19, మార్చి 2020, గురువారం

త్వామనురజామి - 45 - ఉన్నా.. వేచి ఉన్నా.. . ట్రింగుమనవేలనే - ఓ ఎన్నేయల్ ఫోనా!

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 44 - ఆనాటి ఆ హాయీ ...బోల్డంత నిజమోయీ...

నేను సంక్రాంతికి గుంటూరు వెళ్ళే ముందు బదరీకి - ఒకసారి తనతో రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్తానని అన్నాను కదా! అందులోనూ  బెంగుళూరులో చేస్తున్న ప్రాజెక్టు అయిపోయి నేను ఇంటికి వెళ్తే మళ్ళీ ఇప్పటిప్పట్లో తనని కలవడానికి అవ్వదు కదా అనిపించింది. అందుకే ఓ గురువారం తను NAL కి వచ్చినప్పుడు చెప్పాను మరుసటి రోజు రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్ళొద్దామని.

ఒకప్పుడు తాననుకున్నట్టుగానే, నేనిప్పుడు అన్నట్టుగానే - ఇద్దరం కలిసి దగ్గర్లోనే వున్న దోమ్లూరు రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్ళాము. లోపలికి వెళ్ళి అక్కడున్న ఆఫీసర్ని కనుక్కుంటే ఏం చెప్పారంటే - మా ఏజ్ ప్రూఫ్ కోసం మా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు తేవాలని, మా ఇద్దరి పేర్లు ఒక బోర్డు మీద రాసి బయట అందరికీ కనపడేలా పెడతారని - ఇల్లాంటివేవో చెప్పారు. ఆయన చెప్పినవన్నీ శ్రద్ధగా విని బయటకొచ్చి పెద్దగా నవ్వుకుని మళ్ళీ NAL కి వెళ్ళిపోయాం. అప్పుడే బదరీకి చెప్పాను నేనూ, అపర్ణ మైసూర్ వెళ్దామనుకున్న విషయం. అది వినగానే తను - "ఇప్పుడు అపర్ణ వచ్చిందని నన్నొదిలేసి తనతో వెళ్ళిపోతావా? అదేం కుదరదు. మళ్ళీ నీ ప్రాజెక్ట్ అయి గుంటూరు వెళ్ళిపోతే - మళ్ళీ - నువ్వక్కడ, నేనిక్కడ, పాటక్కడ, పలుకిక్కడ - అంటూ పాడుకుంటూ ఉండాలి నువ్వూ, నేనూ." అన్నారు.

"మీకంత బెంగైతే మీరూ మాతో మైసూర్ రండి" అన్నాన్నేను.

అలా అనుకున్నదే తడవు అపర్ణతో మాట్లాడి ఆ శనివారమే మైసూర్ వెళ్ళొద్దామని అనేసుకున్నాం.

శనివారం పొద్దున్నే ఆరింటికల్లా మెజెస్టిక్ బస్టాండు దగ్గర - నేను, బదరి, అపర్ణ - ముగ్గురం కలుసుకున్నాము. మేం ముగ్గురం కలిసి బస్సులో మైసూర్ వెళ్ళేటప్పటికి పదిన్నర అయింది.

బస్సులో కిటికీ సీట్లో అపర్ణ, పక్కన నేను, నా పక్కన బదరీ కూర్చున్నాము. నాకిష్టులైన వాళ్ళిద్దరితో కలిసి మైసూర్ వెళ్తున్న ఎక్సైట్‌మెంటో ఏంటో కానీ బస్సులో వున్న మూడు గంటలూ మాట్లాడుతూనే వున్నాను. ఇటు అపర్ణతో నేను చదువుతున్న పుస్తకాలు - Gone with the wind, Emma, Archies, Tin Tin గురించి చెప్పడం - వాటిల్లో మా ఇద్దరికీ common గా ఇష్టమైన వాటి గురించి మాట్లాడుకోవడం - అదే మాటల్లో మేము చిన్నప్పుడు చదివిన Little Women ని ఆధారం చేసుకుని మేము డిగ్రీ చదివే రోజుల్లో టీవీలో వచ్చిన హిందీ సీరియల్ "కచ్ఛీధూప్" లో నటించిన భాగ్యశ్రీ అనే అమ్మాయి ఎంత బావుంటుందో - ఇలా బోల్డన్ని కబుర్లు చెప్పుకున్నాము.

ఇటు పక్క బదరీకి బోర్ కొట్టకూడదు కదా మరి!

అందుకని తనకేమో - అప్పుడెప్పుడో కిందటేడాది జూన్‌లో నేను, అమ్మ, పప్పి, కుట్టి శివకోడు వెళ్ళినప్పటి విశేషాలు - మేము శివకోడుకి వెళ్ళిన టైంలోనే ప్రసాద్ మామయ్య ఇంట్లో అద్దెకుంటున్న కరణం గారి అమ్మాయి పద్మ, అల్లుడు రామారావుగారు, వాళ్ళ పిల్లలు మాధురి, సుధీర్ బొంబాయి నుంచి రావడం - రోజూ మేమందరం శివకోడు నుంచి నడుచుకుంటూ రాజోలు సినిమాలకి, గోదారొడ్డుకి వెళ్ళడం - ఓ రోజు గోదారొడ్డుకి వెళ్ళినప్పుడు ఆ పక్కనే నా MCA జూనియర్ ప్రియదర్శిని వాళ్ళ ఇల్లు ఉంది, ఆ ఇంటి అడ్రెస్ నా దగ్గర ఉందీ అని వెతుక్కుంటూవెళ్తే ఆ ప్రియదర్శిని వాళ్ళ నాన్నగారు పొన్నాడ హనుమంతరావుగారు, వాళ్ళ కుటుంబం మా చెల్లాయత్తకి తెల్సు అని తెలియడం - ప్రియదర్శిని వాళ్ళింట్లో వాళ్ళ అక్కలూ, వదినలతో మాట్లాడడం - ఈలోగా మా అమ్మ నేను ప్రియదర్శినితో నేను బదరి గురించి ఏమన్నా మాట్లాడడానికేమన్నా వాళ్ళింటికొచ్చానా అని అనేస్కుని, అలా అని నన్నడగలేక అక్కడున్నంతసేపూ బోల్డంత అసహనంగా ఉండడం - అక్కడ మొదలుపెట్టి - జనవరిలో నేను గుంటూరు సైనస్ ఆపరేషన్ కోసం వెళ్ళినప్పుడు - నేను, పప్పి చిలకలూరిపేట రవి, శారద దగ్గరికి ఓ రెండ్రోజులు ఉందామని వెళ్ళడం - అప్పుడు రవి "నీ గురించి బాబాయి, పిన్ని ఎంత బాధ పడుతున్నారో తెలుసా?" అని కోప్పడడం - దానికి నేను అలగడం - ఇవన్నీ మళ్ళీ ఎక్కడ మర్చిపోతానో అన్నట్టుగా - చెప్తూనే వున్నాను.

నేను ఎంత మాట్లాడానంటే అసలు బస్సు హోరే వినిపించలేదు.భలే!

తీరా బస్సు దిగాక మైసూర్ బెంగుళూరు ఉన్నంత చల్లగా లేదు. పైగా ఆ రోజు ఎండ బాగా వుంది. మేం ముగ్గురం  మైసూర్ మహారాజా పేలస్ చూడ్డానికి వెళ్ళాము. అసలు ప్లాన్ ఏంటంటే పేలస్ చూసి, లంచ్ చేసి బృందావన్ గార్డెన్స్ చూసి సాయంత్రం కొంచెం లేట్ అయినా ఇంటికి వెళ్ళి పోవాలని. తీరా పేలస్ అంతా చూసి బయటికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండయిపోయింది. నాకు బోల్డు తలనొప్పి వచ్చేసింది.బృందావన్ గార్డెన్స్ చూడకుండానే బెంగుళూరుకి తిరిగి వచ్చేశాం.

బెంగుళూరులో - ఫిబ్రవరి నెల... చలిచలి రోజుల్లో ... చల్ చల్ అంటూ రోజులు పరిగెడుతున్నాయి.

ఓ వారం క్రితం బదరి కూడా గుంటూరు వెళ్ళిపోయారు. వెళ్ళే ముందే దలాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఇంటర్వ్యూ అయింది తనకి.

చొక్కలింగం గారని ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ - ఆయన చేశారు బదరీని ఇంటర్వ్యూ.

వెంటనే చెప్పారట బదరి బాగా చేశారని. కానీ బయట ఇంకా ఇంటర్వ్యూ కోసం చాలా మంది వచ్చి ఉండడం చేత వాళ్ళందర్నీ చేస్తే కానీ final result చెప్పలేనని అన్నారట.

అది వినగానే బదరీ చొక్కలింగం గారితో "సర్... ఇవాళ మధ్యాహ్నం రెండిటికి నాకు ట్రెయిన్. కలకత్తాలో షాలిమార్ పెయింట్స్‌లో కూడా ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నేనివాళ బయల్దేరి గుంటూరు వెళ్ళి అక్కడ్నుంచి కలకత్తా వెళ్తాను. ఒకవేళ అక్కడ ఉద్యోగం వచ్చేస్తే అదే ముందు తీసుకుంటాను" అని చెప్పేసి వచ్చారట.

ఇదంతా NAL ఆఫీసుకి ఫోన్ చేసి నాతో చెప్పి గుంటూరు వెళ్ళిపోయారు బదరి.

బదరి బెంగుళూరులోనే ఉద్యోగం వెతుక్కోవాలి అని చాలా ప్రయత్నం చేశారు. ఉద్యోగాలు వెతుక్కోవడంలో అస్సలు తీరిక లేకుండా తిరిగారు. నన్ను NAL లో కలిసినప్పుడల్లా సెయింట్ మార్క్స్ రోడ్డులో ఎక్కడెక్కడ అప్లై చేశారు, ఎవరెవరు ఇంటర్వ్యూకి పిలిచారు, ఏ ఆఫీసుకి వెళ్ళారు - ఇవే కబుర్లు.

అలా ఇంటర్వ్యూలకి తిరిగే రోజుల్లో తన దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉండేవి. ఒక్కోసారి జేబులో వున్న ఐదు రూపాయల్లో రెండు ఇడ్లీలు, నాలుక్కప్పుల సాంబారూ - జీర్ణం జీర్ణం ఈ పూటకిదే జీర్ణం - అనుకుని ఇంకో రెండున్నర రూపాయలు రేపటికి అని అట్టేపెట్టుకున్న రోజుల్లో - ఆ రెండో రోజు సరిగ్గా మధ్యాహ్నం భోజనం వేళకి ఏ కామతో, షాన్‌బాగో, అదీ కాక ఏ ఉపాహారదర్శినో మెట్లెక్కబోతుంటే - ఎవరో చెయ్యి జాపారని తన చేతిలో వున్న డబ్బులు రెండూ ఆ చేతిలో పెట్టి - సాపాటు లేని పూట గడిపేశారని తర్వాతెప్పుడో నవ్వుతూ చెప్తుంటే - "అవునా?! నిజ్జంగానే అలా చేశారా?" - అని ఆశ్చర్యపోతూ వినడానికి బానే ఉండేది - ఎందుకంటే ఆ ఆకలి నొప్పి నాక్కాదు కదా!

అలాంటివి విన్నప్పుడల్లా - తనకి నా వల్ల వచ్చిన "బెంగుళూరులోనే ఉద్యోగం చూసుకోవాలి" అన్న constraint లేకపోతే ఈ పాటికి ఎక్కడో ఒకచోట మంచి ఉద్యోగం వచ్చేసేదేమో అనిపించేది నాకైతే.

నాకలా అనిపించిన టైంలోనే బదరీకి షాలిమార్ పెయింట్స్ వాళ్ళ నుంచి కలకత్తాకి రమ్మని పిలుపు వచ్చింది.

నేను కూడా ఈ నెల చివరికి ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్‌మిట్ చెయ్యాలి. దానికోసం కావాల్సిన ప్రింటౌట్లు తీసుకోవడం, వాటిని ఒక వరసలో పెట్టుకోవడం - వాటన్నిటినీ బైండ్ ఎక్కడ చేయించాలా అని వెతుక్కోవడం - భలే హడావిడిగా వున్నాయి నా మనశ్శరీరాలు రెండూ.

అప్పుడే మణిరత్నం "రోజా" పల్లవి థియేటర్లో వచ్చి వుంది. దానికి నేను, సాగి, ఇందిర వెళ్ళాము. ఆ సినిమాలో మ్యూజిక్ ఎంత బావుందీ అంటే వింటున్నవి ఒక్క చెవులే కాదు - ఒళ్ళంతా చెవులయినట్లనిపించింది. ముఖ్యంగా "పుదు వేళ్ళై మళై... " పాటలో ముందు వచ్చే మ్యూజిక్ - మంచుపూలు చిట్లుతున్నట్లుగా వినిపిస్తుంది. అది వినగానే ఒళ్ళు ఝల్లుమన్నట్లనిపించింది. ఎవరో AR రెహమాన్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత మాగజీన్లు చదివినప్పుడు నాకెంతో ఇష్టమైన MRF Tyres - Advertisement చేసింది ఈ రెహమానే అని తెల్సి తెగ మురిశా.

ఇంతలో బదరి మళ్ళీ బెంగుళూరు వచ్చారు. రాగానే NAL కి వచ్చి నన్ను కలిశారు. తనకి దలాల్ స్ట్రీట్ జర్నల్  (DSJ) - CERC (Corporate & Economic Research Center) లో Financial Analyst గా ఉద్యోగం వచ్చిందని, 15 వ తారీఖుకి చేరుతున్నానని చెప్పారు. ఎందుకో ఎప్పట్లా ఎక్కువసేపు ఉండకుండా హడావిడిగా వెళ్ళిపోయారు - ఏదో పనుందని. కొంచెం disappointing గా అనిపించింది. అప్పుడే తనకి తన ఉద్యోగం నాకన్నా ముఖ్యమైనదిగా అనిపించడం నాకు నచ్చలేనట్టుంది.

కాకపోతే తను అనుకున్నట్లే DSJ లో చేరడం నాకు భలే సంతోషంగా అనిపించింది. దాంతోపాటే కొంచెం దిగులుగా కూడా అనిపించింది. సరిగ్గా తనకి ఉద్యోగం వచ్చి బెంగుళూరులో ఉంటారూ అని కచ్చితంగా తెలిసే టైంకి నా ప్రాజెక్ట్ అయిపోతోంది. నేను ఫిబ్రవరి నెలాఖరుకి తిరుపతిలో మా యూనివర్సిటీకి వెళ్ళి, అక్కణ్ణించి అటునుంచి అటే గుంటూరు వెళ్ళిపోవాలి మరి.

ఆ తర్వాత...
ఆలోచించడానికి ఏమీ లేదు.
ఏం ఆలోచించాలో తెలీట్లేదు.
అసలేమైనా ఆలోచించడానికే బెంగగా వుంది.
నాకెలాగూ అలవాటు లేని పని అని ఆలోచన జోలికే వెళ్లట్లేదు నేను.

సరే! బదరీ DSJ లో చేరారు కదా! నేను కూడా నా రిపోర్ట్ పనుల్లో busy అయిపోయాను.

ఆ రోజు మామూలుగానే NAL ఆఫీసుకి వెళ్ళి అప్పటికే bind చేయించిన రిపోర్ట్ అంతా ఒకసారి చూసుకుంటూ వున్నాను - అంతా సరిగ్గానే వుంది కదా అనుకుంటూ.

అంతలో హరీష్ రావు గారు హడావిడిగా బయట నుంచి వచ్చి - నా టేబుల్ దగ్గర నించుని "లలితా! You got a phone call - STD from Guntur" అన్నారు.

అసలెప్పుడూ ఆయన నన్ను పేరు పెట్టి పిలవలేదు. ఇదే మొదటిసారి. అందులోనూ అసలే ఆయన హడావిడిగా తిరుగుతూ వుంటారు. ఇవాళ ఇంకా స్పీడుగా పరిగెత్తుకుంటూ వచ్చారు నా దగ్గరికి - ఫోన్ వచ్చిందని చెప్పడానికి.

నాకు ఆయన హడావిడి చూసి కంగారు వేసింది.
పొద్దున్న పదకొండింటికి నాకు గుంటూరు నుంచి ఫోనేంటి? అందరూ అనాతవరం ప్రసాద్ పెళ్ళికి వెళ్ళుండాలి కదా! అప్పుడే గుంటూరు వచ్చేశారా? వచ్చేస్తే మాత్రం నాకు ఇప్పుడు ఫోన్ చేయడమేంటి?

ఇలా అనుకుంటూ ఒక్కసారిగా లేచి పరిగెత్తాను - మా కారిడార్లో చివరగా వున్న గదిలో వుండే ఫోన్ దగ్గరికి. నా కంగారు చూసి నా వెనకాలే మా సీనియర్ సునీత కూడా పరిగెత్తుకొచ్చింది.

అక్కడకి వెళ్ళగానే పక్కన పెట్టి వున్న ఫోన్ తీసుకుని "హలో" అన్నాను - ఆయాసపడుతూనే...

అవతల్నుంచి నాన్న గొంతు "లల్లీయా?" అంటూ.

నాన్న ఫోన్ చేసినప్పుడు ఉపోద్ఘాతాలూ, ఉభయకుశలోపరులూ ఉండవ్. అంతా straight talk!

"ఆ నాన్నా!" అనగానే వెంటనే అడిగారు "తిరుపతి ఎప్పుడు వెళ్తున్నావ్?" అంటూ.

"ఈ నెలాఖరుకి నాన్నా!"

"సరే అయితే... అక్కణ్ణుంచి ... " ఇంకా ఏదో చెప్పబోతున్నారు ఫోన్ కట్ అయ్యింది.

నాకు నిజంగానే చెప్పలేని టెన్షన్ ఏదో మొదలయింది. అసలెందుకు ఇప్పుడు ఫోన్ చేసి ఇంత అర్జెంటుగా నా తిరుపతి ప్రయాణం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నాన్న ఏం చెప్పబోయారు?

గోళ్ళు కొరుక్కుంటూ అక్కడే - ఆ ఫోన్ కేసి చూస్తూ కూర్చున్నా. పక్కనే సునీత కూడా నా చెయ్యి పట్టుకుని కూర్చుని వుంది.

ఆ ఫోను  కాలుకు  ...
మా నాన్న మాటకు
ఉన్నా... వేచి ఉన్నా...
ట్రింగుమనవేలనే - ఓ ఎన్నేయల్  ఫోనా! 


మీరూ నాకు తోడుగా - పైనున్న కొసరు పాటకు అసలు పాట ఏదో కనిపెట్టి ఆ ట్యూన్లో పాడుకుంటూ వుండండి... మళ్ళీ మా నాన్న ఫోన్ చేసేవరకు ...

 <<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

9, మార్చి 2020, సోమవారం

రచ్చ గెలిచి ఇంటికొచ్చిన "మధ"

"మధ" గురించి చెప్పేయ్ పద!
అంటూ 
నిన్నట్నుంచీ నా తలలో ఒకటే రొద... 




 
అరె! అదెలా చెప్తానబ్బా?! చదివిన కథ గురించో, చూసిన సినిమా గురించో అయితే చెప్పగలను. కానీ ఇలా - చెప్పని కథ, వినని మాట, చూడని కళ - లాంటి - అసలు ఇంకా థియేటర్లకే రాని సినిమా "మధ" గురించి ఏం చెప్పను? ఎలా చెప్పను?

అంతే కదా?! నేనడిగింది సబబే కదా?!

అలా అడిగానే కానీ - చెప్పకుండా వుండలేకపోతున్నా.

ఇప్పటి దాకా చూసిన సినిమాల గురించే రాశాను. మొట్టమొదటిసారిగా చూడని సినిమా గురించి రాయకుండా ఉండలేకపోతున్నాను.

దానికి ప్రేరణ, కారణం - శ్రీవిద్య బసవ.

ప్రతి వారం యూట్యూబ్లో  iDream-TNR interviews కొత్తవి ఏమున్నాయా అని చూసి - ఏదో ఒకటి కాలక్షేపానికి మొదలు పెట్టి - నచ్చి చివరి వరకూ చూసేవి కొన్నైనా ఉంటాయి.

నిన్న రాత్రి అలవాటుగా అటు వైపే వెళ్తే 180వ ఇంటర్వ్యూ  - Women's Day Special అని కనిపిస్తే  - అంత ప్రత్యేకంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పరిచయం చేయదగ్గ వాళ్ళెవరున్నారబ్బా అనుకుంటూనే చూడడం మొదలుపెట్టిన నేను - అసలెక్కడా ఆపకుండా - దాదాపు రెండు గంటల సేపు చూశానూ అంటే అది శ్రీవిద్య బసవ కోసమే.

అన్నట్టు ఈ సినిమాకి పేరు "మధ" అని పెట్టారు కానీ సంస్కృతంలో  "మధ (मध)" అన్న మాటే లేదు - నాకు తెలిసినంత వరకు.

 "మద (मद)" అన్న మాటకు వున్న అర్థాల్లో insanity (పిచ్చి) ఒకటి.

కాకపోతే శ్రీవిద్య బసవ తన సినిమాకి పెట్టుకున్న పేరు "మధ".

మనసొప్పక నేను ముందు "మద" అని రాసుకున్నాను - కానీ సినిమా గురించి రాసేటప్పుడు ఆ పేరుని అలాగే ఉంచడం, ఉచ్చరించడం న్యాయం. అందుకే మళ్ళీ "మధ" అని మార్చేశాను.



ఆ Special Woman ని పరిచయం చేయడం వల్ల నిజంగానే టీఎన్నార్ చేసిన 180వ ఇంటర్వ్యూ Women's Day Special అనిపించుకుంది.

మా బదరి అన్నట్టు ఈ 2020 International Women's Day కి ఇద్దరు శక్తివంతమైన మహిళల గురించి తెల్సుసుకున్నాం - ఒకరు అమ్మాయి శ్రీవిద్య బసవ, ఇంకొకరు అమ్మ ఇందిర బసవ. వాళ్ళిద్దరికీ బోల్డన్ని జేజేలు!

"మధ" అనే కలను కని దాన్ని సినిమా దాకా తీసుకొచ్చిన ఆ ఇద్దరు మహిళల కథతో మొదలు పెడితే...

అనగనగా ఓ తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న అమ్మ.
ఆ అమ్మని బాధ పెట్టే నాన్న.
ఆ అమ్మకీ, నాన్నకీ ఓ ఐదుగురు ఆడపిల్లలు.
ఆ నాన్న పెట్టే బాధలు భరించలేక అమ్మ తీసుకున్న విడాకులు.
ఇక్కడి వరకూ చాలా మామూలు కథ.
అన్నట్టు ఓ సంగతి మర్చిపోయాను... భర్త చాటు భార్యగా వుండి - చదువు మీద ఇష్టంతో చాటుగా భర్తకు తెలియకుండా పిల్లలతో సమానముగా చదువుకుని B. A. పూర్తి చేస్తుంది అమ్మ ఇందిర బసవ. 

ఆ తర్వాత... మొదలవుతుంది అసలు కథ. ఏ సినిమాల్లోనూ ఇప్పటి వరకు చూడని కథ. ఒక సినిమా తియ్యడం వెనకాల కథ.

నాన్న విడిచి పెట్టిన ఆ తల్లీ పిల్లలకి మిగిలింది వాళ్ళుంటున్న ఇల్లు మాత్రమే.
అది కూడా అమెరికా వెళ్ళి  చదువుకుందామని కలలు కంటున్న చిన్న కూతురి కోసం అమ్మేస్తుంది అమ్మ ఇందిర బసవ.
ఇంతలో ఇంజనీరింగ్ చదివి సినిమా తారైంది పెద్ద కూతురు గాయత్రి గుప్తా.
చదువుతున్న ఇంజనీరింగ్‌ని మధ్యలో ఆపేసి సినిమా తీస్తానంది మూడో కూతురు శ్రీవిద్య.
ఈ లోగా అంతవరకూ సబలలా పోరాడి, ఎంత దూరమైనా ఎదురీతగానే కనిపిస్తున్న బతుకు దారిలో అలసి అబలైన అమ్మని సేదతీరమని అమెరికాలో చెల్లెలి దగ్గరికి పంపిస్తారు అమ్మాయిలు.
అమెరికా చేరిన అమ్మకి ఆరడి లేని తీరిక దొరికుతుంది.
అక్కడే ఒక restaurant తెరిచి వేళ్ళు కుదురుకున్న చెట్టులా నిలబడి కూతుళ్ళకి ఆసరా అవుతుంది. MBA కూడా చదువుతుంది.

అప్పుడే - అప్పటికే చిన్నప్పట్నుంచీ తనకు తెలిసిన వ్యధని ఓ కథ రాసుకుని - ఎప్పటికైనా ఆ కథని సినిమాగా తియ్యాలని కలగంటున్న శ్రీవిద్యకి - "ఇప్పుడు తీర్చుకో నీ కలని" అని వెన్నుదన్నుగా నిల్చుంది అమ్మ.

అమ్మ ఇచ్చిన డబ్బులు, అక్క భర్త బావ చేసిన సహాయం, అమ్మ స్నేహితురాలు దగ్గర చేసిన అప్పుతో మొత్తానికి శ్రీవిద్య సినిమా పూర్తయింది.

సినిమా తీసేటప్పుడు శ్రీవిద్య పడుతున్న కష్టానికి, మంచి సినిమా తియ్యాలన్న ఆ అమ్మాయి తపనకీ, సినిమా తీసేటప్పుడు ఆ సినిమాకి సంబంధించిన సాంకేతిక విషయాల మీద ఆ అమ్మాయికి వున్న పట్టుకీ, ఎలాగైనా సినిమా పూర్తి చెయ్యాలన్న ఆ అమ్మాయి పట్టుదలకీ - సాహో! అన్నారు అమ్మాయితో అని చేసిన వాళ్ళందరూ. సినిమా పూర్తి కావడానికి తమ వంతు సహాయమూ చేశారు.

ఇంతకీ శ్రీవిద్య సినిమా దర్శకత్వం ఎలా చెయ్యాలో ఎలా నేర్చుకుందో తెలుసా? యూట్యూబ్ వీడియోలు చూసి. కెమెరా ఏ angle లో పెట్టాలీ అన్న టెక్నికల్ విషయం దగ్గర్నుంచీ - తను సీన్ తియ్యబోయే గదిలో రంగులు ఎలా ఉండాలీ, ఆ గదిలో వెలిగే బల్బ్ ఎన్ని watts ఉండాలీ అన్న aesthatic detail దాకా ఆ అమ్మాయికి వున్న అవగాహన చాలా impressive గా అనిపించింది. ఈ అమ్మయికి సినిమా అంటే నిజ్జంగా passion - అలా అనడం మాత్రం కాదు fashion. 

సరే! సినిమా తీసేసింది. ఎన్నో దేశ, విదేశాల్లో జరిగే Film Festivals కి పంపించింది. బోల్డన్ని ఎవార్డులు గెలుచుకుంది.

ఎన్ని ఎవార్డులొచ్చినా అవి డబ్బు తెచ్చే రివార్డులు కావు కదా! సినిమా తియ్యడానికి చేసిన అప్పులు తీర్చడానికైనా సినిమాని థియేటర్లలో విడుదల చెయ్యాల్సిందే. అలా విడుదల చెయ్యాలంటే డిస్ట్రిబ్యూటర్లకి ప్రివ్యూ చూపించాలి. అలా చూపించాలంటే ప్రివ్యూ థియేటర్‌కి అద్దె కట్టాలి.

అలాంటప్పుడు శ్రీవిద్య తను తీసిన సినిమాని చూడమని తన Facebook friend అయిన నవదీప్‌ని (చందమామ Fame) పిలిస్తే, ఆ సినిమా చూసిన నవదీప్‌కి ఆ సినిమా ఎంత నచ్చిందంటే - తను కూడా తన వంతు ఎంతో కొంత అంత మంచి సినిమాని విడుదల చెయ్యడానికి సహాయం చెయ్యాలీ అనిపించేంత. వెంటనే తన ప్రివ్యూ థియేటర్లో శ్రీవిద్య ఉచితంగా సినిమా ప్రివ్యూ ఏర్పాటు చేసుకోమని చెప్పాడు. నవదీప్ భలే మంచి ఫ్రెండ్!

ఆ సినిమాని చూసిన దర్శకుడు హరీష్ శంకర్ కూడా సినిమా విడుదలకు ఎలాగైనా సహాయం చెయ్యాలనుకున్నాడు. "నాకు నా అభిమాన హీరో ఫిల్మ్ రిలీజ్ అయితే అదే ఫెస్టివల్. అది కాకుండా ఇన్ని రకాల Film Festivals వుంటాయని శ్రీవిద్య సినిమా కొచ్చిన అవార్డుల వల్లే తెలిసింది" అని చెప్పిన హరీష్ శంకర్ సి-న్సియారిటీ నాకు భలే నచ్చింది.

నవదీప్, హరీష్ శంకర్‌తో పాటు ఈ సినిమా చూసిన మహేష్ కోనేరు ఇప్పుడు ఈ "మధ" సినిమాని మార్చ్ 13 న థియేటర్లలో విడుదల చెయ్యడానికి శ్రీవిద్యకి సహాయం చేస్తున్నాడు.

నాకు శ్రీవిద్య బసవ తీసిన సినిమా "మధ" - ఆ అమ్మాయి రాసుకున్న చిన్న కథ నుంచి ఇప్పుడు థియేటర్ దాకా ఎలా వచ్చిందో విన్న తర్వాత ఇది కదా అసలు చెప్పుకోవాల్సిన కథ! అనిపించింది.

తను కష్టపడి సంపాదించిన ప్రతి పైసా సినిమా మీద పెట్టి శ్రీవిద్య చేత సినిమా తీయించి, సినిమా విడుదల కాక డబ్బు రాదేమో అని అనుకుంటున్న శ్రీవిద్యకి "మహా అయితే ఏమవుతుంది… మళ్ళీ జీరో దగ్గర మొదలెడదాం" అని చెప్పిన అమ్మ ఇందిర బసవ కోసం ఈ సినిమా చూడాలని వుంది.

ఈ సినిమా ఒక psychological thriller అట. కథ నాకు తెలియదు కానీ కచ్చితంగా కొన్ని విషయాలు మాత్రం తెలుసు.

ఇందులో ...
punచులూ- ప్రాసలతో మాటలుండవ్.
మంచుకొండల్లో పాటలుండవ్.
తన్ని ఏడిపించి నవ్వించాలనుకునే కామెడీ సీన్లుండవ్.
తన్నుకుంటూ ఊళ్ళో నుంచి కొండల దాకా వెళ్ళిపోయే ఫైటింగులుండవ్.

ఇదెందుకు చూడాలీ అంటే...
ఆరేళ్ళ క్రితం పుట్టిన కథ
మూడేళ్ళ క్రితం short film గా మొదలయి feature film గా ఎదిగిన చిత్రకథ
ముప్పై Film Festivals లో ప్రదర్శింపబడి ఇరవై ఆరు ఎవార్డులు గెలుచుకుని, మూడిట్లో finalist అయిన ఓ సినిమా కథ
ఇది తమిళ్ కాదు, మలయాళం కాదు, బెంగాలీ కాదు...
మార్చ్ 13న  థియేటర్లలో విడుదలవుతున్న ఓ తెలుగు సినిమా కథ
ఇప్పుడే కాలేజీ విడిచిన పిల్లలా, Passion అన్న మాటకి నిర్వచనంలా కనిపించే శ్రీవిద్య బసవ కన్న కల ఈ కథ

అదే... రచ్చ గెలిచి ఇంటికొచ్చిన  "మధ"
తెలుగు సినిమా చూపఱూ! తప్పక చూడాలి పద...

~ సినీ-మా-లక్ష్మి

29, ఫిబ్రవరి 2020, శనివారం

ఇల why కంటి ఫిలుమురో!

ప్రతీవారం గురువారపు సాయంత్రం వారాంతపు కాలక్షేపానికి సినిమాలు వెతుక్కుంటాం.

ఒకటి కాపోతే ఇంకోటి - ఏదో OTT అనుకుంటూ - అమెజాన్ ప్రైమూ, నెట్‌ఫ్లిక్సూ - మార్చిమార్చి చూస్తూ - ఆ రెండిట్లో వున్న అన్ని భాషల సినిమాలూ ఏంటా అనుకుంటూ - అందులో అప్పటికే చూసినవాటిని గుర్తుపట్టి, దాటుకుంటూ వెళ్తూ - చూడని వాటి preview చూసి నచ్చితే ఎంచుకుంటూ, నచ్చకపోతే విడుచుకుంటూ - మొత్తానికి ఒక అరగంట సమయం సినిమా-అన్వేషణార్పణం.

ఈ వారపు గురువారం అందుకు మినహాయింపేమీ కాదు. సాయంకాలం కాగానే - ఇల సెయింట్ లూయిస్ పురములో - మా లివింగు రూమాంతర స్థిత సోఫా మీదుండి - నా మేలి-సగం బదరి - ఎక్కడో వంటింట కూనిరాగాలు తీసుకుంటూ కూరగాయలు తరుక్కుంటున్న నన్ను "నీకో surprise చూపిస్తా ఓ సారిలా రా!" అనగానే ఏంటా అని ఓ అడుగు అటేశా!

"ఇక్కడే వుండు చూపిస్తా!" అని తను రిమోట్ మీటలు నొక్కుతుండగానే నాకుప్పందిపోయింది.

"ఏంటీ? అల వైకుంఠ పురములో అప్పుడే Netflix లోకొచ్చేసిందా?" అనడిగా.

"ఆ! అదే! వచ్చేసిందప్పుడే!" అంటూ ఆ సినిమా చూపించారు బదరి.

అది చూడగానే కనుగొంటి కనుగొంటి కొత్త సిన్మానిటు కనుగొంటి అని పాడేస్కున్నాం. పాడేస్కుని ఈ సిన్మా రేపు శుక్రవారమే చూసేద్దాం అనేస్కున్నాం. అనేస్కున్నట్టుగానే చూసేశాం కూడా.

కానీ... ఆ OTT లో - అల వైకుంఠపురములో - మేమేం కంటిమో, ఏం కంటిమని అనుకుంటిమో, ఏమనుకొంటిమని అందామనుకొంటిమో - ఏమందామనుకొంటిమో - ఏమనుటకూ మాటలు దొరకక కటకటలాడితిమి.

సినిమా మొదట్లో పెద్దైన పిల్లల్లో - పెద్ద ఇంట్లో కనబడ్డ అల్లువారి వారసుణ్ణి చూసి, మళ్ళీ అదే అల్లువారి అబ్బాయిని పేద ఇంట్లో చూసి - "ఇదేంటి? ఇద్దరూ ఒక్కరుగానే కనిపిస్తున్నారు?" - అని ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం సినిమా చూస్తున్న మేమిద్దరం.

ఇంకొన్ని నిముషాలు గడిచాక, కథ ఇంకొంచెం ముందుకు నడిచాక - అది అల్లువారి వారసుడే అసలు వారసుడని చెప్పీ చెప్పక చెప్తున్న త్రివిక్ర-మాయ అని అర్థమయ్యింది.

అప్పటికే - అస్సలు బుఱ్ఱ వేడెక్కకుండా ఉండాలంటే అది వాడకుండా సినిమాలు చూడాలని బాగా తెల్సిన మేము - ఎవరిది వాళ్ళం వాడకుండానే చూస్తున్నా కూడా, వేడెక్కకుండానే మాడి వాడిపోయిందని అర్థమయ్యింది.

ఇక అక్కణ్ణించి కళ్ళప్పగించి చూస్తూనే వున్నా - అర్థం అయిన విశేషాల కన్నా అర్థం కానీ విషయాలే ఎక్కువ.


తన కాళ్ళ మీదే దృష్టి పెట్టిన హీరో ఉద్యోగానికి ఉద్వాసన చెప్పి బయటికి పంపక అతని కంటిచూపుకి శిక్షగా ఓ సారి ఒంటిని మండించే ఎడారికి, ఇంకోసారి ఒంటిని ఒణికించే మంచుకొండలకి పంపించడమేమిటో?

పొట్టిపొట్టి గౌన్లేసుకున్న హీరోయిన్ కాళ్ళను పట్టుకు వదలనన్న హీరో కళ్ళు పారిస్ ఎందుకెళ్ళాయో, అక్కణ్ణుంచి తిరిగి ఇండియా ఎప్పుడొచ్చాయో ... ?

వస్తూనే కంపెనీ తనకమ్మమని హీరోయిన్ని విసిగిస్తున్న బ్రహ్మాజీ పక్కన అందరూ సూట్లేసుకున్న ఫ్రెంచ్ వాళ్ళు ఎందుకున్నారో? వాళ్ళని హీరో కొడుతుంటే ఎందుకు కొట్టించుకున్నారో?

అర్జున్ రెడ్డితో పక్కన కనిపించినప్పుడు "ఎవరబ్బా ఈ అబ్బాయి భలే చేశాడు?!" అని వెతుక్కుని మరీ కనుక్కున్న రాహుల్ రామకృష్ణన్‌ని ఇందులో చూసినప్పుడు ఆ భలే-factor లేనట్లనిపించిందేంటో?

మురళీశర్మ కనిపించిన ప్రతీసారీ చిరాగ్గా అనిపించడం - అతను ఆ పాత్రలో జీవించడం కాదూ - అసలా పాత్రలో కనిపించడమే అని అనిపించిందేంటో?

వైకుంఠపురం అని పేరు బడ్డ, పేరు పెట్టబడ్డ ఇంటిలోకి - ఆ ఇంట్లో వున్న తన తండ్రికి తను ఆసరాగా ఉందామని హీరో వచ్చేటప్పుడు నేపథ్యంలో వినిపించిన పోతనగారి "అల వైకుంఠపురములో..." పద్యం అసందర్భంగా వినిపించిందేంటో?

"రాములో రాములా..." పాటలో తలపాగా పెట్టుకుని హఠాత్తుగా కనిపించిన బ్రహ్మానందాన్ని చూసిన ఆనందం ఎవరిదో? ఎందుకో?

బన్నీ చేసిన డాన్సులు, బన్నీ చేసిన ఫైటులు, బన్నీ పాడిన పాటలు, బన్నీ వాడిన మాటలు - సినిమా అంతా బన్నీ-మయం. ఈ సీను చూసినా ఏమున్నది తారాగణం...? సినిమా సమస్తం బన్నీ-గాథ-పారాయణత్వం.

ఈ బన్నీ అనబడే అల్లువారి వారసుడు - నటనా, నాట్యం, ఫైటూ- అన్నీ  బాగానే చేస్తాడు కానీ ఎవరైనా పొగుడుతున్నప్పుడు మాత్రం కృతజ్ఞత చూపబోయేటప్పుడు రాబోయే తుమ్ముని ఆపుకుంటున్నట్టు కనబడతాడు. యూట్యూబ్ వీడియోల్లో చూడొచ్చు.

ఈ సినిమాలో ఎందుకు చేశాడ్రా అనిపించింది మాత్రం - అజయ్! ఒకప్పటి రాజమౌళి-విక్రమార్కుడి-ప్రతినాయకుడు ఇందులో ఒక్క దెబ్బకే చెత్తకుండీలో పడిపోవడం, కనిపించిన ప్రతి సీనులో దెబ్బలు తినడం అస్సలు బాలేదు.

ఎంతో చదువుకుని - ఒక కంపెనీని సమర్థవంతంగా, విజయవంతంగా నడుపుతున్న ఒక అమ్మాయి - అప్పటికే తన కాళ్ళని పట్టుకు వదలని కళ్ళు గల అబ్బాయిని ఇష్టపడుతూ కూడా - తండ్రి చెప్పగానే నోరెత్తకుండా ఇంకో డబ్బున్న అబ్బాయి చేత ఎడం చేతి వేలికి ఉంగరం పెట్టించుకోవడమేమిటో? దానికోసం కట్టుకున్న సగం-సగం చీర కట్టేమిటో?

ఆ ఉంగరం తొడిగిన అబధ్ధపు వారసుణ్ణి ప్రేమించిన మేనకోడలు అసలు-వారసుడు అల్లువారి వారసుడు కనపడగానే అతని వెంట కూడా పడడమేమిటో?

అసలు మాట్లాడుకోవడం మానేసిన తన అసలు తల్లిదండ్రుల మాట్లాడుకోకపోవడానికి కారణం తన తండ్రి దగ్గర ఒకప్పుడు పనిచేసిన స్టెనో రేవతి అని హీరోకి ఎవరు చెప్పారో? వాళ్ళ తాతా? ఎప్పుడూ? ఎక్కడా? ఎందుకూ? ఎలా?

అందరూ లాప్‌టాపులు పట్టుకు తిరుగుతుంటే సునీల్ iMac monitor పట్టుకు తిరగడం హాస్యమా?

వెన్నెల కిషోర్‌ని చూస్తే నవ్వు రాలేదెందుకో?

టబూకి నువ్వే కొడుకువని చెప్తానంటే "వద్దూ...నాకు నన్ను పెంచిన అమ్మే ఇష్టం" అని చెప్పిన హీరో అసలు సినిమా సెకండాఫ్‌ మొదలయిందగ్గర్నుంచీ అమ్మ మాటే లేకుండా, అమ్మ-రోహిణి దగ్గరికి వెళ్లకుండా, సినిమా చివర్లో హీరోయిన్నుతో హెలికాఫ్టరు ఎక్కెళ్ళిపోవడం ఏంటో?

సరే! ఇంత గొప్ప సినిమా ఎలాగూ అర్థం కాలేదు. IQ బొత్తిగా ఇంకిపోయినట్లుంది అని నాకు నేనే బాధ పడిపోతున్న నేను యూట్యూబులో అనుకోకుండా త్రివిక్రముల వారు సరదాగా అన్న "మనసుకి దురద పుడితే గోక్కునే దువ్వెన సంగీతం" అన్న caption వున్న వీడియో కనబడితే - ఆ caption లో వున్న భాషని భరించలేక, భావాన్ని అర్థం చేసుకునే స్థాయి లేక - ఓ దండమెట్టి - చూడక - ఊరుకున్నా!

అన్నట్టూ... పాట రాసేటప్పుడు బన్నీని ఊహించుకుంటూ - హీరోయిన్ను కాళ్ళని పట్టుకుని వదలని బన్నీ కళ్ళ గురించి - రాసిన తాతగారు ఆ పాట రాసేటప్పుడు తన మనవరాలి కాళ్ళను ఊహించుకోవడమేమిటో? అప్పుడు మరి ఆయన సినిమాలో సన్నివేశానికి తగినట్లు రాసినట్లా? రాయనట్లా?

మొత్తానికి... ఈ సినిమా చూసిన నాకనిపించిందేంటంటే...

అల వైకుంఠపురములో... 
ఇల why నే కంటి ఈ ఫిలుమురో!
తెలివైన నిర్మాతరో ... 
నెల కాగానే OTT కమ్మెరో! 

~ సినీ-మా-లక్ష్మి


ఓ సరదా కబురు:

ఇవాళ ఫిబ్రవరి 29. Leap Day!
మా అపర్ణ నుంచి ఒక Whatsapp message కనిపించింది. 
If today is leap day, what day was yesterday? అని.
దానికి సమాధానం కూడా తనే చెప్పింది : Look day - అని :)
భలే punny గా, funny గా అనిపించింది నాకు...


24, ఫిబ్రవరి 2020, సోమవారం

చిక్కీ చిక్కనంది పాట ఆచూకీ...

హాయైన పాట ఇట్టే చిక్కుతుంది
చిక్కిన పాట చక్కగా పట్టుబడుతుంది
పట్టుబడ్డ పాట పెదవుల మీద ఆడుతుంటుంది 
నే నీతోనే ఉంటానంటుంది 

అల్లరి పాట చిక్కనంటే చిక్కనంటుంది 
చిక్కనన్న పాట ముసిరి ముసిరి మురిపిస్తుంది 
మురిపించే పాట సడిగానే మిగిలి అలజడి రేపుతుంది 
నేనెక్కడున్నానో కనుక్కోమంటుంది 

మాయైన పాట చిక్కీ చిక్కనట్టుంటుంది 
చిక్కీచిక్కని పాట చేరీ చేరనట్టుంటుంది 
చేరకున్న పాట మదికి చేరువనే ఉన్నట్టుంటుంది 
నే పరిగెడతా పట్టుకోమంటుంది

-----------------------------------------------------------------------------------------------------


కొన్ని రోజుల క్రితం - సరిగ్గా చెప్పాలంటే ఫిబ్రవరి 3వ తారీఖున - మా సెయింట్ లూయిస్ సాహితీ సంఘంలో సభ్యులైన అమృతరెడ్డి గారు నాకొక పాట Whatsapp లో పంపించి, పంచి  "ఈ పాట ఎందులోదో మీకు తెలుసా?" అని అడిగారు.


ఆ పాట వీడియోలో ఘంటసాల వారి బొమ్మా, ఆ పక్కనే "ఈ రోజు పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఘంటసాల గారి హుషారయిన పాట" అన్న మాటలున్నాయి.

అంత కన్నా అందులో ఇంకేమీ వివరాలు లేవు. నాకు ఆ పాట ఎందులోదో తెలీలేదు. కానీ అమృతరెడ్డి గారికి ఆ మాట చెప్పాలనిపించలేదు.

అది పాట. అందులోనూ తేట తెలుగు పాట. మళ్ళీ అందులో ఘంటసాల వారి తేనెలూరు తేట తెలుగు పాట.

ఆ పాట గురించి నాకు ఇప్పటికి తెలియకపోతే పోన్లే, నేను ఎప్పటికీ తెలుసుకోలేకపోతే నే పాడి, పాడి - సాధించి తెచ్చుకున్న పేరు "పాటల భైరవి" నిలిచేనా? 

అంతే! అమృతరెడ్డి గారికి చాలా simple గా - "నేను కనుక్కుని చెప్తానండి" అని చెప్పానే తప్ప "నాకు తెలీదండి" అన్న మాటే అనలేదు.

పాట పడతానని, కనిపెడతానని అనేశానా?! 

అలా అన్న వెంటనే - అండగా - గూగులుండగా - అందులో వెతికే వీలుండగా - ఇంతోటి పాటను పట్టకపోదునా... ఆ... ఆ... ఆ... అని నాలో నేనే పాడుకుంటూ, పదాలల్లుకుంటూ - ఆ పాటలో పదాలు పట్టుకుని గూగుల్లో ఎంత వెతికినా ఎక్కడా దొరకదే!

రెండ్రోజులు... మూడ్రోజులు.... దొర్లాయి.
ఒకటో వారం వజ్రం ... రెండో వారం రత్నం ... గడిచాయి.
ముత్యం మూడో వారం ముగియబోతోంది.
నిన్నటికి అంటే ఫిబ్రవరి 23కి పాట నా చెవిలో ఇల్లు కట్టుకుని ఇరవయి సరిగ్గా ఇరవై రోజులు.

ఎంత తుంటరిదీ పాట! హన్నా! అందినట్టే అంది అందీ అందక ఊరిస్తోంది! ఈ రోజు ఎలాగైనా పట్టుకోవాలి అనుకుని నిన్న సాయంత్రం పాట వింటూ రాసేసుకున్నా.

రాశానే కానీ ఎన్ని రకాలుగా వెతికినా చిక్కలేదు పాట ఆచూకీ.

ఇంకిలా కాదు - పాటని యూట్యూబ్‌లో పోస్ట్ చేసి ఆ లింక్ నా బ్లాగులో పెడితే చూసిన ఎవరైనా చెప్పకపోతారా అనుకుని యూట్యూబ్‌లో upload చేయబోతే దాని మీద Copyright restriction కనిపించింది. దానికి reference గా "Asharali Ravu" అనే టైటిల్‌తో ఒక వీడియో కనిపించింది. వెంటనే upload చేయడం మానేసి అప్పటికే వున్న యూట్యూబ్ వీడియో కోసం వెతికితే నే వెతుకుతున్న పాట "సంతానం" సినిమా లోది అని తెలిసింది. "అక్షరాలే రావు నాకు..." అని మొదలయ్యే ఈ పాటని "Asharali Ravu" అని చూపెట్టింది యూట్యూబ్. అదీ సంగతి!

సంతానం - చిన్నప్పుడెప్పడో ఒకసారి, ఆ తర్వాత అపురూపంగా ఇండియన్ స్టోర్‌లో అపురూపంగా దొరికిన వీడియో కేసెట్లలో ఒకసారి - మొత్తం రెండుసార్లు చూశాను కానీ - ఈ పాట ఎప్పుడూ చూసిన, విన్న గుర్తు లేనే లేదు.

మళ్ళీ నిన్న సాయంత్రం కూర్చుని యూట్యూబ్లో వున్న సంతానం సినిమావి అన్ని వీడియోలు చూశాను. ప్చ్! ఎక్కడా ఈ పాట కనపడలేదు. 

కాకపోతే గూగుల్లో కనిపించిన సంతానం సినిమా పాటల ఆల్బమ్‌లో ఈ పాట list చేసి వుంది. పైగా సంతానం సినిమాలో కథానాయిక పేరు "శారద" (సావిత్రి నటించిన పాత్ర). ఈ పాటలో ఒక చోట "శారద గారి - ఒక్క చీర కేడొందలు" అని వస్తుంది. ఈ రెండు పలుకు-జాడలని బట్టి ఈ పాట సంతానం సినిమాలోదే అని అనేసుకున్నా.

ఈ పాటలో వచ్చిన కొన్ని మాటలు -

అనామతు - చిట్టాకు చేరని పద్దు
మారిస్ కారు - Morris car
సాదర్ - చిల్లర ఖర్చు
పార్కర్ పేనా - Parker Pen 
 - ల్లాంటివి నాకు భలేగా నచ్చాయి.

ఈ పాటని ఘంటసాల వారు పాడారు.
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి గారిది.
రాసిన వారు - అనిసెట్టి, పినిసెట్టి - గార్లు.







అక్షరాలే రావు నాకు...అంకెలేమొస్తాయిలే?!
ఆత్మరాముడు...  లెక్కలంటే అడలుకొని చస్తాడులే!

ఈ చిట్టా అనామతు - అంతా చిత్తులే!
పేరు కైన జమ లేదే... పేజి నిండా ఖర్చులే

ఖర్చులే... జమ లేదే - ఖర్చులే... అన్నీ  ఖర్చులే!
అమ్మబాబో... అంకెలంటే - ఎంత డబ్బో ! తస్సదియ్యా!

అయ్యగారి పెద్ద కారు - నెట్టేవారి కైన ఫీజు
అమ్మగారు కాలేజీలో - కట్టిన ఫైను
మాస్టరు గారు - వాడుకున్న సాదర్
అన్నీ కూడినా - వెయ్యీ చిల్లరే!

ఖర్చులే... జమ లేదే - ఖర్చులే... అన్నీ  ఖర్చులే!
అమ్మబాబో... అంకెలంటే - ఎంత డబ్బో ! తస్సదియ్యా!

మాస్టరు గారి - మూడు సూట్లు ఆరొందలు
శారద గారి - ఒక్క చీర కేడొందలు
రోలెక్స్ వాచీ - పార్కర్ పేనా - పాట కచేరీ - నాటకాలకు
చిల్లర మల్లర - సినిమా ఖర్చు
కాలికి జోడు - కంటికి జోడు
మారిస్ కారు - బీచి షికారు
మారిస్ కారు - బీచి షికారు

ఖర్చులే... జమ లేదే - ఖర్చులే... అన్నీ  ఖర్చులే!
అమ్మబాబో... అంకెలంటే - ఎంత డబ్బో ! తస్సదియ్యా!

అయ్యగారి బ్లేడులకు - అమ్మగారి సోకులకు
అందరి మందులకు - డాక్టరు బిల్లో
ఇవ్వని చందాలు - రాసిన పద్దులు
అన్నీ కూడినా - వెయ్యీ చిల్లరే!

ఖర్చులే... జమ లేదే - ఖర్చులే... అన్నీ  ఖర్చులే!
అమ్మబాబో... అంకెలంటే - ఎంత డబ్బో ! తస్సదియ్యా!

వన్...  టూ...  త్రీ... ఫోర్...  బారా...  తేరా...  రా!
ఒకటీ ... రెండూ...  మూడూ...  నాల్గూ... సున్నా... సున్నా... రా!
సున్నా... సున్నా - సున్నా... సున్నా
సున్నా... సున్నా - ఇంతేనన్నా!


మొత్తానికి చిక్కదనుకున్న పాట చిక్కింది కానీ - చిక్కినట్టే  చెవికి మాత్రం చిక్కి, కంటికి అందక తప్పించుకుంది.

అందుకే...
ఇది హాయిదైనా ఓ మాయైన పాట ...
ఈ మాయ పాటని హాయిగా పాడుకోండి
మీకెక్కడైనా పాట-ఆట ఆచూకీ అందితే
నాకొచ్చి చెప్పడం మర్చిపోకండేం!

~పాటల భైరవి


19, ఫిబ్రవరి 2020, బుధవారం

త్వామనురజామి - 44 - ఆనాటి ఆ హాయీ ...బోల్డంత నిజమోయీ...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 43 - వింటా నీ మాట... విన్నానంటే ...

బెంగుళూరుకి తిరిగి వస్తూ నాతో తెచ్చుకున్నవేంటంటే గుంటూరు డాక్టరు కోసిన నా ముక్కు నొప్పీ - ఆ నొప్పి తగ్గడానికి వేసుకునే పెయిన్ కిల్లర్సూ, ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల వచ్చేసే drowsineస్సూ.

ఆ కోసిన-వేసుకున్న-వచ్చేసిన మూడిటి తోడుగా పొద్దున్నే జోగుతూ బస్సెక్కే నేను మళ్ళీ సాయంత్రం తూగుతూ ఇంటికి వచ్చేదాన్ని.

ఆఫీసులో కూడా పని నెమ్మ....దిగా సాగుతోంది. కృష్ణన్ గారు వేయిస్తున్న లెక్కలూ పూర్తవబోతున్నాయి. వాటన్నిటినీ బొత్తి కట్టి రిపోర్ట్ పుస్తకం కుట్టాల్సిన సమయమాసన్నమైంది - దానికోసం నాకున్న సమయమూ సన్నమైంది - నేను చేసే పని నెమ్మదవడం వల్ల. 


బెంగుళూరు రాగానే తెల్సిన ఇంకో విషయం ఏంటంటే ఫిబ్రవరి 10 న ప్రసాద్-అరుణల పెళ్ళికి ముహూర్తం పెట్టారని, ఇంకొన్ని రోజుల్లో శ్రీను, శ్యామల కలిసి పెళ్ళికి అనాతవరం వెళ్ళబోతున్నారని.

నాకేమో అప్పుడే సరిగ్గా నా ప్రాజెక్ట్ వర్క్ ఫైనల్ రిపోర్ట్ పూర్తి చేయాల్సిన పని  వుంది. ఫిబ్రవరి ఆఖరి వారంలో తిరుపతి వెళ్ళాలి కూడా - మాకు యూనివర్సిటీలో viva voce కి రమ్మని చెప్పారు.

మరిప్పుడు శ్రీను వాళ్ళు అనాతవరం వెళ్తే నేనెక్కడ ఉండాలీ అనుకుంటూ ఉంటే - శ్రీను ఓ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే తను సాగితో మాట్లాడినట్టూ, నేను ఓ నెల రోజులు నా ప్రాజెక్ట్ వర్క్ అయ్యేదాకా సాగి వాళ్ళింట్లో ఉండేటట్లు plan చేసినట్టూ చెప్పాడు.

అది వినగానే బోల్డు happy గా అనిపించింది. అంతకు ముందు New year's eve కి కలిసినప్పుడే నాకు ఇందిర తెగ నచ్చేశారు. సాగి అయితే సరేసరి. (సాగి అసలు పేరు - సాగి కృష్ణప్రసాద్. కానీ తనని సాగి అని పిలవడమే అలవాటు) - అప్పుడెప్పుడో డిగ్రీలో మొదటిసారి బెంగుళూరు వచ్చినప్పట్నుంచి తను నాకు శ్రీను లాగే ఇష్టమైపోయారు. నాకిష్టులైన సాగి-ఇందిరల దగ్గర ఒక నెల వుండబోతున్నానని నా ఆనందం.

ఈలోగా ఏమయ్యిందంటే ఓ శనివారం మధ్యాహ్నం అపర్ణ నన్ను వెతుక్కుంటూ శ్రీను వాళ్ళింటికి వచ్చింది. నేనెక్కడున్నా అపర్ణకి ఉత్తరాలు రాస్తూ ఉండేదాన్ని - బోల్డన్ని కబుర్లతో, కబుర్ల మధ్య పాటలతో. అలా ఉత్తరాలు రాయడం వల్ల తనకి ఎప్పటికప్పుడు నేనెక్కడున్నానో తెలుస్తూనే ఉండేది. అపర్ణ వాళ్ళ పెదనాన్నగారు విజయనగర్ లోనే వుండేవాళ్ళు. ఆయన్ని చూడడానికి వచ్చి నేనూ REMCO layout లో శ్రీను వాళ్ళింట్లో వున్నానని గుర్తొచ్చి అడ్రెస్ వెతుక్కుంటూ వచ్చింది. తనలా రావడం నాకు భలే pleasant surprise! అప్పటికి అపర్ణ IMRB లో ఉద్యోగం చేస్తూ వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఉండేది.

శ్రీనుకి కూడా అపర్ణ తెలుసు. తను బెంగుళూరు నుంచి గుంటూరు వచ్చినప్పుడల్లా నా మాటల నిండా అపర్ణ విశేషాలే ఉండేవి మరి! అపర్ణ వచ్చి కాసేపు అందరితో కబుర్లు చెప్పి సాయంత్రం అయేటప్పటికి వెళ్ళొస్తానని చెప్పి బయల్దేరింది. నేను తనని విజయనగర్ బస్టాపులో బస్సెక్కించి వస్తానని చెప్పి తనతో పాటే వెళ్ళాను.

అలా వెళ్తూ మాట్లాడుకుంటూ ఉన్నపుడు నేను అపర్ణతో - తనని తిరుపతిలో MCA చేసినన్నాళ్ళూ ఎంత మిస్ అయ్యానో చెప్తూ, నేను కూడా తనతో పాటు మైసూర్ SJC లో చదివుంటే ఎంత బావుండేదో అని బోల్డంత longing గా మాట్లాడాను. అప్పుడే మా ఇద్దరికీ ఒకసారి మైసూర్ వెళ్ళొద్దామనిపించింది. వచ్చే రెండు వారాల్లో వెళ్దామని అనేసుకున్నాం కూడా. అప్పుడే అపర్ణకి బదరి కూడా బెంగుళూరు వచ్చారని చెప్పాను. అలా కబుర్లు చెప్తూ ఉండగానే తనెక్కాల్సిన బస్ వచ్చింది. తనలా వెళ్ళగానే నేను ఇంటికి వచ్చేశాను.

అనుకున్నట్టుగానే శ్రీను, శ్యామల అనాతవరం వెళ్ళారు. నేనూ, నా సూట్కేసూ, పుస్తకాలూ సాగి వాళ్ళింటికి చేరాము.

సాగి వాళ్ళ ఇల్లు first floor లో ఉండేది. వాళ్ళ ఇంట్లో రోడ్ వైపు కిటికీ వుండే బెడ్‌రూం నాకు ఇచ్చారు.

అక్కడొక మంచం - మంచం ఎదురుగుండా ఓ పెద్ద కిటికీ - ఆ కిటికీ మీదుగా ఓ సన్నజాజి తీగ - ఆ కిటికీ లోంచి కనబడే - కాసే ఎండా, కురిసే వానా, పెరిగి -తరిగే, తరిగి-పెరిగే చంద్రుడు, మెరిసే వెన్నెల, విరిసే పువ్వులు, ఇవన్నీ ఉన్నప్పుడు మురిసిపోతూ, ఇవేవీ లేనప్పుడు కూడా మెరిసిపోతూ తొంగి చూసే నీలంరంగు పూసుకున్న ఆకాశం... ఇప్పటికీ నాకా గది గుర్తుకొస్తే ఆనాటి ఆ హాయీ ...బోల్డంత నిజమోయీ...అనే అనిపిస్తుంది.

సాగి వాళ్ళింటికి నేను వెళ్ళగానే ఇందిరకి ఎంత సంబరమో! తను అప్పుడు వాళ్ళింటికి దగ్గర్లోనే ఏదో స్కూల్లో టీచర్‌గా పని చేసేవాళ్ళు. రోజూ పొద్దున్నే నేను ఆఫీసుకి రెడీ అయి వచ్చేటప్పటికి నాకోసం వేడివేడి ఇడ్లీలు, అందులోకి జీలకఱ్ఱ వేసి రుబ్బిన వేరుశనగ పచ్చడి చేసి పెట్టేవారు ఇందిర. ఆఫీస్ కేంటీన్లో తింటాను breakfast అంటే ఒప్పుకునేవారే కాదు. అవి తినేసి హడావిడిగా మారుతీమందిర్ బస్టాప్ దగ్గరికి మెజెస్టిక్ బస్సెక్కడానికి వెళ్ళేదాన్ని. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఏవో ఒక పళ్ళు ఒలిచో, ముక్కలుగా కోసో వుంచి రాగానే తినమనేవారు. అవి తినగానే కాసేపు విజయనగర్ బజార్లో తిరిగొద్దామని సాగి-ఇందిర వాళ్ళతో పాటు నన్నూ తీసుకెళ్ళేవాళ్ళు.

వాళ్ళిద్దరితో కబుర్లు చెప్పుకుంటూ - ఆ చలిచలి సాయంకాలాల్లో canopy ల్లా పరుచుకున్న చెట్లకొమ్మల కిందుగా నడుస్తూ - లైట్ల తోరణాలతో వెలుగుతున్న విజయనగర్ రోడ్లకి అటూఇటూ అమ్మేవాళ్ళు అమర్చిపెట్టిన రంగురంగుల ప్లాస్టిక్ సామాన్లు, తళతళలాడే గాజులు, గాలికి ఊగుతున్న బట్టలు, చిన్నపిల్లల కోసం అమ్మే బుడగలు, బొమ్మలు - ఇవన్నీ చూసుకుంటూ - ఇంట్లోకి మరుసటి రోజుకి కావాల్సిన కూరలూ, పళ్ళూ కొనుక్కుని ఇంటికి వచ్చేటప్పటికి ఎనిమిదిన్నర అయ్యేది. రోజూ ఎవరో ఒకరు సాగితో పాటు BHEL లో పని చేసే colleagues సాగి ఇంటికి వస్తూ వుండేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్తూ భోంచేసేటప్పటికి తొమ్మదిన్నర అయ్యేది.

ప్రతీ సాయంత్రం NAL నుంచి నేను మోసుకొచ్చే బోల్డన్ని కబుర్లు వింటూ - ఇంటికి వచ్చిన ప్రతీ వాళ్లకి మళ్లీ మళ్లీ ఆ కబుర్లు తిరిగి చెప్తూ - లలిత ఒక అల్లరి prankster - అని సాగి చెప్పడం, సాగి చెప్తుంటే విన్నవే మళ్లీమళ్లీ వింటూ గలగలా ఇందిర నవ్వడం... ఆనాటి ఆ హాయీ ...బోల్డంత నిజమోయీ..

సాగి-ఇందిరలతో నడక సాగుతున్న సాయంకాలాలు సరదాగా వున్నా ఆ చలి-సర్దా కాస్తా శృతి మించి రాగాన పడి నా ముక్కు-సర్దీ (सर्दी) అయ్యింది. దాంతో నా ముక్కుకి రెండు పక్కలా వాచి మొహమంతా నొప్పి, దాంతో తలనొప్పి కూడా వచ్చేసింది. అంతే! ఓ మూడు రోజులు ఆఫీసుకి డుమ్మా!

పొద్దున్నే ఇందిర స్కూలుకి వెళ్ళే ముందు నన్ను లేపి, నేను మొహం కడుక్కుని రాగానే నాకు ఇడ్లీ తినిపించి అప్పుడు కానీ వెళ్ళేవారు కాదు. తను పొద్దున్న వెళ్తే సాయంత్రమే ఇంటికి వచ్చేవారు. ఇందిర వెళ్ళగానే నేను మళ్ళీ పడుకుండి పోయేదాన్న - నొప్పితో, నీరసంతో. సాగి కూడా ఇంటికి బయట నుంచి తాళం వేసేసి ఆఫీసుకి వెళ్ళిపోయేవారు. నేను  అలాగే పడుకుని ఉండేదాన్ని.

సరిగ్గా పదకొండున్నరకి సాగి ఇంటికి వచ్చి - చప్పుడు కాకుండా (మళ్ళీ నేను ఆ చప్పుడుకి లేస్తే తలనొప్పి ఎక్కువవుతుందని) గబగబా వంట చేసేసి - వేడివేడిగా కంచంలో పెట్టి - అప్పుడు నన్ను నిద్ర లేపి "లలితా! లే! అన్నం తిని పడుకో" అని చెప్పి - నాతోనే కూర్చుని కబుర్లు చెప్తూ - "నువ్వు గుంటూరు అమ్మాయివి కదా ...ఇందిర నీకు కారం, కారంగా చేసిపెట్టమంది. అందుకే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి చేశాను  కేరట్ కూర - బావుందా?" అంటూ నేను అన్నం తినేదాకా ఉండి అప్పుడు మళ్ళీ ఆఫీసుకి వెళ్ళేవాళ్ళు. అలా ఓ మూడు రోజుల దాకా లేవలేకపోయాను. నాలుగో రోజుకి మళ్ళీ ఆఫీసుకి వెళ్ళగలిగాను.

సాగి వాళ్ళింటికి ప్రతి సాయంత్రం ఫ్రెండ్స్ వస్తుండేవారని చెప్పాను కదా! అలా ఎవరొచ్చినా నేను జోక్స్ చెప్పాల్సిందే... పాటలు పాడాల్సిందే... అప్పుడు నేను తప్పకుండా పాడే పాటలు రెండు - ఒకటి దేవులపల్లి "ఆకులో ఆకునై", రెండోది జగ్జీత్ సింగ్ గజల్ లాంటి సిన్మా పాట "హోఠోం సే ఛూలో తుమ్...మేరా గీత్ అమర్ కర్ దో" (ప్రేమ్ గీత్ అనే రాజ్ బబ్బర్ సినిమా లోది). నా చేత పాడించి, విని, వినిపించి తెగ మురిసిపోయేవారు సాగి-ఇందిర.

నేను మాట్లాడిన మాట, పాడిన పాట - ఏదైనా సరే - వాళ్ళింటి పసిపాప మొదటి మాట, మొదటి పాట - అన్నంతలా  విని, ఇంటికొచ్చినవాళ్లకి వినిపించి మరీ వాళ్ళిద్దరూ మురిసిపోవడం తలుచుకుంటే... ఆనాటి ఆ హాయీ ...బోల్డంత నిజమోయీ...

రాత్రి పూట పనంతా అయ్యాక - సాగి తన లోకంలో తను పుస్తకం చదువుకుంటూ వుండేవేళ - ఇందిర నా బెడ్‌రూం లో మంచం మీద కూర్చుని - సాగితో తన పెళ్లి చూపులెలా జరిగాయో చెప్తూ  - అక్కణ్ణుంచి Jane Austen నవలల్లో హీరోయిన్ల కథలు చెప్పుకుని - చివరికి తనకిష్టమైన గంజి-పెట్టిన-చుట్టూ-చెంగావి నూలు చీరలదాకా - బోల్డన్ని కబుర్లు చెప్పేవారు. అప్పుడు కలిగిన ఆనాటి ఆ హాయీ ...బోల్డంత నిజమోయీ...

జగ్జీత్ సింగ్ పాడినట్లు... (ఆయన పాటలో ప్యార్ - నా పాటలో దోస్త్ అయింది)

న ఉమ్ర్ కీ సీమా హో
న జన్మ్ కా హో బంధన్
జబ్ దోస్త్ కరే కోయీ
తో దేఖే కేవల్ మన్
 
నా బ్రతుకు-పుస్తకంలో ఒక అపురూపమైన అధ్యాయం సాగి-ఇందిరలతో ఆనాటి ఆ హాయీ ...బోల్డంత నిజమోయీ...

 <<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

12, ఫిబ్రవరి 2020, బుధవారం

పాకోత్సాహము...శాకహృదయము ననుసరించి వండగ...- 1 - నాంది








హలో మున్నమ్మా... !

ఏం చేస్తున్నావు నాన్నా?

ఇంతకీ ఎక్కడున్నావ్?

ఇప్పుడే బస్ దిగి ఇంటికి వెళ్తూ మాట్లాడుతున్నావా?

సర్సరే! ఏం లేదూ...నేను ఊర్కే call చేశాను.

నేను మాట్లాడుతూ వుంటాను...

నీకు కుదిరినంతవరకు మాట్లాడు...

మధ్యాహ్నం ఏం తిన్నావు? ఏంటీ ... ల్యాబ్ దగ్గర డైనింగ్ హాల్లో తినేశావా ఏదో!

అక్కడేముంటుందమ్మా మామూలుగా? బర్గరా?

పోన్లే ... కడుపు నిండా తిన్నావుగా? సాయంత్రం ఏంటీ ప్లాను? నువ్వు వండుకుంటున్నావా... లేకపోతే బయట్నుంచి ఆర్డర్ చేసుకుంటావా?

అవున్రా... నాన్నా! నేను పంపించిన ఆ కర్ణాటక ఉప్మా recipe try చేశావా? ఎలా వచ్చింది? బాగా కుదిరిందా?

అది చదవగానే భలే easy గా అనిపించి నీకు పంపించాను. అందులోనూ నీకు తెల్సు కదా నాకు ఉప్మా అంటే ఎంతిష్టమో! పైగా ఆవిడెవరో చాలా చక్కగా రాసింది - English లో.

నీకు జ్ఞాపకం ఉందిరా? చిన్నప్పుడు నిన్ను బజ్జోపెట్టేటప్పుడు రోజూ కథలు చెప్పేదాన్ని. అప్పుడు పుణ్యకోటి అనే ఆవు కథలో చివర్లో ఆవూ-పులీ కలిసి ఉప్మా చేసుకు తింటాయని చెప్పేదాన్ని.

అసలలా ఎందుకు చెప్పేదాన్నీ అంటే...

అసలేమో... ఆ కథలో ఓ పులి  ఆవుని తినేస్తాను అంటే అప్పుడా ఆవు - దాని పేరే పుణ్యకోటి - 'పులీ, పులీ! నన్నిప్పుడే తినొద్దూ. నేనింటికెళ్ళి నా బుజ్జిదూడకి బొజ్జ నిండా పాలిచ్చి వస్తాను, అప్పుడు తినూ' అని చెప్పి వెళ్తుంది కదా!

చెప్పినట్టే ఇంటికెళ్ళి బుజ్జిదూడకి పాలు పట్టి, దానికేమో అమ్మ లేనప్పుడు అల్లరి చెయ్యొద్దని చెప్పి, చుట్టూ వున్న ఆవు-ఆంటీలకి దూడని ముందుకొస్తే పొడవొద్దని, వెనక్కొస్తే కాళ్ళతో తన్నొద్దని, ఆకలేస్తే వాళ్ళ పిల్లలతో పాటు పాలు పట్టమని చెప్పి - మళ్ళీ పులి దగ్గరికి తిరిగొస్తుంది. నీగ్గుర్తొచ్చిందా  ఆ కథా?

అలా ఆవు పులి దగ్గరికి తిరిగొస్తుంది అని నేను చెప్తూ వున్నప్పుడు నా మెడ చుట్టూ చెయ్యి వేసి, ఓ బుల్లి ౘందమామ లాంటి మొహంతో నా కళ్ళలోకి చూస్తూ కథ వింటున్న నువ్వు - ఆ తర్వాత ఏమవుతుందా అన్నట్టు - ఆ ఆవు place లో అమ్మని, దూడ place లో నిన్ను నువ్వు ఊహించుకుంటున్నట్టు - భలే tension గా నీ చేత్తో నా మెడని గట్టిగా పట్టేసుకునేవాడివి.

అలా వచ్చిన పుణ్యకోటిని పులి మెచ్చుకుని తినదు అని నేను చెప్పగానే నీకు ఆ ending బాగానే నచ్చినట్టు అనిపించినా - చివర్లో "మరి పాపం! పులికి ఆకలేస్తోంది కదా! మరి దానికి అన్నం ఎవరు పెడతారు?" అనడిగావు.

మరప్పుడు నేను "అమ్మని... అర్రే! నాకది తట్టలేదే!" - అనేసుకుని "భలే అడిగావురా...నాన్నా! అదే చెప్పబోతున్నా..." అని - అప్పటికప్పుడు ఆ కథని ఇంకొంచెం extend చేసి "ఫుణ్యకోటిని మెచ్చుకుని పులి 'నిన్ను నేను తినను, ఇంటికి వెళ్ళిపో నీ దూడ దగ్గరికి' అంటుంది కదా అప్పుడు పుణ్యకోటి ఎంతో సంతోషించి గబగబా సుభద్రా ఆర్కేడ్‌లో వున్న షాపుకెళ్ళి వెళ్ళి ఉప్మా రవ్వ తెచ్చి, ఉప్మా చేసి పులికి పెడుతుంది. అప్పట్నుంచి పులి, పుణ్యకోటి ఫ్రెండ్స్ అయిపోతాయి" అని పూర్తి చేసేటప్పటికి - అప్పటికే సగం మూత పడ్డ కళ్ళతో కథ వింటున్న నువ్వు నవ్వుకుంటూ హాయిగా బజ్జునేవాడివి.

ఇంతకీ ఆ సుభద్రా ఆర్కేడ్ గుర్తుందా నీకు? మనం కాకినాడలో వున్నప్పుడు భానుగుడి జంక్షన్లో ఉండేది. ఇప్పుడూ వుందేమోలే! అమ్మ-నాన్నగారు ఆక్కడే ఆఫీసులో పని చేసేవాళ్ళం. పొద్దున్నించి సాయంత్రం వరకు నేనూ, సాయంత్రం కాగానే పువ్వులా స్నానం చేయించి, బుల్లి లాగూ-చొక్కా తొడిగి నిన్ను తీసుకొచ్చి నా కప్పజెప్పి - మనిద్దరం ఇంటికొచ్చేస్తే - అప్పట్నుంచి రాత్రి దాకా నాన్నగారు నీకోసం షిఫ్టుల్లో పనిచేసేవాళ్ళం కదా!

అద్దీ ... ఆ సుభద్రా ఆర్కేడే మన పుణ్యకోటి కథలోకి వచ్చేసింది - నా ఉప్మా మీది ఇష్టం మూలంగా.

అసలింతకీ ఇదంతా ఎందుకు మొదలెట్టానంటే బుజ్జిగాడూ! నువ్వెప్పుడూ అడుగుతుంటావు కదా - "అమ్మా! నువ్వు చేసే నీ వంటలు recipes రాసి పెట్టు నా కోసం" - అని.

నిజం చెప్పాలంటే నాన్నగాడూ... "నీ వంటలు" అన్నావు కానీ ... అవేవీ నేను కనిపిట్టినవి కాదు.

నేనెప్పుడూ వంట నేర్చుకోలేదు కూడా! మా నాన్నమ్మ, దొడ్డలు, అమ్మ, అత్తయ్యలు నా కోసం, నాకిష్టమని చేసిపెట్టిన వంటల రుచులు కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకుని , ఆ కూరల్లో, పులుసుల్లో, పచ్చళ్లలో వాళ్ళు ఏమేం ingredients వాడి వుంటారా అని ఒక్కోదాన్ని విడివిడిగా వాసనని బట్టి, రుచిని బట్టి, texture ని బట్టి గుర్తు పట్టి - trial & error method లో ఒక్కో ingredient ని కలుపుతూ, ఇంకోసారి తీసేస్తూ - అలా నేర్చుకున్నానన్నమాట. అందుకని నేను చేసే వంటల recipeలు తప్పకుండా రాసి పెడతాను... దాని కన్నా ముందు selecting the ingreditents that go into that recipe and preparing them to make that recipe is the most important activity.

అంటే ఓ కూర వండే ముందు ఆ కూరకి ముక్కలు ఎలా తరుక్కోవాలీ, తరిగిన ముక్కల్ని ఎలాంటి గిన్నెలో వండాలీ, వండేటప్పుడు ముక్కల్ని ఎలా కలాపాలీ, చారు ఎంత సేపు కాచాలీ, సాంబారులో ఇంగువ ఎప్పుడు వెయ్యాలీ - ఇల్లాంటివి ఎన్నో చిన్నచిన్న విషయాలు ఒక unique textureనీ, taste నీ తీసుకొచ్చి మనం వండే వంటని ఒక experince లాగా, వండిన వంటని మనం ఎవరికోసమైతే వండుతున్నామో వాళ్ళకి ఒక expression of affection లాగా అనిపించేలా చేస్తాయి. దానికి నేను పెట్టుకున్న పేరు శాక-హృదయం. అదేంటీ అని అడుగుతున్నావా? తొందర పడకు మరీ... ఆ శాకహృదయం కథా-కమామీషూ చెప్తాగా...

నీకు నే కనిపెట్టిన శాకహృదయం గురించి నేర్పాలి.

అందుకే ఈ ఉపోద్ఘాతమంతా...

నీకు చెప్తూ నెమరేసుకుంటూ నేనూ, నేను చెప్పేది వింటూ నేర్చుకుంటూ నువ్వూ - మనిద్దరం కలిసి నేర్చుకోబోయే వంటింటి-పాఠాలకి నాందిగా నాదో సిన్మతీ గిద్యం...


పాకోత్సాహము వంటింటికి, వండిన ఇంతికి
పాకము వండినపుడె పుట్టదు, కూరలనా
శాక హృదయము ననుసరించి  వండగ
పాకోత్సాహంబు నాడు గల్గును సిన్మతీ

2, ఫిబ్రవరి 2020, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 3 - ఇల కారుణ్య స్వరంలో... భలే ఎస్పీబీ గళంలో...

ఎన్నెన్నో పాటలు ...
ఆనాటివి   
చిన్నప్పుడు చేరువైన నేస్తాల్లా  
చిరకాలంగా మదిలోనే ఉంటూ
ఎదసడితో పాటు తోడుగా ఉంటాయి
వదలక తాము వెన్నంటి వస్తాయి  

ఇంకొన్ని పాటలు ...  
ఈనాటివి   
కొత్తగా దొరికిన స్నేహాల్లా
కలకాలం నీతో ఉంటామంటూ
పెదవుల మీద ఆడుతూ ఉంటాయి
వలదని తమ్ముల వారించకంటాయి

ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎన్నో ఏళ్ళుగా నిలకడగా వున్న పాట... ఆ-పాత-మధురం
ఈనాటి నుంచి ఇక ముందు కూడా కొన సాగబోతోంది మరి... ఈ పాట పదిలం

నాడు-నేడు-రేపటి దారుల కలిపే పాట తోడుగా
సరి సరి పద పద అంటూ నడిచే బాటసారిగా
నే మోసుకెళ్ళే
ఈ... గీతం...సంగీతం...
సతతహరితం...

********************************************************************
********************************************************************

ఈ మధ్య మా సరి లేని ఇల-సెయింట్ లూయిస్-పురంలో థియేటర్లకి వచ్చీ మేము చూడని సినిమాలు ముఖ్యంగా రెండున్నాయి.

ఒకటి "సరి లేరు నీకెవ్వరు". రెండోది "అల వైకుంఠపురములో".

మొదటిది చూడకపోవడానికి కారణం ఏంటంటే - అప్పుడెప్పుడో ఫట్టుమని తగిలిన అదే సరి లేని దర్శకుడి F2 దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేక గుక్కపట్టున్నాం మరి!

రెండోది చూడకపోవడానికి పెద్దగా కారణాల్లేవు కానీ - రానూ పోనూ ఓ గంట ప్రయాణం చేసి మరీ చూడాల్సిన అవసరం ఏముందిలే అనిన్నీ, మా ఇంటి రెండు టిక్కెట్లు చేర్చకపోతే లెక్కకు తక్కువ కాని గొప్ప బడ్జెట్ సినిమా అనిన్నిన్నీ, ఎప్పుడోకప్పుడు ఏ OTT లోనో వస్తే చూద్దామనిన్నిన్నిన్నీ - అనేసుకుని అల వైకుంఠపురము పక్కకెళ్ళకున్నాం.

సినిమాలైతే చూళ్ళేదు కానీ పాటలు మాత్రం వింటూనే వున్నాను. నే విన్న వాటిల్లో "సామజవరగమనా" పాట మొదట నచ్చకపోయినా వినగ-వినగ వీనులకలవాటయ్యింది. దీన్ని రాసింది సిరివెన్నెల వారైతే... సంగీతపు వన్నెలద్దింది థమన్నులవారు. 

ఆ పాట వింటున్నంత సేపూ నాకొకటే అనిపించింది - సుతిమెత్తని హిందోళంతో కూడా నెత్తి మీద మొట్టినంత పని చేసి -  ఆందోళన పుట్టించొచ్చని.

ఆ పాట రాసినవారి సహాయకులో, రాసిన పాటకి రాగం కట్టినవారి సహాయకులో - తెలుగు వచ్చినవారు ఎవరైనా - ఓ పావుగంట ఆ పాడబోయే పిల్లాణ్ణి పక్కన కూర్చోపెట్టుకుని -

"బాబూ! 
ఈ పాటలో కళ్ళున్నాయి. 
కాళ్ళున్నాయి. 
కళ్ళు చూస్తాయి. 
కాళ్ళు నడుస్తాయి. 
ఈ పాట పాడేటప్పుడు అమ్మాయిని మనవిని వినుమని బ్రతిమాలుతున్నట్లో, బుజ్జగిస్తున్నట్లో ఉండాలే తప్ప బెదిరిస్తున్నట్లో, అదిలిస్తున్నట్లో అరుస్తున్నట్లుండకూడదు. 
అమ్మాయిని మా తెలుగులో "భామ" అంటామూ... 
"భా" కి ఆ ఒత్తే లేకపోతే అది నానీ కీ యాద్ ఆగయీ అన్నట్లమాట."

- అని పాయింట్లు-పాయింట్లుగా ప్రయివేటు చెప్పుంటే - పాపం!  ఆ అబ్బాయి - అర్థం చేసుకుని అంత గొంతు చించుకు పాడేవాడు కాదేమో! లేకపోతే ఏ సెల్ ఫోన్ చూసుకుంటూ నడిచే అమ్మాయో ఉందనుకుంటే, ఆ అమ్మాయి చెవులను చేరాలంటే ఆ మాత్రం అరిచే పాడాలేమో! ఆ పాట అలా ఉండడమే రైటేమో!

ఎంతైనా పదిమందీ విని మెచ్చింతర్వాత పదికాలాలుండాల్సిన పాట ... భాష తెలియకపోయినా సంగీతజ్ఞానంతో పాడదామని ప్రయత్నించే పరభాషా-గాయకులకు ఆ మాత్రం ప్రయివేటు చెప్పి పాట పాడిస్తే -అది భాష పరువునీ, పాట బరువునీ పెంచుతుంది - వినేవాళ్ళ పాట్లని తుంచుతుంది.

ముదితలే కాదు ... మనుజుల్ నేర్వగరాని విద్యగలదే - ముద్దార నేర్పించినన్! (చిలకమర్తి వారి మాట మార్చి వాడుకున్నా!).


సరే! పాటకి కట్టిన సంగీతం పక్కన పెడితే పాటలో మాటలు అర్థం కావడానికి నేను పదిసార్లు వినాల్సి వచ్చింది. అప్పటికీ అంతా అర్థం కాలేదు. ఇదిగో ...ఇప్పడు ... నేనిది రాసే సమయానికి అర్థమయింది ఈ వాక్యం... "నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు". 

అసలు పాటే అర్థం కాలేదు అనుకుంటే ఈ పాట మీద బోల్డన్ని spoof లు. 

మొత్తానికి ఎక్కడ విన్నా, ఎలా విన్నా తెలుగు జాతినంతటినీ ఒక పాట-బీటు మీదకి తెస్తున్న ఈ తెలుగు సినిమాలు, పాటలు చూస్తుంటే ముందుముందు తెలుగు భాష చెక్కుచెదరని శిలాక్షరంలా నిలవాలంటే తెలుగు సినిమాల్లోకి చేరడానికి వచ్చేవాళ్ళకి - వాళ్ళ పాత్రతో, పాత్రతతో సంబంధం లేకుండా - తెలుగు చదవడం, రాయడం వచ్చుండాలని ఒక్కటంటే ఒక్క నిబంధన పెడితే - తెలుగుకింక ఢోకా వుండదంతే! ఆ-ఫిల్ము-స్క్రీనాంతం నిలిచిపోతుంది, వెలిగిపోతుంది. అసలే ఈ మధ్య అన్ని చదువు దారులూ సినీ-మా-యాలోకానికే కదా! - ఒకప్పుడు అన్ని దారులూ రోమ్ వైపు మళ్ళినట్లు. డాక్టరైనా, ఇంజినీరైనా, ఇంకోటైనా - సినిమా ఒక passion, అలా అనడం fashion - అది చూడడం వరకే అయినా కూడా... :) 

అరె! పాట మాట మరిచి నా కలవాటైన కబుర్ల బాట పట్టానేమో కదా! మళ్ళీ వెనక్కొచ్చి పాట దగ్గర ఆగితే ... అన్నిసార్లు విన్నా అర్థం కాలేదు అంటూనే అసలా అర్థం కాని పాట గురించి ఇంతగా ఇలా చెప్తున్నానంటే దానికి కారణం - అనుకోకుండా యూట్యూబులో నేను నిన్న చూసిన ఒక వీడియో. 

అది ఏంటంటే "స్వర కారుణ్యం" అనే పేరున - తెలుగొచ్చిన వెలుగు కళ్ళ అబ్బాయి కారుణ్య - హిందోళంలో మొదలుపెట్టిన త్యాగరాజ కీర్తనతో తన్మయమై  - అక్కణ్ణించి అలవోకగా "అల వైకుంఠపురములో" సినిమాలోని "సామజవరాగమనా ... నిను చూసి ఆగగలనా?" అన్న పాట లోకి సాగుతూ, పాటకి తగ్గట్టు కులాసాగా ఊగుతూ చేసిన త్యాగరాజ-థమన్ స్వరాల fusion. అప్పుడు తెలిసింది ఆ పాటలో మాటలేంటో, వాటిలో భావమేంటో! అసలు పాట కన్నా నాకిదే నచ్చింది. నాకు నచ్చి నా బ్లాగుకొచ్చింది.

ఇదిగో... ఇల్లిక్కడ ... ఆ "అల వైకుంఠపురములో" పాట - ఇల కారుణ్య స్వరంలో...వీడియో తిలకించుడి ... ఆడియో ఆలకించుడి... ఆ పై పదము చదివి, గళము కలిపి ఆనందించుడి... 

 

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి - చూడే నా కళ్ళు!
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు - దయలేదా అసలు?

నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు

నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు...
నువ్వు నెట్టేస్తే ఎలా? నిట్టూర్చవటే... నిష్టూరపు విలవిలలు!

సామజవరగమన.. నిను చూసి ఆగగలనా?!
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా?!

సామజవరగమన.. నిను చూసి ఆగగలనా?!
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా?!

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి - చూడే నా కళ్ళు!
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు - దయలేదా అసలు?

మల్లెల మాసమా... మంజుల హాసమా...
ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా
విరిసిన పింఛమా.. విరుల ప్రపంచమా..
ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నగ వశమా

అరె! నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా.. ఉలకవా.. పలకవా.. భామా!
ఎంతో బతిమాలినా.. ఇంతేనా అంగనా?! 
మదిని మీటు మధురమైన మనవిని వినుమా..

సామజవరగమన.. నిను చూసి ఆగగలనా?!
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా?!

సామజవరగమన.. నిను చూసి ఆగగలనా?!
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా?!


****************************************************************************
******************************************************************************

ఈ మధ్యే విన్న ఇంకో పాట ... వినగానే నచ్చిన పాట... డిస్కో రాజా - రవితేజ పాట - "నువ్వు నాతో ఏమన్నావో... నేనేం విన్నానో..."

ఈ పాట కూడా సిరివెన్నెల-థమన్నుల స్వరాల పంట.

ఏడు పదులు నిండిన వయసులో - రెండో బాల్యపు ఉరవడితో - తేట తెలుగుల జిలుగులతో - తెలుగు మాటకే మాటొస్తే మురిసి మెచ్చుకునేలా - బోల్డు-శుభ్ర-మాన్యంగా - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇది.

పాట అక్కడక్కడా అప్పుడెప్పుడో విన్న ఇళయరాజా పాటల్లా అనిపించింది. కానీ అలా అనిపించడం కూడా బాగానే ఉందనిపించింది.

పాటలో సరాగాలు, పరాగాల అంత్యప్రాసలు,   రెక్కల్లా మారే దేహాలు, రెప్పల్లో వాలే మోహాలు, హాయిగా ... అలిసిపోతున్న  ... ఆహాలూ ప్రాసలూరి- వేటూరిని గుర్తు చేశాయి.


ఇప్పటికీ పాట చాలు - భలే! అనిపించేలా పాడిన ఎస్పీబీ గళంలో...




నువ్వు నాతో ఏమన్నావో... నేనేం విన్నానో...
బదులేదో ఏం చెప్పావో...  ఏమనుకున్నానో...
భాషంటూ లేని భావాలేవో - నీ చూపులో చదవనా...
స్వరమంటూ లేని సంగీతాన్నై -  నీ మనసునే తాకనా...
ఎటు సాగాలో అడగని ఈ గాలితో...
ఎప్పుడాగాలో తెలియని వేగాలతో...
భాషంటూ లేని భావాలేవో - నీ చూపులో చదవనా...
స్వరమంటూ లేని సంగీతాన్నై -  నీ మనసునే తాకనా...

నువ్వు నాతో ఏమన్నావో... నేనేం విన్నానో...
బదులేదో ఏం చెప్పావో...  ఏమనుకున్నానో...
భాషంటూ లేని భావాలేవో - నీ చూపులో చదవనా...
స్వరమంటూ లేని సంగీతాన్నై -  నీ మనసునే తాకనా...

నీలాల నీ - కనుపాపలో - ఏ మేఘసందేశమో...
ఈనాడిలా - సావాసమై - అందింది నా కోసమే...
చిరునామా లేని - లేఖంటి నా గానం - చేరిందా నిన్ను ఇన్నాళ్లకీ...
నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం - తీర్చేశావేమో ఈనాటికి
మౌనరాగాలు పలికే - సరాగాలతో... మందహాసాలు చిలికే - పరాగాలతో..
భాషంటూ లేని భావాలేవో - నీ చూపులో చదవనా...
స్వరమంటూ లేని సంగీతాన్నై -  నీ మనసునే తాకనా...

నువ్వు నాతో ఏమన్నావో... నేనేం విన్నానో...
బదులేదో ఏం చెప్పావో...  ఏమనుకున్నానో...

నీ కురులలో - ఈ పరిమళం - నన్నల్లుతూ ఉండగా...
నీ తనువులో - ఈ పరవశం - నను నేను మరిచేంతగా...
రెక్కల్లా మారే దేహాల సాయంతో - దిక్కుల్ని దాటి విహరించుదాం..
రెప్పల్లో వాలే మోహాల భారంతో - స్వప్నాలెన్నెన్నో కనిపెంచుదాం..
మంచు తెరలన్ని కరిగించు ఆవిర్లతో - హాయిగా అలిసి పోతున్న ఆహాలతో
భాషంటూ లేని భావాలేవో - నీ చూపులో చదవనా...
స్వరమంటూ లేని సంగీతాన్నై -  నీ మనసునే తాకనా...

నువ్వు నాతో ఏమన్నావో... నేనేం విన్నానో...
బదులేదో ఏం చెప్పావో...  ఏమనుకున్నానో... 

**********************************************************************
**********************************************************************

మన్ననైన మాటతో  
మన్నికైన రాగంతో 
నాటిదో... నేటిదో...
పాటేదైనా మధురం... 
మృదులం ... మనోహరం... 

~ పాటల భైరవి