19, మే 2022, గురువారం

త్వామనురజామి 2.0 - 2 - యాద్ కర్‌కే యే ఘర్ రోయీ ఆంఖే... మగర్ ముస్కురానా పడా...

దీనికి ముందు కబుర్లు  చదవాలంటే, ఒకసారి ఇక్కడికి వెళ్లి రండి: త్వామనురజామి 2.0 - 1 - హమ్ సింఘాసన్ పర్ జా బైఠే ...జబ్ జబ్ కరే ఇరాదే..

    అప్పటి దాకా  - నేనెలా ఉండేదాన్నంటే - 

    మేడ మెట్లు ఎక్కాలంటే ఒక్క పరుగున ఎక్కుతూ - దిగేటప్పుడు రెండేసి మెట్లు దూకుతూ దిగుతూ -  ఎక్కడికైనా వెళ్ళాలంటే నడకకి ఎక్కువా, పరుగుకి తక్కువగా వడివడిగా అడుగులు పడుతూ - మాటల కన్నా పాటలు ఎక్కువ పాడుతూ, మాట్లాడే మాటల్లో ఎక్కువగా వినపడుతుండే వాడీ, మాటలకి తోడుగా నవ్వులు గలగలలాడి - హడావిడి పడిపోతూ ఉండేదాన్ని. 

    కానీ కొత్తగా మెడలో చేరిన పచ్చని పసుపుతాడు, దానికి తోడు మిలమిల్లాడుతున్న నల్లపూసల దౌరు, కాలివేళ్ళకి చేరిన వెండి చుట్లూ - అప్పటి వరకూ నేనెరుగని ఒక నెమ్మదిని నాకు నేర్పాయి. 

    దానికి తోడు పెళ్లయ్యాక పదహార్రోజుల పండగ దాకా రోజుకో కొత్తచీర కట్టుకోవాలని అమ్మ బోల్డన్ని చీరలు కొంది. అప్పుడే చీర అంటే ఇష్టం మొదలైంది. అంత ఇష్టంగా కట్టుకున్న చీర నా అడుగులకి అందంగా అడ్డం పడుతూ నా నడకకి కూడా నెమ్మది నేర్పింది.

    అత్తవారింట్లో కొత్త వాతావరణం. అందరూ కలుపుగోలుగా మాట్లాడుతున్నా నాకే ఏదో తెలీని బెరుకు. 

    అప్పటివరకూ నేనెంత మాట్లాడినా - ఇంట్లో అయితే పప్పీ, కుట్టీలతో - ఫ్రెండుగా అపర్ణ ఒక్కదానితో మాత్రమే. 

    నా ప్రపంచం అంతా కూడా యూనివర్సిటీ కేంపసూ, క్లాసులూ, పుస్తకాలు, పాటలూ, సినిమాలూ, రికామీగా తిరిగిన షికార్లు. 

    పెళ్ళితో ఒక్కసారిగా అన్నీ మారిపోయినట్లనిపించింది. 

    అత్తవారింట్లో కొత్తపెళ్ళికూతుర్ని చూడడానికి వచ్చే బంధువులు, ఇరుగు-పొరుగువాళ్ళు, బద్రి స్నేహితులు. వుక్కిరిబిక్కిరిగా అనిపించేది. 

ఉన్నట్టుండి ఒక్కసారిగా 
ఇంతకు ముందెప్పుడూ లేనట్టుగా
నాకే తెలియని నేనుగా, 
అంతకు ముందెప్పుడూ నేనెఱుగని నన్నుగా -  
నాకు నేనే కొత్తగా 
అనిపిస్తున్నాను, 
కనిపిస్తున్నాను. 

*** *** ***
*** *** ***

    పెళ్ళి అయిన రెండోరోజు మా ఇద్దరి చేత సత్యనారాయణ వ్రతం చేయిద్దామనుకుంటే - మా ఇంట్లో ఆనవాయితీ లేదని అత్తయ్య అంటే అదేదో మేమే చేస్తామని అమ్మా-నాన్న అన్నారు. 

    ఆ రోజు పొద్దున్నే అత్తయ్య పెట్టిన  వంగపండు రంగు సరిగ చీర, దాని మీదకి అమ్మ కుట్టించిన జరీదారాల బ్లౌజూ వేసుకుని బద్రి చేయి పట్టుకుని అమ్మా వాళ్ళింటి ముందు కారు దిగగానే - అప్పటికి ఒక్క రాత్రి దూరంగా ఉన్నందుకే అది "మా ఇల్లు" నుంచి "అమ్మా వాళ్ళిల్లు" అయిపోయిందని ఒక్కసారిగా గుర్తొచ్చి - ఏదో చెప్పలేని దిగులేసి - ఆపుకోలేనంతగా బోల్డు ఏడుపొచ్చేసింది. షంషాద్ బేగం పాట పెదవులమీదకొచ్చి ఇంకొంచెం ఏడిపించింది. 

యాద్ మైకే కీ  - దిల్ సే - భులాయే చలీ, 
హాఁ ... భులాయే చలీ... 
ప్రీత్ సాజన్ కీ - మన్ మే బసాయే చలీ
హాఁ ... బసాయే చలీ... 
యాద్ కర్‌కే - యే ఘర్ - రోయీ ఆంఖే... 
మగర్ ముస్కురానా పడా ... 

    అక్కడే ఉన్న జయాంటీ (మా పాపాయత్తయ్యగారమ్మయి) నా కళ్ళలో నీళ్ళు చూసి - చటుక్కున నన్ను దగ్గరగా తీసుకుని - లోపలికి తీసుకెళ్ళి నా చేత గోరువెచ్చటి పాలు తాగించారు. అప్పుడు జయాంటీ చేతుల మధ్య నన్ను సోకిన వెచ్చదనం, నా పెదవుల తాకిన గోరువెచ్చటి పాల కమ్మదనం ఇప్పటికీ ఒక నులివెౘ్చని జ్ఞాపకం.

*** *** ***
*** *** ***

    ఆ తర్వాత పదిరోజుల్లో - బద్రి, నేను కబుర్లు చెప్పుకుంటూ - గుంటూరు రోడ్ల మీద వెళ్తూవెళ్తూ - వాల్-పోస్టర్లు చూసి అప్పటికప్పుడు అనుకుని లోపలికి వెళ్లి చూసిన సినిమాలు - ఎప్పటివో పాతాతిపాతవి - బద్రికి ఇష్టమైన సావిత్రి act చేసిందని "మాతృదేవత", పాటలు బావుంటాయని "శ్రీకృష్ణార్జున యుద్ధం". 

    ఇవి కాక - పుట్టింటివాళ్ళూ, మెట్టింటివాళ్ళూ - అందరం కలిసి వెళ్లిన మొదటి సినిమా "రాజేంద్రుడు-గజేంద్రుడు" - ఫస్ట్-షో చూసి ఇంటికి నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ ఫాల్గుణమాస-కృష్ణపక్షపు రాత్రి పూట నాకు గుంటూరు రోడ్లు ఎంత కొత్తగా కనిపించాయో! నేనెప్పుడూ అంతకుముందు అక్కడ నడవనట్లే. నాలాగే అవీ కొత్తగా పుట్టినట్టే. 

 *** *** ***
*** *** ***

    ఇంకా పెళ్ళయ్యాక పదహార్రోజుల పండగ లోగా కలిసిన కొత్తమనుషులు - వీళ్ళందరూ బద్రి స్నేహితులు - పద్మజాతిలక్ అనే అమ్మాయి, అనీస్-అస్మా-ఇద్రిస్, ఆనంద్, మదన్, సీకే అని పిలవబడే చెన్నకేశవరెడ్డి, "అమ్మో! ఈ అమ్మాయినా నువ్వు చేసుకుంది" అనాశ్చర్యపోయిన మా ఏసీ కాలేజ్ సీనియర్ రవితేజ. 

    వీళ్ళే కాకుండా చక్రవర్తి అంకుల్ అని బద్రి ఎప్పుడూ చెప్పే చక్రవర్తి గారు అంటే ఎవరో కాదు చిన్నప్పుడేప్పుడో నాకు ఒకటో తరగతిలో ప్రైవేటు చెప్పిన టీచరుగారి తమ్ముడుగారు. 

    (ఈవిడ దగ్గరికే రాను-రానంటున్న నన్ను ఇద్దరు కలిసి రోడ్డంతా ఉయాలూపుతున్నట్టు చెరో రెక్కా పట్టి మోసుకెళ్ళేవారు. నేను ఆవిడ ఇంటి గుమ్మం మీద కూర్చుని ఏడుస్తుంటే మా అమ్మకి నాన్నమ్మ - మా శివకోడు-మామ్మ వచ్చి ఆవిడకి పరవాణ్ణం లంచమిచ్చి నన్నెంచగ్గా ఇంటికి తీసుకేళ్ళిపోయిందో రోజు. ఇంకొకప్పుడైతే అవన్నీ ఆ టీచరుగారికి గుర్తు చేసి తెగ నవ్వేసుకుని ఉండేదాన్నేమో. కానీ అదేం వింతో మాటలే మర్చిపోయినట్టుండిపోయాను. నిజంగానే నేను చాలా మారిపోయినట్టున్నాను హఠాత్తుగా... ఆరిందాలా... )

    అన్నట్టు వీళ్ళందరితో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. బద్రీ, నేనూ ఓ రోజు నాకు కొత్తచెప్పులు కొందామని వెళ్ళి, వస్తూవస్తూ గీతా-కేఫ్‌లో భోంచేద్దామని వెళ్ళి - కూర్చున్నామో లేదో ఒకతను వచ్చి మా ఎదురుగుండా కూర్చుని - భోజనంతో పాటు బోల్డన్ని కబుర్లు కూడా తినిపించాడు. అతని పేరు విజయభాస్కరరెడ్డి అని తప్ప బద్రికి ఇంకేమీ తెలీదని తర్వాత తెలిసింది. 

 *** *** ***
*** *** ***

    మా పెళ్ళైన రెండు వారాల్లో దుర్ముఖినామ ఉగాది పండగ వచ్చింది. ఆ రోజు నేనే వంట చేస్తానంటే అత్తయ్య బోల్డు సంబర పడ్డారు. మొట్టమొదటిసారిగా మా అత్తవారింట్లో నేను చేసిన వంట - కేరట్-కొబ్బరి కూర, మావిడికాయ పులిహోర. బాగానే చేశాను. అంతే ... ఆ ఒక్కరోజే. 

 *** *** ***
*** *** ***
    ఇంతలో ఉగాది వెళ్ళిన మూడ్రోజులకి పదహార్రోజుల పండగ వచ్చేసింది. ఆ ముందురోజే బద్రి, నేను మా అత్తవారింటి నుంచి అమ్మా వాళ్ళింటికి వెళ్ళాము. 

    ఆ రోజు పొద్దున్నే అమ్మ "రండి, బద్రీ! కొత్తల్లుడికి అత్తగారు తలంటాలి" అంటూ కుంకుడుకాయలరసంతో బద్రికి తలంటు పోసింది అమ్మ. 

    నేను కూడా తయారయి - మేమిద్దరం కొత్తబట్టలు కట్టుకున్న తర్వాత - నా మెడలో పసుపుతాళ్ళకి విడివిడిగా ఉన్న మంగళసూత్రాలని బంగారం గొలుసులో - పొరలుగా పేని పసుపు రాసిన దారాలతో - అమ్మ గుచ్చి ఇస్తే - "నేనైతే గట్టిగా వేస్తాను - ఇలా ఇయ్యి" అని అడిగి మరీ తీసుకుని ముడివేసిచ్చారు నాన్న. బద్రి నా మెడలో కట్టిన మంగళసూత్రాలు అమ్మ-నాన్న కలిసి ఇంకొంచేం గట్టిగా ఇంకొన్ని ముళ్ళేసి - నా మెళ్ళో మళ్ళీ బద్రి చేత వేయించారు. పదహార్రోజులపండగ వేడుకగా ముగిసింది. 

*** *** ***
*** *** ***

    ఆ తర్వాతి రోజే బయల్దేరి బద్రి బెంగుళూరు వెళ్ళారు. వెళ్తూ నాకు చెప్పిన మాట "నేను బెంగుళూరులో ఇల్లు అద్దెకు తీసుకునేదాకా  నువ్వొక రెండు మూడు నెలలు అమ్మ, తమ్ముడు, చెల్లెలు వాళ్ళ దగ్గరే ఉండాలి" అని. 

    అప్పుడు నాకు గుర్తొచ్చిన విషయం ఏంటి తెలుసా ...?

    పెళ్ళికి ముందు ఫాల్గుణ పౌర్ణమి రోజు అమ్మతో నేనన్న మాటలు...ఇంతకు ముందు రాసినవే - మళ్ళీ ఇక్కడ గుర్తు చేసుకుంటున్నా... 

*** *** ***
*** *** ***


    ఆ ఫాల్గుణ పౌర్ణమి రోజు మొదటిసారిగా దిగులుగా అనిపించింది.

    జరగబోయేది నా పెళ్ళి. నే కోరుకున్నట్టుగానే నా కిష్టమైన అబ్బాయితోనే. అది కూడా మా అమ్మానాన్నలు ఒప్పుకుని నా ఇష్టాన్ని మన్నిస్తూ చేస్తున్నదే!

    అయినా ఇంకో మూడు రోజుల్లో అమ్మనీ, నాన్ననీ, పప్పీని. కుట్టీని, ఈ ఇంటినీ, తులశమ్మనీ, ఆ తులశమ్మ ముందు ముగ్గు వేసే మురిపాన్నీ, ఆ ముగ్గులో రాలే విరిసిన చంద్రకాంతల్నీ ఒదిలి వెళ్తాననే బెంగ.


    ఆ రోజు రాత్రి అందరం భోజనాలు చేసిన తర్వాత - ఎప్పటి మా అలవాటు ప్రకారం ఇంటి ముందున్న కుర్చీల్లో కూర్చుని పప్పి, కుట్టీలతో కలిసి ఛాయాగీత్ వింటున్నాను. చలో దిల్‌దార్ చలో ...చాంద్ కే పార్ చలో...అని రఫీ రాగాలు తీస్తుంటే , హమ్ హై తైయార్ చలో అని లతా మంగేష్కర్ ఆనందంగా పాడేస్తోంది. అదేంటో ఎప్పుడు ఛాయాగీత్ పెట్టినా వారానికి నాలుగు రోజులు ఆ పాట తప్పకుండా వచ్చేది.

    ఆ పాట వింటుంటే కుట్టి అందుకుని "లల్లి తైయార్ చలో" అని పాడుతూ నాకేసి చూసి "ఇంకో మూడు రోజులే లల్లెమ్మా! నిన్నిహ పద పద పమ్మక్కా అని పంపించేసి నేను, పప్పి హాయిగా ఉంటాం. కదే పప్పీ!" అని పప్పితో అని - మళ్ళీ నాకేసి తిరిగి - " అప్పుడు నీ స్టాంపులు, బొమ్మలు అన్నీ నావే!" అని నవ్వింది. పప్పి కూడా సవ్వడి లేని నవ్వు ముత్యాలు రాల్చింది.  

    నేను వెంటనే లేచి వంటింట్లో గిన్నెలేవో సర్దుతున్న అమ్మ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వంటింట్లో అమ్మ తప్ప ఎవరూ లేరు.

    "అమ్మా!" అని వంటింటి తలుపు దగ్గర ఆగి మెల్లిగా పిలిచాను.

    అమ్మ గ్యాస్ గట్టు తుడుస్తూ "వచ్చావా? అదుగో ఆ వాటర్ ఫిల్టర్ మీద గ్లాసులో పాలు పోసిపెట్టాను. తాగు." అంది తల తిప్పకుండానే.

    ఒకడుగు ముందుకేసి ఆ గ్లాసు తీసుకుని రెండు అరచేతుల మధ్యా ఆ గ్లాసునలముకుని  ఉన్న వెచ్చదనాన్ని పట్టుకుని, పాలు ఓ గుక్క తాగి "అమ్మా! నేనిన్ని రోజులు హాస్టల్లోనూ, ప్రాజెక్టు కోసమని బెంగుళూర్లోనూ ఉన్నాను. అసలు ఇంట్లోనే ఉన్నట్టు లేదు. అందుకే నా పెళ్ళయ్యాక ఓ మూణ్ణెల్లు మనింట్లోనే నీ దగ్గరే ఉంటానూ... సరేనా?!" అని నెమ్మదిగా అడిగాను. ఎందుకో తెలీని దుఃఖమొస్తోంది. ముక్కు పీలుస్తున్నాను.

    అమ్మ తల తిప్పి చూసి నవ్వబోయి, నన్ను చూసి ఏమనుకుందో ఏమో, దగ్గరగా వచ్చి "నీకిష్టమైనట్టుగానే అన్నీ చేస్తున్నాంగా. ఆ తర్వాత చూద్దాంలే... " అని ఆగి ... మళ్ళీ ఏదో ఆలోచించుకున్నట్టు "నీక్కావల్సినన్ని రోజులు మనింట్లో ఉందువుగానిలే. వెళ్ళు - ముందు ఆ పాలు తాగేసి ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుక్కో. " అని చెప్పింది.

    ఇంతలో - ఎప్పట్నుంచి మా మాటలు వింటోందో - కుట్టి నా పక్కనే వచ్చి నించుని ఓ చేత్తో నా షిప్లీ బొమ్మని పట్టుకుని "చంటిపిల్లలా అమ్మని వదిలి వెళ్ళనని ఏడుస్తావేంటే, లల్లీ ? ఇదిగో ---దీన్ని కూడా పట్టుకుపోవే బాబూ! దీన్ని పట్టుకుని 'జుజుజుజుజూ 'అని ఎంచగ్గా పాడుకోవచ్చు నువ్వు." అని నన్ను వెక్కిరిస్తున్నట్టుగా అంటుంటే నాకు అంత దుఃఖం లోనూ బోల్డు నవ్వొచ్చేసింది.


*** *** ***
*** *** ***

    బద్రి చెప్పినట్టే ఆ తర్వాతి రెండు నెలలూ నేను మా అత్తగారి ఇంట్లోనే ఉన్నాను - మధ్యలో ఒక నాలుగు రోజులు తప్ప. 

    బ్రాడీపేట నాలుగో లైను, పద్ధెనిమిదో అడ్డరోడ్డులో ఉన్న అమ్మా వాళ్ళింటికి, రెండోలైను పదకొండో అడ్డరోడ్డులో ఉన్న మా అత్తగారి ఇల్లు - జస్ట్ రెండు లైన్ల ఏడు అడ్డరోడ్ల దూరం మాత్రమే అనిపించినా దూరం దూరమే కదా!  


*** *** ***
*** *** ***

నేనా దూరం కొలుచుకుంటూ ఇక్కడుంటాను. 




నన్నేడిపించిన షంషాద్ బేగం పాటొకటి పైనుంది కదా... ? దాని మొదలూ-తుదీ మీరేమన్నా పట్టగలరేమో పాడి చూడండి... 

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>


15, మే 2022, ఆదివారం

గమ్మత్తు పాటలు - 1 - ఛల్‌కా యే జామ్...

ఆ పాట -
అప్పటిదాకా 
అంతకు ముందెప్పుడూ
వినివుండని ఓ పాట... 

ఆ పాట -
ఊసుపోని ఓ సాయంకాలాన 
అలలుగా సోకిన పాట... 
కలలుగా తాకిన పాట... 

ఆ పాట -
అప్పటినుంచీ 
ఆ తర్వాతెప్పుడూ
వినకుండనివ్వని పాట...

ఆ పాట -
విన్నపాటున
గుండె మాటున 
దాగి ఉండి
ఊగి ఊగి 
తూగుతుంటుంది


ఆ పాట - 
చిన్న మాటగ 
చిగురు పాటుగ 
జారి పడి 
సోలి సోలి
తూలుతుంటుంది

ఆ పాట... 
పదము పదము కలిసిన
అదే పాట -
పదము పదము కలిపి
నాతో పాటు -
నడు... నీతో నేనొస్తానంటుంది
ఆ పాట... 

పొరపాటున- 
ఆదమఱచి... 
పాట మఱచి... 
నేనుంటే - 

మారాముల ఆ పాట 
అలిగి పాపాయౌతుంది... 
గారాబుల ఆ పాట 
రాగమై అల్లుకుంటుంది... 

*** *** ***
*** *** ***


    నాకు నచ్చిన పాటలు బోల్డన్ని వింటుంటా. 

    నచ్చినదేదో ఒక పాట బోల్డన్నిసార్లు వింటుంటా. 

    ఆ పాట విన్న ప్రతి సారీ - అదే మొదటిసారన్నట్టు వింటుంటా. 

    వింటున్న ప్రతీ సారీ మొదటిసారి ఆ పాట విన్న రోజుని గుర్తు చేసుకుని మురిసిపోతుంటా. 

    ఇలా వింటూ వుండడం, తలుచుకోవడం, మురిసిపోవడం చేస్తూ - నాకు తోచినట్లు అనుకుంటుంటా... 

    అలా విన్న పాటని అనుకుంటూ ఉంటుండగా - అనుకున్న పాటని వింటూ వుండగా - ఆ పాట ఇక ఉన్నచోట ఊరికే ఉంటుందా? 

    ఉబికి ఉరికి పెదవుల మీదకొచ్చి - అక్కడే కులికి ఉలికి - అక్కడితో ఆగక - "నా గురించి కబుర్లు చెప్పూ...ఇంకా-చెప్పవేమ"ని సతాయిస్తుంది. 

  ఉలుకుతున్న పాటని పలుకుతుండమని - పలుకుతున్న పాటని పట్టించుకోకుండా ఉందామని - ఇంటి బయటి దారి చూసి రమ్మని  చూపుల్ని పంపుతానో లేదో ... గాలి తోసుకొచ్చిన ఆగమేగాలేవో ఇక సాగలేక - అక్కడే ఆ మలుపులో ఆగి అలుపు తీర్చుకుంటుంటాయి. 

    ఇంతలో ఏ నల్లమబ్బో కమ్ముకొస్తుంది. వానజల్లు ౘల్లిపోతుంది. 

    ఆ వానకి తడిసిన ఆకొకటి మెరిసిపోతుంటుంది.

    ౘల్లటి చినుకు తాకిన పువ్వొకటి నవ్వుతుంటుంది. 

    జల్లుకి మురిసిన మొగ్గొకటి విరిసిపోతుంటుంది.

    నేల మీద సాగుతున్న ఈ కోలాహలమేమిటా అన్న కుతూహలమో ఏమో - నింగి నుండి - రంగులద్దుకున్న ఒయ్యారాల వానవిల్లొహటి - ఒంగి - తొంగి చూస్తూ వుంటుంది. 

    కిటికీ లోంచి - చినుకుల చిందులూ, ఆకుల మెరుపులూ, పువ్వుల మురిపాలూ, మొగ్గల విరిపాలూ, వేలుపువిల్లు సోలుపులూ - ఇన్ని చూస్తున్న నా పెదవుల మోగుతున్న పాట -  పదే పదే ఆగక - అదే అదే మూగుతూ - నన్నొదలి కదిలి తనెళ్లక - తననొదిలి వెళ్ల నను కదలనీక -  నా చేయి పట్టి లాగుతూ ఆడుకుందాం రమ్మని మారాం చేసే పాపాయిలా తోస్తుంది.  

    గారాలు పోతున్న ఆ రాగాల పాటని - నా  కబుర్లలో రాస్తే - ఆ కబుర్లకి కట్టుబడి - కదలలేని  పాట ఇంకెప్పటికీ నన్నొదిలిపోక - నాతోనే ఉండిపోతుంది కదా అనిపిస్తుంది. 

    అనిపించినదే తడవు కైత ఒకటి - మాట మీద మాటగా - తెరలి తెరలి- మాటలు మాటలుగా - మాటలమూటగా - తరలి తరలి వస్తుంది.  

    పాట గురించి నే రాయబోయే కబుర్లకి - అదిగో... ఆ ముందు మెట్లుమెట్లుగా రాసినదేదో ఉందిగా - ముందు రాసిన మాటలుగా - ముందుమాటై కుదురుకుంటుంది. 

*** *** ***
*** *** ***


    ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే - 

    ఎప్పట్నుంచో తన గురించి రాయమని నా చెవినిల్లు కట్టుకుని రాగాలు తీస్తున్న రాలుగాయి పాటొకటుంది. 

    ఆ పాటకో కథ ఉంది. 

    ఆ కథా-కమామీషూ ఎలాంటివంటే...  

    అనగనగా... అమెరికాలో అడుగు పెట్టిన మొట్టమొదటి సంవత్సరం. 

    అప్పుడు వెళ్ళిన మొట్టమొదటి తెలుగు అసోసియేషన్ సాంస్కృతిక కార్యక్రమం. 

    అక్కడ - వేదిక మీద ఒకాయన, ఇంకొక ఆవిడ కలిసి - వేడుకగా - తెలుగూ, హిందీ భాషల్లో చాలా పాటలు  పాడారు. 

    అప్పుడే మొట్టమొదటిసారి ఒక హిందీ పాట విన్నాను. ఆ పాడిన ఆయన ఎవరో ఆ పాట చాలా బాగా పాడారు. వినగానే పాట భలే నచ్చేసింది. 

    పాటతో పాటు - పాడిన ఆయన పాడుతూ పాడుతూ - ప్రేక్షకుల్లో కూర్చుని పాట వింటున్న తన భార్య కేసి చూస్తూ - ఆజ్ కీ శామ్...ఆప్‌కే నామ్...  - అని ఆ పాటని ముగించడం - అది వింటూ ఆవిడ బోల్డంత సిగ్గుపడుతూ సంబరపడడం - ఇంకా ఇంకా బోల్డంత నచ్చింది. 

    కాకపోతే పాడిన ఆయన, పాట అందుకున్న ఆవిడ - వాళ్ళెవరో నాకు అప్పుడు తెలీదు. ఇప్పటికీ తెలీదు. 

    కానీ అప్పుడు తెలిసిన పాట ఇప్పటికీ ఆ సాయంకాలపు అందమైన జ్ఞాపకంగా నాతో ఉండిపోయింది.

*** *** ***
*** *** ***

    అప్పటి ఆ పాటని - గుర్తు పెట్టుకుని, అలాగే అట్టిపెట్టుకుని - ఆ తర్వాత యూట్యూబ్‌లో ఆ పాటని వెతికి పట్టుకుని - ఇప్పటికి లెక్కపెట్టలేనన్నిసార్లు విన్నాను. 

    ఈ పాట ఒక మత్తుపాట. అంతటి మత్తుపాట కూడా రఫీసాబ్ గొంతులో మెత్తగా, గమ్మత్తుగా పలుకుతుంది. 

    ఉయ్యాల ఎక్కినట్టు తూగుతుంది. గాలి వాలున సోలినట్టు తూలుతుంది. 

    పాటలోని షరాబీ-నిషాని ఖరాబ్ చేసే హిచ్‌కీ శబ్దాలు ఏమీ లేకుండా హాయిగా ఊగుతూ సాగుతుంది.

    ఈ పాటలో ధర్మేంద్రకి ఓ నల్లరంగు సూటూ-బూటూ వేసి, షర్మిలా ఠాగూరుని ఒక అందమైన లేసులున్న తెల్లచీరలో చుట్టి - పాటని ఒక అందమైన ప్రేమనగర్ లాంటి ఇంట్లో చూపిస్తే - వినిపిస్తున్న రఫీసాబ్ గొంతు లోని క్లాసిక్-స్థాయిని కనిపిస్తున్న దృశ్యం కూడా అందుకునేది. 

    ప్రస్తుతానికి పాటలో ఉన్న సెట్టింగ్, వాతావరణం గ్లాసుల-స్థాయి లోనే ఉండిపోయింది. 

    కాకపోతే పాటని ఇష్టపడడానికి ఆ గ్లాసుల-క్లాసు అంతగా అడ్డం రాలేదు. 



*** *** ***
*** *** ***

    ముందుగా ఆ పాట ప్రవర ఇదీ...

    పాట ఉన్న సినిమా నేను పుట్టక ముందొచ్చిన "మేరే హమ్దమ్ మేరే దోస్త్" సిన్మా లోది. 

    పాటని పుట్టించినవారు - మజ్రూ సుల్తాన్‌పురి గారు.

    పాటకి మేళం కట్టించినవారు - లక్ష్మీకాంత్-ప్యారేలాల్ గార్లౌ 

    (మీరు సరిగ్గానే చదివారు - ఒక్కరైతే "గారు", ఇద్దరికన్నా ఎక్కువ మందైతే "గార్లు", ఇద్దరైతే  "గార్లౌ" - అన్నది నా సంస్కృత పాఠ పఠన జనిత జ్ఞానం.)

    పాటలో కనుపట్టైనవారు - ధర్మేంద్ర, షర్మిలా ఠాగూర్, ఒక సర్వర్ వారు, ఓ  పానాసక్త-పురుషాష్టకం - వెరసి తెర నిండుగా - ఓ పది మందికి పైగా మందీ, వారు తాగుతున్న మదిరా, వారిలో ఒకే ఒక్క మదిర ముట్టని ముదిర. 


*** *** ***
*** *** ***


    ఇహ పాట విషయానికి వస్తే... 

    పాటలో చూపులకి నచ్చినవి - 

    ఎరుపూ-ఆకుపచ్చ రంగుల్లో వేలాడుతూ కనిపించిన కొమ్మలశెమ్మెలు (Chandeliers) రెండు  - 
    తళుకులద్దిన ఎఱ్ఱటి చీరలో విరిసిన మందార పూల కొమ్మలా మెరిసిపోతున్న కొమ్మ షర్మిలా -
    షర్మిలా ఎఱ్ఱచీరకి జతగా ధర్మేంద్ర మెడలో ముడేసుకున్న ఎఱ్ఱరుమాలు-


    ఈ పాటలో చెవులకి  నచ్చినవి - 

    రంగ్-ఓ-బూ - అంటే పూలకుండే రంగూ, సుగంధమూ అట
    జామ్-ఏ-మయ్ - ఇది పానపాత్రకో మజా అయిన పిలుపు
    శాఖ్-ఏ-బదన్ - వాహ్...వాహ్... కొమ్మ లాంటి తనువు ఆ కొమ్మదట, అందాలబొమ్మదట...

    ఈ కింద రాశాను చూడండీ ... కొన్ని వాక్యాలూ... అవి పాడేటప్పుడు - ఈ పాట రఫీసాబ్ గొంతులో డోలలూగిన లీల అద్భుతం... ఆ హేల వేరెక్కడా వినం వినం... 

    యే రంగ్-ఓ-బూ కే...
    హోఠోం కో ఛూకే...
    పీ హై సభీ నే...
    ప్యాలోం కే సీనే... 
    బాహోం మే డాల్ లే...
    వో హీ సంభాలే...

*** *** ***
*** *** ***

    కింద నేను రాసుకున్న పాట పాడుకుంటూ చూడాలనుకుంటే - ఇదిగో - ఈ కిందనే ఉంది ... 

    యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=lsnrYj1rOKc


*** *** ***
*** *** ***




ఛల్‌కా యే జామ్...  ఆయియే... 
ఆప్‌కీ ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్... 

ఛల్‌కా యే జామ్...  ఆయియే... 
ఆప్‌కీ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్... 
ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్... 

ఫూల్ జైసే తన్ పే - జల్‌వే...
యే రంగ్-ఓ-బూ కే...
యే రంగ్-ఓ-బూ కే...
ఆజ్ జామ్-ఏ-మయ్ ఉఠే 
ఇన్ హోఠోం కో ఛూకే...
హోఠోం కో ఛూకే...
లచ్‌కాఇయే ... శాఖ్-ఏ-బదన్... 
మెహ్‌కాఇయే... జుల్ఫోం  కీ  శామ్... 

ఛల్‌కా యే జామ్...  ఆయియే... 
ఆప్‌కీ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్... 

ఆప్‌కీ   హీ నామ్ లేకర్ 
పీ హై సభీ నే...
పీ హై సభీ నే...
ఆప్ పర్ ధడక్ రహే హై 
ప్యాలోం కే సీనే... 
ప్యాలోం  కే సీనే...
యహా అజ్‌నబీ - కోఈ నహీ...
యే హై ఆప్‌కీ - మెహ్‌ఫిల్ తమామ్... 

ఛల్‌కా యే జామ్...  ఆయియే... 
ఆప్‌కీ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్... 

కౌన్ హర్ కిసీ కీ బాహే...  
బాహోం మే డాల్ లే...
బాహోం మే డాల్ లే...
జో నజర్ నషా పిలాయే 
వో హీ సంభాలే...
వో హీ సంభాలే...
దునియా కో హో - ఔరోం కీ ధున్
హమ్ కో తో  హై - సాకీ సే కామ్ 

ఛల్‌కా యే జామ్...  ఆయియే... 
ఆప్‌కీ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్... 
ఛల్‌కా యే జామ్...  ఆయియే... 
ఆప్‌కీ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్... 
ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్... 
 

*** *** ***
*** *** ***

    పాట వినబోతే బావుంది కానీ రాయబోతే తెగ సతాయించింది. 

    అది "ఛల్‌కా యే జామ్ ... ఆప్‌కీ ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్... " - అంటే "చిందింది ఈ మదిర నీ పెదవుల కోసం, నీ కన్నుల కోసం" - అనా? 

    లేకపోతే - ఛల్‌కాయే జామ్ ... ఆప్‌కీ ... ఆంఖోం కే నామ్ - హోఠోం కే నామ్.." అంటే "చిందిద్దాం మదిర - నీ పెదవుల కోసం - నీ కన్నుల కోసం"- అనా?

    అలానా - ఇలానా - అనాలోచించి - చివరికి నాకు నచ్చినట్లు - అది ఛల్‌కా యే జామ్ అన్నట్టే రాసుకున్నా. 

    నేనెప్పట్నుంచో రాయాలనుకున్న మత్తుపాటల్లో మొదటిదైన ఈ గమ్మత్తు పాటని - ఏ అనామత్తుఖాతా గానో జమ కట్టి పక్కకు నెట్టెయ్యక  - కిమ్మత్తు కట్టలేని రఫీసాబ్ గళంలోవిని - ఆనందిస్తారని అనుకుంటూ... 

~ పాటల భైరవి 

    


1, మే 2022, ఆదివారం

డీ జే టిల్లు డాన్సు చూడ - దిల్లంతా తిల్లాన పాడు...

ముందుగా నాదో సినీ-మాట...

తెర నిండా వెలిగిపోతూ 
కదిలే బొమ్మలు చెప్పే కబుర్లూ, 
మాటలూ, పాటలూ, ఆటలతో నడిపే కథలూ 
ఇంతకుముందెన్ని చూశానో!
ఇపుడెన్ని చూస్తున్నానో!
ఇకముందెన్ని చూడబోతానో!

ఎన్ని చూసినా - 
ఇంకెన్ని చూస్తున్నా - 
మరిన్ని చూడబోతున్నా - 
నే నేర్చుకున్న సిని-మా-పాఠమేంటీ అంటే...

ఎప్పటికే సినిమా చూస్తుంటే 
అప్పటికదే ప్రస్తుతం...
ఇంకేదైనా మరి అప్రస్తుతం...

అలా చూడగలగడం నాకు దక్కిన సిని-మా-వరం
అలాక్కనుకే చూడగలుగుతున్నా వారం వారం... 

*** *** ***
*** *** ***



    ఈ మధ్య కాలంలో - అనుకోకుండా ఒకసారి చూసి - చూసీ చూడగానే తెగ నచ్చేసి - చూసిన సిన్మానే మళ్ళీ చూద్దామా అనిపించి - అనిపించిన వెంటనే 'మళ్లింకెప్పుడైనా' అనుకోకుండా - మళ్లింకొక్కసారి చూసిన సినిమా "డీజే టిల్లు". 

    మొదట్లో "డీ జే టిల్లు" పేరు విన్నప్పుడు నేనసలు ఇది తెలుగు సినిమా అనుకోలేదు. నిజం చెప్పాలంటే అంతగా పట్టించుకోలేదు. 

    నేను ఎప్పుడూ వచ్చే వార్తాపత్రికల్లో వార్తలు అసలెప్పుడూ చదవను, కానీ ఎప్పుడైనా సినిమా వార్తలు మాత్రం చదువుతుంటాను. 

    ఓ సారలా చదువుతుంటే "డీ జే టిల్లు" హీరో సిద్ధు జొన్నలగడ్డ ఎవరో ఒక విలేఖరి ఆ సినిమా హీరోయిన్ గురించి అసందర్భంగా అడిగిన ఓ ప్రశ్నకి మహా సందర్భోచితంగా సమాధానం చెప్పి తప్పించుకున్న వార్త నాకు భలే నచ్చింది. 

    ఈ అబ్బాయి ఎవరో నిజంగానే "వీరో" అనిపించింది. 

    అలా అనిపించింది కానీ సిద్ధు జొన్నలగడ్డ పేరు వినగానే పాండెమిక్ రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన "కృష్ణ ఎండ్ హిజ్ లీలా" గుర్తుకొచ్చి "వద్దులే...బాబూ... మాటలు కూడా ఆ అబ్బాయే రాసుకుంటాడు. నాకు నచ్చవు. చూడడమెందుకు... మళ్లీ ప్చ్..ప్చ్ అనుకోవడమెందుకు" అని నాలో నేనే అనుకుని, నాతో నేనే గట్టిగా మాట్లాడుకుని "డీ జే టిల్లు" చూడొద్దంటే చూడొద్దనుకున్నా. 

    కానీ "సీన్ సీన్ పే లిఖా హై దేఖ్‌నేవాలే కా నామ్!" అన్న నా-నుడి ప్రకారం ఆ నామం రాయబడ్డ సీను డీ జే టిల్లుదయ్యింది.

    ఆ సీను మీద రాయబడ్డ నామం నాదయ్యింది. 

    వెరసి పతీసహితంగా "డీ జే టిల్లు"ని  చూడడమయ్యింది. 

    బద్రికి , నాకు మా ఇద్దరికీ టిల్లు తెగ నచ్చేశాడు. ఎంత నచ్చాడంటే తోచీతోచని ఓ సాయంకాలం పూట రెండోసారి చూసేంతగా. 

*** *** ***
*** *** ***


    సినిమా మొదలైందగ్గర్నుంచీ ముగింపు దాకా - తెర నిండా చెమ్కీల తళతళలు, గుంగురు జుట్టుల గింగిరాలు, జోరుగ సాగే తెలంగాణ జిలుగులు - నాకు భలే నచ్చేశాయి. 

    సినిమా అంతటా సిద్ధు జొన్నలగడ్డ మాత్రమే వెలిగినా - ఆ వెలుగులకి మిగిలిన నటులందరూ కూడా తమ వంతు తళుకుల్ని కూడా కలిపి ఇంకొంచెం మెరిపించారు - కానీ వెలవెలపోలేదు. 

    కాఫీలో నెయ్యి కలుపుకుని తాగే క్రేజీ డీజే టిల్లు, 
    ఆ క్రేజీనెస్సుని చూసి కళ్ళు తేలేసే  టిల్లు వాళ్ళ నాన్న, 
    ఊళ్ళో కొన్న టీషర్టుకి ప్ర్రాడా లేబుల్ని ఇస్త్రీపెట్టెతో అతికించుకునే డీజే టిల్లు, 
    ఆ క్రేజీ పనుల్ని ఈజీగా తీసుకుని మురిసిపోయే టిల్లు వాళ్ళ అమ్మ,
    గల్లుగల్లుమనే డీజే టిల్లునే తల్లడిల్లేలా చేసిన నల్లచీర రాధిక,
    ప్రిన్స్ మహేష్బాబుకి చుట్టమేమో అనిపించే ప్రిన్స్ సిసిల్,  
    చలాకీగా ఉంటూ చులాగ్గా నవ్వించేసే బ్రహ్మాజీ, 
    చిట్టచివర్లో హాస్పిటల్లో T-man టిల్లు పట్టుకు తిరిగే ఎఱ్ఱ టెడ్డీబేరు, 
    టిల్లుకి ఆ బేరునిచ్చిన మెంటల్ డాక్టరు... 
    అందరూ బాగా చేశారు - 
    నవ్వించారు. 

*** *** ***
*** *** ***

    సినిమా చివర్లో - తనని మోసం చేసి డబ్బులున్న సూట్కేసుని పట్టుకుని షికారెళ్లిపోయిన రాధికని క్షమించేసి బెయిలిప్పించి - జైల్లోంచి బయటికి తీసుకొస్తాడు టిల్లు. 

    అంతే! అంతకు మించి ఇంకేం చెయ్యడు. 

    సినిమా మొదట్నుంచీ నాతో హీరోయిన్నుగా చేసింది కదా అని ఓ ఫీలైపోయి - చివరాఖరికయినా సరే దొరికేసిందని - ఓ చిందేసి, రాధిక మెళ్ళో దండేసి పెళ్లి చేసేసుకోడు. 

    ఎందుకంటే టిల్లు ఓ మామూలు గల్లీబాయ్-టిల్లు అంతే. సిన్మా హీరో కాదు. 

    అందుకే టిల్లు అంత నచ్చాడు. 

      

*** *** ***
*** *** *** 

    నాకు ఈ సినిమాలో బోల్డు నచ్చిన ఒక సీను. 

    పచ్చరంగు చెమ్కీ కుర్తా వేసుకుని పుట్టినరోజు పార్టీ చేసుకుంటున్న టిల్లు తన గర్ల్‌ఫ్రెండ్ రాధిక పార్టీకి రానందని బోల్డు దిగులు పడిపోతాడు. 

    ఎలాగైనా పార్టీకి రావల్సిందే, నువ్వు రాకపోతే పార్టీ చేసుకోనని అలుగుతాడు. 

    రాధిక వస్తానంటే ఆ అమ్మాయిని తీసుకురావడానికి బుగ్గల నిండా ఆపుకోలేని నవ్వునీ, నేల మీద కాలు ఆనకుండా పడే చిందులనీ తోడు తీసుకుని బయల్దేరుతాడు. 

    ఆ టిల్లు చిందుల వెనకాల వినిపించే వాద్యసంగీతం హుషారుగా -  "టిల్లు... టిల్లు... టిల్లు... టిల్లు" అంటూ లీలగా వినిపించే కోరస్ తమాషాగా ఉంటాయి. 

    అప్పుడు చూడాలి టిల్లుని...

ఒళ్లంతా మువ్వలైనట్టు ఘల్లుఘల్లుమంటుంటాడు
గుంగురుల ముంగురులతో గింగిరాలు తిరుగుతుంటాడు
తళుకుబెళుకు మిణుకుచుక్కలా మెరిసిపోతుంటాడు
తొణికితొణికి తుళ్ళుతున్న నీటిజల్లులా మురిసిపోతుంటాడు



    ఆ చిందులన్నీ అయ్యాక అపార్ట్‌మెంటు దగ్గర సంతకం పెట్టమన్న వాచ్‌మన్‌తో "తుంచి దాచిపెట్టుకో - తర్వాతదే ఆటోగ్రాఫైతది" అన్న టిల్లు మాటకి నవ్వులు జల్లుజల్లే! 

    ఆ తర్వాత - హత్య జరిగిన రాధిక ఇంట్లో  తన వేలిముద్రలు పడ్డ చోటల్లా టిష్యూతో తుడుస్తూ "ఓషన్ పార్కులో తిరిగినట్టు తిరిగా..." అని తనని తనే తిట్టుకోవడం - భలేవాడు టిల్లు. 


*** *** ***
*** *** ***


    
    ఈ సినిమా మొత్తమ్మీద నాకు ఎక్కువగా నచ్చినవి ఏంటంటే రెండు. 

    ఒకటి - ఎవరు మాట్లాడినా - ఎవరి మాటకైనా తడుముకోకుండా మాటకి మాట సమాధానం ఇచ్చేస్తూ - అప్పటికప్పుడు impulsve గా, spontaneous గా తెలంగాణ తెలుగులో జోరుగా హుషారుగా టిల్లు మాట్లాడిన తీరు. 

    రెండోది - టిల్లుగా నటించేటప్పుడు సిద్ధు జొన్నలగడ్డ body language, చాలా ప్రత్యేకంగా, సహజంగా ఉన్న అతని డాన్సు స్టెప్పులు. 

*** *** ***
*** *** ***


    అన్నట్టు  - ఈ సినిమాలో "టిల్లు అన్న డీజే పెడితే" పాటలో టిల్లుని వర్ణించే ఈ లైన్లు భలే వున్నాయి. 

    అరె చెమ్కీ షర్టు - ఆహా 
    వీని గుంగురు జుట్టు ఓహో 
    ... .... .... ... 
    ఈ గల్లీ సుట్టు ... ఆహా 
    అత్తరే జల్లినట్టు ... ఓహో 
    మస్తుగా నవ్విండంటే
    పోరిల దిల్లు ఫట్టు ... అదీ  


*** *** ***
*** *** ***

    ఈ సినిమాలో కనిపించే టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ ఎంత నచ్చాడో, ఆ టిల్లుతో కథని నడిపించిన దర్శకుడు విమల్ కృష్ణ కూడా అంతగా మెప్పించాడు. 

    విమల్ కృష్ణ, సిద్ధు జొన్నలగడ్డ కలిసి చేసిన టీం వర్క్ "డీ జే టిల్లు"కి బాగా కుదిరింది. 

    వీళ్ళిద్దరూ OTW లా  అంటే One-Time-Wonder లా ఇక్కడే ఆగిపోకుండా ఇంకా మంచి క్రియేటివ్ ఐడియాలతో బోల్డన్ని సినిమాలు తీస్తే బావుండును.  

*** *** ***
*** *** ***

    
    చివరాఖరిగా నాదో చిన్న మాట - ఓ సినీ మాట... 

    "డీ జే టిల్లు" చూసేటప్పుడు "మాయాబజారు" కళ్ళో, "మిస్సమ్మ" కళ్ళో, "అందాలరాముడు" కళ్ళో "శంకరాభరణం" కళ్ళో, "అడవిరాముడు" కళ్ళో, "జగదేకవీరుడు -అతిలోకసుందరి " కళ్ళో, "గీతాంజలి " కళ్ళో - ఇంకా చెప్పాలంటే  - ఇంతకు ముందు చూసిన ఏ ఒక్క సినిమా చూసిన కళ్ళ తోనో కాకుండా - "డీ జే టిల్లు" చూసే కళ్ళతో మాత్రమే చూశాను నేను. 

    ముందే చెప్పినట్టు...

    ఎప్పటికే సినిమా చూస్తుంటే 
    అప్పటికదే ప్రస్తుతం...
    ఇంకేదైనా మరి అప్రస్తుతం...

~సినీ-మా-లక్ష్మి




10, ఏప్రిల్ 2022, ఆదివారం

ౘదలచూలి పాట - 2 - పటికబెల్లపు పలుకుల రాముడి పాట, శ్రీరామనవమి పానకాల గురుతులతోనట...



పండగంటే ఏంటంటే... 
మదిని చిలుకు తలపొకటి  
పెదవి నొలుకు నవ్వొకటి 
కనుల వెలుగు దివ్వొకటి 

పండగంటే ఏంటంటే... 
తుంచగల వగపొకటి 
పెంచుకున్న ఒరిమొకటి
పంచుకున్న బువ్వొకటి 

పండగంటే ఏంటంటే... 
పనిలేని పూటొకటి 
పాతరోజుల గుర్తొకటి 
పటికబెల్లపు పలుకుల పాటొకటి 

*******
*******



    
    చిన్నప్పట్నుంచి ఏ పండగకాపండగే పండగ-పండగ్గా జరిగి ప్రతి పండగ గురుతూ - గుర్తొచ్చిన ప్రతీసారీ దేనికదే పండగ్గా అనిపించినా - శ్రీరామనవమి మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తుగా గుర్తుంది. 

    అలా గుర్తుండడానికి కారణం మాత్రం - గణపవరంలో ఉన్న రోజుల్లో చూసిన శ్రీరామనవమి ఉత్సవాలు. 

*******
*******

    మేము అద్దెకున్న కరణం గారు - అంటే అనుమంచి లక్ష్మీనారాయణగారి ఇల్లు ఉన్న వీధిలో ఈ చివర రామాలయం, ఆ చివర సంతానవేణుగోపాలస్వామి ఆలయం ఉండేవి. అదే గణపవరానికి మెయిన్ రోడ్డు. ఈ రెండుగుళ్ళూ ఉన్న రోడ్డులో సరిగ్గా మధ్యలో శ్రీనివాసరావు కాఫీ హోటలు, ఆ పక్కనే చిలకలూరిపేట వెళ్దామనుకునేవారి కోసం గూడురిక్షాలు ఉండే రిక్షా స్టాండు ఉండేది.

    శ్రీరామనవమి వచ్చే పదిరోజుల ముందు - అంటే ఉగాది ముందు నుంచే రోడ్డు మీద దుమ్ము లేవకుండా నీళ్ళు జల్లి, రోడ్డుకి అటూఇటూ రాటలు పాతి, తాటాకు పందిళ్ళు వేసేవారు. ఒక పందిరి అటు వేణుగోపాలస్వామి గుడి నుంచి మొదలుపెట్టి రిక్షాస్టాండుకి అవతల ఆగేది. ఇంకో పందిరి రామాలయం దగ్గర మొదలై రిక్షాస్టాండుకి ఇవతల ఆగేది.

    ఇక ఆ పందిళ్ల ముస్తాబు ఎలా ఉండేదంటే ...రకరకాల రంగు కాయితాలతో తోరణాలు, అక్కడక్కడా చిన్నవీ పెద్దవీ రంగుకాయితాల గుమ్మటాలూ, మెరిసే ప్లాస్టిక్ పూల తోరణాలూ, రాత్రి కాగానే మిలమిలలాడే మిణుకుమిణుకు బల్బుల రంగురంగుల ఎలెక్ట్రిక్ దీపతోరణాలూ - మబ్బుల్లో ఉండే దేవేంద్ర లోకమేదో కిందకి దిగి గణపవరం ఊళ్లో వెలిసినట్లు ఉండేది.

    ఇప్పటికీ ఎక్కడైనా ఒకటికి రెండు దీపాలు ఎక్కువగా వెలిగించే ఇల్లో, షాపో చూసినప్పుడల్లా - శ్రీరామనవమి పందిరిలా ఉంది - అనిపిస్తుంది. 

    ఆ రంగు కాయితాలు, రంగురంగుల దీపాలకి తోడు - రోజంతా మోగిపోయే పాటల హడావిడి. ప్రతి శ్రీరామనవమికి పొద్దున్నే భక్తిపాటలతో మొదలుపెట్టి మధ్యాహ్నం కాగానే ఏ అడవిరాముడి లోవో, యమగోల లోవో, జేబుదొంగ లోవో - బోల్డన్ని సినిమా పాటలు వేస్తూనే ఉండేవారు. 

    చెవులు హోరెత్తిపోతున్నా సరే - ఆ పాటలు వింటూ హడావిడిగా పరిగెడుతూ ఆడుకోవడం మరపురాని పండగ.



*******
*******

    నాకేమో రెండుజళ్ళకి జడగంటలు వేసుకోవడం ఇష్టం. 

    మిగిలిన రోజుల్లో కుదిరేది కాదు కానీ ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా ఆ పది రోజులూ - రెండు జడలకి జడగంటలు వేసి - రెండు జడల్లోనూ మల్లెపూలు పెట్టేది అమ్మ. నా రెండు జడలూ వెనకాల అలా బరువుగా బరువుగా ఊగుతుంటే - ఆడుకుంటూ పరిగెత్తేటప్పుడు తలని అటూఇటూ తిప్పుతూ - ఆ జడగంటల చప్పుడు వినడం కూడా - అదొక పండగ నాకు. 

*******
*******

    అలా జడగంటలేసుకున్న నేనూ; 
    నాతోపాటు హైమవతమ్మ గారి శ్రీదేవి, రమణ, కృష్ణ; 
    సువర్చల గారి రాధాయి;
    తులశమ్మ గారి రాధిక; 
    బడి పక్కింట్లో ఉండే రాజ్యలక్ష్మిగారి అబ్బాయి చివుకుల వెంకట రమణ;
    శివాలయం కెళ్ళే దార్లో ఉండే రాజేశ్వరమ్మగారి మనవరాలు చైనం రమ; 
    కంసాలి వారబ్బాయి  శ్రీను; 
    ధనమ్మగారి అమ్మాయి; 
    పాతబాపారావు కూతురు పద్మ...

    మేమందరమూ బడి అయిపోతూనే ఇంటికి వచ్చి అన్నం తినేసి పరిగే...ట్టుకుంటూ వెళ్లిపోయి పందిట్లో నాలుగుస్తంభాలాట, ఎంచగ్గా కాళ్ళు కాలకుండా నేలా-బండా ఆడుకునేవాళ్లం - అలా ఆ ఆటా ఓ పండగే! 

   అప్పుడప్పుడే ఎండలు ఎఱ్ఱగా మారుతుండేవేమో ఆ పందిళ్ళు చలవఱాతి ఇళ్ళలా అనిపించేవి. దానికి తోడు ఒంటిపూటబళ్ళ హుషారు. ఒక పూట మాత్రమే బడి ఉండి మధ్యాహ్నమంతా ఆడుకోగలగడం - అద్దీ...  అసలు పండగ! 

*******
*******

        ఈ ఆటల సరదాయే కాకుండా సపోటాపళ్ల విందొకటి ఉండేదండోయ్! ఇంటింటికీ వచ్చి అమ్మే సపోటా పళ్లవాళ్లు రోడ్డు మీద కనిపించగానే 'మా ఇంటికి రా... మా అమ్మ సపోటాపళ్లు కొంటుందీ అని పళ్లమ్మే అబ్బాయిని సాదరంగా ఇంటిదాకా తీసుకెళ్లి దగ్గరుండి మరీ అమ్మ చేత సపోటాలు కొనిపించడం - అవి ఒలుచుకుని తినడం - అదో తిండి పండగ. 

    అప్పటిదాకా ఏ పేరంటాల్లోనో వచ్చినవో, పండగ రోజుల్లో కొన్నవో తమలపాకులు గులాబీ రంగు సెంటెడ్ సున్నం తోనూ, త్రివేణి సుగంధ వక్కపలుకు తోనూ - అమ్మ, నాన్న, అన్నపూర్ణమ్మగారూ, కరణంగారూ -  ఇలా ప్రతీ ఇంట్లోనూ అమ్మలూ, నాన్నలూ మాత్రం తింటూ - వాళ్ల ఎఱ్ఱబారిన నాలుకలు చూస్తున్న పిల్లలం మమ్మల్ని 'చదువుకునే పిల్లలు తాంబూలం వేసుకోకూడదూ అని అస్సలు ఆ తమలపాకుల జోలికే రానిచ్చేవాళ్లు కాదు. 

    కానీ - ఈ శ్రీరామనవమి రోజుల్లో మాత్రం - అప్పటివరకు ఎక్కడుండేవాడో, అప్పుడు మాత్రం ఎక్కణ్ణించి వచ్చేవాడో - తెలీదు కానీ - ౘందమామలోని మంత్రదండపు సృష్టిలా కిళ్ళీలబ్బాయి ఒకడు శ్రీరామనవమి పందిట్లో ఓ రాట దగ్గర అవతరించి మా కిళ్ళీ-ప్రశ్నలని అవధరించేవాడు. 'అర్థరూపాయి తెచ్చుకో - కిళ్ళీ తినే అదృష్టం కొనుక్కో" అనేవాడు.

    చకచకా ఓ మూడాకుల్ని తొడిమలు తుంచి - మంచిమంచి వాసనలొచ్చే లేహ్యాలు పూసి, చూర్ణాలు రాల్చి, వక్కపలుకులు చేర్చి - అమృతం పొట్లం కట్టాడేమో అనిపించేలాంటి మిఠాయికిళ్ళీలు చుట్టి ఒక అల్యూమినియం కంచంలో గుండ్రంగా పేర్చేవాడు. 

    ఆకుపచ్చగా మెరిసిపోయే ఆ మిఠాయికిళ్ళీలని చూడగానే ఇక ఆగలేక అమ్మ దగ్గరికి వెళ్ళి 'ఈ ఒక్కసారికే..." అని బ్రతిమాలి కొనుక్కు తిన్న అబ్బురపు మిఠాయికిళ్ళీ ఒక పే...ద్ద తీపి-పండగ


*******
*******
 
    ఇహ అసలు - ఆ తొమ్మిది రోజులూ రోజుకో రకమైన పండగ. 

    చెక్కభజనలూ, కోలాటాలు, నాజర్‌వారి బుఱ్ఱకథలూ, హరికథలూ, శివకుమారి బృందంవారి రికార్డింగ్ డాన్సులూ, తెరలు కట్టి సినిమాలూ, చింతామణి నాటకం, గుంటూరు నుంచి వచ్చే అనిల్ కుమార్ గారి సత్యసాయి భజనలూ - చూసే కళ్లకి పండగ. వినే చెవులకి పండగ. 

    అన్నట్టు... నాకు పల్నాటియుద్ధం, బొబ్బిలియుద్ధం కథలూ, బ్రహ్మయ్యగారి చరిత్రలో సిద్ధడి పరిచయం, బనగానపల్లి, కందిమల్లయపల్లి లాంటి ఊరుపేర్లు - ఇవన్నీ తెలిసింది నాజర్‌గారి బుఱ్ఱకథల వల్లే.  

*******
*******


    చిన్నప్పటి పండగ కబుర్లు అయ్యాయి. 

    ఇప్పుడు రాముడితో నా పరిచయం గురించి. 

    పుట్టిన తర్వాత మొట్టమొదటగా గుర్తు పట్టటం నేర్చుకున్న "అమ్మ" అన్న మాట, శబ్దం చేయటం మొదలుపెట్టాక అనడం మొదలుపెట్టిన 'అత్త" అన్న మాట తర్వాత - నాకు గుర్తుండి నేను విన్న మొదటి జేజి పేరు "రాముడు".  

    నాన్న జో కొడుతూ - 

    "రాం రాం రాం రాం రాం రాం...
    రాం రాం రాం రాం రాం రాం... 
    సీతారాం రాం రాం ...
    జానకి రాం రాం రాం" అంటూ పాడిన జోలపాటలోనూ రాముడే!

    నాన్నమ్మ పక్కలో పడుకుని విన్న 

    "రామా లాలీ... 
    మేఘశ్యామా లాలీ....
    తామరస నయనా ...
    దశరథతనయా లాలీ" అన్న లాలిపాటలో  పరిచయమైన మొదటి దేవుడూ రాముడే!

    ఎదుగుతూ వుండగా - శివకోడు సెలవులకి వెళ్ళినప్పుడు - మా ప్రసాద్ మామయ్య మీద అలిగినప్పుడు - ఆయనకి నాన్నమ్మ, నాకు తాతమ్మ అయిన - శివకోడు మామ్మ పప్పు సూరమ్మగారు పాడిన - 

    "లలాటలిఖితం ఇటుండగా 
    శ్రీరామ! నిన్నన పనేలరా?! - అన్న పాటలోనూ రాముడే! 

    ఆ తర్వాత - పాట అంటూ ఇదీ అని తెలిసిన వయసులో - 

    "చీకటి వేళల నడిపించేది
    ఒంటరి ఘడియల వినిపించేది
    ఏది ఏది నీ చేయూత? ఏది ఏది నీ పిలుపు?
    రామా ఓ రామ రావా కనరావా?" - అన్న దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి గారి కవితలోనూ రాముడే!

    "ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు
    ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు
    తలచిన వారికి తారకనాముడు
    పిలిచిన పలికే చెలికాడు సైదోడు" - అన్న వేటూరి సుందరామమూర్తుల వారి గీతి లోనూ రాముడే! 
 

    ఆ తర్వాత పదోతరగతి వేసవి సెలవుల్లో  - ఆరుద్ర రాసిన - "రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా" విని అమాంతం ఆ పాట ప్రేమలో పడిపోయి - ఉన్నపళంగా నేర్చేసుకుని -  వైజాగ్‌లో లలితత్తయ్య ఇంట్లో మేడ మీద పాడుకుంటున్నవేళ - సముద్రపుగాలికి - అలనల్లన తేలొచ్చిన- కాఱుమొయిలు అంచున మెరుపై తోచినదీ రాముడే! 

    ఇలా - ఇంకా ఇంకా - చెప్పాలంటే రాముణ్ణి పదాల్లో ఎంతో అందంగా పట్టిన పాటలెన్నో నాకిష్టం. ఆ రామకబుర్లు ఇంకెప్పుడో కుదిరినప్పుడు. 

    ఇప్పటికి మాత్రం - అసలు శ్రీరామనవమి అన్న పండగ నాకెందుకు అంత ఇష్టమో చెప్పేస్తా... కడుపు చలవకి వడపప్పు నానబోసుకుని, గొంతు సొలుపుకి మిరియాలు, యాలకులు వేసిన బెల్లప్పానకం చేసేసుకుని - శ్రీరామార్పణం - అనుకోగలిగే మహా సులువైన పండగ శ్రీరామనవమి.  
  
*******
*******


    అసలు - ముందే చెప్పానుగా ... నా మటుకు నాకు - పండగంటే... పనిలేని పూటా - పాతరోజుల గురుతూ -  పటికబెల్లపు పలుకుల పాటా అని. 

    ఈ రోజు ఆదివారం - పని అంటే ఆఫీస్ లేని పూట. 

    పాతరోజుల గురుతులన్నీ పైన చెప్పేసుకున్నా. 

    ఇహ కావలసిందల్లా - పటికబెల్లపు పలుకుల పాటొహటి!  

దాన్ని కూడా పట్టుకున్నా - 
పట్టుకున్న పాటని 
పదే పదే - పదం పదం - కలిపి పలికి
అదే అదే - పదం పదం - పలికి కలిపి
పదే పదే అనుకున్నా
అదే అదే పాడుకున్నా
నే పాడుకున్న పాటని
అందరికీ పంచుదామనుకుని 
ఇక్కడ రాసి పెట్టుకున్నా 
పానకంలా పంచిపెట్టుకున్నా 

*******
*******

    ఈ పాట పాత ఆకాశవాణి పాటల గురించి వెతుకుతుంటే - వెలలేని పెన్నిధిలా దొరికింది. 

    మనోరంజకంగా పాటకి సంగీతం కూర్చినవారు, పాట పాడిన వారిలో ఒకరు - చిత్తరంజన్ గారట. పాడినవారిలో ఇంకొకరు వందనగారట. ఇద్దరూ కూడా వందనీయులు. 

    యూట్యూబ్‌లో ఉన్న అన్ని వీడియోల కన్నా నాకు ఈ వీడియో నచ్చడానికి ఒక కారణం ఆ నీలినీలి కాంతి వలయాలు చూసి - చిన్నప్పటి శ్రీరామనవమి గుర్తుకు రావడం. 

    ఇక పాటలో వాద్యసంగీతం ఎంత బావుందీ అంటే పాటతో పాటుగా 

టింగ్ టింగ్ టింగ్ టింగ్ - టింగ్‌టింగ్‌టింగ్‌టింగ్‌టింగ్
టింగ్ టింగ్ టింగ్ టింగ్ - టింగ్‌టింగ్‌టింగ్‌టింగ్‌టింగ్ 
అని పాడుకునేంతగా... 

*******
*******

    ఇక చివరాఖరిగా - మృదుమధురమైన పదాలతో, మనసుకి హాయి నిచ్చే సంగీతంతో ఉత్తేజంగా సాగిన ఈ పాటలో పాటలో నాకు నచ్చిన మాటలు....

    దానవవంశవిరామా... - కటువుగా ఉండే రాక్షసాంతక అనే మాటకి మృదువైన రూపం ఈ పదం. 
    భండనపండిత... రామా! - ఈ భండనపండిత అనే పిలుపు కొత్తగా ఉంది - అంటే యుద్ధశాస్త్రంలో పండితుడనేమో! 
    భూమిజసుహృదయసీమా! - సీతామనోవిహారిని ఇలా పిలవడం ఎంత బావుందో! 
    ధైవలలామా... - దైవశ్రేష్ఠుడట రాముడు! 
    తరణికులేశ్వర - అంటే సూర్యవంశజుడట! 
    కరివరపాలక... రామా! - గజేంద్రరక్షక విష్ణువూ రాముడేనట!

ఆ పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=6PjoSVyoUhc






జై జై శ్రీరామా... పావనరఘురామా!
జై జై శ్రీరామా... పావనరఘురామా
పతితజనావన - పాపవిమోచన - హే సీతారామా! 
పతితజనావన - పాపవిమోచన - హే సీతారామా! 


దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 
దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 

వారిజలోచన వైకుంఠధామా - పాపభంజన పట్టాభిరామా 
వారిజలోచన వైకుంఠధామా - పాపభంజన పట్టాభిరామా 
భండనపండిత... రామా! ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 
దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 

మేరుధీరఘనమేఘశ్యామా - ఘోరధైత్యసంహారక రామా 
మేరుధీరఘనమేఘశ్యామా - ఘోరధైత్యసంహారక రామా 
కారుణ్యాకర... రామా! ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 
దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 

కామితశ్రితజన కౌసల్యరామా - కాంచనచేల కారుణ్యధామా 
కామితశ్రితజన కౌసల్యరామా - కాంచనచేల కారుణ్యధామా 
భూమిజసుహృదయసీమా! ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 
దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 

నరసదాసనుతఅరిజనభీమా - తరణికులేశ్వర ధైవలలామా
నరసదాసనుతఅరిజనభీమా - తరణికులేశ్వర ధైవలలామా
కరివరపాలక... రామా! ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 
దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 

దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 
దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 

జై శ్రీరామా! జై జై శ్రీరామా!!
జై శ్రీరామా! జై జై శ్రీరామా!!
జై శ్రీరామా! జై జై శ్రీరామా!!
జై శ్రీరామా! జై జై శ్రీరామా!!

*******
*******

3, ఏప్రిల్ 2022, ఆదివారం

పాకోత్సాహము...శాకహృదయము ననుసరించి వండగ...- 3 - హాం...ఫఠ్! ఆమ్‌చూర్‌-పులిహోర!

    మున్నమ్మా! ఎలా వున్నావ్? ఏం చేస్తున్నావ్? ఎన్నిరోజులయ్యిందో మన శాకహృదయపు కబుర్లు చెప్పుకుని! 

    అప్పుడెప్పుడో పచ్చిమిరపకాయలు తరగడం దగ్గరే ఆగిపోయాను.  

    అదేంటో అంతసేపు పచ్చిమిరపకాయల గురించి చెప్పి - దాంతో పాటే అసలు పచ్చిమిరపకాయలే వెయ్యని సాంబారు రెసిపీ కూడా చెప్పాను కదా! 

పాకోత్సాహము...శాకహృదయము ననుసరించి వండగ...- 2 - సాంబారు సంబరం, ములగాకు చూర్ణం


    మళ్ళీ ఇన్ని రోజులకి కుదిరింది ఆవురావురనిపించే ఆమ్-కబుర్లు చెప్పుకోవడానికి. 


    అన్నట్టు  - నిన్ననే ఉగాది పండగతో కొత్త సంవత్సరం మొదలైంది. ఈ సంవత్సరం పేరు శుభకృత్. అంటే చాలా మంచి చేసే సంవత్సరమని అర్థం. 


    ఈసారి మంచి వేపపూత దొరికింది. దాంతో మన ఇంటి ఉగాది పచ్చడి ఎంత బాగా కుదిరిందో! నువ్వే చూడు. 



*******

*******    


    అసలింతకీ - నీకు రుచులు ఎన్నో, వాటి పేర్లు ఏమిటో తెలుసా? 

    నాకు తెలిసి రుచులు ఆరు. 

    అవి చేదు, వగరు, తీపి, కారం, పులుపు, కమ్మన. 

    ఉండుండు... నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసు. మరి ఉప్పో? అనే కదా? ఉప్పు గురించి చెప్తా ... చెప్తా!

    మనం రోజూ తినే భోజనంలో చెట్లు, మొక్కల నుంచి వచ్చే ఆకులు, కాయలు, పళ్ళు, గింజలు - వీటన్నిటికీ వుండేవి ఆరంటే ఆరే రుచులు. 

    కాకరకాయ చేదు, నేరేడుపండు వగరు, మామిడిపండు తీపి, పచ్చిమిరపకాయ కారం, చింతకాయ పులుపు,  ఆనపకాయ కమ్మన. 

    తెలుగులో నోటికి రుచిగా అనిపించిన ప్రతి తినుబండారాన్ని, ఆదరువునీ "కమ్మగా" వుంది అంటారు. కానీ నాకు కమ్మన అనేది ఒక రుచి అనిపిస్తుంది. 

    అంటే నోట్లో పెట్టుకోగానే నాలుకకి తీపి, చేదు, కారం, వగరు, పులుపు - వీటిల్లో ఏ రుచీ అనిపించని వాటన్నిటి రుచి పేరు ఏంటీ అంటే మిగిలింది ఇంకేమిటి ? కమ్మనైన కమ్మదనం తప్ప?!

    కమ్మటి రుచికి ఒక మంచి ఉదాహరణ చెప్పనా? 

    అప్పుడెప్పుడో తమ్ముడు నా చేత సంతకం చేయించి, వండనని ఒట్టువేయించుకుని మరీ : అదే కాయ - అదే పప్పు - అదే వద్దు! అన్నాడు చూడు "పెసరపప్పు -ఆనపకాయ" ముద్దకూర... ఆ కూరకి చేదు, వగరు, తీపి, కారం, పులుపు - ఈ రుచుల్లో ఏ రుచీ ఉండదు. అలా అని ఉప్పగానూ ఉండదు - కావాలని ఉప్పెక్కువ వేసేసుకుంటే తప్ప! 

    అన్నట్లు ఇంకో విషయమేంటంటే - చెట్లకి చిగిర్చే, పూసే, కాసే, పండే - ఆకులూ, పూలూ, కాయలూ, పళ్ళూ - వీటిలో ఈ ఒక్కదానికీ వుండని రుచి ఏంటో తెలుసా? ఉప్పు. 

    మనం తినే కాయలు, పళ్ళూ కావాలంటే చెట్లకి నీళ్ళు పొయ్యాలి.  

    ఆ కాయలు వేసి వండిన వంటలకి  రుచిని పెంచే ఉప్పు మాత్రం సముద్రపు నీళ్ళు ఆవిరైతే వస్తుంది. 

    ఉప్పు రుచిని పెంచేదే (taste enhancer) తప్ప అదొక రుచి కాదు - నాకైతే అలాగే అనిపిస్తుంది, అనాలనిపిస్తుంది. 

    అందుకే అంటా - రుచులు ఆరని... 
    చేదు, వగరు, తీపి, కారం, పులుపు, కమ్మనని... 
     తగినంత ఉప్పు చేర్చిన 
ఆరు రుచులు 
నాలుక కోరినట్టు 
పెరుగునని
తరుగునని 
సరిసమానమగునని 

    అందుకే నేను చేసే ఉగాది పచ్చడిలో తతిమ్మా ఆరు రుచులూ ఉంటాయి ఉప్పు తప్ప - చేదుకి వేపపువ్వు, వగరుకి ఆకుపచ్చ తొక్కతో కూడిన మామిడిపిందె, పులుపుకి కొత్త చింతపండు, తీపికి కుదిరితే చెఱకు ముక్క లేదా కొత్తబెల్లం, కారానికి పచ్చిమిరపకాయ, కమ్మదనానికి కొబ్బరిముక్క. 

*******
*******


    అది సరే కానీ ఉప్పు-కారం తర్వాత నాలుకకి తగిలీ తగలగానే జివ్వుమనిపించే రుచి పేరు ఏంటో తెలుసా? అది తెలుగులో palindrome కూడా. 

    అదేంటో చెప్పుకో! నీకు తట్టిందా - అదేంటో? 

    నే చెప్పేయనా? 

    పు... లు... పు

చింతచిగురు పులుపు, చింతకాయ పులుపు
పండిందని - పులుపు పోతుందని - చింత వలదు 
చింతపండు కూడా పులుపే పులుపు 

గోగాగు పులుపు, గోగుపువ్వు పులుపు 
పులుసు వండినా - పచ్చడి నూరినా - పులుపు పోదు 
గోంగూర వండినా, వాడినా - వీడి పోదు పులుపు 

నిమ్మకాయ పులుపు, నారింజ పులుపు
 వాటికి అప్ప లాంటి దబ్బకాయ కూడ పులుపు 
చెక్క కోసి పిండి చూడు - జిల్ జిల్మను పులుపు  

అన్నిటి కన్నా మిన్నయైన పులుపు 
ఆంధ్రుల ఆవకాయలో అమృతమైన పులుపు 
పులుపులలో మహా పులుపు - మామిడికాయ పులుపు 

 

*******
*******    


    అసలివాళ పులుపు గురించి ఎందుకు చెబ్దామనుకున్నానంటే దానికి కారణం - ఆమ్‌చూర్.  

    ఆమ్‌చూర్ అంటే ఆమ్ర-చూర్ణం అంటే మామిడికాయ పొడి. 

    ఈ పాండెమిక్ రోజులు మొదలయ్యాక మన ఇంట్లో జరిగిన ఒక చెప్పుకోదగ్గ మార్పు ఏంటంటే - చింతపండు పూర్తిగా మానేసి దాని బదులు ఆమ్‌చూర్ వాడడం. 

    మన కోనసీమ చారులో, కర్ణాటక రసంలో, మద్రాసు సాంబారులో, రోజూ చేసే రోటి పచ్చళ్ళలో, ఒక్కసారిగా పెట్టుకునే నిలవపచ్చళ్ళలో, చివరికి చింతపండు వేయాల్సిన పులిహోరలో కూడా ఆమ్‌చూరే వాడుతున్నాను. 

    ఆమ్‌చూర్‌తో పులిహోరా...? అని ఆశ్చర్యపోకు మరీ! 

    అసలు అదెలా మొదలైందంటే ... 

        ఓ రోజు నాన్నగారు తన ఫ్రెండ్ గిరి అంకుల్ భోజనానికి వస్తున్నారూ అని చెప్పగానే కొంచెం స్పెషల్‌గా వాంగీబాత్ చేద్దామా అని చూస్తే ఇంట్లో ఎప్పుడూ ఉండే కాప్సికమ్ కూడా లేకపోయింది. పులిహోర చేద్దామా అంటే చింతపండు ఉడికించేంత సమయం లేదు. 

    ఇహ అప్పుడు అనుకున్నా ... ఆమ్‌చూర్‌తో పులిహోర చేద్దామని. 

    వెంటనే గబగబా అన్నం వండేసి మన పెద్ద బేసిన్‌లో వేసి ఆరబెట్టా. అన్నం కొంచెం గోరువెచ్చగా కాగానే అందులోకి కొంచెం ఉప్పు, పసుపు, నువ్వుల నూనె, ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆమ్‌చూర్ వేసి కలిపాను.   

    అందులో మామూలు పులిహోరలో వేసినట్టే - నువ్వులనూనెలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నాలుగు మెంతిగింజలూ, కొంచెం జీలకఱ్ఱా, ఆవాలూ, ముద్ద ఇంగువా -  పోపు వేసి - కరివేపాకు కూడా వేసేశాను. దాంతో పాటే ఇంకొంచెం జీడిపప్పూ, ఇంకొన్ని వేరుశనగగుళ్ళూనూ...

    హాం...ఫఠ్!   ఆమ్‌చూర్‌-పులిహోర తయార్! 

    నాన్నగారూ, గిరి అంకుల్‌కే కాకుండా తమ్ముడికి కూడా బాగా నచ్చింది. నేను చేసిన అప్పటికప్పటి హాంఫఠ్-పులిహోర. 

    నువ్వు కూడా ఎప్పుడైనా ఒకసారి చేసుకుని చూడు - పుల్లపుల్లగా బావుంటుంది.   

*******
*******   

     అన్నట్టు నాన్నగాడూ...మొన్నొకరోజు తమ్ముడూ నేనూ మాట్లాడుకున్న సంగతోటి చెప్పాలి. 

    శుక్రవారం నాన్నగారూ, నేనూ, తమ్ముడూ ఎక్కడికో వెళ్తుంటే ఉన్నట్టుండి వాడు "I forgot అనడానికి తెలుగులో ఏంటీ?" అనడిగాడు.

"రచిపోయాను అంటామమ్మా" అన్నాన్నేను. 

    దానికి వాడు "అంటే forget and die ? అందులో forget కి root-word ఏంటీ" అన్నాడు.

    "Forgot అంటే 'మరచానూ' అంటే చాలు. కాకపోతే కొంచెం emphasize చేయడానికన్నట్టు అలా 'మరచిపోయానూ' అంటామూ అని చెప్తున్నాను. 

    ఇంతలో కార్ సైడ్-మిర్రర్‌లోంచి వాడి నవ్వు మొహం చూడగానే నాకు చటుక్కున ఇలా చెప్పాలనిపించింది. 

    "ఒరేయ్ బుజ్జిగాడూ! అలా అని ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు 'ఏమన్నా తిన్నావా?' అనడిగితే 'ఇప్పుడే తినిపోయానూ' అని చెప్పకు. అన్నిచోట్లా అలా వాడకూడదూ" అని గబగబా చెప్పాను. 

    లేకపోతే ఆ రౌడీ గాడి సంగత్తెలుసుగా - నే నేర్పిన తెలుగుని నా మీదే ప్రయోగిస్తాడు.  


*******
*******  

ఇంత చెప్పాక - ఇంతవరకొచ్చాక - పులుపు గురించి ఓ సిన్మతీ గిద్యం కూడా చెప్పేసుకుందాం. 

అటు చదవగా  - పులుపు
ఇటు పలుకగా  - పులుపు 
నాల్కకిటు పులు కలిగించు రుచి వేరు లేదట 
ఎటునెటు చదివినా పులుపు పులుపు సిన్మతీ !

*******
*******  

     

27, మార్చి 2022, ఆదివారం

అంబుధి పొదికిట అంబుధి పొద్దులు (కార్పస్ క్రిస్టి కబుర్లు)


    కిందటి వారం అనుకోకుండా ఓ నాలుగు రోజులు కలిసొచ్చి కడలి అంచున నడిచే వీలు కుదిరింది. 

    అలా కలిసొచ్చే కాలానికి సముద్రపొడ్డున నడిచొచ్చే పొద్దులు దొరకడానికి పూర్వపు అంకం ఏంటంటే... 

    మార్చ్ 18న బుజ్జిజింక స్కూల్ ఆర్కెస్ట్రాతో యూరప్ వెళ్ళాడు. మార్చ్ 20న బయల్దేరి బద్రి టెక్సస్‌లో ఉన్న కార్పస్ క్రిస్టి అనే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. 

    ఇక ఇంట్లో నేనొక్కదాన్నే ఉండడం ఎందుకని బద్రి తనతో పాటు నన్ను కూడా  కూడా  కార్పస్ క్రిస్టి  తీసుకెళ్లారు. 

    నాతో పాటే నా ఆఫీస్ లాప్‌టాపూ, సరంజామా కూడానూ. 

*******
*******

    అలా కిందటి ఆదివారం (3/20) బయల్దేరి వెళ్లినవాళ్లం మళ్లీ గురువారం (3/24) సాయంత్రానికి ఇంటికి తిరిగివచ్చాం. 

    కార్పస్ క్రిస్టిలో ఉన్న పుంజీడు రోజులూ - పగలు ఆఫీస్ పనితో ఎప్పట్లాగే ఎండ పొడ తగలకుండా గడిచిపోయాయి. 

    కానీ సాయంత్రాల్లో మాత్రం ఒకప్పటి సలిల్ చౌధరి మాటల్లో మురిపించిన "సాంఝ్ కీ దుల్హన్" సముద్రపు అంచుల్లో దృష్టమయ్యే అదృష్టం దక్కింది. 

    కాకపోతే వెంటనే ఫోటో తీయకపోవడం వల్ల కెంజాయ రంగులో ఆకాశంలో మెరిసిన ఆ సంజ-పెళ్లికూతురు నా కంటికి ఆనిన ఓ గురుతు గానే మిగిలిపోయింది. 

    ఆ గురుతుకి గుర్తుగా ఆ పాటలో నాకు నచ్చిన నాలుగు మాటలూ ఇక్కడ రాసుకుంటున్నా... 


("ఆనంద్" సినిమాలో సలిల్ చౌధరి రాసిన పాట)
కహీ దూర్ ... జబ్ దిన్ ధల్ జాయే... 
సాంఝ్ కీ దుల్హన్ బదన్ చురాయే... చుప్‌కే సే ఆయే... 
మేరే ఖయాలోం కే - ఆంగన్ మే - 
కోయీ సప్‌నోం  కే - దీప్ జలాయే... 


*******
*******

 
    ఆదివారం సాన్ ఆంటోనియో ఏర్‌పోర్ట్‌లో దిగి, రెంటల్ కార్ తీసుకుని  కార్పస్ క్రిస్టి  వెళ్తూ - దార్లో ఆగి భోజనం చేస్తున్నప్పుడే బద్రి చెప్పారు - కార్పస్ క్రిస్టి వెళ్తూనే ఒకవేళ కుదిరితే USS లెక్సింగ్‌టన్ మ్యూజియం చూద్దామని. 

    ఎందుకంటే - ఆదివారం తప్పితే మిగిలిన వర్కింగ్ డేస్‌లో మా ఇద్దరి ఆఫీసులు అయేటప్పటికి ఆలస్యం అయితే మేముండబోయే నాలుగు రోజుల్లో ఇక ఆ మ్యూజియం చూడడం పడదు - అందుకని!




USS (United States Ship) లెక్సింగ్‌టన్ 
(రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్లైట్ కేరియర్‌గా పనిచేసిన పెద్ద యుద్ధనౌక)

    అనుకున్నట్టుగానే - భోంచేసిన వెంటనే కారులో బయల్దేరి సరాసరి USS లెక్సింగ్‌టన్ మ్యూజియం చేరేటప్పటికి సరిగ్గా సాయంత్రం నాలుగయ్యింది. 

    అక్కడ మ్యూజియం తెరిచుండేది ఐదుగంటల వరకే అని రాసున్న బోర్డ్ చూసి గబగబా టికెట్లు కొనుక్కుని లోపలికి వెళ్లాము. 

    అప్పుడే మ్యూజియంలో ఉన్న థియేటర్‌లో "ఏర్‌క్రాఫ్ట్ కేరియర్ - గార్డియన్ ఆఫ్ ద సీ" అనే ఓ ఇరవై ఆరు నిముషాల సినిమా మొదలవుతోందని తెలిసింది. ఆ సినిమా చూసి బయటికి వచ్చేటప్పటికి మాకు ఇంకా అరగంట సమయం మిగిలింది. 

    ఆ ఉన్న అరగంట లోనే ఆ యుద్ధనౌకలో ప్రయాణించేటప్పుడు అమెరికన్ సైనికులు వాడిన బంక్ బెడ్లు, ఆ తర్వాత నౌక పైకి వెళ్లి అక్కడ పార్క్ చేసి ఉన్న యుద్ధవిమానాలు చూసి ఐదు గంటల కల్లా బయటికి వచ్చేశాం. 

    లెక్సింగ్‌టన్ మ్యూజియం ఉన్న బీచ్ పేరు నార్త్ బీచ్. చుట్టూ ఉన్న సముద్రం "కార్పస్ క్రిస్టి బే". 

    ఆ యుద్ధనౌక వైపు వెళ్తుంటే కుడి పక్కన ఒక గట్టులా కనిపించింది. సముద్రం నీళ్లలో దాదాపు ఒక ముప్పాతిక మైలు దూరం సేతువులా కట్టి ఉన్న ఆ గట్టు  - ఒక fishing pier - అంటే చేపలు పట్టుకునే గట్టు. 

    బద్రి, నేను - ఇద్దరు మాత్రం పక్కపక్కన నడవగలిగే - ఆ గట్టు మీద నడుచుకుంటూ సముద్రం లోపలివెళ్లి వెనక్కి తిరిగి వచ్చాము. 

    అంత చిన్నగట్టు మీదే - పిల్లలతో సహా కొన్ని కుటుంబాలు కేంపింగ్ కుర్చీలు వేసుకుని కూర్చుని చేపలు పట్టుకుంటున్నారు. 

    అక్కణ్ణించి ఇవతలికి వచ్చి కాసేపు ఆ సముద్ర తీరం వెంబటే కాసేపు నడిచి - అక్కడ "కేర్ కేర్" మంటూ అరుస్తూ తిరుగుతున్న సముద్రపు పక్షులని చూసుకుంటూ - చీకటి పడుతుండగా భోంచేసి మా హోటల్ గదికి వెళ్లిపోయాం. 


*******
*******


    ఇక కార్పస్ క్రిస్టిలో ఉన్న నాలుగు రోజుల్లో - నేను చూసింతలో ...  నాకు అనిపించిందేంటంటే 

కడలి అలలది  - అద్దరి... 
ఆ దరి 
కదిలే కార్లది - ఇద్దరి... 
ఈ దారి 

కడలి దరికి - కార్ల దారికి 
నడుమనున్న కార్పస్ క్రిస్టి 
అనిపించె నాకు 
కడు బీదఱి 

*******
*******

    సోమవారం ఎక్కడికీ వెళ్ళలేదు. 

    ఆఫీసు వేళ మీరేటప్పటికి ఆచ్చి-వేళ కాస్తా  ఆకలి వేళ అయిపోయింది. 

    తొందరగా ఆమ్ తినేసి "అమ్మయ్య" అయిందనిపించాం. 

*******
*******



    మంగళవారం, బుధవారం కూడా ఒకే ప్రదేశానికి వెళ్ళాం. అది "కోల్ పార్క్ పియర్ (Cole Park Pier)". 

    ఆదివారం రోజు నార్త్ బీచ్‌లో మొదటి సారి నడిచిన దాని కంటే కొంచెం షోగ్గా ఉంది గానీ ఇది కూడా ఒక చేపలు పట్టే గట్టే. 




    సముద్రం లోపలి నడవడానికి ఒక రాంపూ, ఆ రాంప్ చివర్న గుండ్రంగా కట్టిన రెయిలింగ్ గోడలు, ఆ గోడల వెంబడి సిమెంటు దిమ్మెల మీద బిగించి వేసిన చెక్క కుర్చీలు ఉన్నాయి. 

    వాటిల్లో కూర్చుని బోల్డంత మంది బోల్డుబోల్డన్ని చేపలు పట్టుకుంటున్నారు. 

    మేమక్కడ ఉన్నప్పుడే ఒకతను ఎంత పెద్ద చేపను పట్టాడో! అంత దగ్గర్నుంచి అప్పుడే పట్టిన అంత పెద్దచేపను చూడడం నాకు అదే మొదటిసారి.

*******
*******

    ఈ కోల్ పార్క్ చేపలగట్టు నుంచి వెనక్కి తిరిగి వస్తుంటే రాంపుకి రెండు పక్కలా  ఉన్న రెయిలింగ్ మీదుగా కనిపిస్తున్న సముద్రపుటలలు నాతో పాటు నడిచొస్తున్నట్టనిపించాయి. 

    చిన్నప్పట్నుంచీ - ఎప్పుడు సముద్రాన్ని చూసినా అలలు ఎలా కనిపిస్తాయీ ?

    అక్కడెక్కడో - మింటిని తాకుదామని పైకి ఎగిసి - ఒక్కసారిగా విరిగి పడి - అందని మింటి కన్నా అందే మంటి మిన్న అనుకున్నట్టు - "పట్టుకో - పట్టుకో" అంటూ పరిగెత్తుకొస్తున్నట్టుండే అలలే కనిపిస్తాయి కదా! 

    కానీ - ఆ కోల్ పార్క్ చేపలగట్టు నుంచి ఒడ్డుకి నడిచొస్తుంటే - అప్పుడు మాత్రం - అప్పటి దాకా నేనెప్పుడూ చూడని తమాషా. 

    ఉప్పొంగుతున్న ఉప్పుసముద్రపుటలలు నాతో పాటుగా "నువ్వు ముందా - నేను ముందా?" అంటూ ఉరికురికి వస్తున్నట్టు - నేను రాంపు మీద కాక అలల మీద నడుస్తున్నట్టుగా - భలేగా అనిపించింది. 

*******
*******

    నా అడుగుల వెంట అలలలలుగా పరిగెట్టుకొచ్చిన ఉబ్బు-నీళ్ల సరదా నా కన్నులని ఇంకా మెరిపిస్తూనే ఉండగానే - నన్నింకా ఇంకా మురిపించే గమ్మత్తు ఒకటి ఒడ్డునున్న పార్కులో కనిపించింది. 




    పచ్చికలో వాలి - పక్కపక్కనే - పడుక్కుని కబుర్లు చెప్పుకుంటున్నట్టున్న రెండు చెట్లు నాకెంత నచ్చాయో!!



*******
*******

    అన్నట్టు - అంబుధి అంటే సంస్కృతంలో రెండర్థాలు ఉన్నాయండోయ్!

    అంబుధి - అంటే అంబు అంటే నీరు కలది - సముద్రం. 

    అంబుధి - అంటే నాలుగు అంకె కూడా. 

    అందుకే - ఇవాళ్టి నా కబుర్లకి "అంబుధి పొదికిట అంబుధి పొద్దులు" అని పేరెట్టుకున్నా. 

    అంటే - కడలి ముంగిట మూడున్నొక్క పూటలు - అని అర్థమన్నమాట...  

*******
*******