27, ఫిబ్రవరి 2011, ఆదివారం

అనాతవరం సంక్రాంతి - అందమైన జ్ఞాపకం

పండగకి నాలుగురోజుల ముందే బయల్దేరి
గుంటూరు-అమలాపురం బస్సు దిగి
గుర్రబ్బండిలో ఇంటికి బయల్దేరితే
అనాతవరం గేటు దగ్గర్నుంచీ
చేతి వూపుతోనే ఊరివారు వేసే కుశలప్రశ్నలు
అవి అన్నీ అందుకుంటూ
మునసబుగారి ఇంటి సందు మలుపు తిరగగానే
బాబిగారొచ్చేస్తున్నారన్న కబురు  ఇంటికి చేరుతుంది
దివాణం మెట్లెక్కి అలసిన మొహాలకి నవ్వులద్దేలోగా
"ఆహ! ఆహ! వచ్చారా పిల్లలూ!" అని ఉయ్యాలబల్ల దగ్గర్నుంచి
కళ్ళజోడు సర్దుకుంటూ కచ్చా పోసి కట్టిన చీరలో నాన్నమ్మ పలకరింపు
రేడియోగదిలోంచి చిరునవ్వుతో
వినీ వినిపించకుండా "ఇప్పుడేనా రావడం?" అంటూ వచ్చే అప్ప
"పొద్దున్నే కాకి అరుస్తే అనుకున్నాను - మీరే వస్తారని..."
అని ఇంటి మహాలక్ష్మిలా ఎదురొచ్చే లలిత దొడ్డ
"బాబయ్య, పిన్ని, పిల్లలు వచ్చారు - గుంటూరు నుంచి.
రవికి, శ్రీనుకి శలవు దొరకలేదట - పెద్ద పండగ రోజుకి దిగుతారు
భద్రు, బావగారు రేపు వస్తున్నారు"
అని వీధిలో వాళ్లకి సంబరంగా చెప్పే ప్రసాదు
నాన్న ఎప్పుడు బయటికి వస్తారా అని
ఆతృతగా ఎదురు చూసే బాల్యస్నేహితులు-
సత్తికొండ, శీనప్ప, కన్నప్ప, భూషిబాబు, భాస్కరం, నాగన్నలు
రామరాజుగారింట్లోంచి ఎదురొచ్చి పలకరించే సూరిబాబు, వెంకన్నలు
"కుట్టి! షటిల్ ఆడతావా?" అని అప్పట్నించే కవ్వించే
సత్తికొండగారి రాంబాబు, చంటిలు
పండగకి ఒకరోజు ముందు దిగే లలిత అత్తయ్య, స్వాతిలు
రాగానే "ఎప్పుడెళ్లిపోతారత్తయ్యా" అనడగడం -
వెళ్ళేటప్పుడు లలితత్తయ్య ఇచ్చే డబ్బులకోసం
లల్లి, పప్పీ, కుట్టి, స్వాతిలు చేసిన పొలంలో షికార్లు
లేతచలిలో శివాలయంలో, విష్ణాలయంలో
ధనుర్మాసపు పూజలు
నెలపట్టిన సందడిలో ఇంటిముందు వేసిన ముగ్గులు
లల్లి ముగ్గు పోత బావుంది అంటే పొంగిపోయి  వేసిన ముగ్గులతో
ముస్తాబైన అనాతవరం రాజుల లోగిళ్ళు
"పిల్ల ముగ్గులేసి నలిగిపోతోందంటూ " ముద్దుగా విసుక్కున్న నాన్నమ్మ ప్రేమలు
ఆ ముగ్గులలో పెట్టిన గుమ్మడిపూల సొగసుల గొబ్బెమ్మలు
భోగిరోజు ఇంటిముందు వేసిన భోగిమంటలో
భోగిదండలతో పాటు వేసిన వెనకవీధినుంచి దొంగిలించిన పెరటి తలుపులు
ఇంట్లో చంటి పిల్లలకి పోసిన భోగిపళ్ళలోంచి ఏరుకున్న పైసలు
పెద్దపండగ రోజు "దండాల పండగ" అని
పెద్దలందరికీ దండాలు పెట్టి దండుకున్న డబ్బులు
బాంకులోంచి తెప్పించి  నాన్నమ్మ మనవలకి పంచిన పది కొత్త రూపాయి కాసులు
సంక్రాంతి సాయంత్రం "సుబ్బీ గొబ్బెమ్మా! సుబ్బడ్నీయవే!" అని ముసిముసిగా నవ్వుతూ
తట్టిన గొబ్బిపాటలు - తర్వాత ప్రసాదంగా తిన్న శనగల పాఠోళి
కనుమనాడు అల్లంపచ్చడితో తిన్న మాషచక్రాలు
సాయంత్రం రెండెడ్ల బళ్ళలో వెళ్ళిన మురమళ్ళ ప్రభల తీర్థం
కొనుక్కున్న రంగు కళ్ళజోళ్ళు
ఇంతలో గొడవలకి పగిలిన గోళీసోడాబుడ్లు
బెదిరిన రెండెడ్ల బండిలో
బింకంగా వున్న ఫ్రం-హైదరాబాద్ సిటీ-కొత్త అల్లుళ్ళు
"భయపడకండి - ఇవన్నీ మామూలే  బావగారూ" ఆరిందాలా  ధైర్యం చెప్పిన చిట్టిమరదళ్ళు
ఆడుతూ పాడుతూ ఇంటికి చేరిన పిల్లబ్యాచులు
ముక్కనుమనాడు ప్రయాణం కూడదంటే
విరిసే పిల్లల మొహాలు
ఆరోజు తులసికోట దగ్గర అమ్మ వేసే జడతో పాటు
ఇంకోరోజు వుంటే బాగుంటుందని లల్లి పెట్టే మెలికలు
స్కూల్ పోతుందమ్మా మళ్ళీ వేసంగిలో వద్దువుగాని
అనే  నాన్నమ్మతో పాటు సాగనంపే పాకపక్కన నేవేసిన చేమంతిమొక్కలు
తడిసిన కళ్ళతో - నేవెళ్ళనంటూ ఎన్నిసార్లు పంపినా
తలుపు చాటున నక్కే ఇంటి ఆడపడుచు అమ్మవారి గరగలా-
వదలలేక వదలలేక
మళ్ళీ రాబోయే వేసవి శలవులని తలుచుకుంటూ
మళ్ళీ అమలాపురం-గుంటూరు బస్సు ఎక్కే బాబిగారి ముగ్గురాడపిల్లలు....
















నూతికి నీ పేరెట్టేశాం...

ఇప్పటికీ తెలీలేదు
నువ్వెందుకు హడావిడిగా వెళ్ళిపోయావో
ఇంకెప్పటికీ తిరిగిరావు
నువ్వు పట్టుకెళ్ళిపోయిన సరదాలు...
సాయి గాడి ఎంగిలి ముద్ద తిని
కాకిలా నువ్వెగిరి పోయాక
ఆ ఏకాకి తనానికి బెంగపడి
మన అనాతవరం శివాలయం ముందున్న
నూతికి పూడిక తీసి, ప్రాణం పోసి
కుట్టీ! నీ పేరెట్టేశాం ...
అయ్యలసోమయాజుల కిరణ్మయి-
జననం: 13-1-1974...మరణం: 8-10-2003
అని .........

5, ఫిబ్రవరి 2011, శనివారం

రథసప్తమి

జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం.

రథసప్తమి మన ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి పుట్టిన రోజు. మాఘ మాసం లో శుద్ధ (శుక్ల) సప్తమి నాడు వస్తుంది ఈ పండగ. ఈ 2011 లో ఫిబ్రవరి 10 వ తారీఖున రథసప్తమి వచ్చింది.

మా చిన్నప్పుడు రథసప్తమికి ఒక రోజు ముందు హడావిడి మొదలయేది. ఇంటి చుట్టు పక్కల జిల్లేడు చెట్లు వెతుక్కుని వెళ్లి చాల జాగ్రత్తగా ఆ ఆకులు కోసి తెచ్చేవాళ్ళం. ఎంతవరకూ నిజమో తెలీదు కానీ జిల్లేడు పాలు కళ్ళలో పడితే కళ్ళు పోతాయి అనే భయం వుండేది. అందుకే ఆ చెట్టుని ఎక్కువ బాధించకుండా లెక్క పెట్టి మూడు ఆకులు- నాకు, పప్పీకి, కుట్టికి సరిపోయేలా కోసుకుని వచ్చేవాళ్ళం. అప్పటికే అమ్మ రేగు పళ్ళు కొని వుంచేది. మేము అద్దెకి వుండే కరణం గారి ఇంట్లో చిక్కుడు పాదుకి వున్న చిక్కుడు కాయలు, చిక్కుడు ఆకులు అన్నపూర్ణమ్మ గారిని  (ఈవిడ కరణం గారి భార్య)  అడిగి కోసుకుని వచ్చేస్తే 'హమ్మయ్య... రేపు రథసప్తమికి కావలసినవి అన్నీ వున్నాయి' అని  ఆ రేపటి కోసం ఎదురు చూస్తూ నిద్ర పోయేవాళ్ళం.

రథసప్తమి రోజు ప్రొద్దున్నే లేచి జిల్లేడు ఆకులలో రెండు రేగు పళ్ళు పెట్టుకుని అవి తల మీద పెట్టుకుని "కాకి! నీ రూపు నువ్వు తీసుకుని నా రూపు నాకిచ్చేయి" అని స్నానం చేసేవాళ్ళం. శీతాకాలంలో ఒళ్ళు పగిలి కొంచెం ఎలాగైనా వడిలినట్లు అవుతుంది. రథ సప్తమి రోజు రాబోయే వసంతానికి ఆహ్వానం అలా పలికే వాళ్ళమన్నమాట.

స్నానం అయ్యాక మేము గొబ్బెమ్మలు పెట్టిన ఆవు పిడకలతో ఆరు బయట చిన్న పొయ్యి చేసి దాని మీద తళతళలాడే ఒక గుండు ఇత్తడి గిన్నె పెట్టి ఆవు పాలతో మా అమ్మ బియ్యం పరమాన్నం చేసేది. ఆ ఆవు పిడకల పొయ్యి పక్కనే చిక్కుడు గింజలు, ఈను పుల్లలతో రథం చేసి ఆ రథానికి జండాలాగా ఒక చిక్కుడాకు పెట్టేది.  అది సూర్యుడి రథం అన్నమాట. బియ్యం పరమాన్నం ఉడికాక - సూర్యుడికి నైవేద్యం పెట్టి - వేడివేడిగా చిక్కుడాకులలో పెట్టి మా ముగ్గురికీ ఇచ్చేది. అలా ప్రతి ఏడాది రథ సప్తమి కూడా ఒక పండగలా జరిగేది.

ఇప్పుడు ఆలోచిస్తే అలాంటి చిన్న చిన్న ఆనందాలని ఎంత మిస్ అవుతున్నామో కదా అనిపిస్తుంది. ఒక వేళ పిల్లలకి తెలుస్తుంది మన పండగల గురించి అనుకుని చేద్దామన్నా ఏంటో అంతా సిములేటేడ్ పండగలా అనిపిస్తుంది కాని మనసుకి హాయిగా వుండదు. అలా ఎందుకు అనిపిస్తుందంటే ఇక్కడ జిల్లేడు ఆకులు, రేగు పళ్ళు, చిక్కుడు ఆకులు దొరకవు.వాటి బదులు ఏవో వాడాలి. అలా చేస్తే అది సిములేటేడ్ గానే  అనిపిస్తుంది కానీ పండగ చేసిన ఫీలింగ్ రాదు.

ఈసారి నుంచి కనీసం నా ఈ కథని సుహాస్ కి, కిరణ్ కి చెప్పడం అనే ట్రెడిషన్ మొదలు పెడతాను.

అందరికీ రథసప్తమి శుభాకాంక్షలతో ...

~లలిత



28, జనవరి 2011, శుక్రవారం

దేవుడు - అమ్మ?? CEO??

జూన్ విహంగ సంచిక లో నా వ్యాసం ఇక్కడ చదవండి

                                      దేవుడు - అమ్మ?? CEO??

చిన్నప్పటి నుంచీ నేను దేవుడిని చాలా సార్లు ఫీల్ అయాను.


వచ్చేసిందా అనుమానం - ఆ టైటిల్ ఏంటి "దేవుడు - అమ్మ?? CEO??" అని - ఈ దేవుడ్ని ఫీల్ అవడమేంటి? - ఈ లలిత కి అసలు బాగానే ఉందా అని?


అసలు విషయం లోకి వస్తున్నాను.


చిన్నప్పుడు మా నాన్నమ్మ తో మా అనాతవరం శివాలయానికి, అమలాపురం వేంకటేశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు ఆవిడ వెనకాల నాకు అప్పటికి నోటికి వచ్చిన అన్ని శ్లోకాలు పాడుకుంటూ ప్రదక్షిణం చేసి, ఆయా దేవుళ్ళ ప్రసాదాలు తిని జడలో పూజార్లిచ్చిన  పూలు పెట్టుకుని, ఇంటికి వచ్చి కొబ్బరి ముక్కలు తినేస్తే ఆవిడ హ్యాపీ.


తరవాత కొంచెం పెద్దయాక గుండులో వున్న హాయి తెలిశాక 4 , 5 తరగతుల్లో ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడల్లా జుట్టంతా ఆ కళ్యాణ  కట్ట లో అర్పించి, నాలుగు పూసల దండలు , ఒక డాక్టర్ ప్లాస్టిక్ బొమ్మ కొనుక్కుని ఇంటికి వస్తే బోల్డంత సంబరం,  నాకు, పప్పీ కి, కుట్టి కి - మమ్మల్ని  చూసి అమ్మ, నాన్నలు హ్యాపీ.


ఇంకొంచెం పెద్దయాక వినాయక చవితి కి పాలవెల్లి కట్టి,  దసరా కి నవరాత్రి పూజలకి ఓంకార క్షేత్రంకి వెళ్లి, సంక్రాంతి కి ముగ్గులేసి, ఉగాది కి వేపపూత పచ్చడి తిని, శ్రీరామ నవమికి పానకం తాగి, వరలక్ష్మి వ్రతానికి కథ చదివితే - ఆడ పిల్లలు చేతికి అంది వచ్చారని అమ్మ హ్యాపీ.


ఆ తర్వాత పెళ్ళయ్యాక ఇంకా బోల్డు, బోల్డు పూజలు అమ్మ, అత్తయ్య చెప్పినట్టు చేస్తూ ఇంటికి వచ్చిన వాళ్లకి తాంబూలమిస్తూ గల గలా మాట్లాడుతూ తిరిగేస్తే అందరూ హ్యాపీ.


ఇన్ని రకాలుగా దేవుడికి సంబంధించినంత పండుగలు, పూజలు, వ్రతాలు చేస్తున్నప్పుడు అవి చేసినందువల్ల నా వాళ్లకి కలిగిన, కలిగించిన ఆనందం లో నాకు దేవుడు కనిపించేవాడు.


కానీ నా అంతట నేను ఎప్పుడూ ఇది కావాలి అని ఇప్పటివరకూ దండం పెట్టుకోలేదు. దేవుడి ముందు కళ్ళు మూసుకుంటే ఏమీ గుర్తు రాదు. అలాగని నాకు కష్టమంటే ఏమిటో తెలియదా అంటే -:( ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు, సీత కష్టాల్లా కాకపోయినా లలిత కష్టాలు లలితవి అనేలా ఏవో వున్నాయి లెండి. ఆయనని అంటే దేవుడిని ఎలాగు ఏమీ అడగను కదా అని అంత పట్టించుకోను. నాకు వీలైనప్పుడు దీపం పెడతాను- లేకపోతే బజ్జో పెడతాను.


ఇప్పుడు అసలు నా  టైటిల్ వెనక కథ లోకి వస్తున్నాను. ఇదిగో ఇలాగే ఏదో పూజల గురించి మాట్లాడుతూ మా తులసి (నా ఆడపడుచు) అడిగింది - అదేంటి వదినా-   రోజూ దీపం పెట్టకపోతే ఎలా? పూజలు అవీ చేయకపోతే ఎలా- దేవుడికి కోపం రాదా? ఏదైనా చెడు జరగదా అని.


అప్పుడు నా ఎప్పటి "లలిత - ఉవాచ" మోడ్ లో ఇలా చెప్పాను:


చూడు తులసి! నా అభిప్రాయం లో దేవుడ్ని రెండు రకాలుగా అనుకోవచ్చు.


1. దేవుడు ఒక  కంపెనీ CEO లాంటి వాడు. ఆ CEO కి తన కంపెనీ లో పని చేసే ప్రతి  ఏమ్ప్లాయీ గురించి పట్టించుకునేంత తీరిక వుండదు. అందుకని చాల డిపార్టమెంట్లు, బోల్డు టీములూ క్రియేట్ చేసి ఏ డిపార్టుమెంటు ప్రాబ్లెమ్స్ ఆ లెవెల్ లో సాల్వ్ అయేలా చూస్తాడు. ఒకసారి ఆఫీసు లో చేరాక కొన్నాళ్ళే ఎవరైనా హెల్ప్ చేస్తారు. తర్వాత అన్నీ మనమే మన పొజిషన్  కి తగినట్లు మేనేజ్ చేయాలి.


మన ప్రపంచానికి దేవుడు CEO అనుకుంటే ఆయన మనకి సెక్యూరిటీ కి ఇల్లు, అమ్మ, నాన్న, చదువుకోవడానికి  స్కూల్, డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు క్రియేట్ చేసాడు. వీటన్నిటి తో పాటు మనుషులకి ఎమోషనల్ డిపెందేన్సి ఇచ్చాడు - మనకి అవసరం అయినపుడు అయిన వాళ్ళు ఆదుకోవడానికి.  ఇన్ని చేసాక ఇంకా 'దేవుడా - నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు' అని దండాలు పెడితే సముద్రపు ఇసుకలో రేణువు లాంటి వాళ్ళం. ఆయనకి మన అప్లికేషను చేరేటప్పటికి మన జీవిత కాలం అయిపోతుంది.  అందుకని నేనేదో దీపం పెట్టకపోతే ఆయనకి పట్టించుకునేంత తీరిక వుండదేమో - అసలు ఆయనకి ఈ లలిత అనే ఒక ప్రాణి వుందని గుర్హు పెట్టుకునేంత అవసరం లేదేమో. సో - అక్కడ మనం సేఫ్.


2. ఇంకా రెండో రకం గా ఆలోచిస్తే దేవుడు అమ్మ లాంటి వాడు. ఒక అమ్మకి పది మంది పిల్లలున్నాఅందరి మీద సమానంగా ప్రేమ వుంటుంది- అందరినీ ఒకేలా చూస్తుంది. చంటి పాపకి పాలిస్తుంది. పెద్ద బాబు కి ఆమ్ పెడుతుంది. ఇంకో పెద్ద పాపని చెల్లిని జాగ్రత్తగా చూడమంటుంది. ఒక రోజులో ఎవరికి తగినట్టు అందరి అవసరాలూ తీరుస్తుంది. స్కూల్ కి వెళ్ళే పిల్ల అయినా, పాలు తాగే పసిపాప అయినా - వాళ్ళ వాళ్ళ ఆకలిని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్లకి కేర్ చేస్తుంది కానీ-  ఏ ఒక్కరినీ నిర్లక్ష్యం  చేయదు. పాప గుండెల మీద తన్నిందని అలగదు, కొట్టదు, అన్నం పెట్టడం మానేయదు.


దేవుడు కూడా అమ్మ లాగే  అనుకుంటే లలిత సముద్రం లో నీటి బొట్టయినా, ఇంకోటి అయినా - ఏమైనా పట్టించుకుంటాడు, జాగ్రత్తగా చూస్తాడు. తప్పు చేసినా క్షమిస్తాడు. అప్పుడు కూడా నేను సేఫ్ :)


అలా కాకుండా దీపం పెట్టలేదు, పూజ చేయలేదు అని నా మీద అలిగితే దేవుడెలా అవుతాడు? నిర్గుణ స్వరూపుడైతే కోపం, అహంకారం, పగ వుంటే దేవుడెలా అవుతాడు? ఒక వేళ అలాంటివాడే దేవుడైతే నేనెంత బాగా చేసినా ఏదో ఒక తప్పు పడతాడు - మామూలు మనిషి లాగే.


నా వరకు నాకు -
ప్రొద్దున్న లేచి మాట వల్ల కానీ, చేత వల్ల కానీ ఎవరినీ బాధించకుండా
ఎవరి చెడు నీ కోరుకోకుండా
ఎవరి ఏ రకమైన అభివృద్ధి కైనా ఈర్ష్య పడకుండా
ఎవరి గురించీ చెడు మాట్లాడకుండా
చేతనైనంతలో సహాయం చేస్తూ
పసి పాపలా మనసారా నవ్వగలిగిన
ప్రతి ఒక్కరిలో దేవుడు వున్నాడు
అలాంటి దేవుడ్ని నేను చాలా, చాలా సార్లు ఫీల్ అయ్యాను- అవుతూనే వుంటాను.


~లలితా TS

20, జనవరి 2011, గురువారం

Be a Roman in Rome...?

ఆగస్టు నెల వనితా మాలికలో నా వ్యాసం ఇక్కడ చదవండి.



Rome లో రోమన్ లా ఉండాలట.  ఇది ఎక్కడ విన్నా, చదివినా కుంచెం (బుడుగు తెలుగు లో ‘కొంచెం’ అన్న మాట :) ) ఆలోచనలో పడుతుంటాను – అంటే ఏంటబ్బా అని. అలా విన్నసారీ, చదివినసారీ కుంచెం కుంచెం ఆలోచించీ, చించీ – ఇలా అభిప్రాయపడిపోయానన్నమాట. ఎలా అంటే – మనం ఇప్పుడు (మనం అంటే మనందరం కాదండీ – రాయల్ వుయ్ అన్నమాట)    ఉత్తర అమెరికా లో ఉద్యోగం చేస్తున్నామా- ఆఫీసు కి వెళ్ళేటప్పుడు నాకు కంచి పట్టు చీరలు ఇష్టం, చక్కగా జరీ అంచుతో మెరుస్తూ, మెరిపిస్తూ వుంటాయి అని మా అనాతవరం అగ్రహారంలో  లాగ కాసె పోసి కట్టుకుని వెళ్దాము అనుకున్నాననుకోండి  - ఇంకంతే నేనెక్కడికో వెళ్ళబోయి దారి తప్పి అక్కడికి వచ్చాననుకుంటారు. (మర్చిపోయాను చెప్పడం…నేను బెంగుళూరు లో నా మొదటి వుద్యోగం లో చేరినప్పుడు రోజూ నా ముచ్చట తీరేలా ప్రతి రోజూ పట్టు చీరేలే కట్టుకు వెళ్ళేదాన్ని. అందులోనూ బెంగుళూరు లో ఆ రోజుల్లో వేసంకాలం లో కూడా చల్లగా వుండేదేమో హాయిగా ‘మించుతూ’ ఎంజాయ్ చేసేదాన్ని. ) .  అందుకని అమెరికా లో ఆఫీసు కి మాత్రం చక్కగా కుదురుగా బిజినెస్ casuals లో వెళ్తేనే అందరి కంటికీ, నా వంటికీ సుఖం. కరెక్టే కదా?
సరే! మరి అది కరెక్ట్ అయితే మరి ఎందుకు ఈ టాపిక్ మొదలు పెట్టింది – అమెరికాలో అమ్రేకా వాళ్ళలాగే ఉంటోంది కదా- మరింక ఇందులో రోము-రోమను అంటూ ఇలా బ్లాగడం ఎందుకూ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను ఆగండి మరీ…
మొన్నామధ్యన మా ఇంటికి ఇండియా నుంచి ఒక ఆంటీ-అంకుల్ చూడడానికి వచ్చారు. వచ్చినప్పుడు మా ఇంటి ముందు ముగ్గు, మా వంటింట్లో చిన్న దేవుడి బీరువా చూసి – “ఎంత బాగా పెట్టావు లల్లీ! మా అమ్మాయిని ఇలాగే ముగ్గు వేయాలమ్మా వాకిట్లో అంటే – What Mummy! Don’t you know why they say – Be  a Roman in Rome –  when we are in America, we have to be like Americans. If not, they would treat us like untouchables- అనేసింది” అని పాపం ఆ ఆంటీ నిట్టూర్చారు.
అది విని నేను కుంచెం ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే మా ఇంట్లో ఏ చిన్న పూజ, భోగిపళ్లు, కిరణ్ పుట్టిన రోజు లాంటివేవి  జరిగినా – నూరు సెంట్ల అమెరికన్ (అంటే మన పదహారణాల తెలుగు అమ్మాయిలా అన్నమాట) అయిన జాకీ పీటర్స్, జమైకన్ వేనెట్ హార్పర్  వచ్చి – ఆంధ్ర పులిహోర లో సాంబారు, టమాటా పచ్చడి (spoon తో)కలుపుకుని తిని, మళ్ళీ మూడింటికి మసాల టీ తాగి – సాయంత్రం డిన్నర్ కి కూడా ప్యాక్ చేసుకుని వెళ్తారు. అంతే కాక నేను వేసిన ముగ్గులని వాళ్ళ ఐ-ఫోన్ లలో ఫుటోపులు తీసుకెళ్తారు.  ఆఫీసు లో Matt Erickson  కి నోరూరేలా వర్ణించి చెప్తారు. మరి నేను రోము-రోమను లా లేనే- మరెంటబ్బా నన్ను ఎవరూ  అస్పృశ్యతా వ్రతం చేయమనట్లేదు అనుకున్నాను.
సరే అసలు సంగతికి వస్తాను – ఈ పిట్ట కథలన్నీ ఆపేసి-  ఆ ఇండో-అమెరికన్ ‘వాట్ మమ్మీ’ గాళ్ కి ఒక బుల్లి బొమ్మలాంటి గాళ్ వుంది. అది తన మమ్మీ మాట వినేసి- Be an American while in America అనేసుకుని లా-అఫ్ -ఇన్వెర్స్ -ప్రపోర్షన్సు ఫాలో అయిపోతూ పెద్దదయ్యేకొద్దీ బుల్లి, బుల్లి గౌనులేస్కుని, తన పద్నాలుగో ఏట  - ఇంకో బుజ్జి బాయ్ ఫ్రెండ్ తో చెట్టా-పట్టా లేసుకుని తిరుగుతూ మన ‘వాట్ మమ్మీ’ కి హాయ్ చెప్పింది అనుకోండి – మన వాట్ మమ్మీ అప్పుడు హథాత్తుగా కళ్ళ  ముందు రింగులు-రింగులు తిప్పుకుని తన తల్లి కి చెప్పిన రోము-రోమను ని గుర్తు చేసుకుంటుందా? లేకపోతే తన బుల్లి తల్లి-బుజ్జి ఫ్రెండ్ ని చూసి My li’l girl knows the rules అని మురిసిపోతుందా? ఇది మాత్రం నా ఆలోచనకీ, ఊహకీ ఏమీ అంతు  పట్టకుండా  వుంది.
ఇంతకీ రోం లో రోమన్ లా ఉండడమంటే మనం వున్న ప్ర్రాంతం లో కాలమాన పరిస్థితులకి తగినట్లు, మన విధి నిర్వహణలకు భంగం కలగకుండా నడుచుకోవడం తప్ప మన ఉనికినే మరిచి “మన” తనానికి దూరం కాకూడదని నా అభిప్రాయం – ఎందుకంటే ఏ దేశం లో వున్నా – ఎన్ని రకాల భక్ష్యాలు రుచి చూసినా – అమ్మ తిన నేర్పిన “పప్పు ఆమే” రుచికరం. ఎన్ని రకాల వస్త్రాలు ధరించినా అమ్మ నేర్పిన చీరకట్టే అందం. ఎన్ని భాషలు మాట్లాడినా – ఆనందం లో “అమ్మయ్య” అన్నా, ఆవేదనలో “అమ్మా” అన్నా అమ్మ భాషే మధురం. అమ్మ మనకి ఇచ్చిన సంప్రదాయమే మనకి శ్రీ రామ రక్ష.

2, జనవరి 2011, ఆదివారం

మొదటి అడుగు

నమస్తే!
ఇది నా మొదటి బ్లాగ్ పోస్ట్.

2011 చాలా మంచిగా మొదలయింది. క్రితం ఏడాది లాగే నా ఫ్రెండ్స్ & cousins అందరికీ నా న్యూ ఇయర్ విషెస్ పంపించాను - నా ఫొటోస్ + నా హ్యాపీ న్యూ ఇయర్ Terzanelle విషెస్ తో


అలాగే  ఈ బ్లాగ్ కూడా  మొదలు పెట్టాను - నా  ఆనందాలు, ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు నాకు ఇష్టమైన, నన్ను ఇష్టపడే వారితో పంచుకోవడానికి. I'm wishing  myself 'GOOD LUCK !'  

~లలితా త్రిపుర సుందరి