా! రేపు సినిమాకి వెడదామా? మనమ్మ సినిమా-బెంగ తీరుద్దామా?" అని.

"తెలుగు సినిమానా - అమ్మో - గట్టిగా అరుస్తారేమో , రక్తాలొచ్చేలా కొట్టుకుంటారేమో ?" - బుజ్జిజింక నిద్ర మత్తులో కూడా ఇంతకు ముందు అప్పుడెప్పుడో చూసిన సినిమా తాలూకు పలవరింతే.

బుజ్జిజింక కలవరపాటుతో కూడిన పలవరింత విన్న అమ్మ - స్వగతంగా - "(కృష్ణవంశీ మొగుడి దెబ్బా - మజాకానా)" అనుకుంది.
సావకాశమైన గొంతుతో - ప్రకాశంగా -  నాన్నగారిచ్చిన  భరోసా- "లేదు నాన్నగాడు - ఇది సరదా సినిమా - ఇంతకు  ముందు చూసిన సినిమాలో నీకు నచ్చాడు - అదే అన్నీ మర్చిపోతూ ఉంటాడు - భలే భలే మగాడివోయ్ హీరో - ఆ నాని సినిమా".

"సరే - లెట్స్ గో " - వరమిచ్చేసిన బుజ్జి-దేవుడు పవళించాడు.

శనివారం - పొద్దున్న అబ్బాయి లెక్కల పోటీ - మధ్యాహ్నం అమ్మా-నాన్నల తమిళ-భాషా-తరగతి-భేటీ అయిపోగానే - సాయంత్రం భోజనాలు కాగానే తొమ్మిదిగంటల సినిమాటకి వెళ్లాం ముగ్గురం.

మా సినిమాచారం ప్రకారం -
నాకో బుట్టెడు చిప్స్----
పక్కనే చీజు----
ఇంకో పక్క  జకారమునకు హకారమాదేశించుకుని రెట్టించిన కారంతో నా చేత హాహాకారం చేయించే  హాలాపిన్యోస్  (Jalapeños) అనబడే గుండ్రని పచ్చిమిరపకాయ ముక్కలు---
బుజ్జిజింకకి Crunch-a-Bunch పొట్లం---
- కొనిపెట్టేసి ఇద్దర్నీ పట్టుకెళ్లి అన్నిటికన్నా పై....న వున్న వరసలో తన సరసన కూర్చోపెట్టుకున్నారు బదరి / నాన్నగారు.

కర కర చిప్స్ - కటుకు కటుకు Crunch - మిల్లులాడడం మొదలయింది.
దాంతో ఈ నేపథ్య సంగీతంతో టాకీ-సినిమా కాస్తా మూకీలా చూడాలేమో అని నాన్న చెవులు అల్లలాడడం కూడా.

బోల్డు మంది తెలిసినవారు ముందు-పక్క సీట్లలో కూర్చుని కనిపించారు.
కరకరలాడే నోటితో నవ్వుతూ -  కరాల-చాలనతో (కరచాలనం కాదు) - శబ్దం రాని పెదవుల కదలికతో 'హాయ్' అంటూ - కాసేపు పలకరింపుల-హడావిడి సాగింది.

ఇంతలో సినిమా మొదలయింది.

మెరిసే కళ్లతో చలాకీగా - మనకి బాగా తెల్సిన ఓ మంచబ్బాయిలా కనిపించే నాని సెప్టెంబర్ లో పరీక్షలు రాసే సీను.

పక్కనే కూర్చుని వున్న - బుజ్జిజింక - చాక్లెట్టు కటుకు-కటుకులు నెమ్మది నెమ్మదిగా కుహు-కుహులయి బుగ్గలు పూరించిన నవ్వులయ్యాయి.

మొత్తానికి ఈ సినిమాలో మాకు అనిపించినవి - నచ్చినవి - అవీ-ఇవీ-అన్నీ 

సినిమా మొత్తం సరదా-సరదాగా సాగిపోయింది - అక్కడక్కడా ఇల్లాజికల్ గా అనిపించినా - అంత పట్టించుకోలేదు మేము. 

నాని  (సినిమాలో పేరు బాబు) ఏక్షన్, డాన్స్, డైలాగ్ డెలివరీ - అన్నీ బావున్నాయి. అతిగా అరవకుండా - నెమ్మదిగా మాట్లాడినా కూడా -  ఆయాసపడకుండా ఆవేశం బాగా చూపించగలడీ అబ్బాయి - చూపుతో, మాటతో. 

కీర్తి సురేష్ - అమ్మాయి ముద్దబంతిపూవులా, ముద్దమందారంలా బావుంది - చుడీదార్ వేసుకున్నా , చీర కట్టుకున్నా ఒద్దికగా వుంది - సినిమాలో పాత్రకి తగ్గట్టు. 

హీరో బాబు - నాన్న - పోసాని - అరిచినా చిరాకెయ్యలేదు - అమ్మాయిని చూడగానే కోడల్ని చేసుకోవాలనే మంచి మామయ్యగా - బాబుని సపోర్ట్ చేసే బాబుగా - బావున్నాడు. 

ఒకప్పటి బాపు-బొమ్మ - ఇందులో బాబు-అమ్మ - ఈశ్వరీ రావు - కనిపించేది అంత ఎక్కువసేపు కాకపోయినా గుర్తుండిపోయే అమ్మ. 

కీర్తి నాన్న మరాఠీ నుంచొచ్చిన సచిన్ ఖేడేకర్ అట - కొంచెం కళ్ల దగ్గర అరవింద్ స్వామి గుర్తొచ్చాడు. 
శంకరాభరణం తులసి అయితే నిజంగా కీర్తికి అమ్మేమో అనేంతగా కుదిరింది పోలిక.

తులసి చూసే 'మనసు-మమత' సీరియల్ 'ఆమ్మో ఇదింకా ఉందా' అనిపించింది.
[దాదాపు నాలుగేళ్ల క్రితం  మా అత్తగారు టీవీలో రోజూ చూస్తుండగా ఇంట్లో పనిచేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు - వినకూడదనుకున్నా, వినిపించుకోకూడదనుకున్నా, వినీ-వినకుండా వినేసిన - హాంటింగ్ మెమొరీ ఈ సీరియల్ నాకు.] 
కామెడీ / హాస్యం కోసం వున్న సీనులు కొత్త ఐడియాలతో నిజంగా నవ్వు తెప్పించేలా వున్నాయి - పక్కవాళ్లు నవ్వుతున్నారని మొహమాటపడి మరీ నవ్వేలా కాకుండా.
ముఖ్యంగా హీరో బాబుని అన్యాయంగా జైల్లో పెట్టారని తెలిసి విడిపించడానికి -  స్నేహితులు - ఇరుగు పొరుగు వారు - చిన్నపిల్లలతో సహా - వచ్చి పోలీస్ స్టేషన్లో బోల్డన్ని కేసులు పెట్టే సీను యునీక్ గా వుంది.

అందులో ఒక చిన్న బాబు పెన్సిల్ పోయిందని కేసు పెట్టడానికి వచ్చి పెన్సిల్ ఎలా పోయిందంటే - ఒక అరగంట షార్పెనర్ లో పెట్టి తిప్పితే పోయిందని చెప్పినది - బుజ్జిజింకకి బాగా నచ్చేసింది. సబ్-టైటిల్స్ చదువుకుని సినిమాని బాగా ఎంజాయ్ చేశాడు. 

నవీన్ చంద్ర సబిన్స్పెక్టర్ గా - గొంతు కొంచెం hollow గా అనిపించినా అంతగా బోర్ కొట్టలేదు - ఈ అబ్బాయి కూడా బాగానే చేశాడు అనుకున్నాము. 

అన్నిటికన్నా నచ్చిన విషయం -  కాబోయే మామగారు ఏమనుకోరు అని తెలిసి, ఆయనే చెప్పిన తర్వాత హీరో బాబుని తన కాలర్ పెట్టుకునేలా చేసి (అరెస్ట్ చేయడానికి కారణం కావాలి కాబట్టి ) - అరెస్ట్ చేసినా - ఆ పోలీస్ స్టేషన్ సీను కూడా అక్కర్లేని డ్రామాలు,  రక్తాలు వచ్చేలా కొట్టుకోవడాలు (మా బుజ్జిజింక అన్నట్లు) లేకుండా చాలా నీట్ గా సివిలైజ్డ్ గా వుంది.
నాకెంతో ఇష్టమయిన వంశీ సినిమా - ఏప్రిల్ ఒకటి విడుదల-గోపి - కృష్ణభగవాన్ కి ఇంకొంచెం పెద్ద రోలు (రాతి రోలు కాదు - సినిమా పాత్ర రోలు) ఇచ్చుంటే బావుండేదనిపించింది. 
పాటల్లో "నెక్స్ట్ ఏంటి" బావుంది. మిగిలిన పాటలు అంతగా గుర్తు లేవు - ఇంకోసారి విని చూడాలి. 
"అరెరే ఎక్కడ" పాటలో హీరో గొంతుకి, హీరోయిన్ గొంతుకి అంత తేడా లేదు. 

సినిమాలో మాటలు ఎక్కువ డ్రామా లేకుండా మామూలు భాషలో వినడానికి హాయిగా వున్నాయి.
ఒకచోట బాబు కీర్తితో  జీవితమంతా గడపాలని వుంది అని చెప్తూ "మన పెళ్లయాక కూరలో ఉప్పు తక్కువయిందని నిన్ను తిట్టాలి" - ఇలాంటిదేదో అంటాడు - అది వినగానే - సహజనక్షత్రం చెప్పిన అతి సహజమైన డైలాగిది అని మురిసిపోయాం మేమిద్దరం.
ఇంతకు ముందు సినిమాలలో సరిగ్గా ఇదిగో - ఇలాంటి సందర్భాల్లో - హీరో - "నీ కంట్లోంచి నీరు రానీయను - నీ కాలు కందనీయను" అని చెప్పే అతిశయోక్తులు గుర్తుకొచ్చి - పోల్చి నవ్వుకున్నాం.
చివరిలో లోకల్ ఫీలింగ్ తో గెలిచినవాళ్లం నేను-ట్రంపూ అని బాబు అనడం సినిమాకి contemporaneity-advantage పెంచింది.
ఈ సినిమా sensible team-work కి మంచి ఉదాహరణ

"నేను లోకల్"  అన్న నాని  హంబుల్
కాని అలా అన్న నాని కీర్తి మాత్రం గ్లోబల్ 



ఉపసంహారం - మా నాన్న 'నేను వోకల్ (వీడియో కాల్లో)'

సినిమా చూసొచ్చి - ఆ కబుర్లు చెప్పుకుని కొంచెం లేటుగా పడుకుని - ఆదివారమే కదా అని - మరి కొంచెం లేటుగా లేస్తూ ఉంటే - నా ఫోన్ మోగింది - Out of Area అని చూపిస్తూ. 
ఎవరయుంటారబ్బా అని తీసి - హలో - అనగానే, అవతల నుంచి నాన్న "గొంతేంటి అలా వుంది - ఒంట్లో బాలేదా?" అంటూ. 

"లేదు నాన్నా - ఇప్పుడే లేస్తున్నాను"

"ఫోన్ సరిగ్గా చూశావా - నేను వాట్సాప్ లోంచి కాల్ చేస్తున్నాను - ఓసారి ట్రై చేద్దామని"

"అవున్నాన్నా చూశాను"

"సరే - అదేదో ఫేస్ టైం వుంది కదా - ఓసారి చెయ్యి అది"

"అబ్బా వద్దు నాన్నా - రాత్రి 'నేను లోకల్' సినిమాకెళ్లి వచ్చాము - ఇప్పుడే లేస్తున్నాను - ఇలా చూస్తే భయపడతారు"

"పర్లేదులే చెయ్యి ఒకసారి - అవునూ - నేను లోకల్ బావుందంటున్నారు ఇక్కడ కూడా - అలాగే శతమానం భవతి కూడా - అద్సరే కానీ ముందు ఫేస్ టైం లోకి రా"

ఇంకొదలరు - అనుకున్నది అయ్యేదాకా ... 

సరే - ఫేస్ టైం లాంటిదే కదా అని - వాట్సాప్ వీడియో కాల్ చేశాను. 

అట్నుంచి నాన్న ఫోన్ తీశారు. 

ఫోన్ స్క్రీన్ మీద ఇన్సెట్ లో నా మొహం బానే కనిపిస్తోంది - కానీ అటుపక్కనుంచి నాన్న కనిపించట్లేదు - స్క్రీన్ అంతా నల్లగా - అక్కడక్కడా ఏదో మిణుకు మిణుకు మంటూ చుక్కలు చుక్కలుగా కనిపిస్తోంది. 

ఒక్క నిముషం ఏమీ అర్థం కాలేదు. 

"ఏంటి నాన్నా! ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది - మీరసలు కనిపించట్లేదు నాకు "

అవతలి నుంచి "హహ్హహ్హహ్హ"

ఇవతలి నుంచి నేను అయోమయంగా - ఏంటా అనాలోచిస్తూ  -  "......"
"నేను చీకట్లో ఉంటే ఎలా కనిపిస్తాను?' అంటూ అటు నుంచి నవ్వులు
'మీరు చీకట్లో వుండి వీడియో కాలేంటి నాన్నా!"
"అసలెలా వస్తుందో చూద్దామని - హహ్హహ్హహ్హ - నేను వోకల్ గా ఓకే కదా"
"మీరు - బాబోయ్ - వుండాల్సిన వారు నాన్నా!" 

"హహ్హహ్హహ్హ"



3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

గళ్లలెక్కలు - కళ్లచిక్కులు

నేనూ - బుజ్జిజింక సరదాకి చేసే పనుల్లో లెక్కలొకటి .

లెక్కలంటే -
ఆకాశంలో చుక్కలని ఎంచేవో...
ఎంచలేక చుక్కలని చూపించేవో...
చుక్కలు చూసిన కళ్లకి చికాకు పెంచేవో కాదు...

లెక్కలంటే -
కొన్ని టక్కున ఎంచేవి
కొన్ని చప్పున చిక్కనివి
ఎంతో మక్కువ పెంచేవి
ఇంకెంతో చక్కనివి

అలాంటి ఒకానొక తమాషా-లెక్క ఇదిగో -



తెలుగులో ఈ లెక్క ఏంటంటే:

జూలియెట్ అనే అమ్మాయి "చదరాలని పట్టండి" అనే ఒక వేడుక-ఆటలో పోటీ చేస్తోంది. ఆ ఆటలో ఒక 4X4 చదరపు పటాన్ని చూసి - అందులో దాగున్న చదరాలని కనుక్కుంటే డబ్బులు గెలుచుకోవచ్చు.  ఆ అమ్మాయి కనుక్కున్న ప్రతీ చదరానికీ డబ్బులు బహుమతిగా ఇస్తారు. ఆ డబ్బుల లెక్క ఎలాంటిదంటే - ఒక 1X1 చదరానికి ఒక డాలరు, 2X2 చదరానికి నాలుగు డాలర్లు, 3X3 చదరానికి తొమ్మిది డాలర్లు, 4X4 చదరానికి పదహారు డాలర్లు - ఇస్తారన్నమాట. ఒకవేళ జూలియెట్ కనక అన్ని చదరాలని కనిపెట్టి - పట్టగలిగి - పటం కట్టగలిగితే ఆ అమ్మాయి ఎంత డబ్బు గెలుచుకుంటుంది?

(అసలయినా - రోమియోని తలచుకుంటూ ఏ బాల్కనీలోనో నించుని -
What's in a name? That which we call a rose
By any other word would smell as sweet.
- అనుకుంటూ వుండక జూలియెట్ ఈ గళ్ల లెక్కలు చేయడమేంటో కదా ?!)

ఆ జూలియెట్ సంగతేమో కానీ ఆ గళ్ల గళ్ల -లెక్క చూడగానే నాకూ, బుజ్జిజింకకీ - చెరి రెండు కళ్లూ మెరిశాయి.

చేతికొక  పేపరు, పెన్సిలూ పట్టుకుని -  చెరొక గళ్ల-చదరం గీసేసుకున్నాము.

అటు తిప్పాము - ఇటు తిప్పాము.

ముందు ఇందులో ఒక పే....ద్ద చదరం వుంది అనేసుకున్నాము - మేఫ్లవర్ ఎక్కని కొలంబస్సుల్లా - ఎదురుగా మరి అంత పెద్దదే కనిపిస్తోంది కదా!



తర్వాత - ఇందులో ఇంకా పదహారు బుల్లి బుల్లి చదరాలు వున్నాయి అని - నాలుగు నాలుగులు పదహారు - అంటూ ఎక్కాలేసి మరీ లెక్కేసేశాం.



తర్వాత - ఇంకొంచెమే వున్న 3X3 చదరాలు గబగబా రొక్కించి మరీ లెక్క చెప్పేశాం - నాలుగే నాలుగని .



చివరాఖరుగా - కుడి చేతి చూపుడు వేలుని, నడిమి వేలుని - మెలికలు మెలికలుగా - గళ్ల మీదుగా నడిపిస్తూ - 2X2 చదరాలు - ఆరని నేనంటే -

రెండార్ల వయసింకా లేకపోయినా - నీకన్నా ఆరున్నొక్కాకులు ఎక్కువే చదివానని - నాకు చెప్పీ చెప్పకనే చెబుతూ -

"అమ్మా ! నిన్ను కాదనాలని కాదు - కానీ అనాల్సొస్తోంది - క్షమించూ "

- అని మహా నేర్పుగా నన్ను నొచ్చనీయక - అలాగని ఇచ్చకపు మాటలాడక -

2X2 చదరాలు తొమ్మిదున్నాయని - నెమ్మదిగా లెక్కపెట్టి చూపించాడు నా బుజ్జిజింక.



ఇంకేముంది - లెక్క తేలిపోయింది.





జూలియెట్ కి ఇచ్చిన లెక్కలో వున్న 4X4 చదరంలో మొత్తం (16+9+4+1) = 30 చదరాలు వున్నాయి.

ఎలా లెక్క పెట్టాలో తెలిశాక ఇంకాగుతామేంటి?

ఇంకో కాయితం మీద 5X5, 6X6 - ఇలా వరుసగా గళ్లు పెంచుకుంటూ గీసుకుని - వాటిలో చదరాల లెక్క కూడా చూశాము.

ఏతావాతా తేలిందేంటయ్యా అంటే - ఇదిగో - ఈ కింద ఫొటోలో వున్నది....



[బుజ్జిజింకకి లెక్కలు కట్టడం ఇంకొంచెం-ఎక్కువ తెలిశాక - మళ్లీ ఈ లెక్కని Sum of the Squares of the first n natural numbers ఉపయోగించి ఇంకోసారి లెక్కగట్టి మేము తప్పో-రైటో - మా లెక్క మేం తేల్చుకుందాం అనేసుకున్నాం. ఇప్పటికి వాడి బుజ్జి-బుర్రకిది చాలు.]

"మరి జూలియెట్ కి వచ్చే డబ్బులో?" - అని నేనడగ్గానే - బుజ్జిజింక వేసిన లెక్క ఇది ...


16 (1X1)'s  = 16X1= $16
 9  (2X2)'s  =  9X4 = $36
 4  (3X3)'s  =  4X9 = $36
 1  (4X4)'s  =  1X16=$16

ఒక 1X1 చదరానికి ఒక డాలరు, 2X2 చదరానికి నాలుగు డాలర్లు, 3X3 చదరానికి తొమ్మిది డాలర్లు, 4X4 చదరానికి పదహారు డాలర్లు  - చొప్పున - మొత్తం (16+36+36+16) = అక్షరాలా అష్టోత్తర-శతానికి-ఒక నాలుగు-తక్కువగా-డాలర్లు అనగా $104/-.

లెక్కంతా అయిపోగానే -
ఒకళ్ల కళ్లు ఒకళ్లు చూసుకున్న
మా కళ్లకి
గళ్ల  లెక్కల్లో చిక్కుకుని
ముళ్లు పడ్డ మా కళ్లు
గళ్లు-గళ్లుగా
బుల్లి-బుల్లి వడగళ్లుగా
అయిపోయాయంటే
వేళాకోళం కానే కాదు మరి!
అంతే కాదు -

అమ్మనోట అనుకోకుండా వచ్చిన -
గళ్లలెక్కలు - కళ్లచిక్కులు 
చెంగుచెంగుమనే బుజ్జిజింక నోట
ఖంగుఖంగుమనే టంగు-ట్విస్టరయ్యింది 



27, జనవరి 2017, శుక్రవారం

ఎంపిక - ట్రంపిక!

అప్పుడెప్పుడో మొట్టమొదటిసారిగా అంటూ "ట్రంపె"ట్ ఒకటే తక్కువగా దండోరా వేసేసిన దగ్గర్నుంచీ ఒకటే ఎన్నికల కబుర్లు ఇంట్లో.

కొన్ని సరదాలద్దినవి
కొన్ని బెంగ పూసినవి
కొన్ని ఆశలు కల్పించేవి
కొన్ని నిరాశే ఖాయమనేవి
కొన్ని వద్దురా బాబూ అనిపించినవి
కొన్ని తప్పించుకోలేవులే అని బెదిరించినవి
కొన్ని అమ్మ-నాన్నల ఆలోచనలవి
కొన్ని బుజ్జిజింకల దిగుళ్లవి


చిన్నప్పుడు క్రికెట్ చూసే రోజుల్లో ఇండియా ఆడే One day-matches చూసేదాన్ని కాదు - నేను చూస్తే గెలవరేమో అనే sentiment కన్నా - చూడకుండా వుంటే గెలిచినా, గెలవకపోయినా ఆ ప్రభావం నామీద ఎక్కువ వుండదు - అని.

అదే రూలు ప్రకారం 2016 మార్చ్ నెలలో ప్రైమరీస్ లో వోటు వేసి వచ్చిన తర్వాత చివరి ఫలితం వచ్చే దాకా టీవీ చూడలేదు.

అసలు ఎన్నికల్లో వోటు ఎవరికి వేశామో ఎవరికీ ఎందుకు చెప్పద్దంటారో నాకైతే ఎప్పటికీ అర్థం కాదు - పెద్ద పెద్ద పేరున్నవాళ్లందరూ మహా-బహిరంగంగా తామెవరిని బలపరుస్తున్నామో వార్తాపత్రికలలో వాళ్లకున్న పేరుకి తగ్గట్టు ఎంతో పెద్ద పెద్ద అక్షరాలలో ప్రకటనలు ఇచ్చి మరీ చెప్తుండగా ఇంకా ఈ దాపరికాలేంటో?!

నేనైతే  ప్రైమరీస్ లో బెర్నీ శాండర్స్ కి వోటేశాను - అందరికన్నా ఆయన చెప్పిన మాటల్లో నిజాయితీ, నిబద్ధత వినిపించి.

ఫలితం తెలిసిందే - డెమొక్రాట్స్ లో హిల్లరీ క్లింటన్ గెలిచింది - రిపబ్లికన్స్ లో డొనాల్డ్ ట్రంప్.

ఇంతకు ముందు ఒబామా పోటీ చేసిన రెండు సార్లు - టీవీలో ప్రసారమయిన ప్రతీ ప్రెసిడెన్షియల్ డిబేటు, టౌన్-హాలు - ఎంతో ఉత్సాహంగా బుజ్జిజింకల్లో పెద్దవాడైన అన్నతో సహా కూర్చుని చూసిన - నాకు, బదరికి - ఈసారి ఎందుకో అసలు టీవీ పెట్టాలనే అనిపించలేదు.

ఆఖరికి అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్ధులని అనుకరిస్తూ సరదా చేసే SaturdayNight Live (SNL) కార్యక్రమం కూడా చూడలేదు - ఒక్కసారి కూడా.

అక్టోబర్ 9వ తారీఖున సెయింట్ లూయిస్ - వాషింగ్టన్ యూనివర్సిటీ లో ట్రంప్-క్లింటన్ డిబేట్ ఉందని - అదికూడా టౌన్-హాల్ పద్ధతిలో అంటే ఓటర్లు పంపించే / వేసే ప్రశ్నలకి అభ్యర్థులు అక్కడికక్కడ చెప్పే సమాధానాల రూపంలో ఉంటుందని తెలిసి - గబగబా భోజనాలు ముగించి టీవీ ముందు చేరాము.

ఆరవ తరగతిలో వున్న బుజ్జిజింక - మా దగ్గరకి రాకుండా వంటింట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు.

డిబేట్ మొదలు అయింది.

ఏండర్సన్ కూపర్ పరిచయం చేసిన పాట్రిస్ అనే ఒకావిడ అక్కడవున్న ప్రేక్షకుల్లోంచి అడిగిన మొదటి ప్రశ్న - "దీనికి  ముందు జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ కి - టీవీ పేరెంటల్ గైడ్లైన్స్ ప్రకారం - MA (అంటే మెచ్యూర్ ఆడియెన్సెస్) రేటింగ్ ఇవ్వదగ్గదిగా వుంది. మీకు తెలుసు కదా ఉపాధ్యాయులు - ఈ డిబేట్లు చూడడం ఒక హోంవర్క్ ఎసైన్మెంట్ గా పిల్లలకు ఇస్తారని. మీ ప్రవర్తన విద్యార్థులకి ఒక సముచితమైన, అనుకూలమయిన నమూనా గా ఉందని మీరు భావిస్తున్నారా?" - అని.

దానికి మొదటగా టాస్ గెలిచిన క్లింటన్, తర్వాత ట్రంప్ - ఒకరి తర్వాత ఒకరు - అసలు ప్రశ్నకు పొంతన లేకుండా ఇచ్చిన సమాధానాలు వినగానే - మొదటి ఏడెనిమిది నిముషాల్లోనే టీవీ ఆపేశాము.

(ఈ పోస్ట్ చివర్లో ఆ డిబేట్ పూర్తి పాఠం URL వుంది - భవిషత్తులో సరదాగా వెనక్కి వచ్చి చదువుకోవడానికి నాకు నేను దాచుకున్న రిఫరెన్స్).

ఇంతలో కాలిఫోర్నియా లో  వున్న అన్న నుంచి ఫోన్ - "అమ్మా-నాన్నగారూ! మీరు డిబేట్ చూస్తున్నారా? ఒకవేళ చూస్తుంటే తమ్ముడు అక్కడ లేకుండా జాగ్రత్త పడ్డారా?" - అంటూ.

అప్పటికే చూడడం ఆపేశామని తెలిశాక అన్న గొంతులో వచ్చిన రిలీఫ్ ఫోన్ లో స్పష్టంగా తెలిసింది - వాడి బాధంతా తమ్ముడు ఆ అనుచితమయిన-భాష వింటాడనే కాదు -  సరదా కబుర్లలో గడవాల్సిన అమ్మా-నాన్నల ఆదివారం అనవసరంగా టీవీ ముందు గడపబడుతుందని.

అప్పటినుంచి ఎన్నికల గురించి అంత పట్టించుకోవడం మానేశాము.

ఒక్కో క్షణం వోటు వేయకపోతే ఏమాయె - అని కూడా అనిపించేది.

మళ్లీ - ఏమో - మన ఒక్క వోటే తేడా రావొచ్చేమో - అనీనూ అనిపించేది.

అంతలోనే - ఏ తేడా అయినా ఏముంది, దొందూ-దొందే అయినప్పుడు - అని కూడా అనిపించేది.

రోజులు ఇలా ఎన్నికల మీదఎలాంటి కలలూ లేకుండా గడిచిపోతున్నాయి.

నవంబర్ వచ్చింది.

8వ తారీఖు ఎన్నికల తేదీ.

మళ్లీ మా ఇంట్లో కొంచెం ఎన్ని-కలకలం.

ఒకరోజు బదరి నవ్వుతూ అన్నారు - "ఫ్రెండ్ ఒకతను అంటున్నాడు - 'బదరి గారు! బ్రహ్మం గారి కాలజ్ఞానంలో అమెరికాకి ఒక పిచ్చివాడు రాజవుతాడని' - అదే నిజమైతే ట్రంపే వస్తాడేమో? ఇంతకీ - బుజ్జాయ్! బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసేనాటికి ఆయనకి అమెరికా ఉందని తెలుసా?"

బదరికి మహా నమ్మకం - నేనొక వాకింగ్-గూగ్లీ నని (గూగ్లీ తాను నాకు చేసిన అనేక బారసాలోత్సవాల్లో ప్రసాదించిన ఒకానొక నామధేయం).

"ఆయన 16th సెంచురీ - అమెరికా పుట్టింది 15th - తెలిసే ఉండాలి - లేకపోతే పాశ్చాత్యదేశం అనుండొచ్చు - అమెరికా అనే అనక్కర్లేదు కదా!" - నా సమాధానం - మనసులో ఏదో తెలియని గుబులుతో - ఇవన్నీ కాలక్షేపం కబుర్లే అని తెలిసినా.

ఇంకోరోజు  - ఇంటినుంచి ఫోన్ చేసిన అమ్మ గొంతులో ఏదో బెంగ - "ట్రంపొస్తే ఇండియన్స్ కి కష్టమట  - మీకేమీ ఇబ్బంది ఉండదు కదా?!" అంటూ.

"అబ్బే - అలాంటిదేం లేదమ్మా - మేమూ - మా రోటీనూ మామూలే!" అంటూ నేను -  అమ్మ బెంగ - నా ఉత్సాహ భంగమవకుండా జాగ్రత్త పడుతూ.

సరిగ్గా ఎన్నికలు ఇంకో రెండు రోజులనగా అన్నగాడి ఫోన్.

ఎప్పట్లాగే కుశల ప్రశ్నలు అయ్యాక - అన్న పూర్తిగా తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టాడు - బహుశా తన పక్కనున్న వారికి అర్థం కాకూడదనేమో !?

" అమ్మా! నువ్వూ, నాన్నగారు వెళ్తున్నారు కదా వోటు వెయ్యడానికి?"

"ఏమో నాన్నా! అంత ఉత్సాహంగా లేదు - ఎవరైనా ఒకటే కదా అనిపిస్తోంది"

"అవుననుకో - వున్న రెండు చెడ్డల్లో తక్కువ చెడ్డని సెలెక్ట్  చేసుకోవడం మంచిది కదా ?!"

"సరే - నాన్నా - మన చేతుల్లో లేనిది - నేనూ ఇంత ఆలోచించక్కర్లేదేమో - నేనూ నాన్నగారు వెళ్తాములే - నాన్నగారితో కూడా చెప్తాను నువ్వన్నది"

"Oh! Well ! అమ్మా - as you say it's not something we can control - I too don't want to waste time thinking about what's going to happen."

"అవును నాన్నమ్మా! జాగ్రత్త్త - మంచిగా తిను, rest well - అప్పుడు మంచిగా చదువుకో and also have fun!"

"అలాగే అమ్మా - bye!"

నవంబర్ 8 వచ్చింది - చిరజల్లు కురుస్తోంది.

ఆఫీస్ లంచ్ టైంలో బదరి, నేను సెల్విడ్జ్ మిడిల్ స్కూల్ కి వెళ్లి మా వోట్లు వేసేసి వచ్చాము - అసలు వోటు అన్నకి మాటిచ్చినట్టు క్లింటన్ కే వేసినా - మిగిలిన వోట్లన్నీ నేనైతే నాకు నచ్చిన, సుపరిచితమయిన పేర్లకి వేసేసి వచ్చాను - పార్టీతో సంబంధం లేకుండా.

బయటికి వచ్చాక  బదరి అన్నారు - "ఇది అమెరికా చరిత్రలోనే ఒక frustrating-election" అని అందరూ అనుకుంటున్నారని.

ఎలాంటిదయితే ఏంటి?! - అయిపోయింది.

మళ్లీ నా క్రికెట్-మ్యాచ్ రూలు ప్రకారం రాష్ట్రాల ప్రకారం ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తున్నా నేను టీవీ చూడట్లేదు - వినట్లేదు.

బదరి మాత్రం చూస్తున్నారు.

ఆ రోజు రాత్రి పూర్తిగా లెక్కింపు అవకుండానే తెలిసిపోయింది ట్రంపే గెలుస్తున్నాడని.

పూర్తిగా చూడకుండానే పడుకుండిపోయాము.

నవంబర్ 9 - పొద్దున్నే ఐదున్నరకి బుజ్జిజింక స్కూల్ కోసం రోజూలాగే లేచాను - వాడినీ లేపాను.

స్నానం చేసి తయారయి కిందకి వచ్చిన బుజ్జిజింకకి "నాన్నగాడు! Trump has won" అని చెప్పీ చెప్పగానే వాడు నా దగ్గరికి వచ్చి రెండు చేతులతో నన్ను పట్టుకుని "అమ్మా! మనం ఇండియా వెళ్లిపోదామా?" అనడిగాడు.

"అదేం నాన్నా? ఎందుకలా ?"

"అన్న సెడ్ ట్రంప్ వుడ్ కిల్ అస్"

నాకు నవ్వొచ్చింది - వాడెందుకలా అన్నాడో తలుచుకుని.

ఎన్నికల గురించి ఎప్పుడు మాట్లాడినా అన్న తెలుగులోనే మాట్లాడేవాడు - తమ్ముడికి అర్థం కాకూడదని.

ఒకసారలాంటి సందర్భంలో "అమ్మా! ట్రంప్ వస్తే చచ్చామే" అని అన్న అనగా విన్న బుజ్జిజింక దాన్ని literal గా తీసుకుని ఇప్పుడిలా అంటున్నాడని అర్థం అయ్యింది నాకు.

వెంటనే "అబ్బే - లేదు నాన్నా ! అన్న వూరికే అలా చెప్పాడు - మనమో పని చేద్దాం - మనం ట్రంప్ గురించి మంచిగా ఆలోచించామనుకో - ఆ positive vibrations వల్ల అతను మంచిగా ఆలోచిస్తాడేమో - అప్పుడు అంత చెడ్డగా ప్రవర్తించడేమో కదా - ప్రయత్నిద్దామా - ఇది నాకు చాలా సార్లు వర్క్ అయింది ?" అన్నాను - బుజ్జిజింక ట్రంప్-బెంగ పోగొట్టడానికి.

బుజ్జిజింక నన్నింకా అలాగే పట్టుకుని "ఓ వెల్ - హి కెన్ బి ఇంపీచ్డ్ - అమ్మా!" అనేసి - ఈలోగా స్కూల్ బస్ వచ్చే టైం అవడంతో కొత్తగా నేర్చుకుంటున్న తెలుగోత్సాహంతో "అమ్మా ! వెళ్లొస్తాను" అని నాకు చెప్పేసి బస్-స్టాప్ కి   వెళ్లి పోయాడు.

ముందు ముందు ఎలా వుండబోతున్నా - ఇప్పటికి మాత్రం ... 
అనుకున్నామనుకున్నా - అనుకోలేదనుకున్నా 
కావాలనుకున్నా - కాకపోతే బాగుండునన్నా 
కలగనలేదనుకున్నా - కలవరమనుకున్నా 
ఇలలో జరగకూడదనుకున్నా - ఇలా జరగకుండాల్సిందనుకున్నా 
ఇతనొచ్చాడేంటనుకున్నా - ఇంకెవరూ లేరా అనుకున్నా
ఇలా రాసి పెట్టి వుందనుకున్నా - రాసిన రాత మారాలనుకున్నా 
ఏమనుకున్నా - ఎంతనుకున్నా 
జరిగిపోయింది ఎంపిక 
ఎంపికైనవాడు ట్రంపిక


[క్లింటన్-ట్రంప్ STL డిబేట్ అక్టోబర్ 9, 2016: http://singjupost.com/full-transcript-donald-trump-vs-hillary-clinton-second-presidential-debate-october-9-2016/]





19, జనవరి 2017, గురువారం

త్వామనురజామి - 9 - అసలేం జరిగిందంటే...(మా నాన్న చెప్పిన కబుర్లు)

కిందటి 19 చెప్పిన కబుర్లు

నా రాని MCA సీటు గురించి మర్చిపోవడానికి  ప్రయత్నిస్తూ - ఆంధ్రా యూనివర్సిటీ MCA కి చదువుకోవడం మొదలు పెట్టాను - దాంతో పాటే నాన్న తెచ్చిన BSRB application కూడా పూర్తిచేసి ఆ పుస్తకాలూ చదవడం మొదలుపెట్టాను. 

నన్నోదార్చడానికన్నట్టు - పాపం - మా అమ్మ "పోన్లే లల్లీ - తిరుపతిలో రావకపోవడమే మంచిదయింది - ఎంచక్కా ఏ బ్యాంక్లోనో ఉద్యోగం అయితే ఇస్త్రీ చీర నలక్కుండా ఇంటికి రావొచ్చు - నీలాంటి వాళ్లకి అదే సుఖం" అంటూ BSRB టెస్ట్ మీద నాకు ఆసక్తి కలిగించడానికి కబుర్లు చెప్పేది. నాకేమో అస్సలు BSRB అంటేనే ఇష్టం లేదు. 

ఒకరోజు మధ్యాహ్నం ఇలాగే ఏవో BSRB మాటలు వస్తే నాన్న గుర్తు చేశారు - వచ్చే వారమే రెండు టెస్టులు - AU - MCA ఎంట్రెన్స్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో - BSRB ఇంకో చోట -  విజయవాడ వెళ్లి రాయాలి - నువ్వూ నేను Yezdi  మీద వెళ్లివచ్చేద్దాం - అని. 

నాన్న అలా అనగానే  అడిగాను -"మరి BSRB రాయాలంటే నా అప్లికేషన్ పెట్టే ముందే చెప్పాను - నాకొక బొమ్మ కొనియ్యాలని - కొంటారా?" - అని. 

పక్కనే నేలమీద తరగడ వేసుకుని టీవీ చూస్తున్న కుట్టి చటుక్కున పైకి లేచి - "ఇంకెన్ని బొమ్మలే బాబూ?
నువ్వూ, అపర్ణా కలిసి ప్రతి పుట్టినరోజుకి, న్యూ ఇయర్స్ డేకి , ఆగస్టు 8న మీ ఫ్రెండ్షిప్ డేకి ఒకళ్లకొకళ్లు నాకిది కావాలంటే నాకిది కావాలి అని ముందే చెప్పేసుకుని ఇచ్చిపుచ్చుకున్న బొమ్మలు, రవి మెడ్రాస్ వెళ్లినప్పుడు తెచ్చిచ్చిన ఆ ఎర్ర మాక్సీ బొమ్మ,  అవి కాక ప్రశాంతి ఇచ్చిన ఆ స్విట్జర్లాండ్ బొమ్మ - ఇన్ని బొమ్మలుండగా ఇంకో బొమ్మా? నువ్వేమో కొనడం -  నాన్నేమో ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలున్నవాళ్లు వస్తున్నారని తెలియగానే 'లల్లి బొమ్మలు బీరువాలో దాచండి' అని నా చేత నీ బొమ్మలన్నీ ఆ బెడ్ రూమ్ బీరువాలో పెట్టించడం - మళ్లీ ఇప్పుడింకో బొమ్మ అంటే - కొనే ఆయనా - కొనిపించుకునే నువ్వూ బానే వుంటారు - మధ్యలో సర్దలేక నా చేతులు పడిపోతున్నాయి" అని ఆపకుండా ఓ పది నిముషాలు తిట్టింది. 

"నా బొమ్మల సంగతి నీకెందుకు?" అని దాన్ని విసుక్కుని "చెప్పండి నాన్నా - టెస్ట్ అయిపోగానే కొంటారా?" అని నాన్న నడిగాను. 

మా ఇద్దరి గొడవా చూసి అసలే భుక్తాయాసంతో ఉన్నారేమో "కొంటాలే - ముందా టెస్ట్ సంగతి చూడు" అని పక్కకి తిరిగి పడుకున్నారు. 

మొత్తానికి టెస్ట్ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు గుంటూరు బస్సు-స్టాండ్ దగ్గర ఆగి అక్కడ ఒక తోపుడు బండిమీద నేనడిగిన రెండు బొమ్మలేవో కొనిపెట్టారు నాన్న. 

రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాను - ఇంతలో ఒకరోజు అపర్ణ వచ్చి చెప్పింది తనకి మైసూరు SJCE లో MCA సీట్ వచ్చిందని - తనకి వచ్చిందని ఎంత సంతోషంగా అనిపించిందో ఒకచోట ఇద్దరం చదివే అవకాశం ఇంక లేదు అని తలుచుకుని అంతకు రెట్టింపు బాధేసింది. 

వేసవి రోజులు - అపర్ణ కూడా వెళ్ళిపోయింది. ఏమీ తోచట్లేదు - తరవాత ఏంటి అని తలుచుకుంటే మొదటిసారి బెంగగా అనిపించింది.

గుంటూరు NCC కాంటీన్ లో పనిచేసే - రామారావుగారు (ఈయన శివకోడులో చంద్రావతి గారి అల్లుడు - అమ్మ ఫ్రెండ్ ఆండాళ్ ఆంటీ భర్త) నెలకొకసారైనా ఇంటికి వచ్చేవారు - మమ్మల్ని పలకరించడానికి. 

ఆ రోజూ అలాగే వచ్చారు - ఎప్పట్లాగే సరదాగా కబుర్లు చెప్తూ -"ఏంటీ - పెద్ద పాప కొంచెం డల్లుగా వుంది అంత  హుషారు లేదు" అనడగ్గానే మళ్లీ మొదట్నుంచీ నా తిరుపతి-శోక గాథ రీప్లే అయింది. 

ఆయన అదేమీ అంత పట్టించుకోదగ్గ విషయం కాదన్నట్టు  "కామేశ్వరరావు గారూ - మొన్న ఎవరో నన్నడిగారండీ ఈ ప్రశ్న - మీకు సమాధానం తెలుసేమో చెప్పండి" అంటూ " వాట్ ఈజ్ హు - హు ఈజ్ వాట్ - అదీ ప్రశ్న" అన్నారు.

అది వినగానే - నేను వెంటనే " అంకుల్ - వాట్ ఈజ్ హు కి ఆన్సర్ World Health Organization (WHO),
హు ఈజ్ వాట్ అంటే James Watt అంటే స్టీమ్ ఇంజిన్ ఇన్వెంట్ చేసినాయన" అనగానే రామారావు అంకుల్ చప్పట్లు కొట్టి " అదీ - నాకు తెలుసు - నువ్వు చెప్పేస్తావని - ఇన్ని విషయాలు తెలిసుండి ఇలా బెంగ పెట్టుకుంటారా ఎవరైనా? మా సంతోష్ ఆల్ఫ్రెడ్ గారికి నీగురుంచి చెప్పాను - నీ దగ్గరికి వాళ్ల పాపల్ని లెక్కలు నేర్చుకోవడానికి పంపిస్తామన్నారు - నీకూ కొంచెం టైం పాస్ అవుతుంది - సరేనా?! " అన్నారు. 

సరే -నాకసలే కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్ చేసుకోవడం ఇష్టం - ఇదేదో బావుంది అనుకుని రోజూ ఓ గంట సంగీత, అనహితలకి మాథ్స్ చెప్తూ - వాళ్లతో నా దగ్గరున్న Enid Blyton పుస్తకాలు షేర్ చేసుకుంటూ - పప్పి, కుట్టీలతో సినిమాలు చూసుకుంటూ - రోజులు దొర్లేలా చూసుకుంటున్నాను. 

ఇలా ఉండగా ఒకరోజు పొద్దున్నే కుట్టి బ్రష్ చేసుకుంటూ ఉంటే మధ్యాంటీ "ఏమ్మాయ్ కుట్టీ! నీ రిజల్ట్స్ వచ్చాయా?" అనడిగారు. 

 అది నోట్లోంచి బ్రష్ తీయకుండానే "ఏమో" అన్నట్టు చెయ్యూపింది. 

వెంటనే ఆంటీ "అదేంటమ్మాయ్ - నీ రిజల్ట్స్ సంగతి నీకే తెలీపోతే ఎట్టా?" అనింకేదో అనబోతూ ఉంటే - కుట్టి బ్రష్ నోట్లోంచి తీసి "నా సంగతి మా అమ్మ-నాన్న చూసుకుంటారు గానీ మీరు మీ సుపుత్రుడి సంగతి చూసుకోండి ముందు" అనేసింది. 

మా వంటింటి తలుపు దగ్గర నుంచుని మా అమ్మ - నోటి మీద చెయ్యి పెట్టుకుని కుట్టికి "ఊరుకో ఊరుకో " అని సైగ చేస్తోంది  - ఆంటీ ఏమనుకుంటారో అని ఆవిడ బెంగ. 

కుట్టికి అవేం లెక్క లేవు - అనేసి లోపలికి వచ్చేసింది. 

ఆంటీ కూడా కుట్టి సంగతి తెల్సు కదా - "నువ్వూ, మా లక్ష్మణూ - మీ ఇద్దరి లా పాయింట్లకి హై కోర్టుకెళ్లినా అప్పీలుండదు" అని నవ్వేసుకుని వాళ్ళింట్లోకి వెళ్లిపోయారు. 

ఒక గంట తర్వాత ఆంటీ వాళ్ళింట్లోంచి - మధ్యాంటీ -లాయరంకుల్  మధ్య సంభాషణ:

"కోర్ట్ కి టైం అవుతోంది - తొందరగా టిఫిన్ పెట్టు"
"ఒక్క ఐదు నిముషాలు ఆగరాదూ - పూజ్జేస్తున్నాను"
"ఎంత సేపా పూజ - అంతసేపు దేవుణ్ణి మనింట్లోనే కట్టేస్తే ఎలా - కొంచెం పక్కింటికి కూడా వెళ్లనీయ్"
"పక్కిల్లు అంటే గుర్తొచ్చింది - ఆ లల్లి సీట్ సంగతేంటో కనుక్కోరాదూ - కామేశ్వర్రావుగారినడిగి ? బా చదివే పిల్ల - ఎందుకా సీట్ రాలేదో ఏంటో?"
"ఇప్పుడే పక్కింటమ్మాయ్ చెప్పిందా లేదా నీకు - నీ కొడుకు సంగతి చూసుకోమని? తొందరగా కానియ్ - నే వెళ్లాలి"

వినొద్దనుకున్నా వినిపించే ఆ మాటలు విని నవ్వుకున్నాము మేమంతా.  

తర్వాత నాన్న లాయరంకుల్ దగ్గరికి వెళ్లి మాట్లాడారు అని తెల్సింది కానీ నేనంత పట్టించుకోలేదు - ఆల్రెడీ అన్ని సీట్లూ ఫిల్ అయిపోయి ఉంటాయి - పెద్ద ఉపయోగం వుండదు అని.

జులై నెలాఖరుకి తిరుపతి పద్మావతి యూనివర్సిటీ నుంచి టెలిగ్రామ్ వచ్చింది - వెంటనే వచ్చి MCA లో చేరమని. 

ఆ టెలిగ్రామ్ చూడగానే మా ఇంట్లో వాళ్తో సమానంగా మధ్యాంటీ సంతోషించారు - అదేదో వాళ్ళింట్లో పిల్లకే సీటొచ్చినట్లు. 

వెంటనే ఒక వెండి పెన్ను కొని నాకు గిఫ్టుగా ఇచ్చారు. 



మొత్తానికి నాకు రాదు అనుకున్న సీట్ మళ్లీ నన్నేవెతుక్కుంటూ వచ్చింది - నా పరీక్షాకాలం పూర్తయింది. 

------------------------------------------------------------------------------------------------------------
అసలేం జరిగిందంటే... (మా నాన్న చెప్పిన కబుర్లు):

 అవీ - నాకు గుర్తుండి నేను రాద్దామనుకున్న కబుర్లు. 

కానీ కిందటి నెల పోస్ట్ కింద విన్నకోట నరసింహారావు గారు పెట్టిన ఒక వ్యాఖ్య (తర్వాత ఎందుకో ఆ వ్యాఖ్య తీసివేయబడింది) చదివి మా నాన్న నాకు ఫోన్ చేశారు. 

"ట్రింగ్.... ట్రింగ్"

 టైం చూస్తే పొద్దున్న ఏడు. 

ఫోన్ కాలర్ ఐడీ లో Out of Area అని కనిపిస్తోంది. 

వారం మధ్యలో అలాంటి కాల్ నాన్న తప్ప ఎవరూ చేయరు. 

ఫోన్ తీశాను - అనుకున్నట్టుగానే నాన్న - "లల్లీ - ఒకసారి ఫోన్ చెయ్" అని పెట్టేశారు.  

వెంటనే చేశాను - ఆయన ఫోన్ కి. 

"ఆయనెవరో కామెంట్లో అడిగినట్టు మనం ముందు పద్మావతి యూనివర్సిటీకే వెళ్ళాం - నీ రాంక్ కార్డు తీసుకుని - ఆ తర్వాత SVU లో మా అమలాపురం SKBR ప్రిన్సిపాల్ గా చేసిన KVV రాజు గారు వున్నారని - ఆయన్ని కలవటానికి వెళ్ళాము"

"అవునా నాన్నా ! అదేంటో నాకు గుర్తు రాలేదు మరి"

"నువ్వప్పుడు సీట్ రాలేదని బాధ పడుతున్నావు కదా - అంతగా పట్టించుకుని వుండవు - నేను చెప్తా రాసుకో  ఏం జరిగిందో"

"భలే వారు - మీరు ఉండాల్సిన వారు నాన్నా!" 

ఫోన్లో నవ్వులు. 

"అదే మీ అమ్మ అంటుంటుంది కదా - నా బారసాల నాటి సంగతులు కూడా నాగ్గుర్తుంటాయని"

"సరే చెప్పండి - మీ పుణ్యమా అని నా వచ్చేనెల పోస్ట్ కి గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడక్కర్లేదు నేను"

"అసలేం జరిగిందంటే ..." అని మొదలు పెట్టి తర్వాతి ఇరవై ముప్పై నిముషాల్లో మా నాన్న గుర్తు చేసిన  మర్చిపోయిన కబుర్లు ఇవి :

"నీకసలు వచ్చింది  వెంకటేశ్వర-పద్మావతి కామన్ ఎంట్రెన్స్ లో 14 వ రాంకు, పద్మావతి లో 6వ రాంకు. మనిద్దరం నీ రాంక్ కార్డు పట్టుకుని తిన్నగా డైరెక్ట్ గా పద్మావతి యూనివర్సిటీకే వెళ్లాం. 

వెళ్తే అక్కడ ఆఫీసులో సుజాతగారని ఒకావిడ నీ రాంకు కార్డు చూసి  - "మీ అమ్మాయికి సీట్ ఇవ్వలేమండి" అన్నారు. 

ఎందుకూ అనడిగితే అప్లికేషన్లో అక్కడేదో ఒక చెక్బాక్స్ ఉందట - చిన్నది ఒక మూలకి - 'ఎంట్రెన్స్లో రాంక్ వస్తే MCA లో చేరతావా' - అని. అది నువ్వు టిక్ పెట్టలేదట. అందుకని సీట్ ఇవ్వరని చెప్పిందావిడ. 

అప్పుడు ఆవిణ్ణి  నేను - "అసలు ఎంట్రెన్స్ రాసేదే MCA లో చేరడానికి అయినప్పుడు  ఆ చెక్ బాక్స్ కి  అర్థమే లేదు.  పైగా మీరు అప్లికేషన్ చెక్ చేశాకే రాంక్ కార్డు పంపించారు కదా - ఇంటర్వ్యూకి రమ్మని? తీరా ఇక్కడికి వచ్చాక ఇలా చెప్తే ఎలా? అందులోనూ  అమ్మాయికి మంచి ర్యాంకు కూడా వచ్చింది" అనడిగాను. 

వెంటనే ఆవిడ "నిజమేననుకోండి - కానీ యూనివర్సిటీ రూల్స్ -  నేనేమీ చేయలేను" అనేసి ఇంకేదో పనిలో పడిపోయింది. 

సరే, ఏం  చేస్తాం ఇంక - అని బయటికి వస్తే  అక్కడ మనలాగే అయిన ఇంకో ఐదారుగురు పేరెంట్స్, పిల్లలు వున్నారు. బయటికి వచ్చిన మనల్ని చూసి యూనివర్సిటీ మీద  గొడవ చేద్దాం - కేసు పెడదాం అన్నారు. 

అప్పటికే సుజాతగారితో వాదించి విసిగిపోయి వున్నాను - అందులోనూ నీకు ఇంకో నెలలో ఆంధ్రా యూనివర్సిటీ MCA ఎంట్రెన్సు, BSRB టెస్టు వున్నాయి - ఇక్కడ కాకపోతే అందులో  వస్తుంది అనుకుని - వాళ్లతో "ఎందుకొచ్చిన గొడవ - వాళ్ళ రూల్సేవో వాళ్ళకున్నాయి - మనకిది కాకపొతే ఇంకో కాలేజ్ వుంటుంది "  అని సర్దిచెప్పి వెంటనే వెంకటేశ్వర యూనివర్సిటీ లో SKBR ప్రిన్సిపాలొకాయన KVV రాజు గారు వున్నారని - ఆయన్ని కలవటానికి వెళ్ళాము - ఆయన దొరకలేదు - ఇంక తిరుమల వెళ్లి మన వైఖానస-రామారావు గార్ని కలిసి - దేవుడి దర్శనం చేసుకుని గుంటూరు వచ్చేశాం. 

అలా తిరిగొచ్చేశాక ఒకసారి ఎందుకైనా మంచిదని మా కంపెనీ లాయరు మాధవపెద్ది రాధాకృష్ణ మూర్తి గారని - ఆయన దగ్గరికి వెళ్లి అడిగాను -  కేసు పెడితే సీటు వచ్చే మార్గం ఏదైనా ఉందా - అని.

ఆయన - "ఇది చాలా చిన్న విషయమయ్యా - కేసు నిలవదు"  అనేశారు. 


ఆ తర్వాత మన పక్కింట్లో ఉండేవారు కదా - వలివేటి వెంకటేశ్వరరావుగారు - పబ్లిక్ ప్రాసెక్యూటర్గా చేస్తుండేవారు. ఆయన దగ్గరకెళ్ళి కూర్చున్నానో రోజు. 

నీ రాంక్ కార్డు చూసి, చెప్పిందంతా విని  - "కామేశ్వరరావు గారు - మీరు డైరెక్ట్ గా హై కోర్ట్ కి లెటర్ రాయండి -  కార్డు  కాకుండా ఇన్లాండ్ లెటర్  రాయండి. కార్డయితే జడ్జ్ దాకా వెళ్లదు. ఇన్లాండ్ అయితే జడ్జ్ కే ఇస్తారు" అని సలహా చెప్పారు. 

ఆయన చెప్పినట్టే ఏం జరిగిందో అంతా వివరంగా రాసి ఇన్లాండ్ లెటర్ పోస్ట్ చేశాను. అది ఆ టైంలో హై కోర్ట్ లో బెంచ్ లో వున్న సిట్టింగ్ జడ్జ్ K. అమరేశ్వరి గారని ఆవిడ దగ్గరికి వెళ్ళింది. 

అమరేశ్వరి గారు ఆ లెటర్ చదివి - "ఇంత మంచి రాంక్ వస్తే సీట్ ఇవ్వకపోవడం ఏంటి - వెంటనే  ఈ అమ్మాయికి సీట్  ఇవ్వండి" - అని పద్మావతి యూనివర్సిటీకి టెలెక్స్ పంపించారు . మనక్కూడా  ఆ ఆర్డర్ కాపీ పంపించారు - నా దగ్గర దాచాను కూడా అది - ఉండాలి అదెక్కడో. 

ఆ తర్వాత పద్మావతి యూనివర్సిటీ నుంచి  టెలిగ్రామ్ వచ్చింది. 

వెంటనే బయల్దేరి తిరుపతి వెళ్ళాము - మళ్ళీ వచ్చిన మనల్ని చూసి ఆ సుజాత గారే అడిగారు - "ఎలా సాధించారండి సీటు?" - అని. 

హై కోర్టుకెళ్లామండి అని చెప్తే బోల్డు ఆశ్చర్యపోయింది ఆవిడ - "మీరు తప్ప ఇంకెవ్వరూ అలా చేయలేదండి" -  అని. 

అలా వచ్చింది నీ MCA సీటు - బోల్డన్ని  కబుర్లు నువ్వు చెప్పడం కాదు - నేను చెప్తాను రాసుకో - హ హ హ"

[మా నాన్న చేత హై కోర్ట్ కి లెటర్ రాయించిన లాయరంకుల్, అసలు నేనెవరో తెలియకపోయినా నా రాంక్  కార్డుని బట్టి  సీటిమ్మని టెలెక్స్ పంపించిన జడ్జ్ అమరేశ్వరి గారు -  ఆ రోజు అలా చేసివుండకపోతే నేనీరోజు ఈ కబుర్లు చెప్పగలిగేదాన్నే కాదు - అసలిలా వుండేదాన్నే కాదేమో.  వాళ్లిద్దరికీ నా మనః పూర్వక కృతజ్ఞతలు!

గుంటూరు లో మేజిస్ట్రేట్ గా రిటైరయ్యి సొంత వూరు పెదవడ్లపూడి లో విశ్రాంతజీవనం సాగిస్తున్న లాయరంకుల్ - వలివేటి వెంకటేశ్వరరావుగారికి - కొన్ని నెలల క్రితం  - ఫోన్ చేసి - "US లో ఉద్యోగం చేస్తున్నాను - ఇదంతా మీ వల్లే, అంకుల్ " అంటే - ఎంతో సంతోషించారు - "నాదేముంది లేమ్మాయ్! - నువ్వు చదివావు , సీటు తెచ్చుకున్నావు" - అంటూ. ]

 
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

14, జనవరి 2017, శనివారం

(సమ్)(సన్)క్రాంతి కబుర్లు

పొద్దు పొద్దున్నే (సమ్)(సన్)క్రాంతి కబుర్లు

"ఇవాళ సంక్రాంతా?"
"కాదు - భోగి - ఇండియా లో అయిపోయింది కూడా - రేపు సంక్రాంతి"
"ఊఁ "
"..."


అసలే సెయింట్ లూయిస్ లో ఇవాళ Winter Ice Storm alerts వున్నాయి.

Fox News లో వాతావరణ మాంత్రికుడు Dave Murray మహా ఉత్సాహంగా -
అదేదో ఆయనే బూజుకఱ్ఱ పట్టుకుని మబ్బులని మావూరి వైపుకి మళ్లించేస్తున్నట్టు -
అవొచ్చి ఆయన చెప్పిన చోటే కురిసేట్టు -
వర్షం వస్తుందని ఊరందరికీ చెప్పి ఆయన తన సొంత నర్సరీలో గప్-చుప్ గా నీళ్లు పెట్టుకుంటున్న విషయం మాకు తెలియనట్టు -
-----ఇలా రకరకాలుగా ఏంటేంటో మనసులో అనేసుకుంటూ రంగురంగుల మ్యాపులు చూపించేస్తూ - "ఇదిగో! ఇంకేముంది! మీ నెత్తిమీదే ఐసు గడ్డలు పడి మీరు గడ్డకట్టుకుపోతారు, జాగ్రత్త్త!!" - అని పదే పదే - ముందుకీ వెనక్కీ కదులుతూ - పడీ పడీ చెప్తున్నాడు.

ఆరో తరగతి చదివే బుజ్జిజింకకి  బడి లేదు -
నిన్నటి గురువారపు సాయంత్రమే - బడినుంచి అమ్మానాన్నలకి చెరో e-mail
ఇద్దరి ఫోన్లకి చెరో SMS
ఇంటి ఫోన్ కి ఒక voice mail  -
"మీ పిల్లాణ్ని బడికి పంపించాలని హడావిడి పడి లేవకుండా ఇంకో అరగంట ఎక్కువ  పడుకోండొహో"
- అని వరమిచ్చేసిన స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్

శీతాకాలపు సెలవులకి ఇంట్లో వున్న అన్నకి ఎలాగూ బడి లేదు - పదహేడు దాకా.

ఇద్దరూ రాత్రి పుస్తకాలు చదువుకుంటూ ఎప్పుడు పడుకున్నారో ఇంకా లేవలేదు.

అమ్మా, నాన్న లేచారు -  ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవేమో గానీ - ఇంటినుంచి పని చేసేటప్పుడు - ఒక సాకెట్ లో రెండు లాప్టాప్ ప్లగ్గులు ఇమడక తప్పదు. వాటితో పాటు నాలుగు చెవుల్లో ఇయర్ ప్లగ్గులూ కావాలి ఎవరి - కాన్ఫరెన్స్ కాళ్లు - వాళ్లు ఏ interference - లేకుండా వినడానికి.

ఉద్యోగానికి - సహజ కవచ కుండలాల్లాంటి - ఆ ప్లగ్గులూ, ఇయర్ ప్లగ్గులూ ధరింపజేసి, ధరించి - కార్యోన్ముఖులయ్యేముందు బదరీకి వచ్చిన సందేహం (సన్-దేహం? సమ్-దేహం?) -

" సంక్రాంతి - అంటే అర్థం ఏంటి?"

"అంటే సూర్యుడు మకరరాశిలో సంక్రమణం చేస్తున్నాడని అంటే ప్రవేశిస్తున్నాడని"

"అది సన్-క్రాంతా? సమ్-క్రాంతా?"

"ఎందుకు అది మీకు?"

"అదే - అది సన్-క్రమణమా? సమ్-క్రమణమా?"

"ఏదో ఒకటి - మొత్తానికి  'సం' అది"

"అదే - సన్నా - సమ్మా"

బయటికి చూస్తే ఆకాశం పేద్ద మసకేసిన గాజుముక్కలా - అప్పుడే రాలుతున్న (కురుస్తున్న) ఐసు తుంపర కిటికీల మీద చిన్న చిన్న గాజు తునకలుగా  రాలుతున్న శబ్దం.

మా వూరు తొడిగె 'మబ్బు'రపు అంబరం
హిమమద్దె దానికి మంచు సరిగంచు

దారి పొడుగునా సిటీ అధికారులు చల్లుతున్న మంచు కరిగించే - మంచునరిగించే ఉప్పుపోతలు.

డ్రైవ్-వే లో వున్న ఎర్రటి కారుకున్న నల్లటి చక్రం  మీద అందంగా పేరుకున్న మంచుర-కత్తుల జాలు - చూడడానికి బావున్నా - ముందున్న చలి-పండగని తలుచుకుని బెంగ-తలపోతలు. 



పవర్ పోతుందేమో -
వంట కాదేమో -
చలేస్తుందేమో -
డిష్-వాషర్ గబగబా వేయాలేమో -
కొవ్వొత్తులు తీసిపెట్టుకోవాలేమో -
పవర్ పోతే ఆఫీస్ లో ఇవాళ బోల్డన్ని కాన్ఫరెన్స్ కాల్స్ వున్నాయి  miss అవుతానేమో -
ఇన్ని బెంగల మధ్య - ఈ సన్నా - సమ్మా  ప్రశ్నలు.

"ఏమో బాబూ - నేనంత ఆలోచించలేదు - వదిలేయండి"

అలా వదిలేస్తే మజా ఏంటి కదా! కొనసాగింది వేరు-కారణ-విశ్లేషణ (root cause analysis) - వేరు మాటే లేకుండా ...

"అసలు సంక్రాతి, సంక్రమణం - word ఆరిజిన్ ఏంటా అని"

"ఏదో ఒకటి - మకర రాశిలో సంక్రమణమనే నాకు తెలుసు - అందుకే సంక్రాతి"

"అయితే - Happy మకర సంక్రాతి  - అనే చెప్పాలి కదా - ఎందుకంటే ఇంకో పదకొండు సంక్రమణాలు వుంటాయి కదా - to be specific ?!"

"అబ్బా! ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు మీరు?  నేనెవరికీ చెప్పలేదు బాబూ - పుట్టినప్పట్నుంచీ చెప్పామా ఏంటి  - Happy భోగి, Happy సంక్రాంతి, Happy కనుమ అని - ఇప్పుడు మాత్రం ఎందుకు? మీరేంటి - ఇప్పట్నించీ ప్రతి నెలా ప్రతి రాశి సంక్రమణానికి కూడా చెప్తారా ఏంటి?"

"నేనూ చెప్పట్లేదులే..."

వంటింటి - స్టవ్ ఆఫ్ కి, ఆఫీస్ లాప్టాప్ - లాగిన్ కి మధ్య పరుగు - ice storm పెరిగి పెద్దదయ్యేలోగా అన్ని పనులూ చక్కబెట్టేయాలని.

"మరైతే - ఇప్పటికి వదిలేయండి బాబూ - సన్నో, సమ్మో"

మీసాల చాటునుంచి నవ్వు - నా ఉడుకుమోత్తనం చూసి - "వూరికే అడిగాలే - ఏదో - ఉబుసుపోక కబుర్లు" అని సన్నగా అంటూ.

ఈలోగా తొమ్మిదవ్వడంతో - మా ఇద్దరి - కబుర్లు కట్టు - ఆఫీస్ కాల్ మొదలుపెట్టు...


భూమికావల మీవి భోగిమంటలు 
అవనికీవల మావి చలి-కీలలు 
మకర సంక్రమణం అక్కడ పండగ 
మంచు ఆక్రమణం ఇక్కడ మెండుగ 
కనుమ గారెల ఘుమఘుమలు మీవి 
హిమపు ధారల రిం ఝిమ్ మాది 
sun-దో;  some-other-దో - ఎల్లెడలా క్రాంతి
ఎలాగైతేనేం - మనందరి సంక్రాంతి




7, జనవరి 2017, శనివారం

నేర్పించిరి (చదివించని) గురువులు - 5 - అమ్మ



అమ్మాయి

అనగనగా ఓ అమ్మాయి
అన్నదమ్ములు - అక్కచెల్లెళ్లు
ఆటలు - పాటలు
పెద్ద కళ్లు - రెండుజళ్లు
పలుకు తక్కువ - చదువు మక్కువ

వాళ్ల నాన్నగారు చెప్పేవారట - ఇలాగే బాగా చదువుకుంటే డాక్టర్ చదివిస్తానని.  
చెప్పిన నాన్నగారు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు - పైనుంచెవరో పనిగట్టుకుని పిలిచినట్లు.
పెద్దన్న మీద పడ్డ కుటుంబ భారం - పల్లకీ మోత కన్నా కుదుపు తక్కువైన బ్రాహ్మణ వ్యవసాయం. 

ఈలోగా మనువాడమని  వచ్చిన మేనబావ -
చదువాపద్దు - పిల్ల బాగా చదువుతోందని - ఇంటికి వచ్చి మరీ చెప్పారట మాష్టార్లు -
మేనబావ వింటేగా - పిల్లపేరు మల్లెమొగ్గ - నా పేర్ జమిందార్ - పిల్లనిస్తారా - పెళ్లి చేస్తారా - అని ఒకటే మాట-ఒకటే పాట.

పెళ్లయ్యింది - అంటే - ఏంటో తెలిసీ తెలియని - పదిహేనేళ్లు - వచ్చీరాని వయసులో.
అప్పుడే అనేసుకుందేమో - తాను పూర్తి చేయలేని చదువు - తనకిష్టమయిన చదువు అందిపుచ్చుకునే పాపాయిలు కావాలని.

అమ్మాయిలకమ్మ

అమ్మాయి అమ్మ అయ్యింది - వరసగా  - ముగ్గురమ్మాయిలకి.
ఎవరైనా - ముగ్గురూ అమ్మాయిలేనా అనబోతే - దుర్గా, లక్ష్మీ, సరస్వతులు పుట్టారమ్మా మా ఇంటా - అంటూ (మేన)అత్తగారి సమర్ధింపు కోడలికి.

ఆ ముగ్గురమ్మాయిల్లో పెద్ద పిల్ల - పెంకి, మొండి - పాటలే తప్ప మాట్లాడదు - రాగం అంటారని అదేదో పాటనుకుందో ఏమో - ఆ అంటే ఆరున్నొక్కరాగం , ఊ అంటేనూ  అదే రాగం. 
ఎవర్నీ ఆక్షేపించని నాన్నమ్మే ఇచ్చేశారు బిరుదు - చండిక - అని.

తన తర్వాత - ఒకరు తర్వాత ఒకరుగా - పుట్టిన ఇద్దరు చెల్లెళ్లు - చిట్టి చెల్లి, కుట్టి చెల్లి  - పుట్టినవేళ ఆసుపత్రిలో అమ్మ దగ్గరే వుంటానని గొడవ చేసేది అమ్మాయీ-చండిక.
కళ్లు తెరవని పసిపాపకి ఏమీ తెలియదు - కళ్లు నలుపుకుని మరీ ఏడ్చే ఈ ఎడపాపని మాత్రం ఏడిపించకూడదు అని అమ్మ చండికనే తన పక్కలో పడుకోబెట్టుకునేది.

చండికకి  బడికివెళ్లే వయసొచ్చినా అమ్మే లోకం.

అలా అని ఎంతకాలం బడికి వెళ్లకుండా ఉండడం?
అమ్మ బళ్లో వేసేసింది పిల్లని.

బడికి వెళ్లనని రోజూ ఏడుపు
రోజుకిద్దరు - చెరో రెక్కా పట్టి - రోడ్డు మీద ఊయలూగిస్తూ - బడికి మోసేసేవారు.

బడి ముందునించే అమ్మ వెళ్లాలి - వూరు చివర శివాలయం చెరువు దగ్గరున్న మంచినీళ్ల బావికి.
అమ్మాయి అడిగింది -మల్లయ్య మాష్టార్ని - వెక్కుతూ - "అమ్మ నీళ్లకి వెళ్లే వేళ నేను ఆ రోడ్డు పక్కగా వున్న కిటికీ ఎక్కి కూర్చోనా - అలా అయినా మా అమ్మని కాసేపయినా చూడొచ్చుకదా" - అని.

"అమ్మో - ఈ లల్లమ్మో - ఏం పిల్లమ్మో - పాపం పోన్లేమ్మో" - అనుకున్నారో  ఏమో - మల్లయ్య పంతులుగారు - ఓ చీపురు పుల్లిచ్చి కిటికీ ఎక్కించేవారు - అమ్మ ఆ దారిన వచ్చేవేళ.

ఇంక అప్పట్నుంచీ - అమ్మ ఆ దారిన వచ్చి కనబడే దాకా "అమ్మా చూడాలీ - నిన్నూ నాన్నని చూడాలీ" అంటూ కాసేపు, "చూడాలని వుంది అమ్మా - చూడాలని వుంది - పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి" అంటూ ఇంకాసేపు బడి మొత్తాన్ని తాత్కాలిక దుఃఖసాగరంలో ఓలలాడించేది.

పాటలంటే ఇష్టమని అమ్మాయికి అమ్మ దేశభక్తి గీతాలు నేర్పేది - జయ జయ భారత జాతీయానందోత్సవ శుభసమయం - ప్రియతమ భారత జనయిత్రీ చిరదాస్య విమోచన నవోదయం - అంటూ.

ప్రతి ఆగస్టు పదిహేనుకి తెల్ల పరికిణీ, జాకెట్టు - ఆప్కో జరీ అంచువేసి కుట్టించేది. బడి మొత్తంలో అమ్మ కుట్టించిన తెల్ల బట్టల్లో మెరిసిపోయే అమ్మాయిని - ఆ పిల్లని గారం చేయొద్దండీ అని చెప్పినా వినకుండా - రామశేషు మాష్టారు స్వాతంత్ర్య దినోత్సవ ఊరేగింపులో ఎత్తుకుని తిప్పేవారు.

ఇంక బడికి సెలవులిస్తే  - అమ్మాయికి అమ్మతోనే ఆటలు - అవీ తానే కనిపెట్టినవి .

ఆ ఆటలెలాంటివంటే ...

గాజుముక్కలాట
- బడికి వెళ్లే దారిలో, ఆడుకునే వీధిలో - ఎక్కడ పగిలిన చేతిగాజు ముక్క దొరికితే అక్కణ్ణుంచి అది తెచ్చి ఖాళీ బోర్నవిటా డబ్బాలో దాచేది - అమ్మాయి.

బడి లేని మధ్యాహ్నాలలో అమ్మ వంట అయిపోయి పిల్లలకి ఆమ్ పెట్టేసి "హమ్మయ్య" అనుకునేవేళ గాజుముక్కల (డ)బ్భాండం చేతబట్టి చిన్ -మోహినీ అవతారమై అమ్మాయి ప్రత్యక్షం

ఇంక అమ్మకి అలసట తీరే మార్గమేది ? అయినా సరే విసుక్కోకుండా - ఓపిగ్గా కూర్చుని - గాజుముక్కల గుట్టలోంచి అమ్మాయికి కనపడకుండా చేతికి చేయడ్డుపెట్టుకుని - ఓ గాజుముక్క తీసి - అదే రంగో అమ్మాయిని కనుక్కోమనేది. ఒకవేళ అమ్మాయి అదే రంగు గాజుముక్క చూపిస్తే అమ్మాయికి ఆ రెండు ముక్కలు, లేకపోతే అమ్మకి రెండు గాజుముక్కలు. ఇలా ఆ గుట్టలోంచి బోల్డన్ని గాజుముక్కలు ఎవరికొస్తే వాళ్లు గెలిచినట్టన్నమాట.

బొమ్మొస్తుందా - రాదా ?
బడి పుస్తకం ఒకటి  తెచ్చి అమ్మ - అమ్మాయి పక్క-పక్కన కూర్చుని ఒకరు "బొమ్మొస్తుందా-రాదా?" అనడిగితే రెండోవారు వస్తుందనో-రాదనో చెప్పాక కాయితం తిప్పితే బొమ్ముంటే వస్తుందని చెప్పినవారు గెలిచినట్లు, లేకపోతే అడిగినవారికి పాయింటు.

ఇలాంటి వింత-వింత ఆటలు ఆడుతూనే అమ్మ ఎన్నో కబుర్లు చెప్పేది అమ్మాయికి - అన్నిట్లోనూ చదువు ముఖ్యాంశం - విద్యా దదాతి వినయం - స్పర్థయా వర్ధతే విద్యా -  విద్వాన్ సర్వత్ర పూజ్యతే - చదువుకునే టైంలో చదువుకోవాలి -  గడిచిపోయిన కాలం వెనక్కి రాదు.

అమ్మాయికో అలవాటు  - రెండు నెల్లకో క్లాసు పుస్తకం - తెలుగు వాచకమో - సైన్స్ టెక్స్టో  పడేసుకోవడం - అమ్మకొచ్చి పుస్తకం పోయిందని చెప్పడం.

అమ్మ అస్సలేమీ అనకుండా - "అయ్యో! అవునా! ఆంజనేయులు కొట్టుకెళ్లి కొత్తది తెచ్చుకో" అనడం.
అమ్మాయి వెళ్లి ఆంజనేయులు కొట్లో పుస్తకం కొనుక్కుని - దాంతో పాటు శనగపప్పు-బెల్లం ప్రసాదం చేతిలో పడితేనే కదిలి ఇంటికి వచ్చేది.

ఆంజనేయులు పెట్టడం మర్చిపోతే ఇంకేమైనా వుందీ - కొట్టు కట్టేదాకా అక్కడే నిలబడివుండేది అమ్మాయి - అందుకే పుస్తకంతో పాటే ప్రసాదం ప్రసాదించేవాడు.

అసలు రహస్యమేమిటంటే అమ్మాయికి ఫెళఫెళలాడే కొత్త పుస్తకాల ఘుమఘుమలాడే వాసన ఇష్టం - అందుకని ఏడాదికి రెండో మూడో తెలుగు వాచకాలు కొనుక్కునేది. అమ్మకి అసలు సంగతి తెల్సినా - అమ్మాయి ముచ్చటపడుతోందని మురిసేది - ముద్దుకైనా విసుక్కునేది కాదు.

ఈలోగా అమ్మాయి ఐదో తరగతికి వచ్చింది - అమ్మాయికన్నా ముందు అమ్మ హడావిడి పడి ఆధునిక మూల్యాంకన దర్శిని తెప్పించింది - విజయవాడలో వున్న అక్క-బావగార్లకి చెప్పి.  సోవియెట్ భూమి - చింపి - వేసిన అట్టతో వచ్చిన ఆ పుస్తకం అమ్మాయికి సర్వకాల-హస్త-భూషణం.

అమ్మ అమ్మాయికి పుస్తకాల మీద ప్రేమ పెరిగేలా - చందమామలు, బొమ్మరిల్లులు, అమర్ చిత్ర కథలు - ఇలా ఎన్నో పుస్తకాలు కొనేది. తాను చదివే యద్దనపూడి, మాదిరెడ్డి, కోడూరి(ఆరెకపూడి) నవలలు, విశ్వనాథ వారి వేయిపడగలు, రంగనాయకమ్మ విషవృక్షం - ఇదీ అదీ అని లేదు - అర్థం అవుతుందా లేదా అని లేదు - కాయితమైతే అక్షరముంటే - తెలుగైనా, ఇంగ్లీషయినా - ఆఖరికి అప్పటికి ఇంకా  అంతగా అర్థం కాని హిందీ అయినా - అమ్మాయి చదువుతానంటే చాలు పుస్తకం కొనిచ్చేసేది అమ్మ.

పెరుగుతున్న అమ్మాయితో పాటు చెప్పీ చెప్పకుండా అమ్మ చెప్పే పాఠాలు కూడా పెరుగుతున్నాయి - అసలంటూ అందం ఉండాలి కానీ తెచ్చిపెట్టుకోకూడదు - చెప్పి పెట్టిన బుద్ధి, దెప్పి పెట్టిన మెతుకు ఒంటబట్టవు - ఒక వేలు అవతలివారికేసి చూపిస్తే మూడువేళ్లు మనకేసే చూపిస్తాయి  - Face is the index of the mind - A sound mind in the sound body - తిండి కలిగితేనే కండ కలదోయ్ - నక్క ఒకచోట ఊళలు పెట్టి ఇంకోచోట సంగీతం పాడదు - పెద్దవాళ్లు చెప్పినట్టు చెయ్యాలి, చేసినట్టు కాదు - ఇలా ఎన్నెన్నో చిన్నా పెద్దా పాఠాలు - ఇవే కాక సందర్భానికి తగినట్లు సుమతీ, కుమారీ - శతక పద్యాలు.

చిన్న తరగతులలో అమ్మాయికి అర్థం కాని లెక్కలు అమ్మే చెప్పాలి - మరి నాన్నైతే ఒక్కసారి చెప్పగానే అర్థం కాకపొతే - ఆయ్ హన్నా ! - అంటారు కదా - అందుకని.

అమ్మాయికి  పరీక్షలొస్తే ఇంటిల్లిపాదికీ పరీక్షా-కాలమే - పరీక్ష బా రాస్తే పర్వాలేదు - రాయకపోతే ఇంకంతే - ఇల్లంతా (అ)శోకవనమే. దానికితోడు పరీక్షల ముందు అసలు ఖానా మానేసి "నఖా"ని అయిపోయేది అమ్మాయి. అమ్మ అప్పుడు పక్కన కూర్చుని "హనుమంతుడిలాగా నీ బలం నీకు తెలియదు - నువ్వు బాగా రాయగలవు" అని చెప్తే అప్పుడు "హమ్మయ్య" అని కనులారా నిదరోయేది.

ఇంక పరీక్ష రాసి ఇంటికి రాగానే - పరీక్ష పేపరు అమ్మ చేతికిచ్చి ప్రతీ ప్రశ్నకీ సమాధానం పరీక్షలో ఎలా రాసిందో అమ్మకి అప్పచెప్పాల్సిందే - ఒకటో తరగతి నుంచీ డిగ్రీ ఫిజిక్స్ థీరీల  దాకా ఇదే తీరు - అమ్మకి ఎంత అర్థమవుతుందీ అనేకన్నా అమ్మకి చెప్పాలి అన్నదే ముఖ్యం.

అమ్మాయి ఏడో తరగతిలోకి రాగానే - (అప్పటినుంచి వరసగా దాదాపు పదేళ్లపాటు) అమ్మ ఇచ్చిన అందమైన బహుమతి - ప్రతీ నెల ఒక Competition Success Review (CSR), ఒక Reader's Digest (RD).  ఉన్న ఊరిలో ఆ రెండు పుస్తకాలు చదివేది ఆ వయసులో అమ్మాయి ఒక్కతే. CSR నిండా పజిళ్ల లాంటి mental aptitude టెస్టులు, RD నిండా అప్పటివరకూ పరిచయం లేని భూమికి అవతలివైపు వున్న ప్రపంచం.

ముగ్గురక్క చెల్లెళ్లలో పెద్దదైనా ముగ్గురిలో చిన్నగా కనిపించే అమ్మాయిని ఎవరైనా హేళన చేయబోతే - మా పిల్ల ఇంకో గుప్పెడుంటే బ్యూటీ కాంటెస్ట్ కివెళ్లగలిగేది - అని అమ్మాయి మనసుకి వెలితి అనిపించకుండా వెనకేసుకొచ్చేది అమ్మ.

ముగ్గురాడపిల్లలని - పెళ్లై ఎవరిళ్లకి వాళ్లెళ్లిపోతే అక్కడెలాగూ చేసుకోవాలి - నేనెలా పెళ్లయ్యాకే వంట నేర్చుకున్నానో మీరూ అలాగే నేర్చుకుందురు గాని - అని వంటింటి ఛాయలకి రాకుండా అబ్బురంగా అమ్మాయిలకి నచ్చింది వండి పెట్టి పెంచింది.

ముగ్గురమ్మాయిల తల్లి - అబ్బాయిల ముచ్చటెలా తీర్చుకుందంటే - చదువంటే ఇష్టమున్న తమ్ముడి, చెల్లెలి పిల్లల చదువులకి ఒంటిమీద బంగారాన్ని వారి చేతిలో పుస్తకాలుగా మార్చి మురిసిపోయేంతగా. ఆ మురిపెం చూసే  పక్కింటి సరస్వతాంటీ అమ్మని - జగన్మాతా - అని పిలిచేవారు.

పొద్దున్న లేచిన అమ్మకి -  రాత్రి ఏ పదింటికో పక్క చేరబోయేవేళ - అనుకునో, అనుకోకుండానో తలుపు తట్టి వచ్చిన చుట్టాలకి - అప్పటికప్పుడు ఎర్రగా వేయించిన బంగాళాదుంపలు, వేడి వేడి చారు - పెట్టి వచ్చినవారి కడుపు నింపందే నిద్ర పట్టేది కాదేమో - అప్పటికే నిద్రపోయి వంటింట హడావిడికి నిద్ర లేచిన అమ్మాయిలకి కనిపించేది - చేతి గరిటతో అన్నపూర్ణ - అలుపెరుగనిది అమ్మ.

అమ్మకి ధైర్యమూ ఎక్కువే - నాన్నYezdi చీకటిలో కనపడని గుంటలో పడిపోయి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో చేరారని ఎవరో వచ్చి చెప్తే - జాగ్రత్తగా వుండండని అమ్మాయిలకి చెప్పి - చెప్పులేసుకుని ఏ కంగారూ కనిపించనీయకుండా ఆ రాత్రిలో నాన్న దగ్గరికెళ్లింది - అది తలచుకున్న అమ్మాయికి ఇప్పటికీ ఆశ్చర్యమే - అసలంత చడీ-చప్పుడు లేకుండా అమ్మ అలా ఎలా వెళ్లగలిగిందీ - అని.

అమ్మాయి పెద్దయ్యింది - అప్పటిదాకా ఆడింది ఆట - పాడింది పాట - చదువుకి దూరం వెళ్లాల్సొచ్చింది - మొదటిసారి అమ్మని, ఇంటిని వదిలి. చదువుతో పాటు మనువుకనువైన మనసునీ అందుకుంది. అమ్మకీ, నాన్నకీ ఒక్క నిముషం ఇది నిజం కాదేమో అనిపించింది. ముందుగా అమ్మకే అర్థం అయ్యింది - అమ్మాయి పట్టు పట్టింది ఇక విడవదని. నాన్నకి నచ్చచెప్పింది - అమ్మాయి పెళ్లి ముచ్చట తీర్చింది.

అమ్మాయి పెళ్లయ్యాక - అమ్మంటే ఎంత ఇష్టం వున్నా - మరి అత్తవారింటికి వెళ్లాలి కదా! అలా వెళ్లినప్పుడు మరి కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త మాటలు - అంతా కొత్తగా వుంటుంది కదా ! అలాంటి కొత్త కొత్త గా అనిపించే తొలినాళ్లలో సరదాగా అన్న మాటొకదానికి  అమ్మాయి నొచ్చుకుంది - నొచ్చుకుని అమ్మకి చెప్పుకుంది.

అమ్మాయి చెప్పింది అమ్మ వింది - విని అంది - "ఒక అమ్మ కడుపున పుట్టిన మీ ముగ్గురే ఒకలా లేరు - అలాంటిది మీ అత్తవారింట్లో మనింట్లో ఉన్నట్లు ఎలా ఉంటుంది?  ఆడపడుచు అంటే ఆదుకునే నేస్తం లాంటిది - మరిది అంటే లక్ష్మణస్వామి  - ఆ ఇంటి కబురు మంచిదైతే పంచుకో - కానిదైతే తెలివిగా మంచిగా మలుచుకో - చదువుకున్నావు - వృధా పోనీయకు - ఆలోచించు - ఒదిగి ఉండడం ఓడిపోవడం కాదు - అదే గెలిపిస్తుంది నిన్ను".

అమ్మ చెప్పిన మాట చద్దిమూట అయింది అమ్మాయికి - తిరుగులేని ప్రేమాస్త్రమయ్యింది.
 
అమ్మలగన్నఅమ్మమ్మ

ముగ్గురమ్మాయిలకి పెళ్లిళ్లు అయ్యాయి - అమ్మలయ్యారు - అమ్మని అమ్మమ్మని చేశారు.
ఎదిగిన మనవళ్ల-అమ్మమ్మ అయిన అమ్మకిప్పుడు ఆటవిడుపు.

అమ్మాయి >>>  అమ్మాయిలకమ్మ >>>  అమ్మలగన్నఅమ్మమ్మ ~ వెరసి మా అమ్మ - పేరిందేవి.

అమ్మాయి చదువుకోసం, ముగ్గురాడపిల్లల పెళ్లిళ్ల కోసం, తను చదివించాలనుకున్న- తన పుట్టింటి పేరు నిలుపుతారనుకున్న తన మేనల్లుళ్ల కోసం, తను సహాయం చేయాలనుకుంటున్న ఎవరికోసమైనా - నాన్నకి కష్టమవుతుందని తెలిసినా - ఒప్పించడానికి అమ్మ చేసే ప్రయత్నాలు చూసినప్పుడల్లా అమ్మాయి అనుకునేది - అనుకుని నవ్వుతూ నాన్నతో అనేది - "నాన్నా! మా అమ్మ అన్నపూర్ణ, జగన్మాతే కాదు - సర్వమంగళ కూడా" - అని.

మ్రింగెడి వాఁడు విభుండని
మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంళసూత్రంబు నెంత మది నమ్మినదో?