6, నవంబర్ 2024, బుధవారం

స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 2

క్రిందటి శ్లోకం / Previous slOkaH:  స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 1





*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

శ్లోకం - 2


కో న్వస్మిన్  సాంప్రతం లోకే 
గుణవాన్  కశ్చ  వీర్యవాన్
ధర్మజ్ఙశ్చ  కృతజ్ఙశ్చ 
సత్యవాక్యో  దృఢవ్రతః

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

అర్థం: 

ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టు వాల్మీకి మహర్షి నారదమునీంద్రుడిని అడిగినది ఏమిటంటే....

ఎవరు ఈ ప్రస్తుత ప్రపంచంలో గుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మజ్ఙుడు, కృతజ్ఙుడు, ఎప్పుడూ సత్యమునే పలికేవాడు, మరియు చేపట్టిన పనిలో పట్టుదల కలవాడు?



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)


కః - ను - అస్మిన్ - సాంప్రతం - లోకే= ఎవరు - ఇంకా - ఈ - ప్రస్తుత - ప్రపంచంలో?
గుణవాన్=గుణవంతుడు?
వీర్యవాన్=పరాక్రమవంతుడు?
ధర్మజ్ఙః=ధర్మజ్ఙుడు?
కృతజ్ఙః=కృతజ్ఙుడు?
చ=మరియు
సత్యవాక్యః=ఎప్పుడూ సత్యమునే పలికేవాడు?
దృఢవ్రతః=పట్టుదల కలవాడు?

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


श्लोकः - 2

को न्वस्मिन् साम्प्रतं लोके |
गुणवान् कश्च वीर्यवान् |
धर्मज्ञश्च कृतज्ञश्च |
सत्यवाक्यो दृढव्रतः |

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

 Meaning in English: 

From the first slOkaH, Vaalmiki asked Narada the following questions:

In this world at present who is having the virtues? Who is powerful? Who does know his duties and thankful for the services? Who tells the truth and who is determined in what he does?

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

Word to word meaning (In the same order of occurrence in the slOkaH):


कः - नु - अस्मिन् - साम्प्रतम् - लोके =Who - else - this - at present - in the world
गुणवान् =having virtues
वीर्यवान्=powerful
धर्मज्ञः=knows his duties
कृतज्ञः=who is thankful
सत्यवाक्यः=who tells the truth
दृढव्रतः=who is determined



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 3

5, నవంబర్ 2024, మంగళవారం

స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 1

    స్మర వారం వారం ... అంటే మళ్ళీ మళ్ళీ మననం చేసుకోమని అర్థం. 

    నేర్చుకున్న సంక్షేపరామాయణం రాసి పెట్టుకుంటే ఇంకెప్పటికీ గుర్తుండిపోతుందని అనిపించింది. 

    అందుకే ఈ "స్మర వారం వారం....సంక్షేపరామాయణం".

    నేను నేర్చుకున్న సంక్షేపరామాయణం నాతో పాటు మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడానికి కొందరు మిత్రులు, ఆత్మీయులు ఆసక్తి చూపించారు. వారు కూడా పాడుకోవడానికి, నేర్చుకోవడానికి వీలుగా వారానికో శ్లోకం, దాని అర్థం ఇక్కడ పంచుకోబోతున్నాను. 

    ముందుగా ...రాముణ్ణీ, రాముడి బంటు హనుమంతుణ్ణీ ఒకసారి తలుచుకుని మొదలెడుతున్నా.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం
భాష్ప వారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***






*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


అథ సంక్షేపరామాయణం!
శ్లోకం - 1

తపఃస్వాధ్యాయనిరతం  
తపస్వీ  వాగ్విదాం  వరం
నారదం  పరిపప్రచ్ఛ 
వాల్మీకిర్మునిపుంగవం


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    అర్థం: 
ముని వాల్మీకి మహర్షి తపస్వీ, వేదాధ్యనంలో నిమగ్నుడూ, వాగ్విదులలో శ్రేష్ఠుడూ, మునిపుంగవుడూ అయిన నారదుణ్ణి అడిగాడు. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

ప్రతిపదార్థాలు (శ్లోకంలో వచ్చిన క్రమంలో)


తపఃస్వాధ్యాయనిరతం=తపస్సు చేయడం లోనూ, వేదాలని అధ్యయనం చేయడంలో నిమగ్నుడిని (ఇది నారద మహర్షి గురించిన విశేషణం)
తపస్వీ=ముని (ఇది వాల్మీకి మహర్షికి సంబంధించిన విశేషణం) 
వాగ్విదాం=వేదవిదులలో 
వరం=శ్రేష్ఠుడిని (ఇది నారద మహర్షి గురించిన విశేషణం)
నారదం=నారదుడిని
పరిపప్రచ్ఛ=అడిగాడు
వాల్మీకిః=వాల్మీకి
మునిపుంగవం=మునులలో శ్రేష్ఠుడిని (ఇది నారద మహర్షి గురించిన విశేషణం)


    వాల్మీకి మహర్షి నారదమునిని ఏమని అడిగాడో తెలియాలంటే మనం ఇంకొన్ని శ్లోకాలు నేర్చుకోవాలి. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


For the friends who don't speak Telugu, I am going to give the slOkaH in the devanagari (Hindi / Sanskrit) script and its meaning in English.


    "smara vAraM vAraM..." means remember (or recite) again and again. 

    I felt like writing down the Sanskrit Ramayanam that I have learnt so that I would remember it forever.

    Hence, this "smara vAraM vAram... sankshepa rAmAyaNaM" series. 

    Some of my friends and family showed interest in joining me in this recitation journey. I am going to share here one slOkaM and its meaning every week so that they can also sing and learn.

    Before starting to learn sankshepa rAmAyaNaM, let's pray to Rama & Hanumaan with the following slOkAH:



श्रीराम राम रामेति - रमे रामे मनोरमे |
सहस्रनाम तत्तुल्यं - रामनाम वरानने ||

यत्र यत्र रघुनाथकीर्तनम् - तत्र तत्र कृतमस्तकाञ्जलिम् |
भाष्पवारि परिपूर्णलोचनं - मारुतिं नमत राक्षसान्तकम् ||


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



अथ संक्षेपरामायणम् |

श्लोकः - 1 

तपःस्वध्यायनिरतम् |
तपस्वी वाग्विदां वरम् |
नारदं परिपप्रच्छ |
वाल्मीकिर्मुनिपुङ्गवम् ||

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

Word to word meaning (In the same order of occurrence in the slOkaH)

तपःस्वध्यायनिरतम्=who is always engaged in the tapas and study of Vedas (adjective of Narada)
तपस्वी=Maharshi (adjective of Valmiki)
वाग्विदां=among the wise men
वरम्=the best (adjective of Narada)
नारदं=Narada
परिपप्रच्छ=asked
वाल्मीकिः=Valmiki 
मुनिपुङ्गवम्=the greatest among the sages (adjective of Narada)

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    Meaning in English: 

Maharshi Valmiki asked Narada, who performs penance (tapas), who is always engaged in the tapas and study of Vedas, who is the best among the wise men and who is the greatest among the sages.

    To know what Valmiki Maharshi asked Narada muni, we need to learn the next few slokas.

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


To be continued....స్మర వారం వారం ...సంక్షేపరామాయణం - 2


28, జులై 2024, ఆదివారం

www.వద్దు-వద్దు-వద్దు.com




*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

నేను దేన్నీ ఎప్పుడూ వద్దనుకోను

మూడు విషయాల్లో నేను వద్దనుకున్నదే కద్దైంది

ఒకటి 

మేమున్న చోట్లో  నెలవు. 

ఇంకోటి 

నేను కొలువు చేస్తున్న చోటు.

మరింకోటి 

ఇటీవలే మా నెలవుకొచ్చి కొలువు తీరిన కొత్త-తోమరి


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


వద్దనుకున్న చోటే కుదిరిన నెలవు:

    సెయింట్ లూయిస్ వెస్ట్ కౌంటీలో మాంచెస్టర్ రోడ్ అని ఒక అందమైన రోడ్ వుంది. 

    దానికి అనుబంధంగా రెయిన్కీ రోడ్ అని ఒక చిన్న రోడ్ వుంది. 

    మేము అప్పుడెప్పుడో అపార్ట్‌మెంట్లో వున్న రోజుల్లో రెయిన్కీ రోడ్‌లో వుండే తెలిసిన వాళ్ళెవరైనా ఏ శనాదివారాల్లోనో  పుట్టినరోజు పార్టీకో, ఇంకే పూజకో పిలిచేవారు.

    అలా పిలిచిన వాళ్ళింటికి వెళ్ళాలంటే మాంచెస్టర్రోడ్డు మీద నుంచి ఎడమ చేతి వైపున్న రెయిన్కీ రోడ్‌లోకి తిరగాల్సి వచ్చేది. 

    అప్పుడున్న ట్రాఫిక్కుని బట్టి ఒక్కోసారి ఐదూ-పది నిముషాల దాకా ఆ మధ్య లేన్‌లో వేచివుండాల్సి వచ్చేది. 

    అలాంటప్పుడు మనసులో "అబ్బా! సెలవు రోజుల్లోనే ఇంతసేపు పడుతోంది. ఇక రోజూ ఈ దార్లోనే ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఇంకెంత ఆలస్యమవుతుందో. అసలెప్పుడూ ఈ రోడ్డులో మాత్రం ఇల్లు కొనుక్కోకూడదు" అనుకునేదాన్ని.

    అమెరికాలో వుందామనుకుని ఇల్లు కొనుక్కుందామని అనుకున్నప్పుడు ఎక్కడెక్కడో తిరిగి ఎన్ని ఇళ్ళు చూసినా ఏదీ నచ్చక  - మళ్ళీ అదే మాంచెస్టర్రోడ్డు మీద నుంచి ఎడమ చేతి వైపున్న రెయిన్కీ రోడ్‌లోకి తిరిగి - ఇప్పుడు మేమున్న ఇల్లు నచ్చి కొనుక్కున్నాము. 

    మా ఇల్లు కొనుక్కునేటప్పుడు "అసలెప్పుడూ ఈ రోడ్డులో మాత్రం ఇల్లు కొనుక్కోకూడదు" అని నేననుకున్నానన్న సంగతే నాకు గుర్తు రాలేదు. 

    కాకపోతే మాకు రెయిన్కీ కన్నా ముందు రోడ్డు లోనే తిరిగి ఇల్లు చేరే వీలుంది కాబట్టి అంత ఇబ్బందేమీ లేదు. కానీ వద్దనుకున్నదే వరించినట్టయింది. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


వద్దనుకున్న చోటే చేరిన కొలువు:

    ఒకానొక ఏడాది ఆగస్టు ఐదో తేదీన రెండు విషయాలు తెలిశాయి. 

    ఒకటి పాస్ అయ్యానని. ఇంకొకటి తప్పానని. 

    ఇంటర్వ్యూలో పాసయ్యాను. 

    ఇంట్లో నెల తప్పాను. 

    సరిగ్గా - ఇలాంటి సందర్భమే - అంతకు ముందు - అన్నజింక పుట్టేటప్పుడు - ఎదురైనప్పుడు అనివార్య కారణాల వల్ల  ఉద్యోగాన్ని వదులుకోవల్సి వచ్చింది. 

    ఈసారి మాత్రం వచ్చిన అవకాశం పోగొట్టుకోకూడదూ, ఎలాగైనా రెండిటినీ నిభాయించాలీ అనుకుని ఉద్యోగంలో చేరాను. 

    సరిగ్గా ఏడు నెలలు పని చేసి కనడానికి పదమూడు రోజుల ముందు మానేశాను. 

    ఆ ఉద్యోగం చేసినన్నాళ్ళూ నా బాసు ఆడ-బాసు - literally, figuratively. 

    అదెలా అంటే - ఆవిడ ఆడావిడ obviously. 

    ఈడ (నేనున్న సిటీలో) కాకుండా ఆడ (వేరే సిటీలో) వుండేది. 

    ఆవిడెందుకో - పాపం! - నన్ను చూడకుండానే ఎందుకో నా మీద అనిష్టం పెంచుకుంది. 

    చాలా విసిగించింది. ఎలాగూ కొన్ని నెలల్లో మానేస్తాను కదా అని భరించాను. 

    అనుకున్నట్టుగానే delivery date దగ్గర పడుతుండగా ఉద్యోగం మానేశాను. 

    బుజ్జిజింక  పుట్టాడు. ఆఫీసన్న మాటే తలవకుండా హాయిగా ఆడుతూ-పాడుతూ కాలం గడిచిపోతోంది. 

    వాడికి పదకొండు నెలలప్పుడు ఓ రోజు బద్రి ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనే "ఆఫీసులో మురళి నీ CV అడిగాడు. వాళ్ళ టీంలో ఖాళీలు ఉన్నాయట" అన్నారు. 

    నేను వెంటనే "అమ్మో! ఆ ఆఫీసుకా ...నేను జన్మలో మళ్ళీ అటుకేసే రాకూడదనుకున్నాను, బావా!" అని అస్సలొప్పుకోలేదు. 

    కానీ ఆ మురళి బద్రి వెంటపడి అడిగి మరీ నన్ను తన టీం లోకి తీసుకున్నాడు. అప్పట్నుంచి నేను ఎన్ని టీములు మారినా అదే ఆఫీసులో పని చేస్తున్నాను. 

    మళ్ళీ వద్దనుకున్నదే వరించినట్టయింది కదా! 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


వద్దు వద్దనుకున్నా వచ్చేసిన వైఫై-వాషర్:

    దాదాపు మూడున్నరేళ్ల క్రితం మా తోమరి ఇక సాగలేనని ఆగింది. కానీ దెబ్బకి దడిచి మళ్ళీ సాగింది. ఆ కబుర్లు మళ్ళీ ఇక్కడొకసారి గుర్తు చేసుకున్నా. 

తొందరపడి మా తోమరి - ఎందుకో ఆగిందీ... దెబ్బకి సాగిందీ...

    ఒక దెబ్బకి ఆ రోజు సర్దుకుని పనిచేయడం మొదలు పెట్టిన ఆ తోమరి ఇంకా పనైతే చేస్తూనే వుంది. 

    కానీ పై ర్యాకు ఓ పక్కకి ఒరిగిపోయింది. కింది ర్యాకుకి చక్రాలు వూడిపోయాయి. 

    ఎప్పుడోప్పుడు లోపల లోడ్ చేసిన గిన్నెలూ, కంచాలూ దొర్లుకుంటూ బయటికి వచ్చేస్తాయేమో అనిపించేలా తయారైంది. 

    అన్నట్టు - అప్పుడప్పుడూ మా తోమరికి  ప్రేంనగర్ - వాణిశ్రీ పూనుతూ వుంటుంది. 

    అంతే ... ఆవేశంతో వూగిపోతూ -----

ఎవరో రావాలీ
ఈ ర్యాకులు...సవరించాలీ
నా wheelలు బిగియించాలీ...
నాలో గిన్నెలు తొలగించాలీ...

    -----అని పాడుకుంటుంటుంది. 

    సర్లే! ఆవేశాలతో ఊగిపోయి, ఆయాసంతో అదాగిపోయేదాకా ఆగే కన్నా ముందే ఓ కొత్త డిష్వాషర్ కొనేసుకుంటే మంచిదనిపించింది. 

    ఎప్పుడైతే కొత్త-తోమరి కొనుక్కుందామనుకున్నామో - మా ఇంట్లో వున్న నలుగురం - అమ్మా-నాన్నా-ఇద్దరబ్బాయిలం - ఏకగ్రీవంగా డంబ్-డిష్వాషర్ మాత్రమే కొనుక్కోవాలని అనుకున్నాము. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    అసలే ఈ మధ్య అన్నీ స్మార్ట్ అయిపోతున్నాయి. 

    చెవిలో ఫోను స్మార్టు. 

    చేతికున్న వాచు స్మార్టు

    బట్టలుతికే వాషర్ స్మార్టు.

    గిన్నెల్తోమే డిష్వాషర్ స్మార్టు. 

    అసలు గిన్నెలు తోమడానికి భుజబలముండాలి కానీ బుద్ధిబలమెందుకంట - అడిగేవాళ్ళు లేక ఆఖరికి యంత్రాలక్కూడా అలుసైపోతున్నాం. 

    తీరా ముచ్చటపడి స్మార్ట్ డిష్వాషర్ కొనుక్కొచ్చి ఇంట్లో వైఫైకి కనెక్ట్ చేస్తే అదేమన్నా ఊరికే వుంటుందా?

    రోజుకి నేనెన్ని సార్లు దాన్ని on చేస్తున్నానూ, ఎప్పుడెప్పుడు on చేస్తున్నానూ, అందులో ఏ డిష్వాషర్ లిక్విడ్ వాడుతున్నానూ, ఎన్ని గిన్నెలు పెడుతున్నానూ, ఎన్ని కంచాలు కడుగుతున్నానూ, ఎన్ని గరిటెలు వాడుతున్నానూ - ఇలాంటివన్నీ లెక్కేసి దాన్ని తయారు చేసిన కంపెనీ వాడికి పంపిస్తుంది. 

    వాడు ఆ డేటానంతా ఇంకెవరెవరికి అమ్ముతాడో!

    ఇహప్పట్నుంచీ - నువ్వు గిన్నెలెక్కువ తోముతున్నావ్, నీ తోమరిని అరగదీసేస్తున్నావ్, మీ home appliance insurance పెంచేస్తామని బెదిరింపులొస్తాయేమో! 

    ఏమైనా కొనుక్కోవడానికి ఏదైనా కొట్టుకెళ్తే నా తోమరి పంపించిన కడుగుడు-డేటా లెక్కలతో నా మొహాన్ని గుర్తు పట్టేసి ఇహ నేను ఆ స్టోర్ లోంచి బయటికి వచ్చేదాకా రకరకాల గిన్నెలు తోమే సబ్బులూ, బిళ్ళలూ, పీచుల గురించి అడ్వర్టైజ్మెంట్లతో నా చెవులు చేటలైపోతాయేమో!

    లేకపోతే నా స్మార్టు-తోమరికే తెలివెక్కువై - నేను రోజుకోసారే తోముతా అని మొండికేస్తుందేమో!

    అందుకే మా ఇంటికి రాబోయే తోమరికి "నాచురల్-ఇగ్నోరెన్స్ ముద్దు... ఆర్టిఫిషియల్-ఇంటెలిజెన్స్ వద్దు" అనుకున్నాం. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    అనుకున్న వెంటనే మా అభిమాన Costco కొట్లో  ఒకట్రెండు మోడల్సు ఎంపిక చేసుకున్నాము కూడా. 

    తీరా కొనబోతే -  "ఈ డిష్వాషర్లు రకానికొకటి కొట్లో అందరూ చూస్తారని పెట్టాము, కొనుక్కోవాలంటే మాత్రం మీరు online లో ఆర్డర్ చేసుకోవాల్సిందే" అని చెప్పారు. 

    సరే! అని ఇంటికొచ్చింతరువాత బద్రి కాస్టుకో డాట్కాంలో వెతికితే  - మేము స్టోర్లో చూసిన దానికన్నా మంచిదేదో కనిపించిందీ, దానికి బోల్డన్ని మంచి రివ్యూలు వున్నాయని చెప్పి - ఓ కొత్త-తోమరిని ఏరికోరి ఎంపిక చేశారు. 

    ఓ మంచిరోజున వానకురవని ఎండపూట కొత్త-తోమరి మా ఇంటికొచ్చింది. 

    మోసుకొచ్చిన ఇద్దరు ఇంట్లో పెట్టివెళ్ళగానే - ఇంకో ఇద్దరు తలుపు తోసుకుంటూ వచ్చి దాన్ని బిగించి వెళ్ళారు. 

    కొత్తది బిగించి పాతది వాళ్ళు పట్టుకుపోతున్నపుడు మా పాత-తోమరి మీదున్న "Clean - Dry" మాగ్నెట్టుని తీసి మా కొత్త-తోమరి మీద పెట్టాను. అది దాని డిష్షు -పారంపర్యాభరణం మరి! 

    ముచ్చటగా వున్న తోమరిని చూసుకుని మురుస్తున్న మాకు డిష్వాషర్ తలుపు మీద మిలమిల్లాడుతూ మెట్లుమెట్లుగా వున్న WiFi చిహ్నం కనిపించింది. 

    అంటే -  పదేపదే ఏ smart dishwasher ఐతే వద్దనుకున్నామో - అదేఅదే మా వంటింట కొలువైంది. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఏ మాటకామాటే చెప్పుకోవాలి. 

    మా కొత్త-తోమరి అసలు చప్పుడే చేయదు. మూగగా తోముకుపోతుంది అంతే. 

    ఇక్కడింకో తమాషా విషయం చెప్పాలి. 

    నేను మామూలుగా రోజూ రాత్రి పడుకునేముందు డిష్వాషర్ on చేస్తాను. 

    కిందటి వారం ఓ రోజు పొద్దున్న లేచి చూడగానే మా కొత్త-తోమరి తలుపు తీసి వుంది. 

    నేను పడుకున్న తరవాత పడుకున్న బుజ్జిజింక పాలు తాగే కప్పు తీసుకోవడానికి తెరిచి వుంటాడనుకున్నాను. పెద్ద పట్టించుకోలేదు. 

    మొన్నో రోజు రాత్రి వేయడం మర్చిపోయానని పొద్దున్నే ఎనిమిదింటికి డిష్వాషర్ on చేశాను. 

    ఆఫీస్ కాల్‌లో మాట్లాడుతూ మంచినీళ్ళు తాగుదామని వంటింట్లోకి వెళ్ళగానే వాష్-సైకిల్ పూర్తవడానికి ఇంకో ఐదు నిముషాలుంది. కానీ డిష్వాషర్ డోర్ తెరిచి వుంది. 

    ఇంట్లో నేను తప్ప ఎవరూ లేరు. 

    ఒళ్ళు ఝల్లుమంది. బోల్డన్ని హారర్ సినిమాలు గుర్తుకొచ్చాయి. 

    ఏదో పట్టపగలే కాబట్టి ఆట్టే భయపడకుండా - "ఇదేంట్రా బాబూ! కొత్తది అప్పుడే పాడయ్యిందా ఏంటి? " అనుకుని ఎందుకైనా మంచిదని google లో "డిష్వాషర్ తలుపు ఎందుకు తెరుచుకుందీ?" అని వెతికా. 

    హమ్మయ్య! అది ఈ మధ్య వస్తున్న డిష్-వాషర్లలో కడిగిన గిన్నెలు ఇంకా బాగా ఆరడానికి తలుపు దానంతట అదే తెరుచుకునే ఫీచరొకటి పెట్టారట. అదీ సంగతి. 

    ఎంతైనా స్మార్ట్ అంటే స్మార్టే మరి! 

    ఇంకా నయం! కడిగిన గిన్నెలన్నీ వెంటనే ఖాళీ చేయట్లేదని కిందకి దిమ్మరించెయ్యట్లేదు. 

    అంత స్మార్ట్ కాకపోతే అదే పదివేలు! 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


8, జులై 2024, సోమవారం

ఎఱుక లేని నా ఎదటే...పలుకు పాటై నా ఎదనే...(రాముడు)

రాముడు
శివుడు
కృష్ణుడు

చిన్నప్పట్నుంచీ మూడు దశలుగా ఈ ముగ్గురూ నాకెఱుకే... 

వీళ్ళు ముగ్గురూ 
నేనెరిగినంతలో 
కరకు రాతి గుళ్లల్లో వుంటారు
కొలుచు జాతి గుండెల్లో వుంటారు
ఊహకందని ఉనికై వుంటారు
మనిషిని మించిన మనికై వుంటారు 

*** *** *** *** *** *** *** 
*** *** *** *** *** *** *** 

    చిన్నప్పట్నుంచీ ఎప్పుడు ఏ గుడికి వెళ్లినా కళ్ళు మూసుకుని ఆ గుళ్లో వున్న మూర్తికి సంబంధించిన శ్లోకమో, స్తోత్రమో మనసులో అనుకోవడం నాకు అలవాటు. అంతకు మించి ఇంకో ఆలోచనే ఎప్పుడూ రాలేదు ఇప్పటి దాకా. 

    నిజం చెప్పాలంటే నేను తఱచు వెళ్లే గుళ్లు కూడా తక్కువే. నేనెప్పుడూ వెళ్ళే గుళ్లు - మా శివకోడు శివాలయం, పుంతలో ముసలమ్మ గుడి  - అనాతవరంలో శివాలయం, విష్ణాలయం, ముత్యాలమ్మ, మరిడమ్మ, కట్లమ్మ - అయినవిల్లి వినాయకుడు - వానపల్లి పళ్ళాలమ్మ - ఎప్పుడో వెళ్లిన తిరుపతి - ఈ మధ్యే చూసిన ఒంటిమిట్ట రాముడు - అంతే!

    ఏ గుడికి వెళ్లినా నిర్నిమిత్తంగా చేసే ఓ ప్రదక్షిణం, పళ్లెంలో వేసే దక్షిణ, చేతికి చిక్కే పటికబెల్లపు పలుకు, నోటికి దక్కే ఉద్ధరిణెడు తీర్థం, జడలో చేరే ఓ పువ్వు, నొసటన చేరే కుంకుమో, విభూతి బొట్టో.  

    ఆ గుడి మెట్ల మీదో, కోనేరు గట్టు మీదో ఓ పది నిముషాలు కూర్చుని ఏ రావిచెట్టు గాలో ఊపిరి నిండా నింపుకోగలిగితే గుళ్లో వున్న దేవుడు కనికరించి కళ్లెదుట నిలిచినట్టే. 

    గుడికి వెళ్లినా ఏమైనా కోరుకోవడం అసలెప్పుడూ లేనిదే. దేవుడే దిగొచ్చి తీర్చాల్సినంత పెద్ద కోరికలేమీ లేకపోవడం ఒక  కారణం. 

    అంతే కాకుండా అసలు నా నమ్మకమేంటంటే మనవన్నీ  ముందే రాసేసున్న కథలు. 

    ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. 

    కొందరికి వాళ్ళు అనుకున్నది, వారి కథలో రాసున్నది దాదాపుగా coincide అవుతుంది. అంటే ఒక సినిమా చూస్తూ దర్శకుడు తీద్దామనుకున్న కథని మనం ముందే ఊహించగలిగినట్టన్నమాట. 

    ఇంకొందరికి వాళ్ళనుకున్న దానికి భిన్నంగా జరుగుతుంది - అంటే సస్పెన్సు సినిమాలాగా అన్నమాట. 

    ఇలా జరగాలని అనుకోవడం, అనుకోకపోవడం కూడా ఎవరెవరు ఎంత సంతోషించాలీ, ఇంకెవరు ఎంత బాధ పడాలీ అన్న లెక్కల్లోనే జరుగుతాయి. 

    అలాంటప్పుడు నేను కోరుకున్నా కోరుకోకపోయినా నాకు జరగాల్సినవాటిల్లో ఏ మార్పూ వుండదేమో, ఆ మాత్రం దానికి - పిపీలకమాత్రపు నేను - ఆ దేవుణ్ణి ఎందుకబ్బా disturb చేయడం అనిపించడం కూడా - నేను దేవుడికి పెట్టే దండంలో ఒట్టి దండం తప్ప కోరికల-దండకం లేకపోవటానికి ఒక కారణం. 

    అన్నిటికన్నా ఇంకో పెద్ద కారణమేంటంటే 'ఏమన్నా కావాలీ' అని దేవుణ్ణి అడగడానికి నాకు బోల్డు మొహమాటం. ఇవ్వాల్సిందేదో ఇచ్చే పంపించి వుంటాడు కదా- ఇంకా ఏమడుగుతాంలే అని. 

*** *** *** *** *** *** *** 
*** *** *** *** *** *** ***

    ఒక ఉదాహరణ చెప్తా. 

    మా వంటింటి గోడ వారగా అప్పుడప్పుడూ చీమలొస్తుంటాయి. వాటికి నేను ఒక్కోసారి బెల్లమ్ముక్కలు పెడుతుంటాను. 

    అది ఎందుకూ అంటే "పాపం - అంత చిన్నచీమ, తనకు మించిన బరువు మోసుకెళ్తూ కష్టపడుతుందీ, నేను చిటికెడు బెల్లప్పొడి పెడితే దానికి బోల్డంత అనిపిస్తుంది కదా!"అని. 

    ఒక్కోసారి అలాక్కాకుండా వాటి దార్లో పొరపాట్న ఒలికిన పంచదారేదో మోసుకెళ్ళిపోతుంటాయి మా వంటింటి చీమలు. 

    అలాగే ఒక్కోసారి చీమలొచ్చినా ఏ పని హడావిడిలోనో వుండి నేను పట్టించుకోను. అసలేమీ పెట్టను. 

    వాటి ప్రాణానికి ఏదో దొరికింది అని పట్టికెళ్ళడం తప్ప "ఆ బెల్లమ్ముక్క ఎవరో మనకి పెట్టినది, ఈ పంచదార మనకి ఉట్టినే దొరికినది" అని లెక్కలేసుకుంటాయని నేననుకోను. 

    అసలు వాటికి నా ఉనికి కూడా తెలీదేమో.  

*** *** *** *** *** *** *** 
*** *** *** *** *** *** ***

    నాకు చీమలెలాగో దేవుడికి నేనలాగ అనిపిస్తుంది నాకు. 

    అలాంటప్పుడు నా ఉనికే తెలియని దేవుడిని "నాకు అదియ్యి ఇదియ్యి" అని అడగడం ఏం బావుంటుందబ్బా అనుకుంటాను. 

ఆందుకే "గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం" అన్న మాటల్ని నా వరకు నాకు "చేతికి చిక్కిన పేలపిండి కృష్ణదత్తం" అనుకుంటాను. 



*** *** *** *** *** *** *** 
*** *** *** *** *** *** *** 

    అసలూ .... ఒకప్పుడు దేవుళ్ళు భూమికి దగ్గర్లోనే వుండేవాళ్ళనుకుంటా. 

    అందుకే తపస్సులు చేస్తే ప్రత్యక్షమయ్యి వరాలు ఇచ్చేవాళ్ళు. 

    ఆ తర్వాత ఆ ప్రత్యక్షమవడాలు తగ్గించుకుని నిష్కామంగా ఎవరు పూజ చేసినా కనీసం కలలో అయినా కనిపించేవారు. 

    తర్వాత్తర్వాత పవళింపు సేవకీ, సుప్రభాత సేవకీ మధ్య విరామం కూడా ఇవ్వకుండా IST (Indian Standard Time) లోనే కాకుండా అమెరికన్, బ్రిటిష్, ఆస్ట్రేలియన్ - ఇలా అన్ని కాలమానాల్లో - రోజులో వున్న ఇరవైనాలుగ్గంటలూ దండాలూ, దండలూ, దర్శనాలూ అంటే ఎంతటి దేవుడికైనా "భూమ్మీదుంటే సుఖం లేదంతే" అనిపించి "ఈ ఇహము నాకహితము, నాకమే నాకు హితమూ" అని ఎవరికీ అందక ఎంచగ్గా ఎందో వుండి వుంటాడు. 

*** *** *** *** *** *** *** 
*** *** *** *** *** *** *** 

    ఇదే నాతో నాకున్న పేచీ. 

    ఏదో చెబ్దామని మొదలుపెట్టి అది తప్ప ఇంకేవో చెప్పేసుకోవడం. 

    ఇవాళసలు నాకు అంచెలంచెలుగా ఎఱుకైన ముగ్గురు దేవుళ్ళ గురించి మూడంచెల్లో గుర్తు చేసుకుందామని మొదలుపెట్టి మొదటి అంచె దరిదాపుల్లోకి కూడా రాకుండా ఎక్కడెక్కడో  సంచరిస్తున్నాను. 

    ఇదిగో... ఇప్పుడు మళ్ళీ రాముడి అంచె దగ్గరికి వస్తున్నాను. 


*** *** *** *** *** *** *** 
*** *** *** *** *** *** *** 


    రాముడితో నా మొదటి పరిచయం మా నాన్న నాకు పాడిన జోలలో. 

రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం
రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం

గోవింద రాంరాం
గోవింద హరిహరి
గోవింద జయజయ
గోవింద రాధేశ్యాం

హరే రామా గోవిందం
అర్జునసారథి గోవిందం
పాండవపక్షా గోవిందం
పరమపవిత్రా గోవిందం

గోవింద రాంరాం
గోవింద హరిహరి
గోవింద జయజయ
గోవింద రాధేశ్యాం

రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం
రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం

    నాకు పాడిన ఆ జోలపాటే నా పిల్లలకూ పాడారు నాన్న. 

    అదే వరసలో నేనూ పాడాను. 

    ఒక మాట అటూ - ఇటూగా మరచి మార్చి పాడానేమో కూడా --- 

    రాముడితో మొదలుపెట్టి గోవిందమైన ఈ పాట ఇక్కడ చదివి మా నాన్న రేప్పొద్దున్న నాకు ఫోన్ చేసి "హన్నా! పాట తప్పు రాశావు - సరి చెయ్" అనెలాగూ చెప్తారు. అప్పుడొచ్చి మళ్ళీ తప్పులు దిద్దుతా. 


*** *** *** *** *** *** *** 
*** *** *** *** *** *** *** 

    "అత్తా, అమ్మా, నాన్న, నాన్నమ్మ"  అంటూ మాటలు నేర్చిన నాకు మా నాన్నమ్మ నేర్పిన లాలిపాటలో రాముడు మళ్ళీ పలకరించాడు. 

రామా లాలీ .... మేఘశ్యామా లాలీ...
తామరసనయనా.... దశరథతనయా లాలీ...

*** *** *** *** *** *** *** 
*** *** *** *** *** *** *** 


    "అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ..." అంటూ మాటలు రాయడం నేర్చుకుంటున్న నాకు మా అమ్మ పాడిన పాటలో రాముడు దర్శనమిచ్చాడు. 



జయ జయ శ్రీరామా... 
రఘువరా - శుభకర శ్రీరామా
త్రిభువనజననయనాభిరామా...
త్రిభువనజననయనాభిరామా...
జయ జయ శ్రీరామా... 
రఘువరా - శుభకర శ్రీరామా
(జయసింహ సినిమాలోది) 

*** *** *** *** *** *** *** 
*** *** *** *** *** *** *** 


    ఆ తర్వాత ఆరో తరగతి చదువుతున్నప్పుడు నాకు తమాషాగా అనిపించి పాడుకున్న పాటలోనూ రాముడే... 

నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంటా...
నా నావ మీద కాలు పెడితే ఏటవుతాదో తంటా...
రామయ తండ్రీ...ఓ రామయ తండ్రీ 
(సంపూర్ణ రామాయణం సినిమాలోది)

    ఎనిమిదో తరగతి సెలవుల్లో ఇంట్లోకి కొత్తగా వచ్చిన టూ-ఇన్-వన్‌లో విని నేర్చుకున్న "లవకుశ" సినిమా పాటలూ-పద్యాల్లోనూ, పుహళేంది కట్టిన ప్రైవేట్ ఆల్బమ్ "రామగానలహరి" లోనూ రాముడే. 

    పదో తరగతి సెలవుల్లో నేర్చుకున్న పాటలోనూ రాముడే. 

రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా 
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యమునేలగా

(శ్రీరామగానామృతం అనే ఒక ప్రైవేట్ ఆల్బంలో వచ్చిన 
ఈ పాటంటే నాకు భలే అబ్బురం - 
నాస్తికులని విన్న ఆరుద్ర ఎంత ఆస్తికమైన పాట 
తెలుగువారికి ఆస్తిగా ఇచ్చారా అని!)


    ఇంకొన్నాళ్ళకి పాటల్లో సాహిత్యం బాగా అర్థం కావడం మొదలయింది. 

    అప్పుడు నాకు ఇష్టమైన పాటల రచయిత వేటూరి సుందరరామమూర్తి రాసిన 'పంతులమ్మ' సినిమా పాట విన్నాక "హమ్మయ్య! నాకు రాముడు తెలీదని బెంగ లేదు - ఎదుట పడే మనుషుల్లో కనబడే మంచే రాముడయ్యుంటాడు" అనిపించింది. 

    ఆ పాటేంటంటే... 


ఎరిగిన వారికి ఎదలో వుంటాడు...
ఎరుగని వారికి ఎదుటే వున్నాడు...

... .... ... .... ... 
మనసెరిగినవాడు మాదేవుడు - శ్రీరాముడు 
(పంతులమ్మ సినిమాలోది)

*** *** *** *** *** *** *** 
*** *** *** *** *** *** *** 


    పైన చెప్పిన పాటలే కాకుండా ఇంకా ఎన్నోఎన్నో రాముడి పాటలు విన్నాను, నేర్చుకున్నాను - నేర్చుకుంటూనే వున్నాను. 

    ఆ నేర్చుకున్న పాటలూ, ఆ పాటల్లో నేర్చుకున్న జీవితపాఠాలూ ఇంకోసారెప్పుడైనా బోల్డన్ని కబుర్లు చెప్తాను - కానీ ఇప్పటికి చెప్పాల్సిన విషయం ఒకటీ,  విశేషం ఇంకోటీ ఉన్నాయి. 

    ముందుగా విషయానికొస్తే - మొన్న జూన్ 25వ తేదీన నా సంస్కృతభారతి కోర్స్  "సంభాషణతః శాస్త్ర పర్యన్తమ్" నాలుగవ పరీక్షా (శాస్త్రమ్)  ఫలితాలు వచ్చాయి. మొత్తానికి నాలుగు పరీక్షలు పాస్ అయి KKSU (కవికులగురు కాళిదాసు సంస్కృత విశ్వవిద్యాలయం) వారి నుంచి ఒక యోగ్యతాపత్రం అందుకున్నాను. 

    ఇహిప్పుడు విశేషం ఏంటంటే.... ఆ నాలుగో లెవెల్లో నా పాఠ్యాంశం "సంక్షేప రామాయణం". 

    సంక్షేప రామాయణం అంటే వాల్మీకి రచించిన రామాయణ కావ్యంలో బాలకాండలోని ప్రథమసర్గలోని వంద శ్లోకాలు. ఇందులో లోకంలో సర్వోత్తమగుణాలు కలిగి మహనీయుడైన వారెవరని అడిగిన వాల్మీకికి నారదుడు టూకీగా రాముడి కథ చెప్తాడు. 

    ఆ కథ మన లవకుశ సినుమాలో రెండు పాటలంత కథ. 

    "వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా" అంటూ రామపట్టాభిషేక సంభారాలతో మొదలు పెట్టి "శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా" అంటూ సీతారాములు అయోధ్యకి తిరిగొచ్చి రాజ్యం ఏలే దాకా సంక్షిప్తంగా వుంటుంది. 

*** *** *** *** *** *** *** 
*** *** *** *** *** *** *** 

    మా శాస్త్రం కోర్సులో భాగంగా మొదటి ముప్ఫై శ్లోకాలు ప్రతిపదార్థతాత్పర్యసహితంగా, వ్యాకరణంతో సహా నేర్పారు. ఆ 30 శ్లోకాలు కంఠస్థం కూడా చేయాలీ అన్నారు. 

    అలా ముప్ఫయ్యే కంఠస్థం చేస్తే మరింకో డెబ్భై శ్లోకాలు మిగిలిపోతాయి కదా! 

    అందుకని ఫిబ్రవరి 5 వ తేదీన మొదలుపెట్టి వంద శ్లోకాలూ కంఠస్థం చేద్దామని మొదలుపెట్టాను. 

    రోజుకొకటి నేర్చుకుంటూ - మరుసటి రోజున ముందురోజుకి నేర్చుకున్నంతవరకు వల్లె వేసుకుంటూ - మొన్న జులై మూడో తారీఖుకి మొత్తం వంద శ్లోకాలూ నేర్చేసుకున్నాను. అంటే నూటయాభై రోజుల్లో నూరు శ్లోకాలు - మూడుపొద్దులకి నాలుగు పాదాలన్నట్టు - ఒకటిన్నర రోజుకి ఒక శ్లోకమన్నట్టు. 

    అన్నట్టు ఈ వంద శ్లోకాల్లో చదివిన రాముడి విశేషణాల్లో నాకు బోల్డంత నచ్చినది "అదీనాత్మా" - అంటే దైన్యము, దీనత్వమూ దరికే చేరనివాడు. 

    అద్దీ! అలాక్కదరా ఎవ్వరైనా వుండాలీ అనిపించింది నాకు. 


*** *** *** *** *** *** *** 
*** *** *** *** *** *** *** 

ఎక్కడో వున్న తనని తెలుసుకోలేకపోతున్నాననీ, 
వున్నాడో లేదో తేల్చుకోలేకపోతున్నాననీ 
"దైవం మానుషరూపేణా" అంటే ఏంటో చూపిద్దామని ఆ రాముడే దిగి వచ్చినా నాకు తెలీదేమో....

అందుకే....

ఈ సంక్షేపరామాయణ నిత్యపారాయణతో...
ఎఱుక లేని నా ఎదటే...
పలుకు పాటై నా ఎదనే...
మారాము మాని ఆ రాముడే
మాలిమయ్యె మా రాముడే...

*** *** *** *** *** *** *** 
*** *** *** *** *** *** *** 

కొసమెరుపు: కష్టపడో, ఇష్టపడో విడవకుండా వంద శ్లోకాలు నేర్చుకున్నానని నాకు నేనే ఒక లెగో కొనుక్కున్నాను :) నా సంబరానికి గుర్తుగా లెగో-బాణాసంచా పేల్చుకున్నా. 







26, జూన్ 2024, బుధవారం

ఈ ఏటికి హాల్లో సినిమావలోకానికో చెల్లుచీటీ...అను చలనచిత్రోపాఖ్యానం-2024 AD

    2024 AD - మొదలై రెండు మూళ్లు ఆరు నెలలు పూర్తవుతూ వున్నాయి ఇంకో మూడు రోజుల్లో. 

    ఇప్పటికి ముత్యంగా మూడు సినిమాలు థియేటర్లో చూశాం. 

    ఇహ ఈ ఏడాదికి హాలుకెళ్లి సినిమా చూడద్దు బాబూ అనుకుని సినిమాలకో  చెల్లుచీటీ ఇచ్చుకున్నాం. 

    ఆ ఖబరే ఇవాళ్టి కబుర్లు. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ ఏడాదికి హాలులో చూసిన మొట్టమొదటి సినిమా టిల్లు స్క్వేర్.  

    ఆ టిల్లుగా చేసిన సిద్ధు జొన్నలగడ్డకి ఎవరు పెట్టారో కానీ Star Boy అనే పేరు  -   "టిల్లు స్క్వేర్" సినిమా చూస్తున్నంత సేపూ "ఈ   సిద్ధు  స్టార్ బోయ్ కాదు చాలా స్మార్ట్-బోయ్" అనిపించాడు. 

    చాలా తెలివిగా - "డీజే టిల్లు" లో బావున్నాయి అనిపించిన సీన్లని పట్టుకొచ్చి "టిల్లు స్క్వేర్" లో అక్కడక్కడా పేర్చేశాడు. 

    దాంతో అంతకు ముందు "డీజే టిల్లు" చూసిన వాళ్లకి  తలా-తోకా లేని "టిల్లు స్క్వేర్" సినిమా బావుందేమో అని డౌటొచ్చేస్తుంది. 

    "డీజే టిల్లు" చూడని వాళ్ళకెలాగూ అందులో మిస్సైన ఆ కొన్ని సీన్లూ "టిల్లు స్క్వేర్" లో కనిపించడంతో ఇదేదో బానే వుందే అనిపిస్తుంది. 

    అంతే ! అంతకు మించి ఇంకేం లేదు. 




*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    థియేటర్‌కి వెళ్లిన రెండో సినిమా "ప్రసన్న వదనం". 

    సుహాస్ హీరో. 

    కొత్త కథ. 

     తన మొహం తనకే తెలియని హీరో. 

    జుట్టుకి రంగేసుకుంటేనే స్నేహితులని గుర్తు పడతాడు. 

    సినిమా చివర్లో జుట్టుకి ఒకేలాంటి రంగేసుకున్న ఇద్దరమ్మాయిల్లో తన హీరోయిన్ ఎవరో కనుక్కోవడానికి తంటాలు పడతాడు. 

    సినిమా చాలా బావుంది. 

    కానీ థియేటర్లో పట్టుమని పది మంది కూడా లేరు. 

    ఈ సినిమా చూసి బయటికి రాగానే బద్రి, నేను ఏమనుకున్నామంటే ... "ఇంత కొత్త concepts తో సినిమాలు తీస్తున్నారు ఈ కొత్త దర్శకులు. ఇదే మలయాళంలో తీసి dub చేస్తే గొప్ప సినిమా అని పొగుడుతారు కానీ మన తెలుగు సినిమా అయేటప్పటికి ఎవరో స్టార్ హీరో వుంటే తప్ప థియేటర్లో చూడ్డానికి రారు. ఇప్పట్నుంచి మనిద్దరం చిన్న హీరోల సినిమాలు థియేటర్లోనే చూద్దాం" అని. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    "ప్రసన్న వదనం" చూసిన ప్రసన్న హృదయంతో వెళ్లిన మూడో సినిమా "గం గం గణేశ". 

    తమ్ముడు దేవరకొండ హీరో. 

    సినిమా మొదలవుతూనే ఓ చిన్న అనుమానం - మనం రావల్సిన సినిమాకే వచ్చామా - లేకపోతే పొరపాట్న వేరే దానికి వచ్చామా - అని! 

    సినిమా మొదలైన పది  నిముషాలకి  ఇన్నేళ్ల నా సినీ-వీక్షణ-కాలంలో మొట్టమొదటి సారిగా - నాకు తెలియకుండా నిద్రపోయా. 

    ఓ అరగంట తరవాత నిమెలకువ వచ్చింది. 

    నేనెప్పుడు లేస్తానా అని ఎదురు చూస్తున్న బద్రి నేను కళ్ళు తెరవడం చూసి "బుజ్జాయ్! ఇంటికి వెళ్లి పోదామా?" అనడిగారు. 

    అమ్మో ! ఇప్పుడు ఇంటికెళ్ళిపోతే ఇంకేమన్నా వుందా? 

    ఏం జరిగి వుంటుందా అని మళ్ళీ ఏ OTT లోనో వెతుక్కుని మరీ చూస్తాం. మళ్ళీ అదో time waste - ఇంకో తలనొప్పి. 

    ఆ మిగిలిన కొంచెం సినిమా కూడా ఎలాగో ఓపిక పట్టి చూసేస్తే - ఇప్పటిది సరి అనుకుని - "ఉహూ! వద్దు. చూసేద్దాం." అన్నాను.  

    మొత్తానికి "గం గం గణేశ" చూసి బయటికి వచ్చి కారెక్కగానే బద్రి అన్న మొట్టమొదటి మాటలు "ఈ ఏడాదికి ఇక థియేటర్లో సినిమాలకి రావద్దు. చాలు". 

    అంత కన్నా ఇంకొక్క మాట చూసిన సినిమా గురించి మాట్లాడుకున్నా అది ఎక్కువే అనుకున్నాం. 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఏప్రిల్  నెలలో "టిల్లు స్క్వేర్" చూసి రాగానే రాసుకున్న ఓ పుంజీడు కబుర్లు అప్పుడు పోస్ట్ చేయడానికి కుదరలేదు. రాసినంత వరకు చాల్లే అనుకుని అలాగే వదిలేశాను.  అవిప్పుడు ఈ కింద పోస్ట్ చేశాను. 

 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

"టిల్లు స్క్వేర్"  అనబడు ఓ ఎంటర్టెయిన్మెంటు టిల్లర్ 


    పుష్ప, కాంతారా సినిమాలకి తరువాయి భాగాలు వస్తాయని తెలిసినప్పుడు అవి తప్పకుండా థియేటర్లో చూడాలని గట్టిగా అనుకున్నా. 

    అవి రెండూ కూడా అప్పుడొస్తాయి, ఇప్పుడొస్తాయి అని వింటుండగానే "టిల్లు స్క్వేర్" అనే ఇంకో టిల్లు-సినిమా మార్చ్ 29 న వస్తోందని తెలియగానే నాకు అంతకు ముందు చూసిన డీజే టిల్లు సినిమా గుర్తొచ్చింది. 

    ఆ  సినిమా బద్రీకి, నాకు బాగా నచ్చింది కూడా. అది చూసిన ఉత్సాహంలో రాసుకున్న బ్లాగ్ కబుర్లు గుర్తుకొచ్చాయి. 


    ఈలోగా టిల్లు స్క్వేర్ సినిమా మా వూళ్ళో వున్న థియేటర్కి వచ్చేసిందని తెలిసింది. నాకు చూస్తే బావుండుననిపించింది. 

    ఏదైనా సినిమా చూసే ముందు ఆ సినిమాకి సంబంధించిన రివ్యూలు చదవను, వినను. 

    సినిమా చూస్తే నాదైన fresh view తో చూడడమే నాకిష్టం. ఈ "టిల్లు స్క్వేర్" కూడా అలాగే చూశాను. 

    ఆ సినిమా చూడడానికి ముందు ఏం జరిగిందో, చూసేటప్పుడు ఏమనిపించిందో, చూశాకా ఎందుకిది రాయలనిపించిందో - ఆ విశేషాలే ఈ రోజు కబుర్లు.

టిల్లు స్క్వేర్ సినిమాకి వెళ్లే ముందు... 

    ఏప్రిల్ 1 సోమవారం నాడు రాత్రి  ఎనిమిదింపావు ఆటకి బద్రి టికెట్లు తీసుకున్నారు. 

    తీరా సోమవారం వచ్చేటప్పటికి - ఆ రోజు మధ్యాహ్నం నుంచి మా ఊళ్ళో severe weather alerts రావడం మొదలుపెట్టాయి. 

    ఆ రోజు సాయంత్రం ఏడుంపావు దాకా టోర్నెడో వార్నింగ్ వుంది అని టీవీలో, ఫోనుల్లో హెచ్చరికలు వస్తూనే వున్నాయి. 

    నేను మాత్రం ఆఫీస్ అయిపోగానే రాత్రి వంట చేసేసి సినిమాకి వెళ్ళడానికి తయారవుతున్నా. 

    కాకపోతే టోర్నెడో వార్నింగ్ వుంది కాబట్టి బద్రీది, నాదీ ఆఫీస్ లాప్‌టాపులు రెండూ వాటి వాటి bags లో  పెట్టి బేస్మెంటులో పెట్టొచ్చా. 

    టోర్నెడో హెచ్చరికలు వచ్చిన ప్రతిసారీ ఇంట్లో వున్న విలువైన వస్తువులు పట్టుకుని బేస్మెంటు లోకి వెళ్ళడం మా కలవాటు. 

    అవి అక్కడ పెట్టి పైకొచ్చి ఇంట్లో వున్న సుహాస్‌తో "జాగ్రత్త నాన్నగాడూ... టోర్నెడో అంటున్నారు" అనగానే వాడు వెంటనే "అమ్మా! ముందు మీరు జాగ్రత్త. బయటికి వెళ్తున్నారు" అన్నాడు. 

    "థియేటర్లో వుండగా అక్కడ టోర్నెడో వస్తే మేమొక్కళ్ళమే కాదుగా. అక్కడింకా చాలా మంది వుంటారు. అదో రకమైన ఎక్స్పీరియన్స్ అవుతుంది" అంటూనే నేను కారెక్కేటప్పటికి టైము ఏడుంపావు. 

    అప్పటికి ఆ టోర్నెడో కూడా నా మీద దయ తలిచినట్లు మా వూరు దాటిపోయింది. 

    సినిమా మీద నాకున్న మక్కువకి ప్రకృతి కూడ మద్దతిచ్చింది. 

    అలా బయల్దేరి - మధ్యలో AT&T స్టోర్ దగ్గర ఆగి అక్కడ పని చూసుకుని - థియేటర్‌కి చేరేటప్పటికి ఎనిమిది గంటలు.  

    చిప్పులూ -చీజూ కొనుక్కుని సరిగా ఎనిమిది గంటల ఐదు నిముషాలకి కుడికాలు పెట్టి హాలు-ప్రవేశం చేయబోతుండగా అక్కడున్న ద్వారపాలకుడొకడు ఆపేశాడు. 

    "ఏంట్రా - ఎందుకాపేడూ?" అనుకుంటూ, అదే పైకనబోతుండగా ఇంతలో అతనే చెప్పాడు "ఇందాక టోర్నెడో సైరన్ రావడం వల్ల ఇంతకు ముందు షో కాసేపు ఆపాలసి వచ్చింది. అదే ఇంకా నడుస్తోంది. మీ సినిమా ఎనిమిదింపావుకి కదా. అప్పుడే రండి" అని.

    మొత్తానికి ఎనిమిదింపావుకి లోపలికెళ్ళి సీట్లలో కూర్చున్నాము. 

    ముందేవో రాబోయే ఇంగ్లీషు సినిమాల ట్రైలర్లు ఓ మూడో నాలుగో వేశారు. అవేమీ కూడా అంత ఆసక్తికరంగా అనిపించలేదు. 


టిల్లు స్క్వేర్ సినిమా చూస్తున్నప్పుడు, చూశాక ...

    ఓ పది నిముషాల తర్వాత టిల్లు స్క్వేర్ సినిమా మొదలయింది. 

    సినిమా చూశాం. 

    బయటికి వచ్చాం. 

    మామూలుగా సినిమా చూడడం అయిపోయాక ఇంటికి వస్తూ చూసిన సినిమా గురించి నచ్చిందనో, నచ్చలేదనో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వచ్చే బద్రి, నేను ఈ సారి మాత్రం అసలు సినిమా గురించే మాట్లాడుకోలేదు.

    సినిమా అస్సలు బాగాలేదు అని మాలో మాకు చెప్పుకోవడానికే మొహమాట పడ్డట్టున్నాం. 

    ఇంతకు ముందు "డీజే టిల్లు" సినిమా చూశాక - తడుముకోకుండా మాట్లాడే సిద్దు జొన్నలగడ్డ spontaneity ని అంతగా ఇష్టపడ్డ మాకు టిల్లు స్క్వేర్‌లో డైలాగులు అంత గొప్పగా అనిపించలేదు. ఏదో అక్కడక్కడా తప్ప అంతగా నవ్వు రాలేదు. 

    సినిమా మొత్తానికి నాకు గుర్తున్నది టిల్లు మాత్రమే. 

    టిల్లుగా చేసిన సిద్దు జొన్నలగడ్డ screen presence బావుంది. 

    పసుపు రంగు మీద గుల్లబీ రంగు పూలపూల చొక్కా, పైడ్-పైపర్ లాగా ఒక పక్కంతా తెలుపు, ఇంకో పక్కంతా ఎరుపూ వున్న పేంటూ-చొక్కా,  మెరిసే చెమ్కీల పసుప్పచ్చ కుర్తా - ఇలా ఏ బట్టలు వేసుకున్నా ఇవి సిద్దు జొన్నలగడ్డ వేసుకున్నాడు కాబట్టి బావున్నాయి, ఇంకెవరికైనా అయితే అంతగా నప్పేవి కాదేమో అనిపించేంతగా నచ్చాడు టిల్లు. 

    కానీ ఒక సినిమా చూడాలంటే హీరో బావున్నాడనిపిస్తే చాలదు. 

    ఈ సినిమాలో సిద్దు తప్ప వున్న అందరూ వున్నారంతే - అన్ని చోట్లా వుండలేని సిద్దు వుండని చోట ఖాళీలు పూరించడానికి వున్నట్లు. 

    ఇందులో వున్న ఇద్దరమ్మాయిల కన్నా సిద్దునే బాగా వున్నట్టు అనిపించాడు, కనిపించాడు నాకు. 

    టిల్లు జీవితంలో అంతకు ముందు జరిగిన సంఘటనలని గుర్తు చేయడానికన్నట్టు అక్కడక్కడా చూపించిన "డీజే టిల్లు" సినిమా నుంచి ఎత్తుకొచ్చి చూపెట్టిన సీన్లు తప్ప "టిల్లు స్క్వేర్" సినిమాలో నాకు గుర్తుంచుకోదగ్గవి కానీ, ఇప్పుడిది రాస్తుండగా గుర్తొచ్చి నవ్వు తెప్పిస్తున్నవి కానీ ఏమీ లేవు. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఎండలో ఎండిన కొత్త వడియాల్లా గలగల్లాడాల్సిన కబుర్లు చప్పగా చల్లారిపోయిన వడల్లా సాగితే ఆ తప్పు నాదే - ఎప్పటి కబుర్లు అప్పుడు చెప్పలేక ఇప్పుడు చెప్పాలనుకోవడమే! 


~ సినీ-మా-లక్ష్మి 





29, ఫిబ్రవరి 2024, గురువారం

ఏంటీ! ఇంతోటి అదనపు ఇరవైనాలుగ్గంటలకే ఇన్నేసి అంతూ-పొంతూ లేని కబుర్లా?

 "ఉరుకుల పరుగులలో 
ఆదమరచి అర-మరచిన పొద్దొకటుంది
అగ్గలమైన పొద్దది
అదనమైన పొద్దది
అప్పనంగా అబ్బిందని  అనుకోవద్దు
అగ్గువని అరగొరగా చూడొద్దు
అరుదైన పొద్దది సుమా!" 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    అనుకుని  .... ఒక్కసారి ఆగి - ఊపిరి గా...ఠిగా పీల్చి
    తర్వాత ఏం పాట గుర్తొస్తుందా మొట్టమొదటగా అనుకుంటే 
    అబ్బురంగా అబ్బరమైన దేవులపల్లివారి పదమొకటి పెదవులపై కదలాడింది. 

"తరులెక్కి యల నీలి గిరినెక్కి మెలమెల్ల
ౘదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా... దాహమా... చింతలా...వంతలా...!?
ఈ కరణి వెఱ్ఱినై ఏకతమ తిరుగాడ... "
(దేవులపల్లి "కృష్ణ" పక్షం)

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    పాట పాడుకుంటున్న తుటిపై చిట్లిందొక చిన్నినవ్వు. 

    ఆ నవ్వు గుల్జార్ చెప్పినట్టు పెదవులకి ఎప్పుడో తీర్చాల్సిన అప్పు లాంటి వచ్చీరాని అరువు-నవ్వు కాదు. 

    ఆ నా నవ్వు 
    కాసేపక్కడే పెదవిపై చిందులాడి -
    చినుకు చినుకు చేరి జల్లువానై ముంచినట్లు -
    మది పట్టలేని సంబరమై ఎద దాకా వెల్లువైంది.

    నవ్వంటే అంతే కదా మరి?! 

    అందందె మొదలై 
    పెదవి మించి 
    ఎదను ముంచి 
    కదలి ఉరికి
    ఒడల కుదిపి
    మదిని కదిపి
    మరిక వదలనని
    అందందే వుంటానంటుంది... 

    ఎలాగూ గుర్తొచ్చాడు - గుల్జార్ రాసిన ఈ అరువు-నవ్వు పాటేదో మీకు తెలుసాండీ?

"ముస్కురాయే తో ముస్కురానే కే కర్జ్ ఉతార్‌నే హోంగే
ముస్కురాఊ కభీ తో లగ్‌తా హై...
జైసే హోఠోం పే కర్జ్ రఖా హై"
(గుల్జార్ విరచితం)

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఏంటీ! ఇంతోటి అదనపు ఇరవైనాలుగ్గంటలకే ఇంత సంతోషమా? 

    మరి ఒద్దా?

    ఒకటా...? రెండా...? 

    ఏడుకేడు తోడుకొని నాలుగేళ్ళు దాటుకుని - గడియ గడియ కూడుకుని ఒక రోజైతే  - ఆ రోజులో వీలు చిక్కిన ఏ కొద్ది క్షణాలనో  పాట పాడుకుని పండగ జరుపుకోక ఊరికే పొద్దు పోనిస్తానా?

    అదే మా సరదా-సిరి దర్శకరత్న బహుపద-దాసరి వుండుంటే ఈ రోజుని ఊరికే అట్టా పోనిచ్చేవాడా?

"దొరకక ... దొరకక ... 
దొరకక దొరకక దొరికిన రోజు
దొరికీ దొరకక దొరకని రోజు 

మిగలక... మిగలక... 
మిగలక మిగలక మిగిలిన రోజు
మిగిలీ మిగలక మిగలని రోజు

ఒకే ఒక్క రోజు...
తిరిగి రాని రోజు..."

    అన్న పాటని పదేపదే పాడుకుంటూ పదం కలపకుండేవాడా? 

    అన్నట్టు ... నాలాగే మీకూ ఒక అందమైన రోజొకటి అదనంగా దొరికింది కదా....? 
    పైన రాసిన దాసరివారి పాట మొదలేదో పట్టగలరా?

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

ఇంతకీ ---

"అదొక పొద్దు - 
అదొక అందమైన పొద్దు - 
అదొక అందమైన అదనమైన పొద్దు - 

    --- అంటూ ఇన్నేసి అంతూ-పొంతూ లేని కబుర్లల్లడమేనా - లేక ఇంకేమన్నా గుర్తుండే పని చేశావా ఈ పొద్దు?" -  అని అడిగితే ఏమీ ఆలోచించకుండా టక్కున చెప్పేసేలా ఏమన్నా అచ్చెరువు పుట్టించే పనో-పాటో చేద్దామనుకుని కిటికీ లోంచి బయటికి చూస్తే - బంగరపుటెండ కిటికీ ఊసల్లోంచి ఇంట్లోకొచ్చి వెలుగు-నీడల ముగ్గులెయ్యాలని ఉత్సాహపడి ఉరుకుతోంది కానీ ఉడుకు పుట్టించే ఉద్దేశ్యం ఏ కోశానా లేనట్టుంది. 

అయినా ...పైనున్న సూరీడు ఉడుక్కోకుండా ఉలికిపడకుండా ఉన్నమాట అనుకుంటే -

ఆ అడవి గాచిన వెన్నెల
ఈ మా వూర గాచిన ఎండా ఒకటేనబ్బా!
అది చూపుకి సోకని చల్లదనం
ఇది ఒంటికి తాకని వెచ్చదనం





        ఇహ చేసేదేముందీ? 
    
    ఇంటి పట్టునే 
    ఇరవుగా వుండి 
    ఇంకాసేపట్లో 
    ఇసకలా జారిపోబోతున్న 
    ఇంగిలీషు రెండో నెలని 
    ఇలా నా బ్లాగులో 
    ఇచ్చకాల రాతల్లో 
    ఇడుముకుంటున్నా... 

    

    

24, ఫిబ్రవరి 2024, శనివారం

గీతం...సంగీతం...సతతహరితం - 17 - ఈ పాట విన్న - దిల్ వో చలా... ఆ గాలిలో అలా...అలా...

ఈలపాటల గాలి ఆగి ఆగి వీచె
తూలు గాలి అలల మీద 
మెఱుపంచు కోక గట్టి
తువ్వర మువ్వ గజ్జె కట్టి
తూగి సోలుతున్నదెవరది?

చిందులేయు చిన్నారి 
చినుకుదారి చిఱుతుక
నీలిమబ్బు తునక కాక
ఇంకెవరది?
ఆగి ఆగి వీచు గాలి తోన తానె సాగివచ్చె

పాట వినగోరు వీనులకి
గాలి అలల ఈలపాట...
గాలి పాడు పదమది ముందో?
గాలి యీల విన్న మబ్బుకన్నె తానాడెనో?!

ఆట కనగోరు కనులకి
నీలిమబ్బు తునక ఆట...
చింది కదులు పదమది ముందో?
మొయిలు చిందు కన్న గాలి పాట పాడెనో!?

గాలిమబ్బుల వెనకముందుల పంతాల్లో
ఆటపాటల వేడుకలు నా సొంతాలే!
నే జెప్పబోవు ఊసుపోని ఉదంతాలు 
ఆ సంగతుల-గతుల సంగతులే!


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఎప్పట్నుంచో - ప్రతి వారం వారం - "స్మర వారంవారం" - అనుకుంటూ వింటుంటున్నా - వింటూ వింటూ ఆ పాటలో లీనమై తేలిపోతూ వుంటున్నా - ఇప్పటి దాకా ఆ పాట గురించి చెప్పాలనుకున్నది చెప్పడానికి కుదరలేదు - కుదురూ చిక్కలేదు. 

    ఇవాళ మాత్రం - ఎలాహైనా రాహెయ్యాలంతే! - అని కూర్చున్నా. 

    సూద్దారి... ఈ దారి నెంత మాత్రం సాగుతానో మరి!

    అస్సలిదీ... - ఇదంటే - ఈ పాట వుందే - ఇది నిజ్జంగా ఓ గాలిపాట. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    గాలికి మొదలు ఎక్కడైనా వుండొచ్చు కదా! 

అప్పటిదాకా 
సద్దు లేకుండా 
స్తబ్దుగా వున్న గాలి 
అలలు అలలుగా 
కదలి మెదలి
ఒక్కసారిగా 
పాలుమాలిక వీడి
పడి లేచే కెరటమైతే
ఎక్కడ సడి అడుగులు పడితే
అక్కడే మొదలనుకుంటే

    అదుగో...అచ్చంగా అల్లాగే వున్నట్టుండి వున్నపాటున మొదలైన పాట గాలిపాట కాక ఇంకేంటి మరీ?!


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    మరసలు ...కుదురైన పాటంటే ఏమిటీ...?

    తాళాలూ, కాలాలూ, స్వరాలూ, రాగాలూ, జతులూ, శ్రుతులూ, గతులూ,  సంగతులూ - ఇన్ని వరసలూ వ్యవహారాలూ వున్నదే కదా... !


    పలకరింపు లాంటి పల్లవి
    వెనువెంటనే చిరునవ్వు చిలకరింపు లాటి అనుపల్లవి
    ఆ తర్వాత వడివడిగా కలివిడిగా సాగే కబుర్ల లాంటి చరణాలు
    కదా! 

    కానీ అదే - 
    తొరపడో, తడబడో - 
    వాక మార్చి వరస విడిచి -
    పల్లవిని దాటి వురికి 
    అనుపల్లవి మాటే మరిచి 
    సరాసరి చరణానికి చరచరలాడితే ?!
    అది ఖచ్చితంగా గాలి తోడైన పాటే! 
    గాలికీడూజోడైన పాటే! 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    "ఈ పాటికి ఆ పాటేదో చెప్పెయ్యకుండా - 
    ఇప్పటి దాకా - 
    ఇదిగో పాటా, అదో గాలిపాటా - 
    అని ఆకుకి అందకుండా, పోకకి పొందకుండా - 
    గాలికబుర్లాడడమే తప్ప - 
    అసలా పాటేదో చెప్పడానికి పాటు పడకుండా - 
    అలాగని మా పాటికి మమ్మల్నొదిలేసి 
    మా పాట్లేవో మమ్మల్ని పడనీకుండా - 
    ఈ పాట-పోటు మాకేమిటి బాబోయ్!" 

    అని పాట కట్టి పాడేసుకోవాలనిపిస్తోందా? 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇంతసేపు ఎలాగూ ఆగారు - ఇంతవరకు ఎలాగోలా చదివారు. 

    ఇంకో గాలిపాట గురించి ఇంకొన్ని మాటలు కూడా చదివేస్తే - పాటమర్యాద పాటించినవారవుతారు.  

    అప్పుడెప్పుడో - బోల్డంత కథున్నా కూడా - "ఇది కథ కాదు" అనే ఓ సిన్మా వచ్చింది. 

    దాన్ని తీసింది బాధే చందమనే బాలచందర్. 

    అందులో "గాలికదుపు లేదు... కడలికంతు లేదు" అనే పాటొకటుంది. 

    నేనీ రోజు రాయబోతున్న హిందీ పాటుందే... అది విన్నప్పుడల్లా - వెంటనే ఈ తెలుగు పాట కూడా గుర్తొస్తుంది. 

    ఆ పాటలో కొన్ని వాక్యాలు....

    ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో...
    ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో...
    తుళ్ళితుళ్ళి గంతులు వేసే లేడికేది కట్టుబాటు...?
    మళ్ళిమళ్ళి వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు...?

    ఆ పైన రాసిన  తెలుగు పాట చరణం అచ్చు ఈ కింద రాసిన హిందీ పాట చరణం లాగానే అనిపిస్తుంది నాకు.... 

    విన్న ప్రతిసారీ మాటలు కొంచెం అటూ-ఇటూగా వున్నా - మొత్తమ్మీద రెండిట్లో వున్న పాటాత్మ ఒకటేలా వుంటుంది. 

కల్ కే - అంధేరోం సే - నికల్‌కే
దేఖా హై - ఆంఖే - మల్‌తే మల్‌తే
హో... కల్ కే - అంధేరోం సే - నికల్‌కే
దేఖా హై - ఆంఖే - మల్‌తే మల్‌తే
హో...ఫూల్ హీ ఫూల్  - జిందగీ బహార్ హై
తయ్ కర్ లియా ఆ... ఆ... ఆ...



    ఇహిప్పుడు అసలు విషయానికొస్తా! 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    మన స్వామీ, వాడి స్నేహితుల గురించి మాల్గుడి కబుర్లు చెప్పిన ఆర్కే నారాయణ్ రాసిన "The Guide" అనే నవల ఆధారంగా తీసిన హిందీ సినిమా "గైడ్" అని ఒకటుంది. 

    బావుంటుంది. 

    యూట్యూబ్‌లో వుంటుంది. 

    ఇప్పటిదాకా చూసుండకపోతే ఓ పాలి చూసొచ్చేస్తే కూడా బావుంటుంది. 

    దాంట్లో కథానాయకుడు దేవానంద్. దానికి దర్శకుడు ఆతని తమ్ముడు విజయ్ ఆనంద్. కథానాయిక వహీదా రెహమాన్. 

    అన్నట్టు ఈ సినిమాని అమెరికాలో ఇంగ్లీషులో కూడా తీశారట. కానీ అందులో వహీదా లేదట. ఫ్లాప్ అయిందంటే అవదా మరి?!

    సరి! ఆ సినిమా ఇంగ్లీషులో హిట్టు కాదు ఫట్టు అని చెప్పేసుకున్నాం కదా!  

    హిందీ సినిమాలో బావుండే అన్ని పాటల్లోంచి అన్నిటి కన్నా నాకు బాగా అనిపించే పాట గురించి - హమ్మయ్య! - ఇహిప్పుడు చెప్తా. 

    ఆ పాట "కాంటోం సే - ఖీంచ్‌కే - యే ఆంచల్".
    రాసింది శైలేంద్ర.
    పాట కట్టింది సచిన్ దేవ్ (SD ) బర్మన్. 
    పాడింది లతా మంగేష్కర్.
    పాటకు ముందు మాట్లాడింది దేవానంద్.
    పాటలో ఆట్లాడింది వహీదా.

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ పాటలో అన్నిటి కన్నా ముందు, వెనక, ఆ తర్వాత కూడా వహీదా గురించి చెప్పుకోవాలబ్బా!

    మెరుపుతళుకులు కుట్టిన పచ్చనీలపు చీరా...
   
    జడ మొదట్లో మువ్వల జడబిళ్ళా...
    ఆ కింద జడ మధ్యలో పొదిగిన ఓ మువ్వ
     పొడుగాటి జడకి వేలాడుతూ జడకుచ్చులూ...

    చెవులకి లోలకాల్లా వూగుతున్న లోలాకులూ...
    కంబువంటి కంబువున తాల్చిన మిలమిలలదౌరు
    మోచేతిని తాకుతున్న చోళీ చేతులకి తళతళ మెరుస్తున్న గాజులు 
    ఎడమచేతి ఉంగరంవేలికో పూలవుంగరం 
    
    చీర మీదున్న మెరుపులని మించి తళతళలాడుతూ తళుకులీనే కళ్ళూ...
    ఆ కళ్ళని వెలిగించి - వాటిని మించి - పెదవుల మీద మించిమించారిన నవ్వులూ... 
    ఆ నడకలో లయలూ - నటనలో హొయలూ...
    చిత్తోడ్‌ఘర్ కోట మీద గాలి అలలలో అలలా - కలలోని కలికిలా - చిలికించిన అలవోక కదలికలూ...






    బావుంది వహీదా...

    ఎండుగడ్డిలో దొర్లుతూ
    కుండ ఎత్తి బద్దలుగొడుతూ
    ఒంటె మీద ముసుగులో కులుకుతూ
    కోటగోడల మీద కెరటంలా ఉరుకుతూ
    "కహీ న ఖో న జాఊ..." అని పరిసరాలు మరిచి మైమరచిపోతూ
    గుడి గోడల మీదున్న నాట్యాంగనల్లా భంగిమలు పెడుతూ
    అల్లా-ఉద్దీన్-ఖిల్జీ చూసిన రాణీ పద్మినిలా అద్దంలో కనిపిస్తూ
    కాదనుకున్న నిన్నని వదిలి రేపటి ఆమని నాదేనని ధీమాగా చెప్తూ... 

    దాక్కుంటూ ... దోబూచులాడుతూ... 
    ఎగురుతూ....గెంతుతూ... పరిగెడుతూ...
    పాదాలు గాలిలో తేలుతున్నట్టు సోలుతూ ... 
    
    ఎలా చూసినా - ఎన్నిసార్లు చూసినా 
    పాట ప్రతి frame లో 
    ఎంత బావుందో... వహీదా... 

   నాకు ఈ పాట చూసినప్పుడు కనిపించేది వహీదా మాత్రమే! 

   ఊపిరి సలపని బంధనాలు దాటి బయటపడిన గాలి సంబరంగా వేసే చిందులు  - కళ్ళకి కట్టినట్టు నర్తించి చూపిన వహీదా నటన ఎంత బావుందో చూసే కళ్ళకి రాయడం వస్తేనే సరిగ్గా చెప్పడానికి కుదురుతుంది. 

   కెమెరా కూడా వహీదాని ఎంత అందంగా చూపిద్దామా అని తహతహలాడినట్టనిపిస్తుంది.  

    ఆ కెమెరాని పట్టుకుని వహీదా ఎటెళ్తే  అటు - ఆమె చుట్టూ తిప్పిన  - ఫాలి మిస్త్రీకి కోటి దండాలు!
    


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    

      అప్పుడే జీవించాలనే ఆశ - 
    అలా జీవిస్తూనే మరణించాలనే లాలస -
    అదే .... ఈ పాటలో వినిపించే స్వేచ్ఛాన్వేషిత లిలీష!

    అవన్నీ కలిసున్న ఈ  పాట ఇష్టం. 
    ఈ పాటలో వహీదాని చూడడం ఇష్టం. 
    ఈ పాటలో వహీదానే పాడిందా అనిపించేంత లలితంగా పాట పాడిన లతా మంగేష్కర్ గొంతు ఇష్టం. 
    ఈ పాటలో వినిపించే వేణునాదం ఇష్టం, 

    ఈ పాటకి వున్న ప్రత్యేకత - పల్లవితో కాకుండా చరణంతో మొదలవడం. 

    ఈ పాటలో పల్లవి "ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... ". 

    కానీ మొదలవడం "కాంటోం సే - ఖీంచ్‌కే - యే ఆంచల్" అనే చరణంతోనే మొదలవుతుందనేమో -
ఎదురు చూడనపుడు వీచడం మొదలు పెట్టే కుదురు లేని గాలిలా అనిపిస్తుంది ఈ పాట.

    
   
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


ఈ పాటకి యూట్యూబ్ లింక్: 

పాట కూడా రాసి పెట్టా ఈ కింద! 

కాంటోం సే - ఖీంచ్‌కే - యే ఆంచల్
తోడ్‌కే బంధన్ - బాంధీ పాయల్
హో...కోఈ న రోకో - దిల్ కీ - ఉడాన్ కో
దిల్ వో చలా...  ఆ... ఆ... ఆ...

ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 
ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 

అప్‌నే హీ బస్ మే - నహీ మై
దిల్ హై కహీ - తో - హూ కహీ మై
హో...అప్‌నే హీ బస్ మే - నహీ మై
దిల్ హై కహీ - తో - హూ కహీ మై
హో... జానే క్యా పాకే - మేరీ జిందగీ నే
హస్‌కర్ కహా... హా... హా... హా...

ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 
ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 

మై హూ గుబార్ - యా - తూఫాన్ హూ
కోఈ బతాయే - మై కహా హూ
హో... మై హూ గుబార్ - యా - తూఫాన్ హూ
కోఈ బతాయే - మై కహా హూ
హో... డర్ హై - సఫర్ మే - కహీ ఖో న జాఊ మై
రస్తా నయా... ఆ... ఆ... ఆ...

ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 
ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 

కల్ కే - అంధేరోం సే - నికల్‌కే
దేఖా హై - ఆంఖే - మల్‌తే మల్‌తే
హో... కల్ కే - అంధేరోం సే - నికల్‌కే
దేఖా హై - ఆంఖే - మల్‌తే మల్‌తే
హో...ఫూల్ హీ ఫూల్  - జిందగీ బహార్ హై
తయ్ కర్ లియా ఆ... ఆ... ఆ...

ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 
ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

ముందు వెనకైన గాలిపాట 

గాలి లాగా అదాటుగా తేలి వచ్చి 
చెవికి సోకె ఈ పాట 

  ఈ పాట విన్న  - దిల్ వో చలా...  ఆ గాలిలో అలా...అలా...


~ పాటల భైరవి