స్నేహం అన్న మాట వినగానే ముందు గుర్తొచ్చేవి - గడిచిపోయిన పాత రోజులు, చిన్నప్పటి నేస్తాలే.
జీవన్ తాల్ మే - భటక్ రహా రే - తేరా హన్‌సా
నేను రంగులేశాను.
దేవులపల్లి వారిని తలుచుకుంటూ -
పువ్వులు, రెమ్మలు, ఆకులు, సీతాకోకచిలుకలు -
నా రంగుల మాటలు, పాటలు ఇక్కడ కాసేపు ఆపుతాను.
ముందుగా - మునుముందుగా నేనొక అమ్మాయి కథ చెప్తాను.
కథ అన్నాను కదా - అందుకని అన్ని కథల్లాగే "అనగనగా..." అనే మొదలు పెడతాను, కానీ నిజానికి ఇది కథ కాదు. ఒక అమ్మాయి కన్న రంగుల కల.
ఆ కలని కళగా మలచుకుని - ఆ రంగుల బొమ్మల కొలువునే తనకి ఆదాయమిచ్చే కొలువుగా మార్చుకున్న అమ్మాయి కథ. ఆ అమ్మాయి ఎవరో, తన కల ఏంటో, అది కళగా ఎలా మారిందో, ఆ కళ కూర్చిన కొలువేంటో చెప్పే ముందు - నేను మొదలుపెట్టిన కథ చెప్పేస్తాను,
అనగనగా ఒక తొమ్మిదేళ్ళ పాప. కుట్టుమిషన్ నేర్చుకోవాలి అని సరదా పడింది. వెంటనే వాళ్ళ అమ్మకి వెళ్ళి చెప్పింది. అమ్మ పాప సరదాని సరేనంది. క్లాసుకి పంపించడమే కాదు తన పాప కోసమని అమ్మా-నాన్న కలిసి ఒక మంచి మిషన్ కూడా కొనిచ్చారు. ఆ పాప బోల్డు సంబర పడి కొన్నాళ్ళు ఆటగా కుట్టుకుంది - కుడుతూ ఆడుకుంది.
ఈలోగా ఆ పాప పెద్దదయ్యింది. ఇల్లు దాటి కాలేజ్‌కి వెళ్ళింది. కుట్టుమిషన్ చిన్నబోయింది. ఇంట్లో ఓ మూలకెళ్ళిపోయింది.
పెద్దదైన పాప చదువుకుంది, పెళ్ళి చేసుకుంది, ఉద్యోగం చేసింది. అంతలో అమ్మయ్యింది. అమ్మ అవుతూనే - "ఇంకెక్కడికీ వెళ్ళొద్దు" అనుకుని - ఇంటి పట్టునే ఉండి - పుట్టిన బుజ్జిబాబుతో ఆడుకోవాలనుకుంది.
అలా ఆడుకుంటూ - ఉంటుండగా - ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే కుదరదుగా! ఇంటికి కావాల్సిన అదీ-ఇదీ కొనుక్కోవాలంటే షాపుకి వెళ్ళాలిగా! అలా వెళ్ళిన ప్రతి చోటా Arts & Crafts section చూసినప్పుడల్లా ఆ అమ్మ ఇంక అక్కడే ఆగిపోయేది. ఆ మెత్తటి శాటిన్లని, వెల్వెట్లని, సిల్కులని చేతితో ముట్టుకుంటూ, రంగురంగుల పూసలని వేలితో తాకుతూ - ఏదో కలల ప్రపంచం లోకి వెళ్ళిపోయేది. ఎంత బావుందీ రంగుల ప్రపంచం అనుకునేది.
ఈలోగా బుజ్జిబాబుకి తోడుగా ఇంకో బుల్లి తమ్ముడు, చిట్టి చెల్లెలు ఒకరి తర్వాత ఒకరు వచ్చేశారు. అమ్మ ప్రపంచం మూడు పువ్వులు - ఆరు రంగులుగా వెలిగిపోతోంది.
ఓ రోజు బుల్లి తమ్ముడు బడి నుంచి వస్తూనే - పెన్సిళ్ళు పెట్టుకోవడానికి ఓ చిన్న పౌచ్ కావాలని - అది తనకిష్టమైన నారింజ రంగులో ఉండాలని, ఎలా ఉండాలో, ఎలా ఉంటేనే తనకి నచ్చుతుందో - అమ్మకి చెప్పాడు. ఎంత ఆలోచించినా అమ్మకి తన వరాల-బాబు కోరుకున్న అన్ని వివరాల-సంచీ ఎక్కడ దొరుకుతుందో తెలీలేదు. ఇలాక్కాదు పని అనుకుని ఓ రోజు బుల్లి తమ్ముడిని షాపుకి తీసుకెళ్ళి పెన్సిళ్ళు పెట్టుకునే పౌచ్ చెయ్యడానికి కావల్సిన సామగ్రి అంతా కొనుక్కొచ్చింది. ఆ తర్వాత అమ్మ, బుల్లి తమ్ముడు కూర్చుని ఆ పౌచ్ ఎలా ఉంటే బావుంటుందో డిజైన్ చేసుకున్నారు. ఇక తర్వాత మిగిలిందేంటి? మిషన్ మీద అమ్మ చకచకా పౌచ్ కుట్టేసి - Ta - Da అనెయ్యడమే!
అలా బుజ్జిబాబు, బుల్లి తమ్ముడు, చిట్టి చెల్లెలు - ఏదో కావాలని అడగడం - అమ్మ మంత్రమేసినట్టు - వాళ్ళు అడిగినవన్నీ చేసిచ్చేయటం - అలా చేస్తూ చేస్తూ అమ్మకి ఇంకా బోల్డన్ని మంచి ఆలోచనలు తట్టటం. తను చేసిన వాటన్నిటితో ఒక వెబ్‌సైట్ సృష్టించడం - అందులో వాటన్నిటినీ పేర్చడం - తన సరదా వ్యాపకాన్నే తనకు ఆదాయ-మార్గంగా మార్చుకోవడం గబగబా జరిగిపోయాయి.
ఇప్పుడు చెప్తాను ఆ అమ్మాయి / అమ్మ ఎవరో... తన పేరు రేణుకా గిరీష్. నాకు MCA లో జూనియర్.
తన వెబ్‌సైట్ పేరు టీల్ ఎండ్ టులిప్.
ఒక్కసారి తన రంగుల లోకం చూసి రండి మరి: TealAndTulip - Hand Crafted, Handmade Items, Handmade Accessories
.
ఇక్కడి నుంచి - ఇందాకెప్పుడో ఆపిన నా రంగులపలక కబుర్లు మళ్ళీ మొదలు.
ఆ టీల్ ఎండ్ టులిప్ వెబ్‌సైట్‌లో రేణుక చేసి పెట్టిన కలరింగ్ బోర్డు ఒకటి నాకు చాలా నచ్చింది.
Coloring Board Unlimited : https://tealandtulip.com/shop/ols/products/coloring-board-unlimited
అదొక ఏక్రిలిక్ (ప్లాస్టిక్) తో చేసిన బోర్డు. దాని మీద ఒక మంచి డిజైన్ చెక్కి (etch) ఉంటుంది. ఆ డిజైన్‌ని మనకు నచ్చిన రంగులతో - మనసుకి నచ్చినట్టు నింపుకోవచ్చు. మళ్ళీ కడిగేసుకుని ఇంకోలా రంగులు నింపుకోవచ్చు.
నాకు చూడగానే భలే నచ్చేసింది ఆ రంగులపలక. వెంటనే ఓ రెండు రంగులపలకలు తెప్పించేసుకున్నా.
2020 లో ఇంటికి (ఇండియాకి) వెళ్ళడం కుదరకపోవడంతో ఆఫీసులో ఓ రెండు వారాల సెలవులు మిగిలిపోయాయి.
రంగులపలక, రంగురంగుల పెన్నులు, రెండు వారాల సెలవులు - అంత కన్నా ఏం కావాలి? నేను కొన్న వాటిల్లో నాకు ఎక్కువగా నచ్చిన పువ్వుల-సీతాకోకచిలకల పలకకి రంగులేద్దామనుకున్నా!
సంక్రాంతి సంబరాల నెలలో - మా ఇంటి కిటికీ లోంచి బయటికి చూస్తే - నాకు కనిపించేవి రెండే రంగులు - తెల్లవారుతున్న పగలు అద్దుకునే ధూసరవర్ణం, పొద్దువాలుతున్న రాత్రి పూసుకునే నీలవర్ణం.

ఈ రంగులపలక మీద రంగులు వేయడం నాకొక మంచి ఉత్తేజభరితమైన కాలక్షేపం.
కొంచెంకొంచెంగా మొదలుపెట్టి - పువ్వులు, రెమ్మలు, ఆకులు, సీతాకోకచిలుకలు - ఇలా ఒక్కోదానికి ఒక్కో రంగు వేసుకుంటూ - రంగు మారినప్పుడల్లా ఫోటో తీసుకుంటూ - నేను రంగులతో ఆడుకున్నాను. ఆడుకుంటూ రంగులు వేసుకున్నాను.
ఇంత మంచి కలరింగ్ బోర్డుని డిజైన్ చేసి అందించిన రేణుకకి శుభాభినందనలు!
(TealAndTulip - Hand Crafted, Handmade Items, Handmade Accessories)
ఎలా గడిచిందో ఏమో - గడిచిన ఏడాది కాలం!
Can New Life, New Beginning ever be any Newer?!
New mark of resilience is
etched in Time
New rays of glimmering Hope are
in surge
Can New Life, New Beginning
ever be any Newer?!
Push Tears and Sorrow back, make way for
Smiles and Joy
Don’t fear the gloom, don’t
fret in the dark any more
New rays of glimmering Hope
are in surge
Let the Old whiles stay
back, let the New times spring ahead
It’s time to charge ahead
with a beam and conquer
Don’t fear the gloom, don’t
fret in the dark any more
Smell the blooms, Feel the
fresh breeze, Ease and pause
Laugh away the toils and
troubles and tumults
It’s time to charge ahead with
a beam and conquer
Be reassured! Worse spell is
not an eternal visitant to stay
Mirthful Horizon is here
leading the way sunnily
Laugh away the toils and
troubles and tumults
Ambition, Bravery, Courage
be the new ABCs of Life
New mark of resilience is
etched in Time
Mirthful Horizon is here
leading the way sunnily
Can New Life, New Beginning
ever be any Newer?!
**************************************
I wish you all a HAPPY and PROSPEROUS, a MERRY and MASKLESS New Year!
ఓయ్ 2020...
చేసిందంతా చేసేసి ఏంటంత మెల్లిగా జారుకుంటున్నావ్?
అసలు మొదట నువ్వు వచ్చీ రాకుండానే - కొత్త దశాబ్దం మొదలైందని, ఖచ్చితమైన చూపు అంకెలు 20 / 20 కలుపుకొచ్చావని, చమత్కార భరిత - Vision 2020 వనీ, కలిసొచ్చే కాలానివని, కలకల నవ్వులతో కళకళలాడిస్తావని ఎంత మురిసిపోయానూ?
సరిగ్గా ఏడాది క్రితం ఏమనుకున్నానూ? ఎంత మురిసిపోయానూ? ఓ సారి గుర్తు చెయ్యనా?
నేననుకున్నట్టు నువ్వు సమదృష్టి భరిత వత్సరానివే - కానీ అందులో ఉన్న ఓ చిన్న మెలిక నేను గమనించలేదు సుమా! అదేంటంటే నువ్వు సమదర్శి-దృష్టి భరిత సంవత్సరానివని.
ఒక్కటి మాత్రం నిజం. నిన్నెప్పటికీ మరువలేం. నువ్వు చేసిన గాయం ఇప్పటిప్పట్లో మానేది కాదు.
నువ్వు మాత్రం ఏం చేస్తావులే! ఎప్పట్లాగే సెకన్లు నిముషాలుగా, నిముషాలు గంటలుగా, గంటలు రోజులుగా - తలొంచుకుని నీ దారిన నువ్వు పెరగడమూ, ముందుకు జరగడమూ తప్ప నీకుగా నువ్వు ఏమీ చెయ్యలేదని నాకు తెలుసు.
కాకపొతే - అన్నీ సవ్యంగా సాగుతుంటే, అంతా బావుంటే కాలం కలిసొచ్చిందనీ - ఏ మాత్రం తడబడినా, ఓ చిన్న కుదుపిచ్చినా కాలం పామై కరిచిందనీ - జరిగే వాటన్నిటికీ కాలమే కారణమని అనుకోవడం మనుషులుగా మాకలవాటు. అందుకే మా కష్టాలకి, నష్టాలకి, కాలు కదపలేని బాధలకి నీదే బాధ్యత అంటున్నాం.
ఇంకొద్ది సేపట్లో పాతబడి, వాడిన మొహంతో నువ్వలా పోబోతున్నావా?! ఆ మలుపులో మొహమంతా వచ్చీరాని నవ్వు పులుముకుని, బిక్కుబిక్కుమంటూ, రానా-వద్దా అనుకుంటూ, ముందుకీ-వెనక్కీ ఊగిసలాడుతూ, అలా అని తోసుకొస్తున్న కాలాన్ని ఆపలేక, ఇప్పుడో-ఇంకో ఘడియకో వచ్చేస్తానన్నట్టున్న ఆ 2021 నీకూ కనిపించే ఉంటుంది.
ఆ వచ్చే కొత్త సంవత్సరం - నీ అంత కాకపోయినా ఎంతో కొంత తమాషా - అనగా some-వింత అయిన సంవత్సరమే! ఎలా అంటావా? 2021 అంటే 21 వ శతాబ్దపు 21 వ సంవత్సరం. భలే!
చూశావా! ఇప్పటి దాకా 20-20 వని నువ్వేం చేశావ్ అంటూ నిన్ను నిలదీస్తున్న నేను అంతలోనే 20-21 గురించి కొత్త లెక్కలేసుకుని ఇంతలోనే మురిసిపోతున్నాను. మనిషి పుట్టినప్పటినుంచి చెప్పిందే, మళ్ళీమళ్ళీ చెప్తున్నదే, నీకు మళ్ళీ చెప్తున్నా విను - మరపు మాకు సహజం. మరపు మాకు వరం.
ఎంతో చెడు జరిగిందని అందరం అనుకుంటున్న నీ కాలంలో - కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండేలా అంతో ఇంతో మంచి కూడా జరిగిందని - చేతులు కడిగించి, మూతులు మూయించి ఎంతో కొంత మార్పు తెచ్చానని - ఆట్టే మురిసిపోకు.
ఇంకో నాలుగు నాళ్ళు గడిచి మళ్ళీ నలుగురూ కూడే వేళ, నలుదిక్కులకీ వెళ్ళగలిగే వేళ - "నువ్వు నేర్పావూ-మేము నేర్చామూ" అనుకునే మంచి మచ్చుక్కూడా మిగిలుండదు.
ఇంకొక్క రోజులో నిరుడయ్యే నీకు నేను చెప్పేదొకటే!
ఇంత జరిగాక - "ఇప్పుడున్న కాలం బాలేదు, ఇంతకుముందు బావుంది, ఇక ముందు బావుంటుంది" - అన్న లెక్కలేమీ ఉండవు చూసుకో.
అలా అనుకోవడానికి అసలంటూ మనిషి మిగిలుండాలి కదా.