9, ఫిబ్రవరి 2021, మంగళవారం

To B.E., or not to B.E. ... అంటూ సాగే నా soliloquy!

    మొన్నటి ఆదివారం నుంచి ఎంత చలిగా ఉందో ఈ మా ఊళ్ళో!

        మా ఊళ్ళో చలిపులి "బ్‌ర్‌ర్‌ర్"మని గాండ్రిస్తోంది.  

    ఉన్నచోట - ఉన్న పళాన ఉష్ణోగ్రత ఎలా ఉందా అని చూస్తే ఇంట్లో థెర్మోస్టాట్ 16 డిగ్రీలు చూపించింది. 

    అది చూస్తూనే అప్పుడెప్పుడో - మా బుజ్జిజింక గాడన్నట్టు - pre-historic times లో FORTRAN లో రాసిన నా మొట్టమొదటి Fahrenheit to Celsius conversion program ని నెమరేసుకుంటూ - ఉరామరిగ్గా - ప్లస్సు పదహారు డిగ్రీల ఫేరన్‌హైట్ ఈజీక్వల్టూ మైనస్సు తొమ్మిది డిగ్రీల సెంటీగ్రేడు - అని మనసు లోనే లెక్కలేసుకున్నా.  

    అలా పాత ప్రోగ్రాముల రోజుల్ని నెమరేసుకునేటప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఆ  FORTRAN ప్రోగ్రాం రాసినప్పుడు - Fahrenheit to Celsius conversion formula నన్ను ఎంత సతాయించిందో  గుర్తుకొచ్చింది. 

    వారానికో రోజు అరగంట మాత్రం దొరికేది  కంప్యూటర్ ల్యాబ్ టైం. మాకు FORTRAN చెప్పింది రమశ్రీ మేడం అనుకుంటా. 

    ఒక ఉష్ణోగ్రతని ఫేరన్‌హైట్ నుంచి సెంటీగ్రేడుకి మార్చాలంటే దాన్ని 32 లోంచి తీసేసి 5/9 తో హెచ్చవేయమంది. అదీ ఫార్ములా అని తీర్మానించి తేల్చి చెప్పేసింది. అంత వరకు బానే వుంది. సింటాక్స్ ప్రకారం ప్రోగ్రామ్ రాశానే కానీ నాకేంటో నచ్చలేదు అందులో. ఏం నచ్చలేదా అని తెగ ఆలోచించిన తర్వాత తట్టిందేంటంటే నాకు అందులో 5/9 అన్న క్రమభిన్నం సక్రమంగా అర్థం కాలేదు. మా మేడం "అది అంతే!" అని నొక్కి వక్కాణించింది కానీ "అంతే ఎందుకు?" నా ప్రశ్నని ఆట్టే పట్టించుకోలేదు.  

    ఇలా అర్థాలు ఆట్టే చెప్పకుండా స్టెప్పులేయించి లెక్కలు చేయిస్తున్నారనే కదా ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ కోచింగులు మానేసి సొంతంగా ఆడుతూ-పాడుతూ చదువుకుని ఇక్కడకొస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఇదే ఫార్ములాల గొడవేంట్రా బాబూ అనిపించింది. కాకపొతే ఓ రెండో, మూడో కాయితాలు నలుపు చేసేసి, నలిపేసి - సెంటీగ్రేడ్ 100-0=100 కి,  ఫేరన్‌హైట్ 212-32=180 కి నిష్పక్షపాతంగా నిష్పత్తులు చూసేసుకుంటే 5/9 కిటుకు తెలిసిపోయింది. కానీ నాకింక క్లాసులో పాఠాలు వినాలనిపించలేదు.

     MCA మూడేళ్ళలో నేను పాఠాలు విన్నది ఇద్దరో ముగ్గురో చెప్పిన క్లాసులు - శుభ మేడమ్ చెప్పిన డిస్క్రీట్ మేథమేటికల్ స్ట్రక్చర్స్, రాజశేఖర్ సర్ చెప్పింగ్ అకౌంటెన్సీ, సత్యం సర్ చెప్పిన ఆర్గనైజషనల్ బిహేవియర్. మిగిలినవన్నీ నాకు తోచినట్టు నేనే చదువుకున్నా. 

    నాకు మొదట్నుంచి ఉన్న మంచిదో, చెడ్డదో ఒక అలవాటు ఏంటంటే - నాకు పాఠం మొదటిసారి వినగానే అర్థం కాకపోతే ఆ తర్వాత వాళ్ళేం చెప్పినా వినేదాన్ని కాదు. నేనే చదివేసుకుని నాకు తోచినట్లు అర్థం చేసేసుకునేదాన్ని. 

    అప్పటికీ మా అమ్మ చెప్పేది "చెప్పే గురువు మీద భక్తి ఉంటేనే శ్రద్ధ కుదిరి చదువొస్తుంది" అని. 

    "సరే! భక్తి కలిగేలా చెప్పగలిగే గురువు దొరికితే శ్రద్ధగా ఎలాగూ వింటాం. అలా కాకపోతే మహాశ్రద్ధగా వింటున్నట్టుంటాం!!!" అని ఓ విట్టేసేసేదాన్ని. అది విని మా అమ్మకి చిరాకెత్తి - "నీలాంటివాడే వెనకటికొకడు చిన్నప్పుడు కాకరకాయ్ అని పెద్దయ్యాక కీకరకాయ్ అన్నాట్ట" అనేసేది. 

    అసలివన్నీ ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చాయీ అంటే రెండ్రోజుల క్రితం ఆదివారం నాడు - హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న పిల్లలున్న తల్లులిద్దరం కబుర్లు చెప్పుకున్నాం - నేనూ, మా ఆడపడుచు. 

    తనతో మాట్లాడడం అయ్యాక - ఆ ఫోన్ పెట్టేశాక - 


"అన్ని ఇంజినీరింగుల టెక్నాలజీలూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోనే కలిసిపోయేటట్టయితే
To B.E., or not to B.E.?! that is the question" అంటూ మొదలెట్టి  ... 
  "- of that day, of today, of any day" 
అంటూ సాగే  నా soliloquy 
అనబడే స్వగతానికి గతం ఏంటీ అంటే... 

గతం... 

    అనగనగనగనగా... మా గుంటూరు. 

    ఆ మా గుంటూర్లో ఎఱ్ఱటి ఎండలు మొదలయీ మొదలవగానే - ఏడు రంగుల వానవిల్లులో ఇంకో వెయ్యి వన్నెలు కలిపినన్ని రంగురంగుల రెక్కలు తొడుక్కున్న సీతాకోకచిలకల గుంపుల్లా అమ్మాయిలూ - ఇన్ని రంగులు కళ్ళ ముందు కదులుతుంటే ఏ రంగు బట్టలేసుకుంటే ఏంటన్నట్టు తెలుపో-నలుపో-జానేదేవ్-ఆ తేడాలిక్కడ లేనేలేవ్ అన్నట్టున్న గండుతుమ్మెదల్లాంటి అబ్బాయిలూ - బిలబిల్లాడుతూ మా బ్రాడీపేట రోడ్లని కళకళలాడించేవాళ్ళు. 

    మా మేడ మీద పిట్టగోడెక్కి కూర్చుని అటూ-ఇటూ గుంపులుగుంపులుగా గలగల్లాడుతున్న వాళ్ళని చూడడంతో సరదాగానే గడిచింది గుంటూర్లో మా మొదటి వేసవి - జూనియర్ ఇంటెర్మీడియట్ సెలవులది. 

    "కప్పలు, బొద్దింకలు కోయిస్తారు, మా పిల్ల జడుసుకుంటుందమ్మా! ఎందుకొచ్చిన బైపీసీ? ఎంచక్కా లెక్కలు చేసుకుంటుంది" అని దగ్గరుండి మరీ మా అమ్మా, లక్ష్మి దొడ్డా కలిసి నన్ను బండ్లమూడి హనుమాయమ్మ జూనియర్ కాలేజీలో చేర్పించారు కదా! 

     తెల్లవారకుండా లేచేసి - ఒకటో-రెండో జళ్ళేసేసుకుని - జట్లుజట్లుగా - బుద్ధిగా - తలొంచుకుని మా ఇంటి ముందు నుంచి ట్యూషన్లకి వెళ్ళిపోతూ-వచ్చేస్తున్న ఆడపిల్లల్ని చూసి "ఓహో! ట్యూషన్లకి వెళ్తే ఇంత బుద్ధిగా ఉంటారు కామోసు" ననుకుని - అదే ఆశతో పొద్దున్నే నూనె రాసి జళ్ళేసి - నన్ను రాఘవేంద్రరావుగారి ఫిజిక్స్ ట్యూషన్లో కూర్చోపెట్టేసింది మా అమ్మ. 

    ఓ వారం రోజులు అవగానే నాకు ట్యూషన్ పడక జలుబు చేసేసింది. 

    పొద్దున్నే లేచి చలిలో వెళ్ళి నలిగిపోతున్నానని - తొమ్మిదింటికి వెచ్చగా పాలు తాగి వెళ్ళొచ్చని మా ఇంటి వెనకనే ఐదవ లైనులో రిటైర్డ్ టీచర్ భావన్నారాయణ గారి దగ్గర ట్యూషన్ చేర్పించింది అమ్మ. 

    ఆయన కొచ్చిందెంతున్నా - నన్నాట్టే కొశ్చెన్లు అడక్కుండా నాకు నచ్చింది మాత్రమే చెప్పే భావన్నారాయణ గారి చదివింపు నచ్చి ఇంటర్ రెండేళ్ళు ఆయన దగ్గరే లెక్కలు చేసుకొచ్చేదాన్ని. మిగిలిన ఫిజిక్స్, కెమిస్ట్రీ నాకు చేతనైనంత వరకు అర్థం చేసుకుంటూ చదువుకునేదాన్ని. 

    ఇక నా సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోగానే - ఎంపీసీ గ్రూపు కదా - ఎంత కాదనుకున్నా తర్వాతి అంకం ఎంసెట్.  దాని కోసం ట్యూషన్లు చేరడం తప్పలేదు. తీరా చేరాక - ఈ లెక్క ఇలాగే ఎందుకు చెయ్యాలీ, ఆ ఫిజిక్స్ ఫార్ములా ఎలా వచ్చిందీ - అని సందేహాలొస్తే - "అదంతా ఎంట్రన్స్ అయిపోయాక తీరిగ్గా చర్చించుకుందాం, ప్రస్తుతానికి చెప్పింది చెయ్" - అనేవాళ్ళే అంతా. 

    అప్పుడు... అలాంటి ... అనేకానేక సందేహాలు అస్సలు తీరని అసహనపు వేసవి మధ్యాహ్నాల్లో - వట్టివేళ్ళ చాపల నీడలో కూర్చుని  -  నా చుట్టూ -  పొరలేసి కుడితే మూడు బొంతలయ్యేంత దొంతరల ఎంసెట్ మోడల్ టెస్ట్ పేపర్సూ, దాని మానాన అది కూనిరాగాలు తీస్తున్న ట్రాన్సిస్టరూ,  కొంటె బొమ్మల బాపు, ముళ్ళపూడి బుడుగు, ఆ పక్కనే Merchant Of Venice చదివిన మాయలో ఉండి - మోజుపడి కొనుక్కున్న షేక్స్పియర్ ట్రాజెడీ డ్రామా Hamlet  - ఇన్ని పెట్టుకుని - దీర్ఘంగా ఆలోచించా... 

    ఆ మాత్రం సమాధానాలు కూడా దొరకని అంతంతమాత్రపు చదువు కోసం గుంటూరు వీధుల్లో, వేసంకాలపు మిట్టమధ్యాహ్నపుటెండల్లో తిరగడం అంత అవసరమా అని. 

    అలా అనుకుని - ఇంట్లోనే ఉండి ఎంత చక్కగా చదువుకుంటానో చూడు - అని మా అమ్మని ఒప్పించి, అప్పటి దాకా వెళ్తున్న ట్యూషన్లన్నీ మానేశా. 

    ఇహ అప్పణ్ణించి - పొద్దున్న లేస్తూ చదివా. మధ్యాహ్నం భోంచేస్తూ చదివా. సాయంత్రం టీవీ త్యాగం చేస్తూ చదివా. "పుస్తకం హస్తభూషణం" అన్న నానుడికి బ్రాండ్-అంబాసడర్లా మసలా.  

    అంతా చేసి ఎంట్రెన్స్ రాస్తే వచ్చిన రాంక్  - అంకెల్లోనే కాదు, అంకెలని అక్షరాల్లోకి మారిస్తే కూడా ఘనంగా వినిపించే అంకె - ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు. ఆ రోజుతో కచ్చితంగా తెలిసిపోయింది - I am not meant to be B.E. అని. 

ఇప్పుడు... 
ఇలా ...  - 
"I am not meant to be B.E. దాకా ఎలా వచ్చానో చెప్పాక 
  -ఆ గతానికి కొనసాగింపుగా  
ఈనాటి స్వగతం ఏంటీ అంటే... 

స్వగతం: 

    ఇందాక అప్పుడెప్పుడో మా ఆడపడుచుతో చదువుల గురించి మాట్లాడానని చెప్తూ - నా చదువుల రోజుల్లోకి షికారెళ్ళొచ్చా కదా... తన ఫోన్ పెట్టెయ్యగానే - ఫోన్ పెట్టెయ్యడం అన్నది జరిగింది కానీ మాట్లాడడం మాత్రం ఆగలేదు. 

    "చిన్నప్పుడు ఏ సినిమా చూసినా హీరో బియ్యే చదివి ఫస్టు క్లాసులో పాసవుతూ ఉండేవాడు. అప్పడు BA ఎలాగో ఇప్పటి BE అలా వుంది. సివిల్ చదివినా, మెకానికల్ చదివినా అన్నిటికీ ఎండ్ పాయింట్ IT యే అయిపోయింది. ఆ మాత్రం దానికి అన్ని బ్రాంచులెందుకో? అసలింక కొన్ని తరాల పిల్లలు ఇంజనీరింగ్ చదవడం మానేసి వాళ్ళకి నచ్చిన కొత్త చదువులేమన్నా చదువుకుంటే బావుండును." అని నాలో నేను స్వగతానికి ఎక్కువగా, ప్రకాశానికి మిక్కిలిగా అనుకుంటూ ఉన్నాను. 

    అప్పటి దాకా నేను మాట్లాడుకుంటూ ఉన్నదంతా నిశ్శబ్దంగా వింటున్న బదరి అందుకుని "నీకో సంగతి చెప్తా విను...మనం చదువుకునే రోజుల్లో - మనతో చదివిన వాళ్ళు చాలా మంది ఇంజనీరింగ్ ఎందుకు చదివారంటే అదేదో ఆ సబ్జెక్టు అంటే ఏంటో తెలిసి, దాని మీద ఆసక్తి ఉండి కాదు. అమెరికా చదువుల మోడల్లో 12 ఏళ్ళు స్కూలు  + 4 ఏళ్ళ డిగ్రీ ఉంటే అమెరికాకి వీసా రావడం ఈజీ అవుతుందని ఆ awareness ఉన్న పేరెంట్స్ ఎవరో కొందరు వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగులో చేర్పించి ఉంటారు. వాళ్ళని చూసి ఇంకొందరు... అలా అలా కొన్నేళ్ళయ్యాక అసలు అలా ఎందుకు చదవడం మొదలు పెట్టారో అసలు కారణం మర్చిపోయి ఇంజనీరింగ్ కన్నా ఇక వేరే డిగ్రీయే లేదన్నట్టు అందరూ అదే చదివించడం మొదలు పెట్టారు. ఆంధ్రాలో సీట్లు రానివాళ్లు మహారాష్ట్ర వెళ్ళి కూడా చేరారు. " అంటూ ఇంకొన్ని విషయాలు గుర్తు చేశారు.  

    నాకు ఎప్పుడు చదువుల గురించి తలచుకున్నా బాధ - ఎంతో విలువైన పిల్లల సమయాన్ని, శక్తిని పనికిరాని కోచింగులు, అర్థం లేని కాంపెటిషన్లు మింగేస్తున్నాయని. 

    ఆడుతూ, పాడుతూ, అర్థం చేసుకుంటూ, బుద్ధిని వికసింప చేసేలా హాయిగా చదువుకోవాల్సిన చదువుని పరీక్షల్లో మార్కుల కోసం, ర్యాంకుల కోసం మాత్రం చదువుకోవాల్సి రావడం పువ్వుల్లాంటి, పసిగువ్వల్లాంటి పిల్లలకి జరుగుతున్న మహా  అన్యాయం. 

    అన్నట్టు మా బుజ్జిజింకలతో పాటు చదువుకుంటూ నేను నేర్చుకున్న ఒక చిన్న పాఠం - పరీక్షల ముందు ఏ పిల్లలకీ "All the Best ! Do well!" అని చెప్పొద్దు అని. 

    ఆ విశేషాలు ఇంకో సారి ... 

31, జనవరి 2021, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 8 - ఓ హన్సినీ.. . ! మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!

అప్పుడు -
ఏమీ తెలిసీ తెలియని అప్పుడు 
చిన్నప్పుడు 
చదువుకున్న బడిలో 
ఆడుకున్న ఆటల్లో 
కుదిరిపోతుంది చెలిమి  
అలవోకగా ... 
మాటల్లో ... ఆటల్లో ... 

ఇప్పుడు -
ఎంతో తెలుసని అనుకునే ఇప్పుడు  
పెద్దప్పుడు 
కలుపుకున్న మాటలతో 
ఊసుపోని వేళలలో 
కుదురుకుంటుంది కూరిమి
అలవాటుగా...  
మాటలతో ... పాటలతో... 

********
********
 

    స్నేహం అన్న మాట వినగానే ముందు గుర్తొచ్చేవి - గడిచిపోయిన పాత రోజులు, చిన్నప్పటి నేస్తాలే. 

    ఆ పాతరోజుల స్నేహం అలా ఉంటూనే - ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త పరిచయం ఏర్పడడం ఎప్పుడూ బావుంటుంది. 

    ఆ కొత్త పరిచయపు సాంగత్యంలో - కొత్త విషయాలు తెలియడంతో పాటు - అప్పటివరకు తెలిసిన విషయాలనే కొత్తగా-కొంగొత్తగా చూడడం అంతకు ముందెప్పుడూ లేనంత బావుంటుంది. 

    కొత్తకొత్త అనుకుంటూనే ఆ పరిచయం చిన్నిచిన్ని పలకరింపుల్లో ఇష్టమైన అలవాటుగా మారడం - పలకరింపులు దాటి స్నేహమై నిలిచిపోవడం  - ఇంకెప్పటికీ బావుంటుంది. 

         అన్నట్టు ... ఆ కొత్త పరిచయం ప్రతీ సారి ఓ కొత్త మనిషితో మాటాడుకున్న మొట్టమొదటి మాటే కానక్కర్లేదు - మొట్టమొదటిసారిగా విన్న ఓ పాత పాట కూడా అయుండొచ్చు. 

    అప్పుడెప్పుడో పెద్దలెవరో  "ఋణానుబంధ రూపేణా పశు పత్ని సుతాలయా" అన్నారు కదా దానికి నా version "ఋణానుబంధ రూపేణా పతి మిత్ర సుత గీతాలయా ". 

    ఇంతకీ ఇంతటి ఉపోద్ఘాతం ఎందుకయ్యా అంటే - అప్పుడెప్పుడో ట్రావెల్ చేసే రోజుల్లో - అంటే 2020 కి ముందు - అనగా 2019 BC యుగంలో - ఒకానొక రోజు - నాకు చెబ్దామని మూటకట్టుకొచ్చే బోల్డన్ని కబుర్లతో పాటు - ఝుమ్మని మోగే తుమ్మెద పాటలాంటి - పాట నొకదాన్ని తన పెదవుల మీద మోసుకొచ్చారు బద్రి. 

    చాలా రోజుల పాటు - తను మోసుకొచ్చిన పాటని - "ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ!" అంటూ పదేపదే ఆ రెండు ముక్కలే పాడుకుంటూ ఉండిపోయామే కానీ ఆ పాటేదో పట్టుకోలేకపోయాము. 

    ఇలాక్కాదని చెప్పి - ఓ రోజు - "ఎంతకాలం ఇద్దరం చెరికో ముక్క అనుకుంటూ ఆ రెండు ముక్కలే పాడుకుంటాం? ఎలాగైనా సరే వెతికి చెఱుకుముక్కలాంటి  ఆ పాటేదో పట్టుకుందాం" అన్జెప్పి వెతుక్కుంటే - పనికట్టుకుని పలకరించి చేసుకున్న కొత్త పరిచయం లాగా - భలే దొరికేసింది ఆ పాత పాట.  

    పాట పూర్తిగా విన్నాం. 

    ఒక్కో పాట అప్పటివరకు అస్సలెప్పుడూ విని ఉండనిదైనా - అప్పుడే మొదటిసారి వింటున్నదైనా - వినీ వినగానే, వింటుండగానే - చెవులలో మూగేస్తుంది, పెదవులపై మోగేస్తుంది. 

    ఇది అచ్చు అలాంటి పాట. ఈ పాట గురించి ఇంకా ఇంకా చెప్పే ముందు అసలు ఆ పాటేంటో చెప్పాలి కదా!

    పాట పేరు: ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ!
    పాటున్న సినిమా పేరు: ౙహ్రీలా ఇన్‌సాన్
    పాటలో పరిగెట్టిన వాళ్ళ పేర్లు: రిషి కపూర్, ఇటు నుంచి నీతూసింగ్, 
అటు నుంచి మౌసమీ ఛటర్జీ, వీళ్ళు ముగ్గురే కాకుండా బోల్డంత గాలి 
పాటలో కనిపించిన ఊరు: చిత్రదుర్గ 
పాట రాసినవారి పేరు: మజ్రూ సుల్తాన్‌పురి 
పాట కట్టినవారి పేరు: రాహుల్ దేవ్ బర్మన్ (RD బర్మన్)
పాట పాడినవారి పేరు: కిషోర్ కుమార్ 

   
    పైన రాసింది పాటకి పైపై పరిచయం మాత్రమే. ఈ పాట గురించి చెప్పాలంటే కథ ఇంకా చాలా ఉంది. 

    ౙహ్రీలా ఇన్‌సాన్ సినిమా పేరెప్పుడూ వినలేదు ఇంతకు ముందెప్పుడూ. అసలీ సినిమా ఏమిటీ, ఎప్పటిదీ, ఎక్కడిదీ, ఎవరిదీ అని వెతుక్కుంటూ వెళ్ళగా వెళ్ళగా యూట్యూబ్లో తేలా. 

    అక్కడ చూడగా తేలిందేంట్రా అంటే - ఇది కన్నడలో నాగర హావుగా గొప్పగా పుట్టి - తెలుగులో కోడెనాగుగా ఓ వెలుగు వెలిగి - హిందీలో ౙహ్రీలా ఇన్‌సాన్ (విషపూరితమైన మనిషి) గా కృంగి పోయిన సినిమా అని. 

    కన్నడ సినిమా నాగరహావులో - నట-నటీ -త్రయం: విష్ణువర్ధన్, శుభ, ఆరతి. 

    తెలుగు సినిమా కోడెనాగులో - కథానాయక-నాయికా-త్రయం: శోభన్ బాబు, లక్ష్మి, చంద్రకళ. 

    హిందీ సినిమా ౙహ్రీలా ఇన్‌సాన్ లో - ఆభినేత-నేత్రీ-త్రయం: రిషి కపూర్,  రిషి నిజదార నీతూసింగ్, మౌసమీ ఛటర్జీ. 

     కన్నడ, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించినది - కన్నడ దర్శకుడు పుట్టణ్ణ కణగాల్. తెలుగులో మాత్రం K.S. ప్రకాశరావు (ఫలపుష్ప-విసిరేంద్ర రాఘవేంద్రరావుగారి తండ్రిగారు). 

    ఇక నాకు నచ్చిన హిందీ పాట - ఓ హన్సినీ.. . ! మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?! విషయానికి వస్తే... పాటలో వినిపించే మొట్టమొదటి మాట దగ్గర మొదలుపెట్టి -  పాటలో కనిపించే చిట్టచివరి పరుగు దాకా చెప్పాల్సింది బోల్డంత ఉంది. 

    నిజానికి ఈ పాటని ఓ హంసినీ... మేరీ హంసినీ! అని అనుస్వారసహిత-హ "హం" తో  తేలిగ్గా రాసేయొచ్చు. మరి అలా రాస్తే కిషోర్ కుమార్ మునిపళ్ళతో సుతారంగా అన్న నకారపొల్లు నా రాతలో ఎలా కనిపిస్తుంది? అందుకే నా రాతలో"హంసిని" - "హన్సిని " అయింది

      ఇక్కడ నుంచి ఈ పాట లోకి ఇంకా ముందుకి వెళ్ళేలోగా - కన్నడ, తెలుగు సినిమాల్లో ఇదే సందర్భానికి వచ్చే కవల పాటల గురించి చెరి రెండు ముక్కలూ చెప్పేసి అప్పుడు మళ్ళీ హిందీ పాట దగ్గరికొస్తా. 

నాగరహావు సినిమాలో పాట: బారే...  బారే... చెందద చెలువిన తారె!

    కన్నడలో - ఇదే సందర్భానికి చెందిన పాట - పీబీ శ్రీనివాస్ పాడారు. 

    ఆ పాట ఏంటంటే... ఈ కింద ఓ రెండు లైన్లు రాసిపెట్టా. 

    (కుండలీకరణాలలో ఉన్నది కన్నడ పాటకి నా తెలుగు అనువాదం - మహాదుష్టసమాసాలతో అసలుసిసలు డబ్బింగు పాటలా ) 

 "బారే...  బారే... చెందద చెలువిన తారె ... 
(రావే... రావే... సుందర సుందర తారా!)
బారే బారే ఒలవిన చిలుమెయ ధారె" 
(రావే... రావే... ప్రేమల చెలమల ధారా!)
    

    కన్నడలో  "చిలుమె" అంటే ఇంగ్లీషులో  "ఫౌంటెన్ (fountain)". దానికి అచ్చతెలుగు మాట  "చిమ్మనగ్రోవి". Fountain కి  తెలుగులో ఇంకో అర్థం "చెలమ" అని కూడా ఉంది. అందుకని డబ్బింగు పాటలో రాసినట్టు  "చిలుమెయ ధారె" ని - "చెలమల ధార" చేశా. 

    కన్నడ పాటలో నాకు నచ్చిన ఇంకో లైను ఏంటంటే "మౌన గౌరియ మోహద కై బిడలారే ". దాన్ని నేను తెలుగులో ఇలా డబ్బుకున్నా "మూగప్రేమ సమ్మోహన చెయి విడలేనే". 

     పాటలో మాటలు ఎంత బావున్నాయో - పీబీఎస్  మెత్తటి గొంతులో వినడానికి అంత కంటే హాయిగా ఉన్నాయి. ఈ పాటకి విజయభాస్కర్ సంగీతం, పీబీ శ్రీనివాస్ గాత్రం - రెండూ కూడా సప్తస్వరభరిత పంచప్రాణాలు. ఈ పాట విన్న దగ్గర్నుంచి  - 5 of  1 = 2 && 7 అనేది నా కొత్త సమీకరణం (equation). 

    ఈ పాటలో ధవళవస్త్రధారక-విష్ణువర్ధన్ తో పాటు కనిపించే హీరోయిన్ ఆరెంజ్-చీరధారిణి-ఆరతి. 

    పాటంతా గాలిలో తేలుతున్నటుగా - స్లో మోషన్ లో ఉంటుంది. 

    ఆ ఆరతి కూడా  - గడ్డిభూముల్లో పరిగెడుతూ, చెట్టు కొమ్మలెక్కి ఊగుతూ, చెట్టు కొమ్మల మీంచి అటూఇటూ గెంతుతూ - భలేగా పరిగెడుతూ ఉంటుంది. 

    ఇక విష్ణువర్ధనేమో జుట్టంతా కుడిపక్కకి పోగు పెట్టేసుకుని - భుజాలు ఎగరేస్తూ, బుగ్గల్లో పూరీలు పెట్టుకున్నట్టు కనిపిస్తూ - బల్-తమాషాగా ఉంటాడు. 

    కస్తూరి-పరిమళ భరిత కన్నడ పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=1r2DfXX4T3c


కోడెనాగు సినిమాలో పాట: నాలో కలిసిపో... 

    ఇహ తెలుగుపాట ఎలా ఉంటుందీ అంటే - శోభన్ బాబు, చంద్రకళ గాలిలో తేలిపోతూ - అక్కడే ఆగక సెట్టింగుల్లో అట్నుంచి ఇటూ, ఇట్నుంచి అటూ దూకుతూ ఉండగా -  బహుమంద్ర స్థాయిలో మొదలయి -  ఘంటసాల స్వరంలో, పెండ్యాల స్వరాలతో సాగే ఆత్రేయ పదాలతో సాగుతుంటుంది.  

నాలో - కలిసిపో... 
నా ఎదలో నిలిచిపో... 
కాచుకున్న కౌగిలిలో కప్పురమై - కరిగిపో... కరిగిపో... 


    ఈ పాటలో - తెల్లదుస్తుల-శోభన్ బాబుకి ఇటు వైపు నుంచి అటు వైపుకి నల్లచీరలో పరిగెడుతూ లక్ష్మి కనిపిస్తే, అటునుంచి ఇటువైపుకి పసుప్పచ్చ చీరలో చంద్రకళ తేలుకుంటూ వస్తుంది. 

    కన్నడ, హిందీ పాటల్లో అదే కొండలు-అదే గాలి-అవే  దుస్తులు. అయితే తెలుగులో మాత్రం కొండల్లో సెట్టింగులు-సెట్టింగుల్లో వానవిల్లులు -వానవిల్లులాంటి దుస్తులు. 

    ఏమాటకామాటే చెప్పుకోవాలి కళాపోషణకి బాగా-మహాగా-మహబాగా పోషణ జరిగేది తెలుగు సినిమాల్లోనే. 

    తెలుగు పాటలో రెండో చరణంలో - ౘందమామ కెదురుగుండా నించుని శోభన్ బాబు ఎత్తుకున్నప్పడు చంద్రకళ కట్టుకున్న తళుకుబెళుకుల-వానవిల్లు చీర ఎంత బావుందో! 

తేటతెలుగు పాటకి  యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=WfbHhPN24ws

    అలా - కన్నడ-చెట్టు చుట్టూ, తెలుగు-సెట్టు చుట్టూ తిరిగితిరిగి - ఇహ ఇప్పుడు - నాకు కొత్తగా చుట్టమైన పాత హిందీ పాట దగ్గరికి వచ్చేశాం !

    
ౙహ్రీలా ఇన్‌సాన్ సినిమాలో పాట: ఓ హన్సినీ.. . ! మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!


    నాకు నచ్చిన ఈ హిందీ పాట దాపులకి వెళ్ళేలోగా ఈ ౙహ్రీలా ఇన్‌సాన్ సినిమా గురించి నాకనిపించిన కొన్ని కబుర్లు. 

    కన్నడలో, తెలుగులో గొప్పగా, పొగరుగా ధ్వనించే "నాగరహావు", "కోడెనాగు" అన్న పేర్లు పెట్టి హిందీ లోకి వచ్చేటప్పటికి - "ౙహ్రీలా ఇన్‌సాన్" - అని - వినగానే "ఎబ్బే! ఏం మనిషిరా వీడు?" అనిపించేలాంటి పేరు పెట్టటం ఈ సినిమాకి జరిగిన మొట్టమొదటి అన్యాయం. 

    అందులోనూ - బే-మీసాల్‌గా ఉండి "బేమిసాల్" అనిపించే ఎండ కన్నెరగని కపూ-రాకుమారుడు రిషికపూర్‌ని తో-మీసాల్‌గా,  కయ్యానికి కాలు దున్నేవాడిలా చూపించడం - విషాదాంతం చేయడం - హిందీ సినిమాకి  పుట్టణ్ణ చేసిన ఇంకో అన్యాయం. 

    ఈ పాట వినగానే - మహా మోజు పడి - సినిమా చూద్దామనుకుని ఎంత అనిపించిందో - కానీ చూడలేదు. 

    హిందీ పాట "ఓ హన్సినీ.. . ! మేరీ హన్సినీ!" గురించి నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఈ పాటకీ, తెలుగులో సిరిసిరిమువ్వ సినిమాలో "ఝుమ్మంది నాదం" పాటకీ ఒక మంచి పోలిక ఉంది. ఈ రెండు పాటలూ కూడా డ్రీం-సాంగ్స్ అంటే ఊహల్లో పాటలు. 

    కానీ అది కాదు నేను చెప్పాలనుకున్న పోలిక. 

    ఈ రెండు పాటల్లో కూడా - మొదటి కొన్నిసెకన్ల వరకు - అంటే - నిజం లోంచి ఊహ లోకి తలపు మారే దాకా "టిటి-టిట్ట  టిటి-టిట్ట  టిటి-టిట్ట" అంటూ ఒక తంత్రీ-వాయిద్యంతో మొదలయి - ఊహలో ప్రారంభమయ్యే అసలు పాట దగ్గరికి వచ్చేసరికి  - ఒక్కసారిగా కుదుపు లాంటి ఎత్తుగడతో వినిపిస్తుంది పల్లవి. 

ఝుమ్మంది నాదం పాటకి యూట్యూబ్ లింక్https://www.youtube.com/watch?v=g_f9X6xbx6U


    ఇప్పుడు - అసలు పాట గురించిన కబుర్లు... 

    "ఓ హన్సినీ..." పాట మొదలవుతూనే ఒక పురాతన దేవాలయం పక్కనే ఉన్న శిలాతోరణం  నుంచి పరిగెట్టుకుంటూ ఆకుపచ్చ ట్యూనిక్ వేసుకుని నీతూసింగ్ వస్తుంటుంది. ఆమె వెనకాలే రిషి కపూర్ పరిగెడుతూ వస్తాడు. నీతూసింగ్ పరిగెట్టే వైపు కూడా ఒక పురాతన దేవాలయం, దానిముందు ఒక ధ్వజస్తంభం ఉంటాయి. ఆమె అలా పరిగెడుతూనే ఉంటుంది - ఆమెకి వ్యతిరేక దిశలో గాల్లో తేలుకుంటూ ధవళవస్త్రధారిణి మౌసమీ ఛటర్జీ రిషి కపూర్ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది రిషి కపూరుకి. 

    నాకు ఈ పాట చూసిన మొదటి సారే ఆ పురాతన దేవాలయాలు చాలా సమ్మోహనంగా అనిపించాయి. అవి ఏంటా అని వెతికితే - కర్నాటకలో చిత్రదుర్గ కోట పరిసర ప్రాంతాలని తెలిసింది. నా హంపి-హళేబీడు లిస్టులో చిత్రదుర్గ కూడా చేర్చుకున్నాను - కుదిరినప్పుడు తప్పకుండా వెళ్లాల్సిందే!

   శాక్సోఫోన్‌ గంభీర ధ్వని పాట అంతా కమ్ముకుని వినిపించే  ఈ పాటలో - పల్లవి అవగానే మొదటి చరణం మొదలయే ముందు వచ్చే వాద్యసంగీతం - అచ్చు - గాలి మునివేళ్ళ మీద పరిగెడుతోందా - అన్నట్టు వినిపిస్తుంది. దానికి తోడు అప్పుడే రిషి కపూర్ కూడా చులాగ్గా గాలితో పాటు పరిగెడుతున్నట్టుగా కనిపిస్తాడు. అదే మ్యూజిక్ రెండో చరణం మొదలయ్యే ముందు కూడా మళ్ళీ వస్తుంది. 

    మొదటి చరణంలో మెహక్-గజ్‌రా, లహక్-కజ్‌రా అన్న ప్రాసలు అప్రయత్నంగానే కుదిరినట్టు అందంగా అమిరాయి. 

మేరీ సాసోం మే - మెహక్ రహా రే - తేరా గజ్‌రా
(నా ఊపిరిలో నీ మల్లెల వాసనలు అలుముకుంటున్నాయి)
మేరీ రాతోం మే - లహక్ రహా రే - తేరా కజ్‌రా
(నా రాతిరిలో నీ కాటుకల రంగులద్దుకుంటున్నాయి)

    రెండో చరణం మాత్రం కొంచెం వింతగా అనిపించింది - 
    
దేర్ సే - లెహరోం మే - కమల్ సంభాలే హుఏ - మన్ కా
(ఎప్పట్నుంచో నా మనసనే కమలాన్ని అలల మీద నిభాయిస్తున్నాను)
జీవన్ తాల్ మే - భటక్ రహా రే - తేరా హన్‌సా
(జీవన లయలో నీ హంసనైన నేను పరిభ్రమిస్తున్నాను)

    ఈ రెండో చరణంలో పై రెండు లైన్లు పాడేటప్పుడు - రిషి కపూర్ - రెండు చేతులు పైకి ఎత్తి తమషాగా కదులుతూ వేసే రెండు చిన్న స్టెప్పులు భలే ఉంటాయి. 

    మొత్తానికి ఈ పాటలో - హంస - రిషి కపూర్, హంసిని - మౌసమీ ఛటర్జీ. 

    అది అర్థం కావడానికి బానే టైం పట్టింది నాకు. 

    ఆ ఊహలో పాట పాడే  రిషికపూర్ కోసం గీత రచయిత మజ్రూ సుల్తాన్‌పురి ఊహించుకున్న పేర్లు అవి. 

    నేను ఈ పాట చిన్నప్పట్నుంచి ఎప్పుడూ  విని ఉండకపోయినా - విన్న దగ్గర్నుంచి నన్ను తెగ వెంటాడిన పాట. ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు. ఇంకెన్ని సార్లు వింటానో చెప్పలేను! 

    ఓ హన్సినీ... !  పాటకి యూట్యూబ్ లింక్https://www.youtube.com/watch?v=R4Vj_XsfHTM






ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!
మేరే అర్‌మానోం కే - పంఖ్ లగాకే - కహా ఉడ్ చలీ?!

ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!
మేరే అర్‌మానోం కే - పంఖ్ లగాకే - కహా ఉడ్ చలీ?!

ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ!

ఆజా - మేరీ సాసోం మే - మెహక్ రహా రే - తేరా గజ్‌రా
ఓ... ఆజా - మేరీ రాతోం మే - లహక్ రహా రే - తేరా కజ్‌రా

ఆజా - మేరీ సాసోం మే - మెహక్ రహా రే - తేరా గజ్‌రా
ఓ... ఆజా - మేరీ రాతోం మే - లహక్ రహా రే - తేరా కజ్‌రా

ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!
మేరే అర్‌మానోం కే - పంఖ్ లగాకే - కహా ఉడ్ చలీ?!

ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!
మేరే అర్‌మానోం కే - పంఖ్ లగాకే - కహా ఉడ్ చలీ?!

ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ!

దేర్ సే - లెహరోం మే - కమల్ సంభాలే హుఏ - మన్ కా
జీవన్ తాల్ మే - భటక్ రహా రే - తేరా హన్‌సా

దేర్ సే - లెహరోం మే - కమల్ సంభాలే హుఏ - మన్ కా
జీవన్ తాల్ మే - భటక్ రహా రే - తేరా హన్‌సా

ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!
మేరే అర్‌మానోం కే - పంఖ్ లగాకే - కహా ఉడ్ చలీ?!

ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!
మేరే అర్‌మానోం కే - పంఖ్ లగాకే - కహా ఉడ్ చలీ?!

ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ!

********
********

నన్ను వెంటాడిన పాట
నా వెంటే ఉంటానన్న పాట 
ఆ పాటని పంచుకుంటూ .., 
పంచిన కబుర్లట - ఇవి ఈ పూట ... 

~ పాటల భైరవి 

17, జనవరి 2021, ఆదివారం

రంగులపలకలో కలకలమన్న కల

    నేను రంగులేశాను.  

    దేవులపల్లి వారిని తలుచుకుంటూ - 

మల్లెలతో వసంతం 
చేమంతులతో హేమంతం 
వెన్నెల పారిజాతాలు 
వానకారు సంపెంగలు 
అన్నీ మనకు చుట్టాలే 
వచ్చీపోయే అతిథులే 

    అని పాడిందే పాడుకుంటూ - "అబ్బే! ఇలాక్కాదు" అని నాతో నేనే అనుకుంటూ - ఆ చివరి రెండు లైన్లని - 
అన్నీ నాకే చుట్టాలే 
వచ్చేశాయీ అతిథులే !

    అని మార్చి పాడుకుంటూ - నేను రంగులేశాను.

    పువ్వులు, రెమ్మలు, ఆకులు, సీతాకోకచిలుకలు - 

    అబ్బా! ఎన్నిటికి రంగులేశానో! 
    ఎన్నెన్ని రంగులేశానో!
    వేసిన రంగులు చూసి నాకు నేనే మురిశాను 
    వేసిన రంగులు - చూసిన కళ్ళ - కలలుగా మార్చుకున్నాను. 

    నేను నా రంగుల కలల కబుర్లు చెప్పే ముందు - అసలా రంగులతో ఆడుకోవడం ఎలా మొదలయ్యిందో చెప్పాలి. 

    నే చెప్పింది విని ఇప్పటివరకు రంగులేయని వాళ్ళు కూడా రంగులేయాలి. 

నే రంగులేసి - కన్న కలలు - కబుర్లుగా చెప్పాలి 
నా కల - కలకాలం చెప్పినా - రంగులూరుతుండాలి 
ఒక రంగు - పలు రంగులుగా వెలిగిపోతుండాలి 
ఇక రంగులేసి - అందరూ - నాలాగే మురిసిపోవాలి 
(ఈ కొసరు పాటకి అసలు పాటేంటో?)

నా రంగుల మాటలు, పాటలు ఇక్కడ కాసేపు ఆపుతాను. 

*********
*********

    ముందుగా - మునుముందుగా నేనొక అమ్మాయి కథ చెప్తాను. 

    కథ అన్నాను కదా - అందుకని అన్ని కథల్లాగే "అనగనగా..."  అనే మొదలు పెడతాను, కానీ నిజానికి ఇది కథ కాదు. ఒక అమ్మాయి కన్న రంగుల కల. 

    ఆ కలని కళగా మలచుకుని - ఆ రంగుల బొమ్మల కొలువునే తనకి ఆదాయమిచ్చే కొలువుగా మార్చుకున్న అమ్మాయి కథ. ఆ అమ్మాయి ఎవరో, తన కల ఏంటో, అది కళగా ఎలా మారిందో, ఆ కళ కూర్చిన కొలువేంటో చెప్పే ముందు - నేను మొదలుపెట్టిన కథ చెప్పేస్తాను, 

    అనగనగా ఒక తొమ్మిదేళ్ళ పాప. కుట్టుమిషన్ నేర్చుకోవాలి అని సరదా పడింది. వెంటనే వాళ్ళ అమ్మకి వెళ్ళి చెప్పింది. అమ్మ పాప సరదాని సరేనంది. క్లాసుకి పంపించడమే కాదు తన పాప కోసమని అమ్మా-నాన్న కలిసి ఒక మంచి మిషన్ కూడా కొనిచ్చారు. ఆ పాప బోల్డు సంబర పడి కొన్నాళ్ళు ఆటగా కుట్టుకుంది - కుడుతూ ఆడుకుంది. 

    ఈలోగా ఆ పాప పెద్దదయ్యింది. ఇల్లు దాటి కాలేజ్‌కి వెళ్ళింది. కుట్టుమిషన్ చిన్నబోయింది. ఇంట్లో ఓ మూలకెళ్ళిపోయింది. 

    పెద్దదైన పాప చదువుకుంది, పెళ్ళి చేసుకుంది, ఉద్యోగం చేసింది. అంతలో అమ్మయ్యింది.  అమ్మ అవుతూనే - "ఇంకెక్కడికీ వెళ్ళొద్దు" అనుకుని - ఇంటి పట్టునే ఉండి - పుట్టిన బుజ్జిబాబుతో ఆడుకోవాలనుకుంది. 

    అలా ఆడుకుంటూ - ఉంటుండగా - ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే కుదరదుగా! ఇంటికి కావాల్సిన అదీ-ఇదీ కొనుక్కోవాలంటే షాపుకి వెళ్ళాలిగా! అలా వెళ్ళిన ప్రతి చోటా Arts & Crafts section చూసినప్పుడల్లా ఆ అమ్మ ఇంక అక్కడే ఆగిపోయేది. ఆ మెత్తటి శాటిన్లని, వెల్వెట్లని, సిల్కులని చేతితో ముట్టుకుంటూ, రంగురంగుల పూసలని వేలితో తాకుతూ - ఏదో కలల ప్రపంచం లోకి వెళ్ళిపోయేది. ఎంత బావుందీ రంగుల ప్రపంచం అనుకునేది. 

    ఈలోగా బుజ్జిబాబుకి తోడుగా ఇంకో బుల్లి తమ్ముడు, చిట్టి చెల్లెలు ఒకరి తర్వాత ఒకరు వచ్చేశారు. అమ్మ ప్రపంచం మూడు పువ్వులు - ఆరు రంగులుగా వెలిగిపోతోంది.  

    ఓ రోజు బుల్లి తమ్ముడు బడి నుంచి వస్తూనే - పెన్సిళ్ళు పెట్టుకోవడానికి ఓ చిన్న పౌచ్ కావాలని - అది తనకిష్టమైన నారింజ రంగులో ఉండాలని, ఎలా ఉండాలో, ఎలా ఉంటేనే తనకి నచ్చుతుందో - అమ్మకి చెప్పాడు. ఎంత ఆలోచించినా అమ్మకి తన వరాల-బాబు కోరుకున్న అన్ని  వివరాల-సంచీ ఎక్కడ దొరుకుతుందో తెలీలేదు.  ఇలాక్కాదు పని అనుకుని ఓ రోజు బుల్లి తమ్ముడిని షాపుకి తీసుకెళ్ళి పెన్సిళ్ళు పెట్టుకునే పౌచ్ చెయ్యడానికి కావల్సిన సామగ్రి అంతా కొనుక్కొచ్చింది. ఆ తర్వాత అమ్మ, బుల్లి తమ్ముడు కూర్చుని ఆ పౌచ్ ఎలా ఉంటే బావుంటుందో డిజైన్ చేసుకున్నారు. ఇక తర్వాత మిగిలిందేంటి? మిషన్ మీద అమ్మ చకచకా పౌచ్ కుట్టేసి - Ta - Da అనెయ్యడమే! 

    అలా బుజ్జిబాబు, బుల్లి తమ్ముడు, చిట్టి చెల్లెలు - ఏదో కావాలని అడగడం - అమ్మ మంత్రమేసినట్టు - వాళ్ళు అడిగినవన్నీ చేసిచ్చేయటం - అలా చేస్తూ చేస్తూ అమ్మకి ఇంకా బోల్డన్ని మంచి ఆలోచనలు తట్టటం. తను చేసిన వాటన్నిటితో ఒక వెబ్‌సైట్ సృష్టించడం - అందులో వాటన్నిటినీ పేర్చడం - తన సరదా వ్యాపకాన్నే తనకు ఆదాయ-మార్గంగా మార్చుకోవడం గబగబా జరిగిపోయాయి. 

    ఇప్పుడు చెప్తాను ఆ అమ్మాయి / అమ్మ ఎవరో... తన పేరు రేణుకా గిరీష్. నాకు MCA లో జూనియర్. 

    తన వెబ్‌సైట్ పేరు టీల్ ఎండ్ టులిప్. 

ఒక్కసారి తన రంగుల లోకం చూసి రండి మరిTealAndTulip - Hand Crafted, Handmade Items, Handmade Accessories

    . 

*********
*********


    ఇక్కడి నుంచి - ఇందాకెప్పుడో ఆపిన నా రంగులపలక కబుర్లు మళ్ళీ మొదలు. 

    ఆ టీల్ ఎండ్ టులిప్ వెబ్‌సైట్‌లో రేణుక చేసి పెట్టిన కలరింగ్ బోర్డు ఒకటి నాకు చాలా నచ్చింది. 

Coloring Board Unlimited https://tealandtulip.com/shop/ols/products/coloring-board-unlimited

    అదొక ఏక్రిలిక్ (ప్లాస్టిక్) తో చేసిన బోర్డు. దాని మీద ఒక మంచి డిజైన్ చెక్కి (etch) ఉంటుంది.  ఆ డిజైన్‌ని మనకు నచ్చిన రంగులతో - మనసుకి నచ్చినట్టు నింపుకోవచ్చు. మళ్ళీ కడిగేసుకుని ఇంకోలా రంగులు నింపుకోవచ్చు. 

    నాకు చూడగానే భలే నచ్చేసింది ఆ రంగులపలక.  వెంటనే ఓ రెండు రంగులపలకలు తెప్పించేసుకున్నా. 

    2020 లో ఇంటికి (ఇండియాకి) వెళ్ళడం కుదరకపోవడంతో ఆఫీసులో ఓ రెండు వారాల సెలవులు మిగిలిపోయాయి.  

    రంగులపలక, రంగురంగుల పెన్నులు, రెండు వారాల సెలవులు - అంత కన్నా ఏం కావాలి? నేను కొన్న వాటిల్లో నాకు ఎక్కువగా నచ్చిన పువ్వుల-సీతాకోకచిలకల పలకకి రంగులేద్దామనుకున్నా! 



********
********

రంగులపలకలో కలకలమన్న కల

    సంక్రాంతి సంబరాల నెలలో - మా ఇంటి కిటికీ లోంచి బయటికి చూస్తే - నాకు కనిపించేవి రెండే రంగులు - తెల్లవారుతున్న పగలు అద్దుకునే ధూసరవర్ణం, పొద్దువాలుతున్న రాత్రి పూసుకునే నీలవర్ణం. 


అన్ని రోజులూ ధూసరమే!
అన్ని రాత్రులూ నీలమే!


ఎంత ధూసరమూ, ఎంత నీలమూ అంటే - ఆ పగటినీ, రాత్రినీ గట్టిగా పట్టుకుని రంగులు వేసేద్దామా అనిపించేంత. 

అల్లాంటి ఓ తెలుపూ-నలుపుల రోజు... 
రంగులపలక పరుచుకుని 
 రంగులపేనాలు పేర్చుకుని - 
బుగ్గన చెయ్యి చేర్చుకుని - 
కిటికీ పక్కన కూర్చున్నా - 
గాలిని వింటూ, వెలుగుని రమ్మంటూ, చినుకుని పొమ్మంటూ ! 

అలా అంటూ - రంగులపలక మీద కొన్ని రంగులు చిలకరించా... 
పలక మురిసి పువ్వులయ్యింది... 


వీచీ వీచని గాలి 
మినుకుమినుకు వెలుతురు 
కురిసీ కురియని చినుకు 
తోచీతోచని ఆ పూట ఓ మాటనుకున్నాయి 
ఆటాడుకుందామని పంటాలేసుకున్నాయి 

అది చూసి ఊగిన పూల ఎడదల చివుళ్ళు మొలిచె! 



పంటాలేసిన గాలి పండాయె 
పంతం లేని వెలుతురు జంటాయె 
పేచీ పెట్టిన చినుకు ఆటలో అరటిపండాయె 
గాలీ-వెలుతురు-ముసురు లేని చినుకు ఆట మొదలాయె 

మురిసి మురిసి పువ్వుపువ్వు రెమ్మ సోకు చేసుకొనె... 



ఆటలాడె  గాలి - ఏం చేసె?
ఆటాడుతూ వెలుతురు - మరి ఏమనె?
ఆటలో చేరని చినుకు - ఏమాయె?

అనుకుంటూ రెమ్మ మీద రెమ్మ చేరి ముమ్మురమయ్యె... 


 
ఆట లోన గాలి రువ్వె
ఆట ఆడుతూ వెలుతురు నవ్వె
ఆడలేని చినుకు చిమ్మలేక గమ్మునుండె

రువ్విన నవ్వులె చిన్ని హృదయపత్రాలాయె 

(చెట్లకుండే ఆకులు ఆకుపచ్చగా ఉండక తప్పదేమో కానీ నా రంగులపలక మీద ఆకులు వాటికి నచ్చిన రంగులేసుకోవచ్చు. అందుకే గులాబీ రంగు ఆకులయ్యాయి - హృదయపత్రాలయ్యాయి .)




హృదయపత్రపు లేత ఆకుపచ్చ అంచులాయె 


  
గాలి  రువ్విన వన్నెలు - పువ్వులాయె 
వెలుతురు నవ్విన నవ్వులు - రంగులాయె 



చినుకు చిమ్మీచిమ్మని  జల్లులు - ఊదారంగు చుక్కలాయె 




చుక్కలంచుల వాలిన సీతాకోకచిలుకలాయె 



పులకరించి పూచిన పువ్వులాయె - పువ్వుపువ్వున రంగులాయె
రంగురంగుల పువ్వులాయె - రంగరించిన పువ్వుల రంగులాయె



నా రంగులపలక కలలు పేనిన రంగులవల ఆయె 
ఆ రంగులవల రంగులపలకలో కలకలమన్న కల ఆయె 


********
********

    ఈ రంగులపలక మీద రంగులు వేయడం నాకొక మంచి ఉత్తేజభరితమైన కాలక్షేపం. 

    కొంచెంకొంచెంగా మొదలుపెట్టి - పువ్వులు, రెమ్మలు, ఆకులు, సీతాకోకచిలుకలు - ఇలా ఒక్కోదానికి ఒక్కో రంగు వేసుకుంటూ - రంగు మారినప్పుడల్లా ఫోటో తీసుకుంటూ - నేను రంగులతో ఆడుకున్నాను. ఆడుకుంటూ రంగులు వేసుకున్నాను. 

ఇంత మంచి కలరింగ్ బోర్డుని డిజైన్ చేసి అందించిన రేణుకకి శుభాభినందనలు! 

(TealAndTulip - Hand Crafted, Handmade Items, Handmade Accessories)

10, జనవరి 2021, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 24 - కవలపాటలు - తమిళ తరుణ చంద్రుడు... తెలుగు నెలరాజై పరుగిడె... హిందీ నీలి నీలి ఆకాశం మీద...


ఏ వలపు మెదిలి
ఏ తలపు కదిలి 
ఎవరు కట్టినదో 
పాట ఒకటి... 
ఎక్కణ్ణుంచో - తేలి వస్తుంది 

తేలి వచ్చిన ఆ పాట... 
ఎప్పట్లాగే - చెవికి సోకుతుంది 

చెవికి సోకిన ఆ పాట...  
ఎందుకో మరి - ఎదకు సొక్కనంటుంది 

చెవికి సోకి, ఎదకు సొక్కని ఆ పాటని 
ఎదను చేరుకుంది కదా అని ఓ మారు పలకరిస్తా... 
వదులుకోక - మర్యాదకు మది మాటున ఓ పక్కనుండమంటా... 

అలాగేనని అలా ఉండిపోతే అది పాటెందుకౌతుంది?!
అమ్మ కనురెప్పల కదలికకే  దోబూచులాడే పాపాయిలా 
మోవి మోగినప్పుడల్లా మురిసి మూగుతానంటుంది 
మనసు లేదు నువ్వంటే - 
మోయలేను నిన్నంటే- 
కినిసి మూగబోతుంది 
ఉలుకూపలుకూ లేక ఉస్సురంటుంది 

అలా అని వదిలిపోతే అది పాటెందుకౌతుంది?!
పెదవి కదిలిన ప్రతి పూటా 
పదేపదే పలకరిస్తుంది 
విదిలించిన కొద్దీ వెంటపడి వస్తుంది 
నేనూ నీ పాటనే కాదా?
ఏదో ఒక పూట నన్నోమారు తలుచుకోవా? - అంటుంది 

అంటూ అంటూ - నా వెంటే ఉంటూ 
పాటగా నాతో మాటలాడుతూ 
మాటలో తానే పాటలూరుతూ 
నా రాతల్లో చేరిపోతుంది 

ఎదకు సొక్కని ఓ నాటి ఆ పాట 
మదిని చుట్టి చుట్టమౌతుంది 
నా పాటగా మారి మోగుతుంటుంది 
*******
*******

    ఒక హిందీ పాట - చిన్నప్పట్నుంచి - ఎన్నిసార్లు విన్నా - విన్నవి పల్లవిలో మొదటి రెండు వాక్యాలు మాత్రమే. ఆ పాట పాడిన కిషోర్ కుమార్ పాడిన పాటలు - ఎన్నో - ఎంతో - ఇష్టమైనా - ఆ ఒక్క పాట మాత్రం ఎందుకో వినాలనిపించేది కాదు. 

   కురిసేది సముద్ర తీరపు మున్నీటి వాన అయినా, అదే ఆజ్యంగా మనసులో వలపు మంటని రేపిన మేఘాన్ని - గట్టిగా గదిమితే - అలిగి - కురవకుండా తేలిపోతుందేమో అన్నట్టు - మెత్తని గొంతుతో - "రిమ్ ఝిమ్ గిరే సావన్ .... సులగ్ సులగ్ జాయే మన్... భీగీ ఆజ్ ఇస్ మౌసమ్ మే - లగీ కైసీ యే అగన్? - అని అడుగుతున్నట్లు ఎంత బాగా పాడాడు కిషోర్ కుమార్ - కదా!

    మరి అదే కిషోర్ కుమార్ పాడిన పాటే ఇది... కలాకార్ సినిమాలో "నీలే నీలే అంబర్ పర్..." - నాకెందుకో నచ్చేది కాదు. పల్లవి. చిన్నప్పుడు రేడియోలో విన్నప్పుడు, ఇప్పుడిప్పుడు దేశీ-రేడియోలో - క్రితం వారం దాకా కూడా - ఈ పాట ఎప్పుడు వచ్చినా మొదలయీ అవకుండానే ఆపేసేదాన్ని. ఎందుకో అస్సలు వినాలనిపించేదే కాదు. 

     మరి అంత వినాలనిపించని పాట ఇప్పుడెందుకు వినాలనుకున్నానంటే - కిందటి ఏడాది సెప్టెంబర్ 26వ తారీఖున - బదరి ఫ్రెండ్ గిరిరాజ్ నాకొక రెండు పాటలు పంపించి వాటి గురించి నావైన మాటలు రాయమన్నారు. అందులో ఒకటి "నీలే నీలే అంబర్ పర్...". నేను ఏ పాటనైతే వినకూడదని అనుకున్నానో ఆ పాట గురించి రాయమని ఒక స్నేహపూరిత విన్నపం. 

    అప్పట్నుంచి ఎన్నిసార్లు ఈ పాట విన్నానో! ఎన్నిసార్లు యూట్యూబులో చూశానో! చూసిన కొద్దీ అస్సలీ పాట చూడకూడదు, వినకూడదు అన్న పంతం. 

    పాట విన్న ప్రతీసారీ అదేదో running commentary లాగా "ఈ పాట ఇంతకు ముందు విన్నప్పుడల్లా అమితాభ్ బచ్చన్‌ది ఏమో అనుకున్నాను. కనీసం అలా అయినా బావుండును. తీరా చూస్తే ఇది కుణాల్ గోస్వామి పాట. పైగా పక్కనే ఆ "యే జో హై జిందగీ" లో వేసిన రాకేష్ బేడీ ఎందుకలా కడుపు పట్టుకుని పొర్లుతున్నాడో?!" అని నా విసుగు-వ్యాఖ్యానం. 

    అది వినగానే "కుణాల్ గోస్వామి ఎవరు? అతని వివరాలేంటి?" అంటూ బదరి యథాలాప-ప్రశ్న. 

    ఆ ప్రశ్న వినగానే "ఎవరా? ఆ మనోజ్ కుమార్ ఉండేవాడు కదా... ఆయన కొడుకు" అంటూ నా బదులు. 

    "మరి మనోజ్ కుమార్ కొడుకు గోస్వామి ఎలా అయ్యాడు?" ప్రశ్న మీద ప్రశ్న సంధించు బదరి. 

    "అబ్బా! నన్ను అంటారు కానీ ప్రశ్నావళి అని, మీరడిగినన్ని ప్రశ్నలు నేను కూడా అడగను. హిందీలో అంతే - అయితే కపూర్, కాకపొతే కుమార్ అన్నట్టుండేది ఒకప్పుడు. అసలు పేర్లు ఉంచుకోవాలంటే కపూర్ అయ్యుండాలి, అరువు పేరు పెట్టుకోవాలంటే జాతిమతకులభేదాలు లేకుండా అందరూ కుమార్లే - దిలీప్ కుమార్, సంజీవ్ కుమార్, రాజ్ కుమార్, రాజేంద్ర కుమార్, ఉత్తమ్ కుమార్, ప్రదీప్ కుమార్ - అదే వరసలో మనోజ్ కుమార్. ఆయన అసలు ఇంటి పేరు గోస్వామి అయ్యుంటుంది. అందుకే కుమార్ కొడుకు గోస్వామి అయ్యాడు" ఒకటడిగితే వంద చెప్పే నా జవాబు. 

    "ఆహా!" అని ఆపేశారు బదరి. మా ఇంకో భాషలో "ఆహ!" అంటే "ఆపు హరికథ!" అని. కానీ అల్లాంటి నా భాషణా-నిరోధ-భాషలూ, భాషణలూ, సంభాషణలూ పట్టించుకునే అలవాటు లేకపోవడం వల్ల - నా కుణాల-విచారం కొనసాగించా. 

    "ఈ కునాల్ గోస్వామి-కే-పితా మనోజ్ కుమార్ నవ్వగా ఎప్పుడూ చూడలేదు. నవ్వట్లేదని నచ్చేవాడు కాదు నాకు. పైగా ఈ పాట సమయం, సందర్భం ప్రకారం - చల్లటి ౘందమామ-కాలం, వెన్నెల-వెలుగు సమయం. పిల్లా-పాపా, పువ్వూ-మొగ్గా హాయిగా జోలలూగే సమయం. అలాంటప్పుడు పాడే పాట ఎలా ఉండాలి? 

    అక్కడక్కడా బొద్దుగా కుదురుకుని, అటూఇటూ మెల్లగా దొర్లే దూదిమబ్బులని బుజ్జగించి, బ్రతిమాలి ఒకచోటికి తెచ్చుకుని వాటి మధ్యలో గాలిపాట వింటూ పడుకునేలా ఉండాలి కానీ ఆ మబ్బులన్నిటినీ పాట పుచ్చుక్కొట్టి పారిపోయేలా చెయ్యకూడదు. 

    ఈ గోస్వామేమో అవసరమైన దాని కన్నా నోరు కదిపేసి హడావిడి చేసేస్తున్నాడు. ఆ కిషోర్ కుమార్ కూడా మరీ అరుస్తున్నట్టు పాడుతున్నాడు. నాకు నచ్చలేదు ఈ పాట" అని తెగ గొడవ చేస్తూనే ఉన్నాను. 

    ఇంత మాట్లాడుతున్నానే కానీ -  ఎక్కడో ఒక పక్క నుంచి నన్ను ఆ పాట "నువ్వోసారి మాటలాపి - చెవులప్పగించి నన్నొక్కసారి వినూ - సరిగ్గా" అని పిలుస్తున్నట్టే ఉంది. 

    జీవితంలో వద్దనుకున్నది ఏదో ఒక సందర్భంలో చెయ్యాల్సొస్తుందని - అలా నన్ను నేనే కాదనుకునే సందర్భాలు రాకుండా ఉండాలని - ఎప్పుడూ "ఇది నేనసలు ఎప్పటికీ చెయ్యను" అనుకునే అలవాటు లేని నేను - ఈ పాటని మాత్రం ఎందుకు కాదనుకోవాలి? పాట ఒకసారి పూర్తిగా వినేస్తే సరిపోదా?  

    అలా అనుకుని - ఇహ ఇలాక్కాదని - మాట్లాడుతున్న నా నోరు, వీడియో చూస్తున్న నా కళ్ళు - గా... ఠిగా మూసుకుని - ఆ పాట విన్నాను. 

    ప్యార్ సే కస్‌నే కో - బాహోం మే బస్‌నే కో, సాసోం కీ గర్‌మీ కో - హాథోం కీ నర్‌మీ కో అంటూ ప్రాస కోసం హిందీ కవి ఇందీవర్ పడిన ప్రయాస, తమిళ ఇళయరాజా వరసని పట్టుకోలేకో, పట్టుకోవాలనుకోకో లక్ష్మీకాంత్-ప్యారేలాల్ కట్టిన పై స్థాయి-వరస నాకు ముందు అస్సలు నచ్చలేదంటే నచ్చలేదు. 

    విన్న మొదటి సారి పాట నచ్చకపోయినా పదే పదే విన్నా. 

    పదోసారి, పదకొండోసారి, పన్నెండోసారి... పదిహేడో సారి - పాట మధ్యలో ఓ పదిహేడు సెకన్ల పాటు (1:50 - 2:07) మబ్బులు దొర్లినట్టు మోగిన గిటార్ "టున్ టున్ టున్ - టున్ టుటున్ టున్ టుటున్ టున్ టుటున్లు" విన్నాను. 

    విన్న వెంటనే ఆ పాట నాకు నచ్చేసింది. ఇహ నేనెటు వెళ్తే అటు నాతో వచ్చేసింది. 

    విననని పట్టుపట్టిన నా చెట్ట పట్టి నాతో ఉండిపోయిన ఆ పాట ఇదిగో ఇక్కడ: Neele Neele Ambar Par - Male Version Lyric Video - Kalaakaar|Sridevi|Kishore Kumar - YouTube    


    


నీలే నీలే అంబర్ పర్ - చాంద్ జబ్ ఆయే
ప్యార్ బర్‌సాయే - హమ్ కో తర్‌సాయే
ఐసా కోఈ సాథీ హో...  ఐసా కోఈ  ప్రేమీ హో... 
ప్యాస్ దిల్ కీ బుఝా జాయే!

నీలే నీలే అంబర్ పర్ - చాంద్ జబ్ ఆయే
ప్యార్ బర్‌సాయే - హమ్ కో తర్‌సాయే
ఐసా కోఈ సాథీ హో...  ఐసా కోఈ  ప్రేమీ హో... 
ప్యాస్ దిల్ కీ బుఝా జాయే!

ఓ... ఊంఛే ఊంఛే పర్‌వత్ - జబ్ ఛూమ్‌తే హై అంబర్ కో
ప్యాసా ప్యాసా అంబర్ - జబ్ ఛూమ్‌తా హై సాగర్ కో
ఊంఛే ఊంఛే పర్‌వత్ - జబ్ ఛూమ్‌తే హై అంబర్ కో
ప్యాసా ప్యాసా అంబర్ - జబ్ ఛూమ్‌తా హై సాగర్ కో
ప్యార్ సే కస్‌నే కో - బాహోం మే బస్‌నే కో
దిల్ మేరా లల్‌చాయే - కోఈ తో ఆ జాయే
ఐసా కోఈ సాథీ హో...  ఐసా కోఈ  ప్రేమీ హో... 
ప్యాస్ దిల్ కీ బుఝా జాయే!

నీలే నీలే అంబర్ పర్ - చాంద్ జబ్ ఆయే
ప్యార్ బర్‌సాయే - హమ్ కో తర్‌సాయే

ఓ... ఠండే ఠండే ఝోంకే - జబ్ బాలోం కో సెహ్‌లాయే
తప్‌తీ  తప్‌తీ కిర్‌నే - జబ్ గాలోం కో ఛూ జాయే
ఠండే ఠండే ఝోంకే - జబ్ బాలోం కో సెహ్‌లాయే
తప్‌తీ  తప్‌తీ కిర్‌నే - జబ్ గాలోం కో ఛూ జాయే
సాసోం కీ గర్‌మీ కో - హాథోం కీ నర్‌మీ కో
మేరా మన్ తర్‌సాయే - కోఈ తో ఛూ జాయే
ఐసా కోఈ సాథీ హో...  ఐసా కోఈ  ప్రేమీ హో... 
ప్యాస్ దిల్ కీ బుఝా జాయే!

నీలే నీలే అంబర్ పర్ - చాంద్ జబ్ ఆయే
ప్యార్ బర్‌సాయే - హమ్ కో తర్‌సాయే

హే...  ఛమ్-ఛమ్ కర్‌తా సావన్ - బూందోం కే బాన్ చలాయే
శత్‌రంగీ బర్‌సాతోం మే - జబ్ తన్ మన్ భీగా జాయే
ఛమ్-ఛమ్ కర్‌తా సావన్ - బూందోం కే బాన్ చలాయే
శత్‌రంగీ బర్‌సాతోం మే - జబ్ తన్ మన్ భీగా జాయే
ప్యార్ మే నహానే కో - డూబ్ హీ జానే కో
దిల్ మేరా తడ్‌పాయే - ఖ్వాబ్ జగా జాయే
ఐసా కోఈ సాథీ హో ఐసా కోఈ ప్రేమీ హో
ప్యాస్ దిల్ కీ బుఝా జాయే

నీలే నీలే అంబర్ పర్ - చాంద్ జబ్ ఆయే
ప్యార్ బర్‌సాయే - హమ్ కో తర్‌సాయే
లాల లలాల  లాల లలాల 
లాల లలాల  లాల లలాల 

*******
*******


    ఇంతకీ నాకు అంతగా నచ్చని ఆ హిందీ పాట విని నచ్చుకోవడానికి కారణం - ఆ హిందీ "కలాకార్" సినిమాకి తమిళ మూలం "పయనంగళ్ ముడివతిలై". 

    అందులో ఇసై-రాజా ఇళయరాజా సంగీతసారథ్యంలో దక్షిణభారత-సంగీతవినీలాకాశ-వెన్నెలబాలుడు మా సుబ్బయ్య - మెత్తటి మీగడ గొంతులో కొంటెనవ్వుని రంగరించి - మబ్బుల్లో బజ్జున్న నెలబాలుణ్ణి బుజ్జగిస్తున్నట్టు పాడిన "ఇళయ నిలా పొళిగిరదే..."


    ఈ పాట రాసింది తమిళకవివజ్రం - వైరముత్తు. పాటలో కనిపించిన - నాకు తెలిసిన నటీనటులు - మోహన్, పూర్ణిమా జయరాం (ఈమె బాపు "మంత్రిగారి వియ్యంకుడు"లో చిరంజీవికి జంట, నిజజీవితంలో భాగ్యరాజాకి ఇంటిపంట, వంటింటివంట). 

    నాకు తమిళ పాటలు తెలుగులో రాయాలంటే కొంచెం భయం - కానీ బోల్డంత ఇష్టం. అందుకే సాధ్యమైనంత వరకు అర్థం చేసుకుంటూ రాయడానికి ప్రయత్నిస్తున్నాను. తప్పులుంటే తర్వాత సరిచేస్తా. 

    నాకు అర్థం అయినంత వరకూ ఈ పాట ఎంత poetic గా అనిపించిందో!

    ఆకాశ వీధిలో మబ్బులన్నీ కలలు కంటూ ఊరేగింపుగా వెళ్తుంటే, ఆకాశం పండగ చేసుకుంటోందట. 

    వరుం వళియిల్ - పనిమళైయిల్ - పరువ నిలా దినం ధనైయుం - ముగిలెడుత్తు - ముగం తొడైత్తు - విడియుంవరై నడై పళగుం -  ఆ మధ్యలో వానచినుకుల జల్లులో తడిసిన బాలచంద్రుడు మబ్బు తునకతో మొహం తుడుచుకుంటూ, వేకువ దాకా తానూ ఆ వేడుకలో నడుస్తున్నాడట. 

    పరువమగళ్ ... విరిగళిలే...  కణవు వరుం - అది చూసి కన్నెపిల్ల కళ్ళలో కలలొస్తున్నాయట. 

       ముగిలినంగళ్ - అలైగిరదే - ముగవరిగళ్ తొలైందనవో - ముగవరిగళ్ - తవరియదాళ్ - అళుతిడుమో... అదు మళయో -  ఆకాశ వీధి ఊరేగింపులో అటూ  పరిగెడుతున్న మబ్బులు వాటి వాటి నెలవులు మరిచి ఏడుస్తుంటే అది వానగా కురుస్తోందట.  పాటంతా పాడేటప్పుడు మా సుబ్బయ్య గొంతులో నవ్వు నింపుకునే పాడినా, ఈ రెండు లైన్లు పాడేటప్పుడు మాత్రం - ఏడుస్తున్న మబ్బులని ఓ చిన్న బాలుడిలా వెక్కిరిస్తున్నట్టు - చిలకరించిన నవ్వు మాత్రం ఈ పాటకు అదనపు అందం. 

    విన్వెలియిల్ విదైథదు యార్ నవమణిగళ్ - ఇంతకీ ఆ ఆకాశంలో ఆ నవరత్నాల విత్తులు నాటిందెవరు?

    ఎంత అందమైన భాష? అంతకన్నా అందమైన భావం!

    ఈ పాటకి ఒక మంచి వీడియో కూడా ఇక్కడ చూడండి: Age is Just A Number. SPB at 35! - YouTube
    



ఇళయ నిలా ... పొళిగిరదే
ఇదయం వరై ... ననైగిరదే
ఉలా పోగుం మేగం ... కనా కాణుమే .... విళా కాణుమే... వానమే
ఇళయ నిలా ... పొళిగిరదే

ఇళయ నిలా ... పొళిగిరదే
ఇదయం వరై ... ననైగిరదే
ఉలా పోగుం మేగం ... కనా కాణుమే .... విళా కాణుమే... వానమే
ఇళయ నిలా ... పొళిగిరదే

ఇళయ నిలా పొళిగిరదే
ఇదయం వరై ననైగిరదే

వరుం వళియిల్ - పనిమళైయిల్ - పరువ నిలా దినం ధనైయుం
ముగిలెడుత్తు - ముగం తొడైత్తు - విడియుంవరై నడై పళగుం
వరుం వళియిల్ పనిమళైయిల్ పరువ నిలా దినం నైయుం
ముగిలెడుత్తు ముగం తొడైత్తు విడియుంవరై నడై పళగుం
వాన వీదియిల్...  మేఘ ఊర్వళం... కాణుమ్ పోదిలే ... ఆరుదళ్ తరుం
పరువమగళ్ ... విరిగళిలే...  కణవు వరుం

ఇళయ నిలా ... పొళిగిరదే
ఉలా పోగుం మేగం ... కనా కాణుమే .... విళా కాణుమే... వానమే
ఇళయ నిలా ... పొళిగిరదే

ముగిలినంగళ్ - అలైగిరదే - ముగవరిగళ్ తొలైందనవో
ముగవరిగళ్ - తవరియదాళ్ - అళుతిడుమో... అదు మళయో
ముగిలినంగళ్ - అలైగిరదే - ముగవరిగళ్ తొలైందనవో
ముగవరిగళ్ - తవరియదాళ్ - అళుతిడుమో... అదు మళయో
నీల వానిలే ... వెళ్ళి ఓ డైగళ్ - ఓడుగిండ్రదే -  ఎన్న జాడైగళ్
విన్వెలియిల్ విదైథదు యార్ నవమణిగళ్

ఇళయ నిలా ... పొళిగిరదే
ఇదయం వరై ... ననైగిరదే
ఉలా పోగుం మేగం...  కనా కాణుమే...  విళా కాణుమే వానమే

ఇళయ నిలా ... పొళిగిరదే
ఇదయం వరై ... ననైగిరదే
    

*******
*******

    నా తమిళ-హిందీ కవల పాటల కబుర్లు చదివిన మిత్రులొకరు "తెలుగు పాట కూడా ఉందండి అంటూ నాకు పాట-సాయం చేశారు. 

    తెలుగులో సినిమా పేరు - అమరగీతం

    ఇక పాట విషయానికొస్తే - అదే సీను, అదే మోహను, అదే ట్యూను. 

    వేటూరి సుందరరామమూర్తి గారు అత్యద్భుతంగా పెదవుల కదలికకి తగినట్లుగా భలే రాశారు ఈ డబ్బింగు పాట.  

    ఇంతకు ముందు తమిళ పాట గురించి రాసినప్పుడు ఒక విషయం చెప్పటం మర్చిపోయాను - అదేంటంటే ఈ పాట మొత్తం గిటార్ సంగీతం నిండి ఉంటే ఒక్క చోట మాత్రం - పది సెకన్ల పాటు పిల్లనగ్రోవి చల్లగా వినిపిస్తుంది. అదెక్కడంటే మొదటి చరణం మొదలయ్యే ముందు. 

    ఈ తెలుగు పాటలో ఇంకో విశేషం ఏంటంటే "పరుగిడకూ..." అన్న పదం పాడేటప్పుడు ఎస్పీ అచ్చు తమిళ పాటలో "పొళిగిరదే..." అన్నప్పుడు ఎంత విరుపుతో,  ఇంకెంత vigour తో పాడాడో అంతే విరుపుతో "ఫ ఋ గి డ కూ..." అన్నట్టు భలే భలే పాడాడు. 

    తెలుగు పాటకి యూ ట్యూబ్ లింక్ ఇక్కడ:  https://www.youtube.com/watch?v=dFFEO52NNCc






నెలరాజా! పరుగిడకూ ...  
చెలి వేచే నాకొరకు...  
ఒక్కమారు పోయి... చెలిని గాంచుమా!
నివేదించుమా... విరహమే!

నెలరాజా! పరుగిడకూ ...   
చెలి వేచే నాకొరకు...  
ఒక్కమారు పోయి...  చెలిని గాంచుమా! 
నివేదించుమా... విరహమే!

నెలరాజా! పరుగిడకూ ...  
చెలి వేచే నాకొరకు... 

మబ్బులలో - తళుకుమనే - మెరుపేలే చెలి అందం 
ముచ్చటగా - ముత్యంలా - మెరిసిపడే సఖి పరువం  
మబ్బులలో - తళుకుమనే - మెరుపేలే చెలి అందం 
ముచ్చటగా - ముత్యంలా - మెరిసిపడే సఖి పరువం
వాడిపోనిదీ - వనిత యవ్వనం 
ఆడిపాడితే - కనుల నందనం 
అణువణువు -  విరిసేలే -  లావణ్యం 

నెలరాజా! పరుగిడకూ ...  
ఒక్కమారు పోయి.. చెలిని గాంచుమా!
నివేదించుమా... విరహమే!
నెలరాజా! పరుగిడకు... 

ముంగిటనే - రాచిలుకా - పలికేనూ స్వాగతము 
మురిపెంగా - తమ రాకా - నా చెలితో తెలిపేనూ 
ముంగిటనే - రాచిలుకా - పలికేనూ స్వాగతము 
మురిపెంగా - తమ రాకా - నా చెలితో తెలిపేనూ 

కొండవాగులా...  మల్లెతీగెలా 
పులకరించినా.. సన్నజాజిలా 
విరహిణిలా.. వేచేను - జవరాలే 

నెలరాజా! పరుగిడకూ ...  
చెలి వేచే నాకొరకు...  
ఒక్కమారు పోయి.. చెలిని గాంచుమా 
నివేదించుమా... విరహమే!

నెలరాజా! పరుగిడకూ ...  
*********
*********


ఇంత మంచి తమిళ పాటని, దాని కవల హిందీ పాటని నాకు  పరిచయం చేసిన మా గిటార్-రాజు గిరిరాజ్‌కి బోల్డన్ని  ధన్యవాదాలతో .... 

ఆ పైన తెలుగు పాట-సాయం చేసిన బ్లాగ్మిత్రులకు ఇంకా బోల్డన్ని ధన్యవాదాలతో... 

~ పాటల భైరవి 

 

3, జనవరి 2021, ఆదివారం

ముందుంది మంచికాలం - Can New Life, New Beginning ever be any Newer?! [New Year Terzanelle]

    ఎలా గడిచిందో ఏమో - గడిచిన ఏడాది కాలం! 

    మొదటి రెండు నెలలు గడిచాయో లేదో - మూడవ నెల మార్చ్ నుంచి... 
    ఇల్లు వదిలి బయటికి కదలాలంటే భయం
    బయట గాలి లోపలికి పీల్చాలంటే భయం 
    జలుబు అంటే జడుపు జ్వరం 
    దగ్గు, తుమ్ము చప్పుడుకి దడుపు, భయం
 
    ఎటు నుంచి ఎలా కమ్మేస్తుందో తెలియని, కనిపించని శత్రువుతో - ఎలా చేస్తే గెలుస్తామో తెలియని అయోమయపు యుద్ధం. 

    వార్తలలో చదవడానికి కూడా భయపడేలా - మనిషికి మనిషిని కాకుండా చేసిన - కనీ, వినీ ఎరుగని అమానుషత్వం. 

    పోయిన ప్రాణాలు - చెల్లాచెదురైన కుటుంబాలు, మూతపడిన వ్యాపారాలు - ఉపాధి కోల్పోయిన జీవితాలు, అల్లకల్లోలమైన నిత్యవ్యవహారాలు - అస్తవ్యస్తమైన చదువులు - ఇవన్నీ చాలక మనిషికీ మనిషికీ మధ్యన తప్పక ఉండాల్సిన ఆరడుగుల దూరం - ఎదురెదురుగా ఉన్నా ఒకరినొకరు చూసుకోలేని ముఖానికి ముసుగు -  ఇప్పటి తరానికి ఎప్పుడూ చూడని, విని ఉండని విచిత్రమైన పరిస్థితి ఇది. 

    ఇంత జరిగాక - ఇప్పుడు - ఇంతకన్నా జరిగేది ఇంకేముందని - ఇక ముందు ఇలా ఉండకుండా ఉంటే బావుండునని అనుకుంటూ - ముందుంది మంచి కాలం అని అందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ... నేను రాసుకున్న 2021 New Year Terzanelle - " Can New Life, New Beginning ever be any Newer?!" అందరితో పంచుకుంటూ - 




Can New Life, New Beginning ever be any Newer?!

 

New mark of resilience is etched in Time

New rays of glimmering Hope are in surge

Can New Life, New Beginning ever be any Newer?!

 

Push Tears and Sorrow back, make way for Smiles and Joy

Don’t fear the gloom, don’t fret in the dark any more

New rays of glimmering Hope are in surge

 

Let the Old whiles stay back, let the New times spring ahead

It’s time to charge ahead with a beam and conquer

Don’t fear the gloom, don’t fret in the dark any more

 

Smell the blooms, Feel the fresh breeze, Ease and pause

Laugh away the toils and troubles and tumults

It’s time to charge ahead with a beam and conquer

 

Be reassured! Worse spell is not an eternal visitant to stay

Mirthful Horizon is here leading the way sunnily

Laugh away the toils and troubles and tumults 

 

Ambition, Bravery, Courage be the new ABCs of Life

New mark of resilience is etched in Time

Mirthful Horizon is here leading the way sunnily

Can New Life, New Beginning ever be any Newer?!


**************************************

I wish you all a HAPPY and PROSPEROUS, a MERRY and MASKLESS New Year!