2, ఏప్రిల్ 2016, శనివారం

గ్రాఫులు - ఆటోగ్రాఫులు - ఫోటోగ్రాఫులు

గ్రాఫులు

చిన్నప్పుడు నాకు మాథ్స్ లో గ్రాఫులు గీయడం అంటే చాలా ఇష్టం గా వుండేది. మామూలుగా లెక్కలు చేసే తెల్ల కాగితాల పుస్తకం కాకుండా లేత ఆకుపచ్చ రంగులో చిన్న చిన్న గళ్ళతో నాన్నమ్మ కట్టుకునే వరయూరు చీరలా అనిపించే ఆ గ్రాఫు పేపర్ మీద X-యాక్సిస్ మీద ఒక చుక్క, Y-యాక్సిస్ మీద ఒక చుక్క పెట్టి స్కేల్ తో వాటిని కలుపుతూ గీత గీసి అదేదో లెక్కలకి సంబంధించిన కొత్త సూత్రమేదో నేనే కనిపెట్టేసినట్టు ఆనందపడిపోయేదాన్ని. ఇంతకీ అక్కడ గీసేది రెండు బిందువులని కలుపుతూ ఒక సరళరేఖ. అంత కన్నాఒక చుక్క ఎక్కువా కాదు. ఒక చుక్క తక్కువా కాదు.

తర్వాత్తర్వాత para-బోలాలు, hyper-బోలాలు అంటూ ఎంత గందరగోళం చేసినా ఋజు వర్తన కలిగిన సరళరేఖ మీద మక్కువ పోలేదు. అందుకే ఇప్పటికీ ఎన్ని చుక్కలు పెట్టయినా కమలాలు, గుమ్మడి కాయలు అంటూ సరళరేఖలతో కలపగలిగే ముగ్గులే వేస్తాను కానీ రెండు మెలికలు తిప్పగానే చేతి వేళ్ళు ముడిపడిపోయేలాంటి మెలికల ముగ్గుల జోలికే వెళ్ళను.

నాకు నేను గీసుకునే నా గ్రాఫు ఒకటి వుంది - వృద్ధి(X)-బుద్ధి(Y). ఇంత పెద్దయ్యాను ఎంతో బుద్ధి వచ్చేసింది అని అనుకుందామనుకుంటే ఏదో ఒక సందర్భం లో ఆ గ్రాఫు కొంచెం Y-యాక్సిస్ మీద ఒక్కోసారి ఫ్లాట్ అవుతున్నట్టు నాకే తెలుస్తూ వుంటుంది. అలాంటప్పుడు అమ్మతో "ఏంటో అమ్మా! ఎప్పటికప్పుడు ఏదో పాఠం నేర్చుకుంటున్నట్టే వుంటోంది. ఇంకెప్పుడు బుద్ధి వస్తుందో నాకు " అంటే ఆవిడ నన్ను మించిన ఆశాజీవి - "గోడ మీద రేపు అని రాసుకో లల్లీ !" అంటుంది.  

నాదైన గ్రాఫు కాకుండా వేరే వాళ్ళు గీసే నా గ్రాఫు సందర్భాన్ని బట్టి పడుతూ లేస్తూ వుంటుంది. అదేముందిలే - తానొకటి గ్రాఫితే తమరొకటి గ్రాఫారని - ఉండనే వుందిగా :)


ఆటోగ్రాఫులు

ఇంక నాకసలు అచ్చిరాని ఇంకో రకం గ్రాఫులు - ఆటోగ్రాఫులు.

ఆటోగ్రాఫులు అచ్చిరానివి ఎలా అయాయీ అంటే...
ఎవర్నైనా అడగాలంటే నాకు మొహమాటం
ఎవరికైనా నన్నడగాలంటే వాళ్లకి వెనకాటం (ఇది నా మాట - డిక్షనరీల్లో వుండదు).

నా జీవితం మొత్తం లో ముగ్గురే ముగ్గురి దగ్గర ఆటోగ్రాఫులు తీసుకున్నాను.

ఆ ముగ్గురూ ఎవరంటే -
ఇద్దరేమో  - నేను, అపర్ణ ఇంటర్మీడియట్ లో బోంబే-గోవా excursion  కి వెళ్ళినప్పుడు మా BH కాలేజ్ వాళ్ళు కుదుర్చుకున్న బస్సు డ్రైవ్ చేయడానికి వచ్చిన  డ్రైవర్ అంకుల్ & డ్రైవర్ తాత గారు. 
ఇంక మూడో వారు - నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారు.

వరసగా వాళ్ళిచ్చిన ఆటోగ్రాఫులు ఇవీ ...

డ్రైవర్ అంకుల్ - "May God Bless you !"
డ్రైవర్ తాతగారు - "మంచి బొమ్మలు లాంటి అమ్మాయి"
అక్కినేని : "Love Art"

మొదటి రెండిటినీ అర్థం చేసుకోవడానికి నాకేమీ కష్టం అనిపించలేదు కానీ మూడో దాన్ని అర్థం చేసుకోవడానికి నా ఇంటర్మీడియట్ బ్రెయిన్ కి ఉదాత్తత తగ్గి దాన్ని తెలుగులో "ప్రేమ కళ" అని చదువుకుని "ఇదేంటబ్బా - ఈయన ఇలా రాశారు? అంటే ప్రేమ నగర్, ప్రేమాభిషేకం సినిమాల్లో యాక్ట్ చేశారు కదా - అందుకే అలా రాసి వుంటారు" అని నాకు తోచిన అ(పా)ర్థాలేవో చేసేసుకున్నాను. తర్వాత ఎప్పటికో కొంచెం నా వృద్ధి(X)-బుద్ధి(Y) గ్రాఫు పెరిగాక అది ఒక Imperative Sentence అయిన "కళని ప్రేమించు" అని అర్థమయింది.

ఆ మూడు ఆటోగ్రాఫులు కూడా ఏదో అలా గుర్తు వుండి పోయాయి అంతే తప్ప వాటిని ఎక్కడ పడేసుకున్నానో కూడా గుర్తు లేదు.

ఆ తర్వాత కాలేజ్, యూనివర్సిటీ చదువులు అయాక - సీనియర్స్ , క్లాసు మేట్స్ కి ఆ చివరి రోజున Good Luck చెప్పడం తప్ప ఇంకే కాగితపు గుర్తులూ లేవు.

ఇప్పటికీ నా లైఫ్ గ్రాఫు లో చిన్ననాటి స్నేహితుల నుంచి యూనివర్సిటీ మిత్రుల దాకా - ఎవరో ఒకరితో - నెలకొకసారైనా జరిగే ఆత్మీయ సంభాషణల్లో నాకు దొరికే సంతోషం ఎక్కడో అలమారుల్లో దాచుకునే ఆటోగ్రాఫు పుస్తకాల కన్నా మిన్నగా అనిపిస్తుంది.



ఫోటోగ్రాఫులు



మొన్నొకరోజు ఫోటోలు చాలా వున్నాయి వాటిని కొంచెం సర్దుదామని అనిపించి బయటికి తీశాను.

ఎన్ని ఫోటోలు ...ఎన్ని ఫోటోలు ...

చిన్నప్పటివి
పప్పీ, కుట్టీలతో వున్నవి
మేం ముగ్గురం అమ్మా నాన్నలతో వున్నవి
కాలేజ్ లో ఫేర్ వెల్ పార్టీలవి
అపర్ణ నేను గుంటూరు న్యూ టోన్ స్టూడియో లో తీయించుకున్నవీ
పెళ్ళికి ముందువి
పెళ్లివి
పెళ్ళికి తరవాతవి
పిల్లలు పుట్టక ముందువి
పుట్టిన వెంటనేవి
పెరుగుతున్నప్పటివి
పెరుగుతూ వున్నప్పటివి
ఎప్పటివో
అప్పటివీ
ఇప్పటివీ...

అదిగో... అన్ని కనిపించాయి.

అవి కాక -
డిజిటల్ కెమెరా లో వున్నవి
మా దగ్గర వున్న మూడు ఐ-ఫోనుల్లో వున్నవి.

ఆ ఫోటోలన్నీ చూశాక అసలు సర్దడం మర్చిపోయి ఎక్కడివక్కడే వదిలేసి ఆ ఫోటోల మధ్యలో కూర్చుని చూడడం మొదలుపెట్టాను. టైం ఎలా గడిచిపోయిందో తెలీదు. ఒక గంట అయాక నేను గమనించింది ఏంటంటే ఎన్ని ఫోటోలు చూస్తున్నా- ఒక్కొక్కదాన్ని ఎంత మార్చి మర్చి చూస్తున్నా- ముందుగా ప్రతీ ఫోటోలో నేనున్నానా లేదా అని చూసుకుని , నేనుంటే ఆ ఫోటోకి అంతకు ముందు చూసిన ఫోటోకి నాలో మార్పు ఏముందా అని, ఎందులో ఏం కట్టుకున్నానా అని - ఇంతే - అంతా నా గురించే దృష్టి.

నవ్వొచ్చింది - తర్వాత ఆలోచిస్తే. ఏమని అంటే - ఎక్కడికి అయినా విహార యాత్రకి వెళ్లి వస్తే బోల్డన్ని ఫోటోలు తీసేసుకుని అందరికీ చూపించేసుకుంటామా!!
అప్పుడు - పక్క పక్కనే కూర్చుని ఒకే ఫోటో కేసి ఇద్దరం చూస్తుంటే - ఫోటోలో వున్నవారు ఫోటోలో ఎందరు వున్నా ముందు తమకేసే చూసుకుంటారు. 
ఫోటోలో లేకుండా కేవలం చూపిస్తున్నారు - చూడాలి కాబట్టి అని చూసేవాళ్ళు ఫోటోలో వున్నమనుషుల చుట్టూ వున్న పరిసరాలు - అసలెక్కడికి వెళ్ళారు, ఎంత బాగా తిరిగారు - అని చూస్తారు. ఫోటోగ్రాఫు ఒకటే అయినా దృష్టి గ్రాఫులు వేరే మరి :)

ఫోటోగ్రాఫులలో ఇంకో రకం సెలెబ్రిటి ఫోటోలు. నావరకు నాకు అవి మాన్యుమెంటల్ టైపు. క్రితం ఏడాది మా వూళ్ళో ఈ-టీవీ వాళ్ళ పాడుతా - తీయగా కార్యక్రమం జరిగితే అందరం చూడడానికి వెళ్ళాము. అందరూ SPB తో మాట్లాడడానికి, ఫోటోలు తీసుకోవడానికి సరదా పడుతున్నారు. నేను, పిల్లలు ఒక పక్కగా కూర్చుని చూస్తూ ఉన్నాము. నాకప్పుడు అనిపించింది - అప్పుడే కాక ఎప్పుడు ఏ సెలబ్రిటీ-లోడెడ్ కార్యక్రమానికి వెళ్ళినా అనిపించేది ఒకటే - ఏ హైద్రాబాదో వెళ్తే చార్మినార్ ముందు నిలబడో, బిర్లా మందిర్ దగ్గర కూర్చునో ఫోటో తీసుకుంటాము. దాన్ని మనం పదే పదే చూసుకుని, చూపించుకుని ఆనందపడతాం.   అది ఆ చార్మినార్ కి గానీ, బిర్లా మందిర్ కి గానీ తెలీను కూడా తెలీదు. ఒక వేళ తెలిసినా (తెలిసే అవకాశం లేదు కానీ just an abstract thought ) పట్టదు. సెలబ్రిటీ లతో నేను తీసుకునే ఫోటో అయినా అంతే. సెలబ్రిటీ లకి వాళ్లకి ఎవరు సెలబ్రిటీ లో వాళ్ళతో ఫోటోలు లెక్క గానీ నాతో తీయించుకునే గ్రాఫులు కాదు కదా :)




12 కామెంట్‌లు:

  1. లలితా! నాకు నీ బుద్ధి వృద్ధి గ్రాఫ్ concept భలే నచ్చింది. నా ఈ దాదాపు ఇరవై సంవత్సరాల నీ పరిచయం లో నీ బుద్ధి గ్రాఫ్ ఎప్పుడూ X వైపుకు పడటం సరే, కనీసం సమాంతరరేఖ లా కూడా కనపడలేదు. చుట్టానికి నీ ఆలోచనలు మెలికల ముగ్గులా గజిబిజిగా కనిపించినా concepts మాత్రం always సరళరేఖలే. ఎప్పుడూ confusion లేదు.
    'ప్రేమ కళ' and your then explanation just hilarious.
    Photoes with celebrities and autographs from them, I share your idea. Never fell for those.
    As usual well written. Keep writing.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీ అభిమానపూరిత కామెంట్ కి థాంక్స్! నా వృద్ధి-బుద్ధి గ్రాఫుకి నీ స్కేల్ ని ప్రమాణంగా తీసుకోవడం is like an honor for me based on the many years we traveled together as friends.

      ప్రేమ కళ - అది నేను నన్ను చూసి నాకు నేనే నవ్వుకునే అనేక childish moments లో ఒకటి :)

      తొలగించండి
  2. మూడు గ్రాఫ్ ల కబుర్లు చాలా బావున్నాయి లలిత గారు . ప్రేమ కళ ...నవ్వుకున్నాను .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వనజ గారు!

      వీలు చేసుకుని నా బ్లాగ్ పోస్ట్ చదివి, వ్యాఖ్య పెట్టినందుకు చాలా థాంక్స్. మీ బ్లాగులు, కథలు చదువుతూ వుంటాను. ముక్కుకి సూటిగా, భేషజాలు లేకుండా రాసే మీ బ్లాగులు నాకు నచ్చుతాయి.

      మీకు నవ్వు పంచిన నా "ప్రేమ కళ" కి ఈ వ్యాఖ్య అంకితం చేస్తున్నాను :)

      తొలగించండి
  3. Driver uncle, driver thatha garu...... You have always been like that, never identifying a person just by their profession but adding a relation and a గారు. Remember షణ్ముగం, that elderly man who used to do odd jobs for us? I started calling him 'తాత', after I noticed that you always called him 'తాత'.
    నీ బుద్ధిగ్రాఫ్ ఎప్పుడూ పైకే ఉంది. ఎప్పటినుండో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొంచెం స్వార్థం ఎక్కువ నాకు. ఎలా అంటే రాత్రి పడుకోబోయేముందు ఇంక అసలే ఆలోచన వుండకూడదు - అరె! ఇలా చేయకుండా వుండాల్సింది అని. దానికి నేనేం చేయాలి మరి? రోజు మొత్తంలో నాకు కుదిరినంతవరకు ప్రతీ బంధాన్ని, సందర్భాన్ని, సంఘటనని, సంభాషణని సాధ్యమయినంతవరకు నాకు హాయిగా అనిపించేలా చూసుకుంటాను - చేసుకుంటాను.

      మరి అన్నీ నాకు తగినట్టుగా మంచిగా జరగాలంటే నేను అవతలి వాళ్లకి ఇచ్చేవి కూడా అంతే మంచిగా వుండాలి కదా! - మాటైనా, thought అయినా.

      దానికి తోడు పాతికేళ్ళ జీవన సహచర సహవాస ఫలితం - ఇంకొంచెం వాక్, బుద్ధి నియంత్రణ ;)

      తొలగించండి
  4. Great read Lalitha! Prema kala is hilarious 😆 even your comparison of celebrity photos to photos taken with charminar😂

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Aah - my Prema Kala won your heart too! Those were blissfully ignorant days. But don't think that I am past such adventurous-misinterpretations ;) If not very often, now too I have such moments where even the air around me gets filled with mirthful laughter for the small linguistic mistakes I make. I am fortunate to be able to share those laughs with you almost every week day.

      తొలగించండి
  5. మీ ప్రక్కన నిలబడి ఫోటో తీయించుకునే అవకాశం ఇవ్వగలరా ?
    Same thoughts for me too !

    రిప్లయితొలగించండి
  6. మీ బ్లాగ్ లో విషయాలు కథలు కబుర్లు చదువుతుంటే ఓహ్ రేడియో అక్కయ్య గుర్తు వస్తుంది...జన్జాల సినిమా చూస్తున్నట్టు....త్రివిక్రమ్ రాసిన పంచ్ విన్నట్టు ఉంది మా అక్క తో మాట్లాడి నట్టు ఉంది,అక్కా నీ హాస్య చతురత క్రియేటివిటీ కి ఈ తమ్ముడి వందనాలు.అక్కా అనేసాను ఏమీ అనుకోకు నేను ఫిక్స్ అయిపోయా.కొత్త కబుర్లు చెప్పినపుడు ఈ తమ్ముడికి ఒక చిన్న రేమైన్దారు పడేయడం మర్చిపోకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పకుండా :) మీ ప్రోత్సాహకర కమెంట్ కి థాంక్స్!

      తొలగించండి